Sunday, March 5, 2017

వాల్మీకి కోకిల ఆలపించిన ఆనంద మయ కావ్యగానం ....ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

వాల్మీకి కోకిల ఆలపించిన ఆనంద మయ కావ్యగానం
ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (06-03-2017)

          భగవద్గీత, శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీరామాయణాలు భారతీయ సంస్కృతీరూపాలు. సనాతన ధర్మ ప్రతిపాదకాలు. వీటి మౌలిక తత్వాలు ధర్మజ్ఞానాలు. ఈ రెండింటినీ వాచ్య వ్యంగార్థాలతో "శ్రీమద్రామాయణం" ఆవిష్కరిస్తోంది. వాల్మీకి ఆదికవి. రామాయణం ఆదికావ్యం. ఇది ధ్వని-అర్ధ ప్రతిపాదిత మహామంత్రపూతం. గాయత్రీ బీజ సంయుతం. ఔపనిషతత్వసారం. స్మరణ-పారాయణ మాత్రంగా అంతఃకరణం శుధ్ధి అవుతుందట!.

            ధర్మ-జ్ఞానాలు, కాళ్లూ-కళ్లవంటివట. ఈ రెండూ లేకపోతే, కుంటి-గ్రుడ్డి వాడవుతాడు మానవుడు. మానవ జీవితంలో వీటి ఆవశ్యకతను రామాయణం విశదీకరిస్తోంది. ఈ మహాకావ్యం వాచ్యార్ధంలో ధర్మాన్ని చెప్పుతుంది. వ్యంగార్థంలో బ్రహ్మాన్ని ధ్వనిస్తుంది. మనిషిగా పుట్టిన వాడు బాహ్యంగా ధర్మాన్ని ఆచరించాలి. ఆంతర్యంగా జ్ఞానాన్ని కలిగి వుండాలి. శ్రీరాముడు బాహ్యంగా నరుడై, ధర్మానికి నిలువెత్తు దీపమైనాడు. మూర్తీభవించిన ధర్మమైనాడు. అంతర్గతంగా పర బ్రహ్మమైనాడు. మన జీవితాలూ అంతే! బాహ్యమూ-అంతరమూ అని రెండు విధాలుకదా! ప్రవర్తనలో బాహ్యంగా ధర్మాన్ని ఆచరిస్తూ, అంతర్గ్తంగా బ్రహ్మాన్ని ఉపాసిస్తూ, జ్ఞాన-భక్తి-వైరాగ్యాలను నిచ్చెన మెట్లుగా చేసుకుని, పరతత్వాన్ని సాధించాలి. ఇదే రామాయణ సారం. దీనికి లక్ష్యం శ్రీరాముడు కాగా, హనుమ ఆచార్యుడుగా లక్ష్య సాధనమని పెద్దలు చెప్తారు. రామాయణంలో అందమైన కాండ "సుందరకాండ". నిజానికది "హనుమత్కాండ". ఆద్యంతాలూ హనుమంతుడు ఆచార్యుడుగా దర్శనమిచ్చే అద్భుతకాండ "సుందరకాండ". 

            బాలకాండ వృత్తాంత మంతా 12 ఏళ్లు-అయోధ్య కాండ 12 ఏళ్లు-అరణ్య కాండ 13 ఏళ్లకు పైన-కిష్కింధ కాండ సుమారు 9 నెలలు-యుధ్ధ కాండ 22 రోజులు-ఉత్తర కాండ సుమారు 11 వేల ఏళ్ల నిడివితో నిండుగా నడిచాయి. కానీ "సుందరకాండ" వృత్తాంత మంతా రోజున్నరలోనే గడచిందట! ఎంత ఆశ్చర్యం!

తేట తేట తేనెలోని తీయందనాన్ని, చల్లని వెన్నెలలోని సుఖ శీతల మధురిమల్ని కలబోసి వాల్మీకి కోకిల ఆలపించిన ఆనంద మయ కావ్యగానమే సుందరకాండ. శబ్ద-అర్ధ-భావ-రస సౌందర్యాలను పరస్పరాశ్రయంగా సురుచిర భద్రంగా నింపుకొన్న రసమయ పేటి ఇది. ఇది ఒక అమృత భాండం. జీవ-జీవన సౌందర్య కాండం. బాధల మధ్య బోధలనూ, వ్యక్తుల మధ్య సాధనా సిధ్ధులనూ సిధ్ధపరచి, అందించిన మంత్రమయ అక్షయ అక్షర భాండం సుందరకాండం. సుందరకాండలో సుందరం కానిదేమిటట? అంటే..ఏమీ లేనే లేదు..అని పెద్దలి తేల్చేశారు.

ఇందులో హనుమ మహాయోగి. మహాజ్ఞాని. "విశిష్ట వశిష్ఠుడు". మహాచార్యుడు. అంతటి వాడు లంకకు వెళ్లేటప్పుడు శ్రీరామచంద్రుడి భద్ర ముద్రికను (ఉంగరాన్ని), తిరిగి వచ్చేటప్పుడు సీతమ్మ చూడామణిని చక్కగా ధరించి సముద్రాన్ని సునాయాసంగా దాటి వచ్చాడు. ఈ భవ సాగరాన్ని దాటడానికి విష్ణు చిహ్నాలైన శంఖ-చక్ర ధారణం అలాగే తోడ్పడుతుంటాయి. శ్రీసుందరకాండలో సౌందర్యమనేది రాశీభూతమైంది. మంత్ర పూతమైన రస సౌందర్యం-భగవత్ సౌందర్యమైన శ్రీరామ సౌందర్యం-ఆచార్య సౌందర్యమైన శ్రీహనుమ సౌందర్యం-అశోక, మధు వనాల ఉద్యాన వన సౌందర్యం-మహా విశిష్టమైన లంకా నగర సౌందర్యం-లంకలో కామినీ భోగినీ జన సౌందర్యం-రావణుడి వీర సౌందర్యం-హనుమ సాధనా సౌందర్యం-ఆదికవి వాల్మీకి మహనీయ రమణీయ మాధుర్యమైన కవితా శిల్పసౌందర్యం......వీటన్నింటినీ కలబోసిన మహాసౌందర్యం, శ్రీ "సుందర" సౌందర్యం.


"శ్రాద్ధేశు దేవ కార్యేశు పఠేత్ సుందరకాండమ్’" - పితృ కార్యా లలోనూ, దేవ కార్యాలలోనూ సుందరకాండ అవశ్య పఠనీయ మన్నారు. సుందరకాండ మహామంత్రమనీ, దీనికి ఆంజనేయ స్వామి మంత్రాధి దేవతనీ, సర్వారిష్ట నివారణ దీని ఫలమనీ ఆర్షవాక్యం. ధర్మార్ధ కామాలూ, సత్వ రజోస్తమోగుణాలూ-అనే మూడింటి వల్ల కలిగే ఫలాన్ని పొందాలన్నా, సాంసారిక, మానసిక కష్టాలనుండి దాటాలన్నా, శుభాన్నిచ్చే సుందరకాండను పఠించాలంటారు. ఇది ఇలా వుంచితే అద్భుతమైన దివ్య గాయత్రీ మంత్ర నర్తనం ఆద్యంతాలూ దర్శనమిస్తూందీకాండలో. అందువల్లనేమో "యేనరా కీర్త యిశ్యన్తి నా? స్తి తేశామ్ పరాభవ " అన్నారు రామాయణాన్ని. సర్వత్ర ""కార, ""కారాలు ఆది మధ్యాంతాలూ మనకు ధ్వనిస్తుంటాయి. దేహ-గేహ-గ్రహాది బాధల నుండి సద్యః  రక్షణ కల్పించే మహామంత్ర రాజ విరాజితం కనుకనే శ్రీసుందరకాండ అన్ని సంప్రదాయాల వారికి విశేషంగా ఆదరణీయమైంది.

ఇక ప్రస్తుతానికొస్తే, వాల్మీకి మహర్షి రామాయణాన్ని అనుగ్రహించారు. ముందు విన్నవించుకున్నట్లు దీనినిండా 24 గాయత్రీ మంత్రాక్షరాలను భద్రంగా నిక్షిప్తం చేసారు. మహా మహానుభావులూ, మహావిద్వాంసులూ, సుందర మందర(రామాయణం) నిర్మాతా అయిన, శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు దాసు గారు (వాసుదాసు) వాల్మీకి రామాయణాన్ని యధాతధంగా మంత్రమయం చేస్తూ, ఛంధః యతులను ఆయా స్థానాలలో నిల్పి, వాల్మీకాన్ని తెనిగించారు. వాల్మీకి రామాయణానికి తుల్యమైన స్థాయినీ, పారమ్యాన్నీ, ఆంధ్ర వాల్మీకి రామాయణానికి అందించి, "మందరం" అని దానికి ప్రాచుర్యాన్ని కలిగించారు. ఆంధ్ర పాఠకలోకం అపారంగా మందరాన్ని అభిమానించింది. ఆదరించింది. శ్రీరామానుగ్రహ ప్రాప్తమయింది. కాలం గడచి పోతున్నది. వాసుదాసు గారు మారిపోతున్న తరాలకు గుర్తురావటం కూడా కష్టమై పోతున్నది. వారి "ఆర్యకధానిధుల" తోనూ, "హితచర్యల" పరంపరల తోనూ పరవశించి పోయిన ఆనాటి తెలుగు పాఠక మహనీయులు క్రమంగా తెరమరుగవుతున్నారు.


ఆంధ్ర వాల్మీకి రామాయణం తరువాత వచ్చిన ఎన్నో గద్య-పద్య రామాయణాలకు విశేష ప్రాచుర్యం లభిస్తున్న భూత-వర్తమాన రోజుల్లో "ఆదికవి", "ఆంధ్ర వాల్మీకి" యధాతథంగా మంత్రమయం చేస్తూ ఛంధః యతులను ఆయా స్థానాల్లో నిలిపి తెనిగించిన వాల్మీకానికి ఎందుకంతకన్నా ప్రాచుర్యం రాకూడదని అనిపించింది. వ్యాస మహాభారతాన్ని తెనిగించిన నన్నయ ఆదికవైతే, వాల్మీకి రామాయణాన్ని యధా వాల్మీకంగా పూర్వకాండలతో సహా ఉత్తరకాండను కూడా మొదట తెనిగించిన శ్రీ వావిలికొలను సుబ్బారావు దాసు (వాసుదాసు) కూడా ఆదికవే కదా! నన్నయంతటి గొప్పవాడే కదా! ఆయన ఆంధ్ర వాల్మీకి రామాయణం, నిజానికి సరైన పోషకుడో, ప్రాయోజకుడో వుండి వుంటే ఏ నాడో నొబెల్ సాహిత్య బహుమతికో, తదుపరి జ్ఞానపీఠ పురస్కారానికో నోచుకుని వుండేది. ఏ మాత్రం మన తెలుగువారు ప్రయత్నం చేసినా ఆయనకు భారత రత్న, జ్ఞానపీఠ ఆవార్డులు వచ్చి వుండేవి ఎప్పుడో...ఏనాడో! "మందరం" మనమందరం చదవాలనీ, అందులోని అందమైన సుందరకాండను తొలుత తెలుగు పాఠకులందరికీ సమాదరంగా అందించాలనీ భావించి వాసుదాసు గారు రచించిన సుందరకాండ మందరాన్ని ఆయనే "వక్త" గా, నేను కేవలం "వాచవి" గా, "అనువక్త" గా సంక్షిప్తీకరించడం జరిగింది. దాని సారాంశమే ఈ పరిశోధనా వ్యాస పరంపర.

1 comment: