సకల
శాస్త్రాల సంగమం సుందరకాండ మందరం
ఆంధ్ర
వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా
నరసింహారావు
సూర్య దినపత్రిక (20-03-2017)
వాల్మీకి
రామాయణాన్ని యధా తధంగా గాయత్రీ మంత్రమయం చేస్తూ, చందః యతులను ఆయా
స్థానాల్లో నిలిపి తెనిగించారు వాసుదాస స్వామి. శ్లోకానికో పద్యం
వ్రాసారు. ప్రతి పద్యానికి ప్రతి పదార్ధ తాత్పర్యం ఇచ్చారు. ఒక్కో పదానికున్న వివిదార్ధాలను విశదీకరించారు. భావాన్ని వివరణాత్మకంగా విపులీకరించారు. 1461 పద్యాలతో ఆయన
చేసిన శ్రీరామాయణం సుందరకాండ వ్యాఖ్యానంలో "జ్ఞాన పిపాసి"కి విజ్ఞాన సర్వస్వం దర్శన మిస్తుంది. ఆయన పద్యాలలో సాధారణంగా అందరూ వ్రాసే చంపకమాలలు, ఉత్పలమాలలు, సీస పద్యాలు, ఆటవెలది-తేటగీతులు, కంద, శార్దూలాలు, మత్తేభాలు మాత్రమే కాకుండా తెలుగు ఛంధస్సులో ఉండే వృత్తా లన్నింటినీ
సందర్భోచితంగా ప్రయోగిస్తారు. ఆ వృత్తాలలో ఉత్సాహం, పంచచామరం, తరలం, లయగ్రాహి, చారుమతి, మధురగతి రగడ, వృశభగతి రగడ, మానిని, సుగంధి, స్రగ్విని, మనోరంజని, మణిమంజరి, మత్తకోకిలం, తామరసం, ద్విపద, పద్మనాభ వృత్తం, అంబురుహ వృత్తం ఉన్నాయి. ఆయా సందర్భాలలో, సందర్భోచితంగా, ఆయా వృత్తాలను ఎంతో హ్రుద్యంగా మలిచారాయన. ఉదాహరణకు, రామ కార్యార్ధిగా సముద్రాన్ని లంఘించిన హనుమంతుడికి "పంచచామర" సేవ చేస్తారు కవి. లంకా తీరాన్ని చూసినప్పుడు హనుమంతుడికి కలిగిన ఉత్సాహాన్ని "ఉత్సాహ" వృత్తంలో
వర్ణిస్తారు. సుందరకాండ విషయాన్నంతా సంగ్రహంగా, హనుమంతుడు వక్తగా, ఆయన లంకకు పోయి వచ్చిన విధమంతా తన వానర మిత్రులకు
చెప్పడానికి ఏకంగా ఓ "దండకాన్ని" వ్రాస్తారు. సుమారు 200 పంక్తులున్న ఈ "దండకం" చదువుతే, సుందరకాండ పూర్తిగా
చదివినట్లే! శ్రుత్యర్ధ రహస్యం చెప్తూ "ద్విపద" వ్రాస్తారు కవి. ఇలానే మిగిలిన వృత్తాలు కూడా.
ఇంతకీ సుందరకాండ ఎందుకు చదవాలి? మళ్ళీ వేసుకుందాం ఈ ప్రశ్న. వాసుదాసు గారు తన
తొలి పలుకుల్లోనే చెప్పారీ విషయాన్ని గురించి. సుందరకాండ
పఠించేవారు ప్రత్యుత్తరం కోరి చదవ వలసిన విషయాలు: (సుందరకాండ అంతం లో
కూడ ఇదే విషయం మళ్ళీ చెప్పారాయన)....బధ్ధ జీవ తారతమ్యం, జీవాత్మ-పరమాత్మల సంబంధం, జీవాత్మ తరణోపాయం, శిష్య-ఆచార్య లక్షణాలు, జీవాత్మలకు సేవ్యుడెవరు?, ఆత్మావలోకన పరుడైన యోగి లక్షణం, ఉపాయానికీ-ఉపేయానికీ భేదం, యోగికీ-ప్రపన్నుడికీ భేదం.
ఈ
ముఖ్య విషయాలన్నింటికీ ప్రత్యుత్తరం సుందరకాండలో దొరుకుతుందా? అని ప్రశ్నించు కుంటే - ఎన్ని సార్లు చదివితే అంత వివరంగా సమాధానాలు
దొరుకుతాయి. వాటిని అన్వయించు కోవడమే మనం చెయ్యాల్సిన పని. సుందరకాండ ఆసాంతం, ప్రతి పద్యానికీ ప్రతి పదార్ధం ఇస్తూ, చివరిలో తాత్పర్యం చెప్తూ, అవసరమైన చోట
అంతరార్ధమిస్తూ, ఉపమానాలను ఉటంకిస్తూ, వీలైనంత వరకూ ఇతర గ్రంథాల్లోని సందర్భాలను ప్రస్తావిస్తారు కవి. ప్రత్యుత్తరం కోరి
చదవాల్సిన విషయాలన్నింటికీ సోదాహరణంగా జవాబు చెప్తారు.
చదువుకుంటూ పోతుంటే, అర్ధం చేసుకునే
ప్రయత్నం చేస్తే, ఇది కేవలం సుందరకాండ కధ వృత్తాంతమే కాకుండా, సకల శాస్త్రాల సంగమం లాగా
స్ఫురిస్తుంది. ఒక చోట ధర్మ శాస్త్రం లాగ, మరోసారి రాజనీతి శాస్త్రం లాగా వేరే చోట ఇంకో విధంగాను తోస్తుంది. ఇదో భూగోళ శాస్త్రం - సాంఘిక, సామాజిక, ఆర్ధిక, సామాన్య, నైతిక శాస్త్రం - సంఖ్యా శాస్త్రం - సాముద్రిక శాస్త్రం - కామ శాస్త్రం - రతి శాస్త్రం - స్వప్న శాస్త్రం - పురాతత్వ శాస్త్రం. చదివితే, అర్ధం చేసుకుంటే
ఇంకెన్నో శాస్త్రాలు గోచరిస్తాయి. అసలు-సిసలైన
పరిశోధకులంటూ ఉంటే, ఒక్క సుందరాకాండ మందరం మీద పరిశోధనలు చేస్తే చాలు-ఒకటి కాదు, వంద పీహెచ్డీలు పొందవచ్చు. డాక్టరేట్ తో పాటు అద్భుతమైన రహస్యాలు అవగతమౌతాయి. కాండ లోని చివరి పద్యం ఆయన "అంబురుహ" వృత్తం లో వ్రాసారు.
"క్ష్మా రమణీ
శరజాబ్జ భవానన సార సాహిత.....సర్వ సౌఖ్య విధాయకా" అన్న ఆ పద్యానికి
ప్రతిపదార్ధ తాత్పర్యం వ్రాస్తూ-అందులోని ఓ అర్ధాన్ని విలోమంగా చూస్తే, 1461 అవుతుందంటారు నిరూపణతో! దాని అర్థం-తన సుందరకాండలో 1461 పద్యాలున్నవనే. ఇందులోని ప్రతి
పద్యం పైన, ఒక్కో పద్యం లోని ప్రతి పంక్తి పైనా, ఆసక్తి-చేవ ఉన్న పరిశోధకులు, పరిశోధనా వ్యాసాలు వ్రాయగలిగితే, తెలుగు సాహిత్యంలో
పీహెచ్డీలకు గిరాకీ పెరుగుతుందనడం లో అతిశయోక్తి లేదు. తెలుగు విశ్వవిద్యాలయం వారు ఆలోచించాల్సిన విషయమిది.
"త్రిజట" స్వప్న వృత్తాంతం
చెప్పే సమయంలో, ఉన్నట్లుండి, సీతాదేవి ఎడమ భుజం, ఎడమ తొడ అదిరాయి. త్రిజట ముందుగా తనకు కల వచ్చిందని చెప్తుంది. ఆ తర్వాత దానికనుగుణంగా సాముద్రిక చిహ్నాలను-శుభ శకునాలను గురించి చెప్తుంది. అంతకంటే బహిరంగ
శకునం చెప్పడానికి, వాసుదాసు గారు, చంపకమాలలో వ్రాసిన
వృత్త ప్రతిపదార్ధ తాత్పర్యంలో ఎంతో భావం ఇమిడి వుంది. అదీ ఆయనే వివరిస్తారు. అందులోని ముఖ్య విషయం మూడు విధాలైన కావ్యాల
గురించి-వాటి గుణ గణాల గురించి.
"ఉత్తమం-మధ్యమం-అధమం" అని కావ్యాలను మూడు రకాలుగా విభజించ వచ్చు. కావ్యానికి "ధ్వని" ప్రాణం. శబ్దార్ధాలు "శరీరం" లాంటివి. అంటే, వాచ్యార్ధం కంటే ధ్వన్యర్థం ఎందులో అధికంగా
వుంటుందో అదే ఉత్తమ కావ్యం అనాలి. అసలు ధ్వనే లేకపోతే దాన్ని అధమ కావ్యం అంటారు. కధల పుస్తకాల్లాంటివి చిత్రకావ్యాలంటారు. ధ్వన్యర్ధం ఒక సారి పదానికీ, ఒక సారి వాక్యానికీ, ఇంకో సారి ప్రబంధ సమష్టి పైనా వుంటుంది. అనాదిగా భగవత్ సంబంధమున్న జీవుడు, సంసారంలో చిక్కుకొని, బాధలు పడ్తుంటే, చూడలేని ఆచార్యుడు, వాడిని
ఉధ్ధరించడానికి చేసే ప్రయత్నమే సుందరకాండలోని ధ్వన్యర్థం. ఈ అర్ధాన్ని కాండ మొదట్లోనే "తరువాత రావణాసుర
వరనీత ..." అనే పద్యంలో సూచించడం జరిగింది. ఇది మొదటి "సర్గ" లో వివరంగా వుంది. లంకను "దశ-ఇంద్రియ" అధిష్టితమైన "దేహం" తోనూ, రావణ-కుంభకర్ణులను "అహంకార-మమకారాల" తోనూ, ఇంద్రజిత్తు లాంటి
వారిని "కామ-క్రోధాలు" తోనూ, సీతాదేవిని
వీటన్నింటిలో బంధించబడ్డ "చేతనుడు" గానూ, విభీషణుడిని "వివేకం" గానూ సూచించడం
జరిగిందీ కాండలో. లంకలో శ్రమపడ్తున్న సీతంటే, సంసారంలో కష్టపడ్తున్న జీవుడనీ, అట్టి జీవుడికి, భగవత్ ప్రేరణతో, జానాన్ని ఉపదేశించేందుకు వచ్చిన వాడే "ఆచార్యుడు"అనీ-అతడే హనుమంతుడనీ కూడా
సూచించబడింది.
వరుస క్రమంలో సుందరకాండ లోని
అంతరార్ధాలను పఠిస్తూ పోతే, పైన చెప్పబడిన విషయాలు వివరంగా తెలుస్తాయి. ఆ తెలుసుకోవడం లోనే సుందరకాండ ఎందుకు చదవాలనే ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. ఆరంభం నుండి సుఖాంతం వరకూ సుందరకాండ మందరంలో జరిగిన కథ క్లుప్తంగా జరిగిన
కథ చదువుకుంటూ పోతే మరిన్ని వివరాలు బోధపడ్తాయి.
No comments:
Post a Comment