హైదరాబాద్
నగరంలో తొలి అనుభవాలు
కాలేజీ
కబుర్లు-Part TWO
వనం జ్వాలా నరసింహారావు
ప్రతిరోజు
సాయంత్రం నేను, స్నేహితుడు నరసింహ మూర్తి, క్రమం తప్పకుండా కలిసే
వాళ్లం. నరసింహమూర్తి వివేక వర్ధని కాలేజీలో బి. ఎ. (ఎకనామిక్స్, పాలిటిక్స్,
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) చదువుతుండేవాడు.
వాళ్లన్నయ్య కృష్ణమూర్తి గారు మామయ్యతో పాటు సచివాలయంలో పని
చేస్తుండేవాడు. వాళ్ల మధ్య స్నేహం మమ్మల్ని కూడా దగ్గరికి
చేర్చింది. కాలేజీ నుంచి వచ్చిన తరువాత సాయంత్రం నాలుగు-ఐదు గంటల ప్రాంతంలో నారాయణ గుడా తాజ్ మహల్ ముందు కలిసే వాళ్లం. కబుర్లు చెప్పుకుంటూ, ఒక ప్లేట్ "ముర్కు" తిని, "వన్
బై టు" కప్పు కాఫీ తాగి (బహుశా
అంతా కలిపి అర్థ రూపాయ కన్నా తక్కువ బిల్లు అయ్యేదేమో!) బయట
పడే వాళ్లం. తాజ్ మహల్ హోటెల్ లో పనిచేసే కామత్ అనే అతను మాకు మంచి స్నేహితుడయ్యాడు. కూపన్ మరిచి పోయి వచ్చినా, డబ్బులు టైంకు ఇవ్వలేక పోయినా, భోజనం విషయంలో ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. కాఫీ-టీలు ఫ్రీగా తాగిన రోజులు కూడా ఎన్నో వున్నాయి. మాతో పాటు ఒక్కోసారి రూమ్మేట్ కల్మల చెర్వు రమణ,
ఉస్మానియా "బి-హాస్టల్"
లో వుంటూ ఎం. ఎ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
చదువుతున్న వనం రంగారావు (నర్సింగరావు తమ్ముడు...చనిపోయాడు) కూడా వుండేవారు. తాజ్
మహల్ నుంచి బయటికొచ్చి, కాసేపు నారాయణ గుడా బ్రిడ్జ్
పక్కనున్న పార్క్ లో కూచుని కబుర్లు చెప్పుకునే వాళ్లం. ఒక్కో
సారి హిమాయత్ నగర్ మీదుగా, పీపుల్స్ హై స్కూల్ పక్కనుంచి
నడుచుకుంటూ, చిక్కడపల్లి దాకా పోయి, నరసింహమూర్తిని
వదిలేసి, నేను తాజ్ మహల్ హోటెల్ కు పోయి భోజనం చేసి రూమ్ కు
వెళ్లే వాడిని. మధ్య-మధ్య నారాయణ గుడా నుంచి నడుచుకుంటూ
వై.ఎం.సి.ఏ మీదుగా, బడీ చావడీ, సుల్తాన్
బజార్, కోఠి తిరిగి వచ్చే వాళ్లం. తిరుగు ప్రయాణం, ఒక వేళ అలిసిపోతే, బస్సులో చేసే వాళ్లం.
హిమాయత్
నగర్, అశోక్
నగర్ మధ్య ఇప్పుడున్న "బ్రిడ్జ్" అప్పుడు లేదు. వర్షాకాలంలో మోకాలు లోతు
నీళ్లలో నడుచుకుంటూ వెళ్లే వాళ్లం. అశోక్ నగర్ లో ఇప్పుడు బ్రహ్మాండంగా
వెలిగిపోతున్న "హనుమాన్" గుడి అప్పుడు లేదు. కేవలం ఒక విగ్రహం మాత్రం
రోడ్డు మధ్యలో-కొంచెం పక్కగా వుండేది. నేను, మూర్తి, ఒకరు చూడకుండా మరొకరు ఆ విగ్రహానికి దండం
పెట్టుకుని కదిలే వాళ్లం. పీపుల్స్ హైస్కూల్ దాటిన తరువాత మలుపు తిరిగి చిక్కడపల్లి
వైపు పోతుంటే, ఇప్పుడు సిటీ సెంట్రల్ లైబ్రరీ భవనం వున్న చోట
ఒక కల్లు కాంపౌండ్ వుండేది. దాని ముందర నుంచి చీకటి పడిన తరువాత వెళ్లాలంటే కొంచెం
భయమేసేది కూడా. ఇక మా కబుర్లలో వర్తమాన రాజకీయాలు ఎక్కువగా వుంటుండేవి. కేరళ
నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని ఇందిరా గాంధి ఎలా పడగొట్టింది, కెన్నెడీని
ఎలా చంపారు, మావో సేటుంగ్ వ్యవహారం...ఇలా...జాతీయ-అంతర్జాతీయ
రంగానికి చెందిన కబుర్లుండేవి. మూర్తికి, నాకు మధ్య స్నేహం
ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. పోలీసు స్పెషల్ బ్రాంచ్ లో సీనియర్ అధికారిగా పని
చేసి పదవీ విరమణ చేసాడు మూర్తి. అప్పట్లో హైదరాబాద్ లో ఒక సారి అఖిల భారత
కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన ఒక బహిరంగ సభ ఫతే మైదాన్ స్టేడియంలో జరిగినట్లు
గుర్తు. ఆ సభలో నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి "టోపీ" ని
సవరించుకుంటుంటే, రాబోయే రోజుల్లో, ఏదో
ఒక రాజకీయ మార్పు వుంటుందని పరిశీలకులు వ్యాఖ్యానించినట్లు గుర్తు కూడా
వుంది.
హైదరాబాద్‌లో
ఆ రోజుల్లో ఇప్పుడున్నన్ని సినిమా టాకీసులు లేవు. వున్నవాటిలో ఎయిర్ కండిషన్
థియేటర్లు కాని, ఎయిర్ కూల్డ్ థియేటర్లు కాని దాదాపు లేనట్లే. ఆబిడ్స్ లో వున్న "జమ్రూద్"
టాకీసు ఒక్కటే జనరేటర్ బాక్-అప్ వున్న ఎయిర్ కండిషన్ థియేటర్. అలానే వి. వి.
కాలేజీ పక్కనున్న "నవరంగ్" థియేటర్ ఒకే ఒక్క ఎయిర్ కూల్డ్ థియేటర్. ఇవి
కాకుండా నారాయణ గుడాలో "దీపక్ మహల్", హిమాయత్ నగర్
లో "లిబర్టీ", సికిందరాబాద్ లో
"పారడైజ్", "తివోలీ" థియేటర్లుండేవి.
సికిందరాబాద్ లో ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలు చూపించేవారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో
ఇప్పుడున్న థియేటర్లు ఏవీ అప్పుడు లేవు. ముషీరాబాద్‌లో "రహమత్ మహల్"
టాకీసుండేది. అలానే నారాయణ గుడా దీపక మహల్ పక్కన "రాజ్ కమల్" బార్ అండ్
రెస్టారెంట్ (ఇప్పటికీ వుంది) వుండేది. బహుశా అందులో మద్యపానం అలవాటు చేసుకోని
వారు అరుదుగా వుంటారేమో! నాకు బాగా గుర్తుంది….. డిగ్రీ
పరీక్షల్లో, చివరిగా, మాడరన్ ఫిజిక్స్
పేపర్ (వాస్తవానికి హాజరవడమే కాని మొదటి సారి నేను రాయలేదు) అయిపోయిన తరువాత,
మధ్యాహ్నం పూట, మొట్ట మొదటి సారిగా, రాజ్ కమల్ బార్‌కు వెళ్లి, "గోల్డెన్
ఈగిల్" బీర్ తాగాను. నేను తాగలేనని వనం రంగారావు ఛాలెంజ్ చేయడంతో ఆ పని
చేయాల్సి వచ్చింది. అప్పట్లో బీర్ బాటిల్ ధర కేవలం మూడు రూపాయలే! 1966 లో అలా మొదలైన ఆ అలవాటు ఇప్పటికీ నన్ను వదలలేదు. మరో
మూడేళ్లలో నా తాగుడికి "గోల్డెన్ జూబ్లీ" సెలబ్రేషన్స్ చేసుకోవచ్చేమో!
అప్పుడు మూడు రూపాయల ధర మాత్రమే వున్న బీర్ బాటిల్ ఇప్పుడు వంద దాటి
పోయింది...అప్పట్లో కేవలం గోల్డెన్ ఈగిల్ లాంటి ఒకటి-రెండు బ్రాండులే వుండగా, ఇప్పుడు లెక్క
లేనన్ని వున్నాయి!
అశోక్ నగర్ లో, నా కంటే వయసులో పెద్ద, స్నేహితుడు, వూటుకూర్ వరప్రసాద్ వుండేవాడు. ప్రసాద్, మరికొందరు ఇతర స్నేహితులతో కలిసి దగ్గర
లోని సుధా హోటల్ లో కాని, కొంచెం దూరంలో వున్న నారాయణగూడా
తాజ్ మహల్ హోటెల్ లో కాని కూర్చుని, కప్పు కాఫీ తాగుతూ,
సాయంత్రాలు గడిపే వాళ్లం. నేను హైదరాబాద్ లో
వున్న తొలినాళ్లలో, ఆ తరువాత, వర
ప్రసాద్ ద్వారా పరిచయమైన వ్యక్తులలో ఏ నాటికీ మరవలేని ఒక మహనీయుడు మహారాజశ్రీ అనే
ఒక సాదా-సీదా మనిషి. సుధా హోటెల్,
నారాయణ గూడా తాజ్ మహల్ హోటెల్ చర్చలలో మహారాజశ్రీ మాకు పెద్ద దిక్కు.
గలగలా మాట్లాడే స్వభావం ఆయనది. చిన్నవాళ్ల మైనా
మమ్ములను మర్యాదగా సంభోదించేవాడు. మహారాజశ్రీ పరిచయం కూడా
గమ్మత్తుగా అయిందనాలి. ఆయన వయస్సు అప్పుడెంతో నాకు గుర్తుకు
రావడం లేదు కాని వయసులో మాకంటే చాలా పెద్ద వాడే అని మాత్రం చెప్పగలను. నేను బాగా అభిమానించే బ్రిటీష్ రచయిత, ఉద్యమకారుడు,
తత్వవేత్త, బెర్ట్రాండ్ రస్సెల్ అక్టోబర్ 22, 1960 లో లండన్
నగరంలో స్థాపించిన "కమిటీ ఆఫ్ వన్ హండ్రెడ్"
ఆదర్శాలను-భావాలను తనదైన శైలిలో పదిమందితో
పంచుకోవాలన్న తపన మొదటగా వ్యక్తం చేసింది మహారాజశ్రీ. నాకెందుకో
ఆయన భావాలు ఆ విధంగా నచ్చాయి అప్పట్లో... ఆ మాటకొస్తే
ఇన్నేళ్ల తరువాత ఇప్పటికీ కూడా. ఒక లాల్చీ-పైజమా, అది కూడా మాసినట్లు కనిపించే విధంగా ధరించి,
ఎప్పుడూ-ఏదో విషయంలో మాట్లాడుతూనే వుండేవాడు
మహారాజశ్రీ. ఆయన మాటల్లో ఎక్కువగా ప్రపంచ శాంతి-అంతర్జాతీయ సౌభ్రాతృత్వం-మానవాభ్యుదయం పదాలు
దొర్లుతుండేవి. "కమిటీ ఆఫ్ వన్ హండ్రెడ్" పేరుతో స్వయంగా మహారాజశ్రీ ఒక హౌజ్ మాగజైన్ నడిపినట్లు కూడా గుర్తు.
కరపత్రాలు చాలా సార్లు ముద్రించాడు. "కమిటీ
ఆఫ్ వన్ హండ్రెడ్" స్థాపనకు మూలకారణమైన అణ్వాయుధ
వ్యాప్తి వ్యతిరేక శాసనోల్లంఘన ఉద్యమాన్ని గురించి పదే-పదే
మాట్లాడేవాడు మహారాజశ్రీ. ఆయన మాటల్లో బెర్ట్రాండ్ రస్సెల్
పేరుతో పాటు ఆయన సహ ఉద్యమ కారులైన రాల్ఫ్ షోన్ మన్, రెవరెండ్
మైఖేల్ స్కాట్, ఇతర మద్దతు దార్ల పేర్లు తరచుగా వినబడేవి.
అణ్వాయుధ నిరాయుధీకరణ విషయం కూడా చెప్పేవాడు. "కమిటీ ఆఫ్ వన్ హండ్రెడ్" అధ్యక్షుడిగా
బెర్ట్రాండ్ రస్సెల్ ఎన్నికయ్యారు. మహారాజశ్రీ ఏనాడూ తన
స్వవిషయం చెప్పేవాడు కాదు. ఆయనకు ఎంతమంది పిల్లలో కూడా నాకు
తెలియదు. తాను తీసుకొచ్చే మాగజైన్ కు కాని, కరపత్రాలకు కాని నిధులెక్కడ నుంచి సమకూర్చుకునేవాడో కూడా తెలియదు. నన్ను మాత్రం ఒక్క రోజు కూడా ఒక్క రూపాయ కూడా అడగలేదు. ఇప్పటికీ-ఎప్పటికీ మరవరాని మహనీయులైన వ్యక్తులలో
మహారాజశ్రీ ముందు వరుసలో వుంటారనడంలో అతిశయోక్తి లేదు.
Ravindranath Muthevi:
ReplyDeleteజ్వాలా గారూ !
మీ కాలేజీ రోజుల అనుభవాలు బాగున్నాయి. ఇదే మహారాజశ్రీ గారి గురించి ఎక్కడో మీ వ్యాసాల్లోనే ఇంతకుముందు చదివినట్లు గుర్తు. ప్రస్తుతం అందరూ తప్పుగా 'బడీ చౌడీ' అని రాస్తుంటే మీరు చక్కగా 'బడీ చావడీ' (పెద్ద చావడి) అని రాయడం బాగుంది. ముషీరాబాద్ లోని థియేటర్ 'రహమత్ మహల్' కాదేమో ! నాకు అది 'రాహత్ మహల్' అని గుర్తు. రాహత్ అంటే సుఖము, విశ్రాంతి అని అర్థం.
డా.కె.యన్.కేసరి గారి ఆత్మకథ'చిన్ననాటి ముచ్చట్లు' చదివితే నాటి మదరాసు తీరు తెన్నులు అవగతం
అవుతాయి. మీ జ్ఞాపకాలు కూడా అలనాటి భాగ్యనగరాన్ని కట్టెదుట నిలిపేవిగా మరింత వివరణాత్మకంగా
ముందుకు సాగాలని కోరుకుంటూ.. మీ..... ముత్తేవి రవీంద్రనాథ్.
Srinivasrao Bhandaru: నారాయణ గూడ తాజ్ మహల్ హోటల్ పరిశుభ్రతకు మారుపేరుగా వుండేది. అక్కడ సర్వర్ సోదరులు అంత మందికి సర్వ్ చేస్తూకూడా చెమటలు పట్టకుండా నింపాదిగా తమ విధులు నిర్వహించేవారు. గ్లాసులు, నీళ్ళు ఎంతో స్వచ్చంగా ఉండేవి. టేబులు మీద మంచినీళ్ళ గ్లాసుల్ని వెంటవెంటనే మారుస్తూ వుండేవారు. వెన్న రాసిన మసాలా దోసె అంటే నాకు ఎంతో ఇష్టం.
ReplyDeleteAbhilash Aitharaju: Srinivasrao Bhandaru mammayya, narayanguda taj is dad's favourite as well!!!!
ReplyDeleteManohar Rao Gade: One Bengali sweet made with cream only..I have forgotten the name , it was very famous in those days, I remember well in 60's.
ReplyDelete