వాల్మీకి సంస్కృత రామాయణంలో శ్రీరాముడు
వనం
జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ
దినపత్రిక చింతన కాలమ్ (శ్రీరామనవమి, (17-04-2024)}
శ్రీ
రామాయణం భారతీయ సంస్కృతీ, సనాతన ధర్మ ప్రతిరూపం, దీని మౌలిక
తత్వాలు, ధర్మ, జ్ఞానాలు. రెండింటినీ వాచ్య-వ్యంగార్థాలతో శ్రీ మద్రామాయణం ఆవిష్కరిస్తోంది. వాల్మీకి
ఆదికవి. రామాయణం ఆదికావ్యం. ఇది ధ్వని,
అర్థ ప్రతిపాదిత మహా మంత్రపూతం. గాయత్రీ బీజసంయుతం. ఔపనిషతత్వసారం. స్మరణ, పారాయణ మాత్రంగా అంతఃకరణ
శుద్ధి అవుతుంది. కావ్యాలలో అగ్రస్థానంలో నిలిచిన వాల్మీకి
సంస్కృతంలో రచించిన శ్రీమద్రామాయణంలో నాయిక సీతా దేవి. నాయకుడు
శ్రీరామచంద్రమూర్తి.
వాల్మీకిదొక విలక్షణమైన శైలి. ఏ విషయాన్నీ ఒకేచోట సంపూర్ణంగా చెప్పడు. ఒక
విషయాన్నే రెండు, మూడు సందర్భాల్లో చెప్పాల్సి వస్తే, అక్కడ
కొంచెం, అక్కడ కొంచెం చెప్తాడేకాని, మొదట్లోనే అంతా చెప్పడు. ఒక సందర్భంలో వనవాసానికి వచ్చేటప్పటికి శ్రీరాముడికి 25 సంవత్సరాలని చెప్పాడు. అంటే, వనవాసం వెళ్ళేటప్పుడు 25
సంవత్సరాలనీ, విశ్వామిత్రుడి వెంట పోయేటప్పుడు
12 సంవత్సరాలనీ అనుకోవాలి. పన్నెండో
నెలలో శ్రీరాముడి జననం, పన్నెండో ఏట విశ్వామిత్రుడితో
వెళ్ళడం, పన్నెండేళ్లు అయోధ్యా వాసం, పద్నాలుగేళ్లు
అరణ్యవాసం, పన్నెండేళ్లు సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో నివాసం.
ఈ పరంపరలోనే సీతారాముల కల్యాణం ఎప్పుడు జరిగిందో రాస్తాడు వాల్మీకి.
ఆంధ్రవాల్మీకి,
కవిసార్వభౌమ వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం మందరం,
అయోధ్యాకండ చివర్లో శ్రీరాముడి దినచర్య గురించి వివరించారు. సాధువులను
రక్షించడానికి, పాపాత్ములను నాశనం చేయడానికి, ధర్మ స్థాపన కొరకు, ప్రతియుగంలో
శ్రీమన్నారాయణుడు భూమ్మీద అవతరిస్తుంటాడు.
{ఈ
అవతారాలే మళ్లీ, మళ్లీ పునరావృతమవడం వల్ల, ఇప్పటికి ఎన్ని మత్స్యావతారాలు,
నృసింహావతారాలు, శ్రీరామావతారాలు, కృష్ణావతారాలు అయ్యాయో చెప్పడం కష్టం. మళ్లీ,
మళ్లీ అవతారాలు వచ్చినప్పుడు, వారితో పాటే మళ్లీ-మళ్లీ హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు,
బలిచక్రవర్తి, రావణ, కుంభకర్ణులు, కంస, శిశుపాలులు లాంటి వారు కూడా రావాలికదా?
వారు వచ్చినప్పుడు వారి సహాయకులు, సహచరులు, తల్లిదండ్రులు, అవతార పురుషుడికి
కావాల్సినవారు రావాలి కదా? అలాంటప్పుడు పరిణామవాదం తప్పవుతుంది కదా? అలాగే ముక్తి,
జన్మరాహిత్యం అనే పదాలు వ్యర్తమైనవే కదా?
అవతారాలు రావడం నిజమే. వారికి
కావాల్సినవారు, విరోధులు రావడం కూడా నిజమే. బ్రహ్మేంద్రాదులు, అష్టదిక్పాలకులు,
సూర్యచంద్రులు, సప్తర్షులు, అందరూ పుట్టడం యదార్థమే. అయినా పరిణామ వాదం తప్పుకాదు.
ముక్తి అనేది వ్యర్థపదం కానేకాదు. బ్రహ్మ, రుద్ర, అగ్ని, వరుణుడు...లాంటి పదాలన్నీ
ఆయా పదవుల పేర్లే కాని ఆ ఉపాధిలో వుండే జీవాత్మల పేర్లు కావు. కలెక్టర్, డిప్యూటీ
కలెక్టర్, తహసీల్దార్ అనే పదవుల్లో వుండేవారు మళ్లీ-మళ్లీ వచ్చారంటే, అదే మనిషి
వచ్చాడని అర్థం కాదు. అలాగే బ్రహ్మ, రుద్ర, అగ్ని, వరుణుడు అనే పదవుల్లో వున్నవారు
పోగానే, ఆ స్థానం ఖాళీ కాగానే, మరో అర్హుడు ఆ స్థానంలో నియమించబడుతాడు. వాడి
ఉద్యోగం వాడు చేస్తాడు. ఇలా వచ్చేవాడు భిన్న జీవుడే కాని ఇంతకు ముందు వున్నవాడు
కాదు. కాబట్టి పరిణామ వాదానికి ప్రాణ భయం లేదు.....ముక్తుడికి పునర్జన్మ భయం లేదు.
ఒక స్థానంలో రెండు జీవులుండవు. జీవయాత్రా విషయంలో పరిణామమే సరైన మార్గం.
బ్రహ్మాండకోటులు అనంతం. జీవకోటులూ
అనంతమే. ప్రపంచం నిత్యం. సంసారం నిత్యం. కాలం నిత్యం. నది ఒడ్డున నిలుచుని
చూస్తుంటే నీళ్లు, నీటి బిందువులు దాటిపోతూనే వుంటాయి. వాటి స్థానంలో మరికొన్ని
వస్తాయి. ఒక నీటి బిందువు సముద్రంలో ప్రవేశించగానే ఆద్యంతాలలో శూన్య స్థానం
లేనట్లే, జీవుడు ముక్తుడు కాగానే ఆ స్థానంలో కాని, ఆదిలో కాని, శూన్యం వుండదు.}
శ్రీరామ
జననం వైవస్వత మన్వంతరం, త్రేతాయుగంలో జరిగింది. కొడుకులకై దశరథుడు హేవిలంబినామ
సంవత్సరంలో అశ్వమేధ, పుత్రకామేష్టి యాగాలు చేశాడు. దుర్ముఖి సంవత్సరం చైత్రమాసంలో
అశ్వం విడిచారు. విలంబినామ సంవత్సరంలో శ్రీరామ జననం. మహారాజు పుత్రకామేష్ఠి యాగం చేస్తుండగా, అగ్నిహోత్రం మధ్యనుండి ప్రాజాపత్య మూర్తి బంగారు పాత్రతో వచ్చి, దానిని
ఆయనకిచ్చి, అందులోని పాయసాన్ని భార్యలతో తాగించమని చెప్పాడు.
పాయసం తాగిన భార్యలు గర్భవతులయ్యారు. పన్నెండో నెలలో, (విలంబి)
చైత్ర మాసం, శుక్లపక్షం, నవమి తిథి నాడు, పునర్వసు
నక్షత్రంలో, అభిజిల్లగ్నం, కర్కాటక లగ్నంలో, చంద్రుడిని కూడిన బృహస్పతి కలిగిన బుధవారం ఉదయాన, దశరథుడి జ్యేష్ట భార్య కౌసల్యాదేవి
శ్రీమహావిష్ణువు అర్థాంశమూర్తి, శుభ లక్షణాల రఘువంశ వర్ధనుడిని, శ్రీ రాముడికి జన్మనిచ్చింది. శ్రీరాముడి జన్మ లగ్నం కర్కాటకం కాగా,
మేషంలో రవి, బుధులు, తులలో శని, మకరంలో కుజుడు, మీనంలో శుక్రుడు వున్నారు. శ్రీరామజననం
తరువాత, భరతుడు గురువారం పుష్యా నక్షత్రంలోను,
లక్ష్మణ-శత్రుఘ్నులు శుక్రవారం ఆశ్లేషా నక్షత్రంలోనూ జన్మించారు.
చైత్ర
బహుళ పంచమి నాడు శ్రీరామలక్ష్మణ భరతశత్రుఘ్నులకు నామకరణం జరిగింది. పరాభవ
సంవత్సరంలో తొమ్మిదో ఏట ఉపనయనం జరిగింది. శ్రీరాముడికి 12 ఏళ్ల వయసున్నప్పుడు,
సౌమ్యనామ సంవత్సరంలో యాగరక్షణ కొరకు విశ్వామిత్రుడి వెంట అరణ్యాలకు పోయాడు.
అరణ్యవాసానికి పోయేటప్పుడు శ్రీరాముడికి 25 సంవత్సరాలని, సీతాదేవికి 18 సంవత్సరాలని, మారీచుడు రావణాసురుడితో
సీతాపహరణం ముందర చెప్పినట్లు రామాయణంలో వుంది. శ్రీరాముడికి 12 సంవత్సరాల, సీతకు
ఆరేళ్ళ వయసులో వారి వివాహం జరిగింది. దీనికి దృష్టాంతరంగా విశ్వామిత్రుడి యాగం
కాపాడడానికి రామలక్ష్మణులు వెళ్లిన రోజు నుంచి మిథిలా నగరం వెళ్లడం వరకు
తీసుకోవచ్చు. సౌమ్యనామ సంవత్సరం మాఖ బహుళంలో శ్రీరామలక్ష్మణులు విశ్వామిత్రుడి
వెంట పోయారు. 15వ నాటి ఉదయం మిథిలా ప్రవేశం చేసి, శివ ధనుర్భంగం చేశాడు. 27 వ
రోజున శుక్ల త్రయోదశి శుభ దినం కాబట్టి, ఉత్తర ఫల్గుణీ
నక్షత్రంలో సీతారాముల కల్యాణం జరిగింది. ఉత్తర ఫల్గుణీ నక్షత్రం శ్రీరాముడి జన్మ
నక్షత్రానికి ఆరవది.
27
వ రోజు ఫాల్గున శుద్ధ త్రయోదశి అయితే, అయోధ్య నుండి బయల్దేరిన రోజు మాఘబహుళ విదియ
కావాలి. విదియ, హస్తా రోజు ప్రయాణానికి మంచి రోజే. అది శ్రీరాముడికి ధృవతార కూడా
అవుతుంది. కాబట్టి ఆ రోజున హస్త పోయిన తరువాత అభిజిల్లగ్నంలో ప్రయాణమై వుండాలి.
సీతారాముల కళ్యాణమైన తరువాత, అంటే, బహుళ విదియతో ముగిసి, తదియనాడు జనకుడు బిడ్డలకు
అరణాలిచ్సిన తరువాత, చవితినాడు అప్పగింతలై, ఫాల్గుణ బహుళపంచమి నాడు అయోధ్యకు
ప్రయాణమయ్యారు. షష్టి, సప్తముల్లో పరశురాముడి గర్వభంగమైంది. దశమినాడు అయోధ్య
ప్రవేశం జరిగింది. ఆ తరువాత 12 సంవత్సరాలు సుఖసంతోషాలతో అయోధ్యలో గడిపారు.
దుందుభి
నామ సంవత్సర చైత్ర శుద్ధ పంచమి నాటి ఉదయం పుష్యా నక్షత్రంలో దశరథుడు, శ్రీరాముడికి
యౌవరాజ్య పట్టాభిషేకం జరిపించాలని నిర్ణయించాడు. మరో రకంగా చెప్పాలంటే, చైత్ర
శుద్ధ పంచమే వనవాసారంభమైన రోజు. మర్నాడు గంగాతీర వాసం, ఆ మర్నాడు గుహుడి దర్శనం.
అయోధ్య విడిచిన మూడో రోజు సప్తమినాడు జడలు ధరించడం, నాలుగోనాడు అష్టమి రోజున
భరద్వాజాశ్రమం వెళ్లడం జరిగింది. ఐదవనాడు నవమిన యమున దాటారు. ఆరవనాడు దశమి రోజున
చిత్రకూటమి వెళ్లి వాల్మీకి దర్శనం చేసుకుని, పర్ణశాల నిర్మించుకున్నారు. అదే
రోజున అక్కడ అయోధ్యలో దశరథుడు మరణించాడు.
శ్రీరాముడు
అయోధ్య విడిచిన 17 వ రోజున భరతుడు అక్కడికి చేరుకున్నాడు. మర్నాడు తండ్రికి కర్మలు
ప్రారంభించాడు. 29 వ రోజున కర్మకాండలన్నీ పూర్తయ్యాయి. మర్నాడు 30 వ రోజున వైశాఖ
శుద్ధ చవితినాడు రాజకర్తలు భరతుడిని రాజ్యభారం వహించమని కోరారు. 31 వ రోజున పంచమి
నాడు సభకు వచ్చిన భరతుడిని వసిష్ఠుడు పట్టాభిషేకం చేసుకొమ్మని అడిగాడు. భరతుడు
తిరస్కరించాడు. వైశాఖ శుద్ధ షష్టి రోజున భరతుడు చిత్రకూటానికి బయల్దేరాడు. అదే
రోజున గుహుడిని కలిశాడు. మర్నాడు సప్తమినాడు జడలు ధరించాడు. భరద్వాజుడి విందు
స్వీకరించాడు.
34
వ రోజున, వైశాఖ శుద్ధ అష్టమి నాడు, చిత్రకూటానికి బయల్దేరి శ్రీరామదర్శనం
చేసుకున్నాడు. అదే రోజున రాముడు తండ్రికి నీళ్లు విడిచాడు. 35 వ రోజున రామ, భరత
సంభాషణ అనంతరం మర్నాడు భరతుడికి తన పాదుకలను ఇచ్చాడు శ్రీరాముడు. అదే రోజు, అంటే,
వైశాఖ శుద్ధ దశమిన భరతుడు అయోధ్యకు చేరాడు. 37 వ రోజున వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు
భరతుడు నందిగ్రామం చేరాడు. భరతుడు వెళ్ళిపోయిన తరువాత పౌర్ణమి వరకు చిత్రకూటం లోనే
వుండి సీతారామలక్ష్మణులు, వైశాఖ బహుళ పాడ్యమినాడు అత్రి ఆశ్రమానికి చేరారు.
అరణ్యవాసంలో
భాగంగా, శరభంగ మహర్షి, సుతీక్ష్ణ ముని,
మాండకర్ణి, సుదర్శనముని, అగస్త్యుడి ఆశ్రమాలకు, పంచవటికి వెళ్లారు. క్రౌంచారణ్యం, మతంగవనం, పంపానది
ఒడ్డునున్న ఋశ్యమూక పర్వతం, ప్రస్రవణ పర్వతం దగ్గర వున్నారు. అప్పుడే సీతాన్వేషణ
జరిగింది. హనుమంతుడు
లంక నుండి తిరిగి వచ్చి, సీత జాడ చెప్పడం చెప్పడం పూర్తవగానే, అదేరోజున,
ఫాల్గుణ మాసంలో పౌర్ణమినాడు, ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో యుద్ధానికి
బయల్దేరుదామని రాముడు అన్నాడు. తగిన ఏర్పాట్లు చేయమన్నాడు.
రాముడు కిష్కింధకు
ఆగ్నేయంగా వున్న లంకకు పోతున్నప్పుడు, తరచుగా సూర్యుడున్న రాశికి ముందు రాశిలో
వుండే శుక్రుడు, అనుకూలంగా వెనుక వున్నాడు. రాముడు బయల్దేరిన ఫాల్గుణ మాసం
పౌర్ణిమనాడు సూర్యుడు మీనరాశిలో, శుక్రుడు మేషరాశిలో వున్నట్లు భావించాలి. రాముడి
జన్మరాశి కర్కాటకానికి పదవరాశైన మేషంలో శుక్రుడు వుండడం
రాముడికి అనుకూలం. వెనుక శుక్రుడు వుండడం కూడా అనుకూలమే. శుక్రానుకూలత చెప్పడం వల్ల బృహస్పత్యాది అనుకూలత కూడా వుంది. బృహస్పతి శ్రీరాములవారి జన్మకాలంలో కటకరాశిలో వున్నాడు. ఇతడికి ఒక్కోరాశిలో ఒక్కొక్క సంవత్సరం నివాసం కాబట్టి పన్నెండేళ్లకు
పన్నెండు రాశులను చుట్టి వస్తాడు. అలా మూడుసార్లు
చేస్తే ముప్పయ్యారు సంవత్సరాలు గడిచాయి. ముప్పైఎనిమిదో
ఏట రాముడి దండయాత్ర.
ఆ ఏడు బృహస్పతి రామరాశి, ద్వితీయ
రాశైన సింహంలో వున్నాడు. గురువు రెండో ఇంట వుండడం
అనుకూలం. రామజన్మకాలంలో శని తులావర్గోత్తమంలో వున్నాడు. శనికి రెండున్నరేళ్లు ఒక రాశిలో నివాసం. తులనుండి
పన్నెండు రాశులు చుట్టిరావడానికి ముప్పై సంవత్సరాలు గడుస్తాయి. ముప్పై రెండున్నర దాకా తులలోను, ఆ పైన
రెండున్నర వృశ్చికంలోను, ఆపైన రెండున్నర ధనస్సులోను
వుండి ఆపైన అంటే, ముప్పై ఏడున్నర ఏళ్ల తరువాత మకరానికి
పోవాల్సినప్పటికీ వక్రతాదులవల్ల ధనస్సులోనే వున్నాడని అర్థమవుతున్నది. రామావతారకాలంలో రాహువు సింహరాశిలో వున్నాడు.
రాహువుకు ప్రతిరాశిలోను ఒకటిన్నర
సంవత్సరం నివాసం. అప్రదక్షిణ సంచారం. అక్కడినుండి
ముప్పైఎనిమిదో ఏట కటకరాశిలో వుండాల్సినవాడు మిథునరాశిలో వున్నాడని అనుకోవాలి. రాహువుకు ఏడవ ఇంట కేతువు నివాసం. కాబట్టి
అప్పుడు ధనస్సులో కేతువున్నాడు. ధనస్సు కర్కాటక రాశికి
ఆరోది. అక్కడున్న శనికేతువులు రాముడికి అనుకూలురు. బుధుడు రాముడికి పదవ రాశిలో వున్నాడు కాబట్టి అనుకూలుడు. చంద్రుడు ఉత్తరఫల్గుణితో చేరి వున్నాడు కాబట్టి కన్యారాశిలో వున్నట్లు
లెక్క. అప్పటికి తృతీయ చంద్రుడు కాబట్టి రాముడికి
అనుకూలుడు. మీనంలో వున్న సూర్యుడు కటకానికి తొమ్మిదో
ఇంట వున్నాడు కాబట్టి అనుకూలుడు. మిథునంలో వున్న రాహువు కటకానికి పన్నెండో ఇంట
వుండడంవల్ల రాముడికి కొంచెం బాధకలిగిస్తాడు. ఇలా రాముడికి అనుకూలమైన గోచార ఫలాలు
కనబడ్డాయి. ఈ గోచారం జన్మరాశినిబట్టి చూపించింది. చంద్రరాశినిబట్టి
చూడలేదు. రాక్షసులకు ఈ గోచారం విపరీత ఫలితాన్నే
ఇస్తుంది. అలాగే, ఇక్ష్వాకు వంశతార విశాఖ కాబట్టి నిస్సందేహంగా రాముడికి విజయం చేకూరింది.
(వాసుదాసు గారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం
ఆధారంగా)
No comments:
Post a Comment