తూర్పు కదంబ వంశం, మైత్రక వల్లభి రాజవంశం
(బ్రాహ్మణ
రాజులు-19, 20)
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(29-04-2024)
తూర్పు
కదంబ వంశం
తూర్పు కదంబ వంశరాజులు కళింగ కాదంబులుగా వ్యవహరించబడినారు. వీరు కళింగ
సామ్రాజ్యంలోని ఒక భాగాన్ని ఏలారు. కదంబ రాజవంశీయులు నేటి బెల్గాం, ధార్వార్ జిల్లాలను వైజయంతి, బనవాసి రాజ్యాలుగా పాలించారు. ఈ కదంబ రాజులను
పశ్చిమ కదంబ వంశీయులు అనేవారు. కళింగ దేశంలోని భాగాలు పాలించిన వారిని తూర్పు
కదంబులనీ, కళింగ కదంబులనీ పిలిచేవారు. వీరు కళింగ గాంగ వంశపు రాజుల సామంతులు.
ఇప్పటికీ అనేక కదంబ కుటుంబాలవారు గంజాం మండలంలో వున్నారు. మరికొందరు కటక్ రాజస్వ
విభాగంలో నివసిస్తున్నారు.
తూర్పు కదంబ వంశీయులు తొలుత గంగానదీ
మైదాన ప్రాంతంలో వుండేవారు. వారు క్రమంగా కళింగానికి వచ్చి స్థిర నివాసం
ఏర్పరుచుకున్నారు. క్రీస్తుశకం తొలి శతాబ్దంలో వీరి వలస ప్రారంభం అయింది. ఇకపోతే
పశ్చిమ కదంబులు లేక వనవాసీ కదంబులు నేటి తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లా కందూరు
గ్రామ వాస్తవ్యులు. కదంబ వృక్షాన్ని పూజించేవారు. వీరిలో సంపన్న బ్రాహ్మణ
కుటుంబంలో జన్మించిన మయూరశర్మ సంతతి వారు కదంబ రాజ్యాన్ని అతి వైభవోపేతంగా
పాలించి, వాకాటక, గుప్తవంశపు
రాజులతో వైవాహిక సంబంధాలను ఏర్పరుచుకొని ప్రబల శక్తి సమన్వితులై వుండేవారు.
తొలుత తూర్పు కదంబులు మగధ రాజ్య భాగాన్ని
పాలిస్తూ కళింగానికి వలస వచ్చి స్థిరపడ్డారు. అలా స్థిరపడిన కదంబులు శివపూజా
దురంధరులు. కదంబ వృక్షాల వల్లే ఈ వంశీయులను కదంబులు అని పిలిచారు. కాదంబులు మత్స్య
వంశీయులు. బహుశా అలనాటి విరాటరాజు వంశానికి చెందిన వారై వుండవచ్చు. తూర్పు కదంబ
వంశీయులు ప్రాచీన అర్వాచీన గాంగ వంశపు రాజుల సామంతులుగాను, బందువులుగాను వర్దిల్లారు. పశ్చిమ కదంబ వంశీయులు
ఏ విధంగానైతే పశ్చిమ గాంగ వంశపు రాజులతో సత్సంబంధాలు కలిగి వున్నారో, అలాగే తూర్పు కదంబ వంశీయులు తూర్పు గాంగ వంశపు
రాజులతో సంబంధ బాంధవ్యాలు కలిగి వుండేవారు.
తూర్పు కదంబ వంశీయులు ఖేతపురం రాజధానిగా
కళింగ గాంగ వంశపు రాజుల సామంతులుగా, కళింగావనిలోని
ఒక భాగాన్ని పాలించారు. తూర్పు కదంబ వంశీయులు వేద విద్యలను ప్రోత్సహించి అనేక
దేవాలయాలను నిర్మించారు. వేదవేదాంగేతిహాసాలను అభ్యసించారు. నాగఖేడి కదంబ వంశీయుడు.
గాంగ సామ్రాజ్యంలో ఉన్నత పదవిలో నియమించబడ్డాడు. ధర్మఖేడి తండ్రి భీమఖేడి. తాత
నియర్ణవ. జయంతీపురం ధర్మఖేడి నివాసం. అతడికి అనేక బిరుదులున్నాయి.
తూర్పు కదంబ రాజ వంశీయుల శాసనాలు వారు
మహేంద్రగిరి ప్రాంతాన్ని పటిష్టపరిచి పాలించినట్లు తెలియచేస్తున్నాయి. కదంబ రాజ
వంశీయులు గాంగ వంశపు రాజుల విదేయ సామంతులుగానే కాకుండా వారి సేనానాయకులుగానూ, మంత్రులుగానూ వ్యవహరించారు. గాంగ వంశపు రాజులు
కదంబ రాజ కుమారుల మీద సంపూర్ణంగా రాజ్య రక్షణా బాధ్యతలను మోపినారు. కళింగ దేశంలో
గాంగ శకంతో పాటు కదంబ శకం కూడా వ్యాప్తిలోకి వచ్చింది.
గాంగ వంశపు రాజులలాగానే కదంబులు కళింగ
దేశంలో రాజ్యాన్ని స్థాపించుకుని, వైదిక మతాన్ని
ఉద్ధరిస్తూ, బ్రాహ్మణులకు, దేవాలయాలకు,
విద్యాసంస్థలకు అనేక అగ్రహారాలను ఇస్తూ తమ ప్రభు భక్తిని, దైవ భక్తినీ చాటుకున్నారు. చిన్న-చిన్న
రాజ్యాలను స్థాపించుకున్న ఈ వంశపు రాజులు, కాకతీయులు కళింగ రాజ్యాన్ని జయించిన
తదుపరి వారి సామంతులుగా స్వీకరించబడినారు.
మైత్రక వల్లభి
రాజవంశం
గుప్త
సామ్రాజ్య పతనానంతరం భారత ఉత్తర భాగాలలోనూ, పశ్చిమ
తీరంలోనూ, దక్షిణాపథ, దక్షిణ భారతంలోనూ, అనేక స్వతంత్ర
రాజ్యాలు స్థాపించబడ్డాయి. ఈ రాజ్యాలన్నీ చిన్నవి. ఒకటి-రెండు మాత్రం గొప్ప
రాజ్యాలుగా వర్ధిల్లాయి. ఈ రాజవంశాల వారు ఒకరితో మరొకరు కలహించుకుంటూ, తమ తమ రాజ్య
విస్తరణ కాంక్షలో భాగంగా చివరకు పతనమయ్యారు. ఈ రాజ వంశాల వారిలో వల్లభీలు, కదంబులు, ఘూర్జరులు, మౌఖరులు, కామరూప
పాలకులు,
తదితరులున్నారు.
ఇదిలా వుండగా, వల్లభి నగరాన్ని రాజధానిగా పాలించినవారు వల్లభి
రాజవంశీయులు. వీరు గుప్తరాజుల సేనానులుగా వుండేవారు. ఈ వంశానికి ఆజ్యుడు
భట్టారకుడు. ఇతడు గుప్త సామ్రాజ్యంలో సేనానాయకుడిగా వుండి, ఆ రాజ్య పతనావస్థ
కాలంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. భట్టారకుడు మైత్రక వంశ సంజాతుడు. ఈ
వంశీయులు బ్రాహ్మణులు, భట్టారకులు.
భట్టారకుడు శక్తి సమన్వితుడు. తన పరిధిలో వున్న రాజ్యాన్ని అతడు గుప్త రాజుల
ప్రతినిధిగా పాలించాడు. అతడి పాలన క్రీస్తుశకం ఐదవ శతాబ్ది ఉత్తరార్ధం వరకు
సాగింది. భట్టారకుడి తరువాత అతడి కుమారుడు ధారసేనుడు సింహాసనానికి వచ్చాడు.
ధారసేనుడి సోదరుడు ద్రోణసింహుడు మైత్రక వల్లభి వంశంలో మూడవ రాజు. మహారాజు బిరుదం
వున్నవాడు. ద్రోణసింహుడి సోదరుడు ధ్రువసేనుడు వల్లభి రాజ్యాన్ని స్వతంత్రంగా
పాలించాడు. ఇతడిని కూడా మహారాజుగా పేర్కొన్నారు చారిత్రకారులు.
వల్లభి నగరం మైత్రక వంశీయుల రాజధానీ
నగరం. ఈ రాజ వంశీయుల శాసనాలన్నీ వల్లభి నగరం నుండే ప్రకటించబడ్డాయి. వీరు వల్లభిని
ఎప్పుడు రాజధానిగా చేసుకున్నారో ఆధారాలు లేవు. బహుశా సురక్షిత నగరమైన వల్లభిని
మైత్రక వంశీయులు తమ రాజధానిగా చేసుకొని వుండవచ్చు. వల్లభి రాజ్యం ఎలా అభివృద్ధి
చెందినదో ఆధారాలు లేకపోయినప్పటికీ, అది
సౌరాష్ట్రంలో ప్రబలమైనదిగా కీర్తించబడినది. వల్లభీపుర ప్రాంతం భావనగర్
రాష్ట్రంలోని తూర్పు కథియావాడ్ కు చెందినది.
మొదటి ధ్రువసేనుడు ప్రబల శక్తి
సమన్వితుడు. అతడు వల్లభీ రాజ్యాన్ని అతి వైభవంగా 20 సంవత్సరాలు పాలించాడు.
వల్లభీరాజులలో ఇతడు నాల్గవవాడు. వంశ స్థాపకుడైన భట్టారకుడికి నలుగురు కొడుకులు.
వారు ఒకరి తరువాత మరొకరు వల్లభీరాజ్యాన్ని పాలించారు. వారిలో మొదటి ధారసేనుడు జ్యేష్టుడు.
రెండవవాడు ద్రోణసింహుడు. మూడవ కుమారుడు ధ్రువసేనుడు. నాల్గవ వాడు ధారపట్ట.
ధ్రువసేనుడు వల్లభి రాజ్యాన్ని క్రీస్తుశకం 525 నుండి క్రీస్తుశకం 545 వరకు
పాలించాడు. అతడి తరువాత సోదరుడు ధారపట్ట క్రీస్తుశకం 545 నుండి క్రీస్తుశకం 559
వరకు 14 సంవత్సరాలు పాలించాడు.
ధారపట్ట మహారాజు కుమారుడు గుహసేనుడు
ప్రతిభావంతుడు. తండ్రి తరువాత వల్లభి రాజ్యపాలనా బాధ్యత వహించి సుమారు 8
సంవత్సరాలు పాలించాడు. ఇతడు స్వతంత్రంగా వల్లభి రాజ్యాన్ని పాలించాడు. వల్లభి
వంశంలో మహారాజుగా పేరుగాంచిన గుహసేనుడి కుమారుడు రెండవ ధారసేనుడు తండ్రి అనంతరం
క్రీస్తుశకం 567 లో సింహాసనం అధిష్టించాడు. ఇతడు కూడా పరాక్రమవంతుడే. గురులక
వంశీయుడైన సింహాదిత్యుడు ఇతడి సామంతుడు. రెండవ ధారసేనుడు వల్లభి రాజ్యాన్ని
విస్తరించాడు ఇతడు క్రీస్తుశకం 590 వరకువరకు సుమారు 23 సంవత్సరాలు పాలించాడు.
రెండవ ధారసేనుడి పెద్ద కుమారుడు
కరగ్రహుడు తండ్రి తరువాత క్రీస్తుశకం 590 నుండి 606 వరకు 16 సంవత్సరాలు ప్రశాంతంగా
పాలించాడు. మైత్రిక వంశంలో ప్రసిద్ధికెక్కిన వల్లభి పాలకులలో మొదటి శిలాదిత్యుడు
ప్రముఖుడు. అతడు రెండవ ధారసేనుడి రెండవ కుమారుడు. కరగ్రహుడి సోదరుడు. రెండవ
ధ్రువసేనుడు, శిలాదిత్యుడి అనంతరం వల్లభి రాజ్యాన్ని క్రీస్తుశకం 640 వరకు
పాలించాడు. శిలాదిత్యుడి పాలనాకాలం క్రీస్తుశకం 606 నుండి క్రీస్తుశకం 612, సుమారు
6 సంవత్సరాలు.
శిలాదిత్యుడి అనంతరం వల్లభి రాజ్యం
క్షీణించ సాగింది. ఇతడి సోదరుడు మొదటి కరగ్రహుడికి ఇద్దరు కుమారులు. వారిలో మూడవ
ధారసేనుడు మొదటివాడు. అతడు పినతండ్రి శిలాదిత్యుడి మరణానంతరం వల్లభి రాజ్య
సింహాసనం అధిష్టించి, క్రీస్తుశకం
612 నుండి క్రీస్తుశకం 624 వరకు 12 సంవత్సరాలు పాలించాడు. మూడవ ధారసేనుడి సోదరుడు
రెండవ ధ్రువసేనుడు. అతడు క్రీస్తుశకం 624 లో రాజై,
క్రీస్తుశకం 640 వరకు సుమారు 16 సంవత్సరాలు పాలన చేశాడు. ఇతడి కుమారుడు నాల్గవ
ధారసేనుడు తండ్రి అనంతరం వల్లభి పాలకుడు అయ్యాడు. నాల్గవ ధారసేనుడి అనంతరం రెండవ
కరగ్రహుడు, రెండవ
శిలాదిత్యుడు వల్లభి రాజ్యాన్ని ఏలారు. రెండవ శిలాదిత్యుడి తరువాత అతడి కుమారుడు
మూడవ శిలాదిత్యుడు వల్లభి రాజ్యాన్ని పాలించాడు. ఇతడితో గుప్తరాజుల సేనాపతి
భట్టారకుడు స్థాపించిన మైత్రక వల్లభి రాజ్యం అంతరించి పోయింది.
(స్వర్గీయ
బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)
No comments:
Post a Comment