విలక్షణం ... ఖమ్మం
(విలక్షణ, విశిష్ట, విచిత్రమైన ఖమ్మం రాజకీయ నేపధ్యం)
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ
దినపత్రిక (03-04-2024)
{
రాష్ట్రంలో ఎప్పుడు, సాధారణ ఎన్నికలు ప్రకటించినా,
అభ్యర్థుల ఎంపిక విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యే స్థానాలలో, ఖమ్మం
లోక్ సభ, శాసనసభ స్థానాలు వుంటాయి. అలాగే, ఇందిరాగాంధీ ‘గాలి’ అయినా,
ఎన్టీఆర్ ‘గాలి’ అయినా, ‘టీఆర్ఎస్’
గాలి అయినా నిలదొక్కుకొని, అన్ని జిల్లాలకు భిన్నంగా ఎన్నికల్లో తీర్పు ఇచ్చే ఏకైక
జిల్లా, రాజకీయంగా చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా మాత్రమే!!! ఉదాహరణకు 1978 శాసనసభ
ఎన్నికలలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ (ఐ) రాష్ట్రాన్ని ‘క్లీన్ స్వీప్’ చేసినప్పుడు ఖమ్మం జిల్లాలో 9 స్థానాలకుగాను 5 స్థానాలలో ఆమె అభ్యర్థులు
ఓడిపోయారు. 1983 ఎన్నికలలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని ‘స్వీప్’ చేసినప్పుడు, ఖమ్మం జిల్లాలో ఒకేఒక్క స్థానం టీడీపీకి దక్కింది. టీఆర్ఎస్
పార్టీకి మూడు ఎన్నికల్లోనూ ఈ జిల్లాలో వ్యతిరేకమైన తీర్పే వచ్చింది. వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన ఏకైక జిల్లా కూడా ఇదే.}- సంపాదకుడి
వ్యాఖ్య
ఖమ్మంజిల్లాకు
చెందిన రాష్ట్రస్థాయి, దేశస్థాయి రాజకీయనాయకులలో, సర్దార్
జమలాపురం కేశవరావు, మాడపాటి రామచంద్రరావు, బొమ్మకంటి సత్యనారాయణ రావు, జలగం
వెంగళరావు లాంటి ప్రముఖులున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు జమలాపురం ఆంధ్ర ప్రదేశ్
కాంగ్రెస్ కమిటీకి తొలి అధ్యక్షుడు. స్వామీ రామానంద తీర్థ అనుచరుడిగా స్టేటు
కాంగ్రెసు ఉద్యమాన్ని నిర్వహించిన మాడపాటి, గాంధీభవన్ నిర్మాణానికి పూనుకున్న
పెద్దలలో ఒకరు. తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడుగా బొమ్మకంటి, మధిర ప్రాంతంలో
పోరాటానికి నాయకత్వం వహించిన థీశాలి. మధిర ఎమ్మెల్యేగా (1957-1962), దామోదరం
సంజీవయ్య ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, రాష్ట్ర రాజకీయాలను శాసించిన ‘కింగ్ మేకర్’. హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా
వున్నప్పుడు ఆయనకు కుడిభుజంగా, ఆయన సూచనమేరకు నీలం
సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా కావడానికి తోడ్పడిన వ్యక్తిగా,
అదే నీలంను వ్యతిరేకించిన వ్యక్తిగా బొమ్మకంటికి అసాధారణమైన గుర్తింపు వుంది. జలగం
వెంగళరావు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా కీలకపాత్ర పోషించారు.
అలాగే
రాష్ట్ర-దేశస్థాయికి ఎదిగిన వారిలో టీబీ విట్టల్ రావు, లక్ష్మీకాంతమ్మ, శీలం సిద్దారెడ్డి, బోడేపూడి వెంకటేశ్వరరావు, మల్లు
అనంతరాములు, చేకూరి కాశయ్య, హీరాలాల్
మోరియా, మల్లు రవి, కోట పున్నయ్య, తుమ్మల
నాగేశ్వరరావు, రేణుకా చౌదరి, పీవీ రంగయ్యనాయుడు, యలమంచిలి రాధాకృష్ణమూర్తి, వనమా వెంకటేశ్వరరావు,
కోనేరు నాగేశ్వరరావు, జలగం ప్రసాద్, రాంరెడ్డి వెంకటరెడ్డి, సంభాని చంద్రశేఖర్, మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి
శ్రీనివాసరెడ్డి, తమ్మినేని వీరభద్రం, కూనంనేని
సాంబశివరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి మరెందరో తదితరులున్నారు. మల్లు అనంతరాములు
14 రాష్ట్రాలకు అఖిలభారత కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ గా, ఏపీసీసీ అధ్యక్షుడిగా,
నాగర్ కర్నూల్ లోక్ సభ సభ్యుడిగా వుండేవారు. అకాల మరణం పొందకపోతే బహుశా ఉమ్మడి
రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవాడేమో?
రాష్ట్రంలో
ఎప్పుడు, సాధారణ ఎన్నికలు ప్రకటించినా,
అభ్యర్థుల ఎంపిక విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యే స్థానాలలో, ఖమ్మం లోక్
సభ, శాసనసభ స్థానాలు వుంటాయి. అలాగే, ఇందిరాగాంధీ
‘గాలి’ అయినా, ఎన్టీఆర్ ‘గాలి’ అయినా, ‘టీఆర్ఎస్’ గాలి అయినా నిలదొక్కుకొని, అన్ని
జిల్లాలకు భిన్నంగా ఎన్నికల్లో తీర్పు ఇచ్చే ఏకైక జిల్లా, రాజకీయంగా చైతన్యవంతమైన
ఖమ్మం జిల్లా మాత్రమే!!! ఉదాహరణకు 1978 శాసనసభ ఎన్నికలలో ఇందిరాగాంధీ కాంగ్రెస్
(ఐ) రాష్ట్రాన్ని ‘క్లీన్ స్వీప్’ చేసినప్పుడు ఖమ్మం
జిల్లాలో 9 స్థానాలకుగాను 5 స్థానాలలో ఆమె అభ్యర్థులు ఓడిపోయారు. 1983 ఎన్నికలలో
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని ‘స్వీప్’
చేసినప్పుడు, ఖమ్మం జిల్లాలో ఒకేఒక్క స్థానం టీడీపీకి దక్కింది. టీఆర్ఎస్ పార్టీకి
మూడు ఎన్నికల్లోనూ ఈ జిల్లాలో వ్యతిరేకమైన తీర్పే వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీ అభ్యర్థులను గెలిపించిన ఏకైక జిల్లా కూడా ఇదే.
1952లో ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుండి, ఖమ్మం లోక్
సభ స్థానం కాంగ్రెస్‌కు బలమైన పట్టుగా వుంటూ వచ్చింది. ఇక్కడ అది 12 సార్లు గెలవగా, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
(మార్క్సిస్ట్), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ సార్వత్రిక ఎన్నికలలో గెలిచింది.
పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (హైదరాబాద్), కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా టీబీ విట్టల్
రావు 2 సార్లు (1952, 1957), కాంగ్రెస్ అభ్యర్థులుగా టి లక్ష్మీకాంతమ్మ 3 సార్లు
(1962, 1967, 1971), జలగం కొండలరావు 2 సార్లు (1977, 1980), జలగం వెంగళరావు 2
సార్లు (1984, 1989), పివి రంగయ్య నాయుడు ఒక సారి (1991), నాదెండ్ల భాస్కరరావు
ఒకసారి (1998), రేణుకా చౌదరి 2 సార్లు (1999, 2004); కమ్యూనిస్ట్ పార్టీ
(మార్క్సిస్ట్) అభ్యర్థిగా తమ్మినేని వీరభద్రం ఒకసారి (1996); నామా నాగేశ్వరరావు తెలుగుదేశం
పార్టీ అభ్యర్థిగా ఒకసారి, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఒకసారి (2009, 2019);
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (2014) ఒకసారి గెలిచారు.
గెలిచినవారిలో జిల్లాకు చెందని స్థానికేతరులే ఎక్కువ!!!
గడచిన
మూడు దశాబ్దాల ఖమ్మం లోక్ సభ ఎన్నికల ఫలితాలు విశ్లేచించి చూస్తే ఈ నియోజకవర్గం
గురించి అవగాహన కలుగుతుంది. ముఖ్యంగా, ఈ
నియోజకవర్గంనుండి పోటీ చేయడానికి స్థానికులకన్నా, స్థానికేతరులే అధిక సంఖ్యలో
ఆసక్తి కనపరిచారు కాబట్టి అసలు అవగాహన కలగాల్సింది కూడా మొదట బయటివారికే. ఒకానొక
సందర్భంలో సాక్షాత్తు సోనియాగాంధీ మేడంనే ఇక్కడ పోటీకి దింపాలని ఆలోచన జరిగింది. 1952
సాధారణ ఎన్నికల నుండి 2019 భారత సాధారణ ఎన్నికల దాకా ఇక్కడ జరిగిన ఆసక్తికరమైన
పోటీలో బహుశా ఒకటి రెండు పర్యాయాలు మాత్రమే వంద శాతం స్థానికులు అని చెప్పగలవారు
గెలిచారు. కేంద్రమంత్రులైనవారు కూడా వున్నారు. నియోజకవర్గానికి వీరు చేసింది
ఏమిటనేది కోటిరూకల ప్రశ్న!
1991
సాధారణ ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అప్పుడే ఉన్నత
పోలీసు అధికారిగా పదవీ విరమణ చేసిన ఫక్తు స్థానికేతరుడు, పీవీ
రంగయ్య నాయుడు సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థి, యువకుడు, కమ్యూనిస్ట్ కుటుంబ నేపద్య్హం వున్న వ్యక్తి, (ప్రస్తుతం
రాష్ట్ర స్థాయి నాయకుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి) తమ్మినేని వీరభద్రం మీద కేవలం
6000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. పోటీలో వున్న ఒక స్వతంత్ర అభ్యర్థి సుమారు 50000
ఓట్లను చీల్చడం వల్లే రంగయ్య నాయుడు ఎన్నిక సులభమైంది. కాకుంటే, ఫలితం ఎలా వుండేదో? ఆ తరువాత పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆయన
కేంద్రమంత్రిగా పనిచేశారు.
రంగయ్య
నాయుడు కన్నా ముందర ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జలగం
వెంగళరావు, జలగం కొండలరావు, లక్ష్మీకాంతమ్మ తదితరులు దాదాపు స్పష్టమైన
మెజారిటీతోనే గెలిచారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల చీలికలు,
ఇరుపార్టీలు అభ్యర్థులను నిలబెట్టిన సందర్భాలూ వున్నాయి. అవన్నీ కాంగ్రెస్ పార్టీ
అభ్యర్థికి లాభం చేకూర్చాయి. 1996 ఎన్నికలలో విజయం సాధించిన సీపీఐ(ఎం) అభ్యర్థి
తమ్మినేని వీరభద్రం కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ రంగయ్య నాయుడుమీద
గెలవడానికి ఒకవిధంగా ఎన్టీఆర్ టీడీపీ అభ్యర్థి పోటీలో వుండడం కూడా కావచ్చు అని
గణాంకాలు చెప్తున్నాయి. తమ్మినేని పదవీ కాలం చాలా తక్కువ.
1998
సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా స్థానికేతరుడు, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల
భాస్కరరావు సిట్టింగ్ సీపీఐ(ఎం) అభ్యర్థి తమ్మినేని వీరభద్రం మీద కేవలం 11000 ఓట్ల
మెజారిటీ మాత్రమే సాధించి గెలిచాడు. పోటీలో వున్న బీజెపీ అభ్యర్థి సుమారు లక్షకు
పైగా ఓట్లను పొందడం వల్లే భాస్కరరావు గెలుపు సాధ్యమైంది. ఇక ఆ తదుపరి సాధారణ
ఎన్నికల నుండి రేణుకా చౌదరి, నామా నాగేశ్వరరావుల పర్వం
ఆరంభమైందనాలి. 1999 ఎన్నికలలో మరో స్థానికేతర వ్యక్తి రేణుకా చౌదరి (మాజీ
కేంద్రమంత్రి) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేవలం 8000 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో సమీప
టీడీపీ అభ్యర్థిపై గెలిచారు. సీపీఐ(ఎం), టీడీపీ పార్టీల అభ్యర్థుల ఉమ్మడి ఓట్లు
చాలా అధికం. వారు కలిసి పోటీ చేసినట్లయితే కాంగ్రెస్ గెలుపు సాధ్యమయ్యేది కాదేమో!
2004
ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై
స్పష్టమైన ఆధిక్యతతో గెలిచారు. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం అభ్యర్థి పోటీలో
వున్నందున కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి మీద టీడీపీ అభ్య్యర్థి నామా
నాగేశ్వరరావు గెలుపు సాధ్యమైందని చెప్పాలి. 2014 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పొంగులేటి
శ్రీనివాసరెడ్డికి వచ్చిన ఓట్లు కేవలం 35% అయినా, పోటీలో టీడీపీ,
సిపిఐ, టీఆర్ఎస్ వున్నందున ఆయన గెలుపు సాధ్యపడింది. ఇక గత 2019 భారత
సాధారణ ఎన్నికలలో టీడీపీ నుండి బీఆర్ఎస్ పార్టీకి మారిన నామా నాగేశ్వరరావు కాంగ్రెస్
పార్టీ అభ్యర్థి రేణుకా చౌదరి మీద సుస్పష్టమైన ఆధిక్యతతో గెలిచారు.
ఖమ్మం
జిల్లాలోని శాసనసభ స్థానాల తీర్పు కూడా భిన్నంగా వుంటూ వస్తున్నది. ఉదాహరణకు,
ఖమ్మం నియోజకవర్గం తీసుకుంటే, పీడీఎఫ్ అభ్యర్థిగా నామవరపు
పెద్దన్న మొదటిసారి గెలవగా, ఆ తరువాత వరుసగా, సీపీఐ నుండి నల్లమల్ల గిరి ప్రసాద్, రజబ్ అలీ (2), కాంగ్రెస్ నుండి కీసర అనంతరెడ్డి, సీపీఐ (ఎం) నుండి
మంచికంటి రాంకిషన్ రావు (2), సీపీఐ నుండి పువ్వాడ
నాగేశ్వరరావు (2), కాంగ్రెస్ నుండి యునిస్ సుల్తాన్, సీపీఐ (ఎం) నుండి తమ్మినేని వీరభద్రం, టీడీపీ నుండి
ఒకసారి, కాంగ్రెస్ నుండి ఒకసారి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్
నుండి ఒకసారి, తెలంగాణ రాష్ట్రసమితి నుండి ఒకసారి పువ్వాడ
అజయ్ కుమార్ గెలిచారు. ‘అపర గాంధీ’గా పిలువబడ్డ పానుగంటి
పిచ్చయ్య, పాల్వంచ నియోజకవర్గం నుంచి గెలిచాడు. ఖమ్మం
మునిసిపాలిటీ విషయానికొస్తే చిర్రావూరి లక్ష్మీనరసయ్య జీవించినంత కాలం కమ్యూనిస్ట్
అభ్యర్థిగా ఆయనే ఎల్లప్పుడూ చైర్మన్.
ఇదిలా
వుండగా, ‘కమ్యూనిస్టుల కంచుకోట’ అన్న పేరున్న ఖమ్మం జిల్లాకు,
రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ
సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన చిర్రావూరి లక్ష్మీనరసయ్య,
సర్వదేవభట్ల రామనాధం, మంచికంటి రామ కిషన్‌రావు,
రావెళ్ళ సత్యనారాయణ, కెఎల్ నరసింహారావు,
పర్సా, బోడేపూడి వెంకటేశ్వర రావు వంటి యోధులు
పాల్గొనడం జరిగింది. పార్టీ చీలిపోయిన దరిమిలా, కమ్యూనిస్టు (సేపేఐఎం) పార్టీకి పట్టున్న జిల్లాగా ఖమ్మానికి పేరు
వచ్చింది. దేశచరిత్రలోనే పౌరహక్కుల ఉద్యమానికి నాంది పలికింది డాక్టర్ యలమంచిలి
రాధాకృష్ణమూర్తి, అడ్వకేట్లు రాధాకృష్ణ, సుబ్బారావుల ‘మేథావి త్రయం’ సారధ్యంలో ఖమ్మం
జిల్లాలోనే అనేది జగద్విదితం. ప్రజా ఉద్యమాల నేపధ్యంలో నిర్మించబడిన అదే
కమ్యూనిస్ట్ పార్టీ, క్రమేపీ, అంతర్గత కుమ్ములాటలతో, బలహీనపడిపోయి, దాని ఉనికే ప్రశ్నార్థకం అయింది.
ఇలాంటి నేపధ్యం, రాజకీయ చైతన్యం వున్న ఉద్యమాల
గుమ్మం ఖమ్మం జిల్లా. ఖమ్మం లోక్ సభ స్థానాన్ని ఈ సారి గెలవబోయే అభ్యర్థి ఎవరో,
గెలిచి చేయబోయేది ఏమిటో వేచి చూడాలి.
Ab ki bar Congress sarkar :)
ReplyDelete