Monday, March 13, 2017

సమన్యాయ, స్ఫూర్తిదాయక బడ్జెట్ : వనం జ్వాలా నరసింహారావు

సమన్యాయ, స్ఫూర్తిదాయక బడ్జెట్
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (14-03-2017)

నిర్వహణ వ్యయం కింద రు. 61, 607. 20 కోట్లతో, ప్రగతి పద్దు కింద రు. 88, 038.80 కోట్లతో, మొత్తం రు. 1, 49, 646 కోట్ల వ్యయంతో  2017-2018 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను శాసనసభకు సమర్పించడం జరిగింది. రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ వరుసగా నాలుగవసారి సమర్పించిన వార్షిక బడ్జెట్ ఏ విధంగా, ఏ కోణంలోంచి చూసినా, సందేశాత్మకంగా, స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. సమాజంలోని అన్ని వర్గాల వారికి, అన్ని కుల వృత్తులవారికి, అన్ని మతాల వారికి, వివిధ రంగాలలో పనిచేస్తున్న వారికి, ప్రభుత్వంలో అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాల్సిన అన్ని శాఖలకు, అల్పాదాయ-మధ్య తరగతి ఆదాయ వర్గాల వారికి....వారూ, వీరూ అన్న తేడా లేకుండా, అందరికీ "సమన్యాయం అంటే ఇలా" అన్న రీతిలో వుందీ బడ్జెట్. గత మూడు బడ్జెట్ ల  మాదిరిగానే, ఈ  బడ్జెట్  కూడా పేదల సంక్షేమం పట్ల, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

ప్రజా జీవితంలో సుమారు నాలుగున్నర దశాబ్దాలుగా వివిధ స్థాయీలలో పని చేసి, ప్రజల నాడి తెలుసుకున్న అనుభవంతో, అసలు-సిసలైన దార్శినికతతో, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కనుసన్నలలో, ఆయన ఆలోచనా సరళిని ప్రతిబింబించేదిగా వుందీ బడ్జెట్. సమాజంలో అనాదిగా అణగారిన దళిత, గిరిజన, మైనారిటీ, వెనుకబడిన వర్గాలను, ఎంబీసీలను ప్రత్యేకించి వుద్దేశించినదీ బడ్జెట్. దళిత, గిరిజన, వివిధ కుల వృత్తులలో వున్న  ప్రజలు గతంలో ఏమనుకుండేవారో కాని, ఈ బడ్జెట్ సమర్పణ తరువాత భవిష్యత్ లో తృప్తిగా జీవనం ఎలా గడప వచ్చో భరోసా కలిగిస్తుందీ బడ్జెట్. అణగారివున్న ఈ వర్గాల వారిని బాగుచేయాలనే చిత్తశుద్ధి, దానికి ఆచరణ సాధ్యమైన కార్యాచరణ కనిపిస్తుందీ బడ్జెట్ లో. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి ఎలా చెందనున్నదో, స్థానిక వనరుల గుర్తింపు ఎలా జరగనుందో, యాదవులు, మత్స్యకారులు, చేనేత తదితర రంగాల కులవృత్తుల వారు, వారి-వారి రంగాల ద్వారా రాష్ట్రాన్ని గొప్ప ఆర్థిక వనరుగా ఎలా మార్చబోతున్నారో వివరిస్తుందీ బడ్జెట్. గ్రామీణ వృత్తుల బాగోగులు ఆలోచించి తద్వారా గ్రామీణ జీవన విధానంలో ఎలా మార్పు రాబోతుందో వివరిస్తుందీ బడ్జెట్. ఈ బడ్జెట్  మీద ముఖ్యమంత్రి ముద్ర సృష్టంగా కనిపిస్తుంది. పేదల సంక్షేమం పట్ల ఆపేక్షతో పాటు ఆదాయాన్ని పెంచే అవకాశాలు, ఉపాధి కల్పిస్తూ బంగారు తెలంగాణను సాధ్యమైనంత తొందరగా సాధించాలన్న ఆయన ఆకాంక్షను ఈ బడ్జెట్  ప్రతిబింబిస్తున్నది.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పదిలంగా ఉన్నంత వరకు తెలంగాణ పల్లెలు స్వయం పోషకత్వంతో సమృద్ధితో వుంటాయనే విషయం బడ్జెట్లో స్పష్టం చేయడం జరిగింది. సమైక్య పాలనలో తెలంగాణ జీవన పరిస్థితులు ఎలా విచ్చిన్నమయ్యాయి, వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం, కులవృత్తుల పట్ల అనాదరణ కారణంగా గ్రామీణ జీవితం ఎలా అల్లకల్లోలమయింది, వృత్తి నైపుణ్యం కలిగిన తెలంగాణ బిడ్డలు పొట్ట చేతపట్టుకుని పట్టణాలు, పరదేశాలు వెల్లిబతకాల్సిన దుస్థితిలోకి ఎలా నెట్టివేయబడ్డారు, అనే విషయాలను వివరించి, వాళ్ల బతుకును నిలబెట్టే బడ్జెట్ ను రూపొందించింది ప్రభుత్వం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారానే తెలంగాణ ఆర్థిక వృద్ధి ఎదుగుదల దిశగా పయనిస్తుందని విశ్వాసం ఈ బడ్జెట్లో కనిపిస్తుంది. ఇందుకనుగుణంగా గ్రామీణ వృత్తులకు ఆర్థిక ప్రేరణనిచ్చే పథకాలను రూపొందించడం జరిగింది. అలాగే, తెలంగాణలో అపారమైన మానవ సంపద ఉన్నదని, కులవృత్తులు ఆధారంగా జీవనం గడుపుతూ అనువంశికంగా విశేషమైన వృత్తి నైపుణ్యం పొందిన సామాజిక వర్గాలుండడం తెలంగాణకు గొప్పవరం అనీ ఈ బడ్జెట్లో విసదమవుతుంది. గ్రామీణ జీవితం మీద అలుముకున్న విషాదాన్ని తొలగించి పల్లెల ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని సుందరతరంగా, సుసంపన్నంగా మార్చే విధానానికి తెలంగాణ ప్రభుత్వం నాంది పలికిందీ బడ్జెట్లో.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తి కనిపిస్తుందీ బడ్జెట్లో. తెలంగాణ ఏర్పాటైతే బాగుపడ్తాం అని భావించిన వారికి, ఇదిగో ఇలా బాగుపడుతున్నాం అని అడుగడుగునా దర్శనమిస్తుందీ బడ్జెట్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే, తెలంగాణ ప్రజలు అడుక్కు తింటారని అవాకులు-చవాకులు పేలిన అలనాటి ఆంధ్రా నాయకత్వం ఈ బడ్జెట్ చూస్తే, కెసీఆర్ నాయకత్వంలోని ఉద్యమ నాయకులు ఆ నాడే అది తప్పని నొక్కి వక్కాణించిన వాదన నూటికి నూరు పాళ్లు సబబని నిరూపిస్తుందీ బడ్జెట్.

ఆర్థిక మంత్రి తన ఉపన్యాసంలో చెప్పినట్లు: "తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చెప్పుకోదగిన స్థాయిలో పునరుద్ధరణ పొందడం చూస్తేఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందనే విషయం రుజువవుతున్నదిసాగునీరు, వనరులు, ఉద్యోగాలు - నీళ్లు, నిధులు, నియామకాలపై తెలంగాణకు పూర్తి పట్టు ఉండటం వల్ల  రాష్ట్రం తన శక్తి సామార్థ్యాలన్నీ వినియోగించుకొని ఎల్లలు దాటిన అభివృద్ధిని చవి చూస్తుంది.   ప్రజల పట్ల నిర్లక్ష్య విధానం నుంచి ప్రజా కేంద్ర విధానాల వైపు, నైరాశ్యం నుంచి ఆశావహ పరిస్థితి వైపు, వనరుల నిరుపయోగం నుంచి ఎల్లలు దాటిన అభివృద్ధి వైపు, కరువు పీడిత వ్యవసాయం నుంచి కరువును అధిగమించే సాగు విధానం వైపు మూడేండ్లు కూడా నిండక ముందే నిర్ణయాత్మకంగా ముందడుగు వేశాం".


రాష్ట్ర ఏర్పడ్ద తొలినాళ్లలో, ఒక విధంగా చెప్పుకోవాలంటే, న్యాయంగా అంగీకరించాలంటే, పెద్ద అనిశ్చిత పరిస్థితి నెలకొని వుందనాలి. దేనికీ ప్రాతిపదిక లేదు. బడ్జెట్ ఎలా ప్రవేశ పెట్టాలనే అవగాహన కూడా లేదు. అంచనాలతో తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టిందీ ప్రభుత్వం. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి అర్థిక పరిస్థితి అర్థం కావాలంటే ఒక ఆర్థిక సంవత్సరం పూర్తిగా...అంటే...ఏప్రియల్ 1 నుంచి మరిసటి సంవత్సరం మార్చ్ 31 వరకు, రాష్ట్ర స్థితిగతులను అవగాహన చేసుకోవాలి. రాష్ట్రం పాజిటివ్ వృద్ధిలో ముందుకు సాగుతుందా, లేక, నెగెటివ్ అంటే లోటు బడ్జెట్ లో కొనసాగుతుందా విశ్లేషణ జరగాలి. ఇది అవగాహన చేసుకోవడానికి ప్రభుత్వం ఓర్పుగా-నేర్పుగా సమీక్ష జరిపింది. ముఖ్యమంత్రి సుదీర్ఘంగా జరిపిన ఈ సమీక్షలలో, విశ్లేషణలలో, రాష్ట్రం 2015-2016 ఆర్థిక సంవత్సరంలో కంటే, 2016-2017 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేట్, భారతదేశంలో బహుశా, ఏ రాష్ట్రంలో లేనంతగా వున్నట్లు తేలింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కొంత పడడంతో గత ఆర్థిక సంవత్సరంలోని చివరి త్రైమాసికంలో వృద్ధి కొంత తగ్గిందనాలి. ఇవన్నీ ప్రతిబింబింబించాయి ఈ బడ్జెట్లో.

ఈ నేపధ్యంలో, అన్ని విషయాలను దృష్టిలో వుంచుకుని, పూర్తి పారదర్శకతతో, బడ్జెట్ ప్రతిపాదించేటప్పుడు పాటించాల్సిన అన్ని సాంప్రదాయలకు అనుగుణంగా, కేంద్ర బడ్జెట్ కూడా దృష్టిలో వుంచుకుని రాష్ట్ర బడ్జెట్ సమర్పించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు, కేంద్ర విస్తృత విత్త విధానానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ రూపొందించబడిందనాలి. విస్తృత విత్త విధానానికి సంబంధించినంతవరకు రాష్ట్రాలన్నీ, కేంద్ర ఆలోచనా సరళికి అనుగుణంగానే వుండాలి కాని, విరుద్ధంగా వుండకూడదన్న భావన కనిపిస్తుందీ బడ్జెట్లో. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు, ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ కూడా, గతంలో వున్న ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులకు బదులుగా, కాపిటల్, రెవెన్యూ పద్దులుగా విభజించడం జరిగింది. అకౌంటింగ్ లో కూడా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సూచనకు అనుగుణంగా కేంద్రం, రాష్ట్రాలు ఏకరూప విధానాన్ని అనుసరిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఏకరీతిన ఉండటం కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కొత్త పద్ధతిని చేపట్టింది

నిర్వహణ వ్యయానికి సంబంధించిన జీత భత్యాలు, పింఛన్లు, అప్పులు, ఉద్యోగుల కరవు భత్యం పెరుగుదల, కొత్తగా ఉద్యోగ నియామకాల ఖర్చు లాంటివి ఒక కాటిగరీ కిందకు తీసుకు రావడం జరిగింది. మరో కాటిగరీ కింద వివిధ రకాల సంక్షేమ పథకాలను చేర్చింది ప్రభుత్వం. సంక్షేమ పథకాల్లో పెన్షన్లు, ఫీ రీఇంబర్స్ మెంట్, సన్న బియ్యం లాంటివి వున్నాయి. ఇక మూడోది కాపిటల్ వ్యయం. ఈ బడ్జెట్ లో గమనించాల్సింది, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవలంభించిన అనేక పద్ధతులో తీసుకొచ్చిన మార్పులు-చేర్పులు. "ఆర్థిక శాఖ" ప్రధాన భూమిక వహించే పద్ధతి కూడా మారి, "సంబంధిత శాఖలు" వాటి-వాటి పరిధిలో నిర్ణయాత్మక బాధ్యత వహించే తరహాలో వుందీ బడ్జెట్. అదే విధంగా గతంలో వున్న ఎనిమివందలకు పైగా బడ్జెట్ హెడ్స్ ను సగానికి సగం కుదించి వేయడం కూడా గమనించాల్సిన విషయం.

ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాలలో నిర్లక్ష్యానికి గురైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ధుతూ, అణగారిన ప్రజల ఆకాంక్షలను తీరుస్తూ, తెలంగాణ గత వైభవాన్ని పునరుద్ధరించే బృహత్ బాధ్యతను నెరవేర్చే దిశగా సాగిందీ బడ్జెట్. ప్రజలే కేంద్రంగా, ప్రజా సమస్యలే ఇతి వృత్తంగా పాలన సాగాలని మార్గ నిర్దేశనం చేసిన ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగానే, అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు అందాలనే ఆరాటం అడుగడుగునా ఈ బడ్జెట్లో ప్రస్పుటమవుతుంది. బడ్జెట్ రూపకల్పనలో మార్పులు వచ్చిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో కూడా చోటుచేసుకున్న అనివార్య మార్పులకు అనుగుణంగానేఎస్సీ, ఎస్టీ కమిటీ సిఫారసుల మేరకు ఆయా వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం విధిగా నిధుల కేటాయింపులు ఉండే విధంగానే ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని బడ్జెట్లో చెప్పడం జరిగింది. ఇది ఒక గొప్ప పరిణామం. ఎస్సీ, ఎస్టీ సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికున్న పూర్తి నిబద్ధతకు ఇది అద్దం పడ్తుంది. 

బడ్జెట్ ప్రవేశ పడ్తూ ఆర్థిక మంత్రి పేర్కొన్న విషయాలలోనూ, బడ్జెట్ వివరాల్లోనూ, ప్రభుత్వ ఆశాయాలు, ఆలోచనలు స్పష్టంగా ప్రతిబింబించాయి. పరిపాలనా విభాగాలు చిన్నవిగా వుంటే సామాన్యులకు ఎలా న్యాయం జరుగుతుందనే విషయాన్నీ, అధికార వికేంద్రీకరణ, పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం భారీ పాలనా సంస్కరణలు ఎందుకు తీసుకొచ్చింది అనే విషయం, తద్వారా, భౌగోళిక సామీప్యం, సాంస్కృతిక ఐక్యత, స్థానిక వనరుల సమర్థ వినియోగం జరిగి, సామాన్యుల ముంగిట్లోకి పాలన రావడాన్ని ప్రత్యేకంగా పేర్కొనడం విశేషం. వ్యవసాయం, దాని అనుబంధ  రంగాలకు  ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత; పాలి హౌజ్మైక్రో ఇరిగేషన్ పథకాలకు సబ్సిడీలు; తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందంచడం లక్ష్యంగా ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం; గొర్రెల పెంపకం; చేపల పెంపకం; చేనేత కార్మికుల సంక్షేమం; మహిళా శిశు సంక్షేమం; బ్రాహ్మణుల సంక్షేమం; రెండు పడక గదుల ఇండ్లు; విద్య; వైద్యం లాంటి పలు అంశాలను ప్రాధాన్యతల వారీగా పేర్కొనడం జరిగిందీ బడ్జెట్లో.


మొత్తం మీద సందేశాత్మకం....స్ఫూర్తిదాయకం...రాష్ట్ర బడ్జెట్.

No comments:

Post a Comment