Saturday, June 15, 2013

నా బాల్యం...చిన్ననాటి కబుర్లు-Part FOUR: వనం జ్వాలా నరసింహారావు

నా బాల్యం...చిన్ననాటి కబుర్లు-Part FOUR
వనం జ్వాలా నరసింహారావు

చిన్నతనంలో నాకు ప్రయాణాలంటే చాలా సరదాగా వుండేది. అది కూడా నాకు అత్యంత ఇష్టమైన మా కచ్చడం బండిలో. కచ్చడం బండికి, పెద్ద బండికి సైజులో కొంత తేడా వుండి, ఇది చిన్నగా వుంటుంది. కచ్చడం బండ్లు అందరికీ వుండవు. కొంచెం మోతుబరి రైతులకు మాత్రమే వుంటాయి. మా వూళ్లో పటేల్ రామయ్యకు, అప్పటి సర్పంచ్ పర్చూరి వీరభద్రయ్య గారికి, బత్తుల సత్యనారాయణకు మాత్రమే వుండేవి. కచ్చడం బండి పైన ఒక గుడిసె లాంటిది అమర్చి వుంటుంది. లోపల కూర్చోవడానికి చిన్న నులక మంచం (దాన్ని "చక్కి" అని పిలిచే వాళ్లం) వేయాలి. ముందర బండి తోలేవాడు కూచోవడానికి "తొట్టి" వుంటుంది. సామానులు చక్కి కింద అమర్చే వాళ్లం. ఎక్కువలో-ఎక్కువ ముగ్గురు-నలుగురు కంటే అందులో కూర్చోవడం కష్టం. ఇక వాటికి కట్టే ఎద్దులు కూడా చిన్నవిగానే వుంటాయి. ప్రయాణానికి పోయే ముందర వాటిని అందంగా అలంకరించేవాళ్లం. ముఖాలకు పొన్న కుచ్చులు”, “ముట్టె తాళ్లు”, మెడకు మువ్వలు-గంటలు”, బండి చిర్రలకు (ఎద్దుల మెడపై బండి "కాణీ" వేసినప్పుడు అది జారి పోకుండా రెండు చిర్రలు అమర్చే వాళ్లం) గజ్జెలు, ఎద్దుల మెడలో వెంట్రుక తాళ్లు, నడుముకి టంగు వారు అలంకరించేవాళ్లం. ఎద్దులను అదిలించడానికి తోలేవాడి చేతిలో "చండ్రకోల" వుండేది. అది తోలుతో చేసేవాళ్లు.

ఈ హంగులన్నీ వున్న కచ్చడం బండిలో ప్రయాణం చేస్తుంటే బలే హుషారుగా వుండేది. ఎద్దులు బండిని లాక్కుంటూ పరుగెత్తుతుంటే, ఆ గజ్జెల చప్పిడి, మువ్వల సందడి, టంగు వారు కదలడం....చూడడానికి బలే సరదాగా వుండేది. ఎక్కువమంది వుండి కచ్చడం బండి సరిపోకపోతే, ఒక పెద్ద బండికి కూడా తాత్కాలికంగా ఒక గుడిసె కట్టించి, అందులో "బండి జల్ల" వేయించి, దాంట్లో "బోరెం" పరిచి, దాని కింద మెత్తగా వుండేందుకు వరి గడ్డి వేసి, అందులో కూచుని ప్రయాణం చేసే వాళ్లం. పెద్ద బండిలో ఎద్దులను పరుగెత్తించడం కొంచెం కష్టం. మా కచ్చడం బండిని మా వూళ్లో వున్న వడ్రంగి కోటయ్య తయారు చేశాడు. అతడు మా పక్క వూరైన అమ్మపేట గ్రామం నుంచి మా నాన్న కోరిక మేరకు మా గ్రామం వచ్చి స్థిరపడ్డాడు. ఏడాదికి ఇంత అని అతడికి ముట్ట చెప్పే వాళ్లం. వాస్తవానికి మా ఇంటి పక్కనే మరో వడ్రంగి ఇల్లుంది. వడ్ల జగన్నాధం అనే వాళ్లం అతడిని. ఆ ఇద్దరు వడ్రంగులు వూరును పంచుకున్నారు. సగం మందికి ఒకరైతే, మిగతా సగం మందికి మరొకరు వార్షికంపైనే వడ్రంగి పనులను చేసేవారు.

వడ్రంగి ఇంటి పక్కనే వుండడంతో, చిన్నతనంలో, తీరిక దొరికినప్పుడల్లా స్నేహితులంతా కలిసి అక్కడకు వెళ్లే వాళ్లం. అక్కడ "కొలిమి" లో ఇనుప కడ్డీలను పెట్టి కాల్చడం, వాటిని సమ్మెట పోటుతో కొట్టడం, కొలిమిలో నిప్పు ఆరిపోకుండా ఉపయోగించే "తిత్తులను" వూదడానికి ఎల్లప్పుడూ ఒక మనిషి వుండడం చూసుకుంటూ కాలక్షేపం చేసే వాళ్లం. అక్కడ వుండే "బాడిసె" (గొడ్డలి లాంటి పరికరం) తో ఒక చెక్క తీసుకుని మేమూ చెక్కడం నేర్చుకోవడం బలే సరదాగా వుండేది. వడ్ల జగన్నాధం మా వడ్రంగి కాకపోయినప్పటికీ మమ్మల్ని ఏమీ అనక పోయేవాడు. జగన్నాధం వ్యవసాయ పనిముట్లయిన "అరకలు", "నాగళ్లు", "బురద నాగళ్లు", "దంతాలు", "బండి రోజాలు"....లాంటివి తయారు చేస్తుంటే బలే ముచ్చటగా వుండేది. ఆ పనితనానికి ఆశ్చర్యపోయే వాళ్లం. బండి చక్రాలకు రోజాలను అమర్చడం చాలా కష్టతరమైన పని. ఇనుముతో తయారు చేసిన రోజాను కొలిమిలో కాల్చి, అది ఎర్రగా వున్నప్పుడు, చక్రానికి తొడిగేవారు. అలానే బండి "ఇరుసు" తయారు చేసే విధానం కూడా చాలా కష్టమైంది. తొలకరి వర్షాలు పడుతుండగానే వ్యవసాయ పనులు మొదలయ్యేవి. ఆ పనుల్లో మొదటి కార్యక్రమం వ్యవసాయ పనిముట్లను బాగు చేయించుకుని దున్నడానికి సిద్ధంగా వుండడమే. మా ఇంటికి మరో పక్కన "పోలూరి" వారుండేవారు. ఇప్పటికీ వున్నారు. వాళ్లదే జాగా కొనుక్కుని మా నాన్నగారు మా ఇల్లు కట్టారు. మా ఇరువురి కుటుంబాల మధ్య చాలా సఖ్యత వుండేది.


ప్రయాణం చేయడం సరదా అని చెప్పానుగా. సాధారణంగా మేం బండి కట్టుకుని పోయే స్థలాలు కొన్ని వున్నాయి. తరచుగా వెళ్లే గ్రామం పక్కనున్న వల్లాపురం. ఆ వూళ్లో మా పెదనాన్న గారు (పాలి వాళ్లు) వనం శ్రీరాం రావు గారుండేవారు. ఆయన భార్య దమయంతి గారిని "ఆమ్మ" అని పిలిచే వాళ్లం. వారి కుమారులలో ఒకరైన చిన వరదా రావు (గోవిందం అని పిలిచే వాళ్లం) హెచ్.ఎస్.సీ వరకు నా క్లాస్ మేట్. వల్లాపురానికి ఒక్కోసారి నడిచి కూడా వెళ్లే వాళ్లం. అలానే పక్కనున్న మరో గ్రామం అమ్మ పేటకు వెళ్తుండేవాళ్లం. అమ్మ పేటకు మా నాన్న గారు పట్వారి. ఆయన ఆ గ్రామ "రకం" (ప్రభుత్వానికి చెల్లించాల్సిన వ్యవసాయ శిస్తు లేదా పన్ను) వసూలు చేయడానికి వెళ్లేటప్పుడు ఒక్కోసారి నేను కూడా సరదాగా వెంట వెళ్లేవాడిని. కచ్చడం మీద కాని, సైకిల్ మీద కాని, ఒక్కోసారి నడిచి కాని వెళ్తుండేవాళ్లం. అమ్మపేట గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడి వుంది. గ్రామానికి అర కిలోమీటర్ దూరంలో గుట్ట మీద ఆయన వెలిశారన్న నమ్మకంతో అక్కడ పూజా పునస్కారాలు ఘనంగా జరుగుతుంటాయి. గుట్ట పైకి వెళ్లాలంటే చాలా మెట్లు ఎక్కాలి. తిరుపతి కొండ ఎక్కిన అనుభూతి కలుగుతుంది అక్కడికి పోతే. గుట్టపైన ప్రతి దినం నిత్య ధూప-దీప-నైవేద్యం వుంటాయి. శనివారం నాడు గణనీయమైన సంఖ్యలో యాత్రీకులు వస్తారక్కడికి. మొక్కులు కూడా చెల్లించుకుంటారు. ప్రతి ఏడాది చైత్ర మాసంలో పౌర్ణమి రోజున, వెన్నెల వెలుగులో, అశేష జనవాహిని మధ్య, అంగరంగ వైభోగంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరుగుతుందక్కడ. మా కుటుంబం యావత్తు బండ్లు కట్టుకుని ఆ కళ్యాణోత్సవం చూడడానికి వెళ్లే వాళ్లం. మా నాన్న గారైతే ఆ రోజునుంచి ఒక ఐదారు రోజులు అక్కడే వుండి దైవ కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. ఇప్పటికీ, నేను హైదరాబాద్ లో వుంటున్నప్పటికీ, ప్రతి ఏడాది కళ్యాణోత్సవం నాడు అక్కడకు వెళ్లడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నాను. నేను, మా శ్రీమతి పీటల మీద కూర్చుని మరీ కళ్యాణం జరిపిస్తాం. పల్లెటూళ్లలో వుండే తిరునాళ్లు అమ్మ పేటలో కూడా ఆ రోజున వుంటాయి.

నేను తరచూ వెళ్లే మరో గ్రామం ఇంకో పక్కనున్న కమలాపురం. ఆ వూళ్లో మా అమ్మగారి మేనమామ వనం వెంకటేశ్వర రావు గారుండేవారు. ఆయన కుమారులు వనం నర్సింగరావు, వనం రంగారావులు నా కన్నా రెండు-మూడేళ్లు పెద్దయినప్పటికీ చిన్నతనంలో కలిసిమెలిసి ఆడుకునేవాళ్లం. నర్సింగరావు నేలకొండపల్లి పాఠశాలలో చదువుకునేవాడు. కమలాపురం తరచుగ వెళ్లడానికి మరో కారణం కూడా వుంది. ఆ వూరి మీదనుంచే మా అమ్మమ్మగారి వూరు నాచేపల్లి వెళ్లాలి. శెలవులొచ్చిన ప్రతిసారి, కొన్నాళ్లు నాచేపల్లిలో గడిపే వాళ్లం. వస్తూ-పోతూ కమలాపురంలో బస చేసే వాళ్లం. నాచేపల్లి ప్రయాణం ఆ రోజుల్లో ఒక ప్రహసనంలా వుండేది. ఇప్పటి లాగా సరైన రహదారి వుండేదికాదు. వాగులు, వంకలు దాటి పోవాల్సి వచ్చేది. ఎడ్ల బండిలో వాటి గుండా పోవడం కొంత ప్రమాదకరంగా వుండేది. అంతేకాకుండా, రహదారి ("బాట" అనే వాళ్లం) పొడుగూతా "వరకటాలు" (ప్రమాదాలు జరిగే అవకాశమున్న ప్రదేశాలు) వుండేవి. బండి ఆ మార్గాన పోతున్నప్పుడు ఒరిగి పోయి పడిపోయిన సందర్భాలు అనేకం. అవి వచ్చినప్పుడు మేం కిందకు దిగే వాళ్లం. దిగిన తరువాత నడక కూడా కష్టతరంగా వుండేది. అంతే పోయే వాళ్లం. ఒక సారి బండి "బోల్తా" పడి, నా కాలుకు ప్రమాదకరమైన గాయం అయింది. సుమారు నెల రోజులపాటు చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. రహదారి ఇబ్బందులే కాకుండా, ఆ రోజుల్లో, కమలాపురం గ్రామం దాటి పోవడానికి మరో ఇబ్బంది కూడా వుండేది. ఆ గ్రామంలో ఒక పొగరుబోతు "ఆబోతు" వుండేది. అది బండి వెంట పడి తరుముకుంటూ వచ్చేది. బండికి కట్టిన ఎద్దులు భయపడి బండిని బోల్తా పడవేసేవి. మరో గ్రామం నేలకొండపల్లి (ఆ వూళ్లో మా మేనమామ రాజేశ్వర రావు గారుండేవారు) కి కూడా బండ్లు కట్టుకుని వెళ్లే వాళ్లం. అలానే ఖమ్మం వరకు వెళ్తుండేవాళ్లం.

ఖమ్మం ప్రయాణం ఒక్కోసారి కొంత ఇబ్బందికరంగా వున్నప్పటికీ మొత్తం మీద బలే సరదాగా వుండేది. మేం ఖమ్మం వెళ్లాలంటే మూడు మార్గాలుండేవి అప్పట్లో. మొదటిది ఎనిమిది కిలోమీటర్ల దూరాన వున్న ముదిగొండ గ్రామం వరకు బండి కట్టుకుని వెళ్లి, అక్కడ రోడ్డు రవాణా బస్సు ఎక్కి ఖమ్మం చేరుకోవాలి. అయితే ముదిగొండ బస్ స్టేజ్ లో సాధారణంగా బస్సులను ఆపక పోయేవారు. అప్పట్లో దినమంతా కలిసి నాలుగైదు బస్సులకంటే ఎక్కువ వుండకపోయేది. అవన్నీ సాధారణంగా నేలకొండపల్లిలోనే నిండిపోయి వచ్చేవి. ఎవరన్నా ముదిగొండలో దిగే పాసింజరుంటే బస్ స్టేజ్ లో కాకుండా దూరంగా ఆపి వాళ్లను దింపి వెళ్లిపోయే వాళ్లు. దిగేవారు లేకపోతే ఆపడం జరగకపోయేది. ఓపిక వున్న వాళ్లు ఆగిన స్థలానికి పరుగెత్తుకుంటూ పోతే, అదృష్టం బాగుంటే, ఎక్కగలిగితే, జాగా దొరికేది. లేకపోతే లేదు. మా లాంటి వాళ్లం ఆ ధైర్యం చేయకపోయేవాళ్లం. చిట్టచివరి బస్సుని ఆపే అవకాశాలుండేవి. అదెప్పుడో రాత్రి పొద్దుపోయాక వచ్చేది. అలాంటి సందర్భాలలో మేం ముదిగొండ దాకా కట్టు కొచ్చిన బండిని ఖమ్మం వరకు పొడిగించే వాళ్లం. ప్రయాణం చాలా బడలికగా సాగేది. ఈ బాధంతా ఎందుకని, ఒక్కోసారి సరాసరి ఖమ్మం వేరే మార్గం గుండా బండి మీద వెళ్లే వాళ్లం. లేకపోతే, మరో దిక్కుగా ప్రయాణం చేసి, చింతకాని కాని, పందిళ్లపల్లి కాని బండి మీద చేరుకుని, రైలెక్కి ఖమ్మం వెల్లే వాళ్లం. ఖమ్మం సరాసరి వెళ్లాలన్నా, చింతకాని వెళ్లాలన్నా మార్గమధ్యంలో వున్న "మునేరు" దాటాలి. ఎండాకాలం పర్వాలేదు కాని, వర్షాకాలం అది దాటడం కష్టం-ప్రమాదకరం. అంతే కాకుండా ఖమ్మం వరకైనా, చింతకాని-పందిళ్లపల్లి వరకైనా అప్పట్లో వున్న రహదారి అంత సులభంగా ప్రయాణం చేసే దారి కాదు. బండి బోల్తా పడే అవకాశమున్న ప్రదేశాలు ఐదారుండేవి. అయినా అలానే ప్రయాణం చేయక తప్పని పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఏటి దగ్గర కూర్చుని, ఇంటి నుంచి తెచ్చుకున్న పలహారమో, చద్ది అన్నమో (మామిడికాయ వూరకాయ కలుపుకుని) తింటుంటే బలే మజా వచ్చేది. తిన్నంత తిని, కడుపు నిండా ఆ ఏటి నీళ్లే తాగే వాళ్లం. నేను ఖమ్మం లో చదువుకోవడం ప్రారంభించిన కొద్ది కాలానికి మా వూరు గుండా మొదట్లో మట్టి రోడ్డు, తరువాత మెటల్ రోడ్డు, మరి కొంత కాలానికి డాంబర్ రోడ్డు వేశారు. ప్రస్తుతం డబుల్ రోడ్డు వేస్తున్నారు.


మరిన్ని విశేషాలు....మరోసారి....

4 comments:

  1. మీరు బ్లాగ్ వరల్డ్ లో జాయినవ్వండి. విసృతమైన ప్రచారం మీ బ్లాగుకు కల్పించుకోండి.
    http://ac-blogworld.blogspot.in/

    ReplyDelete
  2. Komaragiri Phanikumari: khachadam bhandi maaku kuda vundedi, meemu pusapalli nundi manukotaku daanilone velle vaallam

    ReplyDelete
  3. కచ్చడం బండిలో గతకాలంలోకి ప్రయాణించినట్లనిపించింది!

    ReplyDelete
  4. మీ బ్లాగ్ను బ్లాగ్ వరల్డ్ కి అనుసంధానం చేయడం జరిగింది.బ్లాగ్ వరల్డ్ ను ఫాలో అవుతూ ఉండండి.మరిన్ని ఉపయోగాలు మీకు తెలుస్తాయి.ప్రతి సంవత్సరము బెస్ట్ బ్లాగ్ వరల్డ్ అవార్డ్ కూడా పెట్టి తెలుగు బ్లాగులను ప్రోత్సహించాలని ప్లాన్ చేస్తున్నాము.వివరాలు త్వరలో....వీలును బట్టి మీ బ్లాగ్ను సంబంధిత శీర్షికకు చేరుస్తాము. http://blogworld-ac.blogspot.in/

    ReplyDelete