Sunday, March 12, 2017

శ్రీరామ ముద్రికనిచ్చి చూడామణి తీసుకున్న హనుమంతుడు ..... ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

శ్రీరామ ముద్రికనిచ్చి చూడామణి తీసుకున్న హనుమంతుడు
ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (13-03-2017)

          సుందరకాండ ఎందుకు చదవాలి? ఎందుకు పారాయణం చేయాలి? శ్రీమద్రామాయణం చదవ దల్చుకున్న వారు సాధారణంగా సుందరకాండ తోనే ఎందుకు ప్రారంభించాలి? సుందరకాండ చదివే ముందు నేను యీ ప్రశ్న వేసుకోలేదు. అయితే పూర్తిగా చదివిన తరువాతా, చదువుతున్నప్పుడూ, ఈ ప్రశ్న వేసుకుంటూ, జవాబు వెతుక్కుంటూ, పోవాలి. ఎందుకు చదవాలనే విషయం దానంతడదే బోధపడుతుంది. సుందరకాండ వృత్తాంతమంతా కేవలం ఒకటిన్నర రోజుల్లోనే జరిగింది. కధ విషయాని కొస్తే, హనుమంతుడు సముద్రాన్ని లంఘించడం, లంకకు చేరడం, సీతాదేవి కోసం వెతకడం, ఆమెను చూడడం, రామ లక్ష్మణుల సమాచారం చెప్పడం, శ్రీరామ ముద్రికనిచ్చి-చూడామణిని తీసుకో పోవడం, లంకా దహనం, మరలిపోయి శ్రీ రాముడికి సీతమ్మ సందేశాన్నివ్వడం-ఇంతే!. ఈ మాత్రం దానికి పెద్ద పుస్తకమేమీ అవసరం లేదు. ఇంకొంచెం లోతుకు పోతే అసలు సుందరకాండ వృత్తాంత ఇలా సాగుతుంది:

            సీతాదేవిని వెతుక్కుంటూ కిష్కిందకు చేరిన శ్రీరాముడు వాలిని చంపి, సుగ్రీవుడిని వానర రాజ్యానికి రాజును చేస్తాడు. బదులుగా సీతాదేవిని వెతికించి పెట్తానని సుగ్రీవుడు వాగ్దానం చేస్తాడు. ఆ తర్వాత కథే సుందరకాండ. నలు దిక్కులకూ పోయిన వానర బృందంలో ఒకటి, దక్షిణ దిక్కుగా పోతుంది. సాక్షాత్తూ యువరాజు అంగదుడి నేతృత్వంలోని బృందమది. జాంబవంతుడి ప్రేరణతో మహేంద్ర పర్వతాన్ని ఎక్కి, అక్కడనుండి లంక కెళ్ళాలన్న సంకల్పంతో సిద్ధపడ్డ హనుమంతుడి ప్రయాణ సంబ్రమంతో మొదలవుతుందీ కాండ. సముద్రాన్ని లంఘించి ఎలా ప్రయాణం చేస్తున్నాడన్న వర్ణనతో కధ శుభారంభ మౌతుంది. హనుమంతుడికి సహాయం చేయాలనుకొని సముద్రుడు "మైనాకుడిని" పంపుతాడు. సమయాభావం వల్ల ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించ లేనని సున్నితంగా తిరస్కరించి, ఆయనకు నచ్చ చెప్పి ముందుకు సాగిపోతాడు. దేవతల ప్రేరణతో అడ్డుపడ్డ నాగమాత "సురస"ను జయిస్తాడు. తనకున్న అణిమాది అష్టసిధ్ధులతో చిన్న ఆకారంగా మారి, ఆమె కోరినట్లు ఆమె నోట్లో దూరి, సురక్షితంగా బయటకొస్తాడు. ఆ తర్వాత హింసికైన "సింహిక"ను వధించి, ప్రయాణాన్ని సాగించి లంకకు చేరుకుంటాడు. ఇదంతా కేవలం ఎనిమిది గంటల్లో జరిగింది.

            లంకా నగరం చేరిన హనుమంతుడు ఉద్యానవనంలో విహరిస్తూ, ముందున్న కార్యం గురించి పలు విధాలుగా ఆలోచిస్తాడు. లంక ప్రవేశిస్తూ అడ్డగించిన లంకాధి దేవత-లంఖిణిని, జయించి, లంకా వినాశానికి నాంది పల్కుతాడు. లంకలో చిన్న పిల్లిలా దిగి, తర్వాత చిన్నకోతి ఆకారంలో యధేఛ్చగా సంచరించి సీతాదేవికై వీధీ-వీధీ గాలిస్తాడు. మండోదరిని చూసి సీతాదేవేనని భ్రమపడుతాడు ఓ సమయంలో. రావణ-రాక్షస స్త్రీల మధ్య వెతుకుతాడు. రావణ గృహంలో వెతుకుతాడు. అక్కడే పుష్పక విమానాన్ని చూస్తాడు. రావణ అంతఃపురం చూసి అంతఃపుర స్త్రీల మధ్య సీతున్నదేమోనని అక్కడా వెతుకుతాడు. సీతాదేవి ఎక్కడా కనిపించక పోవటంతో, విచారంతో, మళ్ళీ-మళ్ళీ వెతుకుతూ, అశోకవనానికి చేరుకుంటాడు బుధ్ధి మతాం వరిష్టుడైన హనుమంతుడు.


            హనుమంతుడి ప్రయత్నం ఫలించి, వెతుకుతున్న సీతాదేవి అశోకవనంలో కనిపిస్తుంది. ఆమే సీతని నిశ్చయించు కోవడానికి, కొన్ని ఆధారాలు చూసుకుంటాడు. అవే ప్రత్యక్ష-పరోక్ష నిదర్శనాలు. ఆమె స్థితికి దుఃఖిస్తాడు. రాక్షస స్త్రీల బెదిరింపులు-రావణుడి బెదిరింపు మాటలు-సీత రావణుడిని నిందించడం, పరుషపు మాటలనటం-ఆయన ఆగ్రహించడం-మళ్లీ రాక్షస స్త్రీల బెదిరింపులు- ఇవన్నీ వింటాడు చెట్టు చాటునుండి హనుమంతుడు. సీతాదేవి భయపడి శ్రీ్రాముడిని తల్చుకుంటూ దుఃఖించడం-త్రిజట స్వప్న వృత్తాంత కూడా వింటాడు. సీతాదేవి మరణించే ప్రయత్నం చేస్తుంటే ఆమెతో ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తాడు హనుమంతుడు.

సీతాదేవి వినేటట్లు శ్రీరాముడి కథను ప్రస్తావించి ఆయన్ను  ప్రశంసిస్తూండగా ఆయన ఉనికి తెలుస్తుందామెకు. ఆ తర్వాత ఆమెతో సంభాషించడం, ఒకరి విషయాలు ఇంకొకరికి చెప్పుకొఓడం, కుశల వార్తలడగడం జరుగుతుంది. సందేహాలు తీర్చుకున్న సీత, రామ లక్ష్మణుల చిహ్నాలేంటని అడగడం, హనుమంతుడు ఆమెకు నచ్చే రీతిలో చక్కగా శ్రీరాముడి దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణించి చెప్పడం, ఆ తర్వాత కథ. శ్రీ రామ ముద్రికను హనుమంతుడిచ్చినప్పుడు నర్మ గర్భితంగా మాట్లాడిన సీతకు, ధైర్యం చెప్తాడు హనుమంతుడు. తన మీద నమ్మకం కుదిరిందనుకున్న హనుమంతుడు సీతను తన వీపు మీద కూర్చోబెట్టుకుని శ్రీ రాముడి దగ్గరకు తీసుకెళ్తానంటాడు. ఆమె నిరాకరిస్తే, ఆమెను కల్సినట్లు గుర్తుగా ఏమన్నా ఇవ్వమంటాడు. కాకాసుర వృత్తాంతాన్ని చెప్పి, చూడామణి నిచ్చి, హనుమంతుడిని ఆశీర్వదించి సెలవిస్తుంది వెళ్ళి రమ్మని సీతాదేవి.

            శత్రువుల బలా-బలాలు తెల్సుకోదల్చిన హనుమంతుడు, వెంటనే తిరిగి పోకుండా, అశోక వనాన్ని పాడు చేసి కయ్యానికి కాలు దువ్వుతాడు. రావణుడికి కోపం వచ్చి పంపిన కింకరులను మట్టుపెట్తాడు. హనుమంతుడు జయఘోశ చేస్తూ ప్రతీకారంగా పంపబడిన చైత్య పాలకులను చంపుతాడు. జంబుమాలి వధ, మంత్రి పుత్రుల చావు, సేనానాయకుల మృతి, అక్ష కుమారుడి వధ వెంట-వెంట జరుగు తాయి. ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డ హనుమంతుడిని తాళ్ళతో కట్టేయటంతో, బ్రహ్మాస్త్ర బంధనం వీడిపోతుంది. రావణుడికి తన వృత్తాన్తాంతా చెప్పి, లంకకు వచ్చిన కారణం చెప్తాడు హనుమంతుడు. రావణుడికి బుధ్ధి చెప్తుంటే కోపించిన ఆయన హనుమంతుడుని దండించమన్నప్పుడు  విభీషణుడి బోధతో తోక కాల్చి పంపమంటాడు రావణాసురుడు.


            ఆ తర్వాత, లంకా దహనం చేస్తాడు హనుమంతుడు. సీతాదేవిని పునర్దర్శించి మళ్ళీ సెలవు తీసుకుని, గంట సేపట్లోనే సముద్రాన్ని లంఘించి, మహేందాద్రి పై దిగుతాడు  హనుమంతుడు. వానర మిత్రులను కలిసి లంకకు పోయివచ్చిన విధమంతా "దండకం" లాగా చెప్తాడు హనుమంతుడే వక్తగా. మధువనంలో విచ్చలవిడిగా విహరించిన వానరులతో కిష్కిందకు చేరుకుని, శ్రీరాముడికి సీతాదేవి స్థితిని వివరిస్తాడు. చూడామణినిస్తాడు. దు:ఖిస్తున్న శ్రీరాముడిని ఓదారుస్తాడు సుగ్రీవుడు. శ్రీరాముడికి హనుమంతుడు సీతా సందేశం వినిపిస్తాడు. కథ అయిపోతుంది. కాకపోతే ఇది టూకీగా. ఈకధంతా వ్రాసినా 40-50  పేజీలకన్నాఅ ఎక్కువుండ కూడదు కదా! అయినా ఎన్దుకింత పెద్ద గ్రంధమైంది మరి? కేవలం కథ చెప్పటం మాత్రమే కాకుండా ఆయా సందర్భాల్లో చేసిన వర్ణనలనేకం. మహేంద్ర పర్వతం వర్ణన, హనుమంతుడి గమనవేగ వర్ణన, మైనాకుడి వృత్తాంతం, లంక వెలుపలి ఉద్యానవన వర్ణన, లంకా నగర వర్ణన, చంద్ర వర్ణన, రావణుడి అంతఃపుర వర్ణన, రాక్షస స్త్రీల వర్ణన, పుష్పకవిమాన వర్ణన, రావణుడి వర్ణన, అశోకవన వర్ణన, సీతాదేవి దుఃఖ వర్ణన, సీతా రామచంద్రుల వర్ణన, శ్రీ్రాముడి విరహ తాప వర్ణన, కాకాసుర వృత్తాంతం, చూడామణి వర్ణన, రావణుడి సభలో రావణుడి వర్ణన, రాక్షస విలాప వర్ణన, అరిష్టాద్రి వర్ణన, మధువన వర్ణనలతో మరింత నిడివైంది సుందరకాండ.

No comments:

Post a Comment