Monday, March 6, 2023

కాల అవయవాల విభాగాలను, కృతాది యుగాల ప్రమాణాలను చెప్పిన భీష్ముడు ..... ఆస్వాదన-110 : వనం జ్వాలా నరసింహారావు

 కాల అవయవాల విభాగాలను,

కృతాది యుగాల ప్రమాణాలను చెప్పిన భీష్ముడు

ఆస్వాదన-110

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (06-03-2023)

ఉగ్రసేనుడికి, శ్రీకృష్ణుడికి, నారదుడి విషయంలో జరిగిన సంవాదం వివరాలను, దాని సారాంశాన్ని ధర్మరాజుకు భీష్ముడు చెప్పిన తరువాత తదుపరి ప్రశ్న వేశాడు ధర్మరాజు. కాలం అవయవాలకు చెందిన విభాగాలను, కృతాది యుగాల ప్రమాణాలను తెలియచెప్పమని పితామహుడిని కోరాడు. పూర్వం శుకుడు ఇదే విషయాన్ని వేదవ్యాస మునిని అడిగాడని, ఆ మునీంద్రుడు చెప్పిన విషయాలను సవిస్తారంగా వివరిస్తానని చెప్పడం ప్రారంభించాడు భీష్ముడు వ్యాసుడి మాటల్లోనే.

‘కాలాలకు, భూతాలకు ఆధారమైన గొప్ప ప్రభావంతో ఒక తేజశ్శక్తి పైకి అన్ని పనులు చేస్తున్నట్లు భావిస్తున్నది. కాని అది ఎప్పుడూ, ఏవిధమైన క్రియతోను సంబంధం లేనిదిగా వున్నది. ఆ తేజోరూపమైన శక్తి మనస్సులో భావించడానికి యోగ్యమైనది. 18 నిమేషాలు ఒక “కాష్ట” అన్న కాల విభాగం అవుతుంది. 30 కాష్టలు ఒక “కళ” అవుతుంది. 360 కళలను ఒక “ముహూర్తం” అంటారు. 30 ముహూర్తాలు ఒక “అహోరాత్రం” అవుతుంది. 30 అహోరాత్రాలు ఒక “మాసం” అవుతుంది. రెండు మాసాలు ఒక “ఋతువు”, ఆరు ఋతువులు ఒక “సంవత్సరం” అవుతాయి. మూడేసి ఋతువులను ఒక “ఆయనం” అంటారు. ఒక ఆయనానికి “ఉత్తరాయణం” అని, మరొక దానికి “దక్షిణాయనం” అని పేర్లు. ఈ ఆయనాలు రెంటినీ అహోరాత్రాలు (రేయింబవళ్లు) అనికూడా వ్యవహరిస్తారు”. యోగులు ఉత్తరాయణాన్ని “అగ్ని” లేదా “శుక్లం” అని, దక్షిణాయాన్ని “ధూమ” మనీ లేదా “కృష్ణ” మనీ కూడా అంటారు. మానవులకు ఒక్క నెల అయితే పితరులకు ఒక్క దినం అవుతుంది. మానవులకు ఒక్క సంవత్సరం అవుతే దేవతలకు ఒక్క రోజు అవుతుంది.

‘దేవతల 12000 సంవత్సరాలు గడిచేసరికి 4 యుగాలు పూర్తవుతాయి. అందులో కృత యుగానికి 4 భాగాలు (4800 సంవత్సరాలు), త్రేతా యుగానికి 3 భాగాలు (3600 సంవత్సరాలు), ద్వాపర యుగానికి 2 భాగాలు (2400 సంవత్సరాలు), కలియుగానికి ఒక్క భాగం (1200 సంవత్సరాలు) వుంటాయి. వీటిని 360 పెట్టి గుణిస్తే మానుష లోకానికి చెందిన కృత యుగాదుల సంవత్సరాలు వస్తాయి. ఆ విధంగా, మానవ కాల విభాగంలో కృత యుగానికి 17,28,000; త్రేతా యుగానికి 12,96,000; ద్వాపర యుగానికి 8,64,000; కలియుగానికి 4,32,000 సంవత్సరాలు వుంటాయి. అన్ని యుగాల ఆద్యంతభాగాలను సంధ్యలని, సంధ్యాంశాలని అంటారు. కాల తత్త్వాన్ని బట్టి పరిశీలిస్తే యుగయుగానికి ఈ సంధ్యా-సంధ్యాంశాలు సమంగానే వుంటాయి.

‘మానవులకు కృత యుగంలో తపస్సు, త్రేతా యుగంలో శ్రేష్టమైన జ్ఞాన స్ఫూర్తి, ద్వాపర యుగంలో  యజ్ఞం చేయడం, కలి యుగంలో దోషాచరణం స్వభావంగా సంభవిస్తుంటాయి. మానవాళికి త్రేతా యుగం నుండి న్యాయం, ధర్మం, ఆయువు, శరీర పటుత్వం క్రమేపీ తరిగిపోతాయి. నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. అలాంటి 1000 మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు లేదా ఒక రాత్రి. బ్రహ్మ రాత్రి పూట నిద్రిస్తాడు. ఆ సమయం లోకాలకు ప్రళయకాలం. తెల్లవారగానే మేలుకుంటాడు. పగటి పూట ప్రాణికోటి సృష్టికి పూనుకుంటాడు. ఇది నిరంతర ప్రక్రియ. ఈ విశ్వమంతా బ్రహ్మం సారాంశమే. పూజనీయమైన బ్రహ్మతత్త్వం నుండి మహత్తు, మనస్సు, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే ఏడు రూపాలు ఉదయిస్తున్నాయి. బ్రహ్మతత్త్వం నుండి మొదలు మయత్తత్త్వం పుడుతుంది. దాన్నుండి మనస్సు, మనస్సు నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుండి పృథ్వి పుడుతున్నాయి. ఈ సప్తరూపాలకు మూలం బ్రహ్మమే’.

‘మునీంద్రులు సప్త స్వరూపాలను “పురుషులు” అని వ్యవహరిస్తున్నారు. వారు తమలో తాము కూడితే సృష్టికార్యం సిద్ధిస్తుంది. లేకపోతే సృష్టి జరగదు. బ్రహ్మములు శబ్దబ్రహ్మమని, పరబ్రహ్మమని రెండు రకాలు. శబ్దబ్రహ్మను భజించడంలో ఆసక్తికలవారు పరబ్రహ్మను పొందుతారు. పరబ్రహ్మమే భూతాలను పుట్టించడం, సంహరించడం చేస్తుంటుంది. సృష్టి విధానం ఇదైతే సంహార విధానం మరొక రకంగా వుంటుంది. స్థావర జంగమాలు అనబడే సకలం భూమిలో కలిసిపోతాయి. ఆ భూమిని జలాలు మింగుతాయి. జలాలను అగ్ని, అగ్నిని వాయువు, వాయువును ఆకాశం కబళిస్తాయి. మనస్సు ఆకాశాన్ని హరించి వేస్తుంది. ఇలా సకల భూతాలూ లయమై పోతాయి. ఆ తరువాత చంద్రుడు మనస్సును కూడా తనలో లయం చేసుకుంటాడు. సంకల్పం చంద్రుడిని గ్రహిస్తుంది. జ్ఞానం సంకల్పాన్ని రూపుమాపుతుంది. కాలం క్రమంగా విజ్ఞానాన్ని, దాని బలాన్ని, పురుష శరీరత్త్వాన్ని హతమారుస్తుంది. ఆ కాలం కూడా నశిస్తుంది. ఆ తరువాత జ్ఞానం శుద్ధబోధస్వరూపమై వెలుగొందుతుంది. అదే వేదాలలో ప్రశస్తమైన బ్రహ్మం. సంహార కార్యం కూడా బ్రహ్మ వశంలోనిదే. ఇలా బ్రహ్మం రేయింబవళ్లు భూతాలకు వినోద క్రీడలాగా జనన మరణాలను చేస్తూ వుంటుంది’.

‘దానం అనేది అన్ని జాతుల వారికి, అన్ని వర్ణాల వారికి ఉత్తమ ధర్మం. దానం, అధ్యయనం, యజ్ఞం చేయడం అనే కర్మల వల్ల అనేక రకాల పాపాలు నశిస్తాయి. అలాగే అహంకారం మీద విజయం సాధిస్తే క్రమంగా అది పృథ్వాది పంచ భూతాలను, బుద్ధిని, ప్రకృతిని జయించగల సంస్కారాన్ని ప్రసాదిస్తుంది. నిస్సారమైన సంసారానికి ముఖ్య కారణం మమకారమే. అందుకే మమకార పరిత్యాగం సమానమైన ధర్మం. ప్రాణులలో మానవులు మేలు. వారిలో బ్రాహ్మణులు, అందునా వేదం ఎరిగిన బ్రాహ్మణులు ముఖ్యులు. వేదం తెలిసినవారిలో వేదార్థప్రవచనం కావించేవారు ఉత్కృష్టమైనవారు. వారిలో ఆత్మజ్ఞులైనవారు గొప్పవారు. వారిని ఆధారం చేసుకునే సమస్త లోకాలు నడుస్తున్నాయి.

‘కర్మ మార్గం ప్రవృత్తి అని, కర్మ రహితమార్గం నివృత్తి అని చెప్పబడుతాయి. ఇందులో మొదటిది బంధం కలిగించేది కాగా, రెండోది విడుదల కలిగించేది. అందువల్ల జ్ఞానసంపన్నులైనవారు కర్మ మార్గంలో ప్రవేశించరు. కొందరు కర్మలు చేయడమే మంచిదని అంటారు. కాని వారు చావు-పుట్టుకలను పొందకుందా తప్పించుకోలేరు. ఎల్లప్పుడూ నిష్కర్మతామార్గాన్ని అనుసరించేవారు గొప్ప ఆనందం పొందుతారు. కర్మ చిత్త శుద్ధిని కలిగించినప్పటికీ, అవిద్యా స్వరూపమైనదే. దానిని వదిలి పెట్టడమే ఆత్మ విద్య. మోక్షం ఇచ్చేది కూడా ఆ కర్మత్యాగమే. ఏక రేఖామాత్రుడైన చంద్రుడితో సమానుడు జీవుడు. అజ్ఞానమనే కర్మ మార్గం గడిస్తే జీవుడు విద్యానంద పరిపూర్ణుడై వెలుగొందుతాడు’.

‘కాలం అనే చక్రానికి వసంతం మొదలైన ఆరు ఋతువులు అంచులుగా వున్నాయి. చైత్రం మొదలైన పన్నెండు మాసాలు తీక్ష్ణమైన ధారలుగా వున్నాయి. దాని ముఖం విశ్వమంతా వ్యాపించి వున్నది. గ్రహించ శక్యం కాని ఆ కాలచక్రం బుద్ధి గుహలో అణగి వున్నది. రథాన్ని లాగే గుర్రాలకు ఎలాగైతే శిక్షణ ఉండాలో, అలాగే, జీవుడు మనస్సును, ఇంద్రియాలను నియోగించేటప్పుడు నిగ్రహించకుండా వాటి మార్గంలో వాటిని పోనిస్తే అశుభానికి గురవుతాడు. మోక్షప్రాప్తికై సాధన చేసే సాధకుడికి ఆత్మనిగ్రహం చాలా ముఖ్యం. అది సిద్ధించకపోతే కష్టాలు కలుగుతాయి. ఆత్మనిగ్రహం దృఢంగా సిద్ధిస్తే అంతంలేని మోక్షపదవి లభిస్తుంది. దానికి ఉపాయం కూడా వుంది. ఆత్మప్రాప్తిని కోరేవాడు అన్ని సంకల్పాలు వదలి మనస్సును సత్త్వగుణంతో సంసక్తం చేయాలి. సత్త్వగుణంలో నిలబడ్డ మనస్సు ఆత్మనిగ్రహాన్ని సమకూరుస్తుంది. అలాంటి నిగ్రహంతో కాలయాపన చేయడం మేలైన విధానం. అంతరాత్మ చాంచల్యం లేకుండా నిగ్రహించబడాలి. అలా వుంటే శాశ్వత పదమైన మోక్షం కలుగుతుంది.

‘పరమాత్మ పంచభూతాలను, భూతజన్యమైన చరాచర ప్రాణికోట్లను సృష్టికాలంలో ప్రవర్తింపచేస్తాడు. ప్రళయకాలంలో మళ్లీ వాటిని తనలో విలీనం చేసుకుంటాడు. ఈ విధంగా సృష్టి, స్థితి, సంహారాత్మకమైన చర్య పరామాత్మ వృత్తిగా జరిగిపోతున్నది. సకల భూత స్వరూపుడైన పరమాత్ముడు భూతాలను సృష్టించి, మళ్లీ తనలోకి ఉపసంహరించుకుంటూ వుంటాడు. పరమాత్ముడు మాయతో కూడినప్పుడే సృష్టి ప్రారంభమవుతుంది. అతడు మాయాయుక్తుడైన సమయంలో భూతాలను సృష్టించకుండా వుండలేడు కాబట్టి, భూత సృష్టి జరుగుతున్నది. మళ్లీ మాయను వదలగానే, ఆ స్థితి, భూతాల అభావాన్ని సూచిస్తుంది. అంటే పరమాత్మ మాయావియోగం చెందినప్పుడు సృష్టి లేకుండా పోతుంది. భూతాల ఉనికి నశిస్తుంది. పరమాత్మ ఆద్యంతాలు లేనిది’.

‘ఈ శరీరమే ఒక నగరం. బుద్ధి దానికి ప్రభువు. చిత్తం మంత్రి. శబ్దాదులైన ఐదు విషయాలు పురోహిత వర్గం. ఇంద్రియాలు పురప్రజలు. రజస్తమో గుణాలనే దుష్టులైన దొరలు భోగాలు అనుభవిస్తారు. బుద్ధి చిత్తంతో విభేదించి రజస్తమో గుణాల శిక్షణలకు లోనై నశిస్తుంది. మనస్సు తన కర్తవ్యాన్ని గ్రహించి ప్రవర్తిస్తే రజస్తమో గుణాలు అణగి పోతాయి. రాజ్యభోగం అక్షయం అవుతుంది.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, పంచమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

No comments:

Post a Comment