అప్పటి పెళ్లి సరదా వేడుకలు ఉన్నాయా?
(పెళ్లినాటి మంగళ
స్నానాలు,
స్నాతకం, కాశీయాత్ర వేడుకలు)
(గుర్తుకొస్తున్నాయి)
వనం
జ్వాలా నరసింహారావు
సాక్షిదినపత్రిక
(19-03-2023)
పెళ్లంటే ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు, ఉద్వేగాలు, సరదాల సమ్మేళనం. హిందూమతం ప్రకారం జరిగే
పెళ్లిలో ఒకప్పుడు కనిపించిన ఆచార సంప్రదాయాలు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. ఇప్పటికీ
కొందరు అక్కడక్కడా పాటిస్తూవున్న అర్థశతాబ్దం క్రితంనాటి కొన్ని వైవాహిక ఘట్టాలు,
వేడుకలు, సరదాలు, భవిష్యత్తులో పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం
లేకపోలేదు. ఉదాహరణకు, పెళ్లిరోజుకు ఒకరోజు ముందర ‘స్నాతకం’
అనే ముఖ్యమైన కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. పెళ్ళి కుమారుడి ఇంటిలో గాని, కళ్యాణ మండపంలో గాని లేదా విడిదిలో (ఆడపెళ్ళివారు ఏర్పాటుచేసిన అతిదిగృహం)
గాని, పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర
పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ది కోసం బ్రాహ్మణులు వరుడితో గోత్ర ప్రవరలు చేయిస్తారు. స్నాతకం అనే ఈ ‘సంస్కారం’, ప్రధానంగా, వరుడిని ‘బ్రహ్మచర్యం’ నుండి గురువు (ఇక్కడ పురోహితుడు) ఆదేశంతో,
అంగీకారంతో ‘గృహస్థాశ్రమం’ స్వీకరించడానికి సిద్ధంచేస్తున్న వేడుక లాంటిది. ఆ
సమయంలో గురువు చేయాల్సిన హిత బోధ తైత్తిరీయోపనిషత్తులోని ‘సత్యాన్న’ అన్న ఒక శ్లోక
రూపంలో వుంటుంది.
‘సత్యం విషయంలోను, ధర్మం విషయంలోను, తెలివితేటల విషయంలోను, పొరపాటు పడవద్దు’ అన్న ఆదేశం
అది. తల్లిని, తండ్రిని, అతిథిని
దేవుడులా భావించాలని చెప్తారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జీవించమని, దానం చేసేటప్పుడు శ్రద్ధగా చేయమని, తాహతుకు మించి
దానం చేయొద్దనీ, ఇంతకంటె ఎక్కువ దానం చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నానని
భావించమనీ బోధిస్తాడు పురోహితుడు. పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని, వారనుసరించిన
మార్గాన్ని ఎంచుకోమని అంటూ, ‘వరుడికి శుభం కలుగుగాక’ అని
ఆశీర్వదించి గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు. సంప్రదాయ వివాహ
పద్ధతిలో భారతీయ ఆలోచనా విధానాన్ని తెలియచేస్తాడు పురోహితుడిక్కడ.
స్నాతకానికి ‘సమావర్తనం’ అన్న పేరు కూడా వుంది. సమా
వర్తనమంటే,
తిరిగి రావడమని అర్థం. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, గురువు హిత బోధతో పాదయాత్ర చేస్తూ తిరిగి రావడాన్నే సమావర్తనం అంటారు. హోమ
కార్యాలు నిర్వర్తించి, దండాన్ని ధరించి, గొడుగు పట్టుకొని కాశీ యాత్రకు బయలుదేరే ఘట్టం సాంప్రదాయంలో మరో ముఖ్యమైన
ఆచారం. వరుడి కాశీ ప్రయాణం, బాజా భజంత్రీల మద్య గొడుగు పట్టుకొని, చేత్తో కర్ర పుచ్చుకొని, కాళ్లకు పావు కోళ్లు ధరించి,
మెడలో పసుపు బట్టను వేసుకొని, సన్యాసం
స్వీకరించేందుకు, కాశీకి పోతున్నానని చెప్పి బయలుదేరుతాడు. కాశీ
యాత్ర ఘట్టం స్నాతకంలో చాలా సరదాగా జరిగే కార్యక్రమం. తన శేష జీవితం ఇక కాశీలో
గడపాలని భావిస్తున్నానని, దానికి బంధు, మిత్రుల అనుజ్ఞ
కావాలని వరుడు కోరతాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం సరైందికాదని, గృహస్థాశ్రమం స్వీకరించి, ధర్మ భద్ధంగా ఇంద్రియ
సుఖాలను అనుభవించి, పరిపూర్ణమైన వైరాగ్యం కలిగిన తర్వాతనే
భార్యా సమేతంగా వానప్రస్థాశ్రమంలో ప్రవేశించాల్సిందిగా పురోహితుడు (గురువు) హితవు
పలుకుతాడు.
ఇక పెళ్ళి కూతురు వైపునుంచి వచ్చిన వారు (ప్రధానంగా వధువు
సోదరుడు-బావ మరిది లేదా మేన మామ లేదా తాతగారు లాంటి పెద్దవారు) ‘బంగారు ఆభరణాలతో అలంకరించబడిన
వారి అమ్మాయి’ నిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నామని, అగ్ని సాక్షిగా అమెను
వివాహమాడమని, ముందుగా తమ ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని
వరుడికి నచ్చచెప్పి, కాశీ యాత్ర ఆలోచనను విరమింపచేసే వేడుక ఇది.
వధువు సోదరుడు వచ్చి ‘అయ్యా, బ్రహ్మచారిగారూ! మీ కాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం
చేసుకొని గృహస్థుగా జీవించండి’ అని చెప్పి బొట్టు పెట్టి,
బెల్లం (తీపి పదార్థం) నోటికి రుచి చూపించి, నూతన వస్త్రాలను
ఇచ్చి వరుడిని వెనుకకు తీసుకొని వస్తాడు. శాస్త్రం
ప్రకారం కాబోయే బావమరిదికి వరుడు నూతన వస్త్రాలను బహుకరిస్తాడు. ఆనాటి పెళ్లిళ్లలో
ఇదొక ప్రధానమైన వేడుక. చాలా కోలాహలంగా
పెళ్ళికి ‘తరలి పోయే ముందర’ జరిగే సరదా కార్యక్రమం ఇది.
ఇలా స్నాతకం వ్రతాన్ని పూర్తి చేసుకొని, వరుడి
బంధు,మిత్రులందరు వధువు గృహానికి (లేదా సత్రంలాంటి వసతి గృహానికి) బయలుదేరుతారు.
బయలుదేరే ముందు, మంగళ స్నానాలు చేయడం, అలంకరించు
కోవడం, పల్లకి లాంటి వాహనాలు సిద్ధం చేసుకోవడం మామూలే.
బయలుదేరే ముందర, శుభకార్యానికి బయలుదేరుతున్నామని, వెనక్కు పిలవడం, నిందించడం, దగ్గడం, తుమ్మడం లాంటివి
లేకుండా వుండాలన్న అర్థం వచ్చే మంత్రాన్ని చదువుతారు.
పెళ్ళికి
ముందర ఒక మంచి రోజున గానీ,
స్నాతకం, అంకురార్పణల రోజున గానీ పెళ్ళికొడుకును, పెళ్ళికూతురును (సిద్ధం)
చేయడం ఒక ఆచారం. మంగళ స్నానాలతో ఆ ఉదయం కార్యక్రమం మొదలవుతుంది. వధూవరుల ఇళ్లలో, ఉదయం తెలతెలవారుతుండగానే, మంగళ వాయిద్యాల మధ్య ఇంటి
ముందర మామిడి ఆకులతో తోరణం కట్టే కార్యక్రమం ముందుగా జరుగుతుంది. వధువుకు, కన్యా దాత దంపతులకు, తోటి
పెళ్ళి కూతురుకు (వధువు సొంత చెల్లెలు గాని, వరుసకు చెల్లెలు గాని), తెల్లవారక ముందే, ముత్తైదువలు బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది,
హారతిచ్చి, మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు.
అలానే వరుడికి, తల్లితండ్రులకు, తోటి పెళ్ళికొడుకుకు (వరుడి సొంత తమ్ముడు గాని,
వరుసకు తమ్ముడు గాని) కూడా జరుగుతుంది.
అంకురార్పణగా పిలిచే ఆ వేడుకకు కన్యా దాత
దగ్గరి బంధువులందరూ వస్తారు. నవ
ధాన్యాలను మట్టి మూకుళ్లలో పుట్ట మన్నులో కలిపి మొలకెత్తే విధంగా అమర్చడాన్ని ‘అంకురార్పణ’
లో చేస్తారు.
అలనాటి
మంగళ
స్నానాలు,
మామిడితోరణాలు, స్నాతకం, కాశీయాత్ర లాంటి వేడుకలు ఇంకా ఉన్నాయా? అక్కడక్కడా వుండవచ్చునేమో!!!
వివాహసంస్కారం వంకరటింకరపోకడలు పోతున్నది. సినీమాలూ సీరియళ్ళూ సిటీసంస్కృతీ పుణ్యమా అని అర్ధంపర్ధంలేని వింతలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరోజును గోరింటాకు కోసం మెహందీ అనీ, మరొకరోజును సంగీత్ అని సినిమాపాటలకు కుప్పిగంతులకు కేటాయించటం నవీనధోరణి. కొన్ని తెలుగింటి పెళ్ళిళ్ళలోనూ సినిమాలను అనుకరిస్తూ బియ్యం నింపిన చెంబును తన్నటం అనే కొత్త (అ)శుభకార్యక్రమం జోడించారు. ఈమధ్య పెళ్ళిళ్ళను నాలుగ్గంటలకే కుదిస్తున్నారు కొందరు - ఒకరు హోమాలూ అవీ దండగండీ వద్దు అన్నారని ఒక పురోహితుల వారు నావద్ద వాపోయారు! సినీమాపాటల కోసం మాత్రం ఒకరోజు కేటాయించటం అవసరం అట! అలాగే విచ్చలవిడిగా డబ్బు వెదజల్లటం ఒకటీ ధారాళంగా వందల లెక్కన వంటకాలను పురమాయించి మూడొంతుల తిండిని గోతిపాలు చేయటం ఒకటీ కూడ కొత్త (అ)శుభసంప్రదాయా లయ్యాయండీ. కలికాలం అనుకోవటమే.
ReplyDeleteపెళ్ళిళ్ళకు వెళ్ళటమూ దండగే. అందరూ మంటపం చుట్టూ మూగి నిల్చుంటారు. ఆహూతులకు వాళ్ళ వీపులు చూడటం కోసం వచ్చామా అని చిరాకేస్తుంది! ఇదొక కొత్త పధ్ధతి అన్నమాట.