హింసా రూపమైన యజ్ఞం కంటే,
అహింసా రూపమైన యజ్ఞం గొప్పదని చెప్పే సక్తుప్రస్థుడి చరిత్ర
ఆస్వాదన-138
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(18-09-2023)
ధర్మరాజు చేసిన అశ్వమేధయాగం లోకాతీతంగా నడిచింది. సమస్త
జనులూ ఆశ్చర్యపడ్డారు. సరిగ్గా అదే సమయంలో ఒకానొక ముంగిస ఒక కన్నం నుండి బయటికి
వచ్చి, బ్రాహ్మణుల మధ్యనుండి “ఈ అశ్వమేధయాగం వీసమంత కూడా సక్తుప్రస్థుడి
మహాధర్మాన్ని పోలదు” అని బహిరంగంగా అన్నది. ఏ కారణాన అలా అంటున్నావని బ్రాహ్మణులు
ఆ ముంగిసను అడిగారు. తమకు అర్థం అయ్యేట్లు చెప్పమని కోరారు. సమాదానంగా ఆ ముంగిస
ఇలా చెప్పింది.
‘కురుక్షేత్రంలో తపస్సు సంపదగా కలిగిన ఒక గొప్ప బ్రాహ్మణుడు
(మునీశ్వరుడు) వున్నాడు. అతడి పేరు సక్తుప్రస్థుడు. కోపతాపాలు,
కోరికలు లేని ఆ బ్రాహ్మణుడు పొలాలలో రాలిన గింజలు ఏరుకొని తినేవాడు. అతడికి భార్య, కొడుకు, కోడలు వున్నారు. ఇలా వుండగా ఒక పర్యాయం
వానలు కురవలేదు. పంటలు పండలేదు. బ్రాహ్మణుడికి తిండి దొరకడం అసాధ్యమైంది. కుటుంబ
సభ్యులంతా కలిసి నివ్వరిధాన్యం కొంచెం ఏరుకొని తెచ్చుకొని ఆకలి తీర్చుకుంటున్నారు.
ఒకనాడు వారలా తృణధాన్యం వెదకి తెచ్చుకున్నారు. అది నాలుగు మానికల పేలపిండి అయింది.
నలుగురూ తలా మానికడు సమానంగా పంచుకొని తినడానికి సిద్ధంగా వున్నారు. అదే సమయానికి
ఒక బాటసారి బ్రాహ్మణుడు ఆకలితో వారింటికి వచ్చాడు. ఆయనకు అతిథి మర్యాదలు చేశారు
వీరు’.
‘ముందుగా ఇంటి యజమానైన బ్రాహ్మణుడు (మునీశ్వరుడు) తన వంతు
పేలపిండిని బాటసారి బ్రాహ్మణుడికి ఇచ్చి అతడి ఆకలి తీర్చుకొమ్మన్నాడు. బాటసారి
తిన్నాడు కాని తృప్తి కలగలేదు. అప్పుడు యజమాని బ్రాహ్మణుడి భార్య ఇది గమనించి
తనవంతు పేలపిండి బాటసారికి సమర్పించమని భర్తను కోరింది. భార్యవంతు పేలపిండి ఇచ్చిన
తరువాత దాన్ని కూడా తిన్న బాటసారి బ్రాహ్మణుడు తృప్తి పడలేదు. సక్తుప్రస్థుడి కొడుకు
అప్పుడు తన వంతు పేలపిండి ఇవ్వడానికి సిద్ధ పడ్డాడు. కొడుకు వంతు పేలపిండిని కూడా
అతిథికి సమర్పించాడు, అతిథి దాన్ని తిన్నాడు కాని అతడి ఆకలి ఇంకా తీరలేదు. అప్పుడు కోడలు
తనవంతు పేలపిండిని మామగారి ముందు పెట్టింది. కోడలి వాటా పేలపిండిని కూడా అతిథికి
సమర్పించాడు బ్రాహ్మణుడు. అతిథి సంతోషంతో దాన్ని తీసుకొని వేడుకతో తిన్నాడు.
అతడికి అప్పుడు తృప్తి కలిగింది. అప్పుడు బాటసారి బ్రాహ్మణుడు తాను “యముడు” నని, ఆయన సదాచార ప్రకృతిని చూసి మెచ్చుకున్నానని హృదయపూర్వకంగా అన్నాడు. భక్తి, వినయం, శ్రద్ధ, ఓర్పు, మర్యాద, దయ, అతిథి మీద ప్రేమ మునీశ్వరుడిలో నిలకడగా
వున్నాయని అన్నాడు’.
‘యముడు ఇలా అంటున్నప్పుడు ఆకాశంలో ఇదంతా గుంపులు కట్టి
చూస్తున్న దేవతలు, యక్షులు, సిద్ధులు బ్రాహ్మణుడు చేసిన దానానికి
పూలవాన కురిపించారు. సప్తర్షుల మనస్సులు సక్తుప్రస్థుడిని చూడడానికి కుతూహలంగా
వున్నాయని, ఆయన భార్యతో,
కొడుకు-కోడలుతో సహా స్వర్గానికి రమ్మని అన్నాడు యముడు. ఆయన కొరకు తొందరలోనే బ్రహ్మ
విమానం పంపుతాడని, బ్రహ్మ సభకు రావాలని చెప్పాడు. అనేక
దానాలు, ప్రఖ్యాత యజ్ఞాలు, ధర్మబద్ధమైన
ప్రశంసకు తగినవి కావని, సన్మార్గంలో సంపాదించి కూడబెట్టిందే
శ్రేష్టమని, యోగ్యుడైనవాడికి తగిన సమయంలో అల్పవస్తువైనా దానం
చేయగలగడం ఉత్తమమని అన్నాడు యముడు. ఇలా అంటూ ఆయన తన నిజస్వరూపం చూపించాడు. ఇంతలో
ఆకాశమార్గాన సువర్ణమణి నిర్మితమైన విమానం కనపడింది. అది నిమ్మదిగా భూమ్మీదకు
దిగింది. అందరినీ ఆ విమానం ఎక్కమని, బ్రహ్మ సభకు వెళ్లాలని అన్నాడు యముడు. అప్పుడు
సక్తుప్రస్థుడు సకుటుంబంగా తనవారితో పాటు విమానం ఎక్కి వెళ్లిపోయాడు’.
ఇదంతా చెప్పిన ముంగిస ఇంకా ఇలా చెప్పింది. ‘సక్తుప్రస్థుడి
దగ్గర జరిగినదంతా నేను గమనిస్తున్నాను. కన్నం నుండి వెలుపలికి రాగానే నా శరీరం మీద
పేలపిండి సువాసన వ్యాపించి, అతిథి కాళ్లు కడిగిన నీటి తడి అంటుకొని సక్తుప్రస్థుడు చేసిన దానం మహిమ
వల్ల నా తలా, శరీరం ఒకవైపున బంగారం అయ్యాయి. ఆనాటి నుండి
నేను దానకార్యాలు జరిగే చోట్లకు, యజ్ఞాలు చేసే ప్రదేశాలకు
వెళ్తున్నప్పటికీ రెండోవైపు బంగారం కాలేదు. ధర్మరాజు అశ్వమేధయాగం చేస్తుంటే విని
ఇక్కడికి వచ్చినా నాకేమీ విశేషం కనపడలేదు. అందువల్ల పొలాల్లో రాలిన గింజలను
ఏరుకొని తిని బతికిన ఆ బ్రాహ్మణుడి ధర్మంతో ఈ యజ్ఞం సాటికాదు అని అన్నాను’.
ఈ విధంగా పలికిన ముంగిస తాను ఎక్కడికి వెళ్లేది ఎవరికీ
తెలియకుండా అదృశ్యమైపోయింది. పశు హింసా రూపమైన యజ్ఞం కంటే, అహింసా రూపమైన యజ్ఞం
గొప్పదని ముంగిస చెప్పింది. అది కారణం వివరించకుండా చెప్పలేదు. తన తల,
శరీరంలోని సగభాగం బంగారం కావడానికి కారణం చెప్పింది కాబట్టి దాని మాటలు
అంగీకారయోగ్యమే. హింసలేని యజ్ఞం మన్నించ తగినది. ఉంఛవృత్తి అయిన బ్రాహ్మణోత్తముడు
ప్రాణరక్షణార్థం సమకూర్చుకున్న పేలపిండిని అతిథికి సమర్పించాడు కాబట్టి అది గొప్ప
విషయం.
ఇంతకీ ఈ ముంగిస ఎవరన్న సందేహం కలగవచ్చు. జమదగ్ని మహర్షి
ఒకసారి శ్రాద్ధం చేయడానికి సంకల్పించాడు. అందమైన కొత్త కుండలో హోమధేనువు పాలు
పిండి అనుకూల ప్రదేశంలో దాన్ని జాగ్రత్తగా వుంచాడు. అతడి మనస్సు పరీక్షించాలని
క్రోధభూతం నిశ్చయించి పాలకుండను పడతోసింది. జమదగ్ని అది చూసి కూడా కోప్పడలేదు.
తాను ఓడిపోయానని అంటూ ఆ భూతం తన తప్పు మన్నించమని జమదగ్నిని వేడుకుంది. భూతం ఏ
తప్పూ చేయలేదని, వెళ్లమని అన్నాడు జమదగ్ని. పితృదేవతలు మాత్రం కోపగించి జమదగ్నిని ముంగిసై
పుట్టామని శపించారు. శాపవిముక్తిని కూడా వారే చెప్పారు. ఏనాడైతే ముంగిస మహాధరాన్ని
అధర్మంగా నిరూపిస్తుందో ఆనాడే శాప విముక్తి అన్నారు. ముంగిస సక్తుప్రస్థుడి కథ
చెప్పి ధర్మరాజు అశ్వమేధయాగాన్ని ఆక్షేపించి, శాప విముక్తి
పొందింది.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, అశ్వమేధపర్వం, చతుర్థాశ్వాసం
(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment