వేదోక్తంగా, శాస్త్రోక్తంగా
ధర్మరాజు
అశ్వమేధయాగం నిర్వహించిన వేదవ్యాస మహర్షి
ఆస్వాదన-137
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(11-09-2023)
అశ్వమేధయాగానికి సర్వ సన్నద్ధమైన ధర్మరాజు దీక్ష
చేపట్టాల్సిన రోజు రానే వచ్చింది. దైవజ్ఞులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో వ్యాసుడు
మొదలైన ఋత్విజులు వేదోక్తంగా ధర్మరాజును యజ్ఞదీక్షితుడిగా చేశారు. పట్టుబట్టా,
నల్లయిర్రితోలు ధరించి ధర్మరాజు యజ్ఞదండాన్ని చేపట్టాడు. ఆ తరువాత వేదవ్యాసుడు
శాస్త్రోక్తంగా వదిలిపెట్టిన ఉత్తమాశ్వం బయల్దేరింది.
(ఈ సందర్భంగా అశ్వమేధయాగాన్ని గురించి నాగళ్ల
గురుప్రసాదరావు గారు చాలా చక్కగా, ఇలా వివరించారు. గుర్రాన్ని బలి పశువుగా చేసి
సార్వభౌముడు చేసే యజ్ఞ విశేషం అశ్వమేధం. దీన్ని చైత్రమాసంలో పూర్ణిమనాడు
ఆరంభించాలి. యజ్ఞం ఆరంభమయ్యే మొదటి సంవత్సరంలో చైత్ర పూర్ణిమనాడు సార్వభౌముడు
సాంగ్రహణం అనే ఒక యజ్ఞాన్ని జరిపించి, మరునాడు బ్రహ్మౌదనం మొదలైన
కర్మలు చేసి, గుర్రాన్ని వదలాలి. ఆ యజ్ఞాశ్వం స్వేఛ్చగా తిరుగుతుంటే రాజపుత్రులు మొదలైనవారు
దానిని వెంబడించాలి. వదిలిన సంవత్సరంలో పదకొండు నెలలు గడిచిన తరువాత అశ్వాన్ని
తోలుకొని వచ్చి రావిచెట్ల తోపులో బంధించాలి. పన్నెండో నెలలో యజ్ఞ సామాగ్రిని
సంపాదించి ఫాల్గునమాసంలో అమావాస్యనాడు సార్వభౌముడు ఋత్విజులతో కూడి యజ్ఞశాలలో
ప్రవేశించాలి. రెండో సంవత్సరం మొదటి పాడ్యమి మొదలు అశ్వమేధయాగం ఆరంభించి, ఏడు
రోజులు హోమం చేసి పూర్ణాహుతి చేయాలి. గుర్రాన్ని రథకారుడి గృహంలో బంధించి బ్రహ్మ
మొదలైన ఋత్విజులు నలుగురూ మంత్రాలు చెప్పి హోమం చేస్తారు. తరువాత సోమలతకు కొన్ని
క్రియలు జరిపి సోమపానం చేస్తారు).
అర్జునుడు వేదోక్తంగా ధర్మరాజు వీడ్కోలు పొంది గాండీవాన్ని
ధరించి గుర్రాన్ని అనుసరించాడు. యాజ్ఞవల్క్య శిష్యుడు మార్గమధ్యంలో అవసరమైన పనులు
నిర్వహించేందుకు బ్రాహ్మణులతో కలిసి అర్జునుడి వెంట వెళ్లాడు. యాగాశ్వం ఉత్తర
దిక్కుగా పోతూ, త్రిగర్త దేశంలో ప్రవేశించింది. త్రిగర్త దేశాధిపతి కుమారులు, మనుమలు గుర్రాన్ని బంధించడానికి వచ్చారు. అర్జునుడు వారికి నచ్చ చెప్పే
ప్రయత్నం చేశాడు. ధర్మరాజు చెప్పినట్లే యుద్ధం తప్పిపోయే విధంగా వారితో
మాట్లాడాడు. వారు సూర్యవర్మ అనే రాకుమారుడిని సేనాపతిగా చేసుకున్నారు. అతడు, అతడి
తమ్ములు కేతువర్మ, ధృతవర్మ అర్జునుడి మాటలు వినకుండా బాణాలు ప్రయోగించారు.
అర్జునుడి పిడికిలి పట్టుతప్పి గాండీవం భూమ్మీద పడింది ఒక సమయంలో. అదే అదనుగా
త్రిగర్త సైన్యం అర్జునుడికి ఒక్కసారి ఎదుర్కొన్నారు. భూమ్మీద పడిన గాండీవాన్ని
పైకి తీసుకొని అర్జునుడు ఒక్కసారిగా విజృంభించాడు. త్రిగర్త సేనలు చెల్లాచెదరై పారిపోయాయి.
అర్జునుడి శరణు కోరారు. వారిని బుద్ధిగా వుండమని చెప్పి అర్జునుడు యజ్ఞాశ్వాన్ని
వెంబడించాడు.
అశ్వం
ప్రాగ్జ్యోతిషపురం వచ్చింది. ఆ సమాచారం విన్న భగదత్తుడి కుమారుడు వజ్రదత్తుడు
గుర్రాన్ని తీసుకొనిపోయాడు. అర్జునుడికి,
వజ్రదత్తుడికి నాలుగురోజులకు పైగా యుద్ధం జరిగింది. అర్జునుడు వజ్రాయుధంతో సమానమైన
బాణాన్ని భీకరంగా ప్రయోగించి వజ్రదత్తుడిని ఓటమి పాల్చేశాడు. ధర్మరాజు ఆజ్ఞానుసారం
రాజకుమారుడిని అశ్వమేధయాగానికి రమ్మని ఆహ్వానించి అక్కడి నుండి యజ్ఞాశ్వాన్ని
వెంబడిస్తూ బయల్దేరాడు అర్జునుడు. యజ్ఞాశ్వం సింధుదేశంలో సంచరిస్తున్నప్పుడు ఆదేశ
వీరుల కుమారులు పూర్వ వైరాన్ని తలచుకొని అర్జునుడి మీద దండెత్తారు. అర్జునుడు విజృంభించి
పోరాడాడు. సింధురాజపుత్ర సైన్య వీరులు దురవస్థలపాలై నలుదిక్కులకు పారిపోయారు.
అప్పుడు దుశ్శల మనుమడితో పాటు అర్జునుడిని చూడడానికి వచ్చింది అక్కడికి. బాలుడిని
కాపాడమని అర్జునుడిని వేడుకొన్నది. తన భర్త సైంధవుడు చేసిన అపకారం మరచిపోమ్మన్నది.
అర్జునుడు అభయమివ్వగా దుశ్శల సైన్యాలను వెంటబెట్టుకొని వెళ్లిపోయింది.
అర్జునుడు
అక్కడినుండి బయల్దేరి యజ్ఞాశ్వం వెంట తిరుగుతూ మణిపురం అనే పట్టణం చేరుకున్నాడు. ఆ
నగరాదిపతైన బభ్రువాహనుడు తన తండ్రి రాకను విని సవినయంగా వచ్చి అర్జునుడి కాళ్లకు
మొక్కాడు. అయితే అర్జునుడు బభ్రువాహనుడిని ఆదరించలేదు. ‘పౌరుష గుణహీనా’ అని
సంబోధిస్తూ, యజ్ఞాశ్వాన్ని ఎందుకు బంధించలేకపోయావని
ప్రశ్నించాడు. చేతకాని తనంతో రాజధర్మానికి తిలోదకాలిచ్చావని నిందించాడు. అదే
సమయంలో నాగలోకం నుండి వచ్చిన బభ్రువాహనుడి తల్లి ఉలూపి, తండ్రి ఆనతి ప్రకారం
అతడితో యుద్ధం చేయమని ఆదేశించింది. బభ్రువాహనుడు రాజలాంఛనాలతో తల్లిని తన
మేడమీదికి పంపి, గుర్రానికి అడ్డుపడి,
అర్జునుడితో యుద్ధానికి తలపడ్డాడు. ఇద్దరికీ ఘోర యుద్ధం జరిగింది. బభ్రువాహనుడు
ప్రయోగించిన బాణం అర్జునుడి హృదయంలో నిలవక అతడి వీపునుండి దూసుకొని పోయింది.
అర్జునుడు భూమ్మీద పడిపోయాడు. అర్జునుడి బాణాల దెబ్బలకు బభ్రువాహనుడు కూడా
నేలకూలాడు.
తన భర్త, కుమారుడు నేలకూలారన్న వార్త విని చిత్రాంగద
దుఃఖంలో మునిగి పోయింది. వెంటనే ఉలూపి కూడా అక్కడికి వచ్చి భర్తను, కుమారుడిని చూసి మూర్ఛపోయింది. తరువాత
తేరుకుంది. అలా జరిగినందుకు ఉలూపిని నిందించి, భర్తను బతికించమని ప్రార్థించింది
చిత్రాంగద. ఇంతలో బభ్రువాహనుడు తేరుకొని లేచి జరిగినదానికి విలపించాడు. ప్రాయోపవేశం
చేయడానికి సిద్ధమయ్యాడు. అతడికప్పుడు యాజ్ఞవల్క్య శిష్యుడు కనిపించాడు. ఇంతలో
ఉలూపి ఆర్జునుడిని బతికించడానికి సంజీవన మణిని స్మరించింది. వెంటనే ఆ మణి ఉలూపి
అరచేతిలో నిలిచింది. అప్పుడామె బభ్రువాహనుడిని చూసి అతడి శక్తి పరీక్షించడానికే
తాను ఇదంతా కావాలని చేశానని, అర్జునుడు మూర్ఛపోయే విధంగా మాయా
ప్రయోగం చేశానని, తన చేతిలోని మణిని అర్జునుడి హృదయస్థానం మీద
పెట్టమని అతడికి చెప్పింది. బభ్రువాహనుడు ఆమె చెప్పినట్లే చేయగా అర్జునుడు బతికి
లేచి కూచున్నాడు. బభ్రువాహనుడు జరిగినదంతా వివరించాడు. బభ్రువాహనుడిని తల్లులు
ఉలూపి, చిత్రాంగదలతో సహా అశ్వమేధయాగానికి రమ్మని
ఆహ్వానించాడు అర్జునుడు.
ఆ తరువాత
అర్జునుడు యజ్ఞాశ్వాన్ని వెంబడిస్తూ పోసాగాడు. గుర్రం రాజగృహం చేరింది. ఇది తెలిసి
ఆ నగరాధిపతైన జరాసంధుడి మనుమడు మేఘసంది అర్జునుడిని యుద్ధానికి ఆహ్వానించాడు. మేఘసంది
ఓటమి దిశగా పోతున్నప్పుడు, అర్జునుడు తన అన్నగారైన ధర్మరాజు
చెప్పిన మాటలు మేఘసందికి చెప్పాడు. ఎవరి ప్రాణాలకూ ధర్మరాజు మాట ప్రకారం హాని
చేయనని, ఇక యుద్ధం చాలించమని సలహా ఇచ్చాడు. అర్జునుడు
చెప్పిన ఆ మాటలు అంగీకరించిన మేఘసంది,
అతడి పాదాలకు మొక్కాడు. అందరిని ఆహ్వానించినట్లే మేఘసంధిని కూడా అశ్వమేధయాగానికి
రమ్మని పిలిచాడు.
యజ్ఞాశ్వం
చేదిదేశం ప్రవేశించినప్పుడు శిశుపాలుడి కుమారుడు శరభుడు మొదలు యుద్ధం చేసినప్పటికీ, తరువాత అర్జునుడిని ఆశ్రయించి పూజలు చేశాడు.
అర్జునుడు ఆ తరువాత వరుసగా టెంకణాదిపతి కిరాతరాజును, కోసల దేశీయులను, కాకదేశవాసులను, దశార్ణదేశాధిపతిని, నిశాదరాజును, పౌండ్ర,
ఆంధ్ర, ద్రావిడ,
కేరళ, కర్ణాట రాజులను గెలిచాడు. గుర్రం ద్వారకకు
చేరినప్పుడు యాదవులు అర్జునుడిని పూజించారు. ఆ తరువాత యజ్ఞాశ్వం పశ్చిమ సముద్ర తీర
దేశాలలో సంచరించి పాంచాల దేశం మీదుగా గాంధార దేశం ప్రవేశించింది. అక్కడి రాజైన
శకుని కుమారుడు యుద్ధం చేసి ఓటమి పాలయ్యాడు.
ఆ తరువాత
అర్జునుడు అనుసరిస్తున్న యజ్ఞాశ్వం హస్తినాపురం వైపు వెళ్లడం మొదలు పెట్టింది. ఆయన
రాక గూఢచారుల ద్వారా విన్న ధర్మరాజు, ధర్మప్రకారంగా అర్జునుడు ఆశ్వరక్షణ
చేసినందుకు పరమానందం పొందాడు. ఆ రోజు మాఘమాసంలోని పూర్ణిమ. తమ్ములను పిలిపించి
ధర్మరాజు అర్జునుడి రాక తెలియచేశాడు వారికి. చైత్ర మాసం సమీపిస్తున్నందున అన్ని
రకాల సదుపాయాలను ఏర్పాటు చేయించమని భీముడిని ఆజ్ఞాపించాడు. భూమండలంలోని
రాజులందరినీ ఆహ్వానించమని చెప్పాడు. ఆహ్వానాన్ని అందుకొని బ్రాహ్మణులు, రాజులు,
మునులు హస్తినాపురం చేరుకున్నారు. అందరికీ అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశారు
ధర్మరాజాదులు. యజ్ఞశాల నిర్మాణం లాంటి పనులు చకచకా జరిగాయి. అప్పుడే శ్రీకృష్ణుడు సాత్యకి, బలరామాది యాదవులతో కూడి వచ్చాడు. అర్జునుడు
ఆహ్వానించిన రాజులంతా రాసాగారు. ఇంతలో ఒక దూత వచ్చి ధర్మరాజుకు నమస్కారం చేసి, అర్జునుడు నగరానికి దగ్గరలో వున్నాడని,
మర్నాటికల్లా హస్తినకు చేరుకుంటాడని చెప్పాడు. అర్జునుడు యజ్ఞాశ్వాన్ని వెంబడిస్తూ
అనుకున్న విధంగానే పట్టణానికి వచ్చాడు.
అర్జునుడి రాకను
నగరమంతా చాటింపు వేసి చెప్పారు. పౌరజనులు ఆర్జునుడిని పొగడసాగారు. వారి మాటలకు
అర్జునుడి మనస్సు సంతోషించింది. ముందు గుర్రం నడుస్తుండగా యజ్ఞశాలకు వచ్చాడు. ఆ
తరువాత యజ్ఞయోగ్యమైన రోజు వచ్చింది. వ్యాసుడు వచ్చి ధర్మరాజుతో యజ్ఞం చేయడానికి
పూనుకొమ్మని చెప్పాడు. అతడికి సమస్త శుభాలు కలుగుతాయని అన్నాడు. ధర్మారాజు దీక్ష
వహించాడు. ఋత్విజులు శాస్త్రోక్తంగా యజ్ఞకార్యకలాపాన్ని నడిపారు. యజ్ఞం
ప్రకాశించింది. ఋత్విజులు ప్రవర్గ్యమనే యజ్ఞాంగాన్ని చేశారు. మంత్రపూతంగా సోమరసం
పిండారు. సవన కర్మం ఆచరించారు. వేదశాసనం ప్రకారం సమస్తం నిర్వర్తించారు. భీముడి
పర్వవేక్షణలో, ఆయన కనుసన్నల్లో, వచ్చిన వారికి ఎవ్వరికీ ఏలోపం కలగకుండా
ఏర్పాట్లన్నీ జరిగాయి.
ఋత్విజులు
బంగారు ఇటుకలతో నాలుగు వరసలు పేర్చి,
గద్ద ఆకారంలో యజ్ఞవేదిని నిర్మించారు. యూప ప్రతిష్ట చేశారు. యూపాలకు బలిపశువులను
కట్టారు. యజ్ఞాశ్వాన్ని ఉత్తమ యూపానికి కట్టారు. దాని చుట్టూ పశు సమూహాన్ని
నిలిపారు. అశ్వమేధ కర్మకాండ చేసే ఋత్విజుల బృందానికి వేదవ్యాసుడి శిష్య సమూహం
నాయకత్వం వహించింది. ఋత్విజులు యజ్ఞాశ్వంతో సహా సర్వ జంతువులను చంపి వండారు.
ద్రౌపదితో కూడా హోమం చేయించారు. అలా వేదవ్యాసుడు సకల లోకాలకు శ్రేయస్సు సమకూరేట్లు
ధర్మరాజు అశ్వమేధయాగాన్ని నిర్వహించి,
ఉదాత్త స్వరంతో యజమానిని దీవించాడు. దేవర్షులంతా ధర్మరాజును ఆశీర్వదించారు.
ధర్మరాజు సదస్యులకు వేయికోట్ల టంకాలు దక్షిణలుగా ఇచ్చాడు.
బ్రహ్మజ్ఞాన
మహాత్త్వంతో ప్రకాశించే వేదవ్యాస మహర్షికి తన భూమండల సామ్రాజ్యాన్నంతా సమర్పించాడు
ధర్మరాజు. భూమిని స్వీకరించిన వ్యాసుడు ధర్మరాజుతో, బ్రాహ్మణ ప్రకృతి కలిగిన తాము
బంగారాన్ని కోరుతామని, కాబట్టి భూమికి వెలగా దాన్నే ఇవ్వడం
శ్రేయస్కరమని చెప్పాడు. బ్రహ్మస్వాన్ని తిరిగి ఎలా తీసుకొంటానని ప్రశ్నించాడు
ధర్మరాజు. ఆ మాటలకు ఆకాశవాణి ఆయన్ను ప్రశంసించింది. తాము భూమిని అమ్ముతామని,
ధర్మరాజు దానం ఇచ్చి కొనడం సమంజసమైన పద్ధతే అవుతుందని, దాంట్లో తప్పు లేదని, బ్రాహ్మణుల కోరిక నెరవేర్చి సంతోషంగా పంపమని
వ్యాసుడు సమాధానం ఇచ్చాడు. వ్యాసుడు చెప్పినట్లే చేయమని కృష్ణుడు కూడా చెప్పాడు.
కోటికోట్ల టంకాలు భూమి వెలగా నిర్ణయించారు. ఆ ధనరాశిని ఋత్విజుల బృందానికి పంచాడు
వ్యాసుడు. బంగారంతో చేసిన యజ్ఞశాల తదితర సామగ్రిని బ్రాహ్మణులకు సమర్పించాడు
ధర్మరాజు. ఆ తరువాత క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు కూడా సువర్ణ దానం చేశాడు.
వేదవ్యాసుడు తన భాగమైన బంగారాన్ని కుంతికివ్వగా ఆమె ధర్మకార్యాలకు ఉపయోగించింది.
ధర్మరాజు
బంధువులతో, రాజులతో కలిసి యజ్ఞాంత స్నానం చేశాడు.
వ్యాసుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ తరువాత మహర్షి శిష్యులతో సహా
అదృశ్యుడయ్యాడు. వచ్చిన రాజులందరికీ ధర్మరాజు నగలూ, నాణ్యాలూ, బహుమానాలూ ఇచ్చాడు. ధర్మరాజు ఆవిధంగా రాజులందరినీ
సంతోషపెట్టి వీడ్కోలు పలికాడు. కృష్ణుడికి ఉత్తమోత్తమ కానుకలిచ్చి పూజించాడు.
బలరాముడని, సాత్యకిని సముచితంగా గౌరవించాడు. వారంతా
ద్వారకకు వెళ్లిపోయారు. ఆ తరువాత ధర్మరాజు స్వగృహం చేరుకున్నాడు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, అశ్వమేధపర్వం, చతుర్థాశ్వాసం
(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment