Sunday, March 19, 2023

పురుషార్థాలలో ధర్మమే శ్రేష్టమని, తత్త్వజ్ఞానమే అమృతత్వమని చెప్పిన భీష్ముడు ...... ఆస్వాదన-112 : వనం జ్వాలా నరసింహారావు

 పురుషార్థాలలో ధర్మమే శ్రేష్టమని,

తత్త్వజ్ఞానమే అమృతత్వమని చెప్పిన భీష్ముడు

ఆస్వాదన-112

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (20-03-2023)

వేదాలలో ధర్మం, అర్థం, కామం అనే మూడు ప్రశస్తమైన పురుషార్థాలలో ఏది లభిస్తే గొప్పగా వుంటుందో తెలియచేయమని ధర్మరాజు భీష్ముడిని అడగ్గా, ఆయన కుండధారుడి వృత్తాంతం ఉదహరించాడు సమాధానంగా. దాని సారాంశం ఈ విధంగా వుంది. ‘ధర్మం ముఖ్య పురుషార్థం. అర్థకామాలు సైతం పురుషార్థాలే. కాని ధర్మాన్ని అనుసరించి అర్థకామాలను అనుభవించాలి. ధర్మ విరుద్ధమైన అర్థకామాలు శ్రేయస్సు కలిగించవు. కాబట్టి అర్థకామాలకంటే ధర్మమే ప్రధానం. పురుషార్థాలలో శ్రేష్టమైన ధర్మాన్నే ఆచరించాలి’.

తన తదుపరి ప్రశ్నగా ధర్మరాజు, ‘పురుషుడు దేనివల్ల పాపకార్యాలు చేయడానికి పూనుకొంటాడని, పుణ్యకార్యాలకు కారణం ఏమిటని, దేనివల్ల పుణ్యపాపాలు రెండు అంటకుండా వుండగలడని, మోక్షం ఎలా పొందుతాడని’ అడిగాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, భీష్ముడు, ఇలా చెప్పాడు:

‘శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే విషయాల మీది కోరిక లోభ మోహాలను కలిగిస్తుంది. చిత్తం లోభ-మోహాలకు లోనైతే ధర్మానికి లోపం కలుగుతుంది. ధర్మం లోపించగానే పాపకార్యాలు చేయాలనే ఆలోచన వస్తుంది. అందువల్ల తెలివిగా ఈ కీడులన్నిటినీ ఊహించి, వాటి జోలికి పోకుండా సజ్జనుల గోష్ఠిలో కాలం గడిపితే విషయాల మీద ఆసక్తి నశిస్తుంది. దానివల్ల ధర్మ బుద్ధి ఉదయిస్తుంది. ధర్మకార్యాలు క్రమంగా ఆచరిస్తూ పోతే హృదయంలోని రాగద్వేషాలు, సుఖదుఃఖాలు మొదలైన ద్వంద్వాలు తొలగిపోతాయి. ఆ తరువాత అపాయంలేని ఉపాయంతో ముక్తి పొందుతాడు’.

‘మోక్షానికి అపాయం లేని ఉపాయం ఏదన్న అనుమానం రావచ్చు. ఏ పనికైనా తగిన ఉపాయాన్ని తప్పక తెలుసుకోవాలి. ఓరిమితో కోపాన్ని సంకల్పించకుండా వుండడం ద్వారా కామాన్నీ; స్వత్త్వ గుణాభ్యాసంతో నిద్రను; దృఢమైన ధైర్యంతో రాగద్వేషాలనూ; జాగరూకతతో భయాన్నీ; జ్ఞాన వైరాగ్యాదులతో క్రమంగా తొలగించడం నేర్చుకోవడం ద్వారా మోహభ్రాంతులనూ; హితమూ, మితమూ, తగిన కాలంలో గ్రహించబడేదీ అయిన భోజనంతో రోగాలనూ, ఉపద్రవాలనూ; క్షేత్రజ్ఞస్వరూపుడైన జీవుడిని చూడడం ద్వారా ప్రాణచేష్టనూ; చివరకు నిస్సారములని గ్రహించడం వల్ల శబ్దాది విషయాలనూ; నిత్య సంతుష్టితో లోభాన్నీ; దయతో అధర్మాన్నీ; తగిన సమీక్షణ విధానంతో కర్మనూ కడకు నెట్టడం నేర్చుకోవడమే ముక్తికి బాట అవుతున్నది.    

‘తృష్ణను నశింపచేసే ఉపాయాన్ని’ చెప్పమని ధర్మరాజు కోరగా, పూర్వం జనకుడు, మాండవ్యుడు అనే మునికి చెప్పిన మాటల వివరాలను చెప్పాడు భీష్ముడు. సంపదలు దుఃఖ నిలయాలని, కామసుఖం, దివ్యసుఖం, ఆశలేమి వల్ల కలిగే సుఖానికి ఈడు కావని, అర్థం అనాయాసంగా లభించగానే ఆశ కూడా పెరిగిపోతుందని, ఆశాప్రభావం వల్ల కలిగే మమకారం పెరిగిపోతుందని, మమకారం తొలగితే తృష్ణ అనే సాగరం ఎండిపోతుందని అన్నాడు భీష్ముడు జనకుడి మాటలుగా. దొరికినదానిని అనుభవిస్తూ, దొరకని దానికొరకు చింతించి దుఃఖపడకుండా పరిపూర్ణుడై ఎవడు వుంటాడో, అతడి మనస్సులోకు తృష్ణ ప్రవేశించదని చెప్పాడు. దుర్మతులైనవారు తృష్ణను విడువలేరని, శరీరం ముసలితనం పొందినా ఆశమాత్రం ముదిమి పొందదని, అది ప్రాణాలు తీసే రోగమని, ఎవడు తాను విముఖుడై తృష్ణను పరిహరిస్తాడో అతడు అత్యధిక సుఖం పొందుతాడని అన్నాడు భీష్ముడు.

‘పురుషుడు ఏంచేస్తే శ్రేయస్సు కలుగుతుంది?’ అని ప్రశ్నించాడు ధర్మరాజు. పిత్రాపుత్ర సంవాదం అనే ఇతిహాసం ఆధారంగా జవాబు చెప్పాడు భీష్ముడు. ‘బ్రహ్మచర్యం, వేదాధ్యయనం, సంతానం పొందడం, యజ్ఞనిర్వహణ చేసి ఆ తరువాత వానప్రస్థధర్మం నిర్వర్తించి సన్న్యాస వృత్తిని స్వీకరించడం అవలంభించాల్సిన పని. అయితే పుట్టినది మొదలు ముదిమి, మరణం వెంటబడుతూనే వుంటాయి కదా? అన్న సందేహం కలగవచ్చు. మానవ శరీరంలోనే మృత్యువు, అమృతత్వం అనేవి రెండూ వున్నాయి. సంసార వ్యామోహమే మృత్యువు. తత్త్వజ్ఞానమే అమృతత్వం. యోగాన్ని అనుష్టించడం, తపస్సు చేయడం, విషయాసక్తిని త్యజించడం అనేవి హితకరమైన మార్గాలు. వీటితో సమానమైన శ్రేయోమార్గాలు లేవు. విషయాసక్తితో సదృశమైన దుఃఖం మరొకటి లేదు. త్యాగాన్ని పోలిన సుఖం కూడా లేదు’. అని చెప్పాడు భీష్ముడు.

‘ఏవిధమైన స్వభావం కలవాడు మోక్షం పొందగలడు’ అని పితామహుడిని అడిగాడు ధర్మరాజు తన తదుపరి సందేహంగా. మితాహారం స్వీకరిస్తూ ఇంద్రియానీకాన్ని జయించి మోక్షం కొరకై శాస్త్రాలలో చెప్పబడిన ఉత్తమ ధర్మాలను అనుష్టించేవాడికి బ్రహ్మపదం సులభ సాధ్యమై వుంటుందని అంటూ మోక్ష ధర్మాలను తెలియచేసే హారీతగీత, వృత్రగీత గురించి తెలియచేశాడు భీష్ముడు. సంపద, పేదరికం అనేవి కాలానికి అధీనమై వుంటాయని, అవి జ్ఞానంలేని మూర్ఖులకు మదాన్ని, దీనత్వాన్ని కలిగిస్తాయని, తద్ద్వారా సుఖానికి, దుఃఖానికి హేతువులౌతాయని, సంపదలు శాశ్వతం కాదని తెలుసుకొన్న జ్ఞానికి అవి వున్నా, లేకున్నా ఎలాంటి వికారమూ కలగదని అన్నాడు భీష్ముడు. పుణ్యకార్యాల వల్ల జీవుడు మాలిన్యం వీడి పవిత్రుడౌతాడని, పుణ్యకార్యాలు చేసేవారు ఉత్తమ వర్ణాన్ని పొందుతారని, విష్ణుధ్యానం ఉత్తమ స్థితిని కలిగిస్తుందని చెప్పాడు.

వృత్రగీతలో భాగంగా భీష్ముడు ఇంద్ర-వృత్రాసుల మధ్య జరిగిన యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, ఇంద్రుడు ఆ యుద్ధంలో ఓటమి దిశగా పోతున్నప్పుడు, బృహస్పతి ప్రార్థన మేరకు శంకరుడి తేజస్సు చలించే జ్వరంగా రూపొంది వృత్రుడిని ఆక్రమించిన విషయం కూడా చెప్పాడు ధర్మరాజుకు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, పంచమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment