మాళవ గుప్త, రాజపుత్రస్థాన ఘూర్జర, నందిపురి ఘూర్జర వంశాలు
(బ్రాహ్మణ
రాజులు-13, 14, 15)
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(15-04-2024)
మాళవ గుప్త
వంశం
గుప్త చక్రవర్తుల సామంతులుగా మాళవ గుప్తులు వ్యవహరించబడ్డారు.
గుప్తరాజ్య పతనానంతరం ఈ వంశీయులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. అప్షద్
శాసనం వల్ల వీరు నృపశబ్ద వాచ్యులని అర్థమవుతున్నది. ఈ వంశీయుల వారైన కృష్ణగుప్త, హర్షగుప్త, జీవితగుప్తులు
గుప్త చక్రవర్తుల సామంతులుగా వుండి, అనేక యుద్ధాలను చేశారు. ఈ వంశీయులలో నాల్గవ
వాడైన కుమారగుప్తుడు అతి బలసంపన్నుడు. గొప్ప విజేత. అతడు మౌఖరి ఈశానవర్మను
యుద్ధంలో ఓడించి విజయుడై, ఈ వంశ
విజయానికి, అభ్యుదయానికి
తోడ్పడ్డాడు.
కుమారగుప్తుడి అనంతరం అతడి కుమారుడు
దామోదర గుప్తుడు మౌఖరులను ఓడించాడు. ఆ తరువాత మౌఖరి ప్రభువులు ఇతడిని ఓడించారు.
దామోదర గుప్తుడి కుమారుడు మహాసేన గుప్తుడు. ఇతడు పాలనా బాధ్యతలు వహించేనాటికి మాళవ
గుప్త రాజ్యం తూర్పు మాళవం దాకా అనగా లోహితీ నది పర్యంతం వ్యాపించినది. ఈ వంశీయులు
సుస్థిరవర్మను ఓడించి కామరూప రాజ్యాన్ని ఆక్రమించారు. మహాసేన గుప్తుడు దండయాత్రలు
నిర్వహించి విజయాలు సాధించినప్పటికీ, చాలాకాలం
జయించిన భూ భాగాలను నిల్పుకోలేకపోయాడు. వల్లభిరాజు మొదటి శిలాదిత్యుడు దండయాత్ర
నిర్వహించి పశ్చిమ మాళవ రాజ్యాన్ని జయించాడు. కాలచురి శంకర గణరాజు ఉజ్జయినీ
నగరాన్ని క్రీస్తుశకం 595 లో జయించాడు. ఇదే సమయంలో మహాసేన గుప్తుడు మాళవ రాజ్యం
మీద తన అధీనాన్ని కోల్పోయాడు. అతడి సామంతుడైన శశాంకుడు వంగ దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో స్వాతంత్ర్యాన్ని
ప్రకటించుకున్నాడు.
మహాసేన గుప్తుడి ఇద్దరు కుమారులు కుమార
గుప్తుడు, మాధవ గుప్తుడు
రాజ్యంలేక స్థానేశ్వర ప్రభువైన ప్రభాకరవర్మ శరణుజొచ్చారు. మహాసేన గుప్తుడి సోదరి
మహాసేన గుప్త ప్రభాకర వర్ధనుడి మాతృమూర్తి. కుమార గుప్తుడికి, మాధవ గుప్తుడికి ఆమె మేనత్త. మాధవ గుప్తుడు
స్తానేశ్వరంలో పెరిగి పెద్దవాడయ్యాడు. అతడి కుమారుడు ఆదిత్య గుప్తుడు. ఆదిత్య
సేనుడి పినతండ్రి కుమారుడు దేవగుప్తుడు. ప్రభాకర వర్ధనుడి సహాయంతో తన పూర్వుల
రాజ్యాన్ని సాధించాడు.
ఇదిలా వుండగా దేవగుప్తుడు మాళవ
రాజ్యాన్ని ఆక్రమించి పాలించాడు. కాకపోతే సంపూర్ణంగా జయించలేదు. దేవగుప్తుడు
శశాంకుడి స్వాతంత్ర్యాన్ని అంగీకరించి అతడితో స్నేహంగా వుండేవాడు. మహాసేన గుప్తుడి
మనుమడు, మాధవ గుప్తుడి కుమారుడు ఆదిత్యగుప్తుడు , దేవగుప్తుడి తరువాత మాళవ
రాజ్యాన్ని ఆక్రమించి మగథను సాధించి, గుప్త వంశపు
కీర్తిని పునరుద్ధరించాడు.
మహాసేన గుప్తుడి వరకు ఈ రాజ వంశీయులు
మాళవ రాజ్య పాలకులుగా వుండేవారు. తరువాత మగథ రాజ్యాన్ని ఏలారు. మహాసేన గుప్తుడు
మగథ, గౌడ రాజ్యాలను
జయించి పాలించాడు. అతడు తన రాజ్యంలోని ప్రాగ్భాగాలను కోల్పోయినప్పటికీ, వున్న మగథ రాజ్యాన్ని పాలించాడు. ఆదిత్యగుప్తుడి
అనంతరం అతడి కుమారుడు, ఆ తరువాత అతడి
కుమారుడు రెండవ జీవిత గుప్తుడు మాళవ గుప్త రాజ్యాన్ని పాలించారు.
రాజపుత్రస్థాన
ఘూర్జర వంశం
క్రీస్తుశకం ఆరవ శతాబ్ది ఉత్తరార్థంనుండి
ఘూర్జరులు ప్రసిద్ధికెక్కారు. వీరు గుప్త రాజ్య పతనానంతరం విజృంభించి రాజ్యస్తాపన చేశారు. పూర్వకాలంలో
గుజరాత్ ఘూర్జర దేశంగా పరిగణించబడింది. గుజరాత్ ప్రాంతాన్ని ఏలడం వల్ల వీరు
ఘూర్జరులు అని పిలువబడ్డారు. రాజాస్థాన్ లోని జోద్పూర్ ప్రాంతంలో ఘూర్జరుల రాజ్యం
వర్దిల్లినది. గుజరన్వాల, గుజరాత్,
పంజాబ్ రాష్ట్రంలోని గుజర్ ఖాన్, గుజరాత్ గా వ్యవహరించబడ్డ సహరాన్పూర్ జిల్లా
ఘూర్జరుల ఆవాస స్థలాలుగా పరిగణించబడ్డాయి.
ఘూర్జరులు
అనేక ప్రదేశాలలో రాజ్యాలను నెలకొల్పి పాలించారు. వీరు మొదట్లో హిమాలయా పర్వత
పశ్చిమ భాగాలలోనూ, పంజాబ్,
ఉత్తర ప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, సింధు రాష్ట్రంలో వున్న కొండ
ప్రదేశాలలో నివసించారు. భారతావని మీద దండయాత్రలు చేసిన హూణుల వెంట ఘూర్జరులు వచ్చి, పంజాబ్,
రాజపుత్ర స్థానం, గుజరాత్ ప్రాంతాలలో నివసించినట్లు చారిత్రక
ఆధారాలున్నాయి. గుజరాత్ ప్రదేశంలో వున్న అనేక ప్రదేశాల పేర్లు ఘూర్జర నామ
సామ్యాన్ని కలిగి వున్నాయి. ఘూర్జరులు భారతీయులే అని, వారు గుజరాత్ రాష్ట్ర వాసులని, విదేశీయులు
కానేకారని పలు ఆధారాలున్నాయి.
ఘూర్జర
వంశ స్థాపకుడు హరిశ్చంద్రుడు. ఇతడు గుప్త సామ్రాజ్య పతనానంతరం రాజపుత్ర స్థానమందలి
జోధ్పూర్ నగరాన్ని రాజధానిగా ఘూర్జర రాజ్యాన్ని స్థాపించాడు. హరిశ్చంద్రుడు
సమరశూరుడు. బ్రాహ్మణుడు. వేదాధ్యయనం చేసినవాడు. అతడు వాకాటక, విష్ణుకుండిన, కదంబాది బ్రాహ్మణ వంశీయుల లాగానే క్షత్రియ ధర్మం అవలంభించి
సైన్యాన్ని సమకూర్చుకుని, క్రీస్తుశకం 550 లో జోధ్పూర్ నగరాన్ని
ఆక్రమించి, ఘూర్జర రాజ్య స్థాపన చేసి, పరిసర భూభాగాలను జయించాడు. హరిశ్చంద్రుడు
వేదవిదుడై అనేక శాస్త్రాలను అభ్యసించాడు.
హరిశ్చంద్రుడికి
ఇద్దరు భార్యలు. ఒకరు కులస్త్రీ కాగా,
వేరొకరు క్షత్రియ వంశ సంజాత. బ్రాహ్మణ స్త్రీ వల్ల కలిగిన సంతతి ప్రతీహార
బ్రాహ్మణులు అని పిలవబడ్డారు. క్షత్రియ వనిత వల్ల కలిగిన సంతానం ప్రతీహార రాజవంశం
వారైనారు.
గుప్తరాజ్యం
పతనావస్థలో వున్న సమయంలో హరిశ్చంద్రుడు మిహిరకులుడిని, యశోధరుడిని ఎదిరించి రాజ్యస్థాపన చేశాడు.
హరిశ్చంద్రుడు తాను స్థాపించిన ఘూర్జర రాజ్యాన్ని క్రీస్తుశకం 550 నుండి
క్రీస్తుశకం 565 వరకు 15 సంవత్సరాలు పాలించాడు.
హరిశ్చంద్రుడికి
క్షత్రియ రాణి భద్రాదేవి వల్ల నలుగురు కుమారులు పుట్టారు. ఈ నలుగురు వేర్వేరు
రాజ్యాల పాలకులుగా వుండేవారు. ఒక కుమారుడు రజ్జల రాజు మాండవ్యపుర రాజ్యాన్ని 25
సంవత్సరాలు పాలించిన తరువాత అతడి కుమారుడు నరభట రాజ్యాదిపత్యాన్ని వహించాడు. ఇతడి
పాలనాకాలం క్రీస్తుశకం 590 నుండి క్రీస్తుశకం 620 వరకు, సుమారు 30 సంవత్సరాలు.
నరభట
అనంతరం అతడి కుమారుడు నాగభట మాండవ్యపుర రాజ్య సింహాసనం అధిష్టించాడు. ఇతడి రాజధాని
జోధ్పూర్ పట్టణానికి దగ్గరలో వున్న మెడంతకం. నాగభట ఘూర్జర రాజ్యాన్ని క్రీస్తుశకం
620 నుండి క్రీస్తుశకం 640 వరకు సుమారు 20 సంవత్సరాలు పాలించాడు. నాగభట తరువాత
ఇతడి వంశానికి చెందిన 8 తరాల వారు, 10
మంది రాజులు సుమారు 200 సంవత్సరాలు ఘూర్జర రాజ్యాన్ని ఏలారు.
నందిపురి
ఘూర్జర వంశం
నందిపురి
ఘూర్జర వంశపు రాజులు, రాజస్థాన ఘూర్జర స్థాపకుడైన హరిశ్చంద్రుడి సంతతివారు.
హరిశ్చంద్రుడికి నలుగురు కుమారులు. భోగభట, కక్క,
రజ్జిల, దడ్డ అనే ఆ నలుగురిలో మొదటి ఇద్దరికీ పాలనా విషయాలు
అంతగా తెలియదు. కాని రజ్జల మాండ్యపుర రాజ్యాన్ని పాలించగా, దడ్డ నందిపురి రాజ్యపాలనా బాధ్యత వహించాడు.
ఘూర్జర వంశీయుడైన మొదటి దడ్డరాజు
క్రీస్తుశకం 575 లో రాజ్యాదిపత్యాన్ని వహించాడు. ఇతడి వంశీయులు భరుకచ్చం
రాజ్యానికి తోడుగా అవంతీనగరం రాజధానిగా కల రాజ్యాన్ని సైతం పాలించారు. వీరు
ప్రతీహారులుగా పరిగణింపబడినారు. శాసనాల ఆధారంగా నందిపురి ఘూర్జర రాజ వంశీయులు క్రీస్తుశకం
575 నుండి క్రీస్తుశకం 641 వరకు పాలించారు.
మొదటి దడ్డరాజు బలపరాక్రమ సంపన్నుడు.
ప్రజ్ఞాశాలి. ఇతడు భరుకచ్చం రాజ్య సరిహద్దులలో వున్న నాగ రాజులను ఓడించి, వారి రాజ్యాలను స్వాధీనపర్చుకున్నాడు. మొదట్లో
దడ్డరాజు వంశేయులు రాజస్థాన ఘూర్జర రాజుల సామంతులుగా వుంది, తరువాత బాదామీ చాళుక్యుల విధేయ సామంతులుగా
మారారు. దడ్డరాజు స్వతంత్ర పాలకుడిగా క్రీస్తుశకం 575 నుండి క్రీస్తుశకం 600 వరకు
సుమారు 25 సంవత్సరాలు ఘూర్జర రాజ్యాన్ని పాలించాడు.
మొదటి దడ్డరాజు కుమారుడు జయభటరాజు. ఇతడు
తండ్రితో కలిసి అనేక యుద్ధాలు చేశాడు. ఇతడి పాలనాకాలం 15 సంవత్సరాలు (క్రీస్తుశకం
600-క్రీస్తుశకం 615). జయభటరాజు కుమారుడు రెండవ దడ్డరాజుతండ్రి అనంతరం బ్రోచ్
రాజ్య సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడి రాజ్యానికి ఉత్తరాన మహీనది, దక్షిణాన కిమ్, పడమర
సముద్రం, తూర్పున మాళవ, ఖాందేశ్ రాజ్యాలున్నాయి. నందిపురం ఈ వంశీయుల
రాజధాని. నందిపుర నగరమే బ్రోచ్ లేక భరుకచ్చం. రెండవ దడ్డరాజు నందిపుర రాజ్యాన్ని
క్రీస్తుశకం 615 నుండి క్రీస్తుశకం 635 వరకు 20 సంవత్సరాలు ప్రశాంతంగా పాలించాడు.
రెండవ దడ్డరాజు కాలం నుండి ఈ వంశీయులు
కాలచురి రాజ వంశీయులతో వైరం కలిగి వున్నారు. రెండవ దడ్డరాజు బాదామీ చాళుక్యుల
సామంతుడు. ఇతడు, ఇతడి వంశీయులు రెండవ పులకేశికి,
కాలచురి రాజులతో జరిగిన సంగ్రామాలలో సహాయపడ్డారు. కాలచురి రాజ్యాన్ని జయించిన
చాళుక్యులు ఆ రాజ్యాన్ని తమ రాజ్యంతర్భాగంగా గ్రహించారు. రెండవ దడ్డరాజు తరువాత
అతడి కుమారుడు రెండవ జయభట, అతడి వంశీయులైన మూడవ దడ్డరాజు, మూడవ జయభట, ఆహిరోల, నాలగవ జయభట
నందిపురి రాజ్యాన్ని పాలించారు.
(స్వర్గీయ
బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)
No comments:
Post a Comment