Monday, September 25, 2023

గాంధారి, కుంతి, విదుర, సంజయుడి సహితంగా అరణ్యాలకు వెళ్లిన ధృతరాష్ట్రుడు ..... ఆస్వాదన-139 : వనం జ్వాలా నరసింహారావు

 గాంధారి, కుంతి, విదుర, సంజయుడి సహితంగా

అరణ్యాలకు వెళ్లిన ధృతరాష్ట్రుడు

ఆస్వాదన-139

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (25-09-2023)

రాజ్యపాలన చేస్తున్న ధర్మరాజు, ఆయన సోదరులు ధృతరాష్ట్రుడిని వినయంగా సేవించేవారు. అతడి ఔన్నత్యానికి ఎలాంటి భంగం కలగకుండా నడుచుకొనేవారు. ప్రతిదినం స్వయంగా వెళ్లి ధృతరాష్ట్రుడిని సేవించేవారు. ధృతరాష్ట్రుడు కూడా పాండవుల మీద అంతే ప్రేమతో, వాత్సల్యంతో వుండేవాడు. కుంతి, ద్రౌపది, సుభద్ర, చిత్రాంగద, ఉలూపి కూడా గాంధారిని కొలిచేవారు. ధృతరాష్ట్రుడు గుళ్లు, చెరువులు, ఊళ్లు, అగ్రహారాలు ఏర్పరిచేవాడు. ధర్మరాజును సేవించడానికి వచ్చే సామంతరాజులు ముందు ధృతరాష్ట్రుడిని సేవించేవారు. ధృతరాష్ట్రుడికి అయిష్టమైన ఏపని కూడా చేయక పోయేవాడు ధర్మరాజు. భీముడికి మనసులో ధృతరాష్ట్రుడి మీద కోపం ఉన్నప్పటికీ అన్నగారి ఆజ్ఞానుసారం నడుచుకొనేవాడు. దుర్యోధనుడు జీవించి వున్నప్పుడు ఎలా జరిగిందో అలాగే, ధృతరాష్ట్రుడికి సార్వభౌముడిలాగా సంపదలు అనుభవించడం, ఇష్టప్రకారం దానం చేయడం సాగనిచ్చాడు ధర్మరాజు. అలాగే గాంధారికి కూడా జరిగింది.

ఆ విధంగా పదిహేను సంవత్సరాలు గడిచాయి. ఆ తరువాత ఒకనాడు ధృతరాష్ట్రుడు బంధువులందరినీ సమావేశపరిచి, ధర్మరాజును పిలిచి తన మనసులోని అభిప్రాయాన్ని తెలియచేశాడు. ముందుగా గతంలో జరిగినవాటిని గుర్తు చేసుకుని మాట్లాడాడు. ముసలితనం తన శరీరాన్ని మింగేస్తున్నదని, ఆ శరీరాన్ని శుద్ధి చేయాలంటే తపస్సు చేయాలని, అందుకు ధర్మరాజు అనుమతి కావాలని, క్షత్రియుడైనవాడు యుద్ధంలోనైనా మరణించాలి లేదా తపస్సుతోనైనా శరీరాన్ని విడిచి పెట్టాలని, కాబట్టి తపస్సు చేసుకోవడానికి తనను అడవులకు పంపమని అన్నాడు. తాను, గాంధారి నారబట్టలు కట్టుకొని అడవులకు పోయి అక్కడ మహర్షులను సేవిస్తూ, అక్కడి నుండే ధర్మరాజును దీవిస్తూ వుంటామని చెప్పాడు. ధృతరాష్ట్రుడు అలా బాధపడి కఠోరమైన అరణ్యాలలో వుండడానికి వెళ్తే తనకు రాజ్యం సుఖాన్ని ఎలా ఇస్తుందని ప్రశ్నించాడు ధర్మరాజు. ఆయన కొడుకైన యుయుత్సుడిని రాజ్యానికి రాజుగా చేస్తే తాను కూడా ధృతరాష్ట్రుడితో పాటే అడవులకు వస్తానని అన్నాడు. తనను విడిచి అరణ్యాలకు వెళ్లవద్దని ధృతరాష్ట్రుడిని ప్రాధేయపడ్డాడు ధర్మరాజు.

ఎలాగైనా సరే తపస్సు చేసుకోవడానికి తాను అడవికి పోవాల్సిందే అని పట్టుబట్టాడు ధృతరాష్ట్రుడు. ముందు భోజనం చేయమని, అడవులకు పోయే విషయం తరువాత ఆలోచిద్దామని ధర్మరాజు చెప్పిన మాటలు ఆయనకు నచ్చలేదు. తాను ఎక్కువగా మాట్లాడలేనని, అరణ్యానికి పోవడానికి తనను ఇబ్బంది పెట్టవద్దని, తపస్సు చేసుకోవడానికి ధర్మరాజు అనుమతి ఇచ్చేవరకు తాను భోజనం చేయనని ధృతరాష్ట్రుడు అంటుండగా వ్యాసమహర్షి అక్కడికి వచ్చాడు. ధృతరాష్ట్రుడు కోరినట్లే చేయమని, అతడికి పెద్దతనం వచ్చిందని, తపస్సు కోరుకోవడం తప్పుకాదని, గాంధారి కూడా తపస్సు చేసుకోవడమే కోరుకుంటున్నదని, కాబట్టి వారిని అడవులకు పోనివ్వమని ధర్మరాజుతో అన్నాడు వ్యాసమహర్షి. ఆయన మాటలకు భిన్నంగా తానేమే అనలేనని ధర్మరాజు జవాబిచ్చాడు. ధృతరాష్ట్రుడి అరణ్యగమనానికి అనుమతి ఇచ్చానని, వ్యాసుడి అనుమతి కూడా ఆయనకు లభించిందని, కాబట్టి ఇక ఆయన తన ఇష్ట ప్రకారమే అడవులకు వెళ్లవచ్చని తాను అడ్డుపడనని అన్నాడు ధర్మరాజు. ధర్మరాజు మాటలకు సంతోషించి వ్యాసుడు తపోవనానికి వెళ్లిపోయాడు.   

ధృతరాష్ట్రుడు చేయాల్సిన పనులన్నీ చేసి గాంధారి సమేతంగా భోజనం చేశాడు. ఆ తరువాత ధృతరాష్ట్రుడు ధర్మరాజుకు రాజనీతి విశేషాలు చెప్పాడు. ఎవరిని ఎలా సన్మానించాలి, ఎవరిని మంత్రులుగా చేసుకోవాలి, ఎవరిని గూఢచారులుగా చేయాలి, ఎలా రాజధానిని రక్షించాలి, ఆడవారి రక్షణ ఎలా కలిగించాలి, రహస్యాలోచన ఎలా చేయాలి, రాజు నిర్ణయాలు ఎలా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడాలి, తగవులు ఎలా పరిష్కరించాలి, తప్పు చేసిన వారిని ఎలా శిక్షించాలి, దేవతార్చన-బ్రాహ్మణార్చన ఎలా చేయాలి, సంపదలను ఎలా న్యాయంగా సంపాదించాలి, ప్రభుత్వానికి అంతరాయం కలిగించేవారిని ఎలా దండించాలి, ఎలాంటివాడిని సేనాపతిగా చేయాలి, తనతప్పులను ఎలా దాచిపెట్టి ఇతరుల దోషాలను ఎలా తెలుసుకోవాలి, శత్రువులతో ఎలా అప్రమత్తంగా వుండాలి, సమాన బలం కల రాజుతో ఎందుకు సంధి చేసుకోవాలి, శత్రురాజులను ఎలా నిర్మూలించాలి, తన సైన్యాన్ని ఎలా రక్షించుకోవాలి, లోబర్చుకున్న శత్రురాజ్య ప్రజలను ఎలా చూసుకోవాలి, ధర్మబద్ధంగా భూమిని ఎలా పాలించాలి, నిత్యం పెద్దలను ఎలా సేవించాలి మొదలైన అంశాలను వివరించాడు ధృతరాష్ట్రుడు. ఆయన చెప్పిన రాజనీతులు విన్న ధర్మరాజు ఆయన ఉపదేశించిన మార్గంలో శ్రద్ధగా నడుస్తానని మాట ఇచ్చాడు.

శ్రాద్ధాది కొన్ని పుణ్యకర్మలు చేసిన తరువాత అడవులకు పోవాలని నిర్ణయించుకున్నాడు ధృతరాష్ట్రుడు. అరణ్యాలకు పోవడానికి పౌరుల అనుమతి కూడా తీసుకుంటానని ధర్మరాజుకు చెప్పాడు. వెంటనే ధర్మరాజు రాజధానిలో వున్న అర్హులైనవారిని రప్పించాడు. తనను సంతోషంగా అనుమతించి అడవులకు పంపమని పౌరులను కోరాడు ధృతరాష్ట్రుడు. అక్కడున్నవారికి ఆ మాటలు విని దుఃఖం కలిగింది. వారంతా ఒకరి ముఖం ఇంకొకరు చూసుకొని ఏమీ మాట్లాడకుండా వూరకున్నారు. చివరకు అందరి పక్షాన శంబువు అనే మాట నేర్పరి బ్రాహ్మణుడు ధృతరాష్ట్రుడితో, వ్యాసమహర్షి చెప్పినట్లు చేయమని అన్నాడు. అరణ్యాలకు పొమ్మన్నాడు. పౌరుల అభిప్రాయాన్ని శంబువు అనే బ్రాహ్మణుడి నోట విన్న ధృతరాష్ట్రుడు చాలా సంతోషించాడు.

ఆ తరువాత ధర్మరాజాదుల అంగీకారాన్ని తీసుకొని కార్తిక మాసంలో పూర్ణిమనాడు మంచి బ్రాహ్మణులను అందర్నీ పిలిపించి భీష్మాదులనుద్దేశించి ఏకాగ్రతతో శ్రాద్ధ కర్మలు చేయడం ఆరంభించాడు ధృతరాష్ట్రుడు. ధర్మారాజు దానికి కావాల్సిన బంగారం, రత్నాలు, ఆవులు మొదలైన వస్తువులను పంపాడు. వాటితో గొప్పగా తన వారందరికీ ఉత్తమలోకాలు కలిగించే శ్రాద్ధక్రియలను చేశాడు ధృతరాష్ట్రుడు. అందరూ ప్రశంసించే విధంగా పదిహేను రోజులపాటు సాటిలేని రత్నాలు, బంగారం, ఆవులు, అలంకారాలు, వస్త్రాలు, కన్నెలు, వూళ్లు మొదలైన అనేక వస్తువులను దానం చేశాడు. ధృతరాష్ట్రుడు బ్రాహ్మణులకు భూదానం కొంత చేస్తే, ధర్మరాజు అంతటితో ఆగకుండా, ఇంకా వూళ్లకు వూళ్లు ధృతరాష్ట్రుడితో దానం చేయించాడు. గ్రామాలను బ్రాహ్మణులకు దానంగా అగ్రహారాలుగా ఇచ్చాడు. ఈ విధంగా ధృతరాష్ట్రుడు భారతయుద్ధంలో మరణించిన తన బంధువులందరికీ ఉత్తమలోకాల సౌఖ్యం కలగచేసే శ్రాద్ధ కర్మలు చేసి తన కోరిక నెరవేర్చుకున్నాడు.

మర్నాడు ఉదయమే, అంటే, మార్గశీర్ష పాడ్యమి నాడు ఋత్విక్కులను కూర్చుకొని గృహం విడిచి పోవడానికి ‘ఉదవసీయం’ అనే యజ్ఞం చేశాడు. పాండవులను, మిగిలిన బంధువులను, స్నేహితులను అందరినీ పిలిచాడు. అరణ్యాలకు బయల్దేరుతున్న విషయాన్ని చెప్పాడు. గాంధారితో కలిసి నారచీరెలు, జింక చర్మాలు ధరించి అక్షతలు, గంధం, పుష్పాలతో ఇంటిని పూజించాడు. వస్తువులన్నిటినీ విడిచి పెట్టాడు. భార్య వెన్నంటి నడుస్తుండగా, యాజకులు, అగ్నులు, సమిధలు మొదలైన సాధనాలు తీసుకొని ధృతరాష్ట్రుడు మందిరం దాటి వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి కుంతీ ప్రభృతులు వచ్చారు. వారంతా విచారిస్తూ వెనుక వస్తుంటే ధృతరాష్ట్రుడు అరణ్యాభిముఖంగా ముందుకు వెళ్లసాగాడు. ధర్మరాజాదులు దుఃఖించారు.

కుంతి శోకిస్తూ గాంధారి చేతిని తన భుజం మీద వుంచుకొని నడుస్తున్నది. ధృతరాష్ట్రుడు గాంధారి భుజం మీద చేయి వేసి పోతున్నాడు. ధృతరాష్ట్రుడు హస్తినగర ద్వారం దాటిపోతూ తన వెంట వస్తున్న పౌరులను ఆగిపొమ్మన్నాడు. విదురుడు, సంజయుడు ఆయన వెంట పోవడానికి నిశ్చయించుకున్నారు. కుంతి కూడా ధృతరాష్ట్రుడి వెంట అడవులకు వెళ్లడానికి నిశ్చయించుకున్నది. ధర్మరాజాదులు ఆమెను వెళ్లవద్దని ఎంతగా ప్రార్థించినప్పటికీ కుంతి అంగీకరించలేదు. వెనక్కు రానన్నది. ద్రౌపదీదేవి, సుభద్ర ప్రార్థించినా వినలేదు. తనకు రాజ్యసుఖాలు అక్కరలేదని, ఉత్తమ లోకాలను పొందడమే తన కోరికని, దానికొరకు ధృతరాష్ట్రుడి తోడుగా అరణ్యాలకు పోతున్నానని, ఇక పైకాలమంతా గాంధారీ ధృతరాష్ట్రులకు సేవచేస్తూ, తపస్సుతో శరీరాన్ని కృశింపచేసుకుంటూ నియమంగా గడుపుతానని అన్నది కుంతి ధర్మరాజాదులతో. ధృతరాష్ట్రుడు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. కుంతి నిశ్చయానికి విచారిస్తూ పాండవులు ఆమెకు పాదాభివందనం చేసి ఆగిపోయారు. ఆమెను ధృతరాష్ట్రుడికి, గాంధారికి అప్పచెప్పారు. నగరానికి వెళ్ళిపోయారు ఆ తరువాత.

ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, విదురుడు, సంజయుడు గంగానది ఒడ్డుకు చేరుకున్నాడు. మర్నాడు నదిని దాటి ఆవలి ఒడ్డుకు చేరారు. కురుక్షేత్రంలో ప్రవేశించారు. అక్కడ వారిని శతయూపుడు అనే రాజర్షి వచ్చి కలిశాడు. తన ఆశ్రమానికి తీసుకెళ్లాడు. ఆశ్రమ సమీపంలోనే పర్ణశాలలు ఏర్పాటు చేశారు విదురుడు, సంజయుడు. అక్కడే వుంటూ గాంధారీ, ధృతరాష్ట్రులు తీవ్రంగా తపస్సు చేసుకోసాగారు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆశ్రమవాసపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment