వేదాల మీద భక్తి, స్మృతుల మీద విశ్వాసం,
సదాచారం,
ధర్మానికి సుందరమైన ఆకారాలు
ఆస్వాదన-111
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(13-03-2023)
కాల అవయవాల
విభాగాలను, కృతాది యుగాల ప్రమాణాలను భీష్ముడు చెప్పగా
విన్న ధర్మరాజు తన మనసులోని మరో సందేహాన్ని తీర్చమని కోరాడు పితామహుడిని.
‘కార్యబలం, వీర్యబలం,
మనోబలం కలిగిన చాలా మంది రాజులు భారత యుద్ధంలో చనిపోయారని, వారిలో ఒక్కడు కూడా తన ప్రాణాలకు ప్రభువు
కాలేక పోయాడని, అసలు మృత్యువు అంటే ఏమిటని, అది దేని నుండి సంభవించిందని, అది ఏరీతిగా ప్రజలను చంపుతుందని’ ప్రశ్నించాడు ధర్మరాజు భీష్ముడిని. పూర్వం
అకంపనుడు అనే మహారాజుకు నారద మహర్షి చెప్పిన కథ ఆథారంగా ధర్మరాజు సందేహాన్ని
తీరుస్తానని తన సమాధానాన్ని ప్రారంభించాడు భీష్ముడు.
‘పూర్వం బ్రహ్మదేవుడు
లోకాలు సృష్టించాడు. దాంతో ప్రాణికోటి సమ్మర్ధం ఎక్కువైంది. దేవుడు చింతించి
ప్రాణిలోకాన్ని ఎలా సంహరించాలా అని ఆలోచించాడు. అతడి చిత్తంలో వేడి పుట్టింది.
దాంట్లో నుండి మహాగ్ని ప్రభవించింది. అది లోకాలను కాల్చివేయడానికి సిద్ధమైంది. ఆ
సమయంలో శివుడు అక్కడికి వచ్చి బ్రహ్మను శాంతింప చేశాడు. పెరిగిపోయిన జంతు సంతతిని
ఎలా సంహారం చేయాల్నో తెలియచేసి అగ్నిని శమింప చేశాడు. అప్పుడు ఎర్రటి కన్నులతో, భాసమానమైన అవయవాలతో ఒప్పే ఒక స్త్రీ
(మృత్యుదేవత) బ్రహ్మదేవుడి ఇంద్రియాల నుండి ఉద్భవించింది. ఆమె దక్షిణ దిక్కుకు
ఎదురుగా పోసాగింది. ప్రాణులను చంపమని మృత్యుదేవతను ఆదేశించాడు బ్రహ్మ. అలాంటి
క్రూర కార్యం తాను చేయలేనని, తనను ఏదైనా ధర్మకార్యానికి
నియోగించమని ఆమె వేడుకుంది. ఆమె సంహారానికే జన్మించిందని, కాబట్టి ప్రజాసంహారకార్యం తప్పక చేయాలని, అలా
చేయకపోతే అధర్మం అని బ్రహ్మ ఆమెను నిర్బంధించాడు. ఆమె కన్నీటి బిందువులను తన
దోసిట్లో పట్టుకున్నాడు. దానికామె జవాబివ్వకుండా మాయమై తపస్సు చేసుకోవడానికి
పోయింది’.
‘తపస్సు
చేసుకోవడానికి ధేనుకాశ్రమం వెళ్లిన మృత్యుదేవత తీవ్రంగా తపస్సు చేసి, అక్కడి నుండి కౌశికి, గంగ, నంద అనే నదులకు వెళ్లింది. తరువాత
హిమవత్పర్వత శిఖరం దగ్గర తపస్సు చేస్తుంటే బ్రహ్మదేవుడు ఆమె సమీపానికి వచ్చాడు.
ప్రజాసంహారమే ఆమె ధర్మమని మళ్లీ చెప్పాడు. తన దోసిట్లో పట్టుకున్న ఆమె కన్నీటి
బొట్లు అనేక రోగాల రూపంలో మనుష్యులను బాధిస్తాయని, కామక్రోధాలనే దుర్గుణాలు
కన్నీటికి సాయ పడ్తాయని, మానవులు వాటితో మరణిస్తారని, ఆమె నిమిత్తమాత్రమే అని చెప్పి ఆమెకు ఒక వరం
ఇచ్చాడు. ఆమెను పురుషుడుగా, స్త్రీగా, నపుంసకుడిగా కమ్మన్నాడు. మృత్యుదేవత జన సంహారం
అనే అధికారాన్ని వహించింది. ప్రజల ప్రాణాలను అపహరించేదిగా అయిపోయింది. ప్రాణులు
చనిపోయి, దేవత్వం పొంది, మళ్లీ మానవత్వం పొందసాగారు’.
ఇది విన్న
ధర్మరాజు మరో ప్రశ్న వేశాడు భీష్ముడికి. ‘సజ్జనులు మనసులో భయపడే ధర్మం అంతగా
పూజింపతగినదా?’ అని అడిగాడు. ధర్మం పధ్ధతి ఏమిటో వివరించమన్నాడు. జవాబుగా భీష్ముడు, వేదాల మీద భక్తి, స్మృతుల మీద గట్టి విశ్వాసం, సదాచారం అనేవి మూడూ ధర్మానికి సుందరమైన ఆకారాలని, అయితే, కొందరు
పండితులు ధనం ధర్మానికి నాలుగవ ఆకారం అని అంటారని అన్నాడు. అయినా న్యాయం తప్పి, అసత్యం పలికి, ధనం సంపాదించడం పాపాలన్నిటిలోకి ఎక్కువ పాపమని, అసత్యం పలకకుండా వుండడం, ఇతరుల ధనాన్ని ఆశించకుండా వుండడం అన్ని
ధర్మాలలోను మేలైన ధర్మమని, ఇతరులకు ఏమేమి చేస్తే తన మనస్సుకు అప్రియంగా
వుంటుందో, ఆ పనులను,
తాను ఇతరులకు చేయకుండా వుండడమే అన్ని ధర్మాలకు ఉత్తమమైన ఆలంబనగా వున్నదని భీష్ముడు
చెప్పాడు.
ఇదే విషయాన్ని
తిక్కన చక్కటి పద్యంలో ఇలా రాశారు:
క: ఒరులేమేమి యొనర్చిన
నరవర అప్రియము తన మనంబునకగు తా
నొరులకు నవి సేయకునికి
పరాయణము పరమ ధర్మ పథముల కెల్లన్
భీష్ముడు
చెప్పిన ధర్మస్వరూప నిర్వహణ అంశానికి సంతుష్టుడైన ధర్మరాజు ‘ఉత్తమమైన ఆచారం
ఎలాంటిదో’ చెప్పమని కోరాడు తాతగారిని. పూర్వం జాబాలి అనే
మునికి, తులాధారుడు అనే వైశ్యుడికి ఒక సంవాదం
జరిగిందని, అది ఇతిహాస రూపంలో వున్నదని, ధర్మరాజు అడిగిన సదాచార ధర్మాన్ని వారి సంవాద
సారాంశంలో వివరిస్తుందని అంటూ తన మాటలుగా చెప్పసాగాడు భీష్ముడు.
‘ఎవడు సత్యమే
యజ్ఞమని భావించి సత్యాన్ని పాటిస్తూ సదా తృప్తి పొంది వుంటాడో అతడి పట్ల దేవతలు
కూడా సంతృప్తి వహిస్తారు. దానివల్ల తిరుగలేని ఆనందం కలుగుతుంది. ఎవడు ధర్మంలో
రమిస్తాడో, సదా ధర్మానికి మిత్రుడై వుంటాడో,
బుద్ధిలో అసంగత్వాన్ని పాటిస్తాడో, అలా పాటించి నిర్మల హృదయుడవుతాడో, అలాంటి
వాడికి కర్మరాహిత్యం వల్ల కలిగే ఆనందం తప్పక సిద్ధిస్తుంది. కర్తవ్యం అని భావించి
చేసే కర్మ పవిత్రమైనది. కార్యసిద్ధికి హేతువౌతుంది. ప్రయోజనాకాంక్షతో చేసే పని
ఉత్తమం కాదు. మాత్సర్యం, స్పర్ధ అనే దుర్గుణాలు సద్ధర్మాన్ని
నశింపచేస్తాయి. సద్ధర్మం నశిస్తే మానవుడు పూర్తిగా నశిస్తాడు. శ్రద్ధతో
సదాచారాన్ని పాటించేవాడు దేవతల దయకు పాత్రుడౌతాడు. మానవుడు తనకు విద్యుక్తమైన ఏ
కర్మకలదో, ఆ కర్మను చక్కగా అనుష్టించడం మేలు. అతడు కర్మల పట్ల నివృత్తిని పొంది, శ్రద్ధతో కర్మసన్న్యాస పద్ధతిని పాటించడానికి
తగిన నేర్పు కూడా వుండాలి’.
‘కార్యాలను
సమీక్షించడానికి కావాల్సింది బహుదీర్ఘ సమయమా?
లేక, అత్యల్ప సమయమా?’ వివరించమని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు. పని చేసేటప్పుడు త్వరపడ
కూడదని, తొందర పడకుండా చక్కగా చాలా కాలం ఆలోచించి
చేస్తే ఓటమి కలగదని, అంతే కాకుండా అలా చేసేవాడికి
తప్పకుండా ఆ కార్యంలో విజయం కూడా సిద్ధిస్తుందని భీష్ముడు సమాధానం ఇచ్చాడు.
ఏమాత్రం సహనం లేనివారు మంచి ఏదో తెలుసుకోలేరని,
ఆలోచించి కార్యాలు చేసేవారిని వారు నిందిస్తారని, అది బుద్ధిమంతుల లక్షణం కాదని భీష్ముడు చెప్పాడు. ధర్మరాజు అడిగిన
విషయాన్ని మరింత వివరంగా తెలుసుకోవాలంటే మేధాతిథి కుమారుడైన చిరకారి అనేవాడి
చరిత్ర వింటే స్పష్టంగా తెలుస్తుందని అన్నాడు. ఆ కథ వివరించి దాని సారాంశాన్ని ఇలా
చెప్పాడు.
‘ఒక కార్యం
చేయాల్సి వచ్చినప్పుడు చాలాకాలం ఆలోచించి ధీరత్వంతో మంచి-చెడ్డలు నిర్ణయించి, ఆ పనిని నెరవేర్చాలి. ఆయాపనులు
నిర్వహించేటప్పుడు ఆలోచించి చేసేవాడిని ఆర్యుడని, తొందరపడేవాడిని అనార్యుడని
పెద్దలు నిర్ణయిస్తారు. తొందరపడకుండా చాలాసేపు విచారించి, ఫలానావాడు మిత్రుడు, ఫలానావాడు శత్రువు, ఫలానవాడు యోగ్యుడు, ఫలానావాడు అయోగ్యుడు అని పరిశీలించి ఆచరించే
సచ్చరిత్రుడు సమస్తమైన శుభాలను పొందుతాడు. తొందరపడి ఒకడు ఒక పనిచేస్తే ఆ పని
చేసినవాడికి తరువాత పశ్చాత్తాపం కలిగిస్తుంది. అలా కాకుండా చక్కగా చాలా కాలం
ఆలోచించి, దోషం లేదని నిర్ణయించుకొని చేసిన పనికి కర్తకు, కల్యాణాన్ని, ప్రకాశాన్ని తెచ్చిపెట్టుతుంది’.
‘ప్రజలను
శిక్షించే పధ్ధతి ఎలాంటిది’ అని ప్రశ్నించాడు ధర్మరాజు
భీష్ముడిని. పూర్వం ద్యుమత్సేనుడు అనే రాజు వుండేవాడని, అతడి కుమారుడు సత్యవంతుడని,
వారిరువురి మధ్య ఒక సంవాదం జరిగిందని, ఆ
సంవాదం ధర్మరాజు ప్రశ్నను వివరిస్తుందని దాని సారాంశాన్ని చెప్పాడు భీష్ముడు.
‘నేరం
చేసినవాడిని వధించడం ధర్మమని పండితులు అంటారు. కాకపోతే, చంపడమే ధర్మమైతే ఇంక
చేయరాని అధర్మ కార్యం ఏముంటుదన్న ప్రశ్న కలగవచ్చు. తప్పు చేసినవాడిని
దండించేటప్పుడు చేసిన తప్పు ఏపాటిదో గమనించి అందుకు తగ్గట్లు చురచుర చూడడం అనే
శిక్షకానీ, తీవ్రమైన మాటలతో మందలించడం అనే శిక్షకానీ, డబ్బు వసూలు చేయడం అనే శిక్షకానీ, లేక శరీరంలోని అవయవాలను వికృతం చేయడం అనే
శిక్షకానీ విధించాలి. చంపదగ్గ తప్పు చేసినవాడిని చంపడమే కర్తవ్యం. రాజైనవాడికి
దుర్మార్గుడి పట్ల కావాల్సినవాడని కాని,
చుట్టమని కాని, తమ్ముడని కాని, కుమారుడని కాని పక్షపాతం వుండడం కూడా పాపమే. రాజైనవాడు తాను ముందు
వినయం కలవాడుగా వుండాలి. తదుపరి తన మంత్రులను,
కుమారులను, సేవకులను క్రమంగా వినయపరులను చేయాలి. అలా చేసి
ప్రజలను రక్షించే భూపతి ఇహలోక సుఖాన్ని,
పరలోక సౌఖ్యాన్ని చూరగొంటాడు’.
‘గృహస్థ,
సన్న్యాస ధర్మాలలో తప్పకుండా ఆచరించాల్సిన ధర్మమేదో’ నిర్ధారణ చేసి చెప్పమని
పితామహుడు భీష్ముడిని అడిగాడు ధర్మరాజు. రెండు ధర్మాలు ఆచరించదగినవేనని, గౌరవించదగినవే అని, దీనిని నిరూపించే కపిలగోసంవాదం అనే
ఇతిహాసాన్ని వినిపిస్తానని, అది వింటే ధర్మరాజు సందేహం తొలగిపోతుందని చెప్పాడు
భీష్ముడు. దాని సారాంశం ఇలా వుంది.
‘బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్న్యాసం, అనే
నాలుగు ఆశ్రమాలు ఆత్మప్రాప్తికి సాధనాలే కాబట్టి, దేవయానాలు అనబడుతున్నాయి. ఆ
మార్గాలలో నడవడం సంసారులైన వారికి ఆచరణీయంగా వున్నది. అందువల్ల వేదం విధించిన
ఆచారాలు సంసారులైన వారికి ఆవశ్యకమై వున్నాయి. వేదవిహిత పద్ధతిలో నడవడం
శ్రేష్టమైనది. గృహం సమస్త కార్యాలకు,
వాటి ఫలాలకు నిధి అయినది. ధర్మానికి బ్రహ్మచర్యం మొదలైన నాలుగు ఆశ్రమాలు నాలుగు
పాదాలుగా వున్నాయి. ఆ నాలుగు పాదాలమీద నిలిచి వున్న ధర్మం ఒక్కటే. అందువల్ల ఎవరు ఏ
ఆశ్రమంలో వున్నా ఒక్కటే. సమస్త కర్మల ఫలాలను రూపింప చేసే ధర్మస్వరూపం ఒక్కటే కదా!
మహాత్ములు ఆశను పూర్తిగా వర్జించి నాలుగవదైన సన్న్యాసాశ్రమం స్వీకరిస్తారు. బాగా
ఆలోచించి చూస్తే నాలుగు ఆశ్రమాలలోనూ ఏ ఆశ్రమమూ సేవించదగనిది కాదు. అందువల్ల
అంతఃకరణశుద్ధి కలిగి ఏ ఆశ్రమంలో వున్నా ఆత్మజ్ఞులైన పండితులు సంసారసాగరతీరం
చేరగలరు’.
తాను చెప్పిన
కథలోని భావాన్ని గ్రహించమని ధర్మరాజుకు చెప్పాడు భీష్ముడు. అందుకు ధర్మరాజు
సంతోషించాడు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, శాంతిపర్వం, పంచమాశ్వాసం
(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment