Wednesday, December 28, 2016

రహదారులపై మృత్యుకేళిని అరికడదాం : వనం జ్వాలా నరసింహారావు

రహదారులపై మృత్యుకేళిని అరికడదాం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (29-12-2016)

ఆధునిక సాంకేతికత ఎంతగా అందుబాటులోకి వచ్చినా మన దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏటేటా ఆందోళనకరంగా పెరుగుతోంది. అనునిత్యం జరిగే రహదారి ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న, అంగవైకల్యం పొందుతున్న వారి సంఖ్య చూస్తుంటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. అధికారిక గణాంకాల ప్రకారం భారత్‌లో 1994- 2004 మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య 3.7 శాతం, 2005- 2015 మధ్య 4.4 శాతం మేరకు పెరిగింది. రోడ్డు ప్రమాదాల నివారణకు, బాధితులకు తక్షణ సహాయ సహకారాలు అందించేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించాలని నిపుణులు చాలాకాలంగా ఘోషిస్తున్నారు. ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించడానికి, క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించడానికి, బీమా క్లెయిమ్ పత్రాలను సకాలంలో పరిశీలించడానికి తగు చర్యలు తీసుకోవాలని వివిధ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి గతంలోనే సిఫార్సులు చేశాయి. అయితే- ఈ సూచనలు, సిఫార్సులు ఆచరణలో అమలు జరగడం లేదన్నది కాదనలేని కఠోర వాస్తవం.

          హైదరాబాద్ వేదికగా ఇటీవల నాలుగు రోజుల పాటు ‘ఇండియన్ రోడ్ కాంగ్రెస్’ సదస్సు జరిగినా, ఆ సందర్భంగా ఏం చర్చించారన్నది ప్రచారం కాలేదు. రహదారి ప్రమాదాల నివారణకు, నియంత్రణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధ్యయనం చేసి, ఉభయ తెలుగురాష్ట్రాలను కలుపుతున్న జాతీయ రహదారిని పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకుని ప్రమాదాలను అరికట్టడంలో ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలన్న అంశాలను రోడ్ కాంగ్రెస్ సదస్సులో ప్రస్తావించక పోవడం బాధాకరం. జాతీయ రహదారులను, రాష్ట్రాల పరిధిలో ప్రధాన రహదారులను అనుసంధానం చేస్తూ, ‘సమీకృత అత్యవసర సహాయ సేవా కేంద్రాల’ (ఐఇఆర్‌సి)ను ఏర్పాటు చేసేందుకు సమగ్ర వ్యూహాన్ని అమలు చేయాలని ‘108 అంబులెన్స్ సర్వీసుల’ రూపశిల్పి డాక్టర్ ఎ.పి. రంగారావు ఇచ్చిన సూచనలు ప్రభుత్వాలకు శిరోధార్యం. రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలంటే ‘సమీకృత అత్యవసర సహాయ సేవా కేంద్రాల’ ఏర్పాటును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాధాన్యతాంశాలలో ఒకటిగా తీసుకోవాలి. బహుళ ప్రయోజన లక్ష్యంగా ఏర్పాటైన ‘హైవే ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ యాక్సిడెంట్ మిటిగేషన్’ (హెచ్‌ఇఆర్‌ఎఎం) అనే వ్యవస్థ విజయవంతంగా చేపట్టి అమలు చేసిన ‘పైలెట్ ప్రాజెక్టు’ ఆధారంగా రూపొందించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ’ (ఐఆర్‌డిఎ), ‘జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్’ సంయుక్త భాగస్వామ్యంలో హెచ్‌ఇఆర్‌ఎఎం ఈ నివేదికను రూపొందించింది. డాక్టర్ ఎ.పి. రంగారావు సారధ్యంలో ఈ సంయుక్త భాగస్వామ్య బృందం అధ్యయనం చేసి, శాస్ర్తియ గణాంకాలతో నివేదికను కేంద్రానికి సమర్పించింది.

          2014తో పోలిస్తే 2015లో దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు 2.5 శాతం మేరకు పెరిగాయి. మృతుల సంఖ్య 4.6 శాతం, క్షతగాత్రుల సంఖ్య 1.4 శాతం పెరిగింది. 2014లో జరిగిన 4,89,000 రోడ్డు ప్రమాదాల్లో 1,39,671 మంది మరణించగా, 4,93,474 మంది గాయపడ్డారు. 2015లో జరిగిన 5,01,423 రోడ్డు ప్రమాదాల్లో 1,46,133 మంది ప్రాణాలు కోల్పోగా, మిగతావారు గాయపడ్డారు. ప్రతిరోజూ ప్రతి గంటకూ సగటున 57 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా కనీసం 17 మంది మృత్యువాత పడుతున్నారు. గత ఏడాది రోడ్డు ప్రమాదాల మృతుల్లో 15- 34 ఏళ్ల లోపువారి సంఖ్య 54.1 శాతం అని తేలింది. 2015 నాటి గణాంకాల ప్రకారం మొత్తం ప్రమాదాల్లో జాతీయ రహదారులపై 28.4 శాతం, రాష్ట్ర రహదారులపై 24 శాతం, ఇతర రోడ్లపై ప్రమాదాలు 47.6 శాతం అని తేలింది. గత ఏడాది జరిగిన ప్రమాదాల్లో మృతుల సంఖ్యను చూస్తే జాతీయ రహదారులపైనే 35 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రణాళికా సంఘం అధ్యయనం ప్రకారం 2002లో రోడ్డు ప్రమాదాలకు లోనైన వారి మూలంగా సామాజికపరమైన వ్యయం 55 వేల కోట్ల రూపాయలని తేలింది. ఇది స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 3.5 శాతంగా విశే్లషించారు.



          రహదారులు రక్తమోడుతున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సిందిగా ఐఆర్‌డిఎ, జిఐసిలను కోరడం జరిగింది. అత్యవసర సహాయ సహకారాలను అందించడంతో పాటు మరణాల సంఖ్యను తగ్గించడానికి, బీమా పత్రాలను పరిశీలించడానికి, ప్రాణాపాయం నుంచి కాపాడడానికి ఏయే చర్యలు తీసుకోవచ్చనే అంశాలను పరిశీలించాల్సిందిగా కోరారు. డాక్టర్ ఎ.పి. రంగారావు నేతృత్వంలో అధ్యయన బృందం ఒక ప్రాథమిక నివేదికను రూపొందించి 2012 సెప్టెంబర్ 1న ఐఆర్‌డిఎకు అందించారు. ఈ ప్రాథమిక నివేదికలో నాలుగు కీలక ప్రతిపాదనలున్నాయి. ఇందులో మొదటిది- డ్రైవింగ్ లైసెన్స్‌ల మంజూరులో నిబంధనలను కచ్చితంగా పాటించడం, వాహన వేగాలను నియంత్రించడం. రెండవది- వాహన చోదకులు మద్యం, మత్తు పదార్థాలను సేవించకుండా చూడడం, సీటు బెల్టులు, హెల్మెట్‌లు ధరించడం వంటివి ఉన్నాయి. ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లి తక్షణ వైద్య సహాయం అందించేలా అంబులెన్స్‌లను ఉంచడం, వాటిని కొన్ని కీలక పాయింట్ల వద్ద సిద్ధంగా ఉంచడం, ప్రాణాపాయాన్ని నివారించేలా క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తీసుకువెళ్లడం, అన్నిరకాల వైద్య సేవలు లభించేలా సమాచార మాధ్యమాలను వినియోగించడం, ప్రమాదాలకు సంబంధించిన సమాచారాన్ని జాప్యం లేకుండా ఆస్పత్రులకు, పోలీసులకు, అంబులెన్స్‌లకు అందించడం వంటి చర్యలు తీసుకోవాలి. ప్రజలు గుర్తుంచుకునేలా టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేయడం, నిరంతర వైద్య సేవలకు కాల్ సెంటర్లు నెలకొల్పడం వంటి ఏర్పాట్లు చేపట్టాలి. 

జిఐసి బృందం ఈ ప్రాథమిక నివేదికను పరిశీలించి విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రయోగాత్మకంగా అమలు చేసేలా ఐఆర్‌డిఎకు సమర్పించింది. డాక్టర్ ఎ.పి. రంగారావును ప్రధాన సలహాదారుగా ఎంపిక చేసి పథకం అమలు బాధ్యతను అప్పగించింది. ఐఆర్‌డిఎ అనుమతి పొందిన ఈ ప్రాజెక్టు కోసం 885 లక్షలు కేటాయించగా ఇప్పటికి 574 లక్షలు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సమీకృత అత్యవసర సహాయ సేవా వ్యవస్థను రూపొందించి, 1033 నెంబర్‌తో టోల్ ఫ్రీ సర్వీస్‌ను జాతీయ రహదారుల ఉపయోగానికి కేటాయించారు. ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నిరోధించడంలో ఈ వ్యవస్థ తోడ్పడుతోంది. ప్రతి 50 కిలోమీటర్ల దూరానికి ఒక అంబులెన్స్, శిక్షణ పొందిన టెక్నీషియన్లు, కాల్‌సెంటర్, వైద్యాధికారి నియామకం, పోలీసులను, ఆస్పత్రులను అప్రమత్తం చేయడం వంటివి ఈ వ్యవస్థలో భాగాలయ్యాయి. ఐఇఆర్‌సి అమలుతో 2014- 2015 మధ్య కాలంలో ప్రమాదాల తీవ్రత తగ్గింది. ఈ పైలెట్ ప్రాజెక్టు అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. 14.8 శాతం ప్రమాదాలు మత్తు పదార్థాలు సేవించడం వల్ల, 27.3 శాతం ప్రమాదాలు అతి వేగం వల్ల, 29.19 శాతం ప్రమాదాలు నిద్రమత్తు వల్ల జరుగుతున్నట్లు తేలింది. వీటిలో 70 శాతం ప్రమాదాలను నిరోధించే ఆస్కారం ఉంది. జాతీయ రహదారి వెంబడి మద్యం అమ్మకాల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రమాదాల నివారణకు అధికారులు, ప్రజల్లో మరింత అప్రమత్తత పెరగాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రమాద బీమా క్లెయిమ్‌లను త్వరిత గతిన పరిష్కరించాలి.

1 comment:

  1. ఏదైనా ప్రమాదం జరిగిన 60 నిముషాలలో వైద్యం అందిస్తే, వాళ్ళు బతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్నే గోల్డన్ అవర్ అంటారట. ఇంత త్వరగా ప్రమాదస్థలానికి చేరుకోవడం, మామూలు అంబులెన్సులతొ చాలాసార్లు సాధ్యంకాదు. అందుకు హెలీకాప్టర్లని ఉపయోగించాలి.
    108 అంబులెన్స్ లా 108 హెలీకాప్టర్ అన్న మాట. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఇలాంటి ఎయిర్ అంబులెన్సులు నడుపుతున్నాయి కాని అవి చాలా ఖరీదు. అలా కాకుండా, సామాన్యుడుకి కూడ అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రంలో, మూడు నాలుగుచోట్ల ఈ హెలీకాప్టర్ అంబులెన్సులని 24 గంటలూ పనిచేసేలా అందుబాటులో ఉంచితే ఎంతోమంది ప్రాణాలు కాపాడవచ్చు. ప్రమాద దృశ్యాలని, బాధితుల పరిస్థితిని ఎవరైనా, మొబైల్ ఫోన్ ద్వారా షూట్ చేసి పంపిస్తే, పరిస్థితికి తగ్గట్టు హెలీకాప్టర్ సిబ్బంది ప్రిపేర్ అయి రావచ్చు.
    Pl read the post in my blog. https://bonagiri.wordpress.com/2012/12/22/108-%E0%B0%B9%E0%B1%86%E0%B0%B2%E0%B1%80%E0%B0%95%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D/

    ReplyDelete