మౌఖరి వంశం, వంగ రాజ్య వంశం, కదంబ వంశం
(బ్రాహ్మణ
రాజులు-16, 17, 18)
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(22-04-2024)
భారత దేశంలోని ప్రాచీన
రాజ వంశాలలో మౌఖరి వంశం కూడా ఒకటి. మహాభారతంలో మద్ర దేశాధీశుడు, అశ్వపతి వంశీయుడు,
మౌఖరులు ఈ ఆశ్వపతి వంశానికి చెందిన వారు. వీరు గొప్ప రాజ్యాన్ని నెలకొల్పి
పాలించారు. మద్రదేశం నేటి పంజాబ్ లోనిది. ఆశ్వపతులు ఈ ప్రాంత పాలకులు. మౌఖరి
వంశీయులు ఉత్తర హిందూ దేశమంతా వ్యాపించారు. క్రీస్తుశకం ఆరవ శతాబ్దంలో గయ ప్రాంతాన
వీరి పాలన కొనసాగింది. గయ జిల్లాలోని నాగార్జునికొండ, బరబరా
కొండలలో ఈ వంశానికి చెందిన శాసనాలలు లభించాయి. ఈ వంశానికి చెందిన ముగ్గురు రాజులు
యజ్ఞవర్మ, శార్దూలవర్మ, అనంత వర్మలు
గుప్త చక్రవర్తుల సామంతులుగా వ్యవహరించారు.
మౌఖరి వంశానికి ఆద్యుడు యజ్ఞవర్మ గుప్త
చక్రవర్తులకు సామంతుడిగా వ్యవహరించాడు. విదేయ సామంతుడిగా గుప్త రాజుల శత్రువులతో
పోరాడి విజయాలు సాధించాడు. ఇతడి పాలనా కాలం క్రీస్తుశకం 501-520. సుమారు 19
సంవత్సరాలు. యజ్ఞవర్మ అనంతరం శార్దూల వర్మ మౌఖరి సామంత రాజ్యాధిపత్యం
స్వీకరించాడు. శార్దూల వర్మ గుప్త రాజులతో చక్కటి సంబంధాలు కలిగి వున్నాడు.
శార్దూల వర్మ క్రీస్తుశకం 520 నుండి క్ర్ఫీస్తుశకం 535 వరకు 15 సంవత్సరాలు
పాలించాడు. మౌఖరి వంశ రాజులలో అనంత వర్మ మూడవవాడు. ఇతడు తన సామంత రాజ్యాన్ని
క్రీస్తుశకం 535 నుండి క్రీస్తుశకం 550 వరకు సుమారు 15 సంవత్సరాలు పాలించాడు.
మౌఖరి వంశంలో రెండవ శాఖ వారు
శక్తిమంతులు. బలపరాక్రమ సంపన్నులు. వీరు గొప్ప రాజ్యాలను స్థాపించారు. మౌఖరి
వంశీయుల రాజ్యం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపించింది. మౌఖరి వంశంలో నాల్గవ రాజైన
ఈశానవర్మ సామంత రాజ్యాదిపత్యం వహించిన తరువాత ఈ వంశీయుల అభ్యుదయం ఉన్నత శిఖరాలను
అధిరోహించింది. ఈశానవర్మ కుమారుడు శర్వవర్మ. విష్ణుకుండిన ఇంద్రభట్టారకుడు
శర్వవర్మకు తన కుమార్తె ఇంద్రభట్టారికను ఇచ్చి వివాహం చేసి, రెండు
రాజ్యాలు సఖ్యంగా వుండడానికి తోడ్పడ్డాడు. మౌఖరి రాజ్యాన్ని విస్తృత పరచాలాన్న
ఆశయంతో ఈశానవర్మ అంగరాజ్యాన్ని జయించి, ముందుకు సాగాడు.
ఈశానవర్మ అపరిమిత సైన్యసంపద కలవాడు. మౌఖరి రాజులలో ఈశానవర్మ కడు సమర్థుడు.
స్వతంత్ర రాజ్య స్థాపకుడు. గుప్తరాజులు వారి పూర్వ వైభవాన్ని పునరుద్ధరించాలని
భావించి, సైన్యాన్ని పెంపొందించుకొని మౌఖరి ఈశానవర్మను
ఎదిరించారు. ఈశానవర్మ పోరాడినా లాభం లేకపోయింది. అపజయం పొందాడు. అపరిమిత సైన్యంతో
అనేక దేశాలను జయించి, మౌఖరి వంశ ప్రతిష్టను ఇనిమడింప చేసిన
ఈశానవర్మ భారతదేశ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి,
క్రీస్తుశకం 550 నుండి క్రీస్తుశకం 576 వరకు 26 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు.
మౌఖరి ఈశానవర్మ కుమారుడు శర్వవర్మ తండ్రి
అనంతరం రాజ్యాదిపత్యాన్ని వహించాడు. ఇతడు రాజకీయ దురంధరుడు. అపరిమిత బలసంపన్నుడు.
అజేయుడు. ఇతడు తన కుమారుడితో కలిసి యుద్ధం చేసి మగథ రాజ్యాన్ని ఆక్రమించాడు.
శర్వవర్మ తండ్రితో కలిసి హూణులతో యుద్ధాలు చేసి విజయాలు సాధించారు. శర్వవర్మ కొద్దికాలం
(క్రీస్తుశకం 576-580) మాత్రమే పాలించాడు. మౌఖరి శర్వవర్మ కుమారుడు అనంతవర్మ (అవంతీవర్మ)
ఆ తరువాత రాజ్యానికి వచ్చాడు. ఇతడు కూడా అసాధారణ ప్రజ్ఞావంతుడు. మౌఖరి వంశీయులలో
గర్వించదగ్గ వ్యక్తి. అవంతీవర్మ తరువాత అతడి కుమారుడు గృహవర్మ మౌఖరి రాజ్యాధిపతి
అయ్యాడు. ఇతడి పాలనాకాలం క్రీస్తుశకం 600 నుండి క్రీస్తుశకం 606. గృహవర్మ
మరణానంతరం అతడి సోదరుడు మౌఖరి రాజ్య పాలనా బాధ్యత వహించాడు. ఈశానవర్మ వంశ చరిత్ర
ఇంతటితో ముగిసింది.
క్రీస్తుశకం 7 వ శతాబ్ది ప్రథమ పాదం వరకు
మౌఖరి వంశేయులు గొప్ప రాజులుగా కీర్తించబడి వైభవోపేతంగా పాలించారు.
వంగ రాజ్య వంశం
గుప్త
సామ్రాజ్య పతనానంతరం వంగ దేశంలో ఒక స్వతంత్ర రాజ్యం ఆవిర్భవించింది. ఈ రాజ్యం
మొదట్లో దక్షిణ, పశ్చిమ
ప్రాగ్భాగాలలో విస్తరించింది. క్రీస్తుశకం ఆరవ శతాబ్ది ప్రథమార్థంలో స్వతంత్ర వంగ
రాజ్యం నెలకొల్పబడింది. వంగ రాజ్యానికి సంబంధించిన తొలి ముగ్గురు రాజులు
గోపచంద్రుడు, ధర్మాదిత్యుడు, సమాచారదేవుడు. వీరి సమగ్ర సమాచారం లభ్యం కావడం
లేదు. ఈ ముగ్గురు రాజులలో సమాచారదేవుడు ప్రకటించిన బంగారు నాణేలు కనుగొనబడ్డాయి.
శాసనాలలో ఈ రాజులు మహారాజాదిరాజులుగా వర్ణించబడ్డారు. వైశ్యగుప్తుడు, గోపచంద్రుడు
వేయించిన శాసనాలలో విజయసేనుడి ప్రశంస వున్నది. విజయసేనుడు వైశ్యగుప్తుడి సామంతుడు.
వైశ్యగుప్తుడి తరువాత వంగ దేశంలో గుప్త చక్రవర్తుల పరిపాలన అంతరించిపోయింది.
క్రీస్తుశకం 507 లో గోపచంద్రుడు స్వతంత్ర రాజ్యం నెలకొల్పాడు.
క్రీస్తుశకం 543 వరకు గుప్త చక్రవర్తుల
అధికారం ఉత్తర వంగ దేశంలో చెల్లుతుండేది. గోపచంద్రుడు వంగ దేశాన్ని క్రీస్తుశకం
507 నుండి క్రీస్తుశకం 525 వరకు స్వతంత్రంగా పాలించాడు. గోపచంద్రుడి తరువాత
ధర్మాదిత్య, సమాచారదేవులు
వంగ దేశాన్ని పాలించారు. సమాచారదేవుడు 14 సంవత్సరాలు పాలించాడు. మొత్తంమీద
గోపచంద్రుడు, ధర్మాదిత్యుడు, సమాచారదేవుడు కలిపి క్రీస్తుశకం 507 నుండి
క్రీస్తుశకం 575 వరకు వంగ రాజ్యాన్ని ఏలారు.
బాదామీచాళుక్య చక్రవర్తి కీర్తివర్మ, టిబెట్ రాజు స్రోన్బట్సన్ దండయాత్రల వల్ల వంగ
రాజ్యం పతనమై పోయింది. వంగ రాజ్యం వంగ, గౌడ రాజ్యాలుగా విభజించబడింది. గౌడ దేశం
ఉత్తర, పశ్చిమ వంగ
దేశ భాగాలుగా వ్యాపించి వుండేది. దక్షిణ, తూర్పు భాగాలు
వంగ దేశంగా పరిగణించబడేవి. వంగ దేశ ప్రాచీన నామం సమతత. మహాసేన గుప్తుడి చివరి
రాజ్య సంవత్సరాలలో గౌడ దేశంలో శశాంకుడు పాలనా బాధ్యత వహించి స్వతంత్ర రాజ్యాన్ని
స్తాపించాడు. శశాంకుడు మహాసేన గుప్తుడి సోదరుడి కొడుకు. శశాంకుడి రాజధాని కనక
సువర్ణపురం. మార్షిదాబాద్ జిల్లాలోని బెర్హంపూర్ కు 10 కిలోమీటర్ల దూరంలో వున్న
రాంగామాట శిధిలాలు పూర్వం కనక సువర్ణపురివై వుండవచ్చు.
మాణ వంశీయులు శశాంకుడికి పూర్వం వంగ
దేశంలోని పర్వత ప్రాంతాలను పాలించారు. వీరి రాజ్యం మిడ్నాపూర్, గయల దాకా విస్తరించి వుండేది. వీరు కళింగం దాకా
తమ రాజ్యాన్ని వ్యాపింప చేసుకున్నారు. శంభుయశనుడు ఈ వంశీయుడు. క్రీస్తుశకం 580
నుండి క్రీస్తుశకం 603 వరకు 23 సంవత్సరాలు కళింగ దేశాన్ని పాలించాడు. శశాంకుడు
ఇతడిని ఓడించి అతడికి చెందిన కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు.
శైలోద్భవ వంశీయులు కొంగోద రాజ్యాన్ని
పాలిస్తూ క్రీస్తుశకం 619 వరకు శశాంకుడి సామంతులుగా వున్నారు. తరువాత
స్వతంత్రులయ్యారు. శశాంకుడు గౌడ దేశాన్ని మహేంద్రగిరి దాకా విస్తరించాడు. ఉత్తర
మగథ భూభాగాలను స్వాధీనపర్చుకున్నాడు. కనోజి పాలకుడు గృహవర్మ మౌఖరి వంశీయుడు. మౌఖరి
ఈశానవర్మ కాలం నుండి గౌడులు మౌఖరులతో శత్రుత్వం కలిగి వుండేవారు. మాళవ గుప్త
రాజులకు మౌఖరులకు బద్ధ వైరం. కాబట్టి శశాంకుడు దేవగుప్తుడితో స్నేహం చేసుకున్నాడు.
శశాంకుడు క్రీస్తుశకం 637-638 వరకు మగథను
పాలించినట్లు ఆధారాలున్నాయి. శశాంకుడు వంగ దేశ ప్రథమ స్వతంత్ర ప్రభువు. అతడు గౌడ
రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా రూపొందించడమే కాకుండా దక్షిణ అంగ, కళింగ దేశాలను జయించి ప్రబల శక్తి సమన్వితమైన
రాజుగా కీర్తి వహించాడు.
కదంబ వంశం
దక్షిణాపథ,
దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధికెక్కిన రాజవంశాలలో కదంబ వంశం ఒకటి. ఈ వంశీయుల తొలి
నివాసం తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లాలో వున్న కందూరు గ్రామం. కందూరు చాళుక్యుల
కాలంలో ప్రసిద్దికెక్కిన గిరి దుర్గం. కందూరునాడును కందూరు పట్టణంగా కూడా పిలవడం
జరిగింది. తెలుగు చోడులలో ఒక శాఖవారు తెలంగాణాలోని నల్లగొండ, మహబూబ్ నగర్ మండలాలను, ఖమ్మం మండలంలోని నేలకొండపల్లి ప్రాంతాన్ని,
కొలనుపాక, కోడూరు, కందూరు, వర్ధమానపురం, పానుగల్లు పట్టణాలను రాజధానులుగా చేసుకుని
పాలించారు.
కందూరులో పెద్ద సంఖ్యలో కదంబ
వృక్షాలుండేవి. కదంబ వృక్షాల వల్ల మయూర శర్మ వంశానికి కదంబ వంశమని పేరు వచ్చింది.
కదంబులు హారీత పుత్రులు. మానవ్యస గోత్రులు. వేదవేదాంగేతిహాస, కావ్య నాటక, అలంకార శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించారు. సకల
సద్గుణ సంపన్నులు. వీరు బ్రాహ్మణులు. కందూరు గ్రామ వాస్తవ్యులు.
కదంబ వంశంలో మయూర శర్మ జన్మించాడు.
బ్రాహ్మణుడైన మయూర శర్మ పౌరుష ప్రతాపాలున్నవాడు. అతడు బ్రాహ్మణ్యాన్ని వీడకుండా
క్షత్రియ ధర్మాన్ని అవలంభించి,
బ్రహ్మక్షత్రతేజో భృతుడయ్యాడు. అతడు కాంచీ నగరాన్నుండి
బయల్దేరి శ్రీ పర్వతారణ్యంలోని ఆటవిక జాతుల వారిని పురికొల్పి, తన సైన్యాన్ని చేర్చుకుని, వారికి సైనిక శిక్షణ ఇచ్చి, వీరులుగా తీర్చిదిద్దాడు. తన గ్రామంలోని, పరిసర గ్రామాలలోని స్నేహితులను సైన్యంలో
చేర్చుకున్నాడు. అలా చేర్చుకున్న సైన్యంతో కలిసి మయూర శర్మ అనేక ప్రాంతాల మీద
దండయాత్రలు నిర్వహించి విజయుడై, తన వంశం పేరుతో కదంబ రాజ్యాన్ని
స్థాపించాడు. అతడి రాజ్యం క్రమేపీ అభివృద్ధి చెంద సాగింది. మయూర శర్మ పల్లవ రాజుల
సామంతులుగా వున్న బృహద్బాణ రాజులను ఓడించాడు.
మయూర
శర్మ కదంబ రాజ్యాన్ని నిర్భీతిగా, ప్రశాంతంగా, ప్రజానురంజకంగా
పాలించాడు. అతడు అష్టాదశ అశ్వమేధ యాగాలు చేశాడని అంటారు. పరశురాముడి లాంటి
పరాక్రమవంతుడని అతడికి పేరు. మయూర శర్మ కాలంలో భారత దేశాన్ని పాలించిన అనేక రాజ
వంశాల వారు బ్రాహ్మణులు. వారు క్షత్రియ ధర్మాన్ని అవలంభించి, బ్రాహ్మణత్వాన్ని వీడకుండా
పరిపాలన చేశారు. ఆ రోజుల్లో క్షత్రియులు,
బ్రాహ్మణుల మధ్య వైవాహిక సంబంధ బాంధవ్యాలు వుండేవి. మయూర శర్మ క్రీస్తుశకం 345
నుండి క్రీస్తుశకం 360 వరకు సుమారు 15 సంవత్సరాలు పాలించాడు.
మయూర
శర్మ మరణించిన తరువాత అతడి కుమారుడు కంగవర్మ కదంబ రాజ్య సింహాసనాన్ని
అధిష్టించాడు. ఇతడు సమర్థుడైన రాజు. ఇతడు సుమారు 25 సంవత్సరాలు వైభవంగా పాలించాడు.
కంగవర్మ కుమారుడు భగీరధుడు క్రీస్తుశకం 385 లో రాజ్యానికి వచ్చి సుమారు 25
సంవత్సరాలు పాలించాడు. తండ్రి, తాతల లాగానే ఇతడు కూడా చక్కటి పాలన
అందించాడు. భగీరధుడి పెద్ద కుమారుడు రఘువు క్రీస్తుశకం 410 లో రాజ్యానికి వచ్చి 15
సంవత్సరాలు పాలించాడు. ఇతడి పాలనా కాలం స్వర్ణయుగం అని పిల్వబడ్డది. రఘువు కదంబ
రాజ్యాన్ని బలిష్టపర్చాడు. రఘువు తరువాత భగీరధుడి రెండవ కుమారుడు కకుత్స వర్మ
రాజ్య పాలనా బాధ్యత వహించి ఇరుగు పొరుగు రాజులతో, రాజ వంశాల వారితో చక్కటి సంబంధ
బాంధవ్యాలు నెలకొల్పాడు. కకుత్స వర్మ గొప్ప వీరుడు. ఇతడు క్రీస్తుశకం 425 నుండి
సుమారు 25 సంవత్సరాలు పాలించాడు.
కకుత్స
వర్మ పెద్ద కుమారుడు శాంతి వర్మ క్రీస్తుశకం 450 లో అధికారంలోకి వచ్చాడు. ఇతడు
శత్రు భయంకరుడు. అనేక రాజ్యాలను జయించి విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇతడి
పాలనా కాలం సుమారు 25 సంవత్సరాలు. కకుత్స వర్మ రెండవ కుమారుడు కృష్ణ వర్మ, శాంతి
వర్మ తరువాత రాజయ్యాడు. కృష్ణ వర్మ కుమారుడు విష్ణు వర్మ తండ్రి మరణానంతరం కదంబ
రాజ్య పాలనా బాధ్యతలు స్వీకరించాడు. ఇతడు పల్లవుల ధాటికి తట్టుకోలేక వారికి
సామంతుడిగా వుండిపోయాడు. శాంతి వర్మ కుమారుడు మృగేశ వర్మ కదంబ రాజ్య పాలనా
బాధ్యతను క్రీస్తుశకం 470 లో స్వీకరించి సుమారు 18 సంవత్సరాలు పాలించాడు. ఇతడు సకల
విద్యలలో నిష్ణాతుడు. పల్లవ రాజ్యం మీద దండయాత్రలు చేసి విజయం సాధించి, కదంబ వంశ ప్రతిష్టను ఇనుమడింప చేశాడు.
మృగేశ
వర్మ కుమారుడు రవి వర్మ క్రీస్తుశకం 488 లో కదంబ రాజ్య పాలనా బాధ్యతలు వహించాడు.
రవి వర్మ బలసంపన్నుడు. తన జ్ఞాతి అయిన విష్ణు వర్మ పల్లవుల సామంతుడు కావడం
సహించలేక, అతడి రాజ్యం మీద దండయాత్రలు చేశాడు. పల్లవులు
విష్ణు వర్మకు సైన్య సహాయం చేశారు. అయినప్పటికీ యుద్ధంలో విష్ణు వర్మ, రవి వర్మ
చేతిలో చనిపోయాడు. రవి వర్మ పట్టుదల కలవాడు. విష్ణు వర్మకు సహకరించిన పల్లవుల మీద
దండయాత్ర చేసి వారిని ఓడించాడు. చివరకు అఖండ కదంబ రాజ్య పాలకుడు అయ్యాడు. రవివర్మ
60 సంవత్సరాలు పాలించాడు.
రవి
వర్మ తరువాత అతడి కుమారుడు హరి వర్మ క్రీస్తుశకం 538 లో కదంబ రాజ్య సింహాసనాన్ని
అధిష్టించాడు. ఇతడు శాంతి కాముకుడు. ఇతడి పాలనా కాలంలో మొదటి పులకేశి విజృంభించి,
కదంబ రాజ్యంలోని అనేక భాగాలను జయించాడు. హరివర్మ అతడిని ఎదిరించలేక మిగిలిన
భూభాగాలను 12 సంవత్సరాలు పాలించాడు. ఇతడితో కదంబ వంశం ప్రధాన శాఖ అంతరించింది.
ఇదిలా
వుండగా కృష్ణ వర్మ సంతతి వారిలో విష్ణు వర్మ కుమారుడు సింహ వర్మ పల్లవుల సహాయంతో
రాజ్యాన్ని తిరిగి సంపాదించాడు. అతడి వంశీయులలో రెండవ కృష్ణ వర్మ, మాంద్రాత్రి వర్మ, అజ వర్మ,
భోగి వర్మ కదంబ రాజ్యాన్ని పాలించారు. అజ వర్మ,
భోగి వర్మల కాలంలో కదంబ రాజ్య వంశం పూర్తిగా అంతరించి పోయింది.
(స్వర్గీయ
బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)
No comments:
Post a Comment