సీతమ్మ చెప్పిన కళ్యాణ ఘట్టం
వనం జ్వాలా నరసింహారావు
సాక్షిదినపత్రిక (30-03-2023)
రాముడెప్పుడైతే శివుడి విల్లు విరిచాడో, అప్పుడే అతడు శివుడి కంటే గొప్పవాడైన విష్ణువని జనకుడు గ్రహించాడు.
అలాంటి ఆమెకు సాక్షాత్తు లక్ష్మీదేవైన సీతను ఇస్తున్నాననే అర్థమొచ్చే విధంగా వివాహం
జరిపించే సమయంలో, 'ఈ సీత'
అన్నాడు. సీత నాగటి చాలులో దొరికినప్పటికీ జనకుడు సగర్వంగా,
'నాదుకూతురు', అని చెప్పాడు.
సీతే లక్ష్మీదేవి అయినందువల్ల, విష్ణువు అవతారమైన రాముడి
కైంకర్యమే ఆమె స్వరూపం. సృష్టిలో, రక్షణలో, సంహారంలో ఆమె ఆయనకు సర్వకాల సర్వావస్థలందు తోడుగా వుంటుంది. వివాహ లీల
కేవలం లోక విడంబనార్థమేనని, ఆయన సొత్తును ఆయనే తీసుకొమ్మని
కూడా అర్థం. ‘ఈ సీత నా కూతురు. నీ సహధర్మచారిణి. ఈమెను పాణి గ్రహణం చేసుకో’’
అని అంటూ సీతను కన్యాదానం చేశాడు జనక మహారాజు. ఈ వివరాలను సాక్షాత్తూ సీతాదేవే అత్రి మహాముని భార్యైన, అనసూయాదేవికి
ఆమె కోరికపై వివరించింది.
అరణ్యవాసంలో భాగంగా చిత్రకూటం
నుండి సీతాలక్ష్మణ సమేతంగా బయల్దేరిన శ్రీరాముడు అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకుని, ఆయనకు, ఆయన భార్య సతీ అనసూయాదేవికి సీతాదేవిని పరిచయం చేశాడు. సీతాదేవి కూడా తన
పేరు చెప్పి నమస్కారం చేసి రెండు చేతులు జోడించి నిలువబడి కుశలం అడిగింది అనసూయను.
సీత పుణ్యచరిత్రదని, పాతివ్రత్యమే గొప్పదిగా భావించి,
చుట్టాలను, సంపదను, సౌఖ్యాన్ని వదిలి, మహారాజు
కోడలినని కాని, మహారాజు కూతురునని కాని లక్ష్యపెట్టకుండా,
తండ్రిని యదార్థవాదిని చేయాలన్న ఉద్దేశంతో అడవికి భర్తతో వచ్చిందని, ఆమెలాంటి స్త్రీలు అరుదని, కొనియాడింది అనసూయ. శ్రీ రామచంద్రమూర్తి తన
పరాక్రమంతో స్వయంవరంలో సీతను పెళ్లి చేసుకున్నాడని వినడమే కాని, అదెలా జరిగిందో వివరంగా వినలేదని, అ కథ వినాలని వుందని, జరిగినదంతా వివరంగా చెప్పమని అనసూయ సీతను అడిగింది.
జవాబుగా
సీతాదేవి, తన తండ్రి జనకుడు విదేహ దేశానికి రాజని, ఒకనాడు యజ్ఞం చేయడానికి నేల దున్నిస్తుంటే నాగేటి కర్రు తగిలి నేల
పెళ్లలు లేచివచ్చి తాను భూమిలోనుండి బయటకు వచ్చానని, అప్పుడు
జనకుడు తనను చూసి ఆశ్చర్యపడి, తన పెద్ద భార్యకు ఇచ్చాడని,
ఆమె తన్ను తన కన్నబిడ్డలాగా చూసుకుని పెంచిందని, తనకు
వివాహయోగ్య దశ రావడం గమనించిన తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచన చేయసాగారని చెప్పింది. తనకు
తగిన వాడిని, సద్గుణ సంపత్తికలవాడిని, గొప్పవాడిని,
ఏవిధంగా భర్తగా సంపాదించగలనని జనకుడు విచార సముద్రంలో మునిగిపోయాడని, తల్లిగర్భంలో పుట్టని దేవకన్యలాంటి సుందరినైన తనకు, తగినవాడిని, మన్మథాకారుడిని, సమానుడైన
వాడిని సంపాదించాలని జనకుడు వెతికాడు కాని ఎవరూ దొరకలేదని,
అప్పుడు స్వయంవరం చాటిస్తే బాగుంటుందని ఆలోచనచేశాడని సీతాదేవి అనసూయకు చెప్పింది.
సీతాదేవి
ఇంకా ఇలా అన్నది: ‘ఈ ప్రకారం ఆలోచించి, తాను చేసిన ఒక
గొప్ప యజ్ఞంలో వరుణుడు తనకు ఇచ్చిన మనుష్యులు కదిలించ సాధ్యపడని వింటిని, రాజులు కలలో కూడా ఎక్కుపెట్టలేని వింటిని, అక్షయబాణాలను,
రాజులందరికీ చూపించాడు జనకుడు. ఆ విల్లెక్కుపెట్టిన వాడు తన
కూతురుకు భర్త కాగలడని ప్రకటించాడు. అక్కడికి వచ్చిన రాజులు దానిని ఎత్తలేక,
చూడగానే భయపడి, దానికి ఒక నమస్కారం చేసి
పోయారు. చాలాకాలం ఇలాగే గడిచి పోయింది. రాజకుమారులెవరూ దానిని ఎక్కుపెట్టలేక
పోయారు’.
‘ఈ
నేపధ్యంలో, విశ్వామిత్రుడు తన యాగ రక్షణకై దశరథ కుమారులైన
రామలక్ష్మణులను వెంట తీసుకుపోయి, తన కార్యం నెరవేర్చుకున్న
అనంతరం, వారికి కళ్యాణం జరిపించాలన్న ఆలోచనతో, తన వెంట మిథిలా నగరానికి తీసుకుని వెళ్తాడు. వారిని జనక మహారాజుకు పరిచయం
చేసి, ఆయన దగ్గరున్న శివ ధనుస్సును చూపించమంటాడు. అప్పుడాయన సీత
జన్మ వృత్తాంతం చెప్పి, తనకు నాగేటి చాలులో దొరికిన సీత
వీర్యశుల్కనీ, శక్తి ప్రదర్శన చేయడమే అమెకివ్వదగిన శుల్కమనీ,
తన దగ్గరున్న ధనుస్సును ఎక్కుపెట్టగలవాడికే కూతురు సీతను ఇస్తానని అంటాడు.
అలా చెప్పి దానిని శ్రీరామ లక్ష్మణులకు చూపించాడు. శ్రీరామచంద్రమూర్తి విల్లెక్కుపెట్టగలిగితే
అయోనిజైన సీతను ఆయన కిస్తానని, అంటాడు’.
‘శ్రీరాముడు, ధనుస్సుండే పెట్టె దగ్గరికిపోయి, దాని మూత తెరిచి,
తాను వింటిని చూసానని, తాకానని చెప్పి,
ఆయన ఆజ్ఞాపిస్తే బయటకు తీస్తానని అంటాడు. వింటిని బయటకు తీసి
ఎక్కుపెడతానని కూడా అంటాడు. అలానే చేయమని జనకుడు, విశ్వామిత్రుడు
చెప్పారు రాముడితో. అవలీలగా వింటిని అరచేత్తో పట్టుకొని, బయటకు
తీసి, రాజులందరు చూస్తుండగా రాముడు అల్లెతాటిని బిగువుగా
లాగుతుంటేనే, విల్లు ఫెల్లుమని రెండుగా విరిగిపోయింది.
రామచంద్రమూర్తి భుజబలం చూసానని, సీత రామచంద్రమూర్తిని మగడిగా
గ్రహించడమంటే అది తన అదృష్టమని, తాను ధన్యుడనయ్యానని,
అంటాడు జనకుడు. తన ముద్దుల కూతురు సీత దశరథ కుమారుడు
శ్రీరామచంద్రుడిని భర్తగా పొందడంవల్ల తమ జనక కులానికి కీర్తి
సంపాదించిపెట్టినట్లయిందని కూడా అంటాడు జనకుడు విశ్వామిత్రుడితో’.
‘విల్లు
ఎక్కుపెట్టిన, విరిచిన వారికి తన కూతురును ఇచ్చి వివాహం చేస్తానని ప్రతిజ్ఞచేసిన తన
తండ్రి తన మాట ప్రకారం
శ్రీరామచంద్రమూర్తికి తన్ను కన్యాదానం చేయడానికి జలపాత్ర చేతిలో తీసుకున్నాడు.
కాని తమ తండ్రి అభిప్రాయం తెలుసుకోవాలని చెప్పి శ్రీరాముడు దానం తీసుకోలేదు.
అప్పుడు తన తండ్రి దశరథ మహారాజు దగ్గరకు దూతలను పంపగా, ఆయన ఆహ్వానాన్ని ఆదరించి దశరథమహారాజు వచ్చాడు’. ఇలా చెప్పి, ఇక ఆ తరువాత సీతా కళ్యాణ ఘట్టం గురించి వివరించింది ఇలా.
"సీతను సర్వాభరణో, పేతను దా నిలిపి నగ్ని కెదురుగ గౌస
ల్యా
తనయున కభిముఖముగ, క్ష్మాతలనాథుండు రామచంద్రున
కనియెన్"
అన్ని విధాలైన
అలంకారాలతో ప్రకాశిస్తున్న సీతను, అగ్నికి ఎదురుగా, శ్రీరామచంద్రమూర్తికి
అభిముఖంగా, నిలువబెట్టి, జనక మహారాజు
శ్రీరామచంద్రమూర్తితో:
“ఈ సీత నాదుకూతురు, నీ సహధర్మచరి దీని నిం గై కొనుమా
కౌసల్యాసుత, నీకును భాసురశుభ మగు గ్రహింపు పాణిం బాణిన్"
“కౌసల్యా కుమారా, ఈ సీత
నా కూతురు. నీ సహధర్మచారిణి. ఈమెను పాణి గ్రహణం చేసుకో. నీకు జగత్ ప్రసిద్ధమైన మేలు
కలుగుతుంది. నీకు శుభం కలుగుతుంది. మంత్రపూర్వకంగా ఈమె చేతిని నీ చేత్తో పట్టుకో.
రామచంద్రా, పతివ్రత, మహా భాగ్యవతి అయిన
నీ సీత, నీ నీడలా ఒక్కసారైనా నిన్ను విడిచి వుండదు"
అని అంటూ, మంత్రోచ్ఛారణతో పవిత్రవంతములైన
జలధారలను రామచంద్రమూర్తి చేతుల్లో జనక మహారాజు ధారపోశాడు. సంతోషాతిశయంతో దేవతలు
పూల వాన కురిపించారు. దేవదుందుబులను చాలా సేపు మోగించారు. ఈవిధంగా మంత్రించిన
జలాలను ధారపోసి తనను శ్రీరామచంద్రమూర్తికిచ్చి వివాహం జరిపించారని సీతాదేవి
అనసూయాదేవికి చెప్పింది.
శ్రీరామవతారం వైవస్వత
మన్వంతరంలో ఐదవ మహాయుగమైన త్రేతాయుగంలో సంభవించింది. కొడుకులకై దశరథుడు పుత్రకామేష్టి
చేయగా శ్రీరామ జననం అయింది. జన్మించింది విలంబినామ సంవత్సరం కాబట్టి హేవిలంబిలో
అశ్వమేధయాగం, పుత్రకామేష్టి చేశాడు. దుర్ముఖి చైత్రమాసంలో అశ్వం
విడిచారు. శ్రీరాముడి జనన కాలంలో గురువు, చంద్రుడు, కర్కాటక లగ్నంలో వున్నారు. అంటే జన్మ లగ్నం కర్కాటకం కాగా, మేషంలో రవి, బుధులు, తులలో శని, మకరంలో కుజుడు, మీనంలో శుక్రుడు వున్నారు.
పునర్వసువు నక్షత్రంలో బుధవారం నాడు శ్రీరామజననం. చైత్ర బహుళ పంచమి నాడు నామకరణం
జరిగింది. పరాభవ సంవత్సరంలో తొమ్మిదో ఏట ఉపనయనం జరిగింది. శ్రీరాముడికి 12 ఏళ్ల
వయసున్నప్పుడు, సౌమ్యనామ సంవత్సరంలో యాగరక్షణ కొరకు
విశ్వామిత్రుడి వెంట అరణ్యాలకు పోయాడు. అరణ్యవాసానికి పోయేటప్పుడు శ్రీరాముడికి 25
సంవత్సరాలు కాగా, సీతాదేవికి 18 సంవత్సరాలు.
శ్రీరాముడికి 12 సంవత్సరాల వయసున్నప్పుడు, సీతకు
ఆరేళ్ళ వయసులో వారి వివాహం జరిగింది. దీనికి దృష్టాంతరంగా విశ్వామిత్రుడి యాగం
కాపాడడానికి రామలక్ష్మణులు వెళ్లిన రోజు నుంచి మిథిలా నగరం వెళ్లడం వరకు
తీసుకోవచ్చు. సౌమ్యనామ సంవత్సరం మాఘబహుళ విదియ నాడు శ్రీరామలక్ష్మణులు
విశ్వామిత్రుడి వెంట పోయారు. హస్త పోయి చిత్రా నక్షత్రం ప్రవేశించడంతో, ఆ రోజు
ప్రయాణానికి మంచి రోజే కాకుండా అది శ్రీరాముడికి ధృవతార కూడా. 15 వ నాటి ఉదయం
మిథిలా ప్రవేశం చేసి, శివ ధనుర్భంగం చేశాడు. 27 వ రోజున ఫాల్గున
శుద్ధ శుక్ల త్రయోదశి శుభ దినం కాబట్టి, ఉత్తర ఫల్గుణీ
నక్షత్రంలో, శుభదినమైన శుక్ల త్రయోదశి నాడు సీతారాముల కల్యాణం జరిగింది. ఉత్తర
ఫల్గుణీ నక్షత్రం శ్రీరాముడి జన్మ నక్షత్రానికి ఆరవది. సీతారాముల కళ్యాణమైన తరువాత,
బహుళ విదియతో ముగిసి, తదియనాడు జనకుడు
బిడ్డలకు అరణాలిచ్సిన తరువాత, చవితినాడు అప్పగింతలై, ఫాల్గుణ బహుళ పంచమి నాడు అయోధ్యకు ప్రయాణమయ్యారు. షష్టి, సప్తముల్లో
పరశురాముడి గర్వభంగం అయింది. దశమినాడు అయోధ్య ప్రవేశం జరిగింది. ఆ తరువాత 12
సంవత్సరాలు సుఖసంతోషాలతో గడిచింది.
ఈ నేపధ్యంలో ఒక్క విషయం చెప్పుకోవాలి
ఇక్కడ. ఇటీవల కొందరు మహానుభావులు భద్రాచల క్షేత్రాన్ని రామనారాయణుడి గుడి చేశారు. శ్రీరాముడు
పుట్టిన చైత్ర శుద్ధ నవమి నాడు భద్రాచలంలో కల్యాణం జరుగుతున్నదని అంటే, ఆ
జరిగేది సీతాదేవికి, శ్రీరాముడికే కదా! అలాంటప్పుడు, దశరథుడుది, జనకుడిది గోత్రాలు, ప్రవర చెప్పకుండా పూజారులు, అశేషమైన భక్తులను మభ్యపెట్టుతూ, రామనారాయణ పేరుతో అచ్యుత గోత్రం చదివి, పరబ్రహ్మ
శర్మ, వ్యూహనారాయణ శర్మ, విభవవాసుదేవ
శర్మ చెప్పుతున్నారు. సీతాదేవికి సౌభాగ్య గోత్రం చెప్పి, విశ్వంభర
శర్మ, రత్నాకర శర్మ, క్షీరార్ణవ శర్మ
అంటున్నారు. ఇదెక్కడి న్యాయం? ఈ తప్పును ఎవరు తీర్చి
దిద్దాలి? ఇదేంటి అని ప్రశ్నించేవారిది అరణ్యరోదన
అవుతున్నదేకాని వినే నాధుడు ఎవరూ లేరని స్థానికుల ఆవేదన!!!
(కీర్తి శేషులు శ్రీమాన్ వావిలికొలను
సుబ్బారావు గారి శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం మందరం ఆధారంగా).
(నేడు శ్రీరామనవమి
సందర్భంగా)
No comments:
Post a Comment