Wednesday, September 20, 2023

అనేక ధర్మాల సమాహారం ‘సనాతన ధర్మం.’ ...... ఆత్మోపాసనతోనే మోక్షం ..... (సముద్రంలో అగాధాలకన్నా సనాతన ధర్మం ఎన్నెన్నో రెట్లు లోతైనది) : వనం జ్వాలా నరసింహారావు

 అనేక ధర్మాల సమాహారం ‘సనాతన ధర్మం.

ఆత్మోపాసనతోనే మోక్షం

(సముద్రంలో అగాధాలకన్నా సనాతన ధర్మం ఎన్నెన్నో రెట్లు లోతైనది)

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (20-09-2023)

ఆంధ్రప్రభ దినపత్రిక (21-09-2023)

అద్వితీయ గీర్వాణ భాషా గ్రంథాలుగా, సనాతన ధార్మిక ‘ధర్మ త్రివేణి' స్థావరాలుగా, భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని నినదించే ఋషి ప్రసాదాలుగా ప్రసిద్ధికెక్కిన శ్రీరామాయణ, భారత, భాగవతాలకు ఆలవాలమైన ధర్మభూమి, కర్మభూమి మన అఖండ భారతావని. అర్థం, అవగాహన చేసుకోగలిగితే, ఈ మూడింటిలో దర్శనమిచ్చే అనేక ధర్మాల సమాహారమే ‘సనాతన ధర్మం.’ మానవ విలువలను కాపాడేందుకు నిరంతరాన్వేషణ జరుగుతుందనడానికి వాల్మీకి రామాయణ గాధే చక్కటి ఉదాహరణ. సాక్షాత్తు మహావిష్ణువైన శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి మానవ విలువలను కాపాడి, సనాతన ధర్మాన్ని భావి తరాలవారికి అందిచ్చాడనేది రామాయణ సారాంశం.

వాల్మీకి రామాయణంలో రాజధర్మం, ప్రజాధర్మం, పతిధర్మం, సతీధర్మం, భాతృధర్మం, పుత్రధర్మం, భృత్యుధర్మం, స్నేహధర్మం, న్యాయవాది ధర్మం లాంటి సర్వ విధాలైన సామాన్య, విశిష్ట సనాతన ధర్మాల గురించి వివరంగా చెప్పడం జరిగింది. పితృవాక్య పాలన, ఆశ్రిత రక్షాధర్మకార్యం, కామక్రోధాలను జయించడం, స్వధర్మ నిర్వహణ, క్షమాధర్మం, కన్యాదాన ధర్మం, రాజ్యాధికారానికి పౌరుల సమ్మతి కోరే ధర్మం, దుర్బోధ తప్పని తెలియచేసే ధర్మం, ఆడిన మాట తప్పకపోవడం అనే ధర్మం, తప్పు చేస్తే శిక్ష తప్పదని చెప్పే ధర్మం లాంటి సనాతన ధర్మం ఉదాహరణలు రామాయణంలో అనేకానేకం.

రాముడు తండ్రి ఆజ్ఞ పాలించడానికి అడవులకు పోవడానికి సిద్ధపడినప్పుడు, లక్ష్మణుడు కైకను దూషిస్తే, ధర్మం, అధర్మం, నీతి, న్యాయం లాంటి అక్షర లక్షలు చేసే విషయాలెన్నో అతడికి వివరిస్తాడు రాముడు. వాటితో పాటే ధర్మాన్ని మించిన దైవం వుందని, ఇదంతా విధి చేష్టని, కైకకు ఇంత దురాలోచన దైవ ప్రేరణ వల్లనే కలిగిందని స్పష్టం చేస్తాడు. వ్యక్తుల సంతోషానికి, సౌఖ్యానికి, వ్యసనానికి, శాంతికి, రోషానికి, లాభనష్టాలకు, జననమరణాలకు, మరెన్నో ఇతర ఫలితాలకు మూలకారణం దైవమే సుమా అని అంటాడు. మానవులు దైవాన్ని ధిక్కరించి పౌరుషాన్నే ఆశ్రయించకుండా, దైవాన్ని ఆశ్రయించి, యథాశక్తి, యథాశాస్త్రం ప్రకారం, నిష్కాములై స్వకర్మలు చేయాలని రామాయణం స్పష్టం చేసిన సనాతన ధర్మం.

పితృ దేవతలను తృప్తిపరచడం, ప్రజల మాట ఆలకించి గౌరవించడం, గురువులకు శుశ్రూష చేయడం, పెద్దలకు నమస్కారం చేయడం, విద్వాంసులను గౌరవించడం, నీతిశాస్త్రం అభ్యసించి రహస్యాలను కాపాడగల మంత్రులను పాలనలో భాగస్వాములను చేయడం, శూరుడిని, ధైర్యం వున్నవాడిని, త్రికరణశుద్ధి కలవాడిని, రాజంటే ప్రేమ వున్నవాడిని సేనానాయకుడుగా నియమించడం, సరైన అధికారులను నియమించడం, నైపుణ్యంకల వేగులను నియమించడం, వ్యవసాయం చేసేవారికి రక్షణ కలిగించడం, గోరక్షణ, వాణిజ్యం చేసేవారికి రక్షణ కలిగించడం, స్త్రీలను గౌరవించడం, రాజ్యాదికారి అనునిత్యం ప్రజలకు అందుబాటులో వుండి దర్శనం ఇవ్వడం, వ్యయం కంటే మించి ఆదాయం ప్రభుత్వానికి వుండడం, నేరం చేసినవాడిని శిక్షించడం లాంటి శ్రీరాముడు భరతుడికి బోధించిన రాజధర్మాలలో చాలావరకు ఇప్పటికీ పాటిస్తున్న సనాతన ధర్మాలే. వీటిల్లో తప్పుబట్టేవి ఏమున్నాయి?

జాబాలి శ్రీరాముడిని ప్రశ్నించే వృత్తాంతంలో, అనేక విషయాలు అవగతమౌతాయి. భగవంతుడు అవ్యాకృతాత్ముడై రూపం, నామం, క్రియ లేనివాడై కొంతకాలం వుంటాడని, ఆ తరువాత మళ్లీ సృష్టిని సంకల్పిస్తాడని, ఇది పరిణామం లేదా ఇవోల్యూషన్ అని, మొదలు జరిగేది విపరిణామం లేదా ఇన్వొల్యూషన్ అని జాబాలి ప్రశ్నల ద్వారా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చేసేవారు ఎవరు? వాటంతట అవే అయ్యాయా? ప్రకృతి జడం కాబట్టి దానంతట అది పరిణామం చెందలేదు. ఇవన్నీ చేసేవాడు భగవంతుడే! ఈ విధంగా సర్వం భగవంతుడే అని, ఇదీ మన సనాతన విజ్ఞానంలో భాగమని అర్థం చేసుకోవాలి. ‘ప్రశ్నించే హక్కు ఆరోజుల్లోనే వుందనడానికి జాబాలి నిదర్శనం. ఆయన వాదనను ఆసాంతం అక్కడే వుండి విన్న వశిష్టుడు, దాన్ని సమర్ధిస్తూ, జాబాలి నాస్తికుడు కాదు, ఆస్తికుడు అని అంటాడు.  


బ్రహ్మేంద్రాదులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, సప్తర్షులు, అందరూ పుట్టడం యదార్థమే. అయినా పరిణామ వాదం తప్పుకాదు. ముక్తి అనేది వ్యర్థపదం కానేకాదు. బ్రహ్మ, రుద్ర, అగ్ని, వరుణుడు లాంటి పదాలన్నీ ఆయా పదవుల పేర్లే కాని ఆ ఉపాధిలో వుండే జీవాత్మల పేర్లు కావు. కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ అనే పదవుల్లో వుండేవారు మళ్లీ, మళ్లీ వచ్చారంటే, అదే మనిషి వచ్చాడని అర్థం కాదు. అలాగే బ్రహ్మ, రుద్ర, అగ్ని, వరుణుడు అనే పదవుల్లో వున్నవారు పోగానే, ఆ స్థానం ఖాళీ కాగానే, మరో అర్హుడు ఆ స్థానంలో నియమించబడి, వాడి ఉద్యోగం వాడు చేస్తాడు. ఇలా వచ్చేవాడు భిన్న జీవుడేకాని ఒకరేకాడు. పరిణామ వాదానికి ప్రాణ భయం కాని, ముక్తుడికి పునర్జన్మ భయం కాని లేదు. ఒక స్థానంలో రెండు జీవులుండవు. జీవయాత్రలో పరిణామమే సరైన మార్గం. ఇదీ సనాతన ధర్మమే.

‘జీర్ణం, జీర్ణం, వాతాపి జీర్ణం’ అనే నానుడి పూర్వాపరాలలో అగస్త్యుడు మేక మాంసం తిన్న ఉదంతం, ఆ రోజుల్లో బ్రాహ్మణులు మాంసం తినేవారనడానికి ఒక ఉదాహరణ. అది అప్పటి ధర్మం కావచ్చు. చెప్పుడు మాటలతో పగ రగిలించేవారు ఎప్పుడూ వుంటారనడానికి, చివరకు అదే రామరావణ యుద్ధానికి అంకురార్పణ కావడానికి శూర్పనఖోపాఖ్యానం చక్కటి ఉదాహరణ.

సీతాపహరణం వద్దన్న మారీచుడి సలహా వినని రావణుడి గతి ఏమయిందో అనే ధర్మాన్ని ఎప్పటికీ అన్వయించుకోవచ్చు. సీతాదేవి జాడ తెలియనందున కోపంతో జగత్ సంహారానికి సిద్ధపడ్డ శ్రీరాముడిని శాంతింప చేయడానికి చిన్నవాడైన లక్ష్మణుడు ఆయన పాదాలమీద పడి నమస్కరించి, ఎన్నో ధర్మాలను, స్థూలంగా ‘మోక్షానికి ఆత్మోపాసన ఒక్కటే మార్గం అనే ధర్మాన్ని చెప్పాడు.

సీతాన్వేషణ సఫలం కావడానికి కబంధుడు శ్రీరాముడికి సూచించిన అద్భుతమైన కార్యాచరణ స్నేహధర్మానికి నాంది. తన పని చక్కపెట్టుకోవడానికి అన్యుల సహాయం తీసుకోవాలని, ఆయన స్థితిలాంటి స్థితిలో ఉన్నవాడితోనే స్నేహం చేసుకోవాలని, స్నేహధర్మాన్ని, యుద్ధ ధర్మాన్ని వివరిస్తూ, సుగ్రీవుడి సహాయం తీసుకోమంటాడు. ఎలాంటివారికైనా కాలాన్ని దాటడం సాధ్యం కాదుకదా అనే ధోరణిలో కబంధుడు చేసిన చక్కటి నీతి బోధ సదా ఆచరణీయం. జ్ఞానాధికుడైన గృహస్థుడికి సన్న్యాసి సహితం నమస్కరించాలి అనేదే ధర్మమని తెలియచేసే విధంగా, (సన్న్యాసి వేషంలో వున్న) హనుమంతుడు తన మొదటి కలయికలో శ్రీరాముడికి నమస్కారం చేస్తాడు. వేదం తెల్సినవాడు, విష్ణుభక్తుడు, మాత్సర్యం లేనివాడు, విష్ణుమంత్రం మీద భక్తికలిగి, దాని అర్థం ఇతరులకు చెప్పగలిగిన వాడు, బాహ్యాభ్యంతరాలలో నిర్మలమైన వాడు, గురుభక్తి కలవాడు, పురాణాల జ్ఞానం కలవాడినే ‘ఆచార్యడు’ అంటారని, ఆచార్య ధర్మాలను రాముడు లక్ష్మణుడికి వివరిస్తాడు.

స్నేహ ధర్మమంటే పరస్పరం ఉపకారం చేసుకోవాలని, సుఖ దుఃఖాలు పంచుకోవాలని రామ సుగ్రీవుల కలయికలో అర్థమవుతుంది. వాలిని చంపడం ధర్మమా? అధర్మమా? అనే అనుమాన నివృత్తి కోసం చనిపోయే చివరి క్షణాల్లో తనను దూషించిన వాలితో ‘ధర్మార్థ గుణ సహితం’గా శ్రీరాముడు చెప్పిన మాటలు విలువైనవి. ధర్మం ఏవిధంగా ఆచరిస్తే పురుషార్థమవుతుందో, పురుషార్థం కాదో, అర్థం, కామం ధర్మంతో కూడి వుండేట్లు చేయాల్నా? వద్దా? అనే విషయం వాలి ఆలోచించలేదని, ప్రామాణికమైన శిష్టాచారం ఎలా వుందో ఆలోచించలేదని, ధర్మశాస్త్రం తెలుసుకోక పోవడం ఆయన తప్పని, తెలిసినవారిని ఎందుకు అడగలేదని ప్రశ్నించాడు రాముడు. ధర్మాన్ని వదిలి అధర్మమైన కామాన్నే స్వీకరించి వాలి రాజధర్మాన్ని తప్పాడని, సజ్జనులు శ్లాఘించే ‘సనాతన ధర్మాన్ని’ వదిలి తమ్ముడు బతికుండగా కోడలి లాంటి అతడి భార్యను, చెరిచిన కారణాన వాలిని చంపాల్సి వచ్చిందని, క్షత్రియుడుగా పుట్టిన తనకు సనాతన ధర్మాన్ని ‘క్షతమ్’ (చెడి పోకుండా) కాకుండా రక్షించే బాధ్యత వున్నదని, ధర్మరక్షణ తనకు పుట్టుకతో వచ్చిన అధికారమని, వాలికి అనేక రకాలుగా ధర్మ శాస్త్ర వాక్యాలను చెప్పాడు శ్రీరాముడు.

లంకకు పోతూ హనుమంతుడు, అణకువతో విద్యా గురువైనందున సూర్యుడికి, రాక్షసులతో యుద్ధానికి పోతున్నాడు కాబట్టి రాక్షస విరోధి ఇంద్రుడికి, బలం, వేగం కలగాలని తండ్రి వాయుదేవుడికి, బ్రహ్మాస్త్రాల బాధ కలగకుండా వుండాలని బ్రహ్మదేవుడికి ప్రార్థనా పూర్వకంగా నమస్కరిస్తాడు. ఇలాంటి సనాతన ధర్మం ఎవరెవరికి కార్యారంభంలో నమస్కరించాలో తెలియచేస్తుంది. లంక చేరిన హనుమంతుడు రాక్షస సంచారం లేని ప్రదేశం ద్వారా లంకా ప్రవేశం చేశాడు. శతృ స్థానాలలోకి దొడ్డిదారి (అద్వారం) నుండే ప్రవేశించాలన్నది రాజనీతి. శత్రు దేశంలోకి ప్రవేశించేటప్పుడు ఎడమకాలు ముందుంచాలి కాబట్టి హనుమంతుడు ఆ పద్ధతినే అనుసరిస్తాడు.

హనుమంతుడు లంకా దహనం చేసి వెళ్లిన తరువాత, మంత్రులతో సమాలోచన చేసినప్పుడు అంతా యుద్ధం చేయమని రావణుడికి సలహా ఇచ్చారు. విభీషణుడు అన్నకు రాజనీతి, యుద్ధ ధర్మం  బోధించాడు, కార్యసాధనకు సామ, దాన, భేద అనే మూడు ఉపాయాలున్నాయని, వీటితో సాధించలేకపోతే దండమనే నాలుగో ఉపాయం అవలంభించాలని, మొదటి మూడు ఉపాయాలను ప్రయత్నించకుండా యుద్ధానికి దిగడం శాస్త్రవిరుద్ధమని, తన్ను తాను రాముడు రక్షించుకొంటే తప్పేంటని, అన్యాయం ఎవరిదని, కలహానికి కాలు దువ్వినవారెవ్వరని, సీతాదేవి ఇక్కడ లేకుంటే హనుమంతుడు ఇక్కడికి వచ్చేవాడా అని, సీతాదేవిని శ్రీరాముడికి అర్పించడం గౌరవకరమని, అదే ధర్మమని అంటాడు. రావణుడు నిరాకరించడంతో, గౌరవంలేని చోట వుండరాదనే ధర్మాన్ని చెప్పేదే విభీషణుడు రాముడిని ఆశ్రయించడం. శరణు అన్నవాడిని చేరతీయడం అనే ధర్మాన్ని తెలియచేసేదే రాముడు అంగీకరించడం. లంకకు పోవడానికి సముద్ర మార్గం కొరకు ఉపాయం చెప్పని సముద్రుడిమీద కోపంతో బాణం వేయడానికి రాముడు సిద్ధపద్దప్పుడు, స్వభావ విరుద్ధంగా ప్రవర్తించడం సరైన పని కాదని చెప్పే ధర్మం సముద్రిడి స్పందన ద్వారా అర్థం చేసుకోవచ్చు.

రామరావణ యుద్ధానికి పూర్వరంగంలో రావణుడి ఆజ్ఞానుసారం వేగులైన శుకసారణులు రాముడి సైన్యం బలాన్ని అంచనా వేయడానికి రహస్యంగా పోవడమంటే అది యుద్ధ ధర్మంగా భావించాలి. రామచంద్రమూర్తి శత్రువులను జయించడానికి తన సేనను విభజించిన పధ్ధతి, చివరి క్షణంలో అంగద రాయబారం కూడా యుద్ధ ధర్మమే. రావణుడు మొదటిసారి యుద్ధానికి వచ్చినప్పుడు, ఓటమి అంచున వుండగా, విల్లుచేతిలో లేని శత్రువును రాముడు చంపడని భావించి నేలమీద తన విల్లుని విడిచాడు. వెంటనే యుద్ధ ధర్మాన్ని అనుసరించి రాముడు రావణుడిని చంపకుండా, కిరీటాన్ని నేలపడగొట్టి, లంకకు పొమ్మని అనుజ్ఞ ఇచ్చాడు. రెండోసారి వచ్చినప్పుడు రాముడు బ్రహ్మాస్త్రాన్ని రావణుడిమీద వేసి చంపాడు. రావణుడికి అంత్యక్రియలు చేయడానికి సందేహిస్తున్న విభీషణుడితో రాముడు, చచ్చినవాడి మీద పగ అనేది లేదని, రావణుడు ధర్మయుద్ధంలో న్యాయరీతిన చనిపోయిన వీరుడు, శూరుడు, తేజస్వి అని, సంస్కారం చేయకపోతే ప్రేతత్వం పోదనే సనాతన ధర్మాన్ని వివరిస్తాడు. ఇన్ని ధర్మాల సమాహారమే రామాయణ ధర్మం. సనాతన ధర్మం.

ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆచరించాలని అనుకుంటే ఇలాంటివి శ్రీరామాయణంలో మరెన్నో వున్నాయి. నారద మహర్షి వాల్మీకికి రామాయణాన్ని ఉపదేశించినప్పుడు ముందు భూతకాలం చెప్పి, తరువాత భవిష్యత్కాలం చెప్పాడు, రామాయణమే ఆదికావ్యం, వేదంలాగా స్వతఃప్రమాణం. దానిలోని విషయాలను ఋజువు చేయడానికి ఇతర ప్రమాణాలు లేవు. వేదార్థం ఇందులో విస్తరించి చెప్పడం జరిగింది. సనాతన ధర్మం తెలుసుకోవాలంటే శ్రీరామాయణం చదవాల్సిందే!!! అప్పుడే సనాతన ధర్మాన్ని హేతుబద్ధంగా విమర్శించడానికి అర్హులు. అజ్ఞానం, మిడిమిడి జ్ఞానం పనికిరాదు.

ఏదేమైనా ధర్మం సనాతమైనా, అదునాతనమైనా, అర్థమైతే అది ధర్మమే!

 

No comments:

Post a Comment