సీతాకల్యాణం
వనం జ్వాలా నరసింహారావు
భక్తి (ఆధ్యాత్మిక మాస) పత్రిక
(ఏప్రియల్ నెల 2024)
శ్రీరామలక్ష్మణులను
విశ్వామిత్రుడు మిథిలా నగరానికి తీసుకుని వెళ్లాడు. వారిని జనక మహారాజుకు పరిచయం
చేసి, శివ ధనుస్సును చూపించమన్నాడు. అయితే జనకుడు
ధనస్సును చూపించే ముందు సీత జన్మ
వృత్తాంతం చెప్పాడు. సీత వీర్యశుల్కనీ, తన దగ్గరున్న, శివ ధనుస్సును ఎక్కుపెట్టగలవాడికే అయోనిజైన
సీతను ఇచ్చి వివాహం చేస్తానని అన్నాడు. ఇంతవరకు తన దగ్గరకు వచ్చిన వారిలో ఎవరు కూడా ఆ విల్లు ఎత్తలేక
పోయారని చెప్పాడు. చివరిగా ధనుస్సును శ్రీరామ లక్ష్మణులకు
చూపించాడు జనకుడు.
శ్రీరాముడు, ధనుస్సుండే పెట్టె దగ్గరికిపోయి, దాని మూత తెరిచి చూశాడు. విశ్వామిత్రుడు ఆజ్ఞాపిస్తే బయటకు తీస్తానని, వింటిని ఎక్కుపెడతానని అన్నాడు. ఆయన అనుజ్ఞ ఇవ్వడంతో, రాముడు అవలీలగా వింటిని అరచేత్తో పట్టుకొని,
బయటకు తీసి, అల్లెతాటిని బిగువుగా లాగుతుంటేనే, విల్లు ఫెల్లుమని రెండుగా విరిగిపోయింది.
రామచంద్రమూర్తి భుజబలం చూసానని, సీతనిచ్చి తాను ధన్యుడవుతానని జనకుడు అన్నాడు. దానివల్ల తమ
జనక కులానికి కీర్తి సంపాదించిపెట్టినట్లయిందని కూడా విశ్వామిత్రుడితో చెప్పాడు. ఆ
తరువాత దశరథ మహారాజుకు కబురు చేయడం, ఆయన మందీమార్బలంతో మిథిలా నగరానికి రావడం జరిగింది. సీతా
రాముల కళ్యాణానికి ముందు ఇరు వంశాల వారు వంశ క్రమాలను
గురించి అడిగి తెలుసుకుంటారు.
పాణిగ్రహణం
కన్యను ఇచ్చుకొనేటప్పుడు, పుచ్చుకొనేటప్పుడు, అధమ పక్షం మూడు తరాల వంశ జ్ఞానం ప్రధానంగా తెలుసుకోకుండా
కన్యను ఇవ్వకూడదు, తీసుకొననూ కూడదు అనేది సనాతన
ఆచారం. వివాహంలో వధూవరుల వంశవృక్షం, నేపధ్యం, ప్రవర అవశ్యంగా
తెలియాలి. ధన ధాన్యాలు ఎంత
సమృద్ధిగా వున్నప్పటికీ, వివాహ విషయంలో ఇది ప్రధానమని శాస్త్రం చెపుతున్నది. ఇక ఆ తరువాత సీతా కళ్యాణ ఘట్టం
మొదలవుతుంది.
"సీతను సర్వాభరణో, పేతను దా నిలిపి నగ్ని కెదురుగ గౌస
ల్యా తనయున కభిముఖముగ, క్ష్మాతలనాథుండు రామచంద్రున కనియెన్"
అన్ని విధాలైన అలంకారాలతో ప్రకాశిస్తున్న సీతను, అగ్నికి ఎదురుగా, శ్రీరామచంద్రమూర్తికి అభిముఖంగా, నిలువబెట్టి, జనక మహారాజు శ్రీరామచంద్రమూర్తితో:
“ఈ సీత నాదుకూతురు, నీ సహధర్మచరి దీని నిం గై కొనుమా
కౌసల్యాసుత, నీకును భాసురశుభ మగు గ్రహింపు పాణిం బాణిన్"
‘కౌసల్యా కుమారా, ఈ సీత నా కూతురు. నీ సహధర్మచారిణి. ఈమెను పాణి గ్రహణం చేసుకో. నీకు జగత్ ప్రసిద్ధమైన మేలు కలుగుతుంది.
నీకు శుభం కలుగుతుంది. మంత్రపూర్వకంగా
ఈమె చేతిని నీ చేత్తో పట్టుకో. రామచంద్రా, పతివ్రత, మహా భాగ్యవతి అయిన నీ సీత, నీ నీడలా ఒక్కసారైనా నిన్ను విడిచి వుండదు’ అని అంటూ,
మంత్రోచ్ఛారణతో పవిత్ర జలధారలను రామచంద్రమూర్తి చేతుల్లో జనక మహారాజు
ధారపోశాడు. తరువాత, జనక మహారాజు లక్ష్మణుడివైపు చూసి, ‘లక్ష్మణా ఇటురా. కన్యాదానంగా ఊర్మిళను స్వీకరించు. ప్రీతిపూర్వకంగా
ఇస్తున్నాను’ అని కోరాడు. ఆ తర్వాత, భరతుడికి మాండవిని, శత్రుఘ్నుడికి శ్రుతకీర్తిని కన్యాదానం చేశాడు జనకుడు. ఇలా
నలుగురు కన్యలను దశరథుడి నలుగురు కొడుకులకు కన్యధారపోసాడు జనకుడు.
రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు, తండ్రి అనుమతితో అగ్నికి, వేదికి, మౌనీశ్వరులందరికి, రాజులకు భార్యలతో కలిసి,
వారి చేతులను తమ చేతుల్లో వుంచుకొని, ప్రదక్షిణ చేసారు. వివాహం శాస్త్ర ప్రకారం ప్రసిద్ధంగా జరిగింది. పూల
వాన కురిసింది. ఆకాశంలో దేవ
దుందుభులు ధ్వనించాయి. దేవతా స్త్రీలు నాట్యం చేసారు. గంధర్వ కాంతలు పాడారు. రావణాసురుడి భయం వీడి, సందుల్లో, గొందుల్లో దాక్కున్న వారందరు నిర్భయంగా, గుంపులుగుంపులుగా ఆకాశంలో నిలిచారు. మంగళ వాద్యాలు మోగుతుంటే పెళ్లి తంతు ముగిసింది.
జనకుని మనసు
సీతా
కల్యాణ ఘట్టం చదివినవారికి చర్చకు వచ్చే కొన్ని విషయాలున్నాయి. కన్యాదానం చేస్తూ
జనకుడు రాముడిని ‘కౌసల్యా సుత’ అని సంబోధించాడు. రామా అని కాని, దశరథ కుమారా
అని కాని అనలేదు. రామా అని పిలిస్తే ఆ
పేరుకలవారు మరొకరు కావచ్చు. దశరథ కుమారా అంటే నలుగురు కొడుకుల్లో వేరొకరు కావచ్చు.
కౌసల్యా కుమార అంటే ఏవిధమైన సందేహానికి తావుండదు. ‘ఈ సీత’ అంటాడు జనకుడు రాముడితో. సిగ్గుతో సీత తన చేయి పట్టుకొమ్మని, తనంతట తానే రాముడిని అడగదు. అందుకే జనకుడు తానే సీతచేతిని రామచంద్రమూర్తికి చూపి ‘ఈ సీత’ అని చెప్పాడు.
సాక్షాత్తు లక్ష్మీదేవైన సీతను రాముడికి ఇస్తున్నాననే అర్థమొచ్చే
విధంగా 'ఈ సీత' అన్నాడు. సీత నాగటి చాలులో దొరికినప్పటికీ జనకుడు సగర్వంగా,
'నాదుకూతురు' అని చెప్పాడు. నీ ‘సహధర్మచరి’ అనడమంటే, రాముడేది ధర్మమని భావిస్తాడో, ఆ ధర్మమందే ఆమె ఆయనకు తోడుగా వుండి ఆ కార్యాన్ని నిర్వహిస్తుంది. రాముడు తండ్రి
వాక్యాన్ని ఎలా పాలించాడో, అలానే ఆయన వాక్యాన్ని సీత పాలిస్తుందని అర్థం. సీతే లక్ష్మీదేవి అయినందువల్ల, విష్ణువు అవతారమైన రాముడి కైంకర్యమే ఆమె స్వరూపం.
అనసూయకు చెప్పిన కథ
తన కళ్యాణ వివరాలను
సాక్షాత్తూ సీతాదేవే అత్రి మహాముని భార్యైన, అనసూయాదేవికి
వివరించింది. అరణ్యవాసంలో
భాగంగా చిత్రకూటం నుండి సీతాలక్ష్మణ సమేతంగా బయల్దేరిన శ్రీరాముడు
అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకుని, ఆయనకు, ఆయన
భార్య సతీ అనసూయాదేవికి సీతాదేవిని పరిచయం చేశాడు. సీత పుణ్యచరిత్రదని, పాతివ్రత్యమే
గొప్పదిగా భావించి, చుట్టాలను, సంపదను, సౌఖ్యాన్ని వదిలి, మహారాజు కోడలినని కాని, మహారాజు కూతురునని కాని లక్ష్యపెట్టకుండా, తండ్రిని
యదార్థవాదిని చేయాలన్న
ఉద్దేశంతో అడవికి భర్తతో వచ్చిందని, ఆమెలాంటి
స్త్రీలు అరుదని, కొనియాడింది అనసూయ.
శ్రీ రామచంద్రమూర్తి తన పరాక్రమంతో స్వయంవరంలో సీతను పెళ్లి చేసుకున్నాడని
వినడమే కాని, అదెలా జరిగిందో వివరంగా వినలేదని,
అ కథ వినాలని వుందని, జరిగినదంతా వివరంగా చెప్పమని అనసూయ సీతను అడిగింది. జవాబుగా సీతాదేవి, తన తండ్రి జనకుడు విదేహ దేశానికి రాజని,
ఒకనాడు యజ్ఞం చేయడానికి నేల దున్నిస్తుంటే
నాగేటి కర్రు తగిలి నేల పెళ్లలు లేచివచ్చి తాను భూమిలోనుండి బయటకు వచ్చానని,
అప్పుడు జనకుడు తనను చూసి ఆశ్చర్యపడి,
తన పెద్ద భార్యకు ఇచ్చాడని చెప్పింది. ఆమె తన్ను తన కన్నబిడ్డలాగా చూసుకుని పెంచిందని,
తనకు వివాహయోగ్య దశ రావడం గమనించిన
తల్లిదండ్రులు తనకు భర్తగా తగిన వాడిని, సద్గుణ సంపత్తికలవాడిని, గొప్పవాడిని, మన్మథాకారుడిని సంపాదించాలని జనకుడు వెతికాడు కాని ఎవరూ
దొరకలేదని, అప్పుడు స్వయంవరం చాటిస్తే బాగుంటుందని ఆలోచనచేశాడని
సీతాదేవి అనసూయకు చెప్పింది.
‘ఈ ప్రకారం
ఆలోచించి, తాను చేసిన ఒక గొప్ప యజ్ఞంలో వరుణుడు తనకు ఇచ్చిన మనుష్యులు
కదిలించ సాధ్యపడని వింటిని, రాజులు కలలో కూడా ఎక్కుపెట్టలేని వింటిని,
అక్షయబాణాలను, రాజులందరికీ చూపించాడు జనకుడు. ఆ విల్లెక్కుపెట్టిన వాడు తన
కూతురుకు భర్త కాగలడని ప్రకటించాడు. అక్కడికి వచ్చిన
రాజులు దానిని ఎత్తలేక, చూడగానే భయపడి, దానికి ఒక నమస్కారం చేసి పోయారు. చాలాకాలం ఇలాగే గడిచి పోయింది.
రాజకుమారులెవరూ దానిని ఎక్కుపెట్టలేక
పోయారు. చివరకు విశ్వామిత్రుడితో వచ్చిన శ్రీరామచంద్రుడు ఆ పని చేసి తనను వివాహం
చేసుకున్నాడు’ అని
చెప్పింది సీత.
సీతాకల్యాణ తిథి
శ్రీరామవతారం వైవస్వత మన్వంతరంలో ఐదవ
మహాయుగమైన త్రేతాయుగంలో సంభవించింది. కొడుకులకై దశరథుడు పుత్రకామేష్టి చేయగా శ్రీరామ జననం అయింది. జన్మించింది విలంబినామ సంవత్సరం కాబట్టి
హేవిలంబిలో అశ్వమేధయాగం, పుత్రకామేష్టి చేశాడు. దుర్ముఖి చైత్రమాసంలో అశ్వం విడిచారు. శ్రీరాముడి జనన కాలంలో గురువు, చంద్రుడు, కర్కాటక లగ్నంలో వున్నారు. అంటే జన్మ లగ్నం కర్కాటకం కాగా, మేషంలో రవి, బుధులు, తులలో శని, మకరంలో కుజుడు, మీనంలో శుక్రుడు వున్నారు. పునర్వసువు
నక్షత్రంలో బుధవారం నాడు శ్రీరామజననం. చైత్ర బహుళ పంచమి నాడు నామకరణం జరిగింది. పరాభవ సంవత్సరంలో తొమ్మిదో ఏట ఉపనయనం జరిగింది. శ్రీరాముడికి 12 ఏళ్ల వయసున్నప్పుడు, సౌమ్యనామ సంవత్సరంలో యాగరక్షణ కొరకు విశ్వామిత్రుడి వెంట అరణ్యాలకు పోయాడు. అరణ్యవాసానికి పోయేటప్పుడు శ్రీరాముడికి 25 సంవత్సరాలు కాగా, సీతాదేవికి 18 సంవత్సరాలు.
శ్రీరాముడికి 12 సంవత్సరాల
వయసున్నప్పుడు, సీతకు ఆరేళ్ళ వయసులో వారి వివాహం జరిగింది. దీనికి దృష్టాంతరంగా విశ్వామిత్రుడి యాగం కాపాడడానికి రామలక్ష్మణులు వెళ్లిన రోజు నుంచి మిథిలా నగరం వెళ్లడం వరకు తీసుకోవచ్చు.
సౌమ్యనామ సంవత్సరం మాఘబహుళ విదియ నాడు శ్రీరామలక్ష్మణులు
విశ్వామిత్రుడి వెంట పోయారు. హస్త పోయి చిత్రా
నక్షత్రం ప్రవేశించడంతో, ఆ రోజు ప్రయాణానికి మంచి రోజే కాకుండా అది శ్రీరాముడికి ధృవతార కూడా. 15 వ నాటి ఉదయం మిథిలా ప్రవేశం చేసి, శివ ధనుర్భంగం చేశాడు. 27 వ రోజున ఫాల్గున శుద్ధ శుక్ల త్రయోదశి శుభ దినం కాబట్టి, ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో, శుభదినమైన శుక్ల త్రయోదశి నాడు సీతారాముల కల్యాణం జరిగింది అని ఆంధ్రవాల్మీకి
వాసుదాస స్వామి ‘ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం చెబుతోంది.
No comments:
Post a Comment