Monday, December 5, 2016

సీతను కనుగొన్న వీరహనుమాన్ ..... ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు 21 వ భాగం - సుందర కాండ : వనం జ్వాలా నరసింహా రావు

సీతను కనుగొన్న వీరహనుమాన్
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
21 వ భాగం - సుందర కాండ
వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (05-12-2016)

సీతాన్వేషణలో భాగంగా హనుమంతుడు రావణా లయాన్ని చూశాడు. రాక్షస ముఖ్యుల ఇళ్లలో ఆమెకొరకు వెతికాడు. రావణుడి ఇంట్లోకి కూడా చొచ్చుకు పోయాడు. అలా లంకంతా కలియ తిరుగుతూ, నగళ్లలో సంచరించే సమయంలో, హనుమంతుడు చూసిన రక-రకాల ఇళ్లను వర్ణించడానికి కవి "మధురగతిరగడ" వృత్తాన్ని ఎంచుకుంటారు. ఆ పద్యం ఇలా సాగింది:

మధురగతిరగడ:      
మారుతిగన్గొనె మందిరజాలము, హారివిదూరజ హాటకజాలముఁ
        జపలాలతికా శకునవిహారము, నిపుణప్రావృ ణ్ణీరదవారముఁ
        వలెఁ బలుదెరఁ గుల భాసిలు శాలలఁ , ఘలితాంబుజఘన కార్ముకశాలల
        రమణీయం బయి క్రాలువిశాలల, విమలగృహోపరి విలసఛ్చాలలఁ
        బరమసురత్న భ్రాజిత మగుచును, బురుహూతాదిక పూజిత మగుచును
        వరమును దోషవి వర్జిత మగుచును, నరయఁ గ నాత్మబ లార్జిత మగుచును
        మయదానవ వర మతి నిర్మితమై, మణిమయభూషా మండిత మగుచును
        భాసిలిగృహములఁ బావని గాంచెను, వీసముఁ గొంకక వేడ్కఁ జరించెను - 90

తాత్పర్యం:    
మనోహరమైన వైఢూర్యాలతో, బంగారంతో నిర్మించబడి, మెరుపుతీగల లాంటి పక్షులు విహరించేందుకు అనువుగా వున్న ఇళ్ల సమూహాలను; భీకర వర్షాకాలంలోని మేఘాల వలె వున్న రక-రకాల శాలలను; శంఖాలు-పెద్ద, పెద్ద ఇళ్లున్న శాలలను; మిక్కిలి విశాలంగా వున్న శాలలను; ఇళ్ల మీద నిర్మించిన భవంతులను; మేలిమి రత్నాలతో కూడి ప్రకాశవంతమైన-ఇంద్రాది దేవతల పూజలందుకుంటున్న-వాస్తు దోషం లేనటువంటి-మయుడనే  దానవ నిర్మితమైన భూషణాలతో ప్రకాశిస్తున్న ఇళ్లను-భుజబలంతో కుబేరుడిని ఓడించి రావణుడు గెల్చుకున్న ఇళ్లను చూసిన హనుమంతుడు, ఏమాత్రం జంకు-గొంకు లేకుండా వాటిలో విహరించసాగాడు.

ఛందస్సు:      "నాలుగు మాత్రలు నాటిన గణములు, నాలుగు రెంటికి నవి విరమణములు గలసి మధురగతికి నలును           జగణము తొలగిన ధృత కౌస్తుభక విరమణము" - అప్ప కవీయం.
కుబేరుడిని జయించి రావణుడు సంపాదించుకున్న పుష్పక విమానాన్ని హనుమంతుడు చూచినప్పుడు, అది ఆయనకు కనిపించిన విధానాన్ని వర్ణించడానికి కవి ఎంచుకున్న వృత్తం "వృషభగతిరగడ". ఆ పద్యం ఇలా సాగుతుంది:

వృషభగతిరగడ:
ఘనఘనాఘనకలితరూపము కాంచనాంచిత చారురూపము
దనుజనాధబలానురూపము ధాత్రి నప్రతిరూపరూపము
ధారిణీగస్వః ప్రకీర్ణము తతవిభాబహురత్నకీర్ణము
చారుతరకుసుమావకీర్ణము క్షాద్ర మనఁ గ రజోవికీర్ణము
చంచలాంగీదీప్యమానము నగు విమానమునకు ననూనము
నగ మనన్ బహుధాతుచిత్రము నైకవర్ణ పయోదచిత్రము
గగన మన గ్రహచంద్రచిత్రముఁ గనె విమానము రత్నచిత్రము
ధరణి పర్వతరాజిపూర్ణము ధరము వృక్షవితానపూర్ణము
ధరణిరుహము సుమౌఘపూర్ణము తతసుమావళి పత్రపూర్ణము
భాసురసుమగ పుష్కరంబులు పక్షికలయుతనిష్కుటంబులు
కేసరాన్వితపుష్కరంబులు గృహము లఛ్చ త్విట్కరంబులు
ఆకుపచ్చ విహంగమంబులు హారిజాత్యతురంగమంబులు
నైకరత్న భుజంగమంబులు నవ్యరుచి నభ సంగమంబులు -91

తాత్పర్యం:    
గొప్ప వర్షాకాలంలోని మేఘం పోలిన బంగారు కాంతితో ప్రకాశించే మనోహరాకారమైందీ పుష్పక విమానం. రావణాసురుడి బలానికి సరిపోయింది. అందువల్ల భూమిపై దానికి సమానమైందేదీ లేదు. ఆకాశంలోంచి జారిపడిన స్వర్ణమా అనతగింది. విస్తారమైన కాంతితో, అనేక రత్నాలతో కూడినది. మనోహరమైన పుష్పాలతో వ్యాపించి, తేనె మాదిరి పుప్పొడితో నిండింది. మెరుపులతో కూడిన మేఘంలాగా, మెరుపు తీగలలాంటి శరీరాలున్న స్త్రీలతో ప్రకాశిస్తున్నది. హంసలు మోసుకుపోయే బ్రహ్మ విమానానికి సరితూగేది. పర్వతంలా భావించే దిగా వివిధ రకాల గైరిక ధాతువులతో వింతగా శోభిస్తోంది. నానా వర్ణాల మేఘాల వలె చిత్రంగా కనిపిస్తోంది. ఆకాశమా అని భావించే విధంగా సూర్య చంద్రుల చిత్రాలున్నాయందులో. హనుమంతుడు చూస్తున్న అలాంటి రత్న చిత్రమైన విమానం భూమి పర్వతాలతో, పర్వతాలు వృక్ష సమూహాలతో, వృక్షాలు పూల రాసులతో, పూల రాసులు ఆకులతో నిండి వుంది. పూలతో నిండిన నీళ్లు, పక్షి కిలకిలారావములతో-కల కల ధ్వనులతో నిండిన తోటలు, అకరుల తోడి కమలాలు, కాంతులు వెదజల్లే గృహాలు, ఆకుపచ్చ పక్షులు, ఉత్తమ జాతి గుర్రాలు, అనేక రత్నాలతో చేయబడిన పాములు, ఆయా పక్షి వర్ణానికి తగిన విధంగా రత్నాలతో చేయబడిన పక్షుల చిత్రాలున్నాయందులో.

ఛందస్సు:      "మధురగతిరగడ" కు ఇరవై ఎనిమిది లఘువులుంటాయి. పదిహేనింట విశ్రాంతి. గురువుకు రెండు లఘువుల చొప్పున కూడా గుణించవచ్చు.

హనుమంతుడు రావణుడి అంతఃపురాన్ని చూసినప్పుడు, ఆయనకు కనిపించిన-కనుగొన్న పరిసరాల విశేషాలను, నెల కొన్న పరిస్థితిని వర్ణించడానికి, వాసు దాసు గారు రాసిన పద్యాలలో రెండు వృత్తాలు ఒకటి "మానిని" కాగా మరొక టి "సుగంధి". అవి:


మానిని:       
జూద మునం బె నుజూదరి కౌడి వసుల్ దెసదోఁ పక చింతలు నా
        జూదరియట్టులు నిశ్చలతం గను సొన్ను ప్రదీపములున్ జగతిన్
        మాదిరి లేక వెలుంగు మణీకృత మంజులదీపులు సెమ్మెలుఁ దా
        మోద ము మీరఁ గనుంగొనె వానర ముఖ్యుఁడు తద్భవనాంతమునన్-92

తాత్పర్యం:    
నేర్పరైన జూదగాడు, తన సర్వస్వం ఓడిపోయినప్పుడు, ఏం చేసేందుకు పాలుపోక, దిక్కు తోచని స్థితిలో చింతిస్తున్నప్పుడు, నిశ్చలంగా వున్న విధంగానే, కదలక-మెదలక వున్న దీపాలను హనుమంతుడు చూశాడు. ప్రపంచంలో ఆ దీపాలతో సరిసమానమైన దీపాలను, ప్రకాశించే మణులతో  తయారు చేయబడిన అలాంటి దీపాలను, దీపపు సెమ్మెలను హనుమంతుడు చూశాడు.

ఛందస్సు:      "మానిని" కి ఏడు "భ" గణాలు, ఒక గురువు, పదమూడవ స్థానంలో యతి.
సుగంధి:        దీప కాంతి దైత్యకాంతు దేహకాంతిఁ దద్వపు
                స్తాపనీయభూషణాలి సార కాంత కాంతులన్
                బాపు ! మండు చుండునట్లు ప్రజ్వరిల్లె శాల, యా
                యేపుఁ జూచి మెచ్చె నంజ నేష్టపుత్రుఁ డాత్మలోన్ - 93

తాత్పర్యం:     దీపాల కాంతి, రావణాసురుడి దేహ కాంతి, వాడు ధరించిన బంగారపు సొమ్ముల కాంతి, కలిసి, ఆ శాల మండే విధంగా వెలుగుతున్నది. ఆ విశేషాన్ని చూసిన హనుమంతుడు "ఔరా" అని తనలో, లోలోన మెచ్చుకున్నాడు.
ఛందస్సు:      "సుగంధి" కి ", , , , ర" గణాలు. తొమ్మిదింట యతి. ఉత్సాహానికి సుగంధికి పెద్ద తేడా లేకపోయినా, సుగంధులన్నీ ఉత్సాహాలే కాని, ఉత్సాహాలన్నీ సుగంధులు కావు. ఉత్సాహానికి న గణంలో ఎడముంటుంది. ఇందులో ఉండదు.

నిద్రిస్తున్న రావణుడి అంతఃపుర స్త్రీలను హనుమంతుడు చూసినప్పుడు "రసమంజరి", "స్రగ్విణి" వృత్తాలలో వర్ణించారు కవి.

రసమంజరి:   
పరిపరి విధముల భాసిలు చేలల్ , సరగలుఁ బలుపలు చందపులీలల్
        పరఁ గెడి యువతలు పానసుకేళీ, పరతను నిదురను బండఁ గ జూచెన్-94
తాత్పర్యం:     నానారకాలుగా ప్రకాశిస్తున్న చీరలను, హారాలను ధరించిన విలాసవంతమైన రకరకాల స్త్రీలను, మద్యం బాగా సేవించి, మత్తుగా నిద్రపోతుండడం హనుమంతుడు చూశాడు.
ఛందస్సు:      రసమంజరికి "న, , , , గురువు" గణాలు. తొమ్మిడో ఇంట యతి.

స్రగ్విణి:                   సద్దు లేకుండఁ గా జారు భూషాతతుల్
                ముద్దియల్ నిద్దురన్ మున్గి వర్తింపగా
                దద్ద యంచల్ మిళిందంబులున్ లేని మేల్
                ముద్దుఁ బద్మాకరం బో యనన్ రాజిలెన్-95
తాత్పర్యం:     స్త్రీలు బాగా నిద్రపోవడం వలన, వారు ధరించిన ఆభరణాల ధ్వని వినబడకపోవడంతో, ఆ మందిర ప్రదేశం, హంసలు-తుమ్మెదలు లేని అందమైన కొలను లాగా కనిపించసాగింది. ఇక్కడ హంసలంటే స్త్రీలని, తుమ్మెదలంటే వారు ధరించిన ఆభరణాలని పోల్చారు కవి.
ఛందస్సు:      స్రగ్విణికి నాలుగు "ర" గణాలు. ఏడింట యతి.
సీతాన్వేషణలో భాగంగా హనుమంతుడు రాక్షసులు మద్యం సేవించే పానశాలలోకి ప్రవేశిస్తాడు. ఆ ప్రదేశంలో కనిపించిన కొన్ని పాత్రలలో సారాయిని సగం మాత్రమే సేవించారు రాక్షసులు. కొన్నింటిలో అసలేమీ మిగులలేదు. కొన్నిటిని అసలు ముట్టనే లేదు. అలానే సగం కొరికి తినిన బక్ష్యాలు, పూర్తిగా తిని కొ౦చెం మాత్రమే మిగిల్చినవి, అసలేమీ తిననివి కుప్పలు-కుప్పలుగా కనిపించాయి హనుమంతుడికి. వీటన్నిటినీ హనుమ చూసినప్పటి దృశ్యాలను వర్ణిస్తూ కవి "మనోరంజని" వృత్తంలో రాశారీ పద్యాన్ని ఇలా:
మనోరంజని: 
పగిలిన గిన్నెలు దొరలెడి కుండలుఁ బారు జలంబులు దండలుఁ బల్
        తెగలగు పండులు బిగి గల కొఁ గిట దేల్చుచు నొండొరు నిద్దుర మై
        వగ కల కన్నెల చెలువగు చిన్నెలు వారక వేరొక తొయ్యలిచీ
        ర గరిత యొక్కతె నిదురను లాగి యురంబునఁ గప్పికొనంగనియెన్-96

తాత్పర్యం:     పగిలిన గిన్నెలు, దొర్లుతున్న కుండలు, నేలపారుతున్న నీళ్లు, దండలు, నానారకాల పళ్లు, నిద్రలో ఒకరినొకరు గట్టిగా కావలించుకున్న సుందరీమణులు, ఒకరి చీరెను మరొకరు లాక్కొని రొమ్ములపై  కప్పుకొని వుండడాన్ని చూశాడు హనుమంతుడు.
ఛందస్సు:      మనోరంజనికి "న, , " లు, ఐదు "స" గణాలు, పదిహేనింట యతి వుంటాయి.


సీతాన్వేషణలో భాగంగా హనుమంతుడు అశోక వనానికి చేరుకుంటాడు. వనంలోకి ప్రవేశించి విహరిస్తాడక్కడ యధేఛ్చగా. వనమంతా సీతకొరకు గాలించాడు. మాసిన చీరెతో, ధైర్యం చెడిన మనస్సుతో, శుష్కించిన దేహంతో, ఆమే సీత అని గుర్తించలేని స్థితిలో వున్న స్త్రీని చూశాడు హనుమంతుడు. అమెను చూసి తనలో తానే వితర్కించుకుంటాడాయన. తాను చూసిన స్త్రీ సీతాదేవే అని నిశ్చయించుకున్న తర్వాత, ఆమె దుస్థితిని చూసి దుఃఖిస్తాడు. 

No comments:

Post a Comment