Thursday, June 20, 2013

నా బాల్యం...చిన్ననాటి కబుర్లు-Part FIVE: వనం జ్వాలా నరసింహారావు

నా బాల్యం...చిన్ననాటి కబుర్లు-Part FIVE:

వనం జ్వాలా నరసింహారావు

ఏబై-అరవై ఏళ్ల కింద గ్రామాలలో నెలకొన్న కొన్ని పరిస్థితులను మననం చేసుకుంటుంటే, ఇప్పటికీ-అప్పటికీ వున్న తేడా కొట్టొచ్చినట్లు అర్థమవుతుంది. ఉదాహరణకు, నా చిన్నతనంలో, మా గ్రామంలో ఎవరికైనా "సుస్తీ" (వంట్లో బాగా లేక పోతే-జ్వరం లాంటిది వస్తే) చేస్తే, వైద్యం చేయడానికి, వూళ్లో వున్న నాటు వైద్యుడే దిక్కు. నాటు వైద్యులలో అల్లోపతి వారు, హోమియోపతి వారు. ఆయుర్వేదం వారు, పాము-తేలు మంత్రాలు వచ్చిన వాళ్లు, మూలిక వైద్యులు....ఇలా అన్ని రకాల వాళ్లు వుండేవారు. మా వూళ్లో ఇంతమంది లేరు కాని, అల్లోపతి వైద్యం నేర్చుకున్న ఒక డాక్టర్ జంగం రాజయ్య, ఆయుర్వేదం వైద్యం తెలిసిన మరో డాక్టర్ రత్నమాచార్యులు వుండేవారు. రత్నమాచార్యులు పూజారి పని కూడా చేసేవారు. ఎవరికి ఏ సుస్తీ చేసినా వాళ్లే గతి. ఇద్దరికీ ఇంజక్షన్లు ఇచ్చి వైద్యం చేసే అలవాటుండేది. జ్వరాలకు (ఎక్కువగా ఇన్ ఫ్లు ఎంజా, మలేరియా-చలి జ్వరం) ఏ.పీ.సీ టాబ్లెట్లు ఇచ్చేవాడు రాజయ్య. ఒక సీసాలో ఆయన ఇంట్లో తయారు చేసిన "రంగు నీళ్లు" కూడా ఇచ్చేవాడు. తగ్గితే తగ్గినట్లు, లేకపోతే, రోగి కర్మ అనుకునేవారు ఆ రోజుల్లో. జంగం రాజయ్యకు ఒక సైకలుండేది. మా ఇంట్లో ఎవరికీ సుస్తీ లేకపోయినా, ప్రతి రోజు ఏదో ఒక టైంలో మా ఇంటికి రాజయ్య తప్పక వచ్చి పోయేవాడు. మా నాన్నను "దొరవారు" అని సంబోధిస్తూ ఓ గంట గడిపి పోయేవాడు.

          వూళ్లో ఏవైనా సీరియస్ కేసులు వుంటే, ఎడ్ల బండిలోనో, మేనాలోనో తీసుకుని ఖమ్మం పోయే వాళ్లు. వారి వెంట రాజయ్య కూడా వెళ్లేవాడు. ఐతే, ఖమ్మంలో కూడా ఆ రోజుల్లో ఎం.బి.బి.ఎస్ డాక్టర్లు ఎక్కువగా లేరు. డాక్టర్ అబ్దుల్ మజీద్, డాక్ట్రర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, డాక్ట్రర్ అశ్వత్థామలు ఎం.బి.బి.ఎస్ డాక్టర్లు. వారు కాకుండా, చిల్లంచర్ల రంగాచార్యులు, ఉపేందర్ రావు, సీతారామచంద్ర రావు లాంటి కొందరు ఆర్.ఎం.పి డాక్టర్లు కూడా చిన్న-చిన్న నర్సింగ్ హోంలు పెట్టి వైద్యం చేసేవారు. ఆపరేషన్లు కూడా వాళ్ళే చేసేవారు. ఇప్పుడైతే ఖమ్మంలో వందలాది మంది ఎం.బి.బి.ఎస్ డాక్టర్లు, స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు....అంతే సంఖ్యలో నర్సింగ్ హోంలు వున్నాయి. నేను, మా కుటుంబం, ఖమ్మంలో వున్నప్పుడు కూడా చాలా మటుకు స్థానిక డాక్ట్రర్ జె. రామారావు (ఆర్.ఎం.పి) దగ్గరకో, లేకపోతే డాక్టర్ అబ్దుల్ మజీద్ దగ్గర కాంపౌండర్‍గా పని చేస్తూ, ఇంట్లో డాక్టర్ గా పేరు తెచ్చుకున్న రామాచారి దగ్గరికో వెళ్లే వాళ్లం.

          జంగం రాజయ్య కంటే, ఇతర ఖమ్మం డాక్టర్ల కంటే ఎక్కువగా, మా ఫామిలీ డాక్టర్ గా నేలకొండపల్లి గ్రామంలో వైద్యం చేస్తున్న మరో ఆర్.ఎం.పి డాక్ట్రర్ బొప్పెన వెంకటేశ్వర రావును చూసుకునేవాళ్లం. మా వూళ్లో జంగం రాజయ్య వల్ల తగ్గని సందర్భంలో, బండి కట్టుకుని, నేలకొండపల్లి వెళ్లి, అక్కడ మా మేనమామ కంకిపాటి రాజేశ్వర రావు గారింట్లో వుంటూ, డాక్టర్ వెంకటేశ్వర రావు దగ్గర వైద్యం చేయించుకునే వాళ్లం. రెండు పర్యాయాలు నేను నేలకొండపల్లిలో వుంటూ వైద్యం చేయించుకున్న సందర్భాలు ఇంకా గుర్తున్నాయి. ఒక సారి ఎడ్ల బండి మీద పోతుంటే, కమలాపురం-అయ్యగారి పల్లి సరిహద్దుల్లో "వరకటం" (అస్తవ్యస్తమైన ఎడ్ల బండి దారి) దగ్గర ప్రమాదం జరిగి నా కాలు మడమ దగ్గర పెద్ద గాయం అయింది. సుమారు పదిహేను రోజులు నేలకొండపల్లిలో వుండి వైద్యం చేయించుకున్నాను. అలానే ఒక సారి టైఫాయిడ్ (అది టైఫాయిడ్ అవునో కాదో!) వచ్చిందని సుమారు నెల రోజులు నేలకొండపల్లిలో వుండి వైద్యం చేయించుకున్నాను. అప్పట్లో ఇంకా యాంటీబయాటిక్స్ ఉపయోగం అంతగా పాపులర్ కాలేదు. ఆర్.ఎం.పి డాక్టర్ వెంకటేశ్వర రావు గారిచ్చిన మందులతోనే నయమయింది. నాకు అప్పుడు చాలా చిన్న వయస్సు. జ్వరంతో బాధపడుతున్న నన్ను ఎప్పుడూ "ఖుషీ" గా వుంచడానికి నేలకొండపల్లిలో చదువుకుంటున్న వనం నర్సింగరావు, భార్గవలను నాతో "చీట్ల పేక" ( ప్లేయింగ్ కార్డ్ లు) ఆడమని మా మామయ్య పురమాయించేవాడు.

          నా చిన్నతనంలో గ్రామాలలో "గత్తర" (కలరా), "స్పోటకం-పాటకం" (స్మాల్ పాక్స్) వ్యాధులు తరచుగా వస్తుండేవి. వీటికి తోడు "దద్దులు", "వంచెలు" కూడా చిన్న పిల్లలకు పోసేవి. ఇవి రాకుండా ముందస్తు నివారణ చర్యగా కలరా ఇంజక్షన్లు చేయడానికి, "టీకాలు" వేయడానికి ప్రభుత్వ వైద్యుల బృందం గ్రామంలోకి వచ్చేది. వారు మా ఇంటి ఎదురుగా వున్న పోలీస్ పటేల్ తుల్లూరి రామయ్య ఇంట్లో మకాం వేసి, గ్రామంలోని అందరినీ అక్కడకు రప్పించి ఇంజక్షన్లు, టీకాలు ఇచ్చేవారు. టీకాలు వేసిన చోట పెద్ద పుండులాగా అయి, ఒక నెల రోజుల తరువాత పెద్ద మచ్చలాగా పడేది. నాకు, నా చేతి భుజం మీద ఆ మచ్చ ఇంకా వుంది. ఇప్పుడైతే స్మాల్ పాక్స్ పూర్తిగా మాయమైంది. చిన్నతనంలోనే టీకాలు వేయడంతో క్రమేపీ అది నిర్మూలించబడింది. కలరా కూడా ఎప్పుడో అప్పుడు కలుషిత నీరు తాగడం వల్ల కొందరికి వస్తున్నా, దాదాపు నిర్మూలించబడినట్లే.

          ఒక్కసారి చిన్నతనం రోజులు, ఇప్పటి రోజులు తలచుకుని పోల్చి చూసుకుంటే, ఎంత అభివృద్ధి చెందామో అర్థమవుతుంది. మా వూరికి ఇప్పుడు విద్యుత్ సరఫరా వుంది. ఖమ్మం నుంచి రావడానికి-పోవడానికి చక్కటి డబుల్ రోడ్ డాంబర్ రహదారి వుంది. దానిపై అన్ని వేళలా తిరగడానికి ప్రభుత్వ బస్సులున్నాయి. 24 గంటలు అందుబాటులో 108 అంబులెన్స్ వుంది. సాగర్ నీళ్లు వచ్చి గ్రామంలోని మూడొంతుల భూమి సస్యశ్యామలం అయింది. ఒకనాడు ఒకరిద్దరు క్వాలిఫైడ్ డాక్టర్లు మాత్రమే వున్న ఖమ్మంలో వందలాది మంది అయ్యారిప్పుడు. మా వూళ్లో ఒక పెట్రోల్ బంక్ కూడా వచ్చిందిప్పుడు. కనీసం పది మందికన్నా కార్లు, ఏబై వరకు ఇతర వాహనాలు వున్నాయి. ఫోన్ లేని ఇల్లు, మొబైల్ వాడని వ్యక్తి మా వూళ్లో కనిపించవు. చింతకాని వెళ్లే మార్గ మద్యంలో వున్న ఏరు మీద వంతెన కట్టుతున్నారు. మా వూరి నుంచి సరాసరి ఖమ్మం పోయే దారిలో ఖమ్మం సమీపంలో ఏటిపైన మరో వంతెన కట్తున్నారు. నడకతో కొన్నాళ్లు, సైకిల్ పైన కొన్నాళ్లు, ఎడ్ల బండిపైన కొన్నాళ్లు, ప్రయివేట్ బస్సుపైన కొన్నాళ్లు, స్కూటర్ మీద ప్రయాణం చేసి కొన్నాళ్లు ఖమ్మం-మా వూరి మధ్యన తిరిగిన మేం, ఇప్పుడు సరాసరి హైదరాబాద్ నుంచి ఉదయం బయల్దేరి కారులో మా వూరికి వెళ్లి, కొన్ని గంటలక్కడ గడిపి, రాత్రి కల్లా హైదరాబాద్ చేరుకో గలుగుతున్నాం. ఎడ్ల బండిలో ప్రయాణం చేసిన నేను విమానాలలో తిరుగుతున్నాను. ఆర్.ఎం.పి డాక్టర్ చికిత్సకే పరిమితమైన మేం ఇప్పుడు సూపర్ స్పెషలిస్ట్ వైద్యం చేయించుకుంటున్నాం. పలకా-బలపం పట్టిన నేను కంప్యూటర్ ను ఉపయోగిస్తున్నాను. ఇంతకంటే అభివృద్ధి ఏం కావాలి?-End

2 comments:

  1. It is very interesting sir. Why don't you write about your College Days?

    ReplyDelete
  2. Thank You.
    I have just completed my childhood and school days. I will now start from my PUC college days.

    ReplyDelete