Wednesday, July 3, 2013

గయ నుంచి శర్మ రాసిన ఉత్తరం: వనం జ్వాలా నరసింహారావు

గయ నుంచి శర్మ రాసిన ఉత్తరం
వనం జ్వాలా నరసింహారావు

          శర్మ గురించి కిందటి అధ్యాయంలో ఉపోద్ఘాతం ఇచ్చాను. వాడు (గయ) కత్రి సరాయ్ లోని నాథ్ ఆయుర్వేదాశ్రమంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక నాడు అనుకోకుండా "అన్వేషణ" అనే వారపత్రిక చూడడం జరిగింది. అందులో మిత్రుడు భండారు శ్రీనివాసరావు (హెచ్.ఎస్.సీ వరకు మా క్లాస్ మేట్) రాసిన ఒక వ్యాసం చదివాడు. వెంటనే స్పందిస్తూ, 22-01-1996 తేదీన ఒక ఉత్తరం రాశాడు. అందులోని విషయాలు చాలావరకు మా ముగ్గురికీ...ఆ మాటకొస్తే...మా సమకాలీనులందరికీ వర్తించేవిగా వున్నాయి. ఆ విషయాలను పదిమందితో పంచుకోవాలన్న ఉద్దేశంతో యధాతథంగా రాస్తున్నాను.

Dear Friend Jwala,
          నేను కొన్నాళ్లుగా ఇక్కడ గయ దగ్గర ఒక ఆయుర్వేద కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సంగతి నీవెరిగినదే కదా. నీవు నన్ను గుర్తు చేసుకుంటూ ఉంటావో లేదో గాని, నేను నిన్ను, మన స్నేహితులందర్నీ ఏదో ఒక సందర్భంలో తలుస్తూనే ఉంటాను. 10 రోజుల క్రితం 9-01-96 అన్వేషణ అనే వారపత్రిక తిరగవేస్తుండగా, పేజీ 45 లో, శ్రీ భండారు శ్రీనివాసరావు వ్రాసిన ఒక వ్యాసం ప్రచురితమయింది నా కంట పడింది. క్రింద రచయిత పేరు చూసి వ్యాసం పూర్తిగా చదివాను. అలా మన చిన్ననాటి జ్ఞాపకాలు... పాత రిక్కా బజారు హైస్కూల్, మామిళ్లగూడెం మన ఇల్లు, పక్క మురికి కాలువ, మనం భోజనం చేసే మైసూర్ కేఫ్, "భోజనం తయార్" బోర్డు, "చలిగా ఉన్నది..చలి చలి వేస్తున్నది" అని కవిత రాసిన మీ స్నేహితుడు, మన నర్సింగరావు గారు, భండారు శ్రీనివాసరావు గారు, బాల మౌళి, నోముల వారు, గుర్రం వారు, బూర్లె వారు, దోసపాటి వారు, మొదలైన స్నేహితులు గుర్తుకొచ్చాయి. Pulse Polio కార్యక్రమం నిర్వహించబడుతున్నది కాబట్టి, మీ ఇంటి ఎదురుగా ఉండే Polio Friend మన క్లాసే కాని  History Student పేరు గుర్తు లేదు, Syed Rehman, Abdul Rehman, Shukur, వారి SC Hostel Friends, "గొట్టం పాపయ్య-పానుగంటి పిచ్చయ్య" అంటూ వుండే శ్రీ కొండలరావు సారు, మనకి మాత్రమే విడమర్చి చెప్పి మిగతా వాళ్లను కసురుకునే Venkat Ram Reddy సారు, "వనజ భవుండు నిన్నొసట..." అంటూ చెప్పే తెలుగు సారు అయ్యదేవర రామచంద్రరావు, బాగా కొట్టి చెప్పే సర్వ శ్రీ చిన్ని రామారావు, వీరభద్రం (Science), అవధాని, రసూల్ మొదలైన వారు, డ్రామాలు వేయించే సత్యం, Sitaramaiah మాస్టార్లు, కాలేజీకి వెళ్లేటప్పుడు నీవు సైకిలు తొక్కడం-నేను కూర్చోవడం, గుట్టల బజారు చడావ్ దగ్గర దిగడం-సైకిల్ తోయడం, లిటరేచర్ అనే పేకాట ఆడడం, Self Service Day, మన స్కూల్ ఒంటికన్ను చప్రాసి, పక్కనే జిలేబి అమ్మే హిందీ తాత, J H Prasad, Late M V K H Prasad,...ఇట్లా అందరూ జ్ఞాపకం వస్తూ ఎన్నో విషయాలు మదిలో మెలిగాయి. గయోపాఖ్యానం, దేవుని లాలూచీ, అనే స్కూల్ డ్రామాలు గుర్తుకొచ్చాయి. చిక్కడపల్లిలో నీ రూమ్మేట్స్ అయిన Late రంగారావు గారు (M A Public Administration), రమణ (రెబ్బారం), A Muslim Friend, Tajmahal Hotel Tracer ఉద్యోగం, "Buy and Cry" Pant, నా పురోహితుడి Duty, ఖమ్మంలోని సుందర్, ప్రభాత్, నవాబ్ మొదలైన సినిమా హాళ్లు,  Janveera, Navab, Cheena, Dharma లాంటి పెద్ద age గల మన Friends, ఖమ్మం నుండి హైదరాబాద్ వెళ్లేటప్పుడు బస్సులో నీకు వినిపించిన హరికధా కాలక్షేపం...మొదలైనవి మనసులో మెదిలాయి. ఇలా వ్రాస్తూ పోతూ ఉంటే అంతం ఉండదు. ఈ సారి హైదరాబాద్ వచ్చినప్పుడు మన చిన్ననాటి సంగతులు అన్నీ ఏకరవు పెట్టి ముచ్చటించాలని ఉన్నది. మా అమ్మాయి వాళ్లు కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మొన్న ఈ మధ్య ఒకసారి మా అమ్మాయిని గురించి హైదరాబాద్ వచ్చాను. కాని నీ Phone నెంబరుకి Phone చేసినా ఫోన్ మారిందా ఏమో నెంబరు పలక లేదు. సమయం లేనందున కలవలేకపోయాను.     

          ఇలా ఈ పత్రిక తిరగేస్తూ శ్రీ భండారు శ్రీనివాసరావు గారి వ్యాసం చదువుతూంటే, వారిని గురించిన జ్ఞాపకాలు కూడా వచ్చాయి. AIR లో వింతలు-విశేషాలు అనే వారి వార్తలు లోగడ ప్రసారమవుతూ ఉండేవి. తర్వాత ఆయన రష్యా వెళ్లినట్లుగా నీవు చెప్పావు. ఇలాంటివే మరెన్నో వ్యాసాలు, ప్రజలకి, ఈనాటి యువతకి పనికి వచ్చే ట్లుగా వ్రాయాలని శ్రీ భండారు వారిని మరీ మరీ కోరుతున్నాను. ఈ విషయాలలో వారితో Personal గా ఒకసారి Discuss చేయాలని అనుకుంటున్నాను. మన భారత దేశం ఒక పుణ్యభూమి. ఎంతో మంది మేధావులకు, మహానుభావులకు జన్మనిచ్చిన మాతృ భూమి. మన వేదాలు, పురాణాలు, మన సాంఘిక ఆచార వ్యవహారాలు, మొదలైనవన్నీ మన ఉనికి, మనుగడలకై ఎంతో ఉపయోగపడేవిగా నిర్ణయించబడి, ఆచరించబడుతున్నవి. ఈ ఆచారాలన్నీ మన శీతోష్ణ స్థితి, Environment పై ఆధారపడి ఉన్నాయి. వాటిని వదిలేసి, పాశ్చాత్య నాగరికతలో ఈనాటి భారతీయుడు కొట్టుమిట్టాడుతున్నాడు. ఆరోగ్య దృష్ట్యా, తోలు చెప్పులు, నూలు దుస్తులు, తాజా ఆహారం, సాత్విక మితాహారం తీసుకోవాల్సి వుండగా Plastic చెప్పులు, బూట్లు, Synthetic దుస్తులు, ఫ్రిజ్ లో నిలవ వుంచిన Tinned Foods తీసుకుంటున్నారు. Christianity లో లాగా మన మతానికి ఒక క్రమశిక్షణ లేదు. మన తాత-ముత్తాతలు శివుడు, విష్ణువులను, మనం వెంకటేశ్వరుడు మొదలైన వారిని దేవుడిలాగా పూజించాం. ఈ నాటివారు బాబాలను, జిల్లెడమూడి అమ్మలను, తాంత్రిక స్వాములను, ఇలా వెలిసిన వూరికొక దేవ దూతలను పూజిస్తున్నారు. వేలు ఖర్చు చేసి దేవుడికి కళ్యాణం చేయిస్తాం కాని మన పొరుగువాడు ఆకలితో అలమటిస్తూ ఉంటే చూస్తూ ఉంటాం. మన చరిత్రలోని మంచిని తీసుకోం. ధర్మరాజు అబద్ధం చెప్పలేదా?, కృష్ణుడు మాయ చేసి యుద్ధంలో పాండవులను గెలిపించలేదా? అని విమర్శిస్తూ ఉంటాం. ఉన్న గుళ్లు చాలన్నట్లు ప్రతి రోజూ, ప్రతి వూళ్లో గుడి కట్టడానికి చందాలు వసూలు చేస్తుంటారు. ప్రజలు నడిచే రోడ్లను ఆక్రమించి చిన్న-చిన్న గుళ్లను కట్టారు. అంతేగాని, మదర్ థెరిస్సాలాగా బీదవారికంటూ మన వాళ్లు నడిపే Poor Homes ఏమీ లేవు. ఒకడు నిజాయితీగా వ్యాపారం చేస్తూ తృప్తిగా జీవిస్తుంటే, పక్కవాడు ఏదో మతలబులు చేసి, బాగా సంపాదిస్తూ మేడలు-కార్లు కొంటుంటే, మొదటి వాడిని శుంఠ-చేతకానివాడి కింద లెక్క కడతారు. రెండవ వాడిని తెలివి తేటలు కలవాడంటారు. అందరూ వాడినే గౌరవిస్తారు. మన ప్రభుత్వం కూడా Reservations కల్పించి ప్రజలకు మంచే చేస్తున్నప్పటికీ, కనీసం విద్య-వైద్య-సాంకేతిక-ఇంజనీరింగ్ రంగాల్లోనైనా Merit ఉన్నవాళ్లకు(Irrespective of the Caste) అవకాశాలు ఇవ్వకుండా, మార్కుల రాయితీలు ప్రకటించి నందువల్ల, ఈనాటి స్కూలు మాస్టార్లు "శ్రీ రఘురామ చారు తులసీ దళ ధామ" అంటే, "శ్రీరాములవారు తులసి ఆకులతో చారు కాచి" అని చెప్పే వారిగా మారిపోతున్నారు. అదే మన రోజుల్లో...మన చదువు తీసుకుంటే....మన చిన్నతనంలో మనం చదువుకున్న మన పాఠం, మను చరిత్రలోని పద్యం ఇంకా నాకు గుర్తున్నది. ఆ పద్యాన్ని నేను ఏమాత్రం చదవలేదు. కంఠస్థం అంతకన్నా చేయలేదు. లెక్చర్ విని, మాస్టారు విడమర్చి చదవగా విని గుర్తు పెట్టుకున్నాను. వాటిలో కొన్ని...."అచటి విప్రులు మెచ్చరఖిల విద్యా ప్రౌఢి, ముదిమది తప్పిన మొదటి వేల్పు.....అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ"; ధర్మరాజు రాజసూయ యాగం సందర్భంలో నన్నయగారి భారతంలోది..."చనపేడికి తారక్రియయును......కృష్ణు పూజించుటిలన్"; ఏనుగు లక్ష్మణ కవి సుభాషితం, "ఆకాశంబున నుండి, శంభుని శిరంబందుండి.....వివేక భ్రష్ట సంపాతముల్"; "జలమున నగ్ని, చాత్రమున జండ మయూఖుని.....మూర్ఖుని మూర్ఖత మాన్పవచ్చునే"; "అవనీనాధులనేకులుండగ విశిష్టారాధ్యుల్. ఆర్యుల్ పూజ్యులు పల్వురుండగ....దాశార్హుండు పూజార్హుండే"; "ఈతనికి ధనమిత్తురేని అభీష్టములైన కార్యముల్....అనర్హుడర్హుడని అత్యుతునచ్యుత చేయపాడియేధర్మవు ధర్మ నందనా"; 8th Class English లో "Her arms across her breast she laid she was more fair than words can say"; Waste Not Want Not Proverb లో శ్రీ గెంటాల రంగారావు గారు చెప్పిన మాటలు "Economy does not mean stringency. One must enjoy life according to his status and earnings. If he goes beyond it he may be called Spend Thrift".

పై విషయాలన్నీ నీకు Bore కలిగించవచ్చునేమో కాని, ఇక్కడ ఖాళీగా ఉన్న నాకు (ఈ రోజు ఆదివారం...ఒంటరిగా ఆఫీసులో ఉన్నాను) ఏదో రాయాలనిపించి, నీవు కూడా పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుని ఆనందించుతావని వ్రాస్తున్నాను.

          ఇంకో విషయం. మనకు ముఖం తెలియని వాడెవడో బాబా గురించి ఉత్తరం వ్రాస్తూ, ఇలాంటి ఉత్తరం 100 ప్రింట్ చేయించి Mr. Ex లక్ష రూపాయలు లాటరీ కొట్టాడు, Mr. Y నిర్లక్ష్యం చేసి తలపగిలి లేదా పాము కాటుకు గురై చచ్చాడని అంటూ, ఇలాంటివే 100 ప్రింట్ చేసి బట్వాడా చేయాలని వ్రాస్తూ వుంటారు. హిందూ మతం దిగజారడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? మన రోజుల్లో మనకు తెలిసింది, తెలియని వాళ్లకి విడమర్చి చెప్పే వాళ్లం. ఈ రోజుల్లో చెప్పడం చేత కాదు కొందరికి. చెప్పితే ఎక్కడ నేర్చుకుంటాడో అని ఈర్ష్య కూడా. ఆ రోజుల్లో Cricket గురించి, Sixer, Four, Wide, Wicket అంటూ చెప్పింది నీవే. ఈ రోజుల్లో ప్రతి పిల్లాడికి తెల్సుననుకో. ఇంత భారతం వ్రాయడానికి, ఇన్ని విషయాలు మననం చేసుకోవడానికి ధనస్సు రాశిలో వ్రాసిన వార ఫలాలు కూడా కాకతాళీయంగా ఏకీభవిస్తున్నాయి! (ఒక పేపర్ క్లిప్పింగ్‌ను వాడి వుత్తరానికి జత పర్చాడు. అందులో వార ఫలాలలో ధనస్సు రాశివారికి " చిన్ననాటి జ్ఞాపకాలు రాగలవు" అని వుంది. బహుశా వాడి జన్మ రాశి ధనస్సు కావచ్చు).

          More details in my next letter. I request you to please reply for this letter at least because this is my second letter to you from Gaya. My kind enquiries to one and all of your family members and also to Mr. B. Srinivasa Rao and his family members. Please show this letter to Mr. B. S. Rao also.

Yours Loving Friend,

L. V. R. S. Sharma

Monday, July 1, 2013

హైదరాబాద్ నగరంలో తొలి అనుభవాలు.. కాలేజీ కబుర్లు-Part FOUR: వనం జ్వాలా నరసింహారావు

హైదరాబాద్ నగరంలో తొలి అనుభవాలు
కాలేజీ కబుర్లు-Part FOUR
వనం జ్వాలా నరసింహారావు

నేను హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నప్పుడే (చనిపోయిన) వనం రంగారావు (నర్సింగరావు తమ్ముడు) ఉస్మానియా బి-హాస్టల్ లో వుంటూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టుతో ఎం. ఏ చదువుతుండేవాడు. ఆయనను కలవడానికి తరచుగా యూనివర్సిటీ కాంపస్‌కు వెల్లే వాళ్లం. అక్కడ ఆయన ద్వారా పరిచయమైన ఆయన స్నేహితులలో ప్రొఫెసర్ హరగోపాల్ (ప్రముఖ పౌర హక్కుల నాయకుడు) ఒకరు. సోషాలజీ డిపార్టుమెంటులో పని చేస్తున్న ప్రొఫెసర్ రాఘవేంద్ర రావు కూడా అలానే పరిచయమయ్యారు. రంగారావు మరో క్లాస్ మేట్ వాసిరెడ్డి శివలింగ ప్రసాద్ (ఇందిరా గాంధి సార్వత్రిక విశ్వ విద్యాలయం ప్రొ-ఛాన్సలర్ గా పదవీ విరమణ చేశారు) కూడా అప్పుడే పరిచయం. రంగారావు కంటే ఒక ఏడాది జూనియర్ ఐన డాక్టర్ శ్రీధర్ రెడ్డి (ప్రముఖ కాంగ్రెస్ నాయకుడిప్పుడు-తెలంగాణ ప్రజా సమితి ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించాడు) కూడా అప్పుడే పరిచయం అయ్యాడు. శ్రీధర్ రెడ్డి విద్యార్థి నాయకుడు కూడా. యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి, యూనివర్సిటీకి విద్యార్థి సంఘ అధ్యక్షుడుగా కూడా ఆ రోజుల్లో ఎన్నికయ్యాడు. నాకంటే ఒక సంవత్సరం సీనియర్. వీరే కాకుండా రంగారావు కంటే ఒక ఏడాది సీనియర్ ఐన బొమ్మకంటి శంకర్ రావు (పాత తరం ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు బొమ్మకంటి సత్యనారాయణ రావు గారి కుమారుడు) కూడా కామన్ స్నేహితుల ద్వారా పరిచయం అయ్యారు. శంకర్ రావు ఐ. పి.ఎస్. అధికారిగా సీనియర్ పొజీషన్ లో రిటైర్ అయ్యారు. బొమ్మకంటి గారి తోడల్లుడు, ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు కె. ఎల్. నరసింహా రావు గారు బావ మరిది నేదునూరి దుర్గా ప్రసాద్ (వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పని చేసేవారు) కూడా అలానే వూటుకూరు వరప్రసాద్ ద్వారా ఆ రోజుల్లో పరిచయం అయ్యారు. మేం (నేను, రూమ్మేట్ రమణ, వనం రంగారావు) బాగా స్నేహం చేసిన వారిలో సిటీ కాలేజీలో పని చేస్తున్న సోమేశ్వర రావు గారు కూడా వున్నారు. ఆయన ఖమ్మం కాలేజీలో కెమిస్ట్రీ డిమాన్ స్ట్రేటర్ గా పని చేసి బదిలీపైన హైదరాబాద్ సిటీ కాలేజీకి వచ్చారు. అక్కడ పని చేస్తూ ఆ తరువాత కాలంలో ఎం. (పొలిటికల్ సైన్స్) పట్టా పుచ్చుకున్నారు. సిటీ కాలేజీలోనే కెమిస్ట్రీ లెక్చరర్‌గా పని చేసే పరిమళ గారితో సోమేశ్వర రావు గారి పరిచయం ప్రేమ వరకూ-పెళ్లి చేసుకునే వరకూ పోయింది. ఐతే, పెద్దల నుంచి అంతగా సానుకూలత రాకపోవడంతో, మేమే పెళ్లి పెద్దలమై, యాదగిరిగుట్టలో వారి పెళ్లి జరిపించాం. పరిమళా సోమేశ్వర్ గారు ప్రముఖ తెలుగు నవలా రచయిత్రి. వారందరితో నా దూరపు స్నేహం ఇంకా కొనసాగుతూనే వుంది.

ఇక్కడ వనం రంగారావు గురించి కొంత చెప్పుకోవాలి. మా పక్క గ్రామం కమలాపురం ఆయనది. నాకు వరసకు బాబాయి అవుతాడు. వయసులో రెండు-మూడేళ్లు పెద్ద. కాలేజీలో సీనియర్. బాగా కష్టపడి చదివేవాడు. ఆయనకు, ఆయన అన్న గారైన నర్సింగరావుకు, భావాల్లో కొంత తేడా కనిపించేది. ఐతే ఇద్దరూ వ్యక్తిగతంగా చాలా మంచి స్వభావం కలవారే. నేను ఖమ్మంలో పియుసిలో చేరిన సంవత్సరం రంగారావు బి. ఏ. రెండో సంవత్సరం చదువుతుండేవాడు. వాళ్లన్నయ్య లాగా కాలేజీ రాజకీయాలలో ఎక్కువగా పాల్గొనక పోయేవాడు. ఎంత సేపటికీ చదువు మీదే శ్రద్ధ. బి.. ఫైనల్ ఇయర్‌లో వున్నప్పుడు ఎస్. ఆర్. అండ్. బి. జి. ఎన్. ఆర్ కాలేజీ మాగజైన్‍కు ఎడిటర్‌గా కూడా ఎంపికయ్యాడు. నేను హైదరాబాద్ న్యూ సైన్స్ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చేరినప్పుడు, ఆయన ఎం. ఏ లో చేరాడు. రెండేళ్ల తరువాత ఎం. ఏ ఫస్ట్ క్లాస్‍లో పాసై, సివిల్స్ పరీక్షలకు తయారవుండేవాడు. నా రూమ్మేట్ రమణకు చాలా దగ్గర బంధువు. శెలవుల్లో (1967) ఒకసారి రమణ వూరు కల్మలచెర్వుకు వెళ్లాడు. అక్కడ ఒకనాడు పొలంలో నడుస్తున్నప్పుడు చిన్న దుంప గుచ్చుకుంది. కొద్ది రోజులకు అది చిన్న పుండుగా మారింది. దానికి వైద్యం చేయించుకునేందుకు డాక్టర్ దగ్గరకు వెళ్తే పెన్సిలిన్ ఇంజక్షన్ ఇచ్చాడు. ఇంజక్షన్ ఇచ్చిన చోట పెద్ద పుండై, రణంగా మారి, హఠాత్తుగా "టెటనస్" వ్యాధికి దారితీసింది. ఖమ్మం యలమంచిలి రాధా కృష్ణమూర్తి ఆసుపత్రిలో చేర్పించడం, చనిపోవడం ఒకే రోజు జరిగిపోయాయి. అప్పటికే రంగారావుకు వివాహం ఐంది కాని కాపురం మొదలెట్టలేదు. మా సమీప గ్రామం బాణాపురం వాస్తవ్యుడు, ఖమ్మంలో మా ఇంటి పక్కనే వుండే గండ్లూరి నారాయణ రావు గారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఉజ్వలమైన భవిష్యత్ వున్న ఒక వ్యక్తి అలా అకాల మరణం చెందాడు.   

Osmania University Ats College  

నేను డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో వున్నప్పుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుల మధ్య, ఉపకులపతి (వైస్ ఛాన్స్ లర్) డి. ఎస్. రెడ్డి వ్యవహారంలో బాగా గొడవలు జరిగాయి. ఒక గ్రూపుకు నేటి కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, (మొన్నటి వరకూ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు...ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి) కె. కేశవరావు మార్గదర్శకత్వం వహించగా, మరొక గ్రూపుకు నాటి విద్యార్థి నాయకులు ఎం. శ్రీధర్ రెడ్డి, పుల్లారెడ్డి, (జన సంఘ్) నారాయణ దాస్, కమ్యూనిస్టు పార్టీ అనుబంధ విద్యార్థి సంఘ నాయకులు నాయకత్వం వహించారు. 1966 లో, నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, 1957 నుంచి ఉపకులపతిగా పని చేస్తున్న  డి. ఎస్. రెడ్డిని పదవి నుంచి తప్పించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో గుంటూరు కాలేజీ ప్రిన్సిపాల్ (పేరు గుర్తుకు రావడం లేదు) ను నియమించడం కూడా జరిగింది. ఆయన ఛార్జ్ తీసుకోవడానికి రావడం, విద్యార్థుల ఆందోళన మధ్య వెనక్కు తిరిగిపోవడం నా కింకా గుర్తుంది. బ్రహ్మానందరెడ్డి తీసుకున్న చర్యకు మద్దతుగా జైపాల్ రెడ్డి, కేశవరావులు ఉద్యమించగా, వ్యతిరేకంగా విద్యార్థి నాయకులు ఉద్యమించారు. ఇంతకు, డి. ఎస్. రెడ్డి చేసిన తప్పేంటి అంటే...ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి కావాలని ప్రతిపాదించడమే! అది నచ్చని బ్రహ్మానందరెడ్డి ఉపకులపతిని తొలగించడానికి చట్టాన్ని సవరించే ప్రయత్నం కూడా చేశాడు. డి.ఎస్. రెడ్డి హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు న్యాయం కోసం వెళ్లాడు. చివరికి కోర్టులో ఆయన పక్షానే తీర్పు వచ్చింది. 1969 వరకు ఆయనే వైస్ ఛాన్స్ లర్‍గా కొనసాగారు. 1968 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి అంకురార్పణ  జరుగుతున్నప్పుడు ఆయనే వైస్ ఛాన్స్ లర్‍. ఉద్యమం వూపందుకునే సరికి రావాడ సత్యనారాయణ ఆయన స్థానంలో వచ్చారు. వైస్ ఛాన్స్ లర్‍గా డి.ఎస్. రెడ్డి కొనసాగించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపధ్యంలో, డిగ్రీ విద్యార్థులకు పరీక్షల్లో "గ్రేస్ మార్కులు" ప్రకటించింది యూనివర్సిటీ. నేను పరీక్ష రాయకపోయినా, కేవలం హాజరైనందుకు నాకు అన్ని సబ్జెక్టుల్లో 15 మార్కులొచ్చాయి!     

నా డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు మార్చ్-ఏప్రిల్ 1966 లో జరిగాయి. నేను లెక్కల పేపర్ రాసిన తరువాత మంచి మార్కులు రావని భావించి, మిగతా పేపర్‌లకు కేవలం హాజరవడం (పరీక్ష పేపర్లు తెచ్చుకోవడానికి) తప్ప రాయలేదు. ఫలితాలు ఊహించినట్లే ఫెయిలయ్యాను. కాకపోతే రాసిన ఒక్క లెక్కల సబ్జెక్టులో పాసయ్యాను. ఆ తరువాత సప్లిమెంటరీ పరీక్షలు రాయలేదు. మళ్లీ హైదరాబాద్‌లో చిక్కడపల్లిలో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని రమణ, నేను మరో స్నేహితుడు వుండేవాళ్లం. ఐతే, నేను ఎక్కువగా మా వూళ్లోనే వుంటూ, మధ్య-మధ్య వచ్చి పోతుండేవాడిని. గ్రామ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించేవాడిని. ఆ విషయాలు ముందు..ముందు రాస్తాను. చిక్కడపల్లిలో వుండే రోజుల్లోనే, సమీపంలో, ఒక మేడపైన, వూటుకూరు అనంత రామారావు, సూర్య ప్రకాశరావు వుంటుండేవారు. వాళ్లిద్దరూ ఉద్యోగాలు చేస్తుండేవారు. వారితో పాటు రావులపాటి సీతారాం రావు కూడా వుండేవారు. మేమంతా తరచుగా కలుస్తుండేవాళ్లం. అనంత రామారావు పేరుకు ఇంజనీరైనా, జనరల్ విషయాలను-వర్తమాన రాజకీయాలను, చాలా చక్కగా విడమర్చి మాట్లాడుతుండేవాడు. ప్రస్తుతం అనంత రామారావు అమెరికాలోని షికాగోలో స్థిరపడ్డారు. మధ్య మధ్య హైదరాబాద్ వచ్చి స్నేహితులతో బంధువులతో కాలక్షేపం చేసి పోతుంటారు. సీతారాం రావు సీనియర్ పోలీసు (ఐ. పి.ఎస్) అధికారిగా పదవీ విరమణ చేశారు. నేను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పని చేస్తున్నప్పుడు, సీతారాం రావు అక్కడ తన చివరి పోస్టింగ్ చేశారు. అదనపు డైరెక్టర్ జనరల్‌గా పదవీ విరమణ అక్కడే చేశారు.

ఇక్కడ అన్నింటికన్నా ముఖ్య విషయం ....ఒక ముఖ్యమైన వ్యక్తి విషయం తెలియచేయాలి. నేనింతకు ముందే రాశాను...ఎల్. వి. ఎస్. ఆర్. శర్మ గురించి. వాడు నాకు హెచ్. ఎస్. సి వరకు, ఆ తరువాత పియుసిలో క్లాస్ మేట్. "నా" అనేవాడెవరూ లేని మనిషి. ఖమ్మంలో చిన్నప్పుడు వరసకు మేనత్తగారింట్లో వుండి చదువుకునేవాడు. వాళ్లతో గొడవపడి మొదట్లో కొంతకాలం తాత్కాలికంగా హెచ్. ఎస్. సి లో వున్నప్పుడు, ఆ తరువాత శాశ్వతంగా పియుసిలో చేరాక వాళ్లింటి నుంచి బయటకొచ్చాడు. వారాలు చేసుకుని ఖమ్మంలో పియుసి పూర్తి చేశాడు. బహుశా పాసవ్వలేదనుకుంటా. ఆ తరువాత విజయవాడకు చేరాడు. కొన్నాళ్లు మద్రాస్‌లో వుండేవాడు. బహు బాషా కోవిదుడు...ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు అనర్గళంగా మాట్లాడేవాడు. విజయవాడ, మద్రాస్ లలో అనేక ఉద్యోగాలు చేశాడు. వాడికి ఒకానొక సందర్భంలో ఆ ఉద్యోగాలేవీ నచ్చలేదు. నేను హైదరాబాద్‌లో చిక్కడపల్లిలోని ఇంట్లో రమణ, రంగారావులతో వుంటున్నప్పుడు, తనకే దన్నా ఉద్యోగం ఇప్పించమని, హైదరాబాద్ వస్తానని ఉత్తరం రాశాడు. సరే...రమ్మన్నాను. తాజ్ మహల్ హోటల్లో లెక్కల పద్దు రాసే ఉద్యోగాన్ని మిత్రుడు కామత్ ఇప్పించాడు. కాని...అది వాడికి నచ్చలేదు. మేం తెప్పించుకునే కారేజీ భోజనంలోనే వాడు కూడా సర్దుకుపోయేవాడు. చివరకు "తద్దినం బ్రాహ్మణుడి" అవతారం ఎత్తాడు. చిక్కడపల్లి స్వరాజ్ హోటెల్ దగ్గరున్న బ్రాహ్మణుల "అడ్డ" కు పోయి ఉదయాన్నే కూర్చుండేవాడు. అంతకు ముందు రూమ్‌లో స్నానం చేసి, గోడకున్న సున్నాన్ని "విభూతి" లాగా పెట్టుకునేవాడు. చేతికందిన పూజల పుస్తకాన్ని పట్టుకు పోయేవాడు. బ్రాహ్మణుల అడ్డ దగ్గరకు "బ్రాహ్మణీకం" అవసరాలున్న వ్యక్తులెందరో వచ్చేవారు ఉదయాన్నే. వాళ్ల అవసరాలకు అనుగుణంగా, వీడు "భోక్త" గానో, "తద్దినం పెట్టించే బ్రాహ్మణుడు" గానో, వ్రతాలు చేయించే "పూజారి" గానో అవతారం ఎత్తేవాడు ఆ పూటకు. మొత్తం మీద ఆ పూటకు భోజనం, కొంత "సంభావన" గిట్టేది. సంభావనతో రాత్రి భోజనం కానిచ్చేవాడు. ఏ పనీ దొరకని నాడు మాతోనే భోజనం. అలా కొన్నాళ్లు చేసి, మళ్లీ మద్రాస్ వెళ్లి పోయాడు. పెళ్లి చేసుకున్న తరువాత విజయవాడలో స్థిరపడి పోయాడు. దానికంటే ముందు కొన్నాళ్లు గయ దగ్గర ఒక ఆయుర్వేద కంపెనీలో పని చేశాడు. అక్కడ నుంచి ఎప్పటికీ దాచిపెట్టుకునే రీతిలో చక్కటి ఉత్తరం రాశాడు. విజయవాడలో కొన్నాళ్లు మద్యం వ్యాపారుల దగ్గర పని చేసేవాడు. ఆ తరువాత చిన్న హోటెల్ ప్రారంభించాడు. ఓ పది సంవత్సరాల క్రితం హఠాత్తుగా చని పోయాడు.


మొత్తం మీద రెండు-మూడు ప్రయత్నాల తరువాత, మార్చ్ 1968 లో లెక్కలు, భౌతిక శాస్త్రం, సెప్టెంబర్ 1968 లో రసాయన శాస్త్రం కంపార్ట్ మెంటల్ గా డిగ్రీ పాసయ్యాను. అలా నా హైదరాబాద్ చదువు-నివాసం ప్రధమ ఘట్టం పూర్తయింది.

Sunday, June 30, 2013

హైదరాబాద్ నగరంలో తొలి అనుభవాలు- కాలేజీ కబుర్లు-Part THREE: వనం జ్వాలా నరసింహారావు

హైదరాబాద్ నగరంలో తొలి అనుభవాలు
కాలేజీ కబుర్లు-Part THREE
వనం జ్వాలా నరసింహారావు

న్యూ సైన్స్ కాలేజీ, బీ ఎస్సీ (ఎం.పీ.సీ) క్లాస్‍లో 150 మందికి పైగా విద్యార్థులుండే వారు. ఎప్పుడూ, సందడిగా, సరదాగా, గలగలా పారే సెలయేరులా వుండేది మా క్లాస్. బయటేమో ఎప్పుడూ..ఏదో ఒక నిర్మాణం జరుగుతుండేది మా కాలేజీలో. కాలేజీకి వున్న మంచి పేరు వల్ల, విద్యార్థుల తాకిడి బాగా వుండేది. అంత మందిని చేర్చుకోవాలంటే, అధిక సంఖ్యలో క్లాస్ రూమ్‌లు కావాలి. అందుకే, ఎప్పుడూ, ఏదో ఒక భవన నిర్మాణం జరుగుతుండేది. ఒక విద్యార్థి...పేరు గుర్తుకు రావడం లేదిప్పుడు...తన దగ్గర ఎప్పుడూ, ఒక "టిక్-టిక్" ధ్వని చేసే టాయ్ వుంచుకునే వాడు. బహుశా...ఆ రోజుల్లోనే అనుకుంటా "దేవాంతకుడు" అనే సినిమా వచ్చి వుండాలి. అందులో హీరో దాన్ని ఉపయోగించేవాడు. ఎవరూ చూడకుండా దాంతో ధ్వని చేయడం అతడికో హాబీ. "సీటింగ్ అరేంజ్ మెంట్" అని రాసి వుంటే, అందులోంచి "ఎస్" అక్షరం తొలగించి, దాన్ని "ఈటింగ్" అని చేసేవాడు. అతడి అల్లరి అంతా-ఇంతా కాదు.

మరి కొందరి క్లాస్ మేట్స్ పేర్లు కూడా గుర్తుకొస్తున్నాయి. ఖమ్మంలో నాతో పాటు పియుసి చదువుకున్న బాల మౌళి (ఇప్పుడో పెద్ద ఛార్టెడ్ అకౌంటెంట్) ఇక్కడ కూడా క్లాస్ మేట్ అయ్యాడు. రాం ప్రసాద్ (ఆయన భార్య గీత..ఆ తరువాతి కాలంలో నాకు స్నేహితురాలైంది) మరొక క్లాస్ మేట్. అతడిప్పుడు ఒక ప్రయివేట్ కంపెనీలో పని చేసి రిటైరై బెంగుళూరులో వుంటున్నాడు. అలానే...రంగ రామానుజం, కుల్ కర్ణి (అతివాద-తీవ్ర వాద భావాల విద్యార్థి), జ్యోతి ప్రసాద్, ఎర్రం రాజు, మల్లికార్జున్, బాబ్జి, సుబ్బా రావు (సీనియర్ సైంటిఫిక్ అధికారిగా పదవీ విరమణ చేశాడు), వి.ఎస్.పి. శాస్త్రి, మల్లాడి వెంకట సుబ్బయ్య, కపాడియా, త్యాగరాజన్, టి. ఆర్. శ్రీనివాసన్ (ప్రస్తుతం షికాగోలో స్థిరపడ్డాడు)...తదితరులు కూడా నాకు క్లాస్ మేట్సే. నిజాం కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం పూర్తి చేసిన వల్లూరి శ్రీ రాం అనే అతడిని, ప్రిన్సిపాల్ సుదర్శన్ నచ్చ చెప్పి ఫైనల్ ఇయర్ లో మా కాలేజీలో, మా క్లాస్ లో చేర్పించాడు. అతడికి లాంగ్వేజెస్ లో యూనివర్సిటీ ఫస్ట్ రావడంతో, ఫైనల్ డిగ్రీలో కూడ అతడికే రాంక్ వచ్చే అవకాశాలున్నాయని భావించిన సుదర్శన్ గారు అలా చేశారు. ఆయన గెస్ నిజమైంది. డిగ్రీలో అతడికే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. క్రెడిట్ న్యూ సైన్స్ కాలేజీకి దక్కింది. ఆయన పక్క నంబరైన నేను కనీసం పాసు కూడా కాలేదు! అసలు పరీక్షలే రాయలేదు! ఇంటర్ నెట్‌లో చూస్తే, శ్రీ రాం అమెరికాలో పని చేస్తున్నట్లు అర్థమైంది.

లెక్చరర్ల విషయానికొస్తే, బహుశా, అంత నైపుణ్యం కల అధ్యాపకులు, మరే కాలేజీలోను వుండరంటే అతిశయోక్తి కాదేమో! తెలుగు బోధించడానికి ఇద్దరుండేవారు. ఒకరి పేరు "మంజు శ్రీ"...మరొకరి పేరు "అరిపిరాల విశ్వం". మాకు తెలుగు పాఠ్య పుస్తకంగా "ఆంధ్ర మహాభారతోపన్యాసాలు", నాన్-డిటేల్‍గా "పురుషోత్తముడు", నాటకంగా "హాలికుడు" వుండేవి. ఆంధ్ర మహాభారతోపన్యాసాలు లో, ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్న సందర్భంలో ఆయనను ఆక్షేపిస్తూ శిశుపాలుడు పద్య రూపంలో అన్న మాటలు "అవనీ నాధు లనేకు లుండఁగ విశిష్టారాధ్యు లార్యుల్ మహీ దివిజుల్ పూజ్యులు పల్వు రుండఁగ ధరిత్రీనాథ! గాంగేయుదుర్వ్యవసాయంబునఁ గృష్ణు గష్టచరితున్ వార్ష్ణేయు బూజించి నీ యవివేకం బెఱిఁగించి తిందఱకు దాశార్హుండు పూజార్హుఁడే" ఇంకా గుర్తున్నాయి. పద్య భాగం పుస్తకం పేరు గుర్తుకు రావడం లేదు కాని ఒక పాఠం..."గంగావతరణం" ఇంకా గుర్తుంది. అందులోని ఒక పద్యం...."ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సుశ్లోకంబైన హిమాద్రినుండి భువి, భూలోకమునందుండి యస్తోకాంభోధి, పయోధినుండి పవనాంధోలోకమున్ చేరె గంగా కూలంకష, పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్".....కొంచెం..కొంచెం గుర్తుకొస్తోంది. అరిపిరాల విశ్వం గారి తమ్ముడు రామ్మోహన రావు కూడా నా క్లాస్ మేట్.


New Science College

ఇంగ్లీష్ లెక్చరర్లుగా "షమీం" మేడం, "వి. వి. చారి" గారుండేవారు. పాఠ్య పుస్తకం-వాచకంగా ఇ.ఎఫ్.డాడ్ సంపాదకీయంలోని వ్యాసాల సంకలనం వుండేది. ఎ. జి. గార్డినర్ రాసిన వ్యాసం ఒకటుంది. ఇ. ఎం. ఫార్ స్టర్ రాసిన "పాసేజ్ టు ఇండియా" నాన్-డిటేల్ గా వుండేది. ఫార్ స్టర్ ఆ పుస్తకాన్ని 1924 లో భారత దేశంలో ఆంగ్లేయుల పాలన-1920 నాటి స్వాతంత్ర్య పోరాటం నేపధ్యంలో రాశారు. ప్రపంచంలోని వంద అత్యుత్తమైన ఇంగ్లీష్ లిటరేచర్ పుస్తకాలలో ఒకటిగా పాసేజ్ టు ఇండియాను "మాడరన్ లైబ్రరీ" ఎంపిక చేసింది. 1923-2005 మధ్య కాలంలో వచ్చిన అత్యుత్తమైన వంద ఇంగ్లీష్ నవలలో ఒకటిగా ఈ పుస్తకాన్ని "టైం మాగజైన్" ఎంపిక చేసింది. నవల మొత్తం కేవలం నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుంది. డాక్టర్ అజీజ్, ఆయన బ్రిటీష్ స్నేహితుడు సిరిల్ ఫీల్డింగ్, శ్రీమతి మూర్, కుమారి అడెలా క్వెస్టెడ్. ఇంగ్లీష్ పోయెట్రీలో కొన్ని పాఠాలు గుర్తున్నాయి. జార్జ్ హెర్బర్ట్ రాసిన "Virtue" (సద్గుణం, సత్ ప్రవర్తన) లో చక్కటి నీతి వుంది. ప్రపంచం మొత్తం కాల గర్భంలో కలిసి పోయినా మనిషి సత్ ప్రవర్తన, సద్గుణం అజరామరంగా వుంటుందని దాని భావన ("Only a sweet and virtuous soul, Like seasoned timber, never gives; But though the whole world turn to coal. Then chiefly lives"). మరో పోయెం 1608-1674 మధ్య కాలంలో జీవించిన "జాన్ మిల్టన్" రాసిన "పారడైజ్ లాస్ట్". ఆయనే రాసిన మరో పోయెం "ఆన్ హిజ్ బ్లయిండ్ నెస్". ఇంకో పోయెం కూడా గుర్తుంది. అది "విలియం వర్డ్ స్‌ వర్త్" రాసిన "సాలిటరీ రీపర్" (...."Alone she cuts and binds the grain, And sings a melancholy strain..."). జనరల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ను నాందేడ్కర్, సుబ్రహ్మణ్యం సార్లు చెప్పేవారు. చాలా ఇంటరెస్టింగ్ గా వుండేదా క్లాస్.

ఆప్షనల్ సబ్జెక్టులైన లెక్కలు, భౌతిక, రసాయన శాస్త్రాలు చెప్పే లెక్చరర్లు ఆయా విషయాలను అత్యంత ఆసక్తికరంగా బోధించే వారు. లెక్కల సబ్జెక్టులో మేం ఫైనల్ ఇయర్ పరీక్షల్లో మూడు పేపర్లు రాయాలి. ఒకటి "బీజ గణితం", రెండోది "రేఖా గణితం", మూడోది "త్రికోణమితి". రేఖా గణితం పుస్తకం "మాణిక్య వాచికం పిళ్లే" రాసిన దాన్ని ఉపయోగించే వాళ్లం. బీజ గణితాన్ని "షఫీ ఉల్ హక్", రేఖా గణితాన్ని "భాస్కర రావు", త్రికోణమితిని డాక్టర్ కుప్పుస్వామి బోధించేవారు. నాకు మొదటి నుంచి లెక్కల సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టంగా వుండేది. పరీక్ష రాసిన ప్రతి సారీ ఆ ఒక్క సబ్జెక్ట్ పాసయ్యేవాడిని మంచి మార్కులతో. మిగతావి (భౌతిక, రసాయన శాస్త్రాలు) రాయడానికే భయం వేసేది. భౌతిక శాస్త్రాన్ని "హరి లక్ష్మీపతి", "ప్రభాకర్" బోధించేవారు. భౌతిక శాస్త్రంలో "మాడరన్ ఫిజిక్స్" అనే నాలుగో పేపర్ కూడా వుండేది. డిమాన్ స్ట్రేటర్‌గా పి. వి. వి. ఎస్. మూర్తి మాతో ప్రయోగశాలలో ప్రాక్టికల్స్ చేయించేవారు. వాటిల్లో "వెలాసిటీ ఆఫ్ సౌండ్", "వర్నియర్ కాలి పర్స్", "స్క్రూ గేజ్"", ఫిజికల్ బాలెన్స్" లతో చేసిన ప్రయోగాలింకా గుర్తున్నాయి. అదే విధంగా రసాయన శాస్త్రం ప్రయోగాలను "రఘురాం" గారు చేయించేవారు. "వాల్యూ మెట్రిక్ అనాలసిస్", "పిప్పెట్, బ్యూరెట్ట్" ఉపయోగించడం తో పాటు "కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు" తయారు చేయించడం చేసే వాళ్లం. రసాయన శాస్త్రం థియరీలో మూడు భాగాలుండేవి. "ఆర్గానిక్", "ఇన్-ఆర్గానిక్", "ఫిజికల్" అనే ఆ మూడింటిని ముగ్గురు లెక్చరర్లు బోధించేవారు. "వై. సూర్యనారాయణ మూర్తి" ఆర్గానిక్ సబ్జెక్టు చెప్పేవారు. ఇప్పటికీ ఆయన బోర్డు మీద వేసిన "బెంజిన్ రింగ్" కళ్లలో మెదులుతుంది. ఇన్-ఆర్గానిక్ అంశాన్ని ప్రిన్సిపాల్ సుదర్శన్ గారు చెప్పేవారు. ఫిజికల్ కెమిస్ట్రీని కూడా వై.ఎస్.ఎన్ గారు చెప్పినట్లు గుర్తు. సర్కార్ అండ్ రక్షిత్ రాసిన ఆర్గానిక్ కెమిస్ట్రీ పుస్తకాన్ని, బాల్ అండ్ తులి రాసిన ఇన్-ఆర్గానిక్ కెమిస్ట్రీ పుస్తకాన్ని చదివే వాళ్లం. లైబ్రరీకి అడపదడప పోయే వాళ్లం. లైబ్రేరియన్‍గా పుల్లయ్య పని చేసేవాడు. తరువాత రోజుల్లో (1973-1974) ఉస్మానియా యూనివర్సిటీలో నేను లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ చేసేటప్పుడు, అతడు కూడా నాతోపాటు చదివాడు.


కాలేజీ చదువుతో పాటు క్రికెట్ ఆటకు క్రమం తప్పకుండా పోవడం కూడా అలవాటు చేసుకున్నాను. బర్కత్ పూరా సమీపంలోని ఆంధ్ర యువతీ మండలి మైదానంలో క్రికెట్ ప్రాక్టీసుకు వెళ్లేవాడిని. "జాలీ రోవర్స్ క్రికెట్ క్లబ్" ఆ రోజుల్లో హైదరాబాద్ "బి-లీగ్" మాచ్‍లు ఆడుతుండేది. నేను ఆ క్లబ్ పక్షాన ఆడేవాడిని. అంతగా ఆటలో రాణించక పోయినా ప్రాక్టీసు మానక పోయేవాడిని. నేను ప్రాక్టీసు చేస్తున్న రోజుల్లో ఆడిన పెద్ద క్రికెట్ క్రీడాకారుల్లో "అబ్దుల్ హాయ్", "సాయినాథ్", "ప్లహ్లాద్" వున్నారు. దరిమిలా వాళ్లంతా రంజీ ట్రోఫీ స్థాయి వరకు ఎదిగారు. నేను హైదరాబాద్‌లో ఆడడంతో, శెలవులకు ఖమ్మం వెళ్లినప్పుడు నాకు అదో రకమైన గౌరవం లభించేది. ఖమ్మం మామిళ్లగూడెం క్రికెట్ క్లబ్ పక్షాన టోర్నమెంటులకు వెల్లే జట్టులో నేనుండే వాడిని. ఖమ్మంలో వనం రంగారావు, నర్సింగరావు, శేషగిరి, మూర్తి, దిలీప్, శంకర్, దివాకర్, ప్లహ్లాద్, కళాధర్, రాధాకృష్ణ...లాంటి వారితో కలిసి ఆడాను.

Saturday, June 29, 2013

హైదరాబాద్ నగరంలో తొలి అనుభవాలు - కాలేజీ కబుర్లు-Part TWO: వనం జ్వాలా నరసింహారావు

హైదరాబాద్ నగరంలో తొలి అనుభవాలు
కాలేజీ కబుర్లు-Part TWO
వనం జ్వాలా నరసింహారావు

ప్రతిరోజు సాయంత్రం నేను, స్నేహితుడు నరసింహ మూర్తి, క్రమం తప్పకుండా కలిసే వాళ్లం. నరసింహమూర్తి వివేక వర్ధని కాలేజీలో బి. . (ఎకనామిక్స్, పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) చదువుతుండేవాడు. వాళ్లన్నయ్య కృష్ణమూర్తి గారు మామయ్యతో పాటు సచివాలయంలో పని చేస్తుండేవాడు. వాళ్ల మధ్య స్నేహం మమ్మల్ని కూడా దగ్గరికి చేర్చింది. కాలేజీ నుంచి వచ్చిన తరువాత సాయంత్రం నాలుగు-ఐదు గంటల ప్రాంతంలో నారాయణ గుడా తాజ్ మహల్ ముందు కలిసే వాళ్లం. కబుర్లు చెప్పుకుంటూ, ఒక ప్లేట్ "ముర్కు" తిని, "వన్ బై టు" కప్పు కాఫీ తాగి (బహుశా అంతా కలిపి అర్థ రూపాయ కన్నా తక్కువ బిల్లు అయ్యేదేమో!) బయట పడే వాళ్లంతాజ్ మహల్ హోటెల్ లో పనిచేసే కామత్ అనే అతను మాకు మంచి స్నేహితుడయ్యాడు. కూపన్ మరిచి పోయి వచ్చినా, డబ్బులు టైంకు ఇవ్వలేక పోయినా, భోజనం విషయంలో ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. కాఫీ-టీలు ఫ్రీగా తాగిన రోజులు కూడా ఎన్నో వున్నాయి. మాతో పాటు ఒక్కోసారి రూమ్మేట్ కల్మల చెర్వు రమణ, ఉస్మానియా "బి-హాస్టల్" లో వుంటూ ఎం. ఎ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్న వనం రంగారావు (నర్సింగరావు తమ్ముడు...చనిపోయాడు) కూడా వుండేవారు. తాజ్ మహల్ నుంచి బయటికొచ్చి, కాసేపు నారాయణ గుడా బ్రిడ్జ్ పక్కనున్న పార్క్ లో కూచుని కబుర్లు చెప్పుకునే వాళ్లం. ఒక్కో సారి హిమాయత్ నగర్ మీదుగా, పీపుల్స్ హై స్కూల్ పక్కనుంచి నడుచుకుంటూ, చిక్కడపల్లి దాకా పోయి, నరసింహమూర్తిని వదిలేసి, నేను తాజ్ మహల్ హోటెల్ కు పోయి భోజనం చేసి రూమ్ కు వెళ్లే వాడిని. మధ్య-మధ్య నారాయణ గుడా నుంచి నడుచుకుంటూ వై.ఎం.సి.ఏ మీదుగా, బడీ చావడీ, సుల్తాన్ బజార్, కోఠి తిరిగి వచ్చే వాళ్లం. తిరుగు ప్రయాణం, ఒక వేళ అలిసిపోతే, బస్సులో చేసే వాళ్లం.

హిమాయత్ నగర్, అశోక్ నగర్ మధ్య ఇప్పుడున్న "బ్రిడ్జ్" అప్పుడు లేదు. వర్షాకాలంలో మోకాలు లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లే వాళ్లం. అశోక్ నగర్ లో ఇప్పుడు బ్రహ్మాండంగా వెలిగిపోతున్న "హనుమాన్" గుడి అప్పుడు లేదు. కేవలం ఒక విగ్రహం మాత్రం రోడ్డు మధ్యలో-కొంచెం పక్కగా వుండేది. నేను, మూర్తి, ఒకరు చూడకుండా మరొకరు ఆ విగ్రహానికి దండం పెట్టుకుని కదిలే వాళ్లం. పీపుల్స్ హైస్కూల్ దాటిన తరువాత మలుపు తిరిగి చిక్కడపల్లి వైపు పోతుంటే, ఇప్పుడు సిటీ సెంట్రల్ లైబ్రరీ భవనం వున్న చోట ఒక కల్లు కాంపౌండ్ వుండేది. దాని ముందర నుంచి చీకటి పడిన తరువాత వెళ్లాలంటే కొంచెం భయమేసేది కూడా. ఇక మా కబుర్లలో వర్తమాన రాజకీయాలు ఎక్కువగా వుంటుండేవి. కేరళ నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని ఇందిరా గాంధి ఎలా పడగొట్టింది, కెన్నెడీని ఎలా చంపారు, మావో సేటుంగ్ వ్యవహారం...ఇలా...జాతీయ-అంతర్జాతీయ రంగానికి చెందిన కబుర్లుండేవి. మూర్తికి, నాకు మధ్య స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. పోలీసు స్పెషల్ బ్రాంచ్ లో సీనియర్ అధికారిగా పని చేసి పదవీ విరమణ చేసాడు మూర్తి. అప్పట్లో హైదరాబాద్ లో ఒక సారి అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన ఒక బహిరంగ సభ ఫతే మైదాన్ స్టేడియంలో జరిగినట్లు గుర్తు. ఆ సభలో నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి "టోపీ" ని సవరించుకుంటుంటే, రాబోయే రోజుల్లో, ఏదో ఒక రాజకీయ మార్పు వుంటుందని పరిశీలకులు వ్యాఖ్యానించినట్లు గుర్తు కూడా వుంది. 


హైదరాబాద్‌లో ఆ రోజుల్లో ఇప్పుడున్నన్ని సినిమా టాకీసులు లేవు. వున్నవాటిలో ఎయిర్ కండిషన్ థియేటర్లు కాని, ఎయిర్ కూల్డ్ థియేటర్లు కాని దాదాపు లేనట్లే. ఆబిడ్స్ లో వున్న "జమ్రూద్" టాకీసు ఒక్కటే జనరేటర్ బాక్-అప్ వున్న ఎయిర్ కండిషన్ థియేటర్. అలానే వి. వి. కాలేజీ పక్కనున్న "నవరంగ్" థియేటర్ ఒకే ఒక్క ఎయిర్ కూల్డ్ థియేటర్. ఇవి కాకుండా నారాయణ గుడాలో "దీపక్ మహల్", హిమాయత్ నగర్ లో "లిబర్టీ", సికిందరాబాద్ లో "పారడైజ్", "తివోలీ" థియేటర్లుండేవి. సికిందరాబాద్ లో ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలు చూపించేవారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఇప్పుడున్న థియేటర్లు ఏవీ అప్పుడు లేవు. ముషీరాబాద్‌లో "రహమత్ మహల్" టాకీసుండేది. అలానే నారాయణ గుడా దీపక మహల్ పక్కన "రాజ్ కమల్" బార్ అండ్ రెస్టారెంట్ (ఇప్పటికీ వుంది) వుండేది. బహుశా అందులో మద్యపానం అలవాటు చేసుకోని వారు అరుదుగా వుంటారేమో! నాకు బాగా గుర్తుంది….. డిగ్రీ పరీక్షల్లో, చివరిగా, మాడరన్ ఫిజిక్స్ పేపర్ (వాస్తవానికి హాజరవడమే కాని మొదటి సారి నేను రాయలేదు) అయిపోయిన తరువాత, మధ్యాహ్నం పూట, మొట్ట మొదటి సారిగా, రాజ్ కమల్ బార్‌కు వెళ్లి, "గోల్డెన్‌ ఈగిల్" బీర్ తాగాను. నేను తాగలేనని వనం రంగారావు ఛాలెంజ్ చేయడంతో ఆ పని చేయాల్సి వచ్చింది. అప్పట్లో బీర్ బాటిల్ ధర కేవలం మూడు రూపాయలే! 1966 లో అలా మొదలైన ఆ అలవాటు ఇప్పటికీ నన్ను వదలలేదు. మరో మూడేళ్లలో నా తాగుడికి "గోల్డెన్‌ జూబ్లీ" సెలబ్రేషన్స్ చేసుకోవచ్చేమో! అప్పుడు మూడు రూపాయల ధర మాత్రమే వున్న బీర్ బాటిల్ ఇప్పుడు వంద దాటి పోయింది...అప్పట్లో కేవలం గోల్డెన్‌ ఈగిల్ లాంటి ఒకటి-రెండు బ్రాండులే వుండగా, ఇప్పుడు లెక్క లేనన్ని వున్నాయి!  


అశోక్ నగర్ లో, నా కంటే వయసులో పెద్ద, స్నేహితుడు, వూటుకూర్ వరప్రసాద్ వుండేవాడు. ప్రసాద్, మరికొందరు ఇతర స్నేహితులతో కలిసి దగ్గర లోని సుధా హోటల్ లో కాని, కొంచెం దూరంలో వున్న నారాయణగూడా తాజ్ మహల్ హోటెల్ లో కాని కూర్చుని, కప్పు కాఫీ తాగుతూ, సాయంత్రాలు గడిపే వాళ్లం. నేను హైదరాబాద్ లో వున్న తొలినాళ్లలో, ఆ తరువాత, వర ప్రసాద్ ద్వారా పరిచయమైన వ్యక్తులలో ఏ నాటికీ మరవలేని ఒక మహనీయుడు మహారాజశ్రీ అనే ఒక సాదా-సీదా మనిషి. సుధా హోటెల్, నారాయణ గూడా తాజ్ మహల్ హోటెల్ చర్చలలో మహారాజశ్రీ మాకు పెద్ద దిక్కు. గలగలా మాట్లాడే స్వభావం ఆయనది. చిన్నవాళ్ల మైనా మమ్ములను మర్యాదగా సంభోదించేవాడు. మహారాజశ్రీ పరిచయం కూడా గమ్మత్తుగా అయిందనాలి. ఆయన వయస్సు అప్పుడెంతో నాకు గుర్తుకు రావడం లేదు కాని వయసులో మాకంటే చాలా పెద్ద వాడే అని మాత్రం చెప్పగలను. నేను బాగా అభిమానించే బ్రిటీష్ రచయిత, ఉద్యమకారుడు, తత్వవేత్త, బెర్ట్రాండ్ రస్సెల్ అక్టోబర్ 22, 1960 లో లండన్ నగరంలో స్థాపించిన "కమిటీ ఆఫ్ వన్ హండ్రెడ్" ఆదర్శాలను-భావాలను తనదైన శైలిలో పదిమందితో పంచుకోవాలన్న తపన మొదటగా వ్యక్తం చేసింది మహారాజశ్రీ. నాకెందుకో ఆయన భావాలు ఆ విధంగా నచ్చాయి అప్పట్లో... ఆ మాటకొస్తే ఇన్నేళ్ల తరువాత ఇప్పటికీ కూడా. ఒక లాల్చీ-పైజమా, అది కూడా మాసినట్లు కనిపించే విధంగా ధరించి, ఎప్పుడూ-ఏదో విషయంలో మాట్లాడుతూనే వుండేవాడు మహారాజశ్రీ. ఆయన మాటల్లో ఎక్కువగా ప్రపంచ శాంతి-అంతర్జాతీయ సౌభ్రాతృత్వం-మానవాభ్యుదయం పదాలు దొర్లుతుండేవి. "కమిటీ ఆఫ్ వన్ హండ్రెడ్" పేరుతో స్వయంగా మహారాజశ్రీ ఒక హౌజ్ మాగజైన్ నడిపినట్లు కూడా గుర్తు. కరపత్రాలు చాలా సార్లు ముద్రించాడు. "కమిటీ ఆఫ్ వన్ హండ్రెడ్" స్థాపనకు మూలకారణమైన అణ్వాయుధ వ్యాప్తి వ్యతిరేక శాసనోల్లంఘన ఉద్యమాన్ని గురించి పదే-పదే మాట్లాడేవాడు మహారాజశ్రీ. ఆయన మాటల్లో బెర్ట్రాండ్ రస్సెల్ పేరుతో పాటు ఆయన సహ ఉద్యమ కారులైన రాల్ఫ్ షోన్ మన్, రెవరెండ్ మైఖేల్ స్కాట్, ఇతర మద్దతు దార్ల పేర్లు తరచుగా వినబడేవి. అణ్వాయుధ నిరాయుధీకరణ విషయం కూడా చెప్పేవాడు. "కమిటీ ఆఫ్ వన్ హండ్రెడ్" అధ్యక్షుడిగా బెర్ట్రాండ్ రస్సెల్ ఎన్నికయ్యారు. మహారాజశ్రీ ఏనాడూ తన స్వవిషయం చెప్పేవాడు కాదు. ఆయనకు ఎంతమంది పిల్లలో కూడా నాకు తెలియదు. తాను తీసుకొచ్చే మాగజైన్ కు కాని, కరపత్రాలకు కాని నిధులెక్కడ నుంచి సమకూర్చుకునేవాడో కూడా తెలియదు. నన్ను మాత్రం ఒక్క రోజు కూడా ఒక్క రూపాయ కూడా అడగలేదు. ఇప్పటికీ-ఎప్పటికీ మరవరాని మహనీయులైన వ్యక్తులలో మహారాజశ్రీ ముందు వరుసలో వుంటారనడంలో అతిశయోక్తి లేదు.

Friday, June 28, 2013

హైదరాబాద్ నగరంలో తొలి అనుభవాలు, కాలేజీ కబుర్లు-Part ONE: వనం జ్వాలా నరసింహారావు

హైదరాబాద్ నగరంలో తొలి అనుభవాలు
కాలేజీ కబుర్లు-Part ONE
వనం జ్వాలా నరసింహారావు

మొత్తం మీద, ద్వారక సార్ పుణ్యమా అంటూ, 1964 జూన్ నెలలో న్యూ సైన్స్ కాలేజీలో బిఎస్సీ డిగ్రీ రెండో సంవత్సరంలో చేరాను. అప్పటికే ఫస్ట్ ఇయర్ లో చేరిన వారి సంఖ్య 150 దాటింది. నా రోల్ నంబర్ "150 X" గా కేటాయించారు. కాలేజీలో చేరడం పూర్తయిన తరువాత చేసిన మొట్టమొదట పని నేను వుండడానికి ఒక గది వెతుక్కోవడం. మా సమీప బంధువులు, శ్రీమతి ఝాన్సీ దంపతులకు, విద్యా నగర్ అడ్డీకమేట్ లో ఇల్లుండేది. వారింట్లో ఒక గది అద్దెకు తీసుకున్నాను. నెలసరి అద్దె పది రూపాయల లోపే! అప్పట్లో నాన్న గారు నాకు నెలకు వంద రూపాయలు ఖర్చులకొరకు పంపేవారు. రెండు నెలలు శెలవులు పోగా, మిగిలిన పది నెలల మొత్తం మీద వెయ్యి రూపాయలు వచ్చేవి. ఫీజులకు పోను, నెలంతా ఖర్చులకు పోను, ఇంకా నెలకు పది-పదిహేను రూపాయలు మిగిలేవి. అవి మా అత్తయ్య దగ్గర దాచుకునేవాడిని. శెలవుల్లో ఇంటికి వెళ్లేటప్పుడు తమ్ముళ్లకు-చెల్లెళ్లకు ఏమన్నా కొనుక్కోపోయేవాడిని. ఎన్ని కొన్నా ఇంకా డబ్బులు మిగిలేవి. శెలవులకు వెళ్లినప్పుడల్లా మామయ్య-అత్తయ్య, మేనల్లుడినైన నాకు, పాంటు-షర్ట్ గుడ్దలు కొనిచ్చేవాడు. అవి ఖమ్మంలో కాని, లేకపోతే శెలవుల తరువాత హైదరాబాద్ వచ్చినప్పుడు నారాయణ గుడాలోని "యాక్స్" టైలర్ దగ్గర కాని, "పారగాన్" టైలర్ దగ్గర కాని కుట్టించుకునేవాడిని. అప్పట్లో కుట్టు కూలీ ఐదారు రూపాయల కంటే మించకపోయేది. ఇప్పటి లాగా అప్పట్లో "రెడీ మేడ్" దుస్తులు ఎక్కువగా లభించకపోయేవి. ఎక్కువగా "టెరిలీన్", "వులెన్" దుస్తులు లభించేవి. కాటన్ తక్కువే. మొదట్లో "బాటం వెడల్పు" గా వుండే పాంట్లు కుట్టించుకునే వాళ్లం. ఆ తరువాత "గొట్టం" పాంట్ల ఫాషన్ వచ్చింది. అవి పోయి "బెల్ బాటం" వచ్చాయి. పాంటు కింద భాగంలో మడతతో కొన్నాళ్లు, మడత లేకుండా కొన్నాళ్లు ఫాషన్‌గా వుండేది. బట్టలు ఎక్కువగా "ఎఫ్. డి. ఖాన్ బట్టల దుకాణం" లో కొనే వాళ్లం.

విద్యా నగర్ లో వున్నంత కాలం భోజనం సమీపంలోని చెలమయ్య హోటెల్ లో తినేవాడిని. చెలమయ్య హోటెల్ ఇడ్లీలు కూడా తినేవాడిని ఉదయం పూట. విద్యా నగర్ నుంచి కాలేజీకి వెళ్లడానికి "3-డి" బస్సు ఎక్కి, నారాయణ గుడాలో దిగి, నడుచుకుంటూ, విఠల్ వాడీ మీదుగా వెళ్లేవాడిని. ఒక్కో సారి "చారనా" బాడుగ ఇచ్చి "చార్మీనార్ చౌ రాస్తా" (ఇప్పటి ఆర్. టి. సి. క్రాస్ రోడ్స్) వరకు రిక్షాలో వచ్చి, అక్కడ నుంచి "7-సి" బస్సెక్కి, వై.ఎం.సి.ఏ దగ్గర దిగి నడుచుకుంటూ వెళ్లేవాడిని కాలేజీకి. చార్మీనార్ చౌ రాస్తా చుట్టుపక్కలంతా పారిశ్రామిక వాడగా వుండేదప్పట్లో. చార్మీనార్ సిగరెట్ కర్మాగారం (వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ), (నీలం రంగు పాకెట్ లో వచ్చే) గోలకొండ సిగరెట్ కర్మాగారం అక్కడే వుండేవి. చార్మీనార్ చౌ రాస్తా నుంచి విద్యానగర్‍కు వెళ్లడానికి పక్కా రోడ్డు లేదప్పట్లో. ఆ మార్గంలో సిటీ బస్సులు నడవకపోయేవి. విద్యా నగర్ పక్కనే జమిస్తాన్ పూరాకు వెళ్లడానికి "రామ్ నగర్ గుండు" మీద నుంచి వెళ్లే వాళ్లం. చార్మీనార్ చౌ రాస్తా-ఆర్. టి. సి. క్రాస్ రోడ్స్ నుంచి (ఇప్పుడున్న) టాంక్ బండ్‍ను కలిపే రోడ్డు కూడా అప్పట్లో లేదు. ఇప్పుడు టాంక్ బండ్‍ను కలిపే స్థలంలో కొంచెం అటు-ఇటుగా ఒక "కల్లు కాంపౌండ్" వుండేది. దానిని తొలగించడానికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మొదట్లో సాధ్యపడలేదు. ఇందిరా పార్క్ అసలే లేదు. ధర్నా చౌక్ కూడా లేదు. ఇందిరా పార్క్ దగ్గర నుంచి టాంక్ బండ్ పక్కగా ప్రస్తుతం వున్న "ఫ్లయిఓవర్" కూడా లేదప్పుడు. ఆ రోజుల్లో హైదరాబాద్‌లో కనీసం పాతిక-ముప్పై వేల రిక్షాలన్నా వుండేవి. మీటర్ టాక్సీలుండేవి కాని, బేరం కుదుర్చుకోని ఎక్కించు కోవడం తప్ప మీటర్ ఎప్పుడూ వేయక పోయేవారు. డ్రైవర్ కాకుండా ముగ్గురికంటే ఎక్కువగా టాక్సీలో కూర్చోనీయక పోయే వాళ్లు. ఆటోలు కూడా వుండేవి కాని అంత పాపులర్ కాదు. ఆటోలలో ఇద్దరు పాసింజర్లకే పర్మిషన్. టాక్సీలకు కిలోమీటర్‌కు పావలా చార్జ్ వున్నట్లు గుర్తు.

సిటీ బస్సుల్లో ప్రయాణం ఇప్పటి లాగా కష్టంగా వుండేది కాదు. హాయిగా ప్రయాణం చేసే వాళ్లం. "ఆగే బడో" అనుకుంటూ కండక్టర్ సున్నితంగా చెపుతుంటే ప్రయాణీకులు క్రమ శిక్షణతో దొరికిన సీట్లలో కూచోవడమో, లేదా, ఒక క్రమ పద్ధతిన నిలబడడమో చేసేవారు. సింగిల్ బస్సులు, ట్రైలర్ బస్సులు, డబుల్ డెక్కర్ బస్సులు వుండేవి. కండక్టర్ చేతిలో టికెట్ ఇచ్చే మిషన్ వుండేది. బర్రున తిప్పి ఒక చిన్న టికెట్ ఇచ్చేవాడు. టికెట్ ఖరీదు పైసల్లోనో, అణా-బేడలలోనో వుండేది. కనీస చార్జ్ ఒక "అణా"-ఆరు "నయాపైసలు" వున్నట్లు గుర్తు. ఉదాహరణకు విద్యా నగర్ నుంచి నారాయణ గుడాకు కాని, చార్మీనార్ చౌ రాస్తా నుంచి వై.ఎం.సి.ఏ కు కాని "అణా" లేదా ఆరు పైసలు రేటుండేది. ఇంతకీ "అణా" ఏంటనే ప్రశ్న రావచ్చు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్త రోజుల్లో కొన్నాళ్ల వరకు-బహుశా ఒక ఆర్నెల్ల వరకనుకుంటా, ఇంకా అణా-బేడలు చలామణిలోనే వుండేవి. అందుకే ఇక్కడ కొంత మన నాణాల గురించి ప్రస్తావిస్తే బాగుంటుందేమో! ఆగస్ట్ 15, 1947 భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజుల్లో అమల్లో వున్న కరెన్సీ నాణాలు "దశాంశ" తరహా నాణాలు కావు. రూపాయను పదహారు "అణా” లుగా, ఎనిమిది "బేడ” లుగా, నాలుగు "పావలా” లుగా, రెండు "అర్థ రూపాయ” లుగా విభజించి చలామణిలో వుంచారు. ఒక "అణా” కు నాలుగు పైసలు...రూపాయకు 64 పైసలు. 1957 లో "డెసిమల్" పద్ధతిలోకి చలామణిని మార్చింది ప్రభుత్వం. అయితే 1964 (నేను హైదరాబాద్ వచ్చిన కొత్త రోజుల) వరకు, నాన్-డెసిమల్ (అణా, బేడ, పావలా...), డెసిమల్ పద్ధతులు రెండింటినీ వాడకంలో వుంచారు. అణా గుండ్రంగా, బేడ నాలుగు పలకలుగా-పచ్చ రంగులో వుండేవి. ఆ తరువాత నాన్-డెసిమల్ నాణాల వాడకం ఉపసంహరించింది ప్రభుత్వం. ఇప్పుడు మనం పైసలుగా వ్యవహరిస్తున్న నాణాలను 1957-1964 మధ్య కాలంలో "నయా పైస” లుగా పిలిచేవారు. 1, 2, 5, 10, 20, 25, 50 (నయా) పైసల నాణాలు చలామణిలో వుండేవి.


విద్యా నగర్ లో ఎక్కువ రోజులుండలేదు. అక్కడ నుంచి కాలేజీకి వెళ్లి రావడం ఇబ్బందిగా వుండడంతో మకాం మార్చాలనుకున్నాను. మారుదామనుకుంటున్న రోజుల్లో, మా పిన్ని కొడుకు కల్మల చెర్వు రమణా రావు (రమణ), హైదరాబాద్ న్యూ సైన్స్ కాలేజీలో డిగ్రీలో చేరడానికి వచ్చాడు. రమణ కూడా సత్యనారాయణ రావు మామయ్యకు వరసకు మేనల్లుడే. నేనేమో స్వయానా అక్క కొడుకునైతే, రమణ, మామయ్యకు కజిన్ సిస్టర్ కొడుకు. మామయ్య-అత్తయ్య ఆ తేడా ఎప్పుడూ చూపలేదు. ఇద్దరం కలిసి వెతకగా హిమాయత్ నగర్ పదకొండో వీధిలో ఒక ఇంట్లో (3-6-700) ముందు భాగంలో గది దొరికింది. అద్దె పది రూపాయలు. చెరి ఐదు రూపాయలన్న మాట. ఆ గదిలో 1965 మార్చ్-ఏప్రిల్ వరకున్నాం. ఆ గదిలో వుంటున్నప్పుడు ఒక సారి వనం నర్సింగరావు (కమలాపురం), గండ్లూరి కిషన్ రావు (బాణాపురం), తాళ్లూరి వైకుంఠం (మండవ) హైదరాబాద్ వచ్చి మా రూంలో మకాం చేసారు. వాళ్లు ముగ్గురు, వూటుకూరు వరప్రసాద్ కలిసి ఒక లారీ కొని వ్యాపారం చేయడానికి నిర్ణయం మా రూంలోనే జరిగింది. కొన్నారు కూడా ఆ తరువాత. వాళ్లొచ్చిన రోజు రాత్రి "చీట్ల పేక" ఆడి, తగాదా కూడా పడ్డాం. డిగ్రీ రెండో సంవత్సరం లాంగ్వేజెస్ పరీక్షలు పూర్తైన తరువాత శెలవులకు వెళ్తూ గది ఖాళీ చేశాం. పరీక్షల్లో నేను థర్డ్ క్లాస్‍లో పాసయ్యాను. శెలవుల తరువాత మళ్లీ హైదరాబాద్ వచ్చి గది వెతుక్కుంటున్నప్పుడు నేలకొండపల్లి వాస్తవ్యుడైన కంకిపాటి జగన్మోహన్ రావుగారి కుమారుడు సీతారాం రావు మాతో కలిసి వుంటానన్నాడు. ఆయన ఆ సంవత్సరం మా కాలేజీలోనే పి.యు.సి లో చేరాడు. ముగ్గురం కలిసి, లింగం పల్లి (వై.ఎం.సి.ఏ సమీపంలో) రెడ్డి మహిళా కాలేజీ పక్క సందులో, రిటైర్డ్ డి.ఎస్.పి విశ్వనాధ రావుగారింట్లో ఒక "గారేజ్" వుంటే అది అద్దెకు తీసుకున్నాం. అద్దె పదిహేను రూపాయలు. ముగ్గురం తలా ఐదు రూపాయలు భరించేవాళ్లం. పర్సా కిషన్ రావు గారి ఇల్లు, కె. బి. భూపాల రావు గారి ఇల్లు మేం అద్దెకు తీసుకున్న వీధిలోనే వుండేవి. సమీపంలోనే, వి. వి. హాస్టల్ పక్క వీధిలో వనం గీతా రంగారావు తండ్రి గారి ఇల్లుండేది.  గదికి దగ్గర లోనే వుండడం వల్ల సాధారణంగా కాలేజీకి నడుచుకుంటూ పోయే వాళ్లం.


కాలేజీకి వెళ్లే దారిలో వై.ఎం.సి.ఏ కి ఎదురుగా "ఇంద్ర భవన్" అనే ఇరానీ రెస్టారెంటులో ఆగుతుండేవాళ్లం ఒక్కొక్కప్పుడు. అక్కడ కాకపోతే, కాలేజీ ఎదురు గుండా (ఇప్పటికీ వుంది) "సెంటర్ కెఫే" కి పోయే వాళ్లం. ఇరానీ "చాయ్" (బహుశా) 15 పైసలిచ్చి తాగే వాళ్లం. ఒక్కోసారి "పౌనా" తాగే వాళ్లం. 5 పైసలకు ఒక సమోసా, లేదా, ఒక బిస్కట్ కొనుక్కుని తినే వాళ్లం. అప్పట్లో "పానీ పురి" ఖరీదు కూడా 5 పైసలే. మిర్చి బజ్జీ కూడా 5 పైసలకే దొరికేది. అలానే సాయంత్రాలు చిక్కడపల్లి వెళ్లి "సాయిబాబా మిఠాయి భండార్" లో "గులాబ్ జామూన్", "కలకంద" తిని, "హైదరాబాద్ మౌజ్" కలుపుకుని పాలు-పౌనా తాగే వాళ్లం. పావలాకు అర డజన్ మౌజ్-అరటి పళ్లు దొరికేవప్పుడు. చిక్కడపల్లి రోడ్డు మీద వున్న మరో హోటెల్ "గుల్షన్ కెఫే" కి కూడా వెళ్తుండేవాళ్లం. గుల్షన్ కెఫే సమీపంలో "రూబీ ఆర్ట్ స్టూడియో" వుండేది. మామయ్య ఇంటి సందులోకి వెళ్లే ముందర, "ప్రజా ఫార్మసీ మెడికల్" షాప్, దానికి ఎదురుగా "మహావీర్ మెడికల్ షాప్" వుండేవి. మామయ్య ఇంటికి పోయే సందులోనే ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు జి. వెంకట స్వామి ఇల్లుండేది. ఆయనను తరచుగా చూస్తుండేవాళ్లం. శెలవుల్లో హిమాయత్ నగర్‌లో వున్న "గాయత్రీ భవన్" కు కాని, నారాయణ గుడాలో వున్న తాజ్ మహల్ కు కాని టిఫిన్ తింటానికి వెళ్లే వాళ్లం. ఇక భోజనం ఎప్పుడూ నారాయణ గుడా తాజ్ మహల్ హోటల్లోనే. అప్పట్లో తాజ్ మహల్ లో 36 రూపాయలిస్తే 60 భోజనం కూపన్లు ఇచ్చేవారు. తడవకు 18 రూపాయలిచ్చి 30 కూపన్లు కొనుక్కునే వాళ్లం. కూపన్ పుస్తకంలో "అతిధులకు" అదనంగా రెండు టికెట్లుండేవి. నెలకు అలా నలుగురు గెస్టులను ఉచితంగా భోజనానికి తీసుకెళ్లగలిగే వాళ్లం. ఇక భోజనంలో "అన్ లిమిటెడ్" పూరీలు ఇచ్చేవారు. సైజు చిన్నగా వుండేవి. వూరగాయ పచ్చళ్లతో సహా తీరు-తీరు రుచులతో భోజనం, పరిశుభ్రంగా పెట్టేవారు హోటెల్ వారు. నేను స్టూడెంటుగా వున్నంతకాలం ఒక్క తాజ్ మహల్ హోటెల్ లోనే భోజనం చేశాను. క్రమేపీ రేట్ పెరుక్కుంటూ పోయింది. ఇప్పుడు 36 రూపాయలకు "ప్లేట్" ఇడ్లీ కూడా రాని పరిస్థితి!