Thursday, March 30, 2023

సీతమ్మ చెప్పిన కళ్యాణ ఘట్టం : వనం జ్వాలా నరసింహారావు

 సీతమ్మ చెప్పిన కళ్యాణ ఘట్టం

వనం జ్వాలా నరసింహారావు

సాక్షిదినపత్రిక (30-03-2023)

రాముడెప్పుడైతే శివుడి విల్లు విరిచాడో, అప్పుడే అతడు శివుడి కంటే గొప్పవాడైన విష్ణువని జనకుడు గ్రహించాడు. అలాంటి ఆమెకు సాక్షాత్తు లక్ష్మీదేవైన సీతను ఇస్తున్నాననే అర్థమొచ్చే విధంగా వివాహం జరిపించే సమయంలో, 'ఈ సీత' అన్నాడు. సీత నాగటి చాలులో దొరికినప్పటికీ జనకుడు సగర్వంగా, 'నాదుకూతురు', అని చెప్పాడు. సీతే లక్ష్మీదేవి అయినందువల్ల, విష్ణువు అవతారమైన రాముడి కైంకర్యమే ఆమె స్వరూపం. సృష్టిలో, రక్షణలో, సంహారంలో ఆమె ఆయనకు సర్వకాల సర్వావస్థలందు తోడుగా వుంటుంది. వివాహ లీల కేవలం లోక విడంబనార్థమేనని, ఆయన సొత్తును ఆయనే తీసుకొమ్మని కూడా అర్థం. ‘ఈ సీత నా కూతురు. నీ సహధర్మచారిణి. ఈమెను పాణి గ్రహణం చేసుకో’’ అని అంటూ సీతను కన్యాదానం చేశాడు జనక మహారాజు. ఈ వివరాలను సాక్షాత్తూ సీతాదేవే అత్రి మహాముని భార్యైన, అనసూయాదేవికి ఆమె కోరికపై వివరించింది.

అరణ్యవాసంలో భాగంగా చిత్రకూటం నుండి సీతాలక్ష్మణ సమేతంగా బయల్దేరిన శ్రీరాముడు అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకుని, ఆయనకు, ఆయన భార్య సతీ అనసూయాదేవికి సీతాదేవిని పరిచయం చేశాడు. సీతాదేవి కూడా తన పేరు చెప్పి నమస్కారం చేసి రెండు చేతులు జోడించి నిలువబడి కుశలం అడిగింది అనసూయను. సీత పుణ్యచరిత్రదని, పాతివ్రత్యమే గొప్పదిగా భావించి, చుట్టాలను, సంపదను, సౌఖ్యాన్ని వదిలి, మహారాజు కోడలినని కాని, మహారాజు కూతురునని కాని లక్ష్యపెట్టకుండా, తండ్రిని యదార్థవాదిని చేయాలన్న ఉద్దేశంతో అడవికి భర్తతో  వచ్చిందని, ఆమెలాంటి స్త్రీలు అరుదని, కొనియాడింది అనసూయ. శ్రీ రామచంద్రమూర్తి తన పరాక్రమంతో స్వయంవరంలో సీతను పెళ్లి చేసుకున్నాడని వినడమే కాని, అదెలా జరిగిందో వివరంగా వినలేదని, అ కథ వినాలని వుందని, జరిగినదంతా వివరంగా చెప్పమని అనసూయ సీతను అడిగింది.

జవాబుగా సీతాదేవి, తన తండ్రి జనకుడు విదేహ దేశానికి రాజని, ఒకనాడు యజ్ఞం చేయడానికి నేల దున్నిస్తుంటే నాగేటి కర్రు తగిలి నేల పెళ్లలు లేచివచ్చి తాను భూమిలోనుండి బయటకు వచ్చానని, అప్పుడు జనకుడు తనను చూసి ఆశ్చర్యపడి, తన పెద్ద భార్యకు ఇచ్చాడని, ఆమె తన్ను తన కన్నబిడ్డలాగా చూసుకుని పెంచిందని, తనకు వివాహయోగ్య దశ రావడం గమనించిన తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచన చేయసాగారని చెప్పింది. తనకు తగిన వాడిని, సద్గుణ సంపత్తికలవాడిని, గొప్పవాడిని, ఏవిధంగా భర్తగా సంపాదించగలనని జనకుడు విచార సముద్రంలో మునిగిపోయాడని, తల్లిగర్భంలో పుట్టని దేవకన్యలాంటి సుందరినైన తనకు, తగినవాడిని, మన్మథాకారుడిని, సమానుడైన వాడిని సంపాదించాలని జనకుడు వెతికాడు కాని ఎవరూ దొరకలేదని, అప్పుడు స్వయంవరం చాటిస్తే బాగుంటుందని ఆలోచనచేశాడని సీతాదేవి అనసూయకు చెప్పింది.

సీతాదేవి ఇంకా ఇలా అన్నది: ‘ఈ ప్రకారం ఆలోచించి, తాను చేసిన ఒక గొప్ప యజ్ఞంలో వరుణుడు తనకు ఇచ్చిన మనుష్యులు కదిలించ సాధ్యపడని వింటిని, రాజులు కలలో కూడా ఎక్కుపెట్టలేని వింటిని, అక్షయబాణాలను, రాజులందరికీ చూపించాడు జనకుడు. ఆ విల్లెక్కుపెట్టిన వాడు తన కూతురుకు భర్త కాగలడని ప్రకటించాడు. అక్కడికి వచ్చిన రాజులు దానిని ఎత్తలేక, చూడగానే భయపడి, దానికి ఒక నమస్కారం చేసి పోయారు. చాలాకాలం ఇలాగే గడిచి పోయింది. రాజకుమారులెవరూ దానిని ఎక్కుపెట్టలేక పోయారు’.

‘ఈ నేపధ్యంలో, విశ్వామిత్రుడు తన యాగ రక్షణకై దశరథ కుమారులైన రామలక్ష్మణులను వెంట తీసుకుపోయి, తన కార్యం నెరవేర్చుకున్న అనంతరం, వారికి కళ్యాణం జరిపించాలన్న ఆలోచనతో, తన వెంట మిథిలా నగరానికి తీసుకుని వెళ్తాడు. వారిని జనక మహారాజుకు పరిచయం చేసి, ఆయన దగ్గరున్న శివ ధనుస్సును చూపించమంటాడు. అప్పుడాయన సీత జన్మ వృత్తాంతం చెప్పి, తనకు నాగేటి చాలులో దొరికిన సీత వీర్యశుల్కనీ, శక్తి ప్రదర్శన చేయడమే అమెకివ్వదగిన శుల్కమనీ, తన దగ్గరున్న ధనుస్సును ఎక్కుపెట్టగలవాడికే కూతురు సీతను ఇస్తానని అంటాడు. అలా చెప్పి దానిని శ్రీరామ లక్ష్మణులకు చూపించాడు. శ్రీరామచంద్రమూర్తి విల్లెక్కుపెట్టగలిగితే అయోనిజైన సీతను ఆయన కిస్తానని, అంటాడు’.

         ‘శ్రీరాముడు, ధనుస్సుండే పెట్టె దగ్గరికిపోయి, దాని మూత తెరిచి, తాను వింటిని చూసానని, తాకానని చెప్పి, ఆయన ఆజ్ఞాపిస్తే బయటకు తీస్తానని అంటాడు. వింటిని బయటకు తీసి ఎక్కుపెడతానని కూడా అంటాడు. అలానే చేయమని జనకుడు, విశ్వామిత్రుడు చెప్పారు రాముడితో. అవలీలగా వింటిని అరచేత్తో పట్టుకొని, బయటకు తీసి, రాజులందరు చూస్తుండగా రాముడు అల్లెతాటిని బిగువుగా లాగుతుంటేనే, విల్లు ఫెల్లుమని రెండుగా విరిగిపోయింది. రామచంద్రమూర్తి భుజబలం చూసానని, సీత రామచంద్రమూర్తిని మగడిగా గ్రహించడమంటే అది తన అదృష్టమని, తాను ధన్యుడనయ్యానని, అంటాడు జనకుడు. తన ముద్దుల కూతురు సీత దశరథ కుమారుడు శ్రీరామచంద్రుడిని భర్తగా పొందడంవల్ల తమ జనక కులానికి కీర్తి సంపాదించిపెట్టినట్లయిందని కూడా అంటాడు జనకుడు విశ్వామిత్రుడితో’.

‘విల్లు ఎక్కుపెట్టిన, విరిచిన వారికి తన కూతురును ఇచ్చి వివాహం చేస్తానని ప్రతిజ్ఞచేసిన తన  తండ్రి తన మాట ప్రకారం శ్రీరామచంద్రమూర్తికి తన్ను కన్యాదానం చేయడానికి జలపాత్ర చేతిలో తీసుకున్నాడు. కాని తమ తండ్రి అభిప్రాయం తెలుసుకోవాలని చెప్పి శ్రీరాముడు దానం తీసుకోలేదు. అప్పుడు తన తండ్రి దశరథ మహారాజు దగ్గరకు దూతలను పంపగా, ఆయన ఆహ్వానాన్ని ఆదరించి దశరథమహారాజు వచ్చాడు’. ఇలా చెప్పి, ఇక ఆ తరువాత సీతా కళ్యాణ ఘట్టం గురించి వివరించింది ఇలా.

"సీతను సర్వాభరణో, పేతను దా నిలిపి నగ్ని కెదురుగ గౌస

ల్యా తనయున  కభిముఖముగ,  క్ష్మాతలనాథుండు రామచంద్రున కనియెన్"

          అన్ని విధాలైన అలంకారాలతో ప్రకాశిస్తున్న సీతను, అగ్నికి ఎదురుగా, శ్రీరామచంద్రమూర్తికి అభిముఖంగా, నిలువబెట్టి, జనక మహారాజు శ్రీరామచంద్రమూర్తితో:

ఈ సీత నాదుకూతురు, నీ సహధర్మచరి దీని నిం గై కొనుమా

కౌసల్యాసుత, నీకును భాసురశుభ మగు గ్రహింపు పాణిం బాణిన్"

          కౌసల్యా కుమారా, ఈ సీత నా కూతురు. నీ సహధర్మచారిణి. ఈమెను పాణి గ్రహణం చేసుకో. నీకు జగత్ ప్రసిద్ధమైన మేలు కలుగుతుంది. నీకు శుభం కలుగుతుంది. మంత్రపూర్వకంగా ఈమె చేతిని నీ చేత్తో పట్టుకో. రామచంద్రా, పతివ్రత, మహా భాగ్యవతి అయిన నీ సీత, నీ నీడలా ఒక్కసారైనా నిన్ను విడిచి వుండదు" అని అంటూ, మంత్రోచ్ఛారణతో పవిత్రవంతములైన జలధారలను రామచంద్రమూర్తి చేతుల్లో జనక మహారాజు ధారపోశాడు. సంతోషాతిశయంతో దేవతలు పూల వాన కురిపించారు. దేవదుందుబులను చాలా సేపు మోగించారు. ఈవిధంగా మంత్రించిన జలాలను ధారపోసి తనను శ్రీరామచంద్రమూర్తికిచ్చి వివాహం జరిపించారని సీతాదేవి అనసూయాదేవికి చెప్పింది.

శ్రీరామవతారం వైవస్వత మన్వంతరంలో ఐదవ మహాయుగమైన త్రేతాయుగంలో సంభవించింది. కొడుకులకై దశరథుడు పుత్రకామేష్టి చేయగా శ్రీరామ జననం అయింది. జన్మించింది విలంబినామ సంవత్సరం కాబట్టి హేవిలంబిలో అశ్వమేధయాగం, పుత్రకామేష్టి చేశాడు. దుర్ముఖి చైత్రమాసంలో అశ్వం విడిచారు. శ్రీరాముడి జనన కాలంలో గురువు, చంద్రుడు, కర్కాటక లగ్నంలో వున్నారు. అంటే జన్మ లగ్నం కర్కాటకం కాగా, మేషంలో రవి, బుధులు, తులలో శని, మకరంలో కుజుడు, మీనంలో శుక్రుడు వున్నారు. పునర్వసువు నక్షత్రంలో బుధవారం నాడు శ్రీరామజననం. చైత్ర బహుళ పంచమి నాడు నామకరణం జరిగింది. పరాభవ సంవత్సరంలో తొమ్మిదో ఏట ఉపనయనం జరిగింది. శ్రీరాముడికి 12 ఏళ్ల వయసున్నప్పుడు, సౌమ్యనామ సంవత్సరంలో యాగరక్షణ కొరకు విశ్వామిత్రుడి వెంట అరణ్యాలకు పోయాడు. అరణ్యవాసానికి పోయేటప్పుడు శ్రీరాముడికి 25 సంవత్సరాలు కాగా, సీతాదేవికి 18 సంవత్సరాలు.

శ్రీరాముడికి 12 సంవత్సరాల వయసున్నప్పుడు, సీతకు ఆరేళ్ళ వయసులో వారి వివాహం జరిగింది. దీనికి దృష్టాంతరంగా విశ్వామిత్రుడి యాగం కాపాడడానికి రామలక్ష్మణులు వెళ్లిన రోజు నుంచి మిథిలా నగరం వెళ్లడం వరకు తీసుకోవచ్చు. సౌమ్యనామ సంవత్సరం మాఘబహుళ విదియ నాడు శ్రీరామలక్ష్మణులు విశ్వామిత్రుడి వెంట పోయారు. హస్త పోయి చిత్రా నక్షత్రం ప్రవేశించడంతో, ఆ రోజు ప్రయాణానికి మంచి రోజే కాకుండా అది శ్రీరాముడికి ధృవతార కూడా. 15 వ నాటి ఉదయం మిథిలా ప్రవేశం చేసి, శివ ధనుర్భంగం చేశాడు. 27 వ రోజున ఫాల్గున శుద్ధ శుక్ల త్రయోదశి శుభ దినం కాబట్టిఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో, శుభదినమైన శుక్ల త్రయోదశి నాడు సీతారాముల కల్యాణం జరిగింది. ఉత్తర ఫల్గుణీ నక్షత్రం శ్రీరాముడి జన్మ నక్షత్రానికి ఆరవది. సీతారాముల కళ్యాణమైన తరువాత, బహుళ విదియతో ముగిసి, తదియనాడు జనకుడు బిడ్డలకు అరణాలిచ్సిన తరువాత, చవితినాడు అప్పగింతలై, ఫాల్గుణ బహుళ పంచమి నాడు అయోధ్యకు ప్రయాణమయ్యారు. షష్టి, సప్తముల్లో పరశురాముడి గర్వభంగం అయింది. దశమినాడు అయోధ్య ప్రవేశం జరిగింది. ఆ తరువాత 12 సంవత్సరాలు సుఖసంతోషాలతో గడిచింది.

ఈ నేపధ్యంలో ఒక్క విషయం చెప్పుకోవాలి ఇక్కడ. ఇటీవల కొందరు మహానుభావులు భద్రాచల క్షేత్రాన్ని రామనారాయణుడి గుడి చేశారు. శ్రీరాముడు పుట్టిన చైత్ర శుద్ధ నవమి నాడు భద్రాచలంలో కల్యాణం జరుగుతున్నదని అంటే, ఆ జరిగేది సీతాదేవికి, శ్రీరాముడికే కదా! అలాంటప్పుడు, దశరథుడుది, జనకుడిది గోత్రాలు, ప్రవర చెప్పకుండా పూజారులు, అశేషమైన భక్తులను మభ్యపెట్టుతూ, రామనారాయణ పేరుతో అచ్యుత గోత్రం చదివి, పరబ్రహ్మ శర్మ, వ్యూహనారాయణ శర్మ, విభవవాసుదేవ శర్మ చెప్పుతున్నారు. సీతాదేవికి సౌభాగ్య గోత్రం చెప్పి, విశ్వంభర శర్మ, రత్నాకర శర్మ, క్షీరార్ణవ శర్మ అంటున్నారు. ఇదెక్కడి న్యాయం? ఈ తప్పును ఎవరు తీర్చి దిద్దాలి? ఇదేంటి అని ప్రశ్నించేవారిది అరణ్యరోదన అవుతున్నదేకాని వినే నాధుడు ఎవరూ లేరని స్థానికుల ఆవేదన!!!

(కీర్తి శేషులు శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు గారి శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం మందరం ఆధారంగా).

(నేడు శ్రీరామనవమి సందర్భంగా)

Monday, March 27, 2023

జ్వరం పుట్టుకను, శాస్త్రతత్త్వాన్ని, కాలపాశ ఛేదనను, సద్ధర్మాలను చెప్పిన భీష్ముడు ..... ఆస్వాదన-113 : వనం జ్వాలా నరసింహారావు

 జ్వరం పుట్టుకను, శాస్త్రతత్త్వాన్ని, కాలపాశ ఛేదనను,

సద్ధర్మాలను చెప్పిన భీష్ముడు

ఆస్వాదన-113

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (27-03-2023)

శంకరుడి తేజస్సు చలించే జ్వరంగా రూపొంది వృత్రుడిని ఆక్రమించిన విషయం భీష్ముడు చెప్పగానే, ఆ జ్వరం ఎలా పుట్టిందని, దాని విధానం ఏమిటని అడిగాడు ధర్మరాజు.

‘దక్షయజ్ఞాన్ని ద్వంసం చేసే సందర్భంలో ఈశ్వరుడి పాలభాగంలో కోపం వల్ల పుట్టిన చెమట బిందువొకటి భూమ్మీద పడింది. వెంటనే అక్కడ పెద్ద మంటలు ఏర్పడ్డాయి. ఆ మంటల్లోనుండి ఒక పురుషుడు ఎర్రటి నేత్రాలు, నల్లటి రూపం, ఊర్ద్వముఖమైన రోమాలుగల భయంకరమైన ఆకృతితో జన్మించాడు. అతడే జ్వరం అనే పేరుతో ప్రసిద్ధుడు అవుతాడని, అతడు సర్వత్రా సంచరిస్తాడని, ఆ జ్వరం ఏకరూపమై వుంటే భూమి భరించలేదని, అందువల్ల దాన్ని నానారూపాలుగా సృష్టించమని బ్రహ్మ దేవుడు శివుడికి చెప్పాడు. శివుడు బ్రహ్మ చెప్పినట్లే దానికి నానారూపాలు కలిగించాడు’.

‘ఏనుగులకు తలనొప్పిగా, పాములకు కుబుసంగా, గోవులకు గిట్టలలో నొప్పిగా, లేళ్లకు తమ రూపు చూసేదానికి ఆటంకంగా, గుర్రాలకు పార్శ్వ భాగంలో శోషణంగా, నెమళ్లకు ఈకలు ఊడిపోవడంగా, కోకిలలకు నేత్రవ్యాధిగా, చిలుకలకు వెక్కిళ్ళుగా, మేకలకు మనోభ్రాంతిగా, పులులకు శ్రమగా, మానవులకు చావుపుట్టుకలు మొదలైన సందర్భాలలో దుఃఖంగా విభజించాడు. ఇది జ్వర స్వరూపం. జ్వరం శివుడి తేజస్సు. అందువల్ల అందరికీ నమస్కరించతగినది’. అని చెప్పాడు భీష్ముడు.

‘శాస్త్రతత్త్వం ఫలానా విధంగా వుంటుందని సందేహించేవాడు పరమార్థం గ్రహించలేడని, అలాంటివాడు ఏపని చేస్తాడో వివరించమని పితామహుడిని కోరాడు ధర్మరాజు. గురువులను పూజించడం, వృద్ధులను సేవించడం, విద్యను వినడం తప్పక చేయాల్సిన పనులని అంటూ భీష్ముడు నారదగాలవుల మధ్య జరిగిన సంవాదాన్ని తెలియచేశాడు. నారద మునీంద్రుడు గాలవుడికి చెప్పిన మాటలుగా భీష్ముడు ఇలా అన్నాడు ధర్మరాజు సందేహానికి జవాబుగా.

‘బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్న్యాసం అనే నాలుగు ఆశ్రమాల పరిస్థితులను పరికించాలి. అందులో ప్రవేశించాలని అనుకునేవాడు వాటి పోకడను సూక్షదృష్టితో చూడాలి. సదా ధర్మార్థకామాల నడవడికలో సౌమ్యభావం కలిగి వుంటూ మనుజుడు పాపానికి హేతువులైన పనులన్నిటినీ వదలాలి. యథాశక్తి పవిత్రమైన చిత్తంతో పుణ్యకార్యాలు మాత్రమే చేయాలి. సదా సజ్జనులతో సాంగత్యం కలిగి వుండాలి. పురుషుడు కపటవృత్తిని వదలి ఋజుత్వాన్ని పూర్ణంగా కలిగి వుండాలి. దేవతలను, పితృ దేవతలను శాస్త్రోక్తవిధి ప్రకారం పూజించాలి’.

‘ఎల్లప్రాణుల పట్లా కాఠిన్యాన్ని వదలి మెత్తదనంతో వ్యవహరించాలి. మధురమైన మాటలకు అలవాటు పడాలి. పురుషుడికి అహంకారం పనికిరాదు. యాచన కూడదు. అలాగే శబ్దస్పర్శ రూప రసగంధాలు అనే విషయాలలో అపరిమితమైన ఆసక్తి తగదు. అహంకారాది దోషాలు లేకుండా వుంటే మేలు కలుగుతుంది. ఎప్పుడైనా సరే ఇతరులను నిందించడం, తనను తాను పొగడుకోవడం తగవు. మానవుడు సోమరిపోతు, గర్వగ్రస్తుడు, నిష్ప్రయోజనకారి, మాత్సర్యదోషం కలవాడు, కోపశాలి కాకూడదు. అతిథులకు తన శక్త్యానుసారం సత్కారం చేయాలి. వేదాధ్యయనం, వేదాంగాలైన శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అనే ఆరు శాస్త్రాల పట్ల ప్రీతి వుండాలి. ఇలా మానవుడు పవిత్రమైన నడవడిక కలిగి ప్రవర్తిస్తే అతడి చిత్తదోషం పరిహరించబడుతుంది. ఆ దోషం తొలగగానే అతడికి జ్ఞానోదయం కలుగుతుంది.

         భీష్ముడు చెప్పిన మాటలు విన్న ధర్మరాజు తనలాంటి వాడు కాలపాశాన్ని ఎలా ఛేదించగలడని ప్రశ్నించాడు ఆయన్ను. పూర్వం సగరుడు అనే నృపాలుడు అరిష్టనేమి అనే మునీంద్రుడిని ఇలాగే ప్రశ్నించాడని, అతడి జవాబును అతడి మాటల్లోనే చెప్తానని, ఇలా అన్నాడు.

         ‘ధనం, ధాన్యం, పశువులు, భార్య, పుత్రులు మొదలైన వారి ఒత్తిడిలో తగులుకుంటే, చిత్తం వ్యాకులత్వం పొంది, మోక్షమార్గం తొక్కరానిదై పోతుంది. మానవుడు అందరినీ వదలి నిబ్బరంగా ఏకాంత ప్రదేశానికి పోవాలి. నిత్యం ప్రాణులు పుట్టి, కర్మలు చేసి, గిట్టుతూ వుంటారు. దీన్ని చక్కగా గమనించినవాడు మోక్షకాంక్షతో శ్రేయోమార్గంలో పయనిస్తాడు. సంసార వ్యామోహానికి చిత్తం లొంగిపోతే, అతడు ప్రేయోమార్గంలో పడిపోతాడు. వాడికి మోక్షం కలగడం కష్టం. ఎవరైతే అన్నిటినీ సమదృష్టితో చూస్తాడో వాడు ముక్తి పొందుతాడు. సమస్త భూమండలాన్ని పరిపాలించిన మహారాజులు సైతం కాలం చెల్లగానే నేలకొరిగి పోతున్నారు. ఇంద్రియ శక్తులు ఉడిగిపోగానే శరీరం చెడిపోతున్నది. దీన్ని చక్కగా భావించి, సంసారం నిస్సారతను గమనించగలవాడు మోక్షలక్ష్మిని చేపట్టగలడు’.

         భీష్ముడు ఆవిధంగా చెప్పగా విన్న ధర్మరాజు మళ్లీ భీష్ముడితో మరో సందేహాన్ని వ్యక్తపరిచాడు. ధర్మాన్ని ద్వేషించే రాక్షసులకు మంత్రిగా మనగలిగే శుక్రత్వమహిమ శుక్రాచార్యుడికి ఎలా కలిగిందని ప్రశ్నించాడు. సమాధానంగా భీష్ముడు ఇలా చెప్పాడు.

         ‘భార్గవుడు (శుక్రుడి పూర్వ నామం) గొప్ప యోగబలం ప్రదర్శించి కుబేరుడిని వంచించాడు. అతడి ధనాన్ని అపహరించాడు. కుబేరుడు జరిగిన విషయాన్ని శివుడికి చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు భార్గవుడిని మింగాడు. కడుపులో నుండి బయటకు రాకుండా దారులన్నీ మూసేశాడు. కాని పురుషాంగం మాత్రం తెరిచి వుంచాడు. భార్గవుడు ఆ దారినుండి బయటకు వచ్చాడు. శివుడి కోపం ఇంకా చల్లారలేదు. అప్పుడు పార్వతి, పుత్ర సమానుడైన అతడి మీద దయచూపమని వేడుకుంది. శివుడు పార్వతి మాటలకు ప్రీతి పొందాడు. భార్గవుడిని తేజోవంతుడిని చేశాడు. తన శిశ్నం నుండి బయటికొచ్చాడు కాబట్టి భార్గవుడిని ఇక ముందు శుక్రుడు అన్న పేరుతో వ్యవహరిస్తారని చెప్పాడు’.

         తన మనస్సుకు ఇంకా-ఇంకా తృప్తి కలిగే విధంగా సద్ధర్మాలను బోధించమని పితామహుడిని ప్రార్థించాడు ధర్మరాజు. సమాధానంగా పరాశర మహర్షి గీతా సారాంశాన్ని వినిపించాడు భీష్ముడు. జనకుడు పరాశర మహర్షిని సద్ధర్మతత్త్వాన్ని గురించి ప్రశ్నించగా ఆయన చెప్పిన సమాదానంలోనే ధర్మరాజు సందేహం కూడా తీరుతుందని అన్నాడు భీష్ముడు. దాని తాత్పర్యం ఇలా సాగుతుంది.

         ‘మానవుడు ఇహపరలోక సుఖాలు ధర్మమూలకాలే అని భావించాలి. ధర్మం ఆచరించి సుఖం పొందాలి. పుణ్యం సుఖాన్నీ, పాపం దుఃఖాన్నీ మానవుడు చేత అనుభవించకుండా వదలవు. చేసే పనులలో అన్యాయం అంటకుండా వుండగలిగితే సన్మార్గం మీద ఆసక్తి కలుగుతుంది. సత్యం, అంతరేంద్రియాలను నిగ్రహించడం, బాహ్యేంద్రియాలను నిగ్రహించడం, హింస లేకుండా వుండడమే సన్మార్గాలు అంటారు. పాపరహితుడైన మానవుడు శ్రేష్టమైన తెలివి అనే పగ్గాలతో, ఇంద్రియాలు అనే గుర్రాలతో లాగబడే కోరికలనే రథాన్ని అపమార్గంలో పోనీయకుండా నిగ్రహిస్తాడు. పవిత్ర కార్యాలలో శరీరం శోభాయమానంగా వుంటుంది. పాపకార్యాలతో చివరకు దానిని బూడిదపాలు చేయడం తగదు’.

         ‘దుష్టకార్యాలు చేయడం మురికి నీటిలో స్నానం చేయడం లాంటిది. పుణ్యకార్యాలు చేయడం మంచినీటి స్నానం లాంటిది. వేదాలను చదవడం వల్ల ఋషి ఋణాన్ని, యజ్ఞాలు చేయడం వల్ల దేవతల ఋణాన్ని, పూజాది సత్కారాలతో అతిథి ఋణాన్ని, పితృకర్మలతో పితరుల ఋణాన్ని, చక్కటి పాలనతో రంజింప చేయడం వల్ల ప్రజల ఋణాన్ని తీర్చాలి. విష్ణు స్తోత్రం, తపస్సు, ధర్మాచరణం అనేవి మనస్సులో గొప్ప జ్ఞానాన్ని కలిగిస్తాయి. అయోగ్యులను యోగ్యులుగా మారుస్తాయి. ఎంతటి దుర్జనుడైనా సజ్జన సాంగత్యంతో పవిత్రుడు అవుతాడు.

         ‘అధిక లాభం కలిగించేదైనా ఆ పని పాపంతో కూడుకుంటే చేయకూడదు. స్వల్పలాభం కలిగించేవైనా పుణ్యకార్యాలను తప్పకుండా చేయాలి. అందువల్ల ఇహ-పర సుఖాలు కలుగుతాయి. నాలుగు వర్ణాలకు సంబంధించిన మానవులు వారి-వారి వర్ణ ధర్మాలను ఆచరించడం ఉత్తమం. ఆయా ధర్మాలలో నేర్పు సంపాదించి తపస్సును ఆశ్రయించినప్పుడే ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. మనుష్యులకు అజ్ఞానం కంటే విరోధి మరొకటి లేదు. ఫలాకాంక్ష లేకుండా సత్కర్మలు చేస్తే నిత్యుడవుతాడు. దేనితోనూ సంగం లేకుండా వుండడం మేలు. సుజ్ఞానం సుగతినిస్తుంది. తపస్సు వల్ల నాశనం వుండదు. ఇది తెలియడమే వేదార్థసారం. ధీరుడిని జ్ఞానలక్ష్మి ఎప్పుడూ వీడిపోదు.

         ‘పెద్దలు కీర్తించే సద్గుణాలు దమం, సత్యం, ఓర్పు అంత మంచి గుణాలా?’ అని ప్రశ్నించాడు భీష్ముడిని ధర్మరాజు తన తరువాత ప్రశ్నగా. ‘హంసగీత వింటే ధర్మరాజు ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుందని అంటూ దాని తాత్పర్యాన్ని వివరించాడు భీష్ముడు ఇలా.

         ‘వేద సారాంశం సత్యం, సత్యసారరూపం దమం, దమసారాంశం ముక్తి. సత్త్వాదులను పాటించేవారికి మోక్షం కరతలామలకం. ఎవడు మనస్సునూ, మాటనూ, అపమార్గంలో పోనీయకుండా రక్షిస్తాడో అతడి చేతిలోనే వేదం, తపస్సు, త్యాగం వుంటాయి. సత్యం, ఓర్పు, దమం అనే మూడూ శాశ్వతమైన మోక్షాన్ని చేరుకోవడానికి నిచ్చెన మెట్లలాంటివి. అవి సజ్జన సాంగత్యం వల్ల కలుగుతాయి. ఆత్మజ్ఞాన సంపన్నుడైన పండితుడు ఒక్కడే తనలో తాను ఆనందిస్తాడు. చాలామందికి ప్రీతి కలిగిస్తాడు. అంతా అతడిని గౌరవిస్తారు. బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేయడం వల్ల దేవత్వం పొందుతాడు. ఉపవాసాది పుణ్యకర్మలు చేయడం వల్ల సాధువుగా ప్రశస్తి పొందుతాడు. నింద్యమైన శీలం కలవాడు దుర్జనుడుగా పిలువబడుతాడు. శౌచం పాటించక పోవడం వల్ల మరణభీతితో దీనుడౌతాడు’.

         భీష్ముడు అలా చెప్పేసరికి విని ధర్మరాజు అతడితో సాంఖ్య శాస్త్రం, యోగశాస్త్రం మధ్యన వున్న భేదాలను, వాటి స్వరూపాలను తెలియచెప్పమని అడిగాడు. సాంఖ్యులు, యోగులు తమ-తమ మార్గాలే మేలైనవని కారణాలు ప్రకటిస్తారు కాని తన దృష్టికి ఆ రెండు మార్గాలు ఒక్కటేనని చెప్పాడు భీష్ముడు. యోగులు ప్రత్యక్షమొక్కటే ప్రమాణహేతువని వాదిస్తారని, సాంఖ్యులు శాస్త్ర ప్రతిపాదితమైన అర్థాలలో విశ్వాసం కలిగి అవే ప్రమాణమని నిరూపిస్తారని, ఏదేమైనా ఈ రెండు మార్గాలవారూ చివరకు పొందే లక్ష్యం ఒక్కటే అని భీష్ముడన్నాడు. సాంఖ్యయోగాల మార్గాలు రెండూ విభిన్నమై కనిపించడమనేది కేవలం శాస్త్రంలో మాత్రమేనని, ప్రాణుల పట్ల హితం, మంచి నియమాలు పాటించడం, శౌచం, ఈ రెండు మార్గాలకూ నియతమైన కార్యాలేనని చెప్పాడు భీష్ముడు ధర్మరాజుకు.     

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, పంచమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

  

                          

        

Sunday, March 26, 2023

TRAINING FUNCTION AS TOP PRIORITY OF GOVERNMENT : Vanam Jwala Narasimha Rao

 TRAINING FUNCTION AS TOP PRIORITY OF GOVERNMENT

Vanam Jwala Narasimha Rao

The Hans India (26-03-2023)

              (Attitude’ problem of two employees who are the main culprits of leak and also lack of ‘knowledge, skill and attitude’ of few more employees working in the same organization, mainly at the supervisory and custodian level, perhaps may be the reason for leakage. In order to avoid mistakes and mischiefs, especially in sensitive departments like Public Service Commission, scope of training could be further expanded beyond ‘knowledge, skill and attitude’ aspect, with predominant focus on attitude, to ‘Sensitization and Sensitivity’ (S & S) aspects. These two coupled with ‘Attitude’, may be termed as SSA- Editor Hans India)

An unanticipated incident in the State, wherein, question paper leak of an examination of Telangana State Public Service Commission (TSPSC), apparently due to the mistake or mischief of two individuals working in the organization, led to a mad hue and cry by few politicians. The leakage, in all probabilities might have happened, due to inadvertent inadequate security measures in office computers, where confidential information is supposed to be stored. The two accused were taken to custody for investigation by Special Investigation Team (SIT) appointed by state government. TSPSC also announced cancellation of the Group One Prelims examination held on October 16, 2022, following a report of the SIT and also an internal inquiry conducted by the commission. Subsequently, the press reported that, SIT arrested few more, who included former outsourcing employees and also some employees who appeared for Group One Prelims and scored more than 100 marks, for further probe.

Attitude’ problem of these two employees who are the main culprits of leak and also lack of ‘knowledge, skill and attitude’ of few more employees working in the same organization, mainly at the supervisory and custodian level, perhaps may be the reason for leakage. Hence, entry level and periodical follow-up training to such people to address these problems to the concerned staff is absolutely necessary, at least in future. This also holds good for employees of other departments to avoid mistakes and mischiefs. In fact, for sensitive departments like Public Service Commission, scope of training could be further expanded beyond ‘knowledge, skill and attitude’ aspect, with predominant focus on attitude, to ‘Sensitization and Sensitivity’ (S & S) aspects. These two coupled with ‘Attitude’, may be termed as SSA. Sensitization stimulates employee whereas sensitivity implies a readiness to respond positively. A special recruitment for TSPSC staff needs to be adopted in future to avoid such leakages. Thus, training will play a vital role in individuals being more responsive to the context and content of the situation or task at hand.

As usual, taking advantage of the whole episode, blame game started accusing the government and IT Minister, for everything that has happened, without even going in to authenticities and niceties. This way of targeting without valid proof is not a healthy practice in a democratic polity. Undoubtedly, the whole episode is sensitive and delicate, and hence, a follow up decision by TSPSC should necessarily be aimed at keeping in view the philosophy of Jeremy Bentham that ‘Greatest Good for the Greatest Number for the Longest Time’. Accordingly, at a time when state government is doing its best to restore confidence among youth by way of taking measures to fix the loopholes in the TSPSC examination system, and benefit the affected individuals, this sort of an unethical blame game is an unhealthy democratic process. Right to Freedom of Expression does not infer Right to shameless abuse. Intellectuals need to ponder over.

 TSPSC, which has been doing incredible service, ever since BRS came to power, has been under ‘Eccentric’ criticism in the recent past by few political leaders either for no reason or for political mileage. TSPSC was formed on December 18, 2014 with Professor Ghanta Chakrapani, who was in forefront during Separate Telangana State moment, as its Chairman, and within one year, under his stewardship, it made a tremendous mark by being recognized as one of the best PSCs in the country. Dr B Janardhan Reddy, a serving IAS Officer then, succeeded him. Both of them are known for their impeccable honesty, dedication, and commitment to service. Irrespective of the fact that the TSPSC is known for its marvelous achievements particularly during Chakrapani’s time and also subsequently, it is under attack for a mistake and mischief of two individuals and thereby implanting doubts in unemployed youth about their future.

Just for academic interest, it is worthwhile to glance in to the past to know the credentials of TSPSC better. In January 2016, just two years of its formation, the prestigious All-India Public Service Commissions Chairmen Conference was Chaired by TSPSC Chairman, a rare honor, where the technological initiatives and Innovative practices as well as procedures of TSPSC were demonstrated. This attracted several commissions. Twelve state PSCs adopted Telangana’s Technical procedures and practices. UPSC directed a visiting committee from Mauritius to seek advice from TSPSC in revamping their national PSC. 

Numerous happenings in our day-to-day life provide us directly or indirectly with a learning opportunity and in the process, we experience certain amount of ‘knowledge or skill or ability to do’ several activities. In the context of an employee, especially in relation to their application in the working environment this type of learning should be in a systematic way and it goes without saying that it should be through Systematic Approach to Training (SAT) only. Honestly speaking, despite several valid recommendations incorporated in National Training Policies and States’ Training Initiatives, ‘Training Function’ is still not a priority area. Then, who is responsible for identifying what the employees need to learn, either to improve their current performance or cope with changes that are likely to occur? These are the days where everything is provisional and short-term in an everchanging scenario. We need to find an answer to this. In this context, training which is systematic learning is a must for every employee for a minimum number of hours in a year beginning with entry stage. In these days of contracting and outsourcing in several departments including sensitive at times, fast track training shall be made compulsory, without which assignment of duties particularly in sensitive areas needs to be disallowed.

In fact, everybody in an organization or department, from the Chief Executive or Head of the Department, to a newly recruited junior member of staff, are involved in a constant learning experience as a ‘learning organization’. But this learning may not be relevant to their job and may not necessarily mean it will result in a worthwhile improvement in job performance. Learning may be a random experience, whereas, training is being done for a specific purpose. It is concerned with helping someone to learn speedily and effectively and requires a clearly defined outcome. In training, effective learning conditions are provided, like demonstrating a task describing how it should be done.

Learning is a critical factor for success. For instance, understanding the priorities of government policies, schemes, and programs as well as promises made to the people and the urgency to fulfil them with transparency, accountability, and responsiveness, the three important parameters for Good Governance. While speed is very important, equally important is accuracy, meaning without any scope for mistakes and mischiefs. If the department relies solely on the naturally occurring process of learning, it may never achieve success, because such learning may take too long, or be wrongly directed. Training which becomes more appropriate here, is a systematic, planned process to modify attitude, knowledge, or skill behaviour through learning experience, directed at improving performance, in an activity or range of activities. The purpose in the work situation, is to develop the abilities of the individual and to satisfy current and future needs of the organization.

In the absence of training and that too systematic, employees in a department, may never be able to perform the task properly and they may harm themselves or others as in the case of TSPSC paper leak incident. The consequences of a wrong performance may result in public complaints. Once the task is learned wrongly it is very difficult to ‘unlearn’ and then ‘relearn’ correctly. Training helps individuals and working groups become more versatile, flexible, and generally able to achieve higher standards of performance. Some organizations take up training and do it as an act of faith, without requiring justification or considering the costs or benefits to be obtained from the investment they are making.  However, such organizations are now increasingly in the minority in spite of their awareness that training is essential to improved performance and process of unlearning of redundant things.

An inevitable consequence of change, and dealing with performance issues resulting from change, is the need to learn systematically through training.  Change may be the result of the introduction of new schemes, new programs, new policies, new technology, latest working practices, or through the general development and rising aspirations of people. Performance problems may occur because of such change, but also because of existing behavioral deficiencies of individuals or working groups. A ‘Systematic Training Function’ is the need of the hour to avoid problems of performance and for improved performance of employees in general and particularly in the context of Telangana Public Service Commission staff.

Persons of the stature of former TSPSC Chairman Ghanta Chakrapani, professor of Sociology and Dean of Social Sciences in Dr BR Ambedkar Open University and experienced in conducting regular training programs on interview technics for members of TSPSC and other training programs for staff including at UPSC level, may be the right person to head and lead ‘Training Function’ as priority of government, so that in future performance and attitude problems as well as ‘mistakes and mischief’ in TSPSC may not occur.  

(The writer is CPRO to CM Telangana and former Senior Faculty and Additional Director, Dr MCR HRD IT, the Premier Administrative Training Institute of Government of Telangana).

Sunday, March 19, 2023

ఇందిరా గాంధీ, సరిలేరు నీకెవ్వరు : వనం జ్వాలా నరసింహారావు

 ఇందిరా గాంధీ, సరిలేరు నీకెవ్వరు

వనం జ్వాలా నరసింహారావు

సకలం వెబ్ మాగజైన్ (20-03-2023)

సుమారు పదహారేళ్ల పాటు భారత ప్రధాన మంత్రిగా వున్న ఇందిరా గాంధీ, తనదంటూ ప్రత్యేకంగా సంతరించుకున్న దృఢమైన ఆత్మ స్థయిర్యం, నిరంకుశ ధోరణి, రాజీ పడని మనస్తత్వం కలబోసిన అరుదైన వ్యక్తిత్వంతో, అనునిత్యం సంక్లిష్టమైన పరిస్థితుల్లో వున్న దేశానికి, అత్యంత సమర్థవంతమైన పరిపాలనను అందించి చరిత్రలో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలిగింది. సర్వేపల్లి రాధా కృష్ణన్, జకీర్ హుస్సేన్, వరాహగిరి వెంకట గిరి, ఫకృద్దీన్ అలీ అహమ్మద్, నీలం సంజీవరెడ్డి, జ్ఞానీ జైల్ సింగ్ లు రాష్ట్రపతులుగా వున్నప్పుడు ఆమె ప్రధాన మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా లాంఛనంగా రాజకీయాల్లోకి ప్రవేశించి, నాలుగు పదుల వయస్సులో 1959 లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికై, ప్రపంచ చరిత్రలోనే ప్రప్రధమంగా బాలట్ ద్వారా అధికారంలోకి వచ్చిన కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేయించడంలో కీలక పాత్ర పోషించింది ఇందిరా గాంధీ.

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం, పార్టీలోని ‘సిండికేట్’ నాయకత్వాన్ని ధిక్కరించి, పార్టీని చీల్చి, భారత జాతీయ కాంగ్రెస్ అంటే తానే అన్న చందాన, మొత్తం పార్టీ యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. ఎమర్జెన్సీ అనంతరం ఓడిన అప్పటి కాంగ్రెస్ పార్టీని, అచిర కాలంలోనే గద్దెనెక్కించడానికి, మరో మారు చీల్చి, ఇందిరా కాంగ్రెస్ గా నామకరణం చేసి, రెండేళ్లకే మళ్ళీ అధికారంలోకి వచ్చి, పాలనా పగ్గాలను, పార్టీ పగ్గాలను తన చేతుల్లో వుంచుకుంది. తనకు ఎదురు లేకుండా, ఎదిరించిన వారికి పుట్ట గతులు లేకుండా, ఏకచ్ఛత్రాధిపత్యంగా, మకుటంలేని మహారాణిగా దేశాన్ని ఏలింది. నియంతృత్వ ప్రజాస్వామ్యమంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది. అధికారంలో వున్నా-లేకపోయినా అత్యంత బలీయమైన శక్తిగా గుర్తింపు పొంది, వైరి వర్గాలను నామరూపాలు లేకుండా చేయగలిగే స్థాయి ఆమెది.

పార్టీ పరంగా నియంతృత్వ పోకడలున్న ఇందిరాగాంధీ, పాలనా పరంగా ప్రజాస్వామ్యాన్ని పటిష్టంగా మలిచే ప్రయత్నంలో అప్రయత్నంగానే నిరంకుశత్వం అలవరచుకుందనొచ్చేమో! ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా బలమైన కేంద్రం దిశగా ఆమె విధానాలు రూపుదిద్దుకోసాగాయి. తన పార్టీకి చెందిన ముఖ్యమంత్రులను ఇష్టమొచ్చిన రీతిలో మార్చడం, ఇతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులను ఇబ్బందులకు గురి చేయడం, అధికారాలను కేంద్రీకరించడం ఆనవాయితీగా మారిపోయింది. కమ్యూనిస్టు వ్యతిరేకతను వదిలి, సిండికేట్ పై విజయం సాధించడానికి వామ పక్షాలను కలుపుకుంది. ‘కమ్యూనిజం’ కంటే ‘కమ్యూనలిజం’ వల్లే ప్రమాదం అంటూ అలనాటి జనసంఘ్ లాంటి పార్టీలను ఎదగకుండా చేసింది.

ఇరవై సూత్రాల ఆర్థిక ప్రణాళికైనా, గరీబీ హటావో పథకమైనా, బాంకుల జాతీయ కరణైనా, గ్రామీణ బాంకుల స్థాపనైనా, రాజ్యాంగ సవరణలైనా, సవరణలలో భాగంగా అవతారికలో ‘సామ్యవాదం, లౌకిక వాదం’ అన్న పదాలను చేర్చడమైనా, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ప్రాధమిక హక్కులకంటే ముఖ్యమైనవని చెప్పడమైనా, మరేదైనా, ఏమి చెప్పినా, చేసినా, ఇందిరా గాంధీ మనసులో మాట ఒకటే. భారత దేశానికి నాయకత్వం వహించగలిగేది తానే అని, తాను దానికోసమే జన్మించానని ఆమె నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆమె అనుకున్న కార్యం సాధించడానికి దేనికైనా వెనుకాడక పోయేది. ఆ నమ్మకమే ఆమె గెలుపుకు సోపానాలయ్యాయి, ఓటమికి కారణాలయ్యాయి. ఓడినా గెలిచి అధికారంలోకి రాగలిగిన ఏకైక వ్యక్తిగా, ప్రపంచ చరిత్రలో పేరు తెచ్చుకుంది.

అణుయుగంలో, అంతరిక్ష యుగంలో భారతదేశాన్ని అడుగు పెట్టించిన ఘనత, సోవియట్ వ్యోమ నౌకలో భారతీయులను పంపడానికి చొరవ తీసుకున్న ఘనత ఇందిరా గాంధీదే. భారత దేశం అంతర్జాతీయ రంగంలో ఎవరి పక్షం వహించదని, ఎలుగెత్తి చాటి చెపుతూ, అలీన విధానాన్ని పాటించే దేశాలకు నాయకత్వం వహించే స్థాయికి తీసుకెళ్ళింది ఇందిరా గాంధీ. సోవియట్ యూనియన్ తో మైత్రి చేసినప్పటికీ, అమెరికా వ్యతిరేకిగా ముద్ర పడకుండా జాగ్రత్త పడింది. ఇందిరా గాంధీలో సహనం, అసహనం సమపాళ్లలో వుండేవని ఆమెను గురించిన కథనాల్లో పలువురు పేర్కొన్నారు. ఎప్పుడు దూకుడుగా వ్యవహరించే దో, ఎప్పుడు నిశ్శబ్దంగా పనులు చక్కబెట్టే దో, ఎందుకు ఒంటరిగా వుండదలుచుకునేదో, ఎప్పుడు-ఎందుకు ఏ పని చేసే దో కనుక్కోవడం అంత తేలిక కాదని మీడియాలో కథనాలొచ్చేవి. ఒకరిని చేరదీయడంలోను, ఇంకొకరిని పక్కన పెట్టడంలోను, ఆమెకు ఆమే సాటి. రిచర్డ్ నిక్సన్ ప్రయివేట్ పౌరుడిగా ఆమెను కలవడానికి వచ్చినప్పుడు వెంట వచ్చిన ట్రాన్స్లేటర్ ను సంభాషణ ముగించమని హిందీలో అన్నదట.

బాల్యంలో జైలులో వున్న తండ్రి జవహర్లాల్ నెహ్రూ తనకు రాసిన ఉత్తరాలలో వర్తమాన ప్రపంచ చరిత్రతో పాటు ప్రాచీన, భవిష్యత్ దర్శనం కలిగే విధంగా ఎన్నో విషయాలను తెలుసుకోగలిగింది. నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రధాని అయినప్పుడు, తండ్రి దగ్గరకు వచ్చే వారికి ఆతిథ్యం సమకూర్చే బాధ్యతలను, కర్తవ్య పరాయణతో నిర్వర్తించింది. జవహర్లాల్ ను కలవడానికొచ్చిన దేశ-విదేశీయ ప్రముఖులు, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు, పాత్రికేయులు, విద్యావేత్తలు, సామాజిక శాస్త్రజ్ఞులు, ఆయన పక్షాన ఆతిథ్య బాధ్యతలు బిడియంగా చేపట్టిన ఇందిరను,  తండ్రి చాటు బిడ్డగా, నెహ్రూ కూతురుగానే చూసినప్పటికీ, ఆమె మాత్రం రాజకీయ పాత్ర పోషించకుండా వుండలేని పరిస్థితికి చేరుకుంది.

తండ్రి మరణానంతరం, లాల్ బహదూర్ మంత్రివర్గంలో సమాచార-ప్రసార శాఖను చేపట్టింది. శాస్త్రి హఠాన్మరణం దరిమిలా, కాంగ్రెస్ అధిష్టానం ఇష్టం వున్నా లేకపోయినా, ఇందిరను ప్రధాన మంత్రిని చేశారు. ఇక అక్కడి నుంచి ఇందిర అధ్యాయం మొదలైంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధించడంతో భవిష్యత్ పై దృష్టి సారించింది ఇందిరా గాంధీ. ప్రజలకు తాను మరింత చేరువ కావాలంటే, సామ్యవాద పంథాలో పయనించడం మినహా మార్గం లేదని విశ్వసించింది. తదనుగుణంగా ప్రభుత్వ పథకాల రూపకల్పనకు అంకురార్పణ చేయసాగింది.

అకస్మాత్తుగా మరణించిన రాష్టపతి జకీర్ హుస్సేన్ స్థానంలో, ఇందిరా గాంధీని విమర్శించే నీలం సంజీవరెడ్డిని ఇందిర వ్యతిరేక కాంగ్రెస్ అధిష్టాన వర్గం అభ్యర్థిగా నిర్ణయించింది. నామినేషన్ పై ఆయననే ప్రతిపాదించిన ఇందిరా గాంధీ, ఓటింగులో, స్వతంత్ర అభ్యర్థి వీవీ గిరికి మద్దతును బహిరంగంగానే ప్రకటించి, తన వారందరినీ ఆయనకే ఓటెయ్యమని సూచించింది. ఆమే నెగ్గింది. నీలం ఓటమి పాలయ్యారు. మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలోంచి వెళ్లిపోయే పరిస్థితులు కలిపించింది. కాంగ్రెస్ పార్టీని చీల్చింది. ఏడాది ముందే 1971 లో ఎన్నికలకు పోయి, అఖండ విజయం సాధించి పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించింది.

భారత-పాకిస్తాన్ యుద్ధంలో, ఇందిర నేతృత్వంలోని భారతదేశం అఖండ విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఉపఖండంలో తిరుగులేని శక్తిగా భారత దేశానికి పేరు తెచ్చింది. ఇందిరా గాంధీని ద్వేషించే అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ తన సంపూర్ణ మద్దతును పాకిస్తాన్ కు ఇచ్చిన నేపధ్యంలో, యుద్ధానంతరం ఆయనకొక ఘాటైన ఉత్తరం రాసిందామె. లక్షలాది మంది తూర్పు పాకిస్తాన్ శరణార్థులు సరిహద్దులు దాటి భారత దేశానికి వచ్చి పడుతుంటే, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తమకుందని, ఆ కర్తవ్య నిర్వహణలో యుద్ధం చేయాల్సి వస్తే, తాను చేసిన తప్పేమిటో స్పష్టం చేయాలని నిక్సన్ ను ప్రశ్నించింది.

ఆమె ఆరోహణ పర్వం కొనసాగుతుండగానే, అవరోహణ పర్వం కూడా మొదలైంది. అలహాబాద్ హైకోర్టు, ఇందిరా గాంధీపై వేసిన ఎన్నికల పిటీషన్ లో ఆమెకు వ్యతిరేకంగా, లోక్ సభకు ఆమె ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలిగా ప్రకటించింది. ఆమె పై కోర్టుకు అపీల్ చేసుకునే వీలున్నప్పటికీ, తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండు చేశాయి. రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా, యోధాన యోధులైన రాజకీయ నాయకులను నిర్బంధించి, అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అంతర్గత బధ్రత చట్టం కింద వందల, వేల సంఖ్యలో అరెస్టులు చేయించింది. స్వతంత్ర భారత దేశంలో చీకటి రోజులకు తెరలేపింది ఇందిరా గాంధీ. రాజ్యాంగాన్ని తిరగ రాసింది. అవధులు లేని అధికారాలను ఇందిరా గాంధీ తన సొంతం చేసుకుంది. అత్యసర పరిస్థితికి అనుగుణంగా, అరెస్టు చేసిన రాజకీయ ఖైదీలను విచారణ లేకుండా జైళ్లలో నిర్బంధించడానికి తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించడంతో ఇందిరకు మరింత బలం చేకూరింది.

ఐదేళ్ల లోక్ సభ పదవీకాలం పొడిగించి, ఆరేళ్లు చేసిన తర్వాత, మరో ఏడాది పొడిగించబోతున్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే, హఠాత్తుగా, జనవరి 1977 లో ఎన్నికల నిర్ణయం ప్రకటించింది ఇందిరా గాంధీ. జైళ్లలో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయించింది. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో జనతా పార్టీ ఆవిర్భవించింది. ప్రతి పక్షాలన్నీ ఏకమయ్యాయి. మార్చ్ 20, 1977 న జరిగిన లోక సభ ఎన్నికలలో ఇందిరా గాంధీని ఆమె నియోజక వర్గంలోను, ఆమె సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని దేశంలోను దారుణంగా ఓడించారు. మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగా ప్రధమ కాంగ్రెసేతర ప్రభుత్వానికి సారధ్యం వహించారు. ప్రజల సేవలోనే గడుపుతానని అంటూ పదవికి రాజీనామా చేసింది ఇందిరా గాంధీ.

ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నాలు తిరిగి ప్రారంభించింది. తన పార్టీలో తనకు వ్యతిరేకంగా వున్న వారితో బంధాలు తెంచుకుని, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన వారిలో సగం మందికి పైగా తన వెంట వుంచుకుని, మరో మారు కాంగ్రెస్ పార్టీని చీల్చింది. కాంగ్రెస్ (ఐ) ని స్థాపించింది. అదే అసలు సిసలైన భారత జాతీయ కాంగ్రెస్ గా ప్రకటించింది. ప్రజలు ఆమె పక్షమే వున్నారనడానికి, దేశ రాజకీయాల్లో ఒకటి వెంట మరొకటి చోటు చేసుకున్న సంఘటనలే నిదర్శనం. కర్నాటకలోని చిక్ మగలూర్ నుంచి ఇందిరా గాంధీ లోక సభకు ఎన్నికవడంతో, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్(ఐ) అఖండ విజయం సాధించడంతో ప్రజలు ఆమెకు తిరిగి బ్రహ్మ రధం పట్ట సాగారు. ఈ నేపధ్యంలో, ఒకానొక సందర్భంలో, లోక్ సభలో సుదీర్ఘ చర్చ అనంతరం, ఇందిరా గాంధీ సభ్యత్వం రద్దుచేయాలని, సమావేశాలు ముగిసేవరకు అరెస్ట్ చేయాలని, ప్రధాని మొరార్జీ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. పార్లమెంట్ హాలును వదిలి వెళ్లనని, తననక్కడే అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తూ భీష్మించుకుని కూచుంది. అరెస్ట్ చేయడానికి మూడు గంటల తర్వాత వచ్చిన అధికారులకు నమస్తే చెపుతూ వారి వెంట వెళ్లింది ఇందిరా గాంధీ.

జులై 1979 లో మొరార్జీ దేశాయ్ రాజీనామా చేశారు. దానికి కారణ భూతుడైన చరణ్ సింగ్ కు మద్దతు పలికి, ఆయన ప్రధాన మంత్రి కావడానికి తోడ్పడింది ఇందిరా గాంధీ వ్యూహాత్మకంగా. దరిమిలా చరణ్ సింగ్ ప్రభుత్వాన్ని విశ్వాస తీర్మానంలో ఓటమి పాలు చేసింది. జనవరి 1980 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ () మూడింట రెండు వంతుల మెజారిటీతో అఖండ విజయం సాధించి, ఇందిరా గాంధీ మరో మారు ప్రధాన మంత్రి అయింది. సుస్థిరతా, అస్థిరతా అన్న నినాదంతో ఆమె ఎన్నికల బరిలో దిగి గెలిచింది. ప్రజాస్వామ్యం, నియంతృత్వం కంటే సుస్థిరతే ముఖ్యమని భారత దేశ ఓటర్లు స్పష్టం చేశారు. భారత దేశానికి కావాల్సింది నియంతృత్వం సమపాళ్లలో కల్సిన ప్రజాస్వామ్యం అన్న సంకేతాన్ని కూడా ఓటర్లు బహిర్గతం చేశారని అనాలి.

ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో అమృత్‌సర్ లోని గోల్డెన్‌ టెంపుల్, హర్మందిర్ సాహిబ్ పై జరిగిన సైనిక దాడికి నిరసనగా, అంగరక్షకులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ లు జరిపిన కాల్పుల్లో అక్టోబర్ 31, 1984 న ఇందిరాగాంధి హత్యకు గురైంది. మరణించడానికి క్రితం రోజు జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, దేశ  సేవలో తన ప్రాణాలు పోయినా బాధ పడనని, చనిపోతే తన రక్తంలోని ప్రతి నెత్తురు బొట్టు జాతికి బలం చేకూరుస్తుందని యాదృచ్చికంగా అన్నదో, లేదా, ఆమెలోని ఏదైనా అంతర్నిహిత శక్తి అలా అనిపించిందో భగవంతుడికే తెలియాలి. ఇందిరాగాంధి హత్యకు గురై మరణించి నలబై సంవత్సరాలు కావస్తున్నా, జాతీయ-అంతర్జాతీయ రంగాలలో ఆమె మిగిల్చిన తీపి-చేదు గుర్తులు అజరామరంగా అశేష ప్రజానీకం గుండెల్లో గూడుకట్టుకున్నాయి. ఇందిరాగాంధీ తప్పొప్పులు పక్కన పెట్టితే, అమెనెంతగా అభిమానించేవారో, అంత మోతాదులోనే, ఆమెలోని మంచి చెడులను నిశితంగా  విమర్శించే కోట్లాది ప్రజలు ఇప్పటికీ చాలామంది వున్నారు. ఆమెదో అరుదైన వ్యక్తిత్వం. అందుకే,సరిలేరు నీకెవ్వరు ఇందిరాగాంధీ’.

(సరిగ్గా 46 ఏళ్ల క్రితం, మార్చ్ 20, 1977 న జరిగిన

లోక సభ ఎన్నికలలో ఇందిరా గాంధీ పరాజయం నేపధ్యంలో)