ప్రతిదానికీ సీబీఐ అవసరమా?
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (15-11-2022)
‘రాష్ట్రప్రభుత్వం న్యాయం చేస్తుందని మాకు నమ్మకం లేదు. ఈ
కేసును సీబీఐ విచారణకు అప్పగించాలి’ లాంటి డిమాండ్స్ చాలా రాష్ట్రాలలో ఇటీవల తరచు
చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ లబ్ధి కోసం, చీటికీ మాటికీ ప్రతి
వివాదానికీ సీబీఐ విచారణ అంటూ డిమాండ్ చేయడం, ఒక్కోసారి
తలనొప్పి తగ్గించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగీకరించడం జరుగుతున్నది.
దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ అనే విషయం ఎవరూ కాదనరు. అందుకేనేమో,
నేర పరిశోధనను కొలిక్కి తీసుకుని రావటంలో అందరినోటా మొదటిగా
వినిపించే మాట సీబీఐనే.
కానీ– ప్రజా జీవితంలో సీబీఐ ఏమేరకు శక్తివంతమైన పాత్రను
పోషిస్తున్నదీ,
జాతీయ సామాజిక, రాజకీయ, ఆర్థిక
వ్యవస్థల కుశలతపై ఎంతవరకూ భరోసానిస్తున్నదీ అన్నది రోజులు గడుస్తున్నకొద్దీ
ప్రశ్నార్థకం అవుతున్నది. ఈ సంస్థ భారత ప్రభుత్వం అధికార పరిధిలో, దాని చెప్పుచేతల్లో పనిచేస్తూ, కేంద్ర ప్రభుత్వ
పాలకుల చేతిలో పావుగా మారి, న్యాయస్థానాల ధర్మాగ్రహానికి
కూడా గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. సరిగ్గా ఒక ఏడాది క్రితం సుప్రీంకోర్టు
సీబీఐని అది చేపట్టిన కేసుల్లో ఎన్ని ప్రోసిక్యుషన్ దాకా వచ్చాయి? ఎన్ని పెండింగులో ఉన్నాయి? శిక్షలు పడ్డ వాటి శాతం
ఎంత? తదితర వివరాలను సమర్పించమని కోరింది కూడా.
ఇటీవల నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం
బహిర్గతం కావడం,
స్థానిక పోలీసులు కార్యరంగంలోకి దిగి చట్టప్రకారం చర్యలు చేపట్టడం
తెలిసిందే. ఆడియో టేపులు బైటపడటంతో, బీజేపీ నాయకులు, ప్రతినిధులు ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆశ్రయించారు. ఈ అంశంపై
సీబీఐతో విచారణకు ఆదేశించాలని కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. శాంతి
భద్రతల సమస్య, అవినీతికి చెందిన అంశాలను దర్యాప్తు చేయడానికి
రాష్ట్ర సంస్థలు ఉన్నప్పటికీ, నేరారోపణ జరిగిన తక్షణమే అలా
కోరడం సబబేనా?
ఏరాష్ట్రంలోనైనా రాజకీయ నాయకులూ రాజకీయ పార్టీల ప్రమేయం
ఉన్న కేసుల విషయంలో గాని,
సమాజంలో పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న వారి ప్రమేయం ఉన్న కేసుల
విషయంలో గాని, స్థానిక దర్యాప్తుసంస్థల మీద నమ్మకం లేదన్న
కారణంతో, సీబీఐ దర్యాప్తును కోరడం పరిపాటే. న్యాయస్థానాలు
కూడా తరచూ సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తుంటాయి. అయితే మొదటి నుంచీ సీబీఐ దర్యాప్తు
విషయంలో, కేంద్రంలో అధికారంలో వున్న పార్టీకి చెందని రాష్ట్ర
ప్రభుత్వాలు భిన్న ధోరణిని అవలంబించటం కూడా ఆనవాయితీనే. చట్టాలు ఏమిచెప్పినా సీబీఐ
దర్యాప్తు విషయంలో సరైన సాంప్రదాయాలు ఇంతవరకూ ఏర్పడలేదన్నది వాస్తవం.
ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూస్తే, సెంట్రల్
బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) 1941లో భారత ప్రభుత్వం స్థాపించిన ‘స్పెషల్
పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్’ అనే పేరుతో ఆరంభమైంది. అలనాటి బ్రిటీష్ ఇండియా
ప్రభుత్వం ఈ సంస్థను రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో, యుద్ధ
సామాగ్రి కొనుగోళ్ల లావాదేవీలలో జరగడానికి ఆస్కారమున్న అవినీతి కేసుల దర్యాప్తుకే
పరిమితం చేసింది. పరిణామక్రమంలో భాగంగా, యుద్ధం ముగిసిన
తరువాత, కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి సంబంధించిన అవినీతి
ఆరోపణల కేసుల దర్యాప్తుకు మాత్రమే పరిమితం చేస్తూ, 1946లో,
‘ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం’ తీసుకొచ్చింది
ప్రభుత్వం.
క్రమేపీ, ఈ సంస్థ పరిధిని కేంద్రపాలిత ప్రాంతాలకు,
రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదంతో సంబంధిత రాష్ట్రాలకు విస్తరించారు.
ఏప్రిల్ 1963లో, హోం మంత్రిత్వ శాఖ తీర్మానంతో, దాని పేరును ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ (సీబీఐ)గా మార్చారు.
ఇలా పేరు మార్పిడి జరిగిన తొలిరోజులలో, కేవలం కేంద్ర
ప్రభుత్వ సిబ్బందిపై వచ్చిన అవినీతి ఆరోపణలు మాత్రమే విచారించడం దీని బాధ్యత.
క్రమేపీ ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బందిని, బేంకుల జాతీయకరణ
తరువాత ఆ సిబ్బందినీ దీని పరిధిలోకి తెచ్చారు. క్రమక్రమంగా దాని పరిధి మరింత
విస్తరించింది. రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేని ప్రతివారూ
సీబీఐ పేరు తెరమీదికి తేవడం అలవాటైపోయింది. ఇలా ఎందుకు జరగాలి?
సీబీఐ వ్యవస్థాపక డైరెక్టర్ డిపి కొహిలి, దాని
ఆవిర్భావపు రోజులలోనే, అదొక జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థగా
ఎదుగుతుందని జోస్యం చెప్పాడు. ఐదేళ్ళ తన పటిష్టమైన నేతృత్వంలో ఆయన సీబీఐ నేటి ఈ
స్థితికి చేరడానికి పునాదులు వేశారు. సిబీఐ నుంచి అత్యున్నత ప్రమాణాల సమర్థతను,
దక్షతను, సత్యనిష్ఠను భవిష్యత్‍లో పౌరులు
ఆశిస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాల్సిన
బాధ్యత దానిపై ఉందని కొహిలి ఆశయం. అధికారులకు ‘లాయల్టీ టు డ్యూటీ’ని ప్రబోధించారు.
ఆయన తదనంతర కాలంలో ఇవన్నీ ఎంతమేరకు జరుగుతున్నాయనేది కోటి రూకల ప్రశ్న.
1965 నుంచి ఆర్థికపరమైన నేరాల పరిశోధన అంశాన్ని కూడా సీబీఐ
పరిధిలోకి తెచ్చింది ప్రభుత్వం. అలా కేంద్ర ప్రభుత్వం దాని పరిధిని మరింత
విస్తరించ సాగింది. హత్యా నేరాలు, కిడ్నాపులు, తీవ్రవాద
కార్యకలాపాల విషయాలలో కూడా సీబీఐతో దర్యాప్తు జరగాలన్న డిమాండు రాసాగింది.
వ్యక్తులు, వ్యవస్థలు తమకు జరిగిందని భావిస్తున్న అన్యాయాల
విషయంలో న్యాయం కలిగించమని కోర్టులను ఆశ్రయించినప్పుడు, కోర్టులు
కూడా సీబీఐకి దర్యాప్తును అప్పచెప్తే స్థాయికి దానికి గుర్తింపు వచ్చింది. ఆ
గుర్తింపును నిలబెట్టుకోవడంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సఫలమైందా,
విఫలమైందా అన్నది చరిత్ర తేల్చాలి. ఈ నేపథ్యంలో 1987 లో సీబీఐలో
రెండు విభాగాలను ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఒకటి: అవినీతి నిరోధక విభాగం, మరొకటి: ప్రత్యేక కేటగిరీ నేరాల విభాగం. ఇలాంటి నేపథ్యం ఉన్న సీబీఐ ఎవరికీ,
ఏ విషయంలోనూ అన్యాయం చేయ (లే)దన్న నమ్మకం, అటు
ప్రభుత్వాలకూ, ఇటు పౌరులకూ ఎంతవరకూ కలిగిస్తున్నదన్న విషయం
ఇంతవరకూ అది చేపట్టి పరిశోధించిన కేసులను అధ్యయనం చేస్తే తప్ప అవగతం కాదు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ
తెలంగాణ రాష్ట్రంలో ఇకముందు ఏ కేసులోనైనా దర్యాప్తు చేయాలంటే ముందస్తుగా ప్రభుత్వ
అనుమతి తీసుకోవాల్సిందే. దర్యాప్తు కోసం సీబీఐకి గతంలో ఇచ్చిన సాధారణ అనుమతిని
ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. ఈ మేరకు ఆగస్టు 30న రాష్ట్ర ప్రభుత్వం జీఓ 51ని
జారీచేసింది. ఇక ఏ కేసులోనైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే, జీవో
51 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం సీబీఐ లాంటి
కేంద్ర దర్యాప్తు సంస్థలను తన రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేసేందుకు
దుర్వినియోగం చేస్తున్నదన్న కారణంతో బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కేంద్ర
దర్యాప్తు సంస్థలకు సాధారణ సమ్మతిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించాయి. పశ్చిమ
బెంగాల్, రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ సహా తొమ్మిది రాష్ట్రాలు తమ
పరిధిలోని కేసులను సీబీఐ విచారించేందుకు సాధారణ అనుమతిని ఉపసంహరించుకున్నాయి.
తాజాగా ఈ జాబితాలో తెలంగాణ వచ్చి చేరింది.
సీబీఐ చేపట్టిన కేసులు కొన్ని మచ్చుకు తీసుకుంటే అవి ఏమేరకు
ఫలితాలను ఇచ్చాయనేది బోధపడుతుంది. దర్యాప్తు కొనసాగిన, కొనసాగుతున్న
విధానం, ఎవరినీ దోషులుగానో నిర్దోషులుగానో తేల్చకుండా నెలల,
ఏళ్ల తరబడి ముద్దాయిలుగా విచారించడం పేర్కొనవచ్చు. కేంద్రంలో ఉన్న
అధికార పక్షం వారికి ఒక నీతి, ప్రతిపక్షాలవారికి వేరొక నీతి
అవలంబించడమూ పరిపాటిగా మారింది. తెలుగు రాష్ట్రాలలోనే సుదీర్ఘకాలం విచారణ
జరుగుతున్న కేసులు ఉన్నాయి. సీబీఐ తన పేరును పది కాలాల పాటు నిలబెట్టుకోవడానికి,
నిష్పాక్షిక దర్యాప్తు సంస్థగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు
అంతగా చేయలేదనాలి. ఆ సంస్థను ముద్దుగా కొందరు 'కాంగ్రెస్
బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్' అని, మరికొందరు
'కాంగ్రెస్ బచావో ఇన్ స్టిట్యూట్' అని,
ఇంకొందరు 'సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్'
అనీ నామకరణం చేశారు.
వ్యాధి నివారణ కంటే నిరోధం ఎంత ముఖ్యమో, అవినీతి
జరిగిన తర్వాత చర్యలకంటే ముందస్తుగానే అవినీతిని నిరోధించగల వ్యవస్థలుండటమూ అంతే
ముఖ్యం. ఆ పని సీబీఐ చేయగలిగితే సంతోషమే! కావాల్సింది 'పోస్ట్
ఆడిట్' కాదు, 'ప్రీ ఆడిట్'. ఎమ్మెల్యేల కొనుగోలు, ప్రలోభం వ్యవహారం లాంటి
దుర్మార్గపు చర్యలతో సంబంధం ఉన్నటువంటి వారిమీద ఒక కన్ను నిరంతరం వేసి ఉంచాలి.
వారు చట్ట పరిధిలో వ్యవహరిస్తున్నారో లేదో విచారణ జరగాలి. ఈ రెండూ రహస్యంగానన్నా,
బహిరంగానైనా జరిగి తీరాల్సిందే. ఎవరూ చట్టానికి అతీతులు కారు. చట్టం
తన పని తాను చేసుకుపోతుంది. రాష్ట్ర దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేదని, సీబీఐతో విచారణ జరిపించాలని కొందరు ప్రతిదానికీ కోరడం ఎంతవరకు సమంజసం?
No comments:
Post a Comment