Tuesday, December 6, 2016

ఇదీ సుపరిపాలన....రచయిత పరిచయం : భండారు శ్రీనివాసరావు

ఇదీ సుపరిపాలన....రచయిత పరిచయం
భండారు శ్రీనివాసరావు

"ఇదీ సుపరిపాలన" పేరుతో నేను రాసిన వ్యాసాల సంకలనానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, దూర్దర్శన్ వార్తా విభాగం మాజీ సంపాదకుడు, భండారు శ్రీనివాసరావు గారు రాసిన రచయిత పరిచయ వాక్యాలు...జ్వాలా

సరిగ్గా పాతికేళ్ళ తరువాత పునరావృతం.
1989 లో జరిగిందిది. మళ్ళీ 2014లో.

కాకపోతే అప్పుడు కాకలు తీరిన రాజకీయ యోధుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఆ వ్యక్తిని తనకుతానుగా ఎంపిక చేసుకున్నారు. ఇన్నేళ్ళకు మళ్ళీ,  తెలంగాణా స్వప్నాన్ని సాకారంచేసుకుని  ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ కూడా అదే వ్యక్తిని, అదే పదవికి ఎంపిక చేసుకోవడం కాకతాళీయం కావొచ్చేమో కాని అంత సులభం కాదు. అయితే, ఇలా జరగడానికి మాత్రం మార్కులు వేయాల్సి వస్తే అవన్నీ పూర్తిగా ఆ వ్యక్తికే వెయ్యాలి. అతడే జ్వాలా నరసింహారావు.

కేవలం ప్రతిభ కారణంగానే పదవిని పొందడం అనేది  జ్వాలాగా చిరపరిచితుడైన వనం జ్వాలా నరసింహారావుకు వెన్నతో పెట్టిన విద్య. ఆ ప్రతిభను పసికట్టే ఆనాటి  ముఖ్యమంత్రి చెన్నారెడ్డి తన వద్ద పీఆర్వోగా జ్వాలాను  స్వయంగా ఎంపిక చేసి  నియమించుకుంటే, ఇప్పుడు తిరిగి తెలంగాణా ముఖ్యమంత్రి  శ్రీ కె.చంద్రశేఖరరావు గారు అదే ఉద్యోగానికి  మరింత పదోన్నతి  కల్పించి తన పేషీ నుంచి పౌర సంబంధాలను ఆజమాయిషీ చేసే ప్రధాన అధికారిగా  గురుతర భారాన్ని ఆ జ్వాలాకే అప్పగించారు.

ఒకనాడు చేసిన ఉద్యోగమే కాని అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయి. మీడియా విస్తరణ, మాధ్యమాల నిర్వహణ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రాష్ట్రం రెండుగా విడిపోయింది. కొత్త సవాళ్ళ మధ్య కొత్త ప్రభుత్వం కొత్త తెలంగాణలో కొలువు తీరింది. ఈ నేపధ్యంలో పౌర సంబంధాలను, పేరుకు పౌర సంబంధాలు కానీ నిజానికి పత్రికా సంబంధాలు అనడమే సముచితం,  సజావుగా నిర్వహించడం ఎవరికయినా కత్తి  మీద సామే. అయితే పూర్వం సముపార్జించుకున్న అనుభవమే ఆయనకు శ్రీరామ రక్షగా అక్కరకు వస్తుంది. వస్తోంది కూడా.

సార్ధక నామధేయుడు

`పిల్లల్ని కంటాం కానీ, వాళ్ల రాతల్ని కనలేము కదా' అని బోలెడు, బారెడు  నిట్టూర్పులు విడుస్తుంటారు కొందరు నిరాశావాదులు.

  కానీ `జ్వాలా' తలితండ్రులు ఈ బాపతు కాదు. అందుకే అతడి స్వభావాన్ని  ముందే గుర్తించి,  భవిష్యత్తుని ముందే  ఊహించి, తమ ఇష్టదైవంతో ముడిపెట్టి  `జ్వాలా' అనే  పదాన్ని బారసాల నాడే అయన పేరుకి జోడించారు.  ఇన్నాళ్ళుగా ఆయన సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులకు  `జ్వాలా' అనే సంక్షిప్త నామం  కూడా ఎంతో కొంత దోహదం చేసి వుంటుందనే నా నమ్మకం! అలాగే ఆయన ‘మాటల్లోని  వాడి, చేతల్లోని  వేడి'  జ్వాలా అనే ఈ పేరు పుణ్యవేునని మా బోంట్ల మరో  నమ్మకం!

డెబ్భయ్యవ దశకం నుంచి ఈ నాటి వరకూ, `జ్వాలా' జీవితం `గ్రాఫు' గమనిస్తే  పరమపద సోపాన పఠం గుర్తుకు వస్తుంది.


ఎంత ఎత్తుకి ఎదిగాడో. అంత కిందకు జారాడు. ఎన్ని నిచ్చెనలు ఎక్కాడో, అన్ని పాముల నోట్లో పడ్డాడు. అయినా, విసుగు చెందని విక్రమార్కుడిలా,  పడిలేచిన కెరటంలా,  మళ్లీ అంతకు మించిన, అతనికి మించిన  ఎత్తులకి ఎగబ్రాకాడు. ఇంకా  ఎక్కాల్సిన `శిఖరాల' కోసం అన్వేషిస్తున్నాడు.  

ఈ విజయాల్లో, జ్వాలా నరసింహారావు పడిన   కఠోర శ్రమా, వేసిన  పథకాలూ, చేసిన ఆలోచనలూ, అంతకు  మించి, ఆయన రక్తంలో జీర్ణించుకుపోయిన  ‘అయాం ఆల్వేస్‌ రైట్‌' అనే తత్వం   పునాదులుగా నిలిచాయి. ఆయన వ్యక్తిత్వాన్ని  నిండుగా మలిచాయి. విశ్రాంతి ఎరుగని,  విరామం కోరని, ఫలితం ఆశించని,  పనిచేసుకుంటూ పోయే మనస్తత్వమే జ్వాలాని పరిపూర్ణ పురుషుడిగా తీర్చిదిద్దింది.

ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం మీ చేతుల్లో వున్న ఈ పుస్తకమే. నేను చెప్పిన దాంట్లో ఏవన్నా అనుమానాలు వుంటే ఇది చదవగానే తొలగిపోతాయి. అందుకు నాది గ్యారంటీ.

పొతే…..

ముఖ్యమంత్రి కార్యాలయం అంటేనే బిజీ. అందులో పనిచేసే ప్రధాన పౌరసంబంధ అధికారి మరీ బిజీ. ఇరవై  నాలుగ్గంటల టీవీ ప్రసారాలు వచ్చాక  ఆ ఉద్యోగం కాలంతో పరిగెత్తే బిజీ బిజీ  ఉద్యోగంగా మారిపోయింది.  ఓ పక్క ఆ కొలువు చేస్తూనే,  మరో పక్క ఇంతటి బృహత్తర రచనా వ్యాసంగం నెరపాలంటే ఆ మనిషి  సవ్యసాచి అయివుండాలి. అతి కొద్దికాలంలో ఇన్నిన్ని  వ్యాసాలు అనేక పత్రికల్లో ప్రచురణకు నోచుకున్నాయంటే అవి రాయడానికి ఎంత శ్రమ పడివుండాలి. ఊహకు అందని విషయం.

‘పనిచేసేది సీఎమ్ ఆఫీసులో కదా,  ఏది రాసినా పత్రికల్లో వస్తుంది’ అని తేలిగ్గా అనేవాళ్ళు ఎలాగూ వుంటారు. ఎవరేది రాసినా,   మొహమాటానికి పోయి పత్రికలు ప్రచురిస్తారనేది కేవలం అపోహ మాత్రమే. ప్రామాణికత లేని రచనలు ప్రచురణకు నోచుకోవడం ఆషామాషీ కాదు. విభిన్న పత్రికల్లో ఈ వ్యాసాలు అచ్చయిన తీరు గమనిస్తే రచయిత ‘చేయితిరిగినతనం’ ఎంతటిదో బోధ పడుతుంది.

అలాగే, ఏదో కాలక్షేపం రాతలు అయితే అనుకోవచ్చు. అలా కాదే. ఒక హోదాలో వుండి రాసే ప్రతి అంశానికి  సాధికారిత వుండి తీరాలి. బాధ్యత కలిగిన  ముఖ్యమంత్రికి, బాధ్యత కలిగిన ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం. ఎలాంటి తభావతు వచ్చినా మెడకు చుట్టుకునే వ్యవహారం. అలాంటిదాన్ని ఎవరికీ మాట రాకుండా, ఎవరితో మాట పడకుండా  ఈ అక్షర చండీ యాగాన్ని  నిర్వహించడం సామాన్యమైన విషయం కాదు. ఈ యజ్ఞాలకు ముగింపులు వుండవు. పూర్ణాహుతులు వుండవు. ఇవి సతతం  కొనసాగేవే. నిరంతర శ్రమజీవి అయిన జ్వాలా నుంచి ఇటువంటివి మరికొన్ని కోరుకునేవాళ్ళకు ఆయన  ఆశాభంగం కలిగించడనేది నా నమ్మకం.  

‘తెలంగాణా ఆవిర్భావం తరువాత దాన్ని బంగారు తెలంగాణాగా ఎలా ఆవిష్కరింపచేసుకోవాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కంటున్న కలలకు ఇది అక్షర రూపం. ఆయన వివిధ సందర్భాలలో వెలిబుచ్చిన అభిప్రాయాలను, రచిస్తున్న ప్రణాళికలను, రూపొందిస్తున్న పధకాలను ఒక్క చోట చేర్చి, గుదిగుచ్చిన సాధికారిక  సంకలనం. తెలంగాణా గురించి పరిశోధన చేసేవారికి ఉపయుక్తంగా వుండేంత గొప్ప సమాచారం, గణాంకాలు ఇందులో పొందుపరచడం మరో వైశిష్ట్యం.   

ముఖ్యమంత్రికి ప్రధాన పౌర సంబంధ అధికారి కాబట్టి కేవలం ప్రశంసాపూర్వక పద విన్యాసాలే వుంటాయని అనుకోవడం సహజం. సహజంగా తెలంగాణా అభిమాని కాబట్టి కేసీఆర్ స్వప్నాల సాకారత విషయంలో ఆయనకూ ఆశలు వున్నాయి. అడియాసలు లేవు. అంచేతే కేసీఆర్ ఆలోచనలను వివరించేటప్పుడు అతిశయోక్తులు దొర్లకుండా మంచి పరిణతి, విజ్ఞత ప్రదర్శించారు.

పొతే, ఈ పుస్తకానికి, ‘ఇదీ సుపరిపాలన” అంటూ జ్వాలా  పెట్టిన  పేరు గురించి ఓ చిన్న ముచ్చట చెప్పుకోవాలి.

“సుపరిపాలన అంటే ఇలావుండాలి, అదే కేసీఆర్ పాలన” అనే అర్ధం, ఇందులో వుంది. అంతేకాని, “ఇదే సుపరిపాలన” అనలేదు. అంటే భజన అయ్యేది. కానీ అలా చేయకపోవడమే జ్వాలా కలంలోని చమత్కారం.  
    
  ఇక, ఒక తుది పలుకు కూడా అడగకుండానే జత చేయాల్సి వస్తోంది.

అదేమిటంటే, రచయిత గురించి  ఈ కొద్ది మాటలు రాయడానికి నేను పడ్డ కష్టం.

ఇందులో అంత శ్రమ ఏమిటి అనిపించవచ్చు.

పరిచయం అవసరం లేని జ్వాలా నరసింహారావును పరిచేయడం అంటే మాటలా మరి!

- భండారు శ్రీనివాసరావు
98491 30595

No comments:

Post a Comment