రాజ ధర్మాలను, నీతులను వివరించమని భీష్ముడిని కోరిన ధర్మరాజు
ఆస్వాదన-96
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (21-11-2022)
అనుకున్న
ప్రకారం, భీష్ముడి దగ్గర సెలవు పుచ్చుకుని వెళ్లిన మర్నాడు, ఆయన వద్ద ధర్మాలను తెలుసుకోవడానికి
ధర్మరాజాదులను తీసుకుపోవడానికి శ్రీకృష్ణుడు సిద్ధమై ఆ విషయాన్ని సాత్యకి ద్వారా
ధర్మరాజుకు కబురుచేశాడు. భీష్ముడి పరిసరాలలో నాటి నుండి జన సమ్మర్ధం లేకుండా
ఏర్పాట్లు చేయమని ధర్మరాజు అర్జునుడికి చెప్పాడు. కొంత మంది రాజులను మాత్రం తమతో
తీసుకొని పోవాలని నిర్ణయించారు. శ్రీకృష్ణుడు,
పాండవులు, కృపాచార్యుడు, యుయుత్సుడు, సంజయుడు వారి-వారి రథాలలో భీష్ముడి
దగ్గరికి బయల్దేరి వెళ్లారు. వారంతా అక్కడికి చేరుకోవడానికి ముందే నారదాది
మహామునులు భీష్ముడి దగ్గరకు వచ్చారు. శ్రీకృష్ణాదులు భీష్ముడు, ఇతర మహర్షులు వున్న సమీపానికి వచ్చి, అందరికీ నమస్కరించి, భీష్ముడిని భక్తితో పూజించారు. అంతకు ముందే
ధర్మరాజు పిలుపు మేరకు అక్కడికి ధృతరాష్ట్రుడు కూడా ఎంపికచేసిన కొందరు రాజులతో సహా
వచ్చి వున్నాడు.
తొలుత నారద
మహర్షి కలగచేసుకొని, భీష్ముడు భూలోకం వదలి స్వర్గలోకానికి
వెళ్లే ముందు మనస్సుతో పాటు, జ్ఞానకర్మేంద్రియాల సందేహాలు తొలగి
పోయే విధంగా సమస్త ధర్మ పద్ధతులనూ ఆయన్ను అడిగి తెలుసుకొమ్మని ధర్మరాజాదులకు సలహా
ఇచ్చాడు. సంభాషణను ప్రారంభించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు ధర్మరాజు. వెంటనే, భీష్ముడి
క్షేమాన్ని గురించి ప్రశ్నించాడు కృష్ణుడు. ఆయన అనుగ్రహంతో తనకు శారీరక బాధ కాని, అలసట కాని లేవని, తన మనస్సు,
జ్ఞాన కర్మేంద్రియాలు పాటవ సంపదతో ఒప్పారుతున్నాయని, ఆయన ఆదేశానుసారం పాండవులకు చెప్పదల్చినవన్నీ సవిస్తరంగా చెప్తానని
అన్నాడు జవాబుగా భీష్ముడు. భీష్ముడిని మానవోత్తముడిగా సంభోదిస్తూ శ్రీకృష్ణుడు, అత్యుత్తమ కీర్తిని భీష్ముడికి ప్రసాదించాలని
భావించి తన జ్ఞానాన్ని ఆయన మనస్సులో ప్రవేశ పెట్టానని, భూమి ఎంతకాలం సుస్థిరంగా వుంటుందో అంతదాకా ఆయన
కీర్తి నశించనిదై కొనసాగుతుందని, ఆయన చెప్పే మంచి మాటలన్నీ వేదాలతో
సమానమై ఒప్పారుతాయని అన్నాడు. సమస్త ధర్మ విశేషాలను బోధించే వాక్యాలను అక్కడున్న
రాజుల సమక్షంలో ఆయన మనుమలైన ధర్మజ భీమార్జున నకుల సహదేవులకు చెప్పమని శ్రీకృష్ణుడు
కోరాడు భీష్ముడిని.
ఆ తరువాత
ధర్మరాజు భీష్ముడి పాదపద్మాలకు నమస్కారం చేయగా, ఆయన
ధర్మరాజును అభినందించాడు, ఆదరించాడు. ధర్మరాజు తనను ఏమేమి అడగ దాల్చుకున్నాడో
అవన్నీ అడగమని భీష్ముడు చెప్పడంతో ధర్మరాజు అడగడం ప్రారంభించాడు.
ఈ
జీవలోకానికెల్లా రాజ ధర్మమే ఆధారమని,
ధర్మార్థ కామాలు రాజధర్మం మీదే ఆధారపడ్డవని,
లోకాన్ని శాసించేది రాజ ధర్మమే అని,
రాజ ధర్మమే పాటించనట్లయితే లోకం పరిస్థితి కలత చెంది నాశనమై పోయేదని, లోకంలోని పాపాలన్నీ రాజధర్మంతోనే నాశనమౌతాయని, కాబట్టి సమస్త రాజ ధర్మాలను వివరించమని ‘తాతా’
అని సంభోదిస్తూ భీష్ముడిని ప్రార్థించాడు ధర్మరాజు. ముందుగా రాజ ధర్మనీతులను
వివరించమని కోరాడు. ఇలా అడగగానే ధర్మరాజుకు జవాబిచ్చే ముందర భీష్ముడు
మహిమాన్వితమైన ధర్మాన్ని, శ్రీకృష్ణుడిని, వేదస్వరూపులైన బ్రాహ్మణ సమూహాన్ని స్మరించి, నమస్కరించాడు. రాజ ధర్మాన్ని చెప్తానని, ఆయా సందర్భాలలో ఆపద్ధర్మ, మోక్ష ధర్మాలను కూడా తెలియ పరుస్తానని అన్నాడు
భీష్ముడు. ఇంకా ఇలా చెప్పాడు:
‘రాజుకు
దైవానుగ్రహం, పురుష ప్రయత్నం రెండు కూడా కార్యసాధనకు
అవసరమే. దాంతీ, శాంతీ కల రాజు శ్రీమంతుడు, యశస్వి అవుతాడు. సమస్త సౌఖ్యాలను
పొందగలవాడౌతాడు. సప్త ప్రకృతులను గుర్తించి సక్రమంగా నిర్వహించేట్లు చేయాలి.
బ్రాహ్మణులను నాశనం చేయాలని అనుకున్న రాజు వాడే నశిస్తాడు. అయితే దోషం చేస్తే వాడు
బ్రాహ్మణుడైనప్పటికీ శిక్షార్హుడే. శాంతపరుడైన రాజును ప్రజలు ఆడిస్తారు. కోపిష్టి
అయితే కోపోద్రిక్తులౌతారు. సప్త రాజ్యాంగాలైన స్వామి, అమాత్యుడు,
స్నేహితుడు, కోశం,
రాష్ట్రం, దుర్గం,
బలం అనే వాటిని రాజు గుర్తించి సక్రమంగా నిర్వహించాలి. వాటికి వినాశకారైన
ఎవ్వరినైనా శిక్షించాలి. యుద్ధంలో శస్త్రాస్త్రాలు ధరించి ఎదుర్కొనే బ్రాహ్మణుడిని
సంహరించడం రాజుకు పరమ ధర్మం అని వేదాలు చెప్తున్నాయి. తప్పు చేసిన బ్రాహ్మణుడిని
రాజ్య బహిష్కరణ చేయాలి కాని వధించరాదు’.
‘రాజు ఎవరినీ
పూరిగా నమ్మకూడదు. అలాగే నమ్మకుండా వుండకూడదు. ఏ అంశాన్నైనా దాని ఉచితానుచితాలు
తానే స్వయంగా పరిశీలించి, గ్రహించాలి. పూర్తిగా విశ్వసించడం కాని, ఏమాత్రం నమ్మక పోవడం కాని రాజు సద్వర్తనకు
క్షేమకరం కాదు. ప్రజారక్షణం చేయని రాజు వేదాధ్యయనం చేయని ఋత్విజుడితో సమానం. శత్రు
సంహారం అవశ్య రాజధర్మం. అల్పుడైన శత్రువు కూడా నిప్పులాగా, విషం లాగా నాశనం చేస్తాడు. కాబట్టి ధీరుడైన
రాజు శత్రుశేషం లేకుండా చేసుకొని రాజ్యాన్ని రక్షించాలి. ధీరుడైన రాజు అనేకమంది
అడ్డగించి ప్రాణాంతకం చేసినప్పటికీ,
లెక్కచేయకుండా రాజ్యం అనే లాభాన్ని ఏమరకుండా పండిత ప్రశంసలు పొందే రీతిలో తన
చేజిక్కించుకోవాలి’.
రాజ ధర్మాలను
వివరించిన భీష్ముడు ఇంకా ఏవైనా సందేహాలుంటే అడగమని ధర్మరాజుతో అన్నాడు. ఆ రోజుకు
సూర్యాస్తమయం అవుతున్నది కాబట్టి ఆ పూటకు నిష్క్రమించి మర్నాడు ఉదయం వచ్చి
అడుగుతానని చెప్పాడు ధర్మరాజు. ధర్మరాజాదులు,
శ్రీకృష్ణుడు భీష్ముడికి నమస్కరించి బయల్దేరి వెళ్లిపోయారు. హస్తినాపురం
చేరుకున్నారు. మునులు వారి-వారి ఆశ్రమాలకు వెళ్లారు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, శాంతిపర్వం, ద్వితీయాశ్వాసం
(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)
No comments:
Post a Comment