Friday, June 28, 2013

హైదరాబాద్ నగరంలో తొలి అనుభవాలు, కాలేజీ కబుర్లు-Part ONE: వనం జ్వాలా నరసింహారావు

హైదరాబాద్ నగరంలో తొలి అనుభవాలు
కాలేజీ కబుర్లు-Part ONE
వనం జ్వాలా నరసింహారావు

మొత్తం మీద, ద్వారక సార్ పుణ్యమా అంటూ, 1964 జూన్ నెలలో న్యూ సైన్స్ కాలేజీలో బిఎస్సీ డిగ్రీ రెండో సంవత్సరంలో చేరాను. అప్పటికే ఫస్ట్ ఇయర్ లో చేరిన వారి సంఖ్య 150 దాటింది. నా రోల్ నంబర్ "150 X" గా కేటాయించారు. కాలేజీలో చేరడం పూర్తయిన తరువాత చేసిన మొట్టమొదట పని నేను వుండడానికి ఒక గది వెతుక్కోవడం. మా సమీప బంధువులు, శ్రీమతి ఝాన్సీ దంపతులకు, విద్యా నగర్ అడ్డీకమేట్ లో ఇల్లుండేది. వారింట్లో ఒక గది అద్దెకు తీసుకున్నాను. నెలసరి అద్దె పది రూపాయల లోపే! అప్పట్లో నాన్న గారు నాకు నెలకు వంద రూపాయలు ఖర్చులకొరకు పంపేవారు. రెండు నెలలు శెలవులు పోగా, మిగిలిన పది నెలల మొత్తం మీద వెయ్యి రూపాయలు వచ్చేవి. ఫీజులకు పోను, నెలంతా ఖర్చులకు పోను, ఇంకా నెలకు పది-పదిహేను రూపాయలు మిగిలేవి. అవి మా అత్తయ్య దగ్గర దాచుకునేవాడిని. శెలవుల్లో ఇంటికి వెళ్లేటప్పుడు తమ్ముళ్లకు-చెల్లెళ్లకు ఏమన్నా కొనుక్కోపోయేవాడిని. ఎన్ని కొన్నా ఇంకా డబ్బులు మిగిలేవి. శెలవులకు వెళ్లినప్పుడల్లా మామయ్య-అత్తయ్య, మేనల్లుడినైన నాకు, పాంటు-షర్ట్ గుడ్దలు కొనిచ్చేవాడు. అవి ఖమ్మంలో కాని, లేకపోతే శెలవుల తరువాత హైదరాబాద్ వచ్చినప్పుడు నారాయణ గుడాలోని "యాక్స్" టైలర్ దగ్గర కాని, "పారగాన్" టైలర్ దగ్గర కాని కుట్టించుకునేవాడిని. అప్పట్లో కుట్టు కూలీ ఐదారు రూపాయల కంటే మించకపోయేది. ఇప్పటి లాగా అప్పట్లో "రెడీ మేడ్" దుస్తులు ఎక్కువగా లభించకపోయేవి. ఎక్కువగా "టెరిలీన్", "వులెన్" దుస్తులు లభించేవి. కాటన్ తక్కువే. మొదట్లో "బాటం వెడల్పు" గా వుండే పాంట్లు కుట్టించుకునే వాళ్లం. ఆ తరువాత "గొట్టం" పాంట్ల ఫాషన్ వచ్చింది. అవి పోయి "బెల్ బాటం" వచ్చాయి. పాంటు కింద భాగంలో మడతతో కొన్నాళ్లు, మడత లేకుండా కొన్నాళ్లు ఫాషన్‌గా వుండేది. బట్టలు ఎక్కువగా "ఎఫ్. డి. ఖాన్ బట్టల దుకాణం" లో కొనే వాళ్లం.

విద్యా నగర్ లో వున్నంత కాలం భోజనం సమీపంలోని చెలమయ్య హోటెల్ లో తినేవాడిని. చెలమయ్య హోటెల్ ఇడ్లీలు కూడా తినేవాడిని ఉదయం పూట. విద్యా నగర్ నుంచి కాలేజీకి వెళ్లడానికి "3-డి" బస్సు ఎక్కి, నారాయణ గుడాలో దిగి, నడుచుకుంటూ, విఠల్ వాడీ మీదుగా వెళ్లేవాడిని. ఒక్కో సారి "చారనా" బాడుగ ఇచ్చి "చార్మీనార్ చౌ రాస్తా" (ఇప్పటి ఆర్. టి. సి. క్రాస్ రోడ్స్) వరకు రిక్షాలో వచ్చి, అక్కడ నుంచి "7-సి" బస్సెక్కి, వై.ఎం.సి.ఏ దగ్గర దిగి నడుచుకుంటూ వెళ్లేవాడిని కాలేజీకి. చార్మీనార్ చౌ రాస్తా చుట్టుపక్కలంతా పారిశ్రామిక వాడగా వుండేదప్పట్లో. చార్మీనార్ సిగరెట్ కర్మాగారం (వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ), (నీలం రంగు పాకెట్ లో వచ్చే) గోలకొండ సిగరెట్ కర్మాగారం అక్కడే వుండేవి. చార్మీనార్ చౌ రాస్తా నుంచి విద్యానగర్‍కు వెళ్లడానికి పక్కా రోడ్డు లేదప్పట్లో. ఆ మార్గంలో సిటీ బస్సులు నడవకపోయేవి. విద్యా నగర్ పక్కనే జమిస్తాన్ పూరాకు వెళ్లడానికి "రామ్ నగర్ గుండు" మీద నుంచి వెళ్లే వాళ్లం. చార్మీనార్ చౌ రాస్తా-ఆర్. టి. సి. క్రాస్ రోడ్స్ నుంచి (ఇప్పుడున్న) టాంక్ బండ్‍ను కలిపే రోడ్డు కూడా అప్పట్లో లేదు. ఇప్పుడు టాంక్ బండ్‍ను కలిపే స్థలంలో కొంచెం అటు-ఇటుగా ఒక "కల్లు కాంపౌండ్" వుండేది. దానిని తొలగించడానికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మొదట్లో సాధ్యపడలేదు. ఇందిరా పార్క్ అసలే లేదు. ధర్నా చౌక్ కూడా లేదు. ఇందిరా పార్క్ దగ్గర నుంచి టాంక్ బండ్ పక్కగా ప్రస్తుతం వున్న "ఫ్లయిఓవర్" కూడా లేదప్పుడు. ఆ రోజుల్లో హైదరాబాద్‌లో కనీసం పాతిక-ముప్పై వేల రిక్షాలన్నా వుండేవి. మీటర్ టాక్సీలుండేవి కాని, బేరం కుదుర్చుకోని ఎక్కించు కోవడం తప్ప మీటర్ ఎప్పుడూ వేయక పోయేవారు. డ్రైవర్ కాకుండా ముగ్గురికంటే ఎక్కువగా టాక్సీలో కూర్చోనీయక పోయే వాళ్లు. ఆటోలు కూడా వుండేవి కాని అంత పాపులర్ కాదు. ఆటోలలో ఇద్దరు పాసింజర్లకే పర్మిషన్. టాక్సీలకు కిలోమీటర్‌కు పావలా చార్జ్ వున్నట్లు గుర్తు.

సిటీ బస్సుల్లో ప్రయాణం ఇప్పటి లాగా కష్టంగా వుండేది కాదు. హాయిగా ప్రయాణం చేసే వాళ్లం. "ఆగే బడో" అనుకుంటూ కండక్టర్ సున్నితంగా చెపుతుంటే ప్రయాణీకులు క్రమ శిక్షణతో దొరికిన సీట్లలో కూచోవడమో, లేదా, ఒక క్రమ పద్ధతిన నిలబడడమో చేసేవారు. సింగిల్ బస్సులు, ట్రైలర్ బస్సులు, డబుల్ డెక్కర్ బస్సులు వుండేవి. కండక్టర్ చేతిలో టికెట్ ఇచ్చే మిషన్ వుండేది. బర్రున తిప్పి ఒక చిన్న టికెట్ ఇచ్చేవాడు. టికెట్ ఖరీదు పైసల్లోనో, అణా-బేడలలోనో వుండేది. కనీస చార్జ్ ఒక "అణా"-ఆరు "నయాపైసలు" వున్నట్లు గుర్తు. ఉదాహరణకు విద్యా నగర్ నుంచి నారాయణ గుడాకు కాని, చార్మీనార్ చౌ రాస్తా నుంచి వై.ఎం.సి.ఏ కు కాని "అణా" లేదా ఆరు పైసలు రేటుండేది. ఇంతకీ "అణా" ఏంటనే ప్రశ్న రావచ్చు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్త రోజుల్లో కొన్నాళ్ల వరకు-బహుశా ఒక ఆర్నెల్ల వరకనుకుంటా, ఇంకా అణా-బేడలు చలామణిలోనే వుండేవి. అందుకే ఇక్కడ కొంత మన నాణాల గురించి ప్రస్తావిస్తే బాగుంటుందేమో! ఆగస్ట్ 15, 1947 భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజుల్లో అమల్లో వున్న కరెన్సీ నాణాలు "దశాంశ" తరహా నాణాలు కావు. రూపాయను పదహారు "అణా” లుగా, ఎనిమిది "బేడ” లుగా, నాలుగు "పావలా” లుగా, రెండు "అర్థ రూపాయ” లుగా విభజించి చలామణిలో వుంచారు. ఒక "అణా” కు నాలుగు పైసలు...రూపాయకు 64 పైసలు. 1957 లో "డెసిమల్" పద్ధతిలోకి చలామణిని మార్చింది ప్రభుత్వం. అయితే 1964 (నేను హైదరాబాద్ వచ్చిన కొత్త రోజుల) వరకు, నాన్-డెసిమల్ (అణా, బేడ, పావలా...), డెసిమల్ పద్ధతులు రెండింటినీ వాడకంలో వుంచారు. అణా గుండ్రంగా, బేడ నాలుగు పలకలుగా-పచ్చ రంగులో వుండేవి. ఆ తరువాత నాన్-డెసిమల్ నాణాల వాడకం ఉపసంహరించింది ప్రభుత్వం. ఇప్పుడు మనం పైసలుగా వ్యవహరిస్తున్న నాణాలను 1957-1964 మధ్య కాలంలో "నయా పైస” లుగా పిలిచేవారు. 1, 2, 5, 10, 20, 25, 50 (నయా) పైసల నాణాలు చలామణిలో వుండేవి.


విద్యా నగర్ లో ఎక్కువ రోజులుండలేదు. అక్కడ నుంచి కాలేజీకి వెళ్లి రావడం ఇబ్బందిగా వుండడంతో మకాం మార్చాలనుకున్నాను. మారుదామనుకుంటున్న రోజుల్లో, మా పిన్ని కొడుకు కల్మల చెర్వు రమణా రావు (రమణ), హైదరాబాద్ న్యూ సైన్స్ కాలేజీలో డిగ్రీలో చేరడానికి వచ్చాడు. రమణ కూడా సత్యనారాయణ రావు మామయ్యకు వరసకు మేనల్లుడే. నేనేమో స్వయానా అక్క కొడుకునైతే, రమణ, మామయ్యకు కజిన్ సిస్టర్ కొడుకు. మామయ్య-అత్తయ్య ఆ తేడా ఎప్పుడూ చూపలేదు. ఇద్దరం కలిసి వెతకగా హిమాయత్ నగర్ పదకొండో వీధిలో ఒక ఇంట్లో (3-6-700) ముందు భాగంలో గది దొరికింది. అద్దె పది రూపాయలు. చెరి ఐదు రూపాయలన్న మాట. ఆ గదిలో 1965 మార్చ్-ఏప్రిల్ వరకున్నాం. ఆ గదిలో వుంటున్నప్పుడు ఒక సారి వనం నర్సింగరావు (కమలాపురం), గండ్లూరి కిషన్ రావు (బాణాపురం), తాళ్లూరి వైకుంఠం (మండవ) హైదరాబాద్ వచ్చి మా రూంలో మకాం చేసారు. వాళ్లు ముగ్గురు, వూటుకూరు వరప్రసాద్ కలిసి ఒక లారీ కొని వ్యాపారం చేయడానికి నిర్ణయం మా రూంలోనే జరిగింది. కొన్నారు కూడా ఆ తరువాత. వాళ్లొచ్చిన రోజు రాత్రి "చీట్ల పేక" ఆడి, తగాదా కూడా పడ్డాం. డిగ్రీ రెండో సంవత్సరం లాంగ్వేజెస్ పరీక్షలు పూర్తైన తరువాత శెలవులకు వెళ్తూ గది ఖాళీ చేశాం. పరీక్షల్లో నేను థర్డ్ క్లాస్‍లో పాసయ్యాను. శెలవుల తరువాత మళ్లీ హైదరాబాద్ వచ్చి గది వెతుక్కుంటున్నప్పుడు నేలకొండపల్లి వాస్తవ్యుడైన కంకిపాటి జగన్మోహన్ రావుగారి కుమారుడు సీతారాం రావు మాతో కలిసి వుంటానన్నాడు. ఆయన ఆ సంవత్సరం మా కాలేజీలోనే పి.యు.సి లో చేరాడు. ముగ్గురం కలిసి, లింగం పల్లి (వై.ఎం.సి.ఏ సమీపంలో) రెడ్డి మహిళా కాలేజీ పక్క సందులో, రిటైర్డ్ డి.ఎస్.పి విశ్వనాధ రావుగారింట్లో ఒక "గారేజ్" వుంటే అది అద్దెకు తీసుకున్నాం. అద్దె పదిహేను రూపాయలు. ముగ్గురం తలా ఐదు రూపాయలు భరించేవాళ్లం. పర్సా కిషన్ రావు గారి ఇల్లు, కె. బి. భూపాల రావు గారి ఇల్లు మేం అద్దెకు తీసుకున్న వీధిలోనే వుండేవి. సమీపంలోనే, వి. వి. హాస్టల్ పక్క వీధిలో వనం గీతా రంగారావు తండ్రి గారి ఇల్లుండేది.  గదికి దగ్గర లోనే వుండడం వల్ల సాధారణంగా కాలేజీకి నడుచుకుంటూ పోయే వాళ్లం.


కాలేజీకి వెళ్లే దారిలో వై.ఎం.సి.ఏ కి ఎదురుగా "ఇంద్ర భవన్" అనే ఇరానీ రెస్టారెంటులో ఆగుతుండేవాళ్లం ఒక్కొక్కప్పుడు. అక్కడ కాకపోతే, కాలేజీ ఎదురు గుండా (ఇప్పటికీ వుంది) "సెంటర్ కెఫే" కి పోయే వాళ్లం. ఇరానీ "చాయ్" (బహుశా) 15 పైసలిచ్చి తాగే వాళ్లం. ఒక్కోసారి "పౌనా" తాగే వాళ్లం. 5 పైసలకు ఒక సమోసా, లేదా, ఒక బిస్కట్ కొనుక్కుని తినే వాళ్లం. అప్పట్లో "పానీ పురి" ఖరీదు కూడా 5 పైసలే. మిర్చి బజ్జీ కూడా 5 పైసలకే దొరికేది. అలానే సాయంత్రాలు చిక్కడపల్లి వెళ్లి "సాయిబాబా మిఠాయి భండార్" లో "గులాబ్ జామూన్", "కలకంద" తిని, "హైదరాబాద్ మౌజ్" కలుపుకుని పాలు-పౌనా తాగే వాళ్లం. పావలాకు అర డజన్ మౌజ్-అరటి పళ్లు దొరికేవప్పుడు. చిక్కడపల్లి రోడ్డు మీద వున్న మరో హోటెల్ "గుల్షన్ కెఫే" కి కూడా వెళ్తుండేవాళ్లం. గుల్షన్ కెఫే సమీపంలో "రూబీ ఆర్ట్ స్టూడియో" వుండేది. మామయ్య ఇంటి సందులోకి వెళ్లే ముందర, "ప్రజా ఫార్మసీ మెడికల్" షాప్, దానికి ఎదురుగా "మహావీర్ మెడికల్ షాప్" వుండేవి. మామయ్య ఇంటికి పోయే సందులోనే ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు జి. వెంకట స్వామి ఇల్లుండేది. ఆయనను తరచుగా చూస్తుండేవాళ్లం. శెలవుల్లో హిమాయత్ నగర్‌లో వున్న "గాయత్రీ భవన్" కు కాని, నారాయణ గుడాలో వున్న తాజ్ మహల్ కు కాని టిఫిన్ తింటానికి వెళ్లే వాళ్లం. ఇక భోజనం ఎప్పుడూ నారాయణ గుడా తాజ్ మహల్ హోటల్లోనే. అప్పట్లో తాజ్ మహల్ లో 36 రూపాయలిస్తే 60 భోజనం కూపన్లు ఇచ్చేవారు. తడవకు 18 రూపాయలిచ్చి 30 కూపన్లు కొనుక్కునే వాళ్లం. కూపన్ పుస్తకంలో "అతిధులకు" అదనంగా రెండు టికెట్లుండేవి. నెలకు అలా నలుగురు గెస్టులను ఉచితంగా భోజనానికి తీసుకెళ్లగలిగే వాళ్లం. ఇక భోజనంలో "అన్ లిమిటెడ్" పూరీలు ఇచ్చేవారు. సైజు చిన్నగా వుండేవి. వూరగాయ పచ్చళ్లతో సహా తీరు-తీరు రుచులతో భోజనం, పరిశుభ్రంగా పెట్టేవారు హోటెల్ వారు. నేను స్టూడెంటుగా వున్నంతకాలం ఒక్క తాజ్ మహల్ హోటెల్ లోనే భోజనం చేశాను. క్రమేపీ రేట్ పెరుక్కుంటూ పోయింది. ఇప్పుడు 36 రూపాయలకు "ప్లేట్" ఇడ్లీ కూడా రాని పరిస్థితి!

3 comments:

  1. Pavan Kondapalli: Sir mee gnapakasaktiki vandanaalu inti no to saha vishayaalani meeku bhale gurtunnai.Takshanam mee ATMAKATHA rayataaniki poonukunte andulo ennomachivishayaalu entomandi goppavyaktula gurinchi bhavishyattu taraalaku teliyajesinavaalu avutaaru.achhulovachhetatlugaa chudandi.

    ReplyDelete
  2. Ravindranath Muthevi:

    జ్వాలా గారూ !
    అప్పటి నాణేల మీద మీ వివరణ బాగుంది. వాలేశ్వరరావు (యాక్స్ టైలర్ ) అప్పటికే ఉన్నారా ?లేక అప్పట్లో వేరే ఎవరన్నా' యాక్స్ టైలర్స్' సంస్థని నిర్వహించేవారా ? మీరు అడ్డీకమేట్ అన్నారు. 'అదిక్ మెట్' అని ప్రస్తుతం వ్యవహరిస్తున్న ప్రాంతం అసలు పేరు ఏమిటో తెలుపగోరతాను.మీరన్నట్లు తాజ్ మహల్ , కామత్ వగైరా ఉడుపి వాళ్ళ హోటళ్ళలో మాత్రమే నేటికీ రుచికరం మరియు శుచికరం అయిన ఆహారం లభిస్తుంది. మాగిన పచ్చ అరటి పండ్లను 'మౌజూ' పేరుతో బండ్లమీద అమ్మేవారు. నాందేడ్ పచ్చ అరటి పళ్ళుగా ప్రసిద్ధమైన ఆ పళ్ళ మీద గోధుమ వన్నె చుక్కలుండి, అవి తియ్యగా, సువాసనగా ఉండి,తింటే కడుపులో చల్లగా ఉండేది. బ్రహ్మచారులు అరడజను పళ్ళు తిని టీ తాగి ఆ పూటకి భోజనం అయి౦దనిపించేవారు. నాకు తెలిసి ఇప్పుడు అలాంటి పళ్ళు అసలు రావడమే లేదు.ఎందుకో ? 'పౌనా', 'మౌజ్' పదాల అర్థం ఏమిటో దయచేసి తెలియజేయగోరతాను. గత కాలపు విశేషాలను మీ జ్ఞాపకాలద్వారా అందరికీ ప్రయోజనకరంగా ఉండేట్లు నెమరువేసుకు౦టున్నందుకు మీకు మరోమారు ధన్యవాదాలు. మీ.. ముత్తేవి రవీంద్రనాథ్.

    ReplyDelete
  3. ఆనాటి రోజుల్ని ఓపికగా వ్రాసి ,వివరంగా గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

    జూపూడి హనుమంత రావు

    ReplyDelete