నానమ్మ
వనం కనకమ్మగారి నుంచి
మనుమరాలు
కనక్ వనం వరకు-Part FOUR:
వనం
జ్వాలా నరసింహారావు
సాధారణంగా ఫలానా వారికి ఫలానా ఇంటి పేరుండడానికి ఏదో
ఒక నేపధ్యం వుంటుందంటారు.
వుండాలని లేదు కూడా. ఇంటి పేరు గ్రామనామమో,
ఏదో ఒక శరీర అవయవమో, జంతువుల పేరో, పక్షుల పేరో, పూల పేరో, తిను
పదార్థాల పేరో, వస్తువుల పేరో, వేదాల
పేరో, వృత్తుల పేరో, ప్రకృతి సంబంధమైన
పేరో, వృక్షాల పేరో, నదుల పేరో,
ఇలాంటి మరింకేదో వుంటుంది. మా ఇంటి పేరు "వనం" అంటే అడవి లేదా తోట లేదా అలాంటిదే మరో
ప్రకృతి సంబంధమైందేదైనా కావచ్చు. లోగడ కొందరు మాత్రమే ఇంటి
పేరుగా వాడుకునే కులాలను, ఇటీవల కాలంలో "ఒక హక్కు" లాగా పలువురు ఉపయోగించుకుంటున్నారు.
ఎవరెన్ని చెప్పినా, కుల-గోత్ర-నామాలు, ఎందరు ఒప్పుకున్నా-ఒప్పుకోక
పోయినా మన సంస్కృతీ సంప్రదాయంలో చెరిపినా చెరగని అంతర్భాగాలు. తర-తరాల కుటుంబ నేపధ్యం, భావి
తరాల వారికి తెలియచేయడానికి, మన గురించి మనం అర్థం
చేసుకోవడానికి, ఈ కుల-గోత్ర-నామాలు వాడుకుంటే తప్పులేదు కాని, ఆ పేరుతో కులతత్వం-మతతత్వం-ప్రాంతీయ తత్వం, లేదా,
మన సంస్కృతి గొప్ప-ఇతరుల సంస్కృతి తక్కువ అనే
భావాలను రెచ్చగొడితే అంతకంటే ఘోరమైన పాపం మరింకోటి లేదు.
ఇంటి పేరుకు ఒకరకమైన నేపధ్యముంటే, వ్యవహారిక నామానికి
కూడా మరో రకమైన నేపధ్యముంటుంది. ఒక తరంలో ఒక వ్యక్తికున్న పేరు, వారి మనుమల-మనుమరాళ్ల తరం వచ్చేసరికి ఎవరికో ఒకరికి పెట్టుకోవడం ఆనవాయితీ.
తాతగారి పేరు మనుమడికి, అమ్మమ్మ-బామ్మ గార్ల పేర్లు
మనుమరాళ్లకు కొన్నేళ్ళ క్రితం వరకు యథాతధంగా పెట్టుకునేవారు. ఇప్పటికీ ఆ ఆచారం
కొనసాగుతున్నా, కొంచెం ఆధునీకరించి పెట్టుకుంటున్నారు.
ఉదాహరణకు, మా తమ్ముడికి మా నాన్నగారి తాతగారి పేరే పెట్టారు.
మా అక్క గారికి మా నాన్న సవతి తల్లి పేరు పెట్టారు. మా ఇంకో తమ్ముడికి (దత్తత
పోయినతనికి) మా నాన్న బాబాయి గారి పేరు పెట్టారు. ఇలా పేర్లు పెట్టుకోవడం ఒక
"పరంపర" గా కొనసాగుతుంటుంది. అసలు దీని మూలాలు మన గోత్రాల్లో-ఋషుల్లో
వున్నాయంటారు.
గోత్రం అంటే, వంశ
పరంపరను తెలియచేసే రహస్యం లాంటిదనవచ్చు. బ్రాహ్మణుల్లో,
పితృ-పితామహ-ప్రపితామహ...అంతకంటే తెలిసి నన్ని తరాల పూర్వీకులతో పాటు, వంశం
ఎక్కడనుంచి ఆరంభమయిందో వారి గోత్రాన్ని బట్టి కొంతవరకు తెలుసుకోవచ్చు. ప్రతి గోత్రం ఒక మహర్షి పేరుతో వుంటుంది. వంశ పరంపర
గురించి వివరించేటప్పుడు, మొదటగా ఏ మహర్షి పేరుమీద గోత్రం
వుందో, ఆయన పేరు చెపుతారు. తర్వాత
ప్రవర చెప్పాలి. ప్రవరంటే, గోత్రానికి
ఆద్యుడైన ఋషి పేరు, ఆ ఋషి కుమారుడి పేరు, ఆయన కుమారుడి పేరు (కొంత మందికి ముగ్గురి తో ఆపగా,
మరికొంతమంది ఏడుగురి వరకూ చెప్పాలి) చెప్పి,
ఫలానా వాడి పౌత్రుడని, పుత్రుడని చెప్పుతారు.
బ్రాహ్మణులు వివిధ వర్గాలుగా గుర్తింపు పొందడానికి బహుశా ఇదొక
ఏర్పాటు కూడా కావచ్చు. మొట్ట మొదటిసారి గోత్రం అన్న పదాన్ని
ఎప్పుడు వాడిందో ఇదమిద్ధంగా తెలవక పోయినా, క్రీస్తు పూర్వం
నాలుగో శతాబ్దానికల్లా, అలనాటి మారుతున్న సామాజిక నియమ
నిబంధనలు-చట్టాలు, గోత్రం చెప్పుకునే
పద్ధతిని స్థిరపర్చాయని అంటారు. దరిమిలా ఆ వ్యవస్థ వేళ్లూనుకోసాగింది. గోత్రాల పుట్టుక సప్తర్షుల ఆవిర్భావంతో ముడిపడిందంటారు. అయితే ఆ సప్తర్షులు ఒక్కో మన్వంతరంలో, ఒక్కో పేర్లతో
వ్యవహరిస్తుండవచ్చు. వైవస్వత మన్వంతరంలో బ్రహ్మ మానస
పుత్రులైన మరీచి, అత్రి, అంగీరస,
పులస్థియ, పులహ, క్రతు,
వశిష్ట మహర్షులను సప్తర్షులనేవారట. అలానే, మరో
నమ్మకం ప్రకారం, విశ్వామిత్ర, జమదగ్ని,
భరద్వాజ, గౌతమ, అత్రి,
వశిష్ట, కశ్యప, అగస్త్య
అనే ఎనిమిదిమంది మహర్షుల సంతతిని-వంశ పరంపరను తెలిపే గోత్రాల
పేర్లుగా పెట్టారంటారు.
మా గోత్రం "పరాశర". ఋషులు
"వశిష్ట-శక్తి-పరాశర".
వశిష్ట మహర్షి హిందూ పురాణాలలో ఒక గొప్ప యోగి. బ్రహ్మ సంకల్ప బలంతో జన్మించాడు. అందరు మహర్షుల వలె
ఈయన ఒంటరి వాడు కాదు. ఈయనకు పరమ పతివ్రత-పతిభక్తి పరాయణురాలైన అరుంధతితో వివాహమైంది. వీరికి కలిగిన చాలా మంది
కుమారులలో "శక్తి" జేష్టుడు. పరాశరుడు వశిష్టుడి మనుమడు. శక్తి పుత్రుడు. ఇతని తల్లి
అదృశ్యంతి. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న వారికి,
వివాహ సమయంలో ఆచరించే సంప్రదాయాలలో మహా పతివ్రత అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ఒకటి. పరాశరుడు
తాతగారైన వశిష్టుడి దగ్గర పెరిగాడు. పరాశరుడు ఒకనాడు తీర్థ యాత్రకు పోతూ, యమునా
నదిలో పడవ నడుపుతున్న మత్స్య గంధి-సత్యవతిని చూసి-మోహించి, ఆమెతో
సంగమించాడు. అలా వారి సంగమం కారణంగా యమునా నదిలో ఒక ద్వీపంలో ఆమె సద్యోగర్భాన (కన్యాత్వం
చెడకుండా) జన్మించిన కొడుకే కృష్ణ ద్వైపాయనుడు లేదా వ్యాసుడు. ఆ పరాశరుడి వంశ
క్రమంలో వాళ్లే వనం వారు.
వనం వారి వంశంలో పూర్వీకుడు వనం
కృష్ణరాయలు గారైనప్పటికీ, నా దగ్గరున్న సమాచారం ప్రకారం, ఏడు తరాల వాళ్ల పేర్లు మాత్రమే అందుబాటులో వున్నాయి. మొదటి తరం "వనం
శేషయ్య" గారు. ఆయనొక జ్యోతిష్య శాస్త్ర పండితుడు. ఆయన భార్య పేరు వెంకట
రామమ్మ గారు. ఈ ఇరువురి దంపతులకు "నర్సింహారావు" గారు (ధర్మపత్ని సీతమ్మ
గారు), "నరహరి రావు" గారు (ధర్మపత్ని
లక్ష్మీ కాంతమ్మ గారు) కుమారులు. నర్సింహారావు గారికి పురుష సంతానం లేనందున
సోదరుడి కుమారుడు వెంకటప్పారావు గారిని దత్తత తీసుకున్నారు. నరహరి రావు గారికి
ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె కలిగారు. పెద్ద కుమారుడి
పేరు వెంకట చలపతి రావు (ధర్మపత్ని వెంకటరామ నర్సమ్మ), రెండవ
కుమారుడి పేరు వెంకట రంగారావు (ధర్మపత్ని కనకమ్మ గారు), మూడవ
కుమారుడి పేరు వెంకట అప్పారావు (ధర్మ పత్ని చిన వెంకట రామ
నర్సమ్మ). రెండవ కుమారుడైన వెంకట రంగారావు గారి ఏకైక
కుమారుడు మా నాన్న గారైన వనం శ్రీనివాస రావు గారు. మా అమ్మ గారి పేరు వనం సుశీల.
మేం ఐదుగురం అన్నదమ్ములం. ముగ్గురు అక్క చెల్లెళ్లున్నారు. మా పేర్లు: అక్క
రాధమ్మ-భర్త స్వర్గీయ ముదిగొండ వెంకట చలపతిరావు, నేను-భార్య
విజయలక్ష్మి, తమ్ముడు వెంకట ప్రసాద్-భార్య ఇందిరా దేవి
(వెంకటప్పారావు-చిన వెంకటరామ నర్సమ్మ దంపతులకు దత్తత ఇచ్చారు), మరో తమ్ముడు నరహరి రావు-భార్య ఇందిరా దేవి, ఇంకో
తమ్ముడు స్వర్గీయ శ్రీనాథ్-భార్య జ్యోతిర్మయి, చెల్లెలు
ఇందిర-భర్త కందిబండ నరసింహారావు, మరో తమ్ముడు శ్రీరామచంద్ర
మూర్తి-భార్య రుద్రాణి, చివరగా చెల్లెలు కృష్ణవేణి-భర్త
శ్రీనివాసరావు. నాకు ముగ్గురు సంతానం. పెద్ద అమ్మాయి ప్రేమ మాలిని-భర్త మండపాక
విజయ గోపాల్, రెండో అమ్మాయి కిన్నెర-భర్త కొణికి వెంకట శ్రీ
కిషన్, అబ్బాయి ఆదిత్య-భార్య పారుల్. పెద్ద అమ్మాయికి ఒక
కూతురు (మిహిర), కిన్నెరకు ఇద్దరు పిల్లలు (యష్విన్, మేధ), అబ్బాయికి ఇద్దరు పిల్లలు (అన్ష్, కనక్). అంటే...."వనం
శేషయ్య" గారి దగ్గర మొదట తరం మొదలై, వనం నరహరి రావు గారు, వనం వెంకట రంగారావు గారు,
వనం శ్రీనివాస రావు గారు, వనం జ్వాలా నరసింహా
రావు, ఆదిత్య కృష్ణ రాయ్, ఏడవ తరం
అన్ష్ వనం.....ఇలా కొనసాగుతోంది. దీన్నే వంశ క్రమం అని కూడా
అంటారు.
సత్యనారాయణ స్వామి వ్రతాన్ని, తెలుగునాట
ఇంటింటా, వీలున్నప్పుడల్లా చేసుకునేవారు ఎందరో వున్నారు.
ఫలానా మాసంలో, ఫలానా తిథి నాడు, ఫలానా
సమయంలో ఈ వ్రతం చేసుకుంటే మంచిదని పురాణాల్లో చెప్పినప్పటికీ, ఎప్పుడైనా-ఎన్నడైనా-ఎక్కడైనా, వీలుంటే మంచిరోజొక్కటి
మాత్రం చూసుకొని వ్రతం చేసుకోవచ్చని పండితులు చెపుతుంటారు. శుభకార్యాలలో చేయటం నేడు
ఆచారంగా వస్తున్నది. తెలుగువారింట్లో, ఏ శుభ కార్యం (వివాహం, గృహ ప్రవేశం, బారసాల, పుట్టిన రోజు, పెళ్లి
రోజు, షష్టిపూర్తి, ప్రమోషన్, కొత్త ఉద్యోగం రావడం లాంటివి) జరిగినా-శుభ వార్త విన్నా, సత్యనారాయణ వ్రతం జరుపుకోవడం ఆచారం.
అయితే, ఈ వ్రతాన్ని సాధారణంగా, వైశాఖ మాసంలో గానీ,
మాఘ మాసంలో గానీ, కార్తీక మాసంలో గానీ
ఏకాదశి-పౌర్ణమి, మకర సంక్రాంతి లాంటి శుభదినాల్లో కానీ చేసుకుంటారు చాలామంది. ఈ వ్రతాన్ని నెలకు ఒక సారి
కానీ , సంవత్సరానికి ఒక సారి కానీ చేసుకునేవారు కూడా
వున్నారు. మా వరకు మేం వీలున్నప్పుడల్లా చేసుకుంటూనే వున్నా. మా పిల్లలు కూడా మా
పద్ధతినే అనుసరిస్తున్నారు ఇప్పటివరకు. మా మనుమరాలి బారసాల సందర్భంగా
ఆదిత్య-పారుల్ దంపతులు కూడా సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు.
ఆదిత్య వాళ్లుంటున్న లిక్మిల్ రోడ్ లోని
అపార్ట్ మెంట్స్ లో, ముందున్న లివింగ్ రూమ్ లో,
తూర్పు దిక్కుగా అనువుగా వున్న ప్రదేశంలో ఒక ఆసనం (వ్రతం పీట) లాంటిది వేసి, దానిపై
కొత్త వస్త్రం (తెల్ల టవల్) పరిచి,
దానిమీద బియ్యం పోసి, దాని మధ్యలో కలశం (వెండిది) ఉంచి, దాని మీద ఇంకో కొత్త వస్త్రం (జాకెట్ గుడ్డ) ఉంచ బడింది. ఆ వస్త్రం మీద సత్యనారాయణ స్వామి ప్రతిమనుంచి,
వెనుక ఫొటోను పెట్టాం. కలశం మీద వుంచేముందర ప్రతిమను పంచామృతములతో
అభిషేకింప చేశారు పూజారి. ఆ మండపంలో బ్రహ్మాది పంచలోక పాలకులను, నవ గ్రహాలను, అష్ట దిక్పాలకులను ఆవాహన చేసి పూజించడం
జరిపించారు ఆ తర్వాత. తరువాత కలశంలో స్వామివారిని ఆవాహన చేసి పూజించే కార్యక్రమం
జరిపించి, పూజానంతరం సత్యనారాయణ స్వామి కథ వినిపించి,
ప్రసాదాన్ని పంచారు శాస్త్రిగారు. కథని అయిదు అధ్యాయాలలో చెప్పడం
జరిగింది .ఒకో అధ్యాయం ముగియగానే అరటిపండు నైవేద్యం పెట్టి ,
కర్పూర హారతి ఇచ్చి రెండవ అధ్యాయం మొదలు పెట్టారు. చివరికి రవ్వతో చేసిన ప్రసాదం నివేదన
చేయించారు. చివరలో మంగళ హారతి కార్యక్రమం, అమ్మాయి
తల్లిదండ్రులు అల్లుడికి, కూతురికి, పాపాయికి
బట్టలు- ఆభరణాలు పెట్టే తంతు జరిగింది. సాంప్రదాయం ప్రకారం ఆహ్వానితులకు
పండు-తాంబూలం, భోజనం పెట్టడం యథావిధిగా జరిపించారు
ఆదిత్య-పారుల్, వాళ్లతో పాటు మా శ్రీమతి, పారుల్ అమ్మ గారు.
ఇదే రోజున పాపాయిని ఉయ్యాలలో వేయడం, బావిలో చేద వేయడం అనే కార్యక్రమాలను
కూడా చేస్తారు. ఉయ్యాలయితే వుంది గాని, బావి
సౌకర్యం అమెరికాలో వుండదు కదా ! అయినా వేడుక వేడుకే. అదే మన వాళ్లకు ఆనందం.
వున్న దాంట్లో సర్దుకుపోవడంలో మరీ ఆనందం మనవాళ్లకి. ఉయ్యాలలో వేయడం
అంటే పాపాయిని ఉయ్యాలలో వెయ్యాలి కాబట్టి సాంప్రదాయంగా పదకొండో రోజున మొదలు
పెడతారు కొంత మంది. మరికొందరు, ఆ రోజున అసలే చేయకుండా 21 వ రోజున కానీ
బారసాల జరుపుకున్న రోజున కానీ చేస్తారు. కొందరు అప్పుడు-ఇప్పుడూ
చేస్తారు. ఇవ్వాళ-రేపు పిల్లలు పుట్టగానే, ఆసుపత్రుల్లో ఎలాగూ ఉయ్యాల్లో
వేస్తున్నారు కాబట్టి, ఈ కార్యక్రమం కేవలం వేడుకే అనాలి.
ఇక ఆ రోజున మిగిలిన మరో కార్యక్రమం బావిలో చేద వేయటం. బావిలో చేద వేయటం అంటే అంత వరకు ఆ అమ్మాయి
(బాలింత-పాపాయి తల్లి) పనులేమి చేయదు కనుక ఆ రోజున బావిలో చేద వేయించి ఆమె అన్నీ
పనులు చేయ వచ్చు అని చెప్పటం కోసం అన్న మాట. ఇదంతా
సైన్స్ ప్రకారమే జరుగుతుందనాలి ఒక విధంగా. ఆ కార్యక్రమాన్నీ జరిపించారు
అమ్మమ్మ-బామ్మలు పాపాయి వాళ్ల అమ్మతో.
కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత, శాస్త్రోక్తంగా, అంతా జరిపించిన బ్రాహ్మణుడిని శక్తి మేరకు సత్కరించడం మన ఆచారాల్లో అతి
ముఖ్యమైంది. బారసాల-నామకరణం-సత్యనారాయణ వ్రతం జరిపించడానికి ఏమివ్వమంటారని సురేష్
ద్వారా అడిగించి నప్పుడు, తన వరకు తనకు వారే దక్షిన
ఇవ్వదల్చుకుంటె అదివ్వొచ్చని, దేవాలయానికి మాత్రం $ 250 విరాళంగా
ఇవ్వమని కోరారు మార్తి వెంకటేశ్వర శాస్త్రి గారు. అమెరికాలో వుంటూ ఇలా నిరాడంబరంగా
వుండడం మమ్మల్నాశ్చర్య పరిచింది. ఆయనే స్వయంగా తన శిష్య బృందంతో తన కారులో వచ్చి
పూజ జరిపించి, మా శక్తికొలది ఇచ్చింది స్వీకరించి, ఆదిత్య-పారుల్ దంపతులను ఆశీర్వదించి వెళ్లారు.
Turlapati Sambasivarao: excellent narration and educarive information.nice article
ReplyDeleteవనం వారి వంశం http://www.elgar.org/2famtree.htm పద్దతిలో ప్రచురిస్తే బాగుంటుంది.
ReplyDeleteజూపూడి హనుమంత రావు
I agree with Jupudi H Rao
ReplyDelete