Monday, June 24, 2013

హైదరాబాద్ రాక-న్యూ సైన్స్ కాలేజీలో చేరిక: వనం జ్వాలా నరసింహారావు

హైదరాబాద్ రాక-న్యూ సైన్స్ కాలేజీలో చేరిక
వనం జ్వాలా నరసింహారావు

          ఖమ్మంలో బిఎస్సీ డిగ్రీ మొదటి ఏడాది చదువు పూర్తి చేసుకున్న నేను, మిగతా రెండేళ్లు హైదరాబాద్ లో కొనసాగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాను. నేను-మా నాన్న గారు, హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ సచివాలయంలో ఉద్యోగం చేస్తూ, చిక్కడపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్క సందులో నివాసముంటున్న మేనమామ కంకిపాటి సత్యనారాయణ రావు గారిని సంప్రదించాం. మామయ్య అని నేను సంబోధించే సత్యనారాయణ రావు గారు హైదరాబాద్‌లోనే తన డిగ్రీ చదువు పూర్తి చేశారు. విశ్వవిద్యాలయంలో టాప్ రాంకర్‍గా (యూనివర్సిటీ ఫస్ట్) డిగ్రీ పరీక్ష పాసయ్యారాయన. మంచి స్టయిలిష్‍గా, ఎల్లప్పుడూ టిప్-టాప్‌గా వుండేవారు. సచివాలయంలో ఎల్డీసి గా చేరిన మామయ్య సహాయ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. నీతికి-నిజాయితీకి మారు పేరు. లక్షలాది రూపాయలు లంచంగా పొందగలిగే అవకాశమున్న గనుల శాఖలో ఉద్యోగం చేసినప్పటికీ పైసా అక్రమ సంపాదన చేయని ఉన్నతమైన వ్యక్తి ఆయన. మా అత్తయ్య విమలమ్మ ఆయనకు అన్ని విధాల తగిన సహధర్మచారిణి. తింటే ఆమె చేసిన వంటే తినాలి...అంత రుచిగా వుంటుంది.

          అప్పట్లో మామయ్య కుటుంబం మాకు వరసకు బంధువైన గూడూరు వారింట్లో ఒక పోర్షన్‌లో అద్దెకుండేది. పక్క పోర్షన్‌లో మా అత్తయ్య సొంత అన్న గారు (ఆయన ఎజి కార్యాలయంలో ఉద్యోగం చేసేవారు) వెంకట్ రామారావు గారు అద్దెకుండేవారు. దరిమిలా ఆ ఇంటిని ఆయన కొనుక్కున్నారు. ఇంటి ఎదురుగా వున్న 150 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని మామయ్య కొనుక్కుని, అందులో చిన్న రెండస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. ఇప్పటికీ సుమారు 75 సంవత్సరాల వయస్సులో మామయ్య, 70 సంవత్సరాల వయస్సులో మా అత్తయ్య, ఆయన ఉమ్మడి కుటుంబం ఆ ఇంటిలోనే నివసిస్తున్నారు. నేను హైదరాబాద్ వచ్చిన తొలిరోజుల్లో మామయ్యకు నలుగురు (విజయ్ రాధా కిషన్, నాగన్న, జయ, పద్మ) పిల్లలుండేవారు. తరువాత మరో నలుగురు (శీను, గోపి, జానకి, చిట్టి) పుట్టారు. మామయ్య కుటుంబం, మా అత్తయ్య సోదరుడి కుటుంబం (ఆయనకు ముగ్గురు పిల్లలు) ఎంత కలిమిడిగా వుండేవారంటే, ఇరు కుటుంబాలకూ కలిపి ఒకే వంట ఇల్లుండేది. ఒక నెలంతా ఒకరి పోర్షన్‌లోని కిచెన్‌లో వండితే మరుసటి నెల మరొకరి పోర్షన్‌లో ఆ పని జరిగేది. అందరూ ఒకే చోట భోజనం చేసేవారు. ఖర్చు చెరిసగం పంచుకునేవారు. ఎవరింటికి బంధువులొచ్చినా, వారిని, ఇరువురూ తమ బంధువులాగానే చూసుకునేవారు. నాకు గుర్తున్నంతవరకు కనీసం పాతిక-ముప్పై సంవత్సరాలన్నా అలా కలిసి మెలిసి భోజనాలు చేశారు. పిల్లలు పెరిగిన తరువాత క్రమేపీ ఎవరి వంట వారే చేసుకోవడం మొదలైంది. ఇద్దరి పిల్లలూ చక్కగా పైకొచ్చారు...ఉద్యోగాలు చేసుకుంటున్నారు.

మామయ్యను నా సీటు విషయం సంప్రదించాం. వెంటనే హైదరాబాద్ బయల్దేరి రమ్మన్నాడు. నేనంతకు ముందు ఒక్కసారి హైదరాబాద్ వచ్చి పోయాను. ఎం. జె. కె. స్మిత్ సారధ్యంలో ఎం.సీ.సీ (ఇంగ్లాండు క్రికెట్ టీం ను ఆ రోజుల్లో అలా పిలిచేవారు) జట్టు భారత దేశంలో పర్యటనలో భాగంగా, జనవరి 7-9, 1964 లో హైదరాబాద్ ఫతేమైదాన్ (ఇప్పటి ఎల్. బి. స్టేడియం) లో సౌత్ జోన్ కు, ఎం.సీ.సీ కి మధ్య ఒక కౌంటీ మాచ్ జరిగింది. సౌత్ జోన్ పైన ఎం.సీ.సీ జట్టు ఇన్నింగ్స్ 27 పరుగుల తేడాతో గెలిచింది. విల్సన్ అనే ఇంగ్లాండ్ క్రీడాకారుడు బాటింగ్‍లోను, బౌలింగ్ లోను అద్భుతమైన ప్రతిభ కనబరిచాడా మాచ్‍లో. సెంచరీ కూడా చేశాడు. అలనాటి హైదరాబాద్ క్రికెట్ స్టార్ ఎం. ఎల్. జయసింహ ఆ మాచ్ లో మంచి స్కోర్ చేయలేకపోయాడు. క్రికెట్ మీద వున్న అభిమానంతో ఖమ్మం కాలేజీలో చదువుకుంటున్న కొంతమందిమి ఆ మాచ్ చూడడానికి మొదటి సారిగా హైదరాబాద్ వచ్చాం అప్పుడు. అప్పట్లో ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లడానికి ఒకే ఒక ఆర్. టీ. సీ బస్సు, ఒక రైలు వుండేవి. ఆర్. టీ. సీ బస్సులో కాని, రైల్లో కాని హైదరాబాద్ టికెట్ ఖరీదు ఆరేడు రూపాయలంటే ఎక్కువ లేదు. మేం రైల్లో ప్రయాణం చేశాం. రిజర్వేషన్ లేదు. రాత్రి పొద్దు పోయాక ఖమ్మంలో రైలెక్కాంరైలు ఎక్కడానికి చాలా అవస్థ పడాల్సి వచ్చింది. చివరకు ఎవరూ కంపార్ట్ మెంట్ తలుపులు తీయకపోతే, తలుపులకు వేళ్లాడుకుంటూ డోర్నకల్ జంక్షన్ వరకు ప్రాణాపాయ స్థితిలో ప్రయాణం చేశాం. మొత్తం మీద ఏ ప్రమాదం జరగకుండా జంక్షన్‌లో కంపార్ట్ మెంట్ లోకి వెళ్లగలిగాం. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో దిగి, సమీపంలోనే వున్న వూటుకూర్ వరప్రసాద్ గదికి చేరుకున్నాం. మా టీంలో నేను కాకుండా, వనం నర్సింగరావు, వనం రంగారావు కూడా వున్నారు. మాచ్ చూడడానికి మాకు టికెట్లు వరప్రసాద్ ఏర్పాటు చేశాడు. వరప్రసాద్ గదిలో ఆయనతో పాటు, ఖమ్మం జిల్లా, కారేపల్లికి చెందిన పర్సా సీతారాం కూడా వుండేవాడు. సీతారాం డన్ లప్ కంపెనీలో పని చేస్తుండగా, ప్రసాద్ ప్రయివేట్ గా డిగ్రీ చదువుతుండేవాడు. ఆ ట్రిప్ లోనే హైదరాబాద్ నగరం కూడా కొంత మేరకు చూసినట్లు గుర్తు.

జనవరి 1964 లో భారత దేశంలో పర్యటించిన ఇంగ్లాండ్-ఎం.సీ.సీ జట్టు మొత్తం ఐదు టెస్ట్ మాచ్‍లు, రెండు కౌంటీ మాచ్‍లు ఆడింది. సౌత్ జోన్‌తో ఆడిన కౌంటీ మాచ్ కంటె ముందు బెంగ్‍ళూర్‍లో జనవరి 3-5 మధ్య  ఇండియన్ బోర్డ్ ప్రెసిడెంట్ ఎలెవన్‌తో మొదటి కౌంటీ మాచ్ ఆడింది. అది డ్రాగా ముగిసింది. టెస్ట్ మాచ్‍ల్లో ఇంగ్లాండ్ పక్షాన కెప్టెన్ స్మిత్ కాకుండా, బ్రియాన్ బోలస్, ఫ్రెడ్ టిట్మస్, జాన్ మార్టిమోర్, జాన్ ప్రైస్, కాలిన్ కౌడ్రే, డేవిడ్ లార్టర్, బారీ నైట్, జిమ్ పార్క్స్, కెన్ బారింగ్ టన్...తదితరులు ఆడారు. భారత దేశం పక్షాన ఆడినవారిలో కెప్టెన్ నవాబ్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, బుధి కుందేరన్, చందూ బోర్డే, బాపు నడ్కర్ని, సలీమ్ అబ్దుల్ దురానీ, భగవత్ చంద్రశేఖర్, దిలీప్ సర్దేశాయ్, ఎం. ఎల్. జయసింహ, రమా కాంత్ దేశాయ్, హనుమంత్ సింగ్...తదితరులు వున్నారు. ఐదు టెస్ట్ మాచ్‍లు కూడా డ్రాగా ముగిశాయి. ఐదు మాచ్‍లకు టాస్ ఇండియా కెప్టెన్ పటౌడీ గెలిచాడు. మద్రాస్ లో జరిగిన మొదటి మాచ్‍లో ఓపెనర్-వికెట్ కీపర్ గా ఆడవలసిన ఫారూక్ ఇంజనీర్ గాయం వల్ల చివరి క్షణంలో జట్టులోకి తీసుకోనందువల్ల, ఆయన స్థానంలో బుధి కుందేరన్ ఆడాడు. ఆ మాచ్‍లో భారత జట్టు చేసిన మొదటి ఇన్నింగ్స్ స్కోర్ 457/7 (డిక్లేర్) లో బుధి కుందేరన్ 192 పరుగులు సాధించడంతో మిగిలిన నాలుగు మాచ్‍లకు అతడినే ఓపెనర్-వికెట్ కీపర్‌గా కొనసాగించారు. 

కాన్పూర్‌లో జరిగిన చివరి మాచ్‍లో టాస్ గెలిచిన పటౌడీ, పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఇంగ్లాండుకు తొలుత బాటింగ్ ఇచ్చాడు. 8 వికెట్లు కోల్పోయి 559 పరుగుల భారీ స్కోర్ చేసిన ఇంగ్లాండ్ భారత్ ముందు పెద్ద సవాలు విసిరింది. భయపడినట్లే, భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 266 పరుగులకే ఆల్ ఔట్ అయింది. ఫాలో ఆన్ తప్పలేదు. మొదటి ఇన్నింగ్ లో చివరలో వచ్చిన బౌలర్ నడ్కర్ని చక్కటి ఆట ఆడి అజేయంగా నిలవడంతో, రెండవ ఇన్నింగ్స్ లో అతడిని ఓపెనర్ గా పంపించాడు కెప్టెన్ పటౌడీ. ఆ ఇన్నింగ్స్ లో నడ్కర్ని సెంచరీ చేసి మళ్లీ అజేయంగా నిలిచి భారత జట్టును ఓడిపోకుండా కాపాడాడు. మొత్తం మీద భారత్  పక్షాన అన్ని మాచ్‍‍లు కలిపి అత్యధిక పరుగులు చేసిన వారిగా బుధి కుందేరన్ (525), దిలీప్ సర్దేశాయ్ (449), ఎం.ఎల్.జయసింహ (444) వుండగా, ఇంగ్లాండ్ పక్షాన బ్రియాన్ బోలస్ (391), కాలిన్ కౌడ్రే (309),ఎం.జె.కె.స్మిత్ (306) అధిక పరుగులు చేశారు. సలీమ్ దురాని 11 వికెట్లు, చంద్రశేఖర్ 10 వికెట్లు, బాపు నడ్కర్ని 9 వికెట్లు, టిట్మస్ 27, జాన్ ప్రైస్ 14, విల్సన్ 9 వికెట్లు తీసుకున్నారు ఇరు పక్షాల నుంచి. హనుమంత్ సింగ్ తాను ఆడిన మొదటి మాచ్ లోనే సెంచరీ సాధించినట్లు గుర్తు. అలానే పటౌడీ ఒక డబుల్ సెంచరీ కూడా చేశాడు.

వాతావరణం అనుకూలించనందున ఇంగ్లాండు జట్టులో చాలామంది అనారోగ్యానికి గురయ్యారు. ఒకానొక సందర్భంలో, ఒక టెస్ట్ మాచ్‍లో, వాళ్లు ఫీల్డింగ్ చేయడానికి పదకొండు మంది ఆటగాళ్లు లేకపోయే పరిస్థితి ఎదురైంది. భారత్ ఆటగాళ్లు ఒకరిద్దరు ఇంగ్లాండు టీం పక్షాన ఫీల్డింగ్ చేసినట్లు జ్ఞాపకం. అంతా "స్పోర్ట్స్ మెన్ స్పిరిట్"...ఇప్పటి లాగా "మాచ్ ఫిక్సింగ్" లు లేవా రోజుల్లో. అలానే, ఆ రోజుల్లో ఇప్పటి లాగా టెలివిజన్ సెట్లు లేవు. రేడియోలో కామెంటరీ వినుకుంటూ ఆనందించేవాళ్లం. విజ్జీ, చక్రపాణి లాంటి వారు వ్యాఖ్యాతలుగా వుండేవారు. మా కాలేజీలో పని చేస్తున్న లెక్చరర్లు వరదరాజన్, జడ్డి, చక్రపాణి, వైద్య క్రికెట్ అభిమానులు కావడంతో, మేం కూడా, మధ్య-మధ్య క్లాసులు ఎగ్గొట్టి వాళ్ల గదుల్లోకి వెళ్లి కామెంటరీ వినే వాళ్లం.

          1964 జూన్ నెలలో నేను, నాన్న గారు కలిసి హైదరాబాద్ చేరుకున్నాం. ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూడా బస్ స్టాండ్ చేరుకునే సరికి సాయంత్రం ఏడు దాటింది. అప్పట్లో ఎక్స్ ప్రెస్ బస్సు కాదది. ఒకరకమైన ఫాస్ట్ పాసింజర్ లాంటిది. కండక్టర్ ఇష్టమొచ్చిన చోట బస్సును ఆపేవాడు. చిక్కడపల్లి వెళ్లడానికి గౌలిగూడా నుంచి రిక్షా కుదుర్చుకున్నాం. రిక్షా వాడిని మొదలు "చల్తే క్యా" అని అడగాలి. అంతా హింది-ఉర్దు కలిసిన భాష. "కహా జానా సాబ్" అని వాడు అడగడం...మేం చిక్కడపల్లి "దేవల్ కి బాజు గల్లీ" అని చెప్పడం, అంగీకరించిన రిక్షా వాడు "బారానా" (75 పైసలకు సమానం) కిరాయి అడుగుతే, మేం "ఛె ఆనా" (వాడడిగిన దాంట్లో సగం) ఇస్తామనడం, చివరకు "ఆఠానా" కు కుదరడం జరిగిపోయింది. గౌలిగూడా, ఇసామియాబజార్, సుల్తాన్ బజార్, బడీ చావిడి, కాచి గుడా చౌ రాస్తా, వై.ఎం.సి.ఏ మీదుగా చిక్కడపల్లి "దేవల్ కి బాజు గల్లీ" లో వున్న మామయ్య ఇంటికి సుమారు ఎనిమిది గంటల రాత్రి సమయంలో చేరుకున్నాం. ఆ రాత్రికి భోజనాలు కానిచ్చి మర్నాడు ఏం చేయాలో మామయ్యతో కలిసి నిర్ణయించుకున్నాం.


మామయ్యకు డిగ్రీలో లెక్కల సబ్జెక్ట్ బోధించిన డి. వి. ద్వారక గారు ఉస్మానియా యూనివర్సిటీలో మాథమాటిక్స్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారప్పుడు. చిక్కడపల్లిలో మామయ్య ఇంటి పక్క వీధిలో వుండేవారాయన. బహుశా ఇప్పుడాయనకు సుమారు 90 సంవత్సరాల పైన వుండవచ్చు. ఇటీవలే రెండేళ్ల క్రితం ఒక పెళ్లిలో ఆయనను కలిశాను. ఆరోగ్యంగానే కనిపించారు. న్యూ సైన్స్ కాలేజీలో సీటు ఇప్పించమని ద్వారకా గారిని అడుగుదామనుకున్నాం. ఆయన ఇంటికి వెళ్లాం. మా అభ్యర్థన మేరకు మర్నాడు నన్ను కాలేజీకి తీసుకెళతామన్నారు. అలానే వెళ్లాం. కాలేజీలో నన్ను ప్రిన్సిపాల్ సి. సుదర్శన్ గారికి పరిచయం చేశారాయన. సీటు కావాలని కోరారు. ఆయన వెంటనే సీటివ్వడానికి అంగీకరించారు. అలా బీఎస్పీ (ఎం.పీ.సీ) రెండో సంవత్సరంలో 1964 జూన్ లో న్యూ సైన్స్ కళాశాలలో చేరాను. ఆ కళాశాలను జులై 17, 1956 , నూతన విద్యా సమితి యాజమాన్యం కింద, సి. సుదర్శన్ గారు, జి.ఎస్. మెల్కోటే గారు స్థాపించారు. నారాయణగూడలో వున్న ఆ కాలేజీలో అత్యంత నైపుణ్యం కల మేధావులైన విద్యావేత్తలెందరో పని చేసేవారు. 1982 సంవత్సరంలో కళాశాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకున్న సందర్భంలో, యాజమాన్య బాధ్యతలను, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతీయ విద్యా భవన్ చేపట్టింది. నారాయణగూడలోని కళాశాల భవనానికి అదనంగా అమీర్ పేటలో మరో బ్రాంచ్ కూడా స్థాపించింది యాజమాన్యం దరిమిలా. ప్రిన్సిపాల్ సుదర్శన్ గారితో ఆనాడు మొదలైన నా పరిచయం ఆ చివరి రోజుల వరకూ కొనసాగింది. నేను రాజ భవన్ లో పని చేస్తున్నప్పుడు, ఆ పరిచయం కాస్త బలపడింది కూడా

5 comments:

  1. ఆనాటి రిక్షాబాడుగ కూడా గుర్తుంచుకున్నారంటే ఓహ్ మీ జ్ఞాపక శక్తికి జోహార్లు!

    ReplyDelete
  2. Turlapati Sambasivarao: amazing memory

    ReplyDelete
  3. Manohar Rao Gade: Old memories are always sweet they never be bitter..

    ReplyDelete

  4. ఉస్మానియా యూనివర్సిటీ మాథెమాటిక్స్ డిపార్టుమెంటు లో మాకు M.Sc లో Co-Ordinate Geometry క్లాసు తీసుకునేవారు.ఇప్పుడు ఆయనకు 92 ఏళ్ళు.
    ప్రస్తుతం అశోక్ నగర్ మూడవ వీధి లోని ఆర్య నర్సింగ్ హోం ప్రక్క వీధిలో 1-10-42 ఇంటిలో నివసిస్తున్నారు.

    ఈ విషయం ఆయనకు తెలిపినచో చాల సంతోషించ గలరు.

    జ్వాలా కు నా శుభాకాంక్షలు.



    http://www.ghmc.gov.in/election/57/english/AC057_DRF_E_226.PDF
    voter ID card 1937275...page 9 of 35 ,Serial no.281

    జూపూడి హనుమంత రావు

    ReplyDelete
  5. Thank you for informing about Dwaraka Sir. I will try to meet him.

    ReplyDelete