సజీవ వాహిని సనాతన ధర్మం
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి
దినపత్రిక (12-09-2023)
(సమస్త ప్రపంచంలో ప్రత్యేకత సంతరించుకున్న ఒక జీవన
విధానమైన భారతీయ, హైందవ, వైదిక
సంస్కృతిని మించిన ఉత్తమోత్తమమైన సనాతన ధర్మబద్ధమైన సంస్కృతి మరొకటి లేనే లేదు.
ప్రపంచ సామాజిక వ్యవస్థలలో హిందూ వైదిక వ్యవస్థ ఒక ఉదాత్తమైన వ్యవస్థ.
సార్వకాలికమై, శాశ్వతమై, స్థిరమై,
యుగ, యుగాలుగా వర్ధిల్లుతూ, ఎన్ని సాంఘిక విప్లవాలొచ్చినా చెక్కు చెదరకుండా, నిశ్చలంగా,
సజీవంగా వుంది. వేదకాలంనాటి నాస్తికుల నుండి, ఆధునిక
కాలంనాటి అజ్ఞానుల వరకూ ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని
విధాలుగా సనాతన ధర్మాన్ని కించపరిచినా ఫలితం శూన్యమే, తాత్కాలికమే!-సంపాదకుడి
వ్యాఖ్యానం)
సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు
ఉదయనిధి స్టాలిన్ అజ్ఞానంతో, లేదా, మిడిమిడి
జ్ఞానంతో చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం, కలకలం
రేగింది. పలు విమర్శలకు, ప్రతివిమర్శలకు దారితీసింది. సనాతన
ధర్మాన్ని విషజ్వరాలతో పోలుస్తూ, దాన్ని నిర్మూలించాలని ఎంత
అవివేకంతో, కుర్రతనంతో ఉదయనిధి వ్యాఖ్యలు చేశాడో, అదే మోతాదులో ఆయన్ను దుయ్యబడుతూ పలువురు మేధావులతో సహా ఎందరో
ఆధ్యాత్మికవేత్తలు ప్రకటనలు ఇచ్చారు కాని, సనాతన ధర్మం
పూర్వాపరాలు కాని, ఆద్యంతం లేని తత్సంబంధిత విషయాల ప్రస్తావన
కానీ శాస్త్రీయంగా చేసే ప్రయత్నం జరగలేదేమో! ఉదయనిధి సౌమ్యంగా మాట్లాడారని ఆయనకు
కితాబు ఇస్తూ, ఆయన పార్టీ ఎంపీ రాజా ఒక అడుగు ముందుకు వేసి,
ఆయనకంటే అతి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని ఉద్దేశించి
చేశారు. చివరకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహితం వారికి మద్దతుగా నిలిచారు.
వ్యూహాత్మకంగా సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తున్నట్లు అనుమానం కలుగుతున్నది.
సముద్రాల్లో అగాధాలు తెలుసుకోవడం ఎంత కష్టమో, వేదాలలో,
ఉపనిషత్తులలో, అష్టాదశ పురాణాలలో, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి, భీష్మాచార్యులు
ధర్మరాజుకి, విశ్వామిత్రుడు శ్రీరాముడికి ప్రవచించిన
ధర్మబోధనల్లో, మనుస్మృతిలో, ఇంకా ఇంకా
అనేకానేక పౌరాణిక, ఇతిహాస గ్రంథాలలో, పలు
సందర్భాలలో ప్రస్తావించిన సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవడం అంతకంటే ఎన్నో రెట్లు
ఎక్కువ కష్టం. వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి కాని, ఆయన్ను
విమర్శిస్తున్న పలువురు కాని ఇది తెలుసుకోవాలి. ధర్మం సనాతనమైనా, అధునాతనమైనా, అర్థమైతే అది ధర్మమే! సనాతన ధర్మానికి,
వేల సంవత్సరాలనాటి హైందవ ధర్మానికి, మనుధర్మానికి
వ్యతిరేకం అని మాట్లాడుతున్న ఇలాంటి వ్యక్తులకు, సనాతన వైదిక
ధర్మం అనాదిగా పరిమళిస్తున్న ఆధ్యాత్మిక సౌరభం అనే విషయం తెలియదు.
ఇలాంటి వారు ధర్మం, అధర్మం, పుణ్యం,
పాపం, స్వర్గం, నరకం,
జీవుడు, దేవుడు, బంధం,
మోక్షం లాంటి ఎన్నో అలౌకిక విషయాలను తెలుసుకోవాలంటే మూర్ఖం వీడి,
వేదంపై దృష్టి సారించాలి. చదివి, ఆసాంతం అర్థం
చేసుకునే ప్రయత్నం చేసి, ఒక్కొక్క అంశం మీద అభిప్రాయం
చెప్పాలికాని, గుడ్డ కాల్చి వేసినట్లు హిందువుల, భారతీయుల విశ్వాసాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం సవ్యం, భావ్యం కాదు. వాస్తవానికి అన్ని ధర్మాలకు మూలం వేదం. అన్ని ఆచారాలకు అదే
ప్రమాణం. అలాటి వేద నిబద్ధమైన ధర్మాన్నే, హిందూ సమాజానికి
ప్రామాణికమైన గ్రంథాల ఆధారంగా, పవిత్ర సనాతన ధర్మంగా పలువురు
విజ్ఞానులు విశదీకరించడం జరిగింది. దురదృష్టం ఏమిటంటే, హైందవ–వైదిక
సంస్కృతిని, ఔన్నత్యాన్ని పరదేశీయులు గుర్తించినప్పటికీ,
మన దేశంలో వున్న కుహనా విమర్శకులు వాటిని తూలనాడడం.
సదాచారం అంటే ఏమిటి? సమాజ శ్రేయస్సంటే ఏమిటి?
ఉత్తమోత్తమమైన ధర్మమంటే ఏమిటి? ఎవరెవరు ఏ
విధంగా తమ విధ్యుక్త ధర్మాలను త్రికరణ శుద్ధిగా ఆచరించాలి? క్షమాగుణం
అంటే ఏమిటి? మనోనిగ్రహం ఎలాంటిది? శాస్త్ర
విజ్ఞానం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం ఎలాంటిది? కాలానుగుణంగా స్త్రీ పురుష ధర్మాలు ఎలా మారుతాయి? వైవాహిక
ధర్మం అంటే ఏమిటి? దాంపత్య ధర్మం ఎలా వుండాలి? తల్లిదండ్రులను, పెద్దవారిని, గురువులను
ఎలా గౌరవించాలి? ఇలాంటివన్నీ సనాతన ధర్మంలో భాగాలే. ఇందులో
విమర్శకులకు ఏ విధంగా తప్పు కనిపిస్తుందో తెలియదు.
వేదకాలం నాటి నుండీ యావత్ ప్రపంచంలో
ప్రత్యేకత సంతరించుకున్న ఒక జీవన విధానమైన భారతీయ, హైందవ, వైదిక సంస్కృతిని మించిన ఉత్తమోత్తమమైన సనాతన ధర్మబద్ధమైన సంస్కృతి మరొకటి
లేనే లేదు. ప్రపంచ సామాజిక వ్యవస్థలలో హిందూ వైదిక వ్యవస్థ ఒక ఉదాత్తమైన వ్యవస్థ.
సార్వకాలికమై, శాశ్వతమై, స్థిరమై,
యుగ, యుగాలుగా వర్ధిల్లుతూ, ఎన్ని సాంఘిక విప్లవాలొచ్చినా చెక్కు చెదరకుండా, నిశ్చలంగా,
సజీవంగా వుంది. వేదకాలంనాటి నాస్తికుల నుండి, ఆధునిక
కాలంనాటి అజ్ఞానుల వరకూ ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని
విధాలుగా సనాతన ధర్మాన్ని కించపరిచినా ఫలితం శూన్యమే, తాత్కాలికమే!
దీనికి కారణం, దాని మూలాలు వేదాలలో సజీవంగా, అజరామరంగా, ఆచంద్రతారార్కంగా వుండడమే. ఆదిమధ్యాంతాలు
లేనిదే వేదం, అందులో చెప్పిన సనాతన ధర్మం.
ఏది ఆర్య ధర్మమో, ఏది ఆర్ష ధర్మమో, ఏది సనాతన ధర్మమో, వీటిల్లో కానిదేదో నిర్ణయించే
అర్హత ఎంతవరకుందో వీటిని గుడ్డిగా వ్యతిరేకించేవారు విజ్ఞతతో ఒకటికి పదిసార్లు
ఆలోచించుకోవడం మంచిదేమో! ఉదాహరణకు సృష్టి రహస్యం పరిపూర్ణంగా సమగ్రంగా
విప్పగలవారెవరైనా వున్నారా? పోనీ తమకు తెలుసని ఇంతవరకు
ఎవరైనా అనగలిగారా? విజ్ఞాన శాస్త్రం ఎంతగానో అభివృద్ధి
చెందింది కదా? అయినప్పటికీ రోబోలను తయారుచేయగలిగారే కాని
మానవ శరీర నిర్మాణానికి అసలు సిసలు నమూనా ఎవరైనా చేయగలిగారా? టెస్ట్ ట్యూబ్ బేబిని పుట్టించగలిగారు కాని, మానవ
వీర్యం, అండం కలయిక లేకుండా దానిని సాధించగలిగారా? సృష్టి ఆదినుంచీ కొన్ని నియమాలు, నిబంధనలు, పద్ధతులు, ఆచరణలు, మంచీ,
చెడులు, ఇలా ఎన్నో సనాతన సంప్రదాయాలు, ధర్మాలూ చోటుచేసుకుంటూ వస్తున్నాయి. వాటిలోంచి ఈకకు ఈక, తోకకు తోకా లాగి, లేని పాండిత్య ప్రదర్శన చేసి,
సనాతన ధర్మాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను,
ఈసడించడం సమంజసం కాదేమో ఆలోచించుకోవడం మంచిది.
అనాదిగా సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమైన భారతావనిలో ఎవరెవరు
ఎటువంటి ధర్మాలను ఆచరించారనేదే ప్రధానం. వాటిని భావితరాల వారు ఎలా అర్థం
చేసుకోవాలనేది ముఖ్యం. మన ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, వేదకాలంనాటి ధర్మశాస్త్రాలు చెప్పినదంతా
బూటకం అని వాదించేకన్న అందులోని ధర్మాలను, అధర్మాలను అవగాహన
చేసుకోవడం ముఖ్యం. ఉదాహరణకు, చాతుర్వర్ణ వ్యవస్థ తీసుకుందాం.
దాని ప్రకారం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య,
శూద్ర అనే నాలుగు వర్ణాలు వాడుకలో వున్నాయి. దాని హేతుబద్ధత
చర్చనీయాంశమైనప్పటికీ, సమాజం అభివృద్ధి చెందిన నేడు కూడా,
సామాజిక అవసరాల దృష్ట్యా, నాలుగు కాదు,
నలబై నాలుగుకు పైగా తరగతులుగా సమాజం విభజించబడి, విధులను నిర్వహించడం లేదా? ఏదేమైనప్పటికీ, చాతుర్వర్ణ వ్యవస్థను ఎవరు, ఎప్పుడు
సృష్టించినప్పటికీ, అది ఎలా రూపాంతరం చెందినప్పటికీ, అది ఒకనాటి సామాజిక అవసరాన్ని, బాధ్యతను ఆ కాలంనాటి
అవసరాలకు అనుగుణంగా నిర్వహించింది. ఇప్పుడు అది రూపాంతరం చెందింది.
ఒక ఆసక్తికరమైన విషయం, అయోధ్య వివాదంపై సెప్టెంబర్ 30, 2010 న వెలువడిన
అలహాబాద్ హైకోర్ట్ సెక్యులర్ తీర్పు. సుదీర్ఘమైన ఆ తీర్పులో న్యాయమూర్తులు ఋగ్వేదం,
కార్ల మార్క్స్, ఖురాన్, ఇక్బాల్, ప్రొఫెట్ మహమ్మద్, డార్విన్
లాంటి అనేక సనాతన, అధునాతన పుస్తకాల్లోని మహనీయుల మాటలను
ఉటంకించారు. జస్టిస్ సుధీర్ అగర్వాల్ తన తీర్పు పాఠాన్ని ఋగ్వేదంలోని సంస్కృత
శ్లోకాలతో ఆరంభించారు ఇలా: ‘ప్రళయావస్థలో శూన్యం తప్ప ఏమీ లేదు. కేవలం పంచ భూతాలు
మాత్రమే వుండేవి. ఏ లోకమూ లేదు. భూమ్యాకాశాలూ లేవు. అలాంటప్పుడు ఎవరు ఎవరిని
కదిలించారు? ఎలా కదిలించారు? అంతా
అనిశ్చిత స్థితే!’ అని మొదలవుతుందా శ్లోకం.
అలా కొనసాగిస్తూ, జస్టిస్
సుధీర్ అగర్వాల్, చావు పుట్టుకలు అప్పుడు తెలియదని, సూర్యచంద్రులు
వున్నారో, లేరో తెలియనందున రాత్రి, పగలు తేడా లేదని అంటూ, ఆ
సమయంలో ఎవరికీ అంతుచిక్కని ఒక పర బ్రహ్మ స్వరూపం, తన శక్తితో
సృష్టి ప్రక్రియను ప్రారంభించాడని, ఆ శక్తికి అతీతమైంది
మరేదీ లేదని పేర్కొన్నారు. ‘సృష్టికి పూర్వం అంతా శూన్యమే. అంతా చీకటిమయం. అంతటా
జలమయం. సృష్టి ఎలా, ఎప్పుడు ప్రారంభమైందో ఎవరికీ తెలియదు.
అన్నీ తెలిసిన పండితులకు, మేధావులకు కూడా తెలిసే అవకాశం
లేదు-ఎందుకంటే వారంతా సృష్టి తర్వాతే పుట్టారు కనుక. సృష్టికి కారకుడైన ఆ శక్తే
సృష్టిని కొనసాగిస్తున్నదా, లేక, మరెవరన్నా
చేస్తున్నారా? అనేదీ అంతుచిక్కని విషయమే. అసలా శక్తికి కూడా
తెలుసో, లేదో?’ అని ఆరంభించి, వివాదం విషయం ప్రస్తావిస్తారు న్యాయమూర్తి అగర్వాల్.
హిందూత్వ, వైదిక, సనాతనధర్మ
వేదాంతం ప్రకారం, ఈ సకల చరాచర ప్రపంచమంతటికీ, భూతకాలంలో జరిగిన దానికీ, వర్తమానంలో జరుగుతున్న
దానికీ, భవిష్యత్‌లో జరగబోయే దానికీ, కర్త,
కర్మ, క్రియ ఒక్కడేనని, ఏ
పనిని, ఎప్పుడు, ఎలా, ఎవరి ద్వారా జరిపించాలో, జరిగినదాని పర్యవసానం ఏమిటో,
లాభ నష్టాలేంటోనన్న విషయాలను నిర్ణయించే అధికారం ఒకే ఒక్కరికి
వుందని అర్థం చేసుకోవాలి. సృష్టించేది బ్రహ్మనీ, సంహరించేది
రుద్రుడనీ, కాపాడుతుండేది విష్ణుమూర్తనీ చెప్పినప్పటికీ,
బహుశా అనంత కోటి బ్రహ్మాండానికి ‘పరబ్రహ్మం’ ఒక్కరే అయుండాలి. ఆ
ఒక్కరికి సమానులు గానీ, అధికులు గానీ ఎవరూ వుండరు. గడ్డిపోచ
కదలాలన్నా ఆ ఒక్కరే కారణం. ఆ ఒక్కరే, మిగతా ఇద్దరినీ
నియమించాడు. బ్రహ్మ, రుద్రులు నిమిత్తమాత్రులే.
ఎవరికీ అర్థం కాని, చేసుకోలేని, ‘జగన్నాటక సూత్రధారి’ స్వయంగా రచించి, నిర్మించి,
దర్శకత్వం వహించిన భారీ సెట్టింగుల నిడివిలేని అద్భుతమైన నాటకంలో,
సకల చరాచర ప్రపంచంలోని జీవ, నిర్జీవ రాసులన్నీ
తమవంతు పాత్ర పోషించాయి. ఆ ఒక్కరు ఎవరికి ఏ పాత్ర ఇస్తే, దాన్ని
వారు ఆయన దర్శకత్వం మేరకే పోషించి, ఆగమన్నప్పుడు ఆగి,
జీవితం చాలించాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్లీ ఆయన నిర్ణయానికే
వదలాలి. ఉదాహరణకు బ్రహ్మనే తీసుకుందాం. బ్రహ్మ ప్రతి కల్పంలో మళ్లీ, మళ్లీ సూర్యచంద్రులను సృష్టిస్తుంటాడు. ఒక కల్పంలో జరిగినట్లే, ఇంచుమించు కొంచెం తేడాతో ప్రతి కల్పంలో జరుగుతుంది. ప్రకృతి
స్థితిగతులన్నీ ఒకే విధంగా వున్నా, జీవులు మాత్రం
మారుతుంటారు. గతించిన కల్పంలోని సూర్యచంద్రుల వలెనే ఆకారాలు కలిగి, అవే పనులను చేస్తుంటారు. ఆ కల్పంలోని సూర్యుడి జీవాత్మ తర్వాత కల్పంలోని
సూర్యుడి జీవాత్మ ఒకటి కాదు. ఆ జీవాత్మకు ఉన్నతమైన స్థానం దొరికి, ఆ స్థానంలోకి అర్హులైన మరొకరు వస్తారు. సనాతన ధర్మం అర్థం చేసుకుంటే ఈ
ఏర్పాటు అర్థం అవుతుంది.
హైందవ మతాన్ని ‘ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా’ (బ్రిటానికా
విజ్ఞాన సర్వస్వం) వివరిస్తూ ఈ మతం ప్రపంచంలోనే ప్రముఖమైన మతం అని పేర్కొంటూ, ఇది
భారత ఉపఖండంలో ఉద్భవించిందని ఉద్ఘాటించింది. ప్రపంచంలోనే ఇది అతి ప్రాచీనమైన మతంగా
పేర్కొంది. సంస్కృతంలో, ఇంకా అనేక ప్రాంతీయ భాషలలో
హైందవానికి సంబంధించి చాలా పవిత్ర గ్రంథాలు ఉన్నాయని పేర్కొంటూ, అవి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు హైందవ మత ప్రచారానికి ఎంతో దోహదం చేశాయని
ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా వివరించింది. ఈ ప్రచారంలో ఆచారాలు, దృశ్య, లలిత కళలు కూడా ప్రముఖ పాత్ర పోషించాయని
పేర్కొంది. హైందవ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది ఆచరిస్తున్నారని,
భారత జనాభాలో 80 శాతం మంది ఈ మతానికి
చెందినవారే అని చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించినా, ప్రాంతీయ
ప్రామాణికతల ఆధారంగానే ఈ మతం గురించి మరింత అవగాహన ఏర్పడుతుందని పేర్కొన్నది. ఇదీ
సనాతన ధర్మానికి అరుదైన గుర్తింపు. విమర్శకులకు ఎందుకు అర్థం కాదో? ఏదేమైనా ధర్మం సనాతమైనా, అధునాతనమైనా, అర్థమైతే అది ధర్మమే!
No comments:
Post a Comment