Wednesday, March 1, 2023

నమ్మకం కోల్పోతున్న రాజ్యాంగ సంస్థలు ! ..... వనం జ్వాలా నరసింహారావు

 నమ్మకం కోల్పోతున్న రాజ్యాంగ సంస్థలు !   

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (28-02-2023)

ఏక్నాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేన పార్టీగా గుర్తిస్తూ, దానికే ఎన్నికల చిహ్నమైన ‘విల్లు, బాణం కేటాయిస్తూ భారత ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పట్ల మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన నాయకుడు, ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చడంలో ఆశ్చర్యం లేదు. ఉద్ధవ్ థాకరే మరొక అడుగేసి, ఎన్నికలకు సంబంధించిన ఈ రాజ్యంగ సంస్థను తక్షణమే రద్దు చేయాలని, సరైన ప్రక్రియ ద్వారా ప్రక్షాళన చేసి పునర్వ్యవస్థీకరణ జరగాలని డిమాండ్ కూడా చేశారు. 2024 లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలే భారతదేశంలో చివరి ఎన్నికలయ్యే ప్రమాదమున్నదని, ఆ తరువాత వచ్చేది నియంతృత్వ పాలన కావచ్చునని భవిష్యవాణి కూడా చెప్పారు.

తన నాయకత్వంలోని శివసేనకు జరిగిన న్యాయమే మున్ముందు ఇతర పార్టీలకు సహితం జరగవచ్చని ఆందోళన కూడా వ్యక్తపరిచారు థాకరే. ఒక కీలక రాజ్యాంగ సంస్థమీద ఇలాంటి అనుమానం రావడం ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం కాదు. ఇదిలావుండగా, థాకరే వర్గంవారు దాఖలు చేసిన పిటీషన్ విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం, ఎన్నికల సంఘం నిర్ణయాన్ని నిలుపుదల చేయడానికి మాత్రం నిరాకరించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ నాయకుడు, అపార అనుభవం వున్న సీనియర్ రాజకీయవేత్త శరద్ పవార్, ఎన్నికల సంఘం నిర్ణయంమీద వ్యాఖ్యానిస్తూ, కొన్ని రాజ్యాంగ సంస్థలు అందరి విషయంలో సమన్యాయంతో వ్యవహరించాల్సిన బాధ్యత వుందని, తన రాజకీయ జీవితంలో ఒక రాజకీయ పార్టీకున్న మొత్తం నియంత్రణను సమూలంగా తీసేసి ఇతరులకు అప్పచెప్పడం ఎన్నడూ జరగలేదని అన్నారు.

స్వతంత్ర భారత దేశంలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంస్థ, భారత ఎన్నికల కమిషన్. రాజ్యాంగం అమలుకు నిర్ణయించిన 26 నవంబర్ 1949 నాటి నుంచే, రాజ్యాంగ బద్ధతగల సర్వస్వతంత్రంగా పనిచేసే ఎన్నికల సంఘం ఏర్పాటుకు నిర్ణయం జరిగింది. ఆర్టికల్ 324 నిర్ధేశించిన ప్రకారం ఏర్పాటైన భారత ఎన్నికల కమిషన్ తొలుత ఏక సభ్య సంఘంగా ఉన్నప్పటికీ, అక్టోబర్ 1, 1993 నుండి మాత్రం త్రిసభ్య సంఘంగా పనిచేయడం ఆరంభమైంది. పార్లమెంట్ ఉభయ సభలకు, రాష్ట్రాల ఉభయ సభలకు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు ఎన్నికలు నిర్వహించే గురుతర బాధ్యత ఎన్నికల సంఘానిదే. రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్, జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు, గుర్తుల కేటాయింపు, పార్టీల పేరు మార్పిడి లాంటి వ్యవహారాలు దాని పరిధిలోనే వుంటాయి. ఎన్నికల కమీషనర్లు ఆరేళ్లపాటు కాని, 65 సంవత్సరాల వయసు వచ్చేదాకా కాని పదవిలో వుంటారు. ప్రతి రాష్ట్రానికి, కేంద్ర పాలిత ప్రాంతానికీ, ఒక ప్రధాన ఎన్నికల అధికారిని భారత ఎన్నికల కమిషన్ ప్రతినిధిగా నియమించటం జరుగుతుంది. భారత ఎన్నికలను యావత్ ప్రపంచంలోని పాత్రికేయులు, మేధావులు, రాజకీయ నాయకులు, రాజనీతిజ్ఞులు, ఇంకా ఎందరెందరో ఆసక్తిగా గమనిస్తుంటారు.

గతంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ భారత రాజ్యాంగ సంస్థ పూర్వపు సంప్రదాయాన్ని, నిష్పాక్షికమైన కీర్తినీ, ప్రతిష్టనూ, నిలుపుకోగలదా అన్న ఆందోళన క్రమేపీ కలుగుతున్నది. చాలా విషయాలలో ఎన్నికల సంఘం పనితీరును, వ్యవహార శైలిని నిశితంగా విశ్లేషించి గమనిస్తుంటే, ఉద్ధవ్ థాకరే వెలిబుచ్చిన అనుమానాల లాంటివే కలగడం సహజం. ఉదాహరణకు, ఇటీవల కాలంలో జరిగిన, జరుగుతున్న ఎన్నికలలో, ప్రధానంగా ఉపఎన్నికలలో అభ్యర్థులు పెట్తున్న ఖర్చు, పాల్పడుతున్న అక్రమాల లాంటివి ఎన్నికల సంఘం చూసీ, చూడనట్లు వుండడం ఆందోళన కలిగించే విషయం. ఎన్నికల సంఘానికి వున్న అపారమైన అధికారాలను నామమాత్రంగా, ప్రధానంగా అధికారంలో వున్న పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఉపయోగించడం రాజ్యాంగ నిపుణులు చర్చించాల్సిన విషయం. ఎప్పుడో అప్పుడు ఒక శేషన్ లాంటి వారు తప్ప పలువురు ఎన్నికల కమీషనర్లు ఎన్నికల సంఘాన్ని సరైన పద్ధతిలో ఎంతవరకు నిర్వహించగలిగారన్నది కూడా బహుదా చర్చనీయాంశమే!

రాజ్యాంగం ప్రసాదించిన సుమారు 20 రాజ్యాంగ సంస్థలు ప్రజాస్వామ్యం పదికాలాలపాటు పటిష్టంగా నిలదొక్కుకోవాలంటే నిష్పాక్షికంగా పనిచేయాలనేదే రాజ్యాంగ స్ఫూర్తి. కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం ఏమాత్రం లేకుండా, జాతీయ ప్రాముఖ్యతారంగాలను నియంత్రణ చేసే విధంగా వ్యవహరించే స్వతంత్ర సంస్థల ఆవశ్యకతను రాజ్యాంగ సభ సభ్యులు గుర్తించారు. తదనుగుణంగానే సరైన రాజ్యాంగ నిబంధనలను ప్రవేశపెట్టడం ద్వారా, రాజ్యాంగ సంస్థల ఏర్పాటుకు మార్గం సుగమం చేయడం జరిగింది. కాని జరిగింది, జరుగుతున్నది ఏమిటి అనేది తర్కించుకుంటే ఆ స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్నదా అన్న అనుమానం కలగక మానదు. స్వాతంత్ర్యానంతరం కొంతకాలం మినహాయించి, కేంద్రంలో అధికారంలో వున్న వరుస కాంగ్రెస్, కాంగ్రెసేతర ప్రభుత్వాల రాజకీయ జోక్యంతో, ఈ సంస్థల తటస్థ స్వభావం వివాదాస్పదంగా మారుతూ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదులను కదిలించే దిశగా ప్రస్తానం సాగించడం దురదృష్టకరం.

ఉదాహరణకు అటార్నీ జనరల్ అనే రాజ్యాంగ సంస్థనే తీసుకుందాం. కేంద్ర ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారైన అటార్నీ జనరల్ సర్వసాధారణంగా ప్రముఖ న్యాయ నిపుణుడై వుంటాడు. కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు ఆర్టికల్ 76(1)  ప్రకారం రాష్ట్రపతి ఈ నియామకం చేయడం అంటే ఒకవిధంగా తటస్థ వ్యక్తికాదనే కదా! అయినప్పటికీ ఇది ఒక రాజ్యాంగ అధికారమే! కార్యనిర్వాహక అధికారం లేని అటార్నీ జనరల్ కు సహాయపడేందుకు సొలిసిటర్ జనరల్, అదనపు సొలిసిటర్ జనరల్ వుంటారు. అటార్నీ జనరల్ వెల్లడించిన అభిప్రాయాలు పలుసందర్భాలలో రాజకీయంగా ఉండేవని విశ్లేషకులు అభిప్రాయపదేవారు.

ఒక సందర్భం పేర్కొనాలంటే, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా వున్నప్పుడు, స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన సమయంలో, ప్రజల కనీస హక్కులను కాలరాస్తూ 1975 జూన్‌ 25న ఆమె దేశంలో ఎమర్జెన్సీ విధించారు. అప్పుడు ఒక సారి, ‘అత్యవసర పరిస్థితిలో ప్రాథమిక హక్కులు రద్దు అవుతాయని వాదిస్తున్నారు కదా, జీవించే హక్కు కూడా రద్దు అవుతుందా’? అని దేశ సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ హన్స్ రాజ్ ఖన్నా (విచారణ జరపకుండా నిర్బంధంలో ఉంచడం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై ఆంక్షలు విధించడమేనని 1976 లో మెజారిటీ తీర్పుకు భిన్నమైన తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి) ప్రశ్నించినప్పుడు అలనాటి అటార్నీ జనరల్‌ ‘నిరేన్‌డే’ ఔనని సమాధానమిచ్చారు!  

మరో ప్రధానమైన రాజ్యాంగ సంస్థ ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్). భారతదేశ అత్యున్నత ఆడిట్ సంస్థ ‘కాగ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 కి అనుగుణంగా ఏర్పాటైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన శాఖల, స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థల, ప్రభుత్వ కార్పొరేషన్ల, ప్రభుత్వం ద్వారా గణనీయంగా నిధులు పొందుతున్న సంస్థల  వివిధ రకాల ఆదాయ, వ్యయాలను ఆడిట్ చేసే అధికారం కాగ్ కు వుంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ను రాష్ట్రపతి నియమిస్తారు. అలా జరిగే నియామకంలో ప్రభుత్వానికి నచ్చిన వ్యక్తినే నియమించడానికి అవకాశాలు ఉన్నాయనడానికి ఉదాహరణగా ప్రస్తుతం ఆ పదవిలో వున్న గిరీష్ చంద్ర ముర్ము నియామకం పేర్కొనవచ్చేమో. కాకపొతే ఆయన ఆ పదవికి అత్యంత అర్హుడు కావచ్చుననేది వేరే విషయం. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ముర్ము ఆయనకు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు కదా! ఇలాంటప్పుడు పారదర్శకతకు ప్రామాణికం ఏంటి?  

మరొక వివాదాస్పద రాజ్యాంగ సంస్థ ఆర్ధిక సంఘం లేదా ఫైనాన్స్ కమీషన్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన వుండాల్సిన ఆర్ధిక సంబంధ బాంధవ్యాలను నిర్వచించడానికి రాజ్యాంగం 280 ప్రకరణ కింద, ఐదు సంవత్సరాలకు ఒకసారి క్రమానుగతంగా రాష్ట్రపతి ద్వారా ఏర్పాటుచేయబడే రాజ్యాంగ సంస్థే ఫైనాన్స్ కమీషన్. ఇంతవరకు 15 ఫైనాన్స్ కమీషన్ల ఏర్పాటు జరిగింది. వివిధ రకాల అసమతుల్యతలతో సతమవుతున్న భారత ఆర్ధిక వ్యవస్థ సవాళ్లను అధిగమించడానికి 22 నవంబర్ 1951 న ఫైనాన్స్ కమీషన్ మొట్టమొదటిసారిగా స్థాపించడం జరిగింది. పలు సందర్భాలలో అధికారంలో వున్న పార్టీకి చెందిన (ఉదాహరణకు బ్రహ్మానందరెడ్డి) రాజకీయనాయకుడిని కమీషన్ చైర్మన్ గా నియమమించడం ఆనవాయితే.

భారత సహకార సమాఖ్య వ్యవస్థలో ఫైనాన్స్ కమీషన్ పాత్ర అత్యంత కీలకమైంది. రాష్ట్రాల పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కానీ, ముఖ్యమంత్రితో కానీ చర్చలు ఏదో ఒక సాధారణ వ్యవహారంగా కాకుండా ఒక నిర్దుష్టమైన లక్ష్యం కొరకు, భారత ఆర్ధిక వ్యవస్థ పరపతిని దృష్టిలో వుంచుకుని చేసేవిధంగా ఆర్ధిక సంఘం శైలిలో పరివర్తన, సంస్కరణ రావాల్సిన అవసరం ఎంతైనా వుంది. కమీషన్ ఉద్భవించి 70 సంవత్సరాలు దాటినప్పటికీ, కేంద్ర-రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ, ఆర్ధిక సంఘం ఆలోచనాధోరణి, విధానంలో గుణాత్మక మార్పు ఆశించినంత స్థాయిలో కనిపించలేదు. భారత దేశ విస్తృత ఆర్ధిక విధానం మొత్తం కేంద్ర ప్రభుత్వంతో వుంటుంది.  ఏ నిధులనైతే, పన్నులనైతే కేంద్రం విధిగా రాష్ట్రాలకు పంపిణీ చేయాలో, చేయాల్సిన ఆగత్యం వుందో, ఆ పని చేయకుండా వాటిని కేంద్రీకరించి తమ గుప్పిట్లో పెట్టుకున్నది.

ఈ నేపధ్యంలోనే, భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాను ప్రతిపాదించిన జాతీయ అభివృద్ధి అజెండాలో భాగంగా, రాజ్యాంగ సంస్కరణలు అనే అంశం కింద, కేంద్ర ఆర్ధిక వనరులను, రాష్ట్రాల ఆర్ధిక వనరులను, పరిస్థితులను విశ్లేషించడానికి, అంచనావేయడానికి. శాశ్వత ప్రాతిపదికమీద ఆర్ధిక సంఘం ఏర్పాటు జరగాలని సూచించారు.

భారత ప్రభుత్వ గ్రూప్ ‘ఎ అధికారుల, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సీనియర్ అదికారుల, స్వతంత్ర ప్రతిపత్తికల కేంద్ర సంస్థల అధికారుల నియామకాలకు సంబంధించిన ప్రీమియర్ కేంద్ర నియామక రాజ్యాంగ సంస్థ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యుపీఎస్సే). అఖిలభారత సర్వీసు అధికారుల నియామకం కూడా యుపీఎస్సే నిర్ధారించిన విధానం ద్వారా మాత్రమే జరగాలని రాజ్యాంగం ఆదేశిస్తున్నది. ఒక్క నియామకమే కాకుండా బదిలీ, పదోన్నతి, క్రమశిక్షణా వ్యవహారంలో కూడా ప్రభుత్వం యుపీఎస్సే ని సంప్రదించాల్సిన అవసరం వున్నది. ఆర్టికల్ 316 కింద యుపీఎస్సే చైర్మన్, సభ్యుల నియామకాన్ని రాష్ట్రపతి చేస్తారు. అందుకే అది నేరుగా రాష్ట్రపతికే రిపోర్ట్ చేయాలి. ఇవన్నీ ఏమేరకు రాజ్యాంగ స్ఫూర్తితో జరుగుత్యున్నాయో విశ్లేషించాలి. వసరమైన మార్పులు, చేర్పులు చేయాలి. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా సర్వీస్ కమీషన్లు వుండాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్నది.

మరో రాజ్యాంగ సంస్థ ఆర్టికల్ 263 కింద ఏర్పాటయ్యే అంతర్ రాష్ట్ర మండలి. దీని అవసరం కలిగినప్పుడు దాని ఏర్పాటు చేయడానికి రాష్ట్రపతికి అధికారం వున్నది. తదనుగుణంగా, 1990 సంవత్సరంలో సర్కారియా కమీషన్ సిఫార్సుల దరిమిలా, శాశ్వత ప్రాతిపదికన, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మండలి ఏర్పాటైంది. రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను, సాధారణమైన ఉమ్మడి అంశాలను, విధానాలను చర్చించి, పరిష్కారం కనుగొనే లక్ష్యంతో మండలి పనిచేయాలి. ప్రధానమంత్రి (ప్రస్తుతం నరేంద్ర మోదీ) అధ్యక్షతన పనిచేసే అంతర్ రాష్ట్ర మండలిలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ సభ్యులే. సంవత్సరానికి మూడు పర్యాయాలు మండలి కలవాలని ఉద్దేశించబడినప్పటికీ, అలా అరుదుగా జరిగింది. రెండు వరుస సమావేశాల మధ్య ఇదమిద్ధమైన కాలపరిమితిని, ఏకరూపతను ఎప్పుడూ పాటించిన దాఖలాలు లేవు. దేశ సమాఖ్య విధానంలో సహకార స్ఫూర్తిని పెంపొందించాల్సిన ఈ మండలి ఎంతవరకు విజయవంతమయిందో సర్వత్రా తెలిసన విషయమే. రాష్ట్రాల మధ్య నెలకొన్న ఎన్నో వివాదాలు అపరిష్కృతంగా వున్న సంగతి జగద్విదితం.      

ఇవే కాకుండా షెడ్యూల్డ్ కులాల కొరకు జాతీయ కమీషన్, వెనుకబడిన తరగతుల కొరకు జాతీయ కమీషన్, షెడ్యూల్డ్ తరగతులవారికి జాతీయ కమీషన్, రాష్ట్ర ఫైనాన్స్ కమీషన్లు లాంటి మరికొన్ని రాజ్యాంగ సంస్థలు కూడా వున్నాయి. వీటిలో కొన్ని లక్ష్యాలకు అనుగుణంగా కొంతమేరకు పనిచేస్తున్నప్పటికీ ఇంకా చేయాల్సింది ఎంతో వున్నది. ఏదేమైనా  భారత రాజ్యాంగ సంస్థలలో గుణాత్మక మార్పు రావాలి. వాటి పట్ల విశ్వసనీయత పెరగాలి. అవి తీసుకునే నిర్ణయాలు ఏకపక్షంగా వుండకూడదు. END

No comments:

Post a Comment