Sunday, November 20, 2022

రాజ ధర్మాలను, నీతులను వివరించమని భీష్ముడిని కోరిన ధర్మరాజు .... ఆస్వాదన-96 : వనం జ్వాలా నరసింహారావు

 రాజ ధర్మాలను, నీతులను వివరించమని భీష్ముడిని కోరిన ధర్మరాజు

ఆస్వాదన-96

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (21-11-2022)

అనుకున్న ప్రకారం, భీష్ముడి దగ్గర సెలవు పుచ్చుకుని వెళ్లిన మర్నాడు, ఆయన వద్ద ధర్మాలను తెలుసుకోవడానికి ధర్మరాజాదులను తీసుకుపోవడానికి శ్రీకృష్ణుడు సిద్ధమై ఆ విషయాన్ని సాత్యకి ద్వారా ధర్మరాజుకు కబురుచేశాడు. భీష్ముడి పరిసరాలలో నాటి నుండి జన సమ్మర్ధం లేకుండా ఏర్పాట్లు చేయమని ధర్మరాజు అర్జునుడికి చెప్పాడు. కొంత మంది రాజులను మాత్రం తమతో తీసుకొని పోవాలని నిర్ణయించారు. శ్రీకృష్ణుడు, పాండవులు, కృపాచార్యుడు, యుయుత్సుడు, సంజయుడు వారి-వారి రథాలలో భీష్ముడి దగ్గరికి బయల్దేరి వెళ్లారు. వారంతా అక్కడికి చేరుకోవడానికి ముందే నారదాది మహామునులు భీష్ముడి దగ్గరకు వచ్చారు. శ్రీకృష్ణాదులు భీష్ముడు, ఇతర మహర్షులు వున్న సమీపానికి వచ్చి, అందరికీ నమస్కరించి, భీష్ముడిని భక్తితో పూజించారు. అంతకు ముందే ధర్మరాజు పిలుపు మేరకు అక్కడికి ధృతరాష్ట్రుడు కూడా ఎంపికచేసిన కొందరు రాజులతో సహా వచ్చి వున్నాడు.

తొలుత నారద మహర్షి కలగచేసుకొని, భీష్ముడు భూలోకం వదలి స్వర్గలోకానికి వెళ్లే ముందు మనస్సుతో పాటు, జ్ఞానకర్మేంద్రియాల సందేహాలు తొలగి పోయే విధంగా సమస్త ధర్మ పద్ధతులనూ ఆయన్ను అడిగి తెలుసుకొమ్మని ధర్మరాజాదులకు సలహా ఇచ్చాడు. సంభాషణను ప్రారంభించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు ధర్మరాజు. వెంటనే, భీష్ముడి క్షేమాన్ని గురించి ప్రశ్నించాడు కృష్ణుడు. ఆయన అనుగ్రహంతో తనకు శారీరక బాధ కాని, అలసట కాని లేవని, తన మనస్సు, జ్ఞాన కర్మేంద్రియాలు పాటవ సంపదతో ఒప్పారుతున్నాయని, ఆయన ఆదేశానుసారం పాండవులకు చెప్పదల్చినవన్నీ సవిస్తరంగా చెప్తానని అన్నాడు జవాబుగా భీష్ముడు. భీష్ముడిని మానవోత్తముడిగా సంభోదిస్తూ శ్రీకృష్ణుడు, అత్యుత్తమ కీర్తిని భీష్ముడికి ప్రసాదించాలని భావించి తన జ్ఞానాన్ని ఆయన మనస్సులో ప్రవేశ పెట్టానని, భూమి ఎంతకాలం సుస్థిరంగా వుంటుందో అంతదాకా ఆయన కీర్తి నశించనిదై కొనసాగుతుందని, ఆయన చెప్పే మంచి మాటలన్నీ వేదాలతో సమానమై ఒప్పారుతాయని అన్నాడు. సమస్త ధర్మ విశేషాలను బోధించే వాక్యాలను అక్కడున్న రాజుల సమక్షంలో ఆయన మనుమలైన ధర్మజ భీమార్జున నకుల సహదేవులకు చెప్పమని శ్రీకృష్ణుడు కోరాడు భీష్ముడిని.

ఆ తరువాత ధర్మరాజు భీష్ముడి పాదపద్మాలకు నమస్కారం చేయగా, ఆయన ధర్మరాజును అభినందించాడు, ఆదరించాడు. ధర్మరాజు తనను ఏమేమి అడగ దాల్చుకున్నాడో అవన్నీ అడగమని భీష్ముడు చెప్పడంతో ధర్మరాజు అడగడం ప్రారంభించాడు.

ఈ జీవలోకానికెల్లా రాజ ధర్మమే ఆధారమని, ధర్మార్థ కామాలు రాజధర్మం మీదే ఆధారపడ్డవని, లోకాన్ని శాసించేది రాజ ధర్మమే అని, రాజ ధర్మమే పాటించనట్లయితే లోకం పరిస్థితి కలత చెంది నాశనమై పోయేదని, లోకంలోని పాపాలన్నీ రాజధర్మంతోనే నాశనమౌతాయని, కాబట్టి సమస్త రాజ ధర్మాలను వివరించమని ‘తాతా’ అని సంభోదిస్తూ భీష్ముడిని ప్రార్థించాడు ధర్మరాజు. ముందుగా రాజ ధర్మనీతులను వివరించమని కోరాడు. ఇలా అడగగానే ధర్మరాజుకు జవాబిచ్చే ముందర భీష్ముడు మహిమాన్వితమైన ధర్మాన్ని, శ్రీకృష్ణుడిని, వేదస్వరూపులైన బ్రాహ్మణ సమూహాన్ని స్మరించి, నమస్కరించాడు. రాజ ధర్మాన్ని చెప్తానని, ఆయా సందర్భాలలో ఆపద్ధర్మ, మోక్ష ధర్మాలను కూడా తెలియ పరుస్తానని అన్నాడు భీష్ముడు. ఇంకా ఇలా చెప్పాడు:

‘రాజుకు దైవానుగ్రహం, పురుష ప్రయత్నం రెండు కూడా కార్యసాధనకు అవసరమే. దాంతీ, శాంతీ కల రాజు శ్రీమంతుడు, యశస్వి అవుతాడు. సమస్త సౌఖ్యాలను పొందగలవాడౌతాడు. సప్త ప్రకృతులను గుర్తించి సక్రమంగా నిర్వహించేట్లు చేయాలి. బ్రాహ్మణులను నాశనం చేయాలని అనుకున్న రాజు వాడే నశిస్తాడు. అయితే దోషం చేస్తే వాడు బ్రాహ్మణుడైనప్పటికీ శిక్షార్హుడే. శాంతపరుడైన రాజును ప్రజలు ఆడిస్తారు. కోపిష్టి అయితే కోపోద్రిక్తులౌతారు. సప్త రాజ్యాంగాలైన స్వామి, అమాత్యుడు, స్నేహితుడు, కోశం, రాష్ట్రం, దుర్గం, బలం అనే వాటిని రాజు గుర్తించి సక్రమంగా నిర్వహించాలి. వాటికి వినాశకారైన ఎవ్వరినైనా శిక్షించాలి. యుద్ధంలో శస్త్రాస్త్రాలు ధరించి ఎదుర్కొనే బ్రాహ్మణుడిని సంహరించడం రాజుకు పరమ ధర్మం అని వేదాలు చెప్తున్నాయి. తప్పు చేసిన బ్రాహ్మణుడిని రాజ్య బహిష్కరణ చేయాలి కాని వధించరాదు’.  

‘రాజు ఎవరినీ పూరిగా నమ్మకూడదు. అలాగే నమ్మకుండా వుండకూడదు. ఏ అంశాన్నైనా దాని ఉచితానుచితాలు తానే స్వయంగా పరిశీలించి, గ్రహించాలి. పూర్తిగా విశ్వసించడం కాని, ఏమాత్రం నమ్మక పోవడం కాని రాజు సద్వర్తనకు క్షేమకరం కాదు. ప్రజారక్షణం చేయని రాజు వేదాధ్యయనం చేయని ఋత్విజుడితో సమానం. శత్రు సంహారం అవశ్య రాజధర్మం. అల్పుడైన శత్రువు కూడా నిప్పులాగా, విషం లాగా నాశనం చేస్తాడు. కాబట్టి ధీరుడైన రాజు శత్రుశేషం లేకుండా చేసుకొని రాజ్యాన్ని రక్షించాలి. ధీరుడైన రాజు అనేకమంది అడ్డగించి ప్రాణాంతకం చేసినప్పటికీ, లెక్కచేయకుండా రాజ్యం అనే లాభాన్ని ఏమరకుండా పండిత ప్రశంసలు పొందే రీతిలో తన చేజిక్కించుకోవాలి’.

రాజ ధర్మాలను వివరించిన భీష్ముడు ఇంకా ఏవైనా సందేహాలుంటే అడగమని ధర్మరాజుతో అన్నాడు. ఆ రోజుకు సూర్యాస్తమయం అవుతున్నది కాబట్టి ఆ పూటకు నిష్క్రమించి మర్నాడు ఉదయం వచ్చి అడుగుతానని చెప్పాడు ధర్మరాజు. ధర్మరాజాదులు, శ్రీకృష్ణుడు భీష్ముడికి నమస్కరించి బయల్దేరి వెళ్లిపోయారు. హస్తినాపురం చేరుకున్నారు. మునులు వారి-వారి ఆశ్రమాలకు వెళ్లారు.        

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, ద్వితీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

Friday, November 18, 2022

ఇందిర పాలనతోనే నియంతృత్వం : వనం జ్వాలా నరసింహారావు

 ఇందిర పాలనతోనే నియంతృత్వం

వనం జ్వాలా నరసింహారావు

మనతెలంగాణ దినపత్రిక (19-11-2022)   

జనవరి 1966, మార్చ్ 1977 మధ్య మొదటి పర్యాయం, జనవరి 1980, అక్టోబర్ 1984 మధ్య రెండో పర్యాయం, సుమారు పదహారేళ్ల పాటు, మకుటంలేని మహారాణిలాగా, భారత ప్రధాన మంత్రి పదవిలో వున్న ఇందిరా గాంధీ, దృఢమైన ఆత్మ స్థయిర్యం, నిరంకుశ ధోరణి, రాజీ పడని మనస్తత్వం కలబోసిన అరుదైన వ్యక్తిత్వంతో, దేశానికి తనదైన శైలిలో ప్రజాస్వామ్య-నియంతృత్వ పరిపాలనను అందించి, చరిత్రలో మంచి, చెడుల విచిత్రమైన కలగాపుల వ్యక్తిగా స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలిగింది. సర్వేపల్లి రాధా కృష్ణన్, జకీర్ హుస్సేన్, వరాహగిరి వెంకట గిరి, ఫకృద్దీన్ అలీ అహమ్మద్, నీలం సంజీవరెడ్డి, జ్ఞానీ జైల్ సింగ్ లు రాష్ట్రపతులుగా వున్నప్పుడు ఆమె ప్రధాన మంత్రిగా పనిచేశారు.

1955 లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా, 1959 లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఇందిరా గాంధీ ఎన్నికైంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం, తనకు ఆరంభంలో మద్దతు పలికి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న "సిండికేట్" నాయకత్వాన్ని ధిక్కరించి, పార్టీని చీల్చి, భారత జాతీయ కాంగ్రెస్ అంటే తానే అన్న చందాన, మొత్తం పార్టీ యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. ఎమర్జెన్సీ అనంతరం ఓడిన అప్పటి కాంగ్రెస్ పార్టీని, అచిర కాలంలోనే గద్దెనెక్కించడానికి, మరో మారు చీల్చి, ఇందిరా కాంగ్రెస్ గా నామకరణం చేసి, రెండేళ్లకే మళ్ళీ అధికారంలోకి వచ్చి, పాలనా పగ్గాలను, పార్టీ పగ్గాలను తన చేతుల్లో వుంచుకుంది. తనకు ఎదురు లేకుండా, ఎదిరించిన వారికి పుట్ట గతులు లేకుండా, ఏకచ్ఛత్రాధిపత్యంగా, ఏకాభిప్రాయం అంటే ఏకవ్యక్తి అభిప్రాయంలాగా దేశాన్ని ఏలింది. నియంతృత్వ ప్రజాస్వామ్యమంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది.

రాజకీయాలకు నిలయమైన కుటుంబంలో జన్మించి, బాల్యమంతా ఒంటరితనంతోనే గడిపి, తాత, తండ్రి తరచుగా జైలుకెళ్ళి వస్తుండడం ప్రత్యక్షంగా చూసి, తండ్రి జవహర్లాల్ అడుగుజాడల్లో బహుముఖ రంగాల్లో తీర్చి దిద్దబడి, అవకాశం వచ్చిన వెంటనే అంది పుచ్చుకుని, అత్యున్నత పదవిని పొంది, విధి వక్రీకరించి తాను అనుకున్న సంజయ్ గాంధీని ప్రధాన మంత్రిగా తేలేకపోయిన ఇందిర, తన తదనంతరం రాజకీయాలకు దూరంగా వున్న రాజీవ్ గాంధీ ప్రధాని కావడానికి రంగం సిద్ధం చేసింది. భవిష్యత్‌లో ఆ పరంపర కొనసాగడానికి పునాదులు వేసినా మారిన, మారుతున్న రాజకీయ సమీకరణాల నేపధ్యంలో రాజీవ్ తదనంతరం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేకపోయాడు. అవుతాడన్న నమ్మకం కూడా లేదు.  

అణుయుగంలో, అంతరిక్ష యుగంలో భారతదేశాన్ని అడుగు పెట్టించడం, సోవియట్ వ్యోమ నౌకలో భారతీయులను పంపడానికి చొరవ తీసుకోవడం, ఇండోపాక్ యుద్ధంలో పాకిస్తాన్ ను ఘోరంగా ఓడించి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారకురాలవడం, అలీన దేశాలకు నాయకత్వం వహించే స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్లడం, అమెరికా అధ్యక్షుడికి ఎదురు తిరిగి తన సత్తా ఏమిటో చూపడం, ఇందిరాగాంధీ ప్రత్యేకత.   

పార్టీ పరంగా, పాలనా పరంగా ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యవాదిలాగా పైకి కనిపించినా, నియంతృత్వ పోకడలు ఆమెలో ప్రస్ఫుటంగా కనిపించేవి. రాజ్యాంగ సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా బలమైన కేంద్రం దిశగా ఆమె విధానాలు రూపుదిద్దుకోసాగాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులను ఇష్టమొచ్చిన రీతిలో మార్చడం, ఇతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులను ఇబ్బందులకు గురి చేయడం, పడగొట్టడం, అధికారాలను కేంద్రీకరించడం ఆనవాయితీగా మారిపోయింది. కమ్యూనిస్టు వ్యతిరేకతతో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఇందిర, కాంగ్రెస్ లోని సిండికేట్ పై విజయం సాధించడానికి వామ పక్షాలను కలుపుకుంది. "కమ్యూనిజం" కంటే "కమ్యూనలిజం" వల్లే ప్రమాదం అనే నినాదం లేవదీసింది. ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వారందరినీ  వారూ-వీరూ అనే తేడా లేకుండా, జైళ్లకు పంపడానికి వెనుకాడలేదు. ఇరవై సూత్రాల ఆర్థిక ప్రణాళికైనా, గరీబీ హటావో పథకమైనా, బాంకుల జాతీయ కరణైనా, గ్రామీణ బాంకుల స్థాపనైనా, ఇందిరా గాంధీ మనసులో మాట ఒకటే. భారత దేశానికి నాయకత్వం వహించగలిగేది తానే అని, తాను దానికోసమే జన్మించానని ఆమె నమ్మకం. ఆ నమ్మకమే ఆమె గెలుపుకు సోపానాలు, ఓటమికి కారణాలయ్యాయి.

ఇందిరా గాంధీలో సహనం, అసహనం సమపాళ్లలో వుండేవని ఆమెను గురించిన విశ్లేషణాలలో పలువురు పేర్కొన్నారు. ఎప్పుడు దూకుడుగా వ్యవహరించేదో, ఎప్పుడు నిశ్శబ్దంగా పనులు చక్కబెట్టేదో, ఎందుకు ఒంటరిగా వుండదలుచుకునేదో, ఎప్పుడు, ఎందుకు ఏ పని చేసేదో కనుక్కోవడం అంత తేలిక కాదని మీడియాలో కథనాలొచ్చేవి. ఒకరిని చేరదీయడంలోను, ఇంకొకరిని పక్కన పెట్టడంలోను, ఆమెకు ఆమే సాటి. అందుకేనేమో తనను తాను ‘జోన్ ఆఫ్ ఆర్క్’ లాగా అభివర్ణించుకుంది ఇందిర బాల్యంలో.

1941 లో భారత స్వాతంత్ర్య సంగ్రామం ఉధృత రూపం దాలుస్తున్న సమయంలో, విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న ఇందిరా ప్రియదర్శిని స్వదేశానికి తిరిగొచ్చింది. తల్లి కమలా నెహ్రూ మరణించిన తర్వాత ఇందిర ఆక్స్ ఫర్డ్ లో చేరింది. రెండవ ప్రపంచ యుద్ధం రోజుల్లో, రెడ్ క్రాస్ వాలంటీర్ గా చేరి, కొంతకాలం అంబులెన్స్ డ్రైవర్ కూడా పనిచేసింది. స్వదేశానికి తిరిగొచ్చే సమయంలో ఆమె వెంట వచ్చిన చిన్ననాటి స్నేహితుడు, ఫిరోజ్ గాంధీని వివాహం చేసుకుంది.  కొద్ది కాలంలోనే ఇరువురు జైలు జీవితం గడపాల్సి రావడం, ఆ తర్వాత విడుదలై వైవాహిక జీవితం గడపడం, రాజీవ్, సంజయ్ లు పుట్టడం ఒకటి వెంట ఒకటి జరిగింది నాలుగేళ్లలోపు.

జైలులో వున్న తండ్రి జవహర్లాల్ నెహ్రూ తనకు రాసిన ఉత్తరాలలో వర్తమాన ప్రపంచ చరిత్రతో పాటు ప్రాచీన, భవిష్యత్ దర్శనం కలిగే విధంగా ఎన్నో విషయాలను తెలుసుకోగలిగింది ఇందిరా గాంధీ. సంజయ్ గాంధీ పుట్టిన సంవత్సరంలోనే నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తండ్రి దగ్గరకు వచ్చే వారికి ఆతిథ్యం సమకూర్చే బాధ్యతలను, అనధికారికంగా ఇందిర చేపట్టాల్సి వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అదే కొనసాగింది. ఇష్టంగానో, అయిష్టంగానే ఆమె తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించింది. తండ్రితో ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం ఏర్పడడంతో, ఫిరోజ్ తో వుండే సమయం తగ్గి, చివరకు వేర్వేరుగా జీవించే పరిస్థితి కలిగింది. ఆయన చనిపోయేంతవరకూ అంతే కొనసాగింది.

జవహర్లాల్ వెంట దేశ, విదేశాల్లో కలిసి తిరగడంతో, లక్షలాది మంది భారతీయులకు, చాలా మంది విదేశ ప్రముఖులకు, ఇందిరాగాంధీ సుపరిచితురాలైంది. నాలుగు పదుల వయస్సులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైన ఇందిర, ఏడాది కాలంలో తన రాజకీయ సమర్థతను, కాఠిన్యాన్ని ప్రదర్శించి, ప్రపంచ చరిత్రలోనే ప్రప్రధమంగా బాలట్ ద్వారా అధికారంలోకి వచ్చిన నంబూద్రిపాద్ నాయకత్వంలోని కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని నాటి (తెలంగాణాకు చెందిన) గవర్నర్ బూర్గుల రామకృష్ణారావు ద్వారా రద్దు చేయించడంలో కీలక పాత్ర పోషించింది. ఎన్నికైన ప్రభుత్వాలను అప్రజాస్వామికంగా కూలదోయడం ప్రారంభం కావడం అలా మొదలైంది. ఆ తర్వాత జరిగిన ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు విజయం సాధించి పెట్టింది. తండ్రి మరణానంతరం, లాల్ బహదూర్ మంత్రివర్గంలో సమాచార, ప్రసార శాఖను చేపట్టింది. శాస్త్రి హఠాన్మరణం దరిమిలా, కామరాజ్ నాడార్, నిజలింగప్ప, నీలం సంజీవరెడ్డి లాంటి ఉద్డండులున్న కాంగ్రెస్ అధిష్టానం ఇష్టం వున్నా లేకపోయినా, ఇందిరను ప్రధాన మంత్రిని చేశారు. ఇక అక్కడి నుంచి ఇందిర అధ్యాయం మొదలైంది. ఎవరూ ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాలణ మొదలైంది ఆమె నేతృత్వంలో.

ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధించడంతో భవిష్యత్ పై దృష్టి సారించింది ఇందిరాగాంధీ. అకస్మాత్తుగా మరణించిన రాష్టపతి జకీర్ హుస్సేన్ స్థానంలో, కాంగ్రెస్ అభ్యర్థిగా ఇందిరాగాంధీని అహర్నిశలూ ఘాటుగా విమర్శించే నీలం సంజీవరెడ్డిని అధిష్టానం నిర్ణయించింది. నామినేషన్ పై ఆయననే ప్రతిపాదించిన ఇందిరాగాంధీ, దరిమిలా స్వతంత్ర అభ్యర్థి వీవీ గిరికి మద్దతును బహిరంగంగానే ప్రకటించి, తన మద్దతుదారులందరినీ ఆయనకే ఓటెయ్యమని అనధికారిక విప్ జారీచేసి, గెలిపించింది. మొరార్జీ దేశాయ్ ని ఆర్ధికశాఖ నుంచి తప్పించి, మంత్రివర్గం నుంచి రాజీనామా చేసే పరిస్థితులు కలిపించింది. క్రమశిక్షణను ఉల్లంఘించిందన్న ఆరోపణపై, వృద్ధ నాయకత్వం ఆమెను పార్టీ నుంచి తొలగించడంతో, ఇందిర కాంగ్రెస్ పార్టీని చీల్చి, ఏడాది ముందే 1971 లో ఎన్నికలకు పోయి, అఖండ విజయం సాధించి పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించింది.

భారత-పాకిస్తాన్ యుద్ధంలో, ఇందిర నేతృత్వంలోని భారతదేశం అఖండ విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఉపఖండంలో తిరుగులేని శక్తిగా భారత దేశానికి పేరు తెచ్చింది. ఆ తర్వాత కొద్ది నెలలకు జరిగిన రాష్ట్ర శాసన సభల ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఇందిర ప్రభ వెలగ సాగింది. ఆమె ఆరోహణ పర్వం కొనసాగుతుండగానే, అవరోహణ పర్వానికి బీజాలు పడ్డాయి. అలహాబాద్ హైకోర్టు, లోక్ సభకు ఆమె ఎన్నిక చెల్లదని, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలిగా కూడా ప్రకటించింది. తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండు చేయడంతో యోధాన యోధులైన ప్రతిపక్ష రాజకీయ నాయకులను నిర్బంధించి, అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అంతర్గత బధ్రత చట్టం కింద వందల, వేల సంఖ్యలో అరెస్టులు చేయించింది. స్వతంత్ర భారత దేశంలో చీకటి రోజులకు తెరలేపింది ఇందిరా గాంధీ.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, పౌరుల ప్రాధమిక హక్కులు హరించిందని, పత్రికా స్వాతంత్ర్యం కాల రాసిందని దేశ విదేశాల ప్రముఖుల విమర్శలను లెక్క చేయని ఇందిర రాజ్యాంగాన్ని తిరగ రాసింది. సుప్రీంకోర్టు స్టేతో తనకు వ్యతిరేకంగా వచ్చిన అలహాబాద్ హైకోర్టు తీర్పునుంచి ఊరట పొందింది. ఆర్థిక, రాజకీయ సుస్థిరత కొరకన్న సాకుతో, జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ఒక ఏడాది వాయిదా వేసింది. విదేశీ బూచిని చూపించడం పదే పదే చేయసాగింది. మీడియాపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. అత్యసర పరిస్థితికి అనుగుణంగా, ఆమె చర్యలను అత్యున్నత న్యాయస్థానం సమర్థించడంతో ఇందిరకు మరింత బలం చేకూరింది. రాజ్యాంగ సవరణల ద్వారా, అవధులు లేని అధికారాలను ఇందిరాగాంధీ తన సొంతం చేసుకుంది. కొడుకు సంజయ్ గాంధీ సారధ్యంలో బలవంతపు కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమల్లోకి చేసింది.

ఐదేళ్ల లోక్ సభ పదవీకాలం పొడిగించి, ఆరేళ్లు చేసిన తర్వాత, హఠాత్తుగా, జనవరి 1977 లో ఎన్నికల నిర్ణయం ప్రకటించింది ఇందిరాగాంధీ. జైళ్లలో నిర్బంధించిన చాలామందిని విడుదల చేయించింది. ప్రతి పక్షాలన్నీ ఏకమయ్యాయి. ఆమె అనుంగు సహచరుడు జగ్జీవన్ రాం కూడా బాంబు పేల్చాడు. ప్రతి పక్షాల సరసన చేరాడు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో అతివాద, మితవాద పార్టీలను, కాంగ్రెస్ లోని యంగ్ టర్క్స్ ను కలుపుకుని జనతా పార్టీ ఆవిర్భవించింది. కసిగా వున్న ఓటర్లు మార్చ్ 20, 1977 న జరిగిన ఎన్నికలలో ఇందిరాగాంధీని ఆమె నియోజక వర్గంలోను, ఆమె సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని దేశంలోను దారుణంగా ఓడించారు. ప్రప్రధమ కాంగ్రేసేతర ప్రభుత్వానికి రెండేళ్లు జైల్లో నిర్బంధించబడిన మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగా సారధ్యం వహించారు. పదవికి రాజీనామా చేసింది ఇందిరా గాంధీ.

ఓటమితో కుంగిపోకుండా ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నాలు తిరిగి ప్రారంభించింది. తన పార్టీలో తనకు వ్యతిరేకంగా వున్న వారితో బంధాలు తెంచుకుని, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన వారిలో సగం మందికి పైగా తన వెంట వుంచుకుని, మరో మారు కాంగ్రెస్ పార్టీని చీల్చి, కాంగ్రెస్ (ఐ) ని స్థాపించింది. కర్నాటకలోని చిక్ మగలూర్ నుంచి ఇందిరా గాంధీ లోక సభకు ఎన్నిక కావడంతో, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్(ఐ) అఖండ విజయం సాధించడంతో ప్రజలు ఆమెకు తిరిగి బ్రహ్మరధం పట్ట సాగారు.

జులై 1979 లో ప్రధానిగా మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసిన తరువాత చరణ్ సింగ్ కు మద్దతు పలికి, ఆయన ప్రధానమంత్రి కావడానికి తోడ్పడి, వ్యూహాత్మకంగా ప్రభుత్వాన్ని విశ్వాస తీర్మానంలో ఓటమి పాలు చేసింది ఇందిరా గాంధీ. జనవరి 1980 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ () మూడింట రెండు వంతుల మెజారిటీతో అఖండ విజయం సాధించి, ఇందిరాగాంధీ మరో మారు ప్రధాన మంత్రి అయింది. ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో అమృత్‌సర్ లోని గోల్డెన్‌ టెంపుల్-హర్మందిర్ సాహిబ్ పై జరిగిన సైనిక దాడికి నిరసనగా, అంగరక్షకులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ లు జరిపిన కాల్పుల్లో అక్టోబర్ 31, 1984 న ఇందిరాగాంధి మరణించింది. నియంతృత్వ పాలనకు బీజాలు ఏనాడో వేసిన ఇందిరాగాంధీ, లోని మంచి చెడులను నిశితంగా  విమర్శించేవారితో పాటు అభిమానించేవారు కూడా చాలామంది వున్నారు.

(నవంబర్ 19 ఇందిరాగాంధీ 105 వ జయంతి సందర్భంగా)

Thursday, November 17, 2022

పచ్చ దోసకాయ, జొన్న బియ్యం, పచ్చి పెసలు! (గుర్తుకొస్తున్నాయి) : వనం జ్వాలా నరసింహారావు

 పచ్చ దోసకాయ, జొన్న బియ్యం, పచ్చి పెసలు!

(గుర్తుకొస్తున్నాయి)

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (17-11-2022)

బాల్యం, యవ్వనం తొలినాళ్లు, మూడేళ్ల వ్యవసాయ అనుభవం లాంటి తీపి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడల్లా కలిగే అనుభూతే వేరు. ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలో వున్న మా గ్రామం వనం వారి కృష్ణా పురం, ఆ వూళ్లోని కొఠాయి (రచ్చబండ), మా రెండంతస్తుల భవనం, ఆ భవనం ముందున్న స్థలంలో తెలతెలవారుతుండగానే ఇద్దరు పని మనుషులు కందికట్టె పోలికట్టెతో శుభ్రం చేసి కలాపు (పేడ కలిపిన) నీళ్లు చల్లడం, వూరు ఒక పక్కన వున్న రామాలయం, మరో వైపున్న వేంకటేశ్వర స్వామి ఆలయం, ఎక్కి తిరిగే కచ్చడం (చిన్న) బండి, పెంట బండ్లు, మేనా, వరి పొలాలు, మల్లె, మామిడి, మిరప, మొక్క జొన్న తోటలు, తోటలలోని మోటబావులు, జొన్న చేలు, చేలలోని దోసకాయలు, మంచె, అరకలు, ఎద్దులు, పాలేర్లు (జీతగాళ్లు అనే వాళ్లం), పాడి పశువులు, వాటికి పెద్ద కొష్టం, మేకలు, వరి గడ్డి వాములు, పెరట్లోని బావి, బావి పక్కనున్న నిమ్మ, అరటి చెట్లు, ఇంటి వెనుక ఉదయాన్నే చల్ల చిలికే ప్రక్రియ, వెన్న పూస తినడం, మామిడి వూరగాయ కారం కలిపి ఉదయాన్నే తిన్న చద్ది అన్నం, వెండి కంచాలలో భోజనాలు, సాయంత్రం ఇంటి ఆరుబయట నీళ్లు చల్లి నవారు, నులక మంచాలు వేయడం, కబుర్లు చెప్పుకుంటా ఆకాశంవైపు చూస్తూ పడుకోవడం, ఇలా గ్రామీణ వాతావరణం గుర్తుకు రాసాగాయి.   

మేం చేస్తున్న వ్యవసాయానికి ప్రతిఫలంగా సుమారు 40 పుట్ల వడ్లు (పుట్టికి 75 కిలోల బరువుండే ఎనిమిది బస్తాలు), 20 పుట్ల జొన్నలు, 40-50 పుట్ల వేరు శనగ, 10 పుట్ల కందులు, 10 పుట్ల పెసలు, వీటికి తోడు మిరప కాయలు, పొగాకు, మామిడి పంట, మల్లెలు, ఇలా, ప్రతి ఏటా పండేవి. నల్ల రేగడిలో జొన్న పంట వేసే వాళ్లం. చెరువు కింద వరి పొలంలో వడ్లు పండేవి. చెరువులోకి నీరు రాకపోతే, జనప పంట వేసే వాళ్లం. ఎర్రమట్టి  చేలలో పునాస పంటలు వేసే వాళ్ళం. ధాన్యం ఇంటికి చేర్చిన తరువాత, "పాతర" లో కాని, "గుమ్ములు" లో కాని, "ధాన్యం కొట్టుల" లో కాని భద్రపరిచేవారు. మార్కెట్ అనుకూలంగా వున్నప్పుడు అమ్మేవారు. ఆ ధాన్యంలోనే కొన్ని బస్తాలు మరుసటి సంవత్సరానికి విత్తనాలుగా ఉపయోగించేందుకు వేరే భద్రపరిచేవారు. ఇప్పటిలాగా విత్తనాలు కొనే అలవాటు లేదు.

పొలాలకు పెంట తోలే ప్రక్రియతో వ్యవసాయపు పనులు వేసవి కాలంలోనే మొదలయ్యేవి. ఉగాది పండుగ కల్లా రాబోయే సంవత్సరానికి పాలేర్లను (జీతగాళ్లను) కుదుర్చుకునే వాళ్లం. ఆ రోజుల్లో పెద్ద పాలేరుకు సంవత్సరానికి పది నుంచి పన్నెండు బస్తాల జొన్నలు, మిగిలిన వాళ్లకు ఎనిమిది బస్తాలు జీతంగా ఇచ్చే వాళ్లం. జొన్నల ధర పెరిగినా, తగ్గినా అదే జీతం. మొదలు మా పాడి పశువుల వల్ల పోగైన నాలుగైదు వందల బండ్ల పెంటను పొలాలకు తోలే వాళ్లం. అదనంగా మా గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాలలో పెంట ఖరీదు చేసి కొని పొలాలకు తోలే వాళ్లం. చెల్లింపులన్నీ ధాన్యం రూపేణగానే జరిగేది.

యాదవుల (గొల్లలు) దగ్గర వందల సంఖ్యలో వుండే జీవాలను (గొర్రెలు) పొలాలలో రాత్రింపగళ్లూ వుంచేవాళ్ళం. అదీ ఖరీదుకే. అలా వుంచడం వల్ల పొలాలలో జీవాల పెంట పోగయ్యేది. అది పొలాలకు సహజ ఎరువులాగా ఉపయోగపడుతుంది. అప్పట్లో రసాయనిక ఎరువుల వాడకం అలవాటు ఇంకా సరిగ్గా కాలేదు. ఇళ్లలో పోగైన పెంటను, జీవాల పెంటను మాత్రమే ఎరువులాగా వాడే వాళ్లం. అదనంగా, చెరువు పూడిక తీసి మట్టిని పొలాలకు తోలే వాళ్లం. తెల్లవారు జామునుంచే పెంట బండ్లను కట్టే ప్రక్రియ మొదలయ్యేది. మధ్యాహ్నం పన్నెండు (రెండు జాములు అనే వాళ్ళు) గంటల సమయం వరకు తోలి ఇళ్లకు తిరిగి వచ్చే వాళ్ళు జీతగాళ్లు. పొద్దున్నే చద్ది అన్నం తినే వాళ్ళు. నేను కూడా అప్పుడప్పుడు పెంట బండి తోలేవాడిని. మధ్యాహ్నం సుమారు రెండు గంటల పాటు జీతగాళ్లు ఇళ్లకు వెళ్లి భోజనం చేసి వచ్చి, ఎడ్లకు దానా వేయడం, నీళ్లు పెట్టడం లాంటివి చూసుకునేవారు. ఆ సంవత్సరానికి కావాల్సిన వ్యవసాయ పనులకు సంబంధించిన తాళ్లు పేనడం లాంటి వాటిని ఒక గంట-రెండు గంటల పాటు చూసుకునేవారు. మళ్లీ నాలుగు గంటల ప్రాంతంలో పెంట బండ్ల కార్యక్రమం మొదలయ్యేది. వెన్నెల రోజుల్లో రాత్రుళ్లు కూడా బండ్లు తోలేవారు. ఇలా తొలకరి జల్లులు కురిసే వరకు కొనసాగేది.

ప్రతి రోజు ఉదయం మా ఇంట్లో చిలికిన చల్లను తీసుకెళ్లేందుకు కొందరొచ్చేవారు. వాళ్లు ఇంట్లో తాము తినేందుకు జొన్నలు దంచుకుని, మా గేదెలు-ఆవులు తాగేందుకు మా ఇంటికి వచ్చి దాని తొక్కు వంచి పోయేవారు. బదులుగా చల్ల తీసుకు పోయే వాళ్లు. వేసవి కాలంలో, మా ఇంటి వెనుక కుండలో వుంచిన చల్లను కడుపు నిండా ఎన్నో సార్లు తాగే వాళ్లం. ఉదయాన్నే చాకలి వచ్చి విడిచిన బట్టలు తీసుకెళ్లి వూరి బయట వున్న వాగులోనో, చెరువులోనో వుతికి సాయంత్రం తెచ్చే వాళ్లు. ఏపని చేయడానికి ఆపనికి ఉపయోగపడేవారే వుండేవారు. గ్రామాలు స్వయం సమృద్ధిగా వుండేవి. చెల్లింపులు ధాన్యం రూపేణానే.

తొలకరి వానలు మొదలవ్వగానే పొలం పనులలో కొంత మార్పు వచ్చేది. వరి పొలాలకు కావాల్సిన నారు చల్లడం, పునాస పంటలకు పొలాలను నాగళ్లతో దున్నడం, దంతెలతో దున్నడం జరిగేది. వర్షాలు కురిసే తీరుతెన్నుల ఆధారంగా పొలం పనులలో మార్పులు చేర్పులు జరుగుతుండేవి. వర్షాలు ఆగుతే మిగిలిన పెంటను తోలడం కొనసాగించేవారు. వేరు శనగ, అందులో కంది పంటలు కలిపి వేసే వాళ్లం. చెరువులకు నీళ్లు రావడం జరుగుతే వరి నాట్లు వేసే వాళ్లం. ఆ తరువాత జొన్న పంట వేసే వాళ్లం. నాట్లు వేయడానికి ముందర పొలాన్ని మొదలు నాగళ్లతో, తరువాత బురద నాగళ్లతో దున్నడం జరిగేది. సాధారణంగా మా గ్రామంలో వరి నాట్లు మహిళలే వేసేవారు. పాటలు పాడుకుంటూ, హుషారుగా నాట్లు వేసేవారు. నాట్ల రోజుల్లో కూలీలతో పాటు నేను కూడా భోజనం పొలం దగ్గరకే తెప్పించుకుని చేసేవాడిని. అక్కడ చెరువు నీళ్లే తాగేవాడిని. ఆ నీరు తాగడానికి భయమేసేది కాదు. ఇప్పుడైతే మరి మినరల్ వాటర్!

నాట్లు పడ్డ తరువాత దశలవారీగా పొలాలకు నీరు పెట్టడం జరిగేది. ఒక్కో సారి రాత్రుళ్లు పోయి వంతుల వారీగా నీళ్లు పెట్టే వాళ్లం. నీళ్లు సరిపోకపోతే పొలాలలో ఒక పక్కన కొంత లోతు వరకు తవ్వి, నీటిని తీసి చేది పోయడం జరిగేది. వరి కొంత పెరిగిన తరువాత కలుపు తీయడం జరిగేది. మూడు-నాలుగు నెలల తరువాత కోతల సీజన్ ఆరంభమయ్యేది. కోయడం, గూళ్లు వేయడం, సమయం చూసుకుని, వాతావరణం అనుకూలించినప్పుడు నూర్పిడి చేయడం, తూర్పార పట్టడం, చివరకు వరి ధాన్యాన్ని ఇంటికి తోలడం జరిగేది. ఈ ప్రక్రియ జరిగినన్నాళ్లు వరి పొలంలోనే రాత్రుళ్లు నిద్రించే వాళ్ళం. ఆ ఆనందం ఇప్పుడు తలుచుకుంటుంటే ఒక మధురానుభూతిలాగా అనిపిస్తోంది. నాటు కూలి, కోత కూలి, ఇతర కూలి అంతా ధాన్యం రూపేణగానే. ఎకరానికి ఐదారు కుండల ధాన్యం కూలీగా వుండేది. రేట్లు పెంచమని అడపాదడపా కూలీలు కమ్యూనిస్ట్ పార్టీ మద్దతుతో ఆందోళన చేసే వాళ్లు కూడా. నాట్ల సీజన్లో, కోతల సీజన్లో ఇతర ప్రాంతాల నుంచి కూడా కూలీలు వచ్చేవారు. ఇప్పుడు చాలావరకు యాంత్రీకమైపోయింది.

ఇక వేరు శనగ పంట వ్యవహారం మరో విధంగా వుండేది. విత్తనాలు తయారు చేయించే ప్రక్రియతో మొదలయ్యేది. ఇంటికి కూలి వాళ్లను పిలిచి, క్రితం సంవత్సరం పండిన వేరు శనగ కాయలను కొలిచి, వాటినుంచి విత్తులను తీయమని వాళ్లకు చెప్పే వాళ్లం. వాళ్లలో కొందరు తమ ఇంటికి తీసుకెళ్లి చేసేవారు, కొందరు మా ఇంట్లోనే చేసేవారు. సాయంత్రం కల్లా వాళ్ల-వాళ్ల సామర్ధ్యాన్ని పట్టి కుండెడో, రెండు కుండలో కాయ కొట్టి విత్తులను తీసే వాళ్లు. వాళ్ళకు కూలీ ధాన్యం రూపేణగానే ముట్టేది. విత్తులు తీసేటప్పుడు కొంత భాగం పప్పు అయ్యేది. ఆ పప్పుతో ఏడాదికి సరిపడా శనగ నూనె చేయించి ఇంట్లో ఉపయోగించే వాళ్లం.

వర్షాలు పడగానే, భూమిని దున్ని అదను కుదిరినప్పుడు "ఎద" పెట్టే వాళ్లం. ఒకడు ఎద గొర్రు తోలుతుంటే, పక్కన నడుచుకుంటూ మరొకరు, శనగ విత్తులను, భూమిలోకి గొర్రు పైభాగంలోంచి భూమిలో పడేలా పోసేవారు. అతి క్లిష్టమైన ఈ ప్రక్రియ అందరికీ చేత కాదు. పైగా శనగ విత్తులతో పాటు కంది విత్తనాలు కూడా ఒక పద్దతి ప్రకారం ఎద పెట్టాలి. శనగ పంట ముందు చేతికొస్తుంది. ఆ తరువాత రెండు నెలలకు కంది పంట వస్తుంది. శనగ విత్తనాలు మొలకెత్తిన నెల రోజుల తరువాత పై పాటు చేయాలి. ఇది కూడా కష్టమైన పనే. పై పాటు చేసే అరకలను అందరూ తోలలేరు. ఎద్దుల కాళ్ల కింద మొక్కలు నలిగి పోకుండా, అరక కింద చెట్లు పడ కుండా తోలాలి. అదెంతో ముచ్చటేసేది. మూడు నెలల తరువాత కూలి వాళ్లతో శనగ మొక్కలను భూమి నుంచి పీకించి కాయలను వేరు చేయించే వాళ్లం. మరో రెండు నెలలకు కంది కళ్ళం వేసి ఆ పంటను కూడా తెచ్చుకునే వాళ్లం.

ఇక మరో పంట జొన్న. వీటినే పచ్చ జొన్నలనే వాళ్లం. ఇటీవల కాలంలో నీటి పారుదల ప్రాజెక్టులు వచ్చిన తరువాత జొన్న పంట దాదాపు ఎవరూ వేయడం లేదు. దీనికి కూడా ఎద పెట్టడం వుంటుంది. జొన్న పంట తయారైన తరువాత కోసి, కట్టలు కట్టించే వాళ్లం. కూలీ కింద కట్టలనే ఇచ్చే వాళ్లం. ప్రతి ఐదు కట్టలకు ఒక కట్ట కూలీ కింద పోయేది. ఇక ఆ తరువాత జొన్న గూడు వేయించడం, కంకి కోయించి తొక్కించడం, తూర్పార బట్టడం, ధాన్యాన్ని ఇంటికి-మార్కెట్‌కు చేర్చడం జరిగేది. జొన్న చేలల్లో పప్పు దోసకాయలుండేవి. అవి అక్కడనే కొడవలితో కోసుకుని, కారం కలుపుకుని, మంచెపైకెక్కి కూచుని తినే వాళ్లం. జొన్న వూస బియ్యం కూడా కొట్టించుకుని, పలుకు రాళ్ల నిప్పులో వేడి చేసుకుని తినే వాళ్లం. చేనులో దొరికే పెసలు తినే వాళ్లం. ఆ అనుభూతి మాటల్లో వర్ణించడం, రాతల్లో చెప్పడం చాలా కష్టం.

ఈ పంటలకు తోడు మేం మిరప తోట వేసే వాళ్లం. మధ్యలో బంతి పూల చెట్లు వేసే వాళ్లం. మా ఇంటి పక్కనే తోట వుండేది. అందులో ఒక పక్క మల్లె తోట కూడా వుండేది. తోటలో మోట బావి వుండేది. మోట తోలడం కూడా కష్టమైన పనే. మోట తోలడానికి కట్టిన ఎద్దులను వెనుకకు నడిపించుకుంటూ, భావి ముందరకు తీసుకెళ్లాలి. భావిలో మోట బక్కెట్ (చాలా పెద్దగా వుంటుంది) పూర్తిగా మునిగి నీరు నిండే లాగా ఎద్దులను వెనక్కి తేవాలి. అప్పుడు మునిగి, నిండిన బకెట్ పైకి రావడానికి ఎద్దులను ముందుకు తోలాలి. బకెట్ కట్టిన తొండం లోంచి నీరు భావిదగ్గరున్న కాలువలో పడి ప్రవహించుకుంటూ మిరప చెట్లను తడుపుకుంటూ పోతుంది. మోట తోలడం సరదాగా కూడా వుంటుంది. అలానే పొగాకు,  మొక్క జొన్న దినుసు గడ్డలు, వుల్లి గడ్డలు కూడా సాగు చేశాం. క్యాబేజీ, కాలీ ఫ్లవర్ లాంటి కూరగాయలతో సహా ఎన్నో రకాల కూరగాయలను కూడా పండించాం. ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే అవన్నీ ఆర్గానిక్ పంటలు.  

ప్రతి పంటకు "పరిగ" అని వుండేది. మాకు జీతగాళ్లే కాకుండా, ఒకరిద్దరు మేమిచ్చే వార్షిక కూలీ మీద ఆధారపడి జీవించే వాళ్లున్నారు. వాళ్లు మాకు అవసరమైన చిల్లర పనులను చేసేవారు. ఉదాహరణకు మా జీత గాళ్లకు కావాల్సిన పాదరక్షలను తయారు చేసే వారుండేవారు. మా పొలాలకు నీరు పెట్టే నీరుకాడుండేవాడు. మా ఇంటి ముందు అలకడానికి కావాల్సిన ఎర్ర మట్టిని తెచ్చి పెట్టేవాడుండేవాడు. మా బట్టలుతికే వాళ్లు, మేమిచ్చే సమాచారాన్ని మా వూరి నుంచి ఇతర గ్రామాలకు తీసుకెళ్ళే మనిషి, ఇలా, కొందరుండేవారు. మా పొలాలలో పంటను మేం తీసుకెళ్ళిన తరువాత, పొలంలో మిగిలిన దాన్ని "పరిగ" అంటారు. అదంతా వాళ్లకే చెందుతుంది. పరిగ కూడా చాలా మోతాదులోనే వుంటుంది ఒక్కో సారి.

ఒకానొక రోజుల్లో గ్రామీణ వాతావరణం, అందులో అగ్రగామిగా వుండే వ్యవసాయం, ఆ వ్యవసాయానికి అనుబంధంగా వుండే పనిముట్లు, నైపుణ్యంతో వ్యవసాయానికి అవసరమైన పనులను చక్కదిద్దే వ్యక్తులు, విద్య లేకపోయినా అనుభవంతో ఏ పంట ఎప్పుడు వేస్తే లాభదాయకమో తెలియచెప్పే కొందరు గ్రామస్తులు, ఇలా అనేక విధాలుగా అలరారుతుండేది. గ్రామమంతా ఒక వసుదైక కుటుంబం లాగా వుండేది. అన్నీ నగదు రహిత లావాదేవీలే! ఎవరికీ ఏ కష్టం వచ్చినా అందరూ ఆడుకునేవారు.

గత అర్ధ శతాబ్ది కాలంగా వ్యవసాయం గణనీయమైన మార్పులకు, చేర్పులకు గురవుతోంది. మానవ, సహజ వనరుల స్థానంలో యంత్రాలు, సింథటిక్ ఎరువులు, క్రిమిసంహారక మందులు చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం కారణాన ఖర్చుతో పాటు పంట దిగుబడులు పెరిగినప్పటికీ, వాతావరణ సమతుల్యం దెబ్బ తినడం, ఆరోగ్యానికి హానికరమైన పరిస్థితులు నెలకొనడం కూడా జరిగింది. పశువుల పెంటను కానీ, జీవాల పెంటను కానీ, చెరువు మట్టిని కానీ పొలాలకు వాడడం అరుదైపోయింది. కాలం తెస్తున్న మార్పుకు అలవాటు పడాలో, ఇబ్బంది పడాలో అర్థం కాని అయోమయ పరిస్థితి. END

Monday, November 14, 2022

ప్రతిదానికీ సీబీఐ అవసరమా? : వనం జ్వాలా నరసింహారావు

ప్రతిదానికీ సీబీఐ అవసరమా?

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (15-11-2022)

‘రాష్ట్రప్రభుత్వం న్యాయం చేస్తుందని మాకు నమ్మకం లేదు. ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలి’ లాంటి డిమాండ్స్ చాలా రాష్ట్రాలలో ఇటీవల తరచు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ లబ్ధి కోసం, చీటికీ మాటికీ ప్రతి వివాదానికీ సీబీఐ విచారణ అంటూ డిమాండ్ చేయడం, ఒక్కోసారి తలనొప్పి తగ్గించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగీకరించడం జరుగుతున్నది. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ అనే విషయం ఎవరూ కాదనరు. అందుకేనేమో, నేర పరిశోధనను కొలిక్కి తీసుకుని రావటంలో అందరినోటా మొదటిగా వినిపించే మాట సీబీఐనే.

కానీ– ప్రజా జీవితంలో సీబీఐ ఏమేరకు శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నదీ, జాతీయ సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థల కుశలతపై ఎంతవరకూ భరోసానిస్తున్నదీ అన్నది రోజులు గడుస్తున్నకొద్దీ ప్రశ్నార్థకం అవుతున్నది. ఈ సంస్థ భారత ప్రభుత్వం అధికార పరిధిలో, దాని చెప్పుచేతల్లో పనిచేస్తూ, కేంద్ర ప్రభుత్వ పాలకుల చేతిలో పావుగా మారి, న్యాయస్థానాల ధర్మాగ్రహానికి కూడా గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. సరిగ్గా ఒక ఏడాది క్రితం సుప్రీంకోర్టు సీబీఐని అది చేపట్టిన కేసుల్లో ఎన్ని ప్రోసిక్యుషన్ దాకా వచ్చాయి? ఎన్ని పెండింగులో ఉన్నాయి? శిక్షలు పడ్డ వాటి శాతం ఎంత? తదితర వివరాలను సమర్పించమని కోరింది కూడా.

ఇటీవల నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బహిర్గతం కావడం, స్థానిక పోలీసులు కార్యరంగంలోకి దిగి చట్టప్రకారం చర్యలు చేపట్టడం తెలిసిందే. ఆడియో టేపులు బైటపడటంతో, బీజేపీ నాయకులు, ప్రతినిధులు ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆశ్రయించారు. ఈ అంశంపై సీబీఐతో విచారణకు ఆదేశించాలని కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. శాంతి భద్రతల సమస్య, అవినీతికి చెందిన అంశాలను దర్యాప్తు చేయడానికి రాష్ట్ర సంస్థలు ఉన్నప్పటికీ, నేరారోపణ జరిగిన తక్షణమే అలా కోరడం సబబేనా?

ఏరాష్ట్రంలోనైనా రాజకీయ నాయకులూ రాజకీయ పార్టీల ప్రమేయం ఉన్న కేసుల విషయంలో గాని, సమాజంలో పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న వారి ప్రమేయం ఉన్న కేసుల విషయంలో గాని, స్థానిక దర్యాప్తుసంస్థల మీద నమ్మకం లేదన్న కారణంతో, సీబీఐ దర్యాప్తును కోరడం పరిపాటే. న్యాయస్థానాలు కూడా తరచూ సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తుంటాయి. అయితే మొదటి నుంచీ సీబీఐ దర్యాప్తు విషయంలో, కేంద్రంలో అధికారంలో వున్న పార్టీకి చెందని రాష్ట్ర ప్రభుత్వాలు భిన్న ధోరణిని అవలంబించటం కూడా ఆనవాయితీనే. చట్టాలు ఏమిచెప్పినా సీబీఐ దర్యాప్తు విషయంలో సరైన సాంప్రదాయాలు ఇంతవరకూ ఏర్పడలేదన్నది వాస్తవం.

ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూస్తే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) 1941లో భారత ప్రభుత్వం స్థాపించిన ‘స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్’ అనే పేరుతో ఆరంభమైంది. అలనాటి బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం ఈ సంస్థను రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో, యుద్ధ సామాగ్రి కొనుగోళ్ల లావాదేవీలలో జరగడానికి ఆస్కారమున్న అవినీతి కేసుల దర్యాప్తుకే పరిమితం చేసింది. పరిణామక్రమంలో భాగంగా, యుద్ధం ముగిసిన తరువాత, కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి సంబంధించిన అవినీతి ఆరోపణల కేసుల దర్యాప్తుకు మాత్రమే పరిమితం చేస్తూ, 1946లో, ‘ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం’ తీసుకొచ్చింది ప్రభుత్వం.

క్రమేపీ, ఈ సంస్థ పరిధిని కేంద్రపాలిత ప్రాంతాలకు, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదంతో సంబంధిత రాష్ట్రాలకు విస్తరించారు. ఏప్రిల్ 1963లో, హోం మంత్రిత్వ శాఖ తీర్మానంతో, దాని పేరును ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ (సీబీఐ)గా మార్చారు. ఇలా పేరు మార్పిడి జరిగిన తొలిరోజులలో, కేవలం కేంద్ర ప్రభుత్వ సిబ్బందిపై వచ్చిన అవినీతి ఆరోపణలు మాత్రమే విచారించడం దీని బాధ్యత. క్రమేపీ ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బందిని, బేంకుల జాతీయకరణ తరువాత ఆ సిబ్బందినీ దీని పరిధిలోకి తెచ్చారు. క్రమక్రమంగా దాని పరిధి మరింత విస్తరించింది. రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేని ప్రతివారూ సీబీఐ పేరు తెరమీదికి తేవడం అలవాటైపోయింది. ఇలా ఎందుకు జరగాలి?

సీబీఐ వ్యవస్థాపక డైరెక్టర్ డిపి కొహిలి, దాని ఆవిర్భావపు రోజులలోనే, అదొక జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థగా ఎదుగుతుందని జోస్యం చెప్పాడు. ఐదేళ్ళ తన పటిష్టమైన నేతృత్వంలో ఆయన సీబీఐ నేటి ఈ స్థితికి చేరడానికి పునాదులు వేశారు. సిబీఐ నుంచి అత్యున్నత ప్రమాణాల సమర్థతను, దక్షతను, సత్యనిష్ఠను భవిష్యత్‍లో పౌరులు ఆశిస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాల్సిన బాధ్యత దానిపై ఉందని కొహిలి ఆశయం. అధికారులకు ‘లాయల్టీ టు డ్యూటీ’ని ప్రబోధించారు. ఆయన తదనంతర కాలంలో ఇవన్నీ ఎంతమేరకు జరుగుతున్నాయనేది కోటి రూకల ప్రశ్న.

1965 నుంచి ఆర్థికపరమైన నేరాల పరిశోధన అంశాన్ని కూడా సీబీఐ పరిధిలోకి తెచ్చింది ప్రభుత్వం. అలా కేంద్ర ప్రభుత్వం దాని పరిధిని మరింత విస్తరించ సాగింది. హత్యా నేరాలు, కిడ్నాపులు, తీవ్రవాద కార్యకలాపాల విషయాలలో కూడా సీబీఐతో దర్యాప్తు జరగాలన్న డిమాండు రాసాగింది. వ్యక్తులు, వ్యవస్థలు తమకు జరిగిందని భావిస్తున్న అన్యాయాల విషయంలో న్యాయం కలిగించమని కోర్టులను ఆశ్రయించినప్పుడు, కోర్టులు కూడా సీబీఐకి దర్యాప్తును అప్పచెప్తే స్థాయికి దానికి గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపును నిలబెట్టుకోవడంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సఫలమైందా, విఫలమైందా అన్నది చరిత్ర తేల్చాలి. ఈ నేపథ్యంలో 1987 లో సీబీఐలో రెండు విభాగాలను ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఒకటి: అవినీతి నిరోధక విభాగం, మరొకటి: ప్రత్యేక కేటగిరీ నేరాల విభాగం. ఇలాంటి నేపథ్యం ఉన్న సీబీఐ ఎవరికీ, ఏ విషయంలోనూ అన్యాయం చేయ (లే)దన్న నమ్మకం, అటు ప్రభుత్వాలకూ, ఇటు పౌరులకూ ఎంతవరకూ కలిగిస్తున్నదన్న విషయం ఇంతవరకూ అది చేపట్టి పరిశోధించిన కేసులను అధ్యయనం చేస్తే తప్ప అవగతం కాదు.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ తెలంగాణ రాష్ట్రంలో ఇకముందు ఏ కేసులోనైనా దర్యాప్తు చేయాలంటే ముందస్తుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. దర్యాప్తు కోసం సీబీఐకి గతంలో ఇచ్చిన సాధారణ అనుమతిని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. ఈ మేరకు ఆగస్టు 30న రాష్ట్ర ప్రభుత్వం జీఓ 51ని జారీచేసింది. ఇక ఏ కేసులోనైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే, జీవో 51 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం సీబీఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను తన రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేసేందుకు దుర్వినియోగం చేస్తున్నదన్న కారణంతో బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలకు సాధారణ సమ్మతిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించాయి. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ సహా తొమ్మిది రాష్ట్రాలు తమ పరిధిలోని కేసులను సీబీఐ విచారించేందుకు సాధారణ అనుమతిని ఉపసంహరించుకున్నాయి. తాజాగా ఈ జాబితాలో తెలంగాణ వచ్చి చేరింది.

సీబీఐ చేపట్టిన కేసులు కొన్ని మచ్చుకు తీసుకుంటే అవి ఏమేరకు ఫలితాలను ఇచ్చాయనేది బోధపడుతుంది. దర్యాప్తు కొనసాగిన, కొనసాగుతున్న విధానం, ఎవరినీ దోషులుగానో నిర్దోషులుగానో తేల్చకుండా నెలల, ఏళ్ల తరబడి ముద్దాయిలుగా విచారించడం పేర్కొనవచ్చు. కేంద్రంలో ఉన్న అధికార పక్షం వారికి ఒక నీతి, ప్రతిపక్షాలవారికి వేరొక నీతి అవలంబించడమూ పరిపాటిగా మారింది. తెలుగు రాష్ట్రాలలోనే సుదీర్ఘకాలం విచారణ జరుగుతున్న కేసులు ఉన్నాయి. సీబీఐ తన పేరును పది కాలాల పాటు నిలబెట్టుకోవడానికి, నిష్పాక్షిక దర్యాప్తు సంస్థగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు అంతగా చేయలేదనాలి. ఆ సంస్థను ముద్దుగా కొందరు 'కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్' అని, మరికొందరు 'కాంగ్రెస్ బచావో ఇన్ స్టిట్యూట్' అని, ఇంకొందరు 'సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్' అనీ నామకరణం చేశారు.

వ్యాధి నివారణ కంటే నిరోధం ఎంత ముఖ్యమో, అవినీతి జరిగిన తర్వాత చర్యలకంటే ముందస్తుగానే అవినీతిని నిరోధించగల వ్యవస్థలుండటమూ అంతే ముఖ్యం. ఆ పని సీబీఐ చేయగలిగితే సంతోషమే! కావాల్సింది 'పోస్ట్ ఆడిట్' కాదు, 'ప్రీ ఆడిట్'. ఎమ్మెల్యేల కొనుగోలు, ప్రలోభం వ్యవహారం లాంటి దుర్మార్గపు చర్యలతో సంబంధం ఉన్నటువంటి వారిమీద ఒక కన్ను నిరంతరం వేసి ఉంచాలి. వారు చట్ట పరిధిలో వ్యవహరిస్తున్నారో లేదో విచారణ జరగాలి. ఈ రెండూ రహస్యంగానన్నా, బహిరంగానైనా జరిగి తీరాల్సిందే. ఎవరూ చట్టానికి అతీతులు కారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రాష్ట్ర దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేదని, సీబీఐతో విచారణ జరిపించాలని కొందరు ప్రతిదానికీ కోరడం ఎంతవరకు సమంజసం?

స్తవరాజమనే స్తోత్రరాజంతో శ్రీకృష్ణుడిని స్తుతించిన భీష్ముడు ..... ఆస్వాదన-95 : వనం జ్వాలా నరసింహారావు

 స్తవరాజమనే స్తోత్రరాజంతో శ్రీకృష్ణుడిని స్తుతించిన భీష్ముడు

ఆస్వాదన-95

వనం జ్వాలా  నరసింహారావు

సూర్యదినపత్రిక (14-11-2022)

పట్టాభిషేక అనంతరం, రాజ్యాన్ని పొందిన ధర్మరాజు, గాంధారీ, ధృతరాష్ట్ర, విదురులకు రాజ్యాన్ని సమర్పించి, వారే రాజ్యానికి అసలైన ప్రభువులని, తాను వారు చెప్పిన పనిని చేసి, వారు పెట్టిన దానిని తింటూ వుండగలనని పలికాడు. ప్రతిరోజూ వారి అనుమతి తీసుకుని పాలన సాగించాడు. ఇలా పాలన చేస్తూ ఒకనాడు తెల్లవారు ఝామున శ్రీకృష్ణుడి మందిరానికి వెళ్లాడు ధర్మరాజు. శ్రీకృష్ణుడిని చూసి కుశల ప్రశ్నలు వేశాడు సహజ రీతిలో. ఆ మాటలకు శ్రీకృష్ణుడు ఏమీ జవాబు ఇవ్వకుండా ధ్యానంలో మునిగి అలా వుండిపోయాడు. అప్పుడు ధర్మరాజు ఆయన ధ్యాన స్థితికి కారణం తెలియచేయమని అడిగాడు. వాస్తవానికి శ్రీకృష్ణుడి ధ్యాననిష్ఠలోని విశేషాన్ని తెలుసుకోవాలనే కుతూహలంతో వున్న ధర్మరాజు ‘వినగ నర్హమేని వినిపింపవే అని ఎంతో మర్యాదగా అడుగుతాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు తన ధ్యానాన్ని విరమించి చిరునవ్వుతో, ప్రసన్న వదనంతో ధర్మరాజును చూశాడు. ఆ సమయంలో భీష్ముడు తనను మదిలో స్మరించడం వల్ల తన మనస్సు అతడిలో లీనమైందని చెప్పాడు ధర్మరాజుకు. భీష్ముడు అత్యంత సమాధి నిష్ఠలో వుండి తనను స్మరించాడని, శరతల్పగతుడైన భీష్ముడు తననే శరణుగా భావించి సమాధి నిష్ఠతో ధ్యానించడం వల్ల భక్త పరాధీనుడనైన తాను భీష్ముడి మనస్సులో సంలీనుడినై వున్నానని అన్నాడు శ్రీకృష్ణుడు. భీష్ముడు స్వర్గస్తుడైతే సర్వజ్ఞానాలు (వేదం వేదాంతాలు, తత్త్వ జ్ఞానాదులన్నీ) ఆశ్రయరహితాలై అదృశ్యమై పోతాయని, అందువల్ల భీష్ముడి దగ్గరికి ధర్మరాజు వెళ్లాలని, వెళ్లి, ఆయన అడగ దలచుకున్న సమస్త ధర్మాలను అడిగి తెలిసికొని సందేహ నివృత్తి పొందాలని శ్రీకృష్ణుడు సూచించాడు ధర్మరాజుకు. శ్రీకృష్ణుడు చెప్పినట్లే పోవడానికి ధర్మరాజు సన్నద్ధుడై, తన వెంట ఆయన్ను కూడా రమ్మని అడిగాడు.

భీమార్జున నకుల సహదేవులతో, కృపాచార్య, యుయుత్స, సాత్యకి, సంజయులతో కలిసి ధర్మరాజును తోడు బెట్టుకుని శ్రీకృష్ణుడు భీష్ముడి దగ్గరికి బయల్దేరాడు. అదే సమయంలో భీష్ముడు శరతల్పగతుడై వున్న ప్రదేశంలో వ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్థాణుడు, వాత్స్యుడు, దేవరాతుడు మొదలైన వారు వున్నారు. భీష్ముడు శ్రీకృష్ణుడిని నిష్ఠగా తన మనస్సులో వుంచుకొని, చేతులు జోడించి, ఉచ్చైస్స్వరంతో స్తుతించాడు, స్మరించాడు. సహస్ర నామాలతో శ్రీమహావిష్ణువును భీష్ముడు సాటిలేని మేటి స్తోత్రంతో పూజించి, మనస్సులోనే కృష్ణుడికి తన నమస్కారం అని అంటూ శిరస్సు వంచి, శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడిని స్తవరాజమనే స్తోత్రరాజంతో స్తుతించాడు.  అలా స్తవరాజంతో స్తుతించి ప్రశాంతంగా మౌనం దాల్చిన భీష్ముడిని మహామునులు ప్రశంసించారు.

శ్రీకృష్ణుడు ధర్మరాజాదులతో భీష్ముడి దగ్గరకు పోతూ మార్గమధ్యంలో శమంత పంచకాలను చూసి ధర్మరాజుకు పరశురాముడి వృతాంతాన్ని వివరించి చెప్పాడు. పరశురాముడు రాజుల మీద 21 సార్లు దండెత్తడం, వారి రక్తంతో పితృ తర్పణం చేయడం, జమదగ్ని పుత్రుడుగా ఆయన జన్మ వృత్తాంతం, కార్తవీర్యార్జునుడి చరిత్ర, అతడికి వశిష్ట మహర్షి ఇచ్చిన శాపం, కార్తవీర్యార్జునుడి కుమారులు జమదగ్ని యాగధేనువును పట్టి బంధించి తేవడం, పరశురాముడు కార్తవీర్యార్జునుడి మీదికి దండయాత్ర పోవడం, పరశురాముడు కార్తవీర్యార్జునుడిని సంహరించి యాగధేనువును తీసుకోనిపోవడం, కోపించిన కార్తవీర్యార్జునుడి కొడుకులు జమదగ్ని తల నరకడం, ఆగ్రహించిన పరశురాముడు సమస్త క్షత్రియ సమూహాన్ని సంహరిస్తానంటూ ప్రతిజ్ఞ చేసి, 21 మార్లు అలాగే వారిని చంపి రాజుల రక్తంతో భూమిని తడపడం, తాను సంపాదించిన భూమినంతా కశ్యప ప్రజాపతికి దానమివ్వడం, ఆ తరువాత దక్షిణ సముద్రం హద్దుగా కలిగిన ప్రదేశానికి తపస్సు చేసుకోవడానికి పోవడం మొదలైన చరిత్ర అంతా చెప్పాడు.     

ఆ తరువాత శ్రీకృష్ణ, ధర్మరాజులు మాట్లాడుకుంటూ వెళ్లి, ఓఘవతీ నదీ తీరంలో అంపశయ్య మీద వున్న భీష్ముడిని అంతా కలిసి దర్శించుకున్నారు. నమస్కారం చేసి అతడి చుట్టూ కూర్చున్నారు. శ్రీకృష్ణుడు భీష్ముడిని కుశల ప్రశ్నలు వేశాడు. ఇక్కడ భీష్ముడిని ఉద్దేశించి శ్రీకృష్ణుడు ప్రశంసించడాన్ని తిక్కన ఒక చక్కటి పద్యంలో ఇలారాశాడు.

ఉ:       రాజటె ! రాగహీనుడటె ! రాజిత సుందరమూర్తి యట్టె ! వి

భ్రాజిత సంపదున్నత విభాసిత వర్తనుడట్టె ! కామినీ

రాజ మనోజ్ఞ భంగి చతురత్వధనుండటె ! బ్రహ్మచర్య దీ

క్షాజిత మన్మధుండునటె జన్మము లిట్టివు యెందు గల్గునే ?

         (భీష్ముడు: క్షత్రియుడిగా జన్మించాడు. మహర్షుల లాగా ద్వంద్వాతీతుడయ్యాడు. ప్రకాశిస్తున్న సౌందర్య మూర్తి. విభ్రాజమానమై అత్యున్నతంగా వెలుగొందే నడవడిక కలవాడు. స్త్రీసమూహానికి మనోహరమైన నైపుణ్యసంపద కలవాడు. బ్రహ్మచర్య దీక్ష వల్ల మన్మథుడిని జయించినవాడు. ఇట్లాంటి జన్మలు మరెక్కడైనా సంభవిస్తాయా?. ఈ పద్య రచన తిక్కన శైలీ విన్యాసానికొక మచ్చు తునక అని విశ్లేషించారు డాక్టర్ ఎస్ గంగప్ప గారు)

         శ్రీకృష్ణుడు ఆ విధంగా భీష్ముడి ఉత్తమ గుణాలను మిక్కిలి ప్రశంసించాడు. అలాంటి గుణాలు కలవాడు కావడం వల్ల ధర్మరాజుకు సమస్త ధర్మాలను భోదించడానికి అర్హుడయ్యాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు భీష్ముడితో ఆయన ఉత్తమ గుణగణాలను ఏకరువు పెట్టాడు. ఆ విధంగా అని, ధర్మరాజుకు ధర్మాలను ఉపదేశించడానికి భీష్ముడిని నియమించాడు శ్రీకృష్ణుడు.

         దానికి ముందర భీష్ముడితో ఆయన హృదయంలో ఎల్లప్పుడూ వుండే విధంగా తన రూపాన్ని నిలిపానని, ఆ విధంగా ఆయన అత్యంత సంతోషానికి అర్హుడయ్యాడని అన్నాడు. భీష్ముడి మనస్సులో భక్తి, ఋజుమార్గం రెండూ వున్నాయని, అందువల్లే ఆయన మనస్సులో దైవ స్వరూపాన్ని అధివసింప చేశానని చెప్పాడు కృష్ణుడు. ఆ రోజు నుండి 56 రోజుల్లో సూర్యుడు ఉత్తరాయణంలో సంచరించడం ప్రారంభిస్తాడని, అప్పుడు భీష్ముడు భౌతిక దేహాన్ని వదిలిపెట్టి మోక్షం పొందుతాడని, ఆయన దివంగతుడు అయిన తరువాత లోకంలో జ్ఞానం మరుగున పడిపోతుందని, అందువల్ల ధర్మ వివేకాలతో కూడిన జ్ఞానాన్ని పొందడానికి ధర్మరాజాదులు వచ్చారని, వారికి జ్ఞానోపదేశం చేయమని, ధర్మార్థ కామ మోక్షాలను తెలియచేయమని చెప్పాడు శ్రీకృష్ణుడు భీష్ముడికి.

         శ్రీకృష్ణుడి మాటలకు స్పందిస్తూ భీష్ముడు, తనకు ప్రస్తుతం సంభాషించే సామర్థ్యం కూడా లేదని, శరీర దుర్బలత్వం వల్ల తన కంఠధ్వని, నాలుక, స్పష్టతను కోల్పోయాయని, ప్రత్యుత్తరం ఇచ్చే శక్తి కూడా లేదని, కాబట్టి ధర్మరాజుకు ఏది మంచో దాన్ని శ్రీకృష్ణుడే చెప్పాలని అన్నాడు. జవాబుగా శ్రీకృష్ణుడు, కురువంశ భారం భీష్ముడి మీదే ఆధారపడి వున్నదని, ఆయన భగవత్తత్త్వ జ్ఞాని అని, ఆయనకు తాను మూడు వరాలు ఇస్తున్నానని అన్నాడు. ఆయనకు గుచ్చుకున్న బాణాల వల్ల మూర్ఛకాని, అలసట కాని, నొప్పి కాని కలగకుండా బాధారహితమైన శరీరంతో సుఖంగా వుండమని చెప్పాడు. ఆయనకు ఆకలి దప్పులు కలగకుండా మహాశక్తి కలుగుతుందన్నాడు. ఆయన దివ్య ప్రబోధాన్ని పొందుతాడని, అలాంటి శక్తితో అతిశయ జ్ఞానాన్ని పొందుతాడని అన్నాడు.

         అక్కడున్న వ్యాసాది మహర్షులంతా శ్రీకృష్ణుడిని ప్రశంసించారు. ఇంతలో సూర్యాస్తమయం అయింది. మహర్షులంతా వెళ్లడానికి సిద్ధమయ్యారు. మళ్లీ ఉదయాన్నే వస్తామన్నారు. కృష్ణుడు మొదలైన వారు కూడా ఉదయాన్నే వస్తామని భీష్ముడికి చెప్పి హస్తినాపురానికి బయల్దేరారు. నగరం చేరుకొని సుఖంగా నిద్రపోయారు. మర్నాడు భీష్ముడి దగ్గరకు పోవడానికి ప్రణాళిక వేసుకున్నారు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, ద్వితీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)