Monday, November 14, 2022

స్తవరాజమనే స్తోత్రరాజంతో శ్రీకృష్ణుడిని స్తుతించిన భీష్ముడు ..... ఆస్వాదన-95 : వనం జ్వాలా నరసింహారావు

 స్తవరాజమనే స్తోత్రరాజంతో శ్రీకృష్ణుడిని స్తుతించిన భీష్ముడు

ఆస్వాదన-95

వనం జ్వాలా  నరసింహారావు

సూర్యదినపత్రిక (14-11-2022)

పట్టాభిషేక అనంతరం, రాజ్యాన్ని పొందిన ధర్మరాజు, గాంధారీ, ధృతరాష్ట్ర, విదురులకు రాజ్యాన్ని సమర్పించి, వారే రాజ్యానికి అసలైన ప్రభువులని, తాను వారు చెప్పిన పనిని చేసి, వారు పెట్టిన దానిని తింటూ వుండగలనని పలికాడు. ప్రతిరోజూ వారి అనుమతి తీసుకుని పాలన సాగించాడు. ఇలా పాలన చేస్తూ ఒకనాడు తెల్లవారు ఝామున శ్రీకృష్ణుడి మందిరానికి వెళ్లాడు ధర్మరాజు. శ్రీకృష్ణుడిని చూసి కుశల ప్రశ్నలు వేశాడు సహజ రీతిలో. ఆ మాటలకు శ్రీకృష్ణుడు ఏమీ జవాబు ఇవ్వకుండా ధ్యానంలో మునిగి అలా వుండిపోయాడు. అప్పుడు ధర్మరాజు ఆయన ధ్యాన స్థితికి కారణం తెలియచేయమని అడిగాడు. వాస్తవానికి శ్రీకృష్ణుడి ధ్యాననిష్ఠలోని విశేషాన్ని తెలుసుకోవాలనే కుతూహలంతో వున్న ధర్మరాజు ‘వినగ నర్హమేని వినిపింపవే అని ఎంతో మర్యాదగా అడుగుతాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు తన ధ్యానాన్ని విరమించి చిరునవ్వుతో, ప్రసన్న వదనంతో ధర్మరాజును చూశాడు. ఆ సమయంలో భీష్ముడు తనను మదిలో స్మరించడం వల్ల తన మనస్సు అతడిలో లీనమైందని చెప్పాడు ధర్మరాజుకు. భీష్ముడు అత్యంత సమాధి నిష్ఠలో వుండి తనను స్మరించాడని, శరతల్పగతుడైన భీష్ముడు తననే శరణుగా భావించి సమాధి నిష్ఠతో ధ్యానించడం వల్ల భక్త పరాధీనుడనైన తాను భీష్ముడి మనస్సులో సంలీనుడినై వున్నానని అన్నాడు శ్రీకృష్ణుడు. భీష్ముడు స్వర్గస్తుడైతే సర్వజ్ఞానాలు (వేదం వేదాంతాలు, తత్త్వ జ్ఞానాదులన్నీ) ఆశ్రయరహితాలై అదృశ్యమై పోతాయని, అందువల్ల భీష్ముడి దగ్గరికి ధర్మరాజు వెళ్లాలని, వెళ్లి, ఆయన అడగ దలచుకున్న సమస్త ధర్మాలను అడిగి తెలిసికొని సందేహ నివృత్తి పొందాలని శ్రీకృష్ణుడు సూచించాడు ధర్మరాజుకు. శ్రీకృష్ణుడు చెప్పినట్లే పోవడానికి ధర్మరాజు సన్నద్ధుడై, తన వెంట ఆయన్ను కూడా రమ్మని అడిగాడు.

భీమార్జున నకుల సహదేవులతో, కృపాచార్య, యుయుత్స, సాత్యకి, సంజయులతో కలిసి ధర్మరాజును తోడు బెట్టుకుని శ్రీకృష్ణుడు భీష్ముడి దగ్గరికి బయల్దేరాడు. అదే సమయంలో భీష్ముడు శరతల్పగతుడై వున్న ప్రదేశంలో వ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్థాణుడు, వాత్స్యుడు, దేవరాతుడు మొదలైన వారు వున్నారు. భీష్ముడు శ్రీకృష్ణుడిని నిష్ఠగా తన మనస్సులో వుంచుకొని, చేతులు జోడించి, ఉచ్చైస్స్వరంతో స్తుతించాడు, స్మరించాడు. సహస్ర నామాలతో శ్రీమహావిష్ణువును భీష్ముడు సాటిలేని మేటి స్తోత్రంతో పూజించి, మనస్సులోనే కృష్ణుడికి తన నమస్కారం అని అంటూ శిరస్సు వంచి, శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడిని స్తవరాజమనే స్తోత్రరాజంతో స్తుతించాడు.  అలా స్తవరాజంతో స్తుతించి ప్రశాంతంగా మౌనం దాల్చిన భీష్ముడిని మహామునులు ప్రశంసించారు.

శ్రీకృష్ణుడు ధర్మరాజాదులతో భీష్ముడి దగ్గరకు పోతూ మార్గమధ్యంలో శమంత పంచకాలను చూసి ధర్మరాజుకు పరశురాముడి వృతాంతాన్ని వివరించి చెప్పాడు. పరశురాముడు రాజుల మీద 21 సార్లు దండెత్తడం, వారి రక్తంతో పితృ తర్పణం చేయడం, జమదగ్ని పుత్రుడుగా ఆయన జన్మ వృత్తాంతం, కార్తవీర్యార్జునుడి చరిత్ర, అతడికి వశిష్ట మహర్షి ఇచ్చిన శాపం, కార్తవీర్యార్జునుడి కుమారులు జమదగ్ని యాగధేనువును పట్టి బంధించి తేవడం, పరశురాముడు కార్తవీర్యార్జునుడి మీదికి దండయాత్ర పోవడం, పరశురాముడు కార్తవీర్యార్జునుడిని సంహరించి యాగధేనువును తీసుకోనిపోవడం, కోపించిన కార్తవీర్యార్జునుడి కొడుకులు జమదగ్ని తల నరకడం, ఆగ్రహించిన పరశురాముడు సమస్త క్షత్రియ సమూహాన్ని సంహరిస్తానంటూ ప్రతిజ్ఞ చేసి, 21 మార్లు అలాగే వారిని చంపి రాజుల రక్తంతో భూమిని తడపడం, తాను సంపాదించిన భూమినంతా కశ్యప ప్రజాపతికి దానమివ్వడం, ఆ తరువాత దక్షిణ సముద్రం హద్దుగా కలిగిన ప్రదేశానికి తపస్సు చేసుకోవడానికి పోవడం మొదలైన చరిత్ర అంతా చెప్పాడు.     

ఆ తరువాత శ్రీకృష్ణ, ధర్మరాజులు మాట్లాడుకుంటూ వెళ్లి, ఓఘవతీ నదీ తీరంలో అంపశయ్య మీద వున్న భీష్ముడిని అంతా కలిసి దర్శించుకున్నారు. నమస్కారం చేసి అతడి చుట్టూ కూర్చున్నారు. శ్రీకృష్ణుడు భీష్ముడిని కుశల ప్రశ్నలు వేశాడు. ఇక్కడ భీష్ముడిని ఉద్దేశించి శ్రీకృష్ణుడు ప్రశంసించడాన్ని తిక్కన ఒక చక్కటి పద్యంలో ఇలారాశాడు.

ఉ:       రాజటె ! రాగహీనుడటె ! రాజిత సుందరమూర్తి యట్టె ! వి

భ్రాజిత సంపదున్నత విభాసిత వర్తనుడట్టె ! కామినీ

రాజ మనోజ్ఞ భంగి చతురత్వధనుండటె ! బ్రహ్మచర్య దీ

క్షాజిత మన్మధుండునటె జన్మము లిట్టివు యెందు గల్గునే ?

         (భీష్ముడు: క్షత్రియుడిగా జన్మించాడు. మహర్షుల లాగా ద్వంద్వాతీతుడయ్యాడు. ప్రకాశిస్తున్న సౌందర్య మూర్తి. విభ్రాజమానమై అత్యున్నతంగా వెలుగొందే నడవడిక కలవాడు. స్త్రీసమూహానికి మనోహరమైన నైపుణ్యసంపద కలవాడు. బ్రహ్మచర్య దీక్ష వల్ల మన్మథుడిని జయించినవాడు. ఇట్లాంటి జన్మలు మరెక్కడైనా సంభవిస్తాయా?. ఈ పద్య రచన తిక్కన శైలీ విన్యాసానికొక మచ్చు తునక అని విశ్లేషించారు డాక్టర్ ఎస్ గంగప్ప గారు)

         శ్రీకృష్ణుడు ఆ విధంగా భీష్ముడి ఉత్తమ గుణాలను మిక్కిలి ప్రశంసించాడు. అలాంటి గుణాలు కలవాడు కావడం వల్ల ధర్మరాజుకు సమస్త ధర్మాలను భోదించడానికి అర్హుడయ్యాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు భీష్ముడితో ఆయన ఉత్తమ గుణగణాలను ఏకరువు పెట్టాడు. ఆ విధంగా అని, ధర్మరాజుకు ధర్మాలను ఉపదేశించడానికి భీష్ముడిని నియమించాడు శ్రీకృష్ణుడు.

         దానికి ముందర భీష్ముడితో ఆయన హృదయంలో ఎల్లప్పుడూ వుండే విధంగా తన రూపాన్ని నిలిపానని, ఆ విధంగా ఆయన అత్యంత సంతోషానికి అర్హుడయ్యాడని అన్నాడు. భీష్ముడి మనస్సులో భక్తి, ఋజుమార్గం రెండూ వున్నాయని, అందువల్లే ఆయన మనస్సులో దైవ స్వరూపాన్ని అధివసింప చేశానని చెప్పాడు కృష్ణుడు. ఆ రోజు నుండి 56 రోజుల్లో సూర్యుడు ఉత్తరాయణంలో సంచరించడం ప్రారంభిస్తాడని, అప్పుడు భీష్ముడు భౌతిక దేహాన్ని వదిలిపెట్టి మోక్షం పొందుతాడని, ఆయన దివంగతుడు అయిన తరువాత లోకంలో జ్ఞానం మరుగున పడిపోతుందని, అందువల్ల ధర్మ వివేకాలతో కూడిన జ్ఞానాన్ని పొందడానికి ధర్మరాజాదులు వచ్చారని, వారికి జ్ఞానోపదేశం చేయమని, ధర్మార్థ కామ మోక్షాలను తెలియచేయమని చెప్పాడు శ్రీకృష్ణుడు భీష్ముడికి.

         శ్రీకృష్ణుడి మాటలకు స్పందిస్తూ భీష్ముడు, తనకు ప్రస్తుతం సంభాషించే సామర్థ్యం కూడా లేదని, శరీర దుర్బలత్వం వల్ల తన కంఠధ్వని, నాలుక, స్పష్టతను కోల్పోయాయని, ప్రత్యుత్తరం ఇచ్చే శక్తి కూడా లేదని, కాబట్టి ధర్మరాజుకు ఏది మంచో దాన్ని శ్రీకృష్ణుడే చెప్పాలని అన్నాడు. జవాబుగా శ్రీకృష్ణుడు, కురువంశ భారం భీష్ముడి మీదే ఆధారపడి వున్నదని, ఆయన భగవత్తత్త్వ జ్ఞాని అని, ఆయనకు తాను మూడు వరాలు ఇస్తున్నానని అన్నాడు. ఆయనకు గుచ్చుకున్న బాణాల వల్ల మూర్ఛకాని, అలసట కాని, నొప్పి కాని కలగకుండా బాధారహితమైన శరీరంతో సుఖంగా వుండమని చెప్పాడు. ఆయనకు ఆకలి దప్పులు కలగకుండా మహాశక్తి కలుగుతుందన్నాడు. ఆయన దివ్య ప్రబోధాన్ని పొందుతాడని, అలాంటి శక్తితో అతిశయ జ్ఞానాన్ని పొందుతాడని అన్నాడు.

         అక్కడున్న వ్యాసాది మహర్షులంతా శ్రీకృష్ణుడిని ప్రశంసించారు. ఇంతలో సూర్యాస్తమయం అయింది. మహర్షులంతా వెళ్లడానికి సిద్ధమయ్యారు. మళ్లీ ఉదయాన్నే వస్తామన్నారు. కృష్ణుడు మొదలైన వారు కూడా ఉదయాన్నే వస్తామని భీష్ముడికి చెప్పి హస్తినాపురానికి బయల్దేరారు. నగరం చేరుకొని సుఖంగా నిద్రపోయారు. మర్నాడు భీష్ముడి దగ్గరకు పోవడానికి ప్రణాళిక వేసుకున్నారు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, ద్వితీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

No comments:

Post a Comment