Thursday, November 17, 2022

పచ్చ దోసకాయ, జొన్న బియ్యం, పచ్చి పెసలు! (గుర్తుకొస్తున్నాయి) : వనం జ్వాలా నరసింహారావు

 పచ్చ దోసకాయ, జొన్న బియ్యం, పచ్చి పెసలు!

(గుర్తుకొస్తున్నాయి)

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (17-11-2022)

బాల్యం, యవ్వనం తొలినాళ్లు, మూడేళ్ల వ్యవసాయ అనుభవం లాంటి తీపి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడల్లా కలిగే అనుభూతే వేరు. ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలో వున్న మా గ్రామం వనం వారి కృష్ణా పురం, ఆ వూళ్లోని కొఠాయి (రచ్చబండ), మా రెండంతస్తుల భవనం, ఆ భవనం ముందున్న స్థలంలో తెలతెలవారుతుండగానే ఇద్దరు పని మనుషులు కందికట్టె పోలికట్టెతో శుభ్రం చేసి కలాపు (పేడ కలిపిన) నీళ్లు చల్లడం, వూరు ఒక పక్కన వున్న రామాలయం, మరో వైపున్న వేంకటేశ్వర స్వామి ఆలయం, ఎక్కి తిరిగే కచ్చడం (చిన్న) బండి, పెంట బండ్లు, మేనా, వరి పొలాలు, మల్లె, మామిడి, మిరప, మొక్క జొన్న తోటలు, తోటలలోని మోటబావులు, జొన్న చేలు, చేలలోని దోసకాయలు, మంచె, అరకలు, ఎద్దులు, పాలేర్లు (జీతగాళ్లు అనే వాళ్లం), పాడి పశువులు, వాటికి పెద్ద కొష్టం, మేకలు, వరి గడ్డి వాములు, పెరట్లోని బావి, బావి పక్కనున్న నిమ్మ, అరటి చెట్లు, ఇంటి వెనుక ఉదయాన్నే చల్ల చిలికే ప్రక్రియ, వెన్న పూస తినడం, మామిడి వూరగాయ కారం కలిపి ఉదయాన్నే తిన్న చద్ది అన్నం, వెండి కంచాలలో భోజనాలు, సాయంత్రం ఇంటి ఆరుబయట నీళ్లు చల్లి నవారు, నులక మంచాలు వేయడం, కబుర్లు చెప్పుకుంటా ఆకాశంవైపు చూస్తూ పడుకోవడం, ఇలా గ్రామీణ వాతావరణం గుర్తుకు రాసాగాయి.   

మేం చేస్తున్న వ్యవసాయానికి ప్రతిఫలంగా సుమారు 40 పుట్ల వడ్లు (పుట్టికి 75 కిలోల బరువుండే ఎనిమిది బస్తాలు), 20 పుట్ల జొన్నలు, 40-50 పుట్ల వేరు శనగ, 10 పుట్ల కందులు, 10 పుట్ల పెసలు, వీటికి తోడు మిరప కాయలు, పొగాకు, మామిడి పంట, మల్లెలు, ఇలా, ప్రతి ఏటా పండేవి. నల్ల రేగడిలో జొన్న పంట వేసే వాళ్లం. చెరువు కింద వరి పొలంలో వడ్లు పండేవి. చెరువులోకి నీరు రాకపోతే, జనప పంట వేసే వాళ్లం. ఎర్రమట్టి  చేలలో పునాస పంటలు వేసే వాళ్ళం. ధాన్యం ఇంటికి చేర్చిన తరువాత, "పాతర" లో కాని, "గుమ్ములు" లో కాని, "ధాన్యం కొట్టుల" లో కాని భద్రపరిచేవారు. మార్కెట్ అనుకూలంగా వున్నప్పుడు అమ్మేవారు. ఆ ధాన్యంలోనే కొన్ని బస్తాలు మరుసటి సంవత్సరానికి విత్తనాలుగా ఉపయోగించేందుకు వేరే భద్రపరిచేవారు. ఇప్పటిలాగా విత్తనాలు కొనే అలవాటు లేదు.

పొలాలకు పెంట తోలే ప్రక్రియతో వ్యవసాయపు పనులు వేసవి కాలంలోనే మొదలయ్యేవి. ఉగాది పండుగ కల్లా రాబోయే సంవత్సరానికి పాలేర్లను (జీతగాళ్లను) కుదుర్చుకునే వాళ్లం. ఆ రోజుల్లో పెద్ద పాలేరుకు సంవత్సరానికి పది నుంచి పన్నెండు బస్తాల జొన్నలు, మిగిలిన వాళ్లకు ఎనిమిది బస్తాలు జీతంగా ఇచ్చే వాళ్లం. జొన్నల ధర పెరిగినా, తగ్గినా అదే జీతం. మొదలు మా పాడి పశువుల వల్ల పోగైన నాలుగైదు వందల బండ్ల పెంటను పొలాలకు తోలే వాళ్లం. అదనంగా మా గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాలలో పెంట ఖరీదు చేసి కొని పొలాలకు తోలే వాళ్లం. చెల్లింపులన్నీ ధాన్యం రూపేణగానే జరిగేది.

యాదవుల (గొల్లలు) దగ్గర వందల సంఖ్యలో వుండే జీవాలను (గొర్రెలు) పొలాలలో రాత్రింపగళ్లూ వుంచేవాళ్ళం. అదీ ఖరీదుకే. అలా వుంచడం వల్ల పొలాలలో జీవాల పెంట పోగయ్యేది. అది పొలాలకు సహజ ఎరువులాగా ఉపయోగపడుతుంది. అప్పట్లో రసాయనిక ఎరువుల వాడకం అలవాటు ఇంకా సరిగ్గా కాలేదు. ఇళ్లలో పోగైన పెంటను, జీవాల పెంటను మాత్రమే ఎరువులాగా వాడే వాళ్లం. అదనంగా, చెరువు పూడిక తీసి మట్టిని పొలాలకు తోలే వాళ్లం. తెల్లవారు జామునుంచే పెంట బండ్లను కట్టే ప్రక్రియ మొదలయ్యేది. మధ్యాహ్నం పన్నెండు (రెండు జాములు అనే వాళ్ళు) గంటల సమయం వరకు తోలి ఇళ్లకు తిరిగి వచ్చే వాళ్ళు జీతగాళ్లు. పొద్దున్నే చద్ది అన్నం తినే వాళ్ళు. నేను కూడా అప్పుడప్పుడు పెంట బండి తోలేవాడిని. మధ్యాహ్నం సుమారు రెండు గంటల పాటు జీతగాళ్లు ఇళ్లకు వెళ్లి భోజనం చేసి వచ్చి, ఎడ్లకు దానా వేయడం, నీళ్లు పెట్టడం లాంటివి చూసుకునేవారు. ఆ సంవత్సరానికి కావాల్సిన వ్యవసాయ పనులకు సంబంధించిన తాళ్లు పేనడం లాంటి వాటిని ఒక గంట-రెండు గంటల పాటు చూసుకునేవారు. మళ్లీ నాలుగు గంటల ప్రాంతంలో పెంట బండ్ల కార్యక్రమం మొదలయ్యేది. వెన్నెల రోజుల్లో రాత్రుళ్లు కూడా బండ్లు తోలేవారు. ఇలా తొలకరి జల్లులు కురిసే వరకు కొనసాగేది.

ప్రతి రోజు ఉదయం మా ఇంట్లో చిలికిన చల్లను తీసుకెళ్లేందుకు కొందరొచ్చేవారు. వాళ్లు ఇంట్లో తాము తినేందుకు జొన్నలు దంచుకుని, మా గేదెలు-ఆవులు తాగేందుకు మా ఇంటికి వచ్చి దాని తొక్కు వంచి పోయేవారు. బదులుగా చల్ల తీసుకు పోయే వాళ్లు. వేసవి కాలంలో, మా ఇంటి వెనుక కుండలో వుంచిన చల్లను కడుపు నిండా ఎన్నో సార్లు తాగే వాళ్లం. ఉదయాన్నే చాకలి వచ్చి విడిచిన బట్టలు తీసుకెళ్లి వూరి బయట వున్న వాగులోనో, చెరువులోనో వుతికి సాయంత్రం తెచ్చే వాళ్లు. ఏపని చేయడానికి ఆపనికి ఉపయోగపడేవారే వుండేవారు. గ్రామాలు స్వయం సమృద్ధిగా వుండేవి. చెల్లింపులు ధాన్యం రూపేణానే.

తొలకరి వానలు మొదలవ్వగానే పొలం పనులలో కొంత మార్పు వచ్చేది. వరి పొలాలకు కావాల్సిన నారు చల్లడం, పునాస పంటలకు పొలాలను నాగళ్లతో దున్నడం, దంతెలతో దున్నడం జరిగేది. వర్షాలు కురిసే తీరుతెన్నుల ఆధారంగా పొలం పనులలో మార్పులు చేర్పులు జరుగుతుండేవి. వర్షాలు ఆగుతే మిగిలిన పెంటను తోలడం కొనసాగించేవారు. వేరు శనగ, అందులో కంది పంటలు కలిపి వేసే వాళ్లం. చెరువులకు నీళ్లు రావడం జరుగుతే వరి నాట్లు వేసే వాళ్లం. ఆ తరువాత జొన్న పంట వేసే వాళ్లం. నాట్లు వేయడానికి ముందర పొలాన్ని మొదలు నాగళ్లతో, తరువాత బురద నాగళ్లతో దున్నడం జరిగేది. సాధారణంగా మా గ్రామంలో వరి నాట్లు మహిళలే వేసేవారు. పాటలు పాడుకుంటూ, హుషారుగా నాట్లు వేసేవారు. నాట్ల రోజుల్లో కూలీలతో పాటు నేను కూడా భోజనం పొలం దగ్గరకే తెప్పించుకుని చేసేవాడిని. అక్కడ చెరువు నీళ్లే తాగేవాడిని. ఆ నీరు తాగడానికి భయమేసేది కాదు. ఇప్పుడైతే మరి మినరల్ వాటర్!

నాట్లు పడ్డ తరువాత దశలవారీగా పొలాలకు నీరు పెట్టడం జరిగేది. ఒక్కో సారి రాత్రుళ్లు పోయి వంతుల వారీగా నీళ్లు పెట్టే వాళ్లం. నీళ్లు సరిపోకపోతే పొలాలలో ఒక పక్కన కొంత లోతు వరకు తవ్వి, నీటిని తీసి చేది పోయడం జరిగేది. వరి కొంత పెరిగిన తరువాత కలుపు తీయడం జరిగేది. మూడు-నాలుగు నెలల తరువాత కోతల సీజన్ ఆరంభమయ్యేది. కోయడం, గూళ్లు వేయడం, సమయం చూసుకుని, వాతావరణం అనుకూలించినప్పుడు నూర్పిడి చేయడం, తూర్పార పట్టడం, చివరకు వరి ధాన్యాన్ని ఇంటికి తోలడం జరిగేది. ఈ ప్రక్రియ జరిగినన్నాళ్లు వరి పొలంలోనే రాత్రుళ్లు నిద్రించే వాళ్ళం. ఆ ఆనందం ఇప్పుడు తలుచుకుంటుంటే ఒక మధురానుభూతిలాగా అనిపిస్తోంది. నాటు కూలి, కోత కూలి, ఇతర కూలి అంతా ధాన్యం రూపేణగానే. ఎకరానికి ఐదారు కుండల ధాన్యం కూలీగా వుండేది. రేట్లు పెంచమని అడపాదడపా కూలీలు కమ్యూనిస్ట్ పార్టీ మద్దతుతో ఆందోళన చేసే వాళ్లు కూడా. నాట్ల సీజన్లో, కోతల సీజన్లో ఇతర ప్రాంతాల నుంచి కూడా కూలీలు వచ్చేవారు. ఇప్పుడు చాలావరకు యాంత్రీకమైపోయింది.

ఇక వేరు శనగ పంట వ్యవహారం మరో విధంగా వుండేది. విత్తనాలు తయారు చేయించే ప్రక్రియతో మొదలయ్యేది. ఇంటికి కూలి వాళ్లను పిలిచి, క్రితం సంవత్సరం పండిన వేరు శనగ కాయలను కొలిచి, వాటినుంచి విత్తులను తీయమని వాళ్లకు చెప్పే వాళ్లం. వాళ్లలో కొందరు తమ ఇంటికి తీసుకెళ్లి చేసేవారు, కొందరు మా ఇంట్లోనే చేసేవారు. సాయంత్రం కల్లా వాళ్ల-వాళ్ల సామర్ధ్యాన్ని పట్టి కుండెడో, రెండు కుండలో కాయ కొట్టి విత్తులను తీసే వాళ్లు. వాళ్ళకు కూలీ ధాన్యం రూపేణగానే ముట్టేది. విత్తులు తీసేటప్పుడు కొంత భాగం పప్పు అయ్యేది. ఆ పప్పుతో ఏడాదికి సరిపడా శనగ నూనె చేయించి ఇంట్లో ఉపయోగించే వాళ్లం.

వర్షాలు పడగానే, భూమిని దున్ని అదను కుదిరినప్పుడు "ఎద" పెట్టే వాళ్లం. ఒకడు ఎద గొర్రు తోలుతుంటే, పక్కన నడుచుకుంటూ మరొకరు, శనగ విత్తులను, భూమిలోకి గొర్రు పైభాగంలోంచి భూమిలో పడేలా పోసేవారు. అతి క్లిష్టమైన ఈ ప్రక్రియ అందరికీ చేత కాదు. పైగా శనగ విత్తులతో పాటు కంది విత్తనాలు కూడా ఒక పద్దతి ప్రకారం ఎద పెట్టాలి. శనగ పంట ముందు చేతికొస్తుంది. ఆ తరువాత రెండు నెలలకు కంది పంట వస్తుంది. శనగ విత్తనాలు మొలకెత్తిన నెల రోజుల తరువాత పై పాటు చేయాలి. ఇది కూడా కష్టమైన పనే. పై పాటు చేసే అరకలను అందరూ తోలలేరు. ఎద్దుల కాళ్ల కింద మొక్కలు నలిగి పోకుండా, అరక కింద చెట్లు పడ కుండా తోలాలి. అదెంతో ముచ్చటేసేది. మూడు నెలల తరువాత కూలి వాళ్లతో శనగ మొక్కలను భూమి నుంచి పీకించి కాయలను వేరు చేయించే వాళ్లం. మరో రెండు నెలలకు కంది కళ్ళం వేసి ఆ పంటను కూడా తెచ్చుకునే వాళ్లం.

ఇక మరో పంట జొన్న. వీటినే పచ్చ జొన్నలనే వాళ్లం. ఇటీవల కాలంలో నీటి పారుదల ప్రాజెక్టులు వచ్చిన తరువాత జొన్న పంట దాదాపు ఎవరూ వేయడం లేదు. దీనికి కూడా ఎద పెట్టడం వుంటుంది. జొన్న పంట తయారైన తరువాత కోసి, కట్టలు కట్టించే వాళ్లం. కూలీ కింద కట్టలనే ఇచ్చే వాళ్లం. ప్రతి ఐదు కట్టలకు ఒక కట్ట కూలీ కింద పోయేది. ఇక ఆ తరువాత జొన్న గూడు వేయించడం, కంకి కోయించి తొక్కించడం, తూర్పార బట్టడం, ధాన్యాన్ని ఇంటికి-మార్కెట్‌కు చేర్చడం జరిగేది. జొన్న చేలల్లో పప్పు దోసకాయలుండేవి. అవి అక్కడనే కొడవలితో కోసుకుని, కారం కలుపుకుని, మంచెపైకెక్కి కూచుని తినే వాళ్లం. జొన్న వూస బియ్యం కూడా కొట్టించుకుని, పలుకు రాళ్ల నిప్పులో వేడి చేసుకుని తినే వాళ్లం. చేనులో దొరికే పెసలు తినే వాళ్లం. ఆ అనుభూతి మాటల్లో వర్ణించడం, రాతల్లో చెప్పడం చాలా కష్టం.

ఈ పంటలకు తోడు మేం మిరప తోట వేసే వాళ్లం. మధ్యలో బంతి పూల చెట్లు వేసే వాళ్లం. మా ఇంటి పక్కనే తోట వుండేది. అందులో ఒక పక్క మల్లె తోట కూడా వుండేది. తోటలో మోట బావి వుండేది. మోట తోలడం కూడా కష్టమైన పనే. మోట తోలడానికి కట్టిన ఎద్దులను వెనుకకు నడిపించుకుంటూ, భావి ముందరకు తీసుకెళ్లాలి. భావిలో మోట బక్కెట్ (చాలా పెద్దగా వుంటుంది) పూర్తిగా మునిగి నీరు నిండే లాగా ఎద్దులను వెనక్కి తేవాలి. అప్పుడు మునిగి, నిండిన బకెట్ పైకి రావడానికి ఎద్దులను ముందుకు తోలాలి. బకెట్ కట్టిన తొండం లోంచి నీరు భావిదగ్గరున్న కాలువలో పడి ప్రవహించుకుంటూ మిరప చెట్లను తడుపుకుంటూ పోతుంది. మోట తోలడం సరదాగా కూడా వుంటుంది. అలానే పొగాకు,  మొక్క జొన్న దినుసు గడ్డలు, వుల్లి గడ్డలు కూడా సాగు చేశాం. క్యాబేజీ, కాలీ ఫ్లవర్ లాంటి కూరగాయలతో సహా ఎన్నో రకాల కూరగాయలను కూడా పండించాం. ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే అవన్నీ ఆర్గానిక్ పంటలు.  

ప్రతి పంటకు "పరిగ" అని వుండేది. మాకు జీతగాళ్లే కాకుండా, ఒకరిద్దరు మేమిచ్చే వార్షిక కూలీ మీద ఆధారపడి జీవించే వాళ్లున్నారు. వాళ్లు మాకు అవసరమైన చిల్లర పనులను చేసేవారు. ఉదాహరణకు మా జీత గాళ్లకు కావాల్సిన పాదరక్షలను తయారు చేసే వారుండేవారు. మా పొలాలకు నీరు పెట్టే నీరుకాడుండేవాడు. మా ఇంటి ముందు అలకడానికి కావాల్సిన ఎర్ర మట్టిని తెచ్చి పెట్టేవాడుండేవాడు. మా బట్టలుతికే వాళ్లు, మేమిచ్చే సమాచారాన్ని మా వూరి నుంచి ఇతర గ్రామాలకు తీసుకెళ్ళే మనిషి, ఇలా, కొందరుండేవారు. మా పొలాలలో పంటను మేం తీసుకెళ్ళిన తరువాత, పొలంలో మిగిలిన దాన్ని "పరిగ" అంటారు. అదంతా వాళ్లకే చెందుతుంది. పరిగ కూడా చాలా మోతాదులోనే వుంటుంది ఒక్కో సారి.

ఒకానొక రోజుల్లో గ్రామీణ వాతావరణం, అందులో అగ్రగామిగా వుండే వ్యవసాయం, ఆ వ్యవసాయానికి అనుబంధంగా వుండే పనిముట్లు, నైపుణ్యంతో వ్యవసాయానికి అవసరమైన పనులను చక్కదిద్దే వ్యక్తులు, విద్య లేకపోయినా అనుభవంతో ఏ పంట ఎప్పుడు వేస్తే లాభదాయకమో తెలియచెప్పే కొందరు గ్రామస్తులు, ఇలా అనేక విధాలుగా అలరారుతుండేది. గ్రామమంతా ఒక వసుదైక కుటుంబం లాగా వుండేది. అన్నీ నగదు రహిత లావాదేవీలే! ఎవరికీ ఏ కష్టం వచ్చినా అందరూ ఆడుకునేవారు.

గత అర్ధ శతాబ్ది కాలంగా వ్యవసాయం గణనీయమైన మార్పులకు, చేర్పులకు గురవుతోంది. మానవ, సహజ వనరుల స్థానంలో యంత్రాలు, సింథటిక్ ఎరువులు, క్రిమిసంహారక మందులు చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం కారణాన ఖర్చుతో పాటు పంట దిగుబడులు పెరిగినప్పటికీ, వాతావరణ సమతుల్యం దెబ్బ తినడం, ఆరోగ్యానికి హానికరమైన పరిస్థితులు నెలకొనడం కూడా జరిగింది. పశువుల పెంటను కానీ, జీవాల పెంటను కానీ, చెరువు మట్టిని కానీ పొలాలకు వాడడం అరుదైపోయింది. కాలం తెస్తున్న మార్పుకు అలవాటు పడాలో, ఇబ్బంది పడాలో అర్థం కాని అయోమయ పరిస్థితి. END

No comments:

Post a Comment