ఐ.సి.ఎస్ అధికారి సి.ఎస్.రామచంద్రన్ శతజయంతి
ఆదర్శ ప్రాయుడు సీ ఎస్ ఆర్
ఆంధ్రజ్యోతి దినపత్రిక (13-12-2016)
బహుముఖ ప్రజ్ఞాశాలి సీ ఎస్ ఆర్
నమస్తే తెలంగాణ (13-12-2016)
నిబద్ధతకు నిలువుటద్దం
ఆంధ్రప్రభ (13-12-2016)
వనం జ్వాలా
నరసింహరావు
1937 సంవత్సరం బాచ్
కు చెందిన రిటైర్డ్ (ఇండియన్ సివిల్ సర్వీస్) ఐసిఎస్ అధికారి, 102 సంవత్సరాల
వయోధిక వి.కె.రావు గారు, వారి సహచర రిటైర్డ్ ఐసిఎస్ అధికారి, దివంగత
సి.ఎస్.రామచంద్రన్ శత జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని, డిసెంబర్
13, 2016 న
(అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆవరణలో) సాయంత్రం 5.30 కు, ఆయనపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడంతో పాటు, ఆయన
గురించి, ఆయనతో తనకున్న అనుభూతుల్ని, అనుభవాలని గురించి ప్రసంగించనున్న
అరుదైన సమావేశంలో పాల్గొనే ప్రతివారికీ అదో గొప్ప అనుభూతి కాబోతుందనడంలో సందేహం
లేదు.
తమిళ నాడుకు చెందిన దివంగత
సి.ఎస్. సుబ్రమణియన్, ఐసిఎస్ అధికారి కావలసి వున్నప్పటికీ, వామపక్ష భావాల ప్రభావంతో, స్వాతంత్ర్య సమరం జరిగే రోజుల్లో, కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉన్నప్పటికీ, ఉద్యమాలలో పాల్గొనేవారు. ఆ నేపథ్యంలో ఒక పర్యాయం స్వయానా ఆయన తమ్ముడి
ఉత్తర్వులకు లోబడి జైలు పాలవ్వటం జరిగింది. ఆ ఉత్తర్వులను జారీ చేసిన వ్యక్తి నాటి హోమ్ సెక్రటరీ (అంతర్గత భద్రతా అధికారి) ఐసిఎస్ అధికారి, దివంగత సి.ఎస్.రామచంద్రన్ కావటం విశేషం. అది అప్పట్లో యాధృచ్ఛికంగా జరిగినప్పటికీ నిబధ్ధత కలిగిన అధికారి కావటం చేత
అలా చేయటం అనివార్యం కావడం విశేషం. ఆ విధంగా అన్నదమ్ముల్లో పెద్ద వాడైన సి.ఎస్. సుబ్రమణియన్ ఐసిఎస్
చదవడానికి ఇంగ్లాండు దేశం వెళ్లినప్పటికీ, మధ్యలోనే భారత దేశానికి వచ్చి, నాటి మద్రాసు నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించడానికి, నిర్మాణాత్మకంగా ఎదగడానికి మూల కారణం అయ్యారు. తమ్ముడు సి.ఎస్. రామచంద్రన్ మాత్రం ఫిజిక్స్
లో బిఎస్సీ ఆనర్స్ పూర్తి చేయడంతో పాటుగా, 1940 సివిల్ సర్వీసుల పోటీ
పరీక్షకు హాజరు కావటం, అందులో ఉత్తమ శ్రేణిలో సఫలీకృతులవ్వటం జరిగింది. ఇండియన్ సివిల్ సర్వీసుల
పరీక్షలలో మాత్రమే కాకుండా, ఫైనాన్షియల్ సివిల్ సర్వీస్ పరీక్షలను
కూడా ఆయన విజయవంతంగా పూర్తి చేయటం విశేషం. డిసెంబర్ 13, 2016 న సాయింత్రం జరిగే దివంగత సిఎస్. రామచంద్రన్ శత జయంతి
ఉత్సవాలలో భాగంగా 102 ఏళ్లు పై బడిన వి.కె. రావుగా ప్రసిద్ధులైన వల్లూరి
కామేశ్వర గారు, సి.ఎస్. ఆర్ పై వారి కూతురు, మాజీ ఐఏఎస్ అధికారిణి, గాయత్రి రామచంద్రన్ రాసిన పుస్తకాన్ని హైదరాబాద్ నగరంలోని అడ్మినిస్ట్రేటివ్
స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో ఆవిష్కరించనున్నారు.
ఎందరో తెలుగువారికి
చిరపరచితులైన వి.కె.రావు గారు విశాఖపట్నం జిల్లా కలెక్టరుగా, నాటి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా, 1973లో రాష్ట్రపతి పాలన విధించబడిన రోజుల్లో గవర్నర్ కు
సలహాదారుడిగా, పదవీ విరమన అనంతరం విజిలెన్స్ కమిషనర్ గా, 1981-1982 లో నాటి భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి ప్రిన్సిపల్ కార్యదర్శిగా పని చేశారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పూర్వ ఐ.ఎ.ఎస్ అధికారులు అయిన ఎం. గోపాల కృష్ణ, ఎస్ . పార్థసారథి, టి.ఎల్. శంకర్ ప్రఖ్యాత వైద్యులు డా.ఎ.పి. రంగారావు లాంటి నిష్ణాతులు ప్రసంగించనున్నారు.
సిఎస్. రామచంద్రన్ గారి
గురించి చెప్పుకోవాల్సి వస్తే... ఐసిఎస్ కు ఎంపికైన తదుపరి అప్పట్లో
మధ్య భారత్ గా పిలువబడే బేరార్-సెంట్రల్ ప్రావిన్సెస్ కేడర్ కు కేటాయించడం జరగడంతో, 1942 లో అక్కడ ఉద్యోగిగా చేరారు. జరిగింది. 1942 నుండి 1948 వరకు సెంట్రల్ ప్రావిన్సెస్
లో పని చేసి, తరువాత, మద్రాసు ప్రెసిడెన్సీకి కేడర్ ను బదలాయించుకున్నారు. సీఎస్ ఆర్ ఎంపికైన 1942 ఐసిఎస్ అధాకారుల బాచ్ లో ఎందరో పేరెన్నికగన్న అధికారులున్నారు. వారిలో
కొందరిని పేర్కొనాలంటే: బెంగాల్ క్యాడర్
కు చెందిన లెస్ లీ పవర్, మద్రాసు ప్రెసిడెన్సీ
క్యాడర్ కు చెందిన డి.డి.సాథే, పంజాబ్ క్యాడర్ కు చెందిన హెచ్.బి.విలియమ్స్, అస్సాం క్యాడర్ కు చెందిన ఎఎన్. కిద్వాయ్, ఉత్తర ప్రదేశ్ క్యాడర్ కు చెందిన బి.కె. కౌల్ , బెంగాల్ క్యాడర్ కు చెందిన అలెగ్జాండర్, యూపీ క్యాడర్ కు చెందిన సతీష్ చంద్ర వంటి వారు ఉన్నారు. కొందరు విభజన అనంతరం పాకిస్తాన్ కు వెళ్లారు. రామచంద్రన్ బాచ్ కు చెందిన కుద్రతుల్లా సాహెబ్ 1947లో పాకిస్థాన్ కు వెళ్లి, నాటి ప్రెసిడెంట్ ఆయుబ్ ఖాన్ వద్ద ప్రిన్సిపల్
సహాయకుడిగా నియమించ బడ్డారు.
ఐసిఎస్ అధికారులలో సి.ఎస్. ఆర్ కన్నా ముందు బాచ్ లలో
చాలా మంది పేరు గాంచిన భారతీయులుండడం మరో విశేషం. వారిలో సర్ సరత్ కుమార్ ఘోష్
(తదుపరి కాలంలో చీఫ్ జస్టిస్ అయ్యారు) కాశ్మీర్ ప్రధాని అయిన సర్ బెంగాల్ నర్సింగ్ రావు, రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా
పని చేసిన సర్ బెంగాల్ రామారావు, సర్ అక్బర్ హైదరీ, భారత తొలి క్యాబినెట్ సెక్రటరీ సర్ ఎస్.ఆర్. పిళ్లయ్ వంటి ఎందరో
ప్రముఖులు ఉన్నారు. అలానే సుభాస్ చంద్ర బోస్, ప్రప్రధమ విదేశాంగ కార్యదర్శి కేపీఎస్ మీనన్ కూడా వున్నారు.
బ్రిటీష్ ఇండియా రోజుల్లో ఇండియన్ సివిల్ సర్వీసులను అధికారికంగా ఇంపీరియల్
సివిల్ సర్వీసులుగా వ్యవహరించేవారు. అది అత్యున్నత సివిల్ సర్వీసెస్ గా బ్రిటిష్ రాజ్యంలో, బ్రిటిష్ ఇండియాలో, నాటి బ్రిటిష్ పాలనలో 1858 నుండి 1947 వరకు వ్యవహరించబడింది. మొదట్లో ఐసిఎస్ కు ఎంపికైన
మొదటి వెయ్యి మంది సభ్యులనందరినీ “సివిలియన్స్”గా పిలిచే వారు. వారందరు
బ్రిటిష్ వారే కావటం విశేషం. పైగా వారి చదువు సంధ్యలన్నీ బ్రిటిష్ పాఠశాలల్లోనే జరిగి పోయేవి. 1905 నాటికి, 5% మందిని బెంగాల్ నుండి ఎంపిక చేయడం జరిగింది. 1947 నాటికి 322 మంది భారతీయులు, 688 మంది బ్రిటిషర్లు సభ్యులుగా ఉండేవారు. 1980 ఏప్రిల్ నెలలో క్యాబినెట్ కార్యదర్శిగా పదవీ విరమణ కావించిన నిర్మల్ కుమార్
ముఖర్జీ, 1944 బాచ్ కు చెందిన చివరి ఐసిఎస్
అధికారి. అలాగే చిట్ట చివరి ఐసిఎస్
అధికారిగా పాకిస్థాన్ నుండి పదవీ విరమణ కావించిన అధికారి ఆఘా షాహీ వుండేవారు. ఇతను
కూడా 1944 బ్యాచ్ కి చెందిన వారే కావటం
మరో విశేషం. ఇతను 1982లో ప్రెసిడెంట్ వద్ద
విదేశాంగ విధాన సలహాదారుగా పదవిలో ఉన్నారు. ఐసిఎస్ లో చివరి సారిగా నియమితులైన వారంతా అక్టోబర్ 1944 బ్యాచ్ కి చెందిన వారు మాత్రమే.
భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో డిప్యూటేషన్ పైన
సి.ఎస్. రామచంద్రన్ పని చేశారు. ఆయన లాల్ బహదూర్ శాస్త్రి వద్ద కూడా పని చేశారు. శాస్త్రి నిరాడంబరత సీఎస్ కు ఆదర్శ ప్రాయమయ్యింది. దేశ పారిశ్రామిక విధానంలో విప్లవాత్మక మార్పులు
తీసుకురావటంలో ఇరువురు కలిసి పనిచేశారు. అందుకే, నేటికి సి.ఎస్. గారి సేవలు భారతదేశ పారిశ్రామిక పఠిష్టతకు పునాదులు వేయటంలో
దోహద పడ్డాయి అని విశ్వసించే వారు లేకపోలేదు. 1961 లో రామచంద్రన్ కు నఫీల్డ్ (NUFFIELD) పౌండేషన్ లో సభ్యత్వం అందింది. ఇది ఇంగ్లాండు దేశంలో ఉంది. ఇక్కడే ఫిజిక్స్ విభాగంలో
ప్రావీణ్యం సంపాదించి న్యూక్లియర్ ఆస్ట్రో విజిక్స్ విభాగాల్లో ప్రావీణ్యం
అభివృద్ది చెంది ఆక్స్ ఫర్డ్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల్లో పేరు గాంచడం జరిగింది. తర్వాత కాలంలో అనేక పేరు గాంచిన పదవులను భారత ప్రభుత్వంలో
చేపట్టిన రామచంద్రన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ లో అదనపు కార్యదర్శిగా, ప్రణాళికా సంఘం సలహాదరునిగా, కుటుంబ నియంత్రణ, వైద్య శాఖలో కార్యదర్శిగా
కూడా పనిచేశారు. దేశాన్ని పరిపాలనా పరంగా
తీర్చిదిద్దటంలో అందెవేసిన చేయిగా అంతర్జాతీయంగా కూడా పలు కీలక పదవులు సీస్ ఆర్ కు
కట్టబెట్టడం జరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖలో
కార్యదర్శిగా భాద్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో సన్నిహిత
సంబంధాలు పెట్టుకున్నారు.
రామచంద్రన్ ఆధ్యాత్మిక
విషయాలకు అధిక ప్రాధన్యతనిచ్చేవారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలపై అపారమైన విశ్వాసం ఉండేది. ఈయన కంచి కామకోటి పీఠానికి చెందిన, పరమాచార్యగా అందరికీ తెలిసిన శంకరాచార్యుల వారికి అనుంగు
శిష్యులు. వేద పఠనంలో, అభ్యాసనలో ఎక్కువ కాలం
నిమగ్నమై ఉండేవారు. కంచి మఠాలు, సంస్థలు స్థాపనలో పరిరక్షణలో
కాలం గడిపేవారు. ఎన్నో దేవాలయాల స్థాపనలో
భాగస్వాములయ్యారు, ఉత్తర భారతదేశంలోని బదరినాథ్, కేదార్ నాథ్ దేవాలయానికి 1977లో అధ్యక్షులుగా నియమించబడ్డారు. ఇతని కాలంలోనే బదరినాథ్, కేదార్ నాథ్ దేవస్థానాల
ఆధునీకరణ జరిగింది. భారతదేశంలో ఆది శంకరుని
సంప్రదాయాలు కొనసాగటంలో బదరినాథ్, కేదార్ నాథ్ ఉన్నత స్థానంలో నిలువటంలో వీరి కృషి ఎనలేనిది. సిఎస్. రామచంద్రన్ ఢిల్లీలోని ‘‘సౌత్ ఇండియన్ సమాజ్’’ అధ్యక్షులుగా దక్షిణ
భారతదేశంలోని సాంస్కృతిక సంస్థల అభివృద్దిలో పాలుపంచుకున్నారు. కేరళ నుండి ఆంధ్ర వరకు అన్ని సంప్రదాయాల మేలు కలయికగా
దీనిని తీర్చిదిద్దటంలో సీఎస్ ఆర్ సఫలీకృతులయ్యారు. దక్షిణ భారతీయులను ఒక్క త్రాటిపై తెచ్చి సంప్రదాయాల కాణాచిగా తీర్చిదిద్దటంలో వీరిది అందేవేసిన చేయిగా
పేర్కొనవచ్చు. ఎనలేని సేవలు చేసిన సివిల్
సర్వెంట్ గా, మానవతావాదిగా, ఆధ్యాత్మిక వాదిగా, దేశానికి వన్నె తెచ్చిన వ్యక్తి సీఎస్ ఆర్. వ్యక్తిత్వం వీరి మతం, అభిమతం. End
No comments:
Post a Comment