Tuesday, June 11, 2013

నానమ్మ వనం కనకమ్మగారి నుంచి మనుమరాలు కనక్ వనం వరకు-Part THREE: వనం జ్వాలా నరసింహారావు

నానమ్మ వనం కనకమ్మగారి నుంచి
మనుమరాలు కనక్ వనం వరకు-Part THREE
వనం జ్వాలా నరసింహారావు

మేం హ్యూస్టన్ కు పోయే ముందర ఒప్పందం ప్రకారం, పాపాయి పుట్టిన నెల రోజుల లోపు శాన్ ఫ్రాన్ సిస్కోకు వచ్చి, కనీసం పది రోజుల పాటుండి, బారసాల చేయించి వెళ్ళాలని. బారసాల నెల రోజుల లోపు జరిపించలేక పోతే, మళ్ళీ మూడో నెల వచ్చిందాక ఆగాలి. పదకొండో రోజు కార్యక్రమం ముగిసిన వెంటనే, పారుల్ నాన్నగారు ఢిల్లీ వెళ్లి పోయారు. నేను-మా శ్రీమతి డిసెంబర్ 18, 2009 న శాన్ ఫ్రాన్ సిస్కో చేరుకున్నాం. బారసాల ప్రయత్నాలు ప్రారంభించాం.

దీనిని అసలు "బాల సారె" అంటారు. అది వాడుకలోకి వచ్చే సరికి "బారసాల" అయింది. అసలు బారసాల అంటే పేరు పెట్టడం లేదా నామకరణం చేయటం అని అర్థం. ఈ వేడుకను పుట్టిన పాపాయికి (బాబు అయితే బాబుకు) పేరు పెట్టటానికి చేస్తారు. వాడుకలో వున్న పద్ధతి ప్రకారం, పుట్టిన 21వ రోజు నుండి 27 వ రోజు లోపల చేస్తారు. ఈ రోజులలో 21, 23, 25, 27 రోజులలో చాలా మంది చేస్తారు. అలానే బేసి సంఖ్యలు వచ్చే ఏ రోజైనా మంచిరోజు చూసుకొని చేసుకోవచ్చు. నెలలోపల చేసుకునే వీలు లేకపోతే, మూడో నెల వచ్చిన తర్వాత చేసుకుంటారు. మేం హ్యూస్టన్ లో వుండడం వల్ల 21వ నాడు (డిసెంబర్ 14, 2009) చేయడం వీలుపడలేదు. ఆ తర్వాత నాలుగైదు రోజుల వరకు, ఆదిత్య లండన్ వెళ్లినందున, వీలు కాలేదు. చివరకు మంచిరోజు 27 వ రోజున (డిసెంబర్ 20, 2009) కుదిరింది. మేం హ్యూస్టన్ నుంచి శాన్ ఫ్రాన్ సిస్కోకు వచ్చిన నాడే ఆదిత్య లండన్ నుంచి శాన్ ఫ్రాన్ సిస్కోకు చేరుకున్నాడు.

మేం హ్యూస్టన్ లో వున్నప్పుడు, శాన్ ఫ్రాన్ సిస్కోలో వున్న, మా ఆవిడ కజిన్ (స్వర్గీయ అయితరాజు శేషగిరి రావు గారి కుమారుడు) సురేష్ ను సంప్రదించాం. ఆదిత్యకు అమెరికా ఇంకా కొంచెం కొత్తైనందున, పూజ చేయించేందుకు తగిన బ్రాహ్మణుడిని వెతికే బాధ్యతను సురేష్ కు అప్పగించాం. నిజంగా అతడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. అన్ని విషయాలు అతడే మాట్లాడాడు. ఖమ్మం జిల్లా-కొత్తగూడెం నుంచి వచ్చిన బ్రహ్మ శ్రీ మార్తి వెంకటేశ్వర శాస్త్రి గారు స్థానిక సత్యనారాయణ స్వామి గుడిని నిర్వహిస్తున్నారు. గొప్ప పండితుడన్న పేరుంది. ఆయనిక్కడ కొచ్చి స్థిర పడిన తర్వాత, ఆంధ్ర ప్రదేశ్ నుంచి, అనేకమంది బ్రాహ్మణులను రెలిజియస్ కోటా కింద అమెరికాలోని పలు ప్రదేశాల్లో వున్న దేవాలయాలకు రప్పించి, ఎంతో మందికి సహాయం చేశాడన్న పేరుంది. ఉదాహరణకు సియాటిల్ దేవాలయంలో పనిచేస్తున్న సంస్కృత పండితుడు-పూజారి దీక్షితులు గారు. ఆయనే పండితుడని ఇండియాలో వున్నప్పుడే నాకు తెలుసు. ఆయన్నడిగితే, మార్తి శాస్త్రిగారు తన "గురువు" అని చెప్పాడు.

శాస్త్రి గారు పంపిన మెయిల్ ప్రకారం బారసాల-నామకరణం-సత్యనారాయణ వ్రతానికి కావలసిన వస్తువులు: పసుపు, కుంకుమ, తమలపాకులు, పోకచెక్కలు, ఖర్జూరపు పండ్లు, అగరు వత్తులు, హారతి కర్పూరం, అరటి పండ్లు, పూలు, కొబ్బరికాయలు-ఇవి పగులగొట్టే సౌకర్యం, ఎండు కొబ్బరి చిప్పలు, కొత్త తుండు గుడ్డ, కొత్త రవికె గుడ్డ, తేనె, పెరుగు, పాలు, నెయ్యి, పంచదారల మిశ్రమమైన పంచామృతం, సత్యనారాయణ స్వామి ఫొటో, తగు మోతాదులో కేసరి ప్రసాదం, బియ్యపు రవ్వ-అందులో కలిపేందుకు పంచదార, వేలకులు, జీడి పప్పు, కిస్మిస్ పండ్లు, దీపారాధనకు కావాల్సిన (దూది, నూనె, అగ్గిపెట్టె) సామాగ్రి, కొబ్బరి కాయనుంచే వీలున్న వెండి-రాగి-సిల్వర్ పాత్ర (చెంబు), పావలా బిళ్లలు (సెంట్లు), రెండు-మూడు కిలోల బియ్యం.

వాస్తవానికి మా శ్రీమతికి ఇలాంటి వాటిల్లో అనుభవం-మా నాన్న వారసత్వంగా అబ్బింది. అదృష్ట వశాత్తు కోడలు పారుల్ కూడా పూజా-పునస్కారాల మీద శ్రద్ధ కనబరచడం వల్ల, మా ఆవిడ క్రమంగా "తనకు సంక్రమించిన వారసత్వాన్ని" ఆమెకు అప్పచెప్తోంది. ఆ నాడు శాస్త్రిగారు చెప్పిన సామాగ్రంతా మా ఆవిడకు తెల్సిందే. అందులో తొంబై శాతం వస్తువులను హైదరాబాద్ నుంచే పట్టుకొచ్చింది.

తెలుగు వారి ప్రత్యేకత-ఆ మాటకొస్తే భారతీయులందరి ప్రత్యేకత, వారి పేరులోనే వుంటుందనాలి. అదేం టోగాని, చాలామంది విషయంలో, తెలుగు వారి-భారతీయుల పేర్లు, వారి పేరును పట్టి, కొత్తగా పరిచయమైన వారు, సర్వసాధారణంగా ఒక అవగాహనకు వచ్చే విధంగా వుంటాయి . అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఆ పేరును వారు పుట్టిన 21 వ రోజున, తల్లి పక్కనుండగా, బంధు-మిత్రుల సమక్షంలో, శాస్త్రోక్తంగా జరుపుకునే ఒక వేడుకలో, తండ్రి పెడ్తాడు. అయితే, అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారు-ఇతర భారతీయులు, ఆ దేశ చట్ట నిబంధనల ప్రకారం, పాపైనా-బాబైనా పుట్టిన మూడు రోజుల లోపు, ఆసుపత్రి రిజిస్టర్ లో నమోదయ్యే విధంగా పేరు రాయడం విధిగా చెయ్యాలి. దానికి అనుగుణంగానే, పారుల్-ఆదిత్యలు మా మనుమరాలి పేరును "కనక్ వనం" అని పెట్టారు. నిబంధనలకు అనుగుణంగా, పుట్టిన తమ పిల్లలకు వెంటనే పేరు పెట్టినా, ఆ పేరును ఆనవాయితీగా ఆచరిస్తున్న పద్ధతుల ప్రకారం, బారసాల జరుపుకొని, "నామకరణం" ప్రక్రియ పూర్తిచేయని తెలుగు వారు గానీ, భారతీయులు గానీ వుండరు. అదో ఆచారం-వేడుక-సరదా-సామాజిక కలయిక. పేరు వ్యక్తులను గుర్తించేందుకు ఉపయోగించే ఒక నామ వాచకము. వ్యక్తులను ప్రత్యేకంగా గుర్తించడానికి లేదా వారి పూర్వీకుల గురించి తెలుసుకోవటానికి పేరుతో పాటు ఇంటి పేరు కూడా ఉంటుంది. ఆచారం ప్రకారం ఆదిత్య-పారుల్ దంపతులు కూడా అలానే జరుపుకున్నారు.


బారసాల నాడు పెట్టిన పేరే ఆ మనిషి పేరులా చెలామణి అవుతుంది. తమ పేర్లు రాసుకునేటప్పుడైనా, చెప్పేటప్పుడైనా భారతీయులందరూ ఒకేవిధంగా వ్యవహరించరు. ఒక్కొక్కరు ఒక్కొక్కరి సంప్రదాయాన్ని పాటిస్తారు. బారసాల నాడు పెట్టిన పేరు మొదట, ఇంటి పేరు తరువాత వచ్చేలా కొన్ని ప్రాంతాల వారు, ఇంటి పేరు మొదట, తరువాత బారసాల నాడు పెట్టిన పేరు వచ్చేలా మరికొన్ని ప్రాంతాల వారు పాటిస్తారు. సాధారణంగా ఏ ప్రాంతం వారికైనా ఇంటి పేరు తరతరాలుగా మారకుండా వుండి, వారి యొక్క వంశ నామంగా వుంటుంది. తెలుగు వారు సంప్రదాయం ప్రకారం బారసాల నాడు పెట్టిన పేరు ముందర ఇంటి పేరు తగిలించకుండా తమ పేరు చెప్పుకోరు. ఈ మధ్య కాలంలో తెలుగు వారి ఇంటి పేరు సంప్రదాయం, క్రమ క్రమంగా మార్పుకు యువతరం నాంది పలుకుతుంది అనుకోవచ్చు. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలుగు వారు, "ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా..." అన్న నా నుడిని పేరు చెప్పుకునే విషయంలో కొంచెం సడలించి, "బి ఎ రోమన్ వైల్ ఇన్ రోమ్" సంప్రదాయాన్ని పాటించడం నేర్చుకున్నారు. అమెరికా దరఖాస్తు పత్రాలలో  ఫస్ట్ నేమ్ అని, మిడిల్ నేమ్ అని, లాస్ట్ నేమ్ అని, పుంఖాను పుంఖంగా ప్రశ్నలు ఉంటాయి. ఒక్కోసారి సర్ నేమ్ ఏమిటని మరో ప్రశ్న వేస్తారు. ఈ బాధలు తప్పించుకోవడానికి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలుగు వారందరు కూడా వారి పద్ధతినే అనుకరిస్తున్నారు. తప్పదు కదా మరి !. దేశ-కాల మాన పరిస్థితులను బట్టి మారడం మంచిదే కదా !

మంత్రోచ్ఛారణల మధ్య, పురోహితుడుగా-పూజారిగా బారసాల-నామకరణం జరిపించాడానికొచ్చిన బ్రహ్మ శ్రీ మార్తి వెంకటేశ్వర శాస్త్రి గారు-ఆయన వెంట వచ్చిన మరో ముగ్గురు ఔత్సాహిక శిష్య బృందం, మొదట విఘ్నేశ్వరుడి పూజ చేయించారు. విఘ్నేశ్వరుడి పూజకంటే ముందు, పురుడు అయిపోయిన వెంటనే, శాస్త్రం ప్రకారం జీర్ణ యజ్ఞోపవీతాన్ని తీసివేసి-దాని స్థానంలో నూతన యజ్ఞోపవీతాన్ని ఆదిత్యతో ధరింప చేసే కార్యక్రమాన్ని జరిపించారు. తరువాత పుణ్యాహవాచనం (శుద్ధి) కార్యక్రమం జరిపించారు. తరువాత నామకరణం చేయించారు. పేరు అనేది ఎవరైనా జన్మ నక్షత్రం ఆధారంగా పెట్తారు. అయితే, అదనంగా, వ్యవహారిక నామంగా, తమకు ఇష్టమైన పేరు పెడతారు. కాని నక్షత్రం ప్రకారం పెడితేనే మంచిది. ఏ నక్షత్రానికి ఏ అక్షరాలు అనేవి శాస్త్రంలో చెప్పబడే వున్నాయి. మా మనుమరాలిది ధనిష్ట నక్షత్రం కాబట్టి గా-గీ-గూ-గే అక్షరాలు వచ్చే విధంగా నామకరణం చేయించారు శాస్త్రి గారు. 

పాపైనా-బాబైనా, పిల్లలకు పెట్టవలసిన పేర్లకు సంబంధించిన నియమాలను గృహ్య సూత్రాలు పేర్కొన్నాయి. పరాశర గృహ్య సూత్రాల ప్రకారం పేరు రెండు లేక నాలుగు అక్షరాల పొడవుండి హ్రస్వ అచ్చుతో కూడిన హల్లుతో మొదలై చివర్లో దీర్ఘం కానీ విసర్గం కానీ ఉండాలి. వేర్వేరు గృహ్య సూత్రాల్లో ఈ నియమాలు వేర్వేరుగా ఉన్నాయి. పేరు పెట్టడానికి నాలుగు పద్ధతులున్నాయి. మొదటిది: జన్మ నక్షత్రాన్ని బట్టి; రెండోది: పుట్టిన నెల/రాశ్యధిపతిని బట్టి; మూడోది: ఇలవేల్పుని బట్టి; నాలుగోది అందరూ పిలిచే పేరును బట్టి. చివరి పద్ధతి కుటుంబ సంప్రదాయాన్ని బట్టి, విద్యా స్థాయిని బట్టి ఉంటుంది. ఇవన్నీ సాధ్యమైనంత వరకు, పరిగణలోకి తీసుకుని, మా మనుమరాలి పేరును, దాని తల్లి-తండ్రులు, పారుల్-ఆదిత్య దంపతులు "వెంకట నాగ సత్యసాయి సంతోషి రాధ కామాక్షి గున్జన్ గోదా దేవి కనక్ వనం" అని నిర్ణయించి, అలానే వెండి పళ్ళెంలో పోసిన బియ్యంపై ఆదిత్యతో రాయించారు శాస్త్రి గారు. ఆ విధంగా, యాదృచ్చికంగానే, పంతొమ్మిదవ శతాబ్దపు "వనం కనకమ్మ" గారి పేరును (మా బామ్మ గారి పేరు-మా నాన్నకిష్టమైన పేరు), ఇరవై ఒకటో శతాబ్దంలో అమెరికాలో పుట్టిన మా మనుమరాలికి "కనక్ వనం" గా పెట్టాడు అలనాటి మా పూర్వీకుడు "వనం కృష్ణ రాయలు" పేరు పెట్టుకున్న మా "ఆదిత్య కృష్ణ రాయ్ వనం".

నామకరణం తంతు ముగిసిన తర్వాత, కటి సూత్ర ధారణ అంటే మొలతాడు కట్టే కార్యక్రమం కూడా జరిపించారు. పసుపు రంగు పులిమిన దారంతో తయారుచేసిన మొలతాడును పాపాయి మొలకు, బామ్మ గారితో కట్టించారు. బంగారపు వుంగరాన్ని తేనెలో ముంచి, మొదలు తండ్రితో, తర్వాత తల్లితో, ఆ తర్వాత అమ్మమ్మ-బామ్మ-తాతయ్యలతో-ఇతర పెద్దలతో, పాపాయి నోట్లో వుంచే కార్యక్రమాన్ని కూడా జరిపించారు శాస్త్రి గారు. 

తరువాత భాగం మరో సారి...



No comments:

Post a Comment