అశ్వమేధయాగానికి సర్వ సన్నద్ధమైన ధర్మరాజు,
అర్జునుడికి
యాగాశ్వ రక్షణ బాధ్యత
ఆస్వాదన-136
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(04-09-2023)
హస్తినాపురానికి వేదవ్యాస మహర్షి వచ్చి, పాండవులను కుశల
ప్రశ్నలు అడిగి, అశ్వమేధయాగ సంస్కారాలను వివరించి, వెంటనే ఆ
యాగాన్ని చేయడానికి పూనుకొమ్మని ధర్మరాజుకు సూచించి అదృశ్యమయ్యాడు. వ్యాసమహర్షి
వెళ్లిన తరువాత ధర్మరాజు తన తమ్ముళ్లను పిలిచి, (వేదవ్యాసుడు
చెప్పిన విధంగా) బ్రాహ్మణులు దాచిపెట్టిన ధనాన్ని తీసుకొనిరావడానికి హిమాలయ యాత్రా
విధానాన్ని ఆలోచించమని అన్నాడు. పరమ శివుడిని నియమబద్ధంగా పూజించి, ఆయన అనుగ్రహం పొంది, ప్రమథ గణాలను సేవించి, భూత బలులు చేసి, మరుత్తుడు బ్రాహ్మణులకు దానం చేసిన
బంగారాన్ని తీసుకొద్దామని భీముడన్నాడు. అర్జున నకులసహదేవులు కూడా అలాగే చెప్పారు.
అశ్వమేధయాగం చేయడానికి నిశ్చయించుకున్న ధర్మరాజు ధృతరాష్ట్రుడి దగ్గరికి పోయి ఆయన
అనుమతి, కుంతి దగ్గరికి పోయి ఆమె అనుమతి పొందాడు.
ఆ తరువాత హిమాలయాలకు బయల్దేరడానికి సిద్ధమైన ధర్మరాజు
యుయుత్సుడిని, విదురుడిని నగరాన్ని రక్షించడానికి నియమించాడు. పదహారు తెల్లటి గుర్రాలు
కట్టిన రథం మీద ధర్మరాజు, ఆయన వెంట ఆయన తమ్ముళ్లు భీమార్జున
నకుల సహదేవులు, చతురంగ బలాలు, రాజులు బయల్దేరి ప్రయాణం చేసి
హిమవత్పర్వతం చేరారు. పురోహితుడైన ధౌమ్యుడిని, ఆయన సహచరులను ముందుంచుకొని ఒక సమతల
ప్రదేశంలో విడిది చేశారు. సరిగ్గా అదే సమయంలో ఆ ప్రదేశానికి వ్యాసుడు వచ్చాడు.
మర్నాడు శివపూజలు చేయాలి కాబట్టి, ఆ రాత్రి నియమనిష్టలతో దర్భపడకల మీద పడుకొమ్మని
ధర్మరాజాదులను ఆజ్ఞాపించాడు. వారలాగే శయనించారు. మర్నాడు వేకువజామునే లేచి దర్భల
మీద శివుడిని ప్రతిష్టించి, పూజించి,
ప్రమథ గణాలను, భూతాలను, యక్షులను, కుబేరుడిని, ఆయన ఇతర అనుచరులను మంత్రపూర్వకంగా ఆహ్వానించి
పూజించారు.
ఆ విధంగా భూతాలను తృప్తి పరచి,
సేవకులతో సహా వెళ్లి, నిధులున్న చోట తవ్వించారు. అలా తవ్వగా కాసేపటికి
దేదీప్యమానంగా ప్రకాశిస్తూ నిధి కనిపించింది. ధర్మరాజు దానికి పూజలు చేశాడు. ఆ
విధంగా వేదవ్యాసుడి సమక్షంలో ఆ మహానిధిని సాధించారు పాండవులు. ధర్మరాజు ఆ మహర్షికి
వినయపూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేసిన తరువాత ఆయన వారికి దీవెనలిచ్చి
అదృశ్యమయ్యాడు. వేలాది బళ్ల మీద, గాడిదల మీద, ఒంటెల మీద, గుర్రాల మీద,
ఏనుగుల మీద ఆ బంగారాన్ని, బంగారంతో చేయించిన అనేక వస్తువులను తరలించారు. మజిలీలు
చేసుకుంటూ హస్తినాపురం పయనించారు.
ఇదిలా వుండగా, ద్వారకకు పోయిన శ్రీకృష్ణుడు
అశ్వమేధయాగం సమయానికై నిరీక్షిస్తూ, ధర్మరాజు చేస్తున్న
ప్రయత్నాలను గూఢచారుల ద్వారా తెలుసుకుంటూ, బలరాముడు, సాత్యకి మొదలైన యాదవులతో, సుభద్రతో కలిసి
హస్తినాపురానికి వచ్చాడు. శ్రీకృష్ణుడి రాకకు అంతా సంతోషంగా వున్న సమయంలో పరీక్షిత్తు
ఉత్తరకు జన్మించాడు. జనం సంతోషంతో కేకలు పెట్తుండగా, చనిపోయిన బిడ్డడు పుట్టాడంటూ
ఏడ్పులు మొదలయ్యాయి. అవి విన్న శ్రీకృష్ణుడు సాత్యకితో కలిసి కుంతి వున్న చోటుకు
వెళ్లాడు. అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం వల్ల కలిగిన అగ్ని కారణాన ఉత్తర కొడుకు
చనిపోయి జన్మించాడని, ఆ బాలుడిని బతికించమని, ఆ బాలుడు
బతకకపోతే తాను, సుభద్ర, ద్రౌపది అంతా
బతకరని అంటుంది కుంతీదేవి. అశ్వత్థామ బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని
ప్రయోగించినప్పుడు తాను ఉత్తర గర్భాన్ని కాపాడుతానని శ్రీకృష్ణుడు చేసిన
ప్రతిజ్ఞను గుర్తు చేసింది. తాను ఆ పసికందును బతికిస్తానని శ్రీకృష్ణుడు అన్నాడు.
శ్రీకృష్ణుడు కుంతి మొదలైనవారిని వెంటబెట్టుకొని పురిటి
ఇంటికి వెళ్లాడు. ఉత్తర బిడ్డ శవాన్ని ఒడిలో పెట్టుకుని కూచుంది. శ్రీకృష్ణుడికి
నమస్కరిస్తూ రక్షించమని కోరింది. భయపడవద్దని అభయమిచ్చిన శ్రీకృష్ణుడు, కాళ్లు
కడుక్కొని, ఆచమనం చేసి, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామక
అస్త్రాన్ని అణచి వేశాడు. ఆ శిశువు శవాన్ని మంచం మీద వుంచమని ఆజ్ఞాపించాడు. ఆ
తరువాత ఇలా అన్నాడు.
‘నేను శత్రువుల విషయంలో అసత్యం పలకని వాడినైతే, యుద్ధంలో
వెనుకంజ వేయని వాడినైతే, ఈ బాలుడి శరీరానికి ఈ రోజే ప్రాణం కలుగుతుంది.
బ్రాహ్మణజాతిపట్ల నాకు అత్యధిక ప్రేమ వున్నట్లయితే, నేను ధర్మాసక్తిగలవాడినైతే ఈ
ఉత్తర కొడుకు జీవిస్తాడు గాక! నేను ఏనాడూ, ఏవిధంగానూ, మనసా అర్జునుడి పట్ల వైరం పొందకుండడం నిజమైతే,
శాశ్వతంగా ఈ శిశువు శరీరంలో ప్రాణం చేరును గాక! అసందిగ్ధమైన ధర్మం నేను
ఆశ్రయించినట్లయితే, నేను చేసిన పని ధర్మబద్ధం కావడం నిజమైతే, ఈ శిశువు పంచప్రాణాలు తిరిగి పొందునుగాక! మహా సత్యం, ఉత్కృష్ట ధర్మం, అస్ఖలిత బ్రహ్మచర్యం నాలో చక్కగా నెలకొని
ప్రకాశిస్తుంటే,ఈ మగబిడ్డకు ఇప్పుడే ప్రాణం వచ్చును గాక!’.
శ్రీకృష్ణుడు ఇలా పలకగానే బాలుడికి ప్రాణాలు వచ్చి అవయవాలు
కదిలాయి. కళ్లు తెరిచాడు. అక్కడున్న వారంతా సంతోషించారు. ఆకాశవాణి శ్రీకృష్ణుడిని
స్తుతించింది. ఉత్తర తన బిడ్డను ఎత్తుకుని వచ్చి శ్రీకృష్ణుడికి మోకరిల్లింది.
బాలుడికి పరీక్షిత్తు అని నామకరణం చేశాడు శ్రీకృష్ణుడు. ఆ విధంగా ఆయన పాండవ
సంతతిని నిలిపాడు. పరీక్షిత్తు పుట్టిన నెలరోజులకు ధర్మరాజాదులు బంగారంతో,
సువర్ణ రాసులతో హస్తినాపురానికి వచ్చారు. తమకు ఎదురొచ్చిన కృష్ణుడిని, బలరాముడిని, ఇతర పెద్దలను తోడుంచుకొని పురప్రవేశం
చేశారు. ఆ తరువాత ఒకానొక సుందర మండపంలో కొలువు చేశారు. ఆ సమయంలో అక్కడికి
వేదవ్యాసుడు వచ్చాడు. అశ్వమేధయాగం సమస్త పాపాలనూ నశింపచేస్తుందని, దానిని చేయమని ఆయన చెప్పాడు.
వ్యాసుడి మాటలు విన్న ధర్మరాజు,
అశ్వమేధయాగాన్ని శాస్త్రోక్తంగా చేయమని ఆజ్ఞాపించమని శ్రీకృష్ణుడిని కోరాడు. తన
అనుమతి అవసరం లేదని, తానే ధర్మరాజును అశ్వమేధయాగం చేయమని
ప్రోత్సహించానని, యాగ నిర్వహణలో తాను ఏంచేయాల్నో ఆయనే తనను ఆజ్ఞాపించాలని అన్నాడు
శ్రీకృష్ణుడు. యజ్ఞదీక్షకు యుక్తమైన రోజును నిశ్చయించి అ సంస్కారాన్ని
నిర్వహించమని ధర్మరాజు వ్యాసుడిని ప్రార్థించగా, తాను, యాజ్ఞవల్క్యుడు, పైలుడు కలిసి చేయాల్సిన పనులన్నీ
చేస్తామని అన్నాడు. ఆ రోజు చైత్రమాసం పూర్ణిమ అని, యజ్ఞానికి
పనికొచ్చే అశ్వాన్ని (భూమండలం అంతా సంచరించడానికి) వెదకడానికి అశ్వశాస్త్రజ్ఞులను
పంపమని చెప్పాడు. సమస్త సామగ్రినీ సిద్ధం చేయించమన్నాడు. బంగారంతో పనిముట్లను
చేయించమన్నాడు.
వ్యాసుడు చెప్పిన విధంగానే ధర్మరాజు చేసి ఆయనకున్న
గుర్రాలలో ఉత్తమ లక్షణాలున్న శ్రేష్టాశ్వాన్ని తెప్పించాడు. వ్యాసుడు ఆ గుర్రాన్ని
చూసి సంతోషించి అది యజ్ఞానికి తగిన విధంగా వున్నదని అంటూ,
దాన్ని శాస్త్రోక్తంగా వదలుదామని చెప్పాడు. ఆశ్వసంచార కార్యానికి, అంటే, దాన్ని రక్షించడానికి, పరాక్రమ శ్రేష్టుడైన
అర్జునుడు తగినవాడని వ్యాసుడు నిర్ధారించాడు. భీముడు,
నకులుడు దేశాన్ని రక్షిస్తుంటారని, సహదేవుడు ఇంటి పనులు చేస్తుంటాడని నిర్ణయం
జరిగింది. మిగిలిన చిన్న-చిన్న పనులకు తగినవారిని నియమించాడు ధర్మరాజు. కుంతీ, ధృతరాష్ట్రుల అనుమతిని తీసుకున్నాడు. ద్రౌపదీదేవిని ఒప్పించాడు.
వ్యాసుడు చెప్పిన విధంగానే ధర్మరాజు అర్జునుడికి అశ్వ రక్షణ
బాధ్యతను అప్పగించాడు. యజ్ఞయోగ్యమైన ఆ గుర్రం అర్జునుడికి రక్షించతగినదని,
ఇతరులకు ఆ పని సాధ్యం కాదని, ఆయన సర్వ సన్నద్ధుడై ఆ పనిమీద
వెళ్లాలని, దారిలో కలిసిన రాజులతో తాను యాగదీక్షలో వున్నానని చెప్పమని, నియమ పూర్వకంగా తగిన పనులను చేస్తూ, ఏ ఆటంకం
లేకుండా గుర్రాన్ని నడిపించమని అన్నాడు ధర్మరాజు అర్జునుడితో.
ఈ విధంగా అశ్వమేధయాగం చేయడానికి సిద్ధపడ్డాడు ధర్మరాజు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, అశ్వమేధపర్వం, తృతీయాశ్వాసం
(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment