తిరుమలేశుని
దర్శనం...స్వామి ఇస్తేనే దొరికేది!
వనం జ్వాలానరసింహారావు
ఆంధ్రప్రభ
దినపత్రిక (21-03-2017)
ప్రాప్తి ఉంటేనే ఏదైనా లభిస్తుందని పెద్దలంటారు. అలాగే తిరుమలేశుని
దర్శనం కూడా.
"వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే
నాస్తి కించన, వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి"… ఆ కలియుగ ప్రత్యక్ష దైవ దర్శనం ఒక్క
క్షణ కాలంపాటు కలిగినా చాలని,
వందల-వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి, లక్షలాది మంది భక్తులు, పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమల
కొండకు నిత్యం వెళుతుంటారు.
స్వామిని దర్శించుకున్న
సామాన్యులు కాని, అసామాన్యులు కాని, గంటల తరబడి క్యూలో నిలుచున్న వారు
కాని, సరాసరి వైకుంఠ ద్వారం గుండా లోనికి
వెళ్లగలిగిన వారు కాని,
ఒక్క టంటే ఒక్క దర్శనం
చాలనుకునేవారు కాని,
వీలై నన్ని దర్శనాలు
కావాలనుకున్నవారు కాని,
ఒక్క రూపాయి హుండీలో వేయలేని
వారు కాని, కోట్లాది రూపాయలు సమర్పించుకోగలిగే
వారు కాని.....ఎవరైనా...కారణమేదైనా....ఎలా వెళ్లినా, వచ్చినా....తృప్తి తీరా, తనివితీరా దేవుడిని చూశామంటారే కాని, అసంతృప్తితో ఎవరూ వెనుదిరిగిపోరు. వెళ్తూ....వెళ్తూ,
దర్శనంలో పడ్డ ఇబ్బందులేమన్నా
వుంటే పూర్తిగా మరచి పోతూ,
ఏ భక్తుడైనా, ఏం కోరినా-కోరకున్నా, తప్పకుండా కోరేది మాత్రం ఒకటుంటుంది.....అదే, "స్వామీ,
పునర్దర్శన ప్రాప్తి కలిగించు" అని. అలా
తన భక్తులను తన వద్దకు రప్పించుకుంటాడా కలియుగ దైవం!
శ్రీ
మహావిష్ణువు నివాసమైన శ్రీ వైకుంఠమే తిరుమల! మహావిష్ణువిక్కడ
"ఆనంద నిలయం" అనే తన "బంగారు మేడ" లో దర్శనమిస్తున్నాడు. ఆలయ ప్రవేశం చేయాలంటే "మహా ద్వారం" గుండా క్యూ లైన్లలో వెళ్లాలి భక్తులు. మహా ద్వారాన్ని "పడి కావలి" అని, "ముఖద్వారం"
అని, "సింహద్వారం" అని, "పెరియ తిరువాశల్"
అని కూడా అంటారు. ఈ మహా ద్వారానికి ఇరు ప్రక్కల
ద్వారపాలకులుంటారు.
మహా ద్వారానికి ఆనుకుని ఒక
మండపం వుంటుంది. ఆ పక్కనే "అద్దాల మండపం" వుంటుంది. అక్కడా కొన్ని వుత్సవాలు జరుగుతాయి. దానికి ఎదురుగా వున్న మరో మండపంలోనే
ఒకప్పుడు కళ్యాణోత్సవం జరిగేది.
ఆ మండపం పక్కనే "తిరుమలరాయ మండపం" వుంటుంది. దానికీ ప్రాధాన్యత వుంది. ఆలయ ప్రాంగణంలోనే "ధ్వజస్తంభం", "బలిపీఠం", "క్షేత్రపాలక శిల" వుంటాయి. అదృష్టవంతులైన భక్తులకు ధ్వజస్తంభం
పక్కనుంచి లోనికి పోయే వీలు కలుగుతుంది. అక్కడ
అన్నీ విశేషాలే!
"నాలుగు
కాళ్ల మండపం",
"విరజానది", శ్రీ వేంకటేశ్వరుడికి అనుదినం
అలంకరించే పూల దండలు,
బంగారు వాకిలి ఉభయ
పార్శ్వాలలో నిలచి వున్న పంచలోహ మూర్తులు, "కులశేఖర పడి".....ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో...ఎన్నెన్నో....!
తెలంగాణ
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ
వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని బంగారు ఆభరణాలు సమర్పించిన సమయంలో స్వామివారిని
సమీపం నుండి తనివితీరా దర్శనం చేసుకున్న వారిలో నేను కూడా వుండడం అరుదైన, అపురూపమైన అనుభవం. సీఎం సతీ సమేతంగా
దేవాలయానికి చేరుకోవడానికి అర గంట ముందరే ఆయనతో దర్శనం చేసుకోవడానికి తెలంగాణ
నుంచి వెళ్ళిన బృందంలోని వారందరినీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి లోనికి
తీసుకెళ్లారు దేవాలయాధికారులు. తొలుత రంగనాయక మండపంలో వుంచిన ఆభరణాలను
కళ్లకద్దుకోవడం, ఆ తరువాత ముఖ్యమంత్రి వెంట దర్శనం
చేసుకోవడం జరిగింది. పేరుపేరునా తన వెంట వచ్చిన ప్రతివారినీ తన సమీపంలోకి పిలుస్తూ, అందరికీ తనివితీరా దర్శనం చేయించారు
సీఎం. హారతీ, తీర్థం అందరికీ లభించింది.
సరిగ్గా
26 సంవత్సరాల క్రితం ఇదే ఫిబ్రవరి నెలలో, దాదాపు
ఇవే రోజుల్లో, అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ మర్రి
చెన్నారెడ్డి దగ్గర పీఆర్వోగా పనిచేస్తున్నప్పుడు కూడా నాకిలాంటి దర్శనమే
లభించింది. అప్పట్లో అమల్లో వున్న నిబంధనల ప్రకారం, సీఎం
వెంట వున్న వారందరినీ ముఖద్వారం నుంచే లోనికి అనుమతించినట్లు జ్ఞాపకం. కాకపోతే
అప్పుడు సీఎం తిరుమలకు వచ్చిన సందర్భం వేరు. కృష్ణా జలాల పంపకం విషయంలో నాటి
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శరద్ పవార్, నాటి
కర్నాటక ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్ తో త్రైపాక్షిక చర్చలకు తిరుపతి వేదికైంది. ఆ
సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను. నాకింకా ఆ సమావేశానికి సంబంధించిన ఒక అంశం
ఇప్పటికీ గుర్తుంది. వాస్తవానికి ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసిన ఉద్దేశం కేవలం
జలాల పంపిణీ విషయమే. రాజకీయాలు వారిమధ్య రాలేదు. నదీ జలాల సంబంధిత సమావేశం తరువాత, వాళ్లు, మళ్లీ తిరుపతిలో ఎక్కడా ప్రత్యేకంగా
కలవలేదు కూడా. అయినప్పటికీ,
ఒక ప్రముఖ పాత్రికేయుడు, అప్పట్లో జాతీయ స్థాయిలో బాగా పేరున్న
"బ్లిట్జ్" ఆంగ్ల వార పత్రికలో రాస్తూ...ఈ ముగ్గురూ కలిసి రాజీవ్
గాంధీకి వ్యతిరేకంగా ఒక కూటమిని తయారు చేస్తున్నారని పేర్కొన్నాడు. ఆ పత్రికలో
వచ్చిన అంశాన్ని నేను సీఎం చెన్నారెడ్డికి చూపించి, జరగని
విషయం రాశారని అంటే...."ఆ మాత్రం భయం రాజీవ్ గాంధీకి వుంటే తప్పేం లేదు"
అని ఆయన వ్యాఖ్యానించారు! ఎందుకో ఈ విషయం ఇప్పుడు మళ్లీ గుర్తుకొచ్చింది.
ఇవన్నీ
ఒక ఎత్తైతే...తిరుమల స్వామి దర్శనం మాటకొస్తే "దర్శనం స్వామి ఇస్తేనే దొరికేది"...అంతే కాని ఎవరూ ఇచ్చేది కాదు. అదో
నమ్మకం. సీఎం కేసీఆర్ ఆభరణాలు స్వామివారికి
సమర్పించిన తరువాత ఎస్వీబీసీ ఛానల్ తో మాట్లాడుతూ తన స్వానుభవం ఒకటి వివరించారు.
కొన్నేళ్ల క్రితం తిరుమలకు వచ్చి కూడా, దర్శనం
చేసుకోకుండా తిరిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, స్వామి
అనుజ్ఞ లేనిదే దర్శనం జరగదని,
అందుకే ఆభరణాలు ఇవ్వడానికి
ఇంత కాలం పట్టిందనీ,
అన్నారు. ఇది నూటికి నూరు
పాళ్లు వాస్తవం.
హైదరాబాద్
నుంచి బయల్దేరి, రేణిగుంట విమానాశ్రయంలో దిగి, అక్కడి మార్పులు చూసిన తరువాత, చిన్నతనం నుంచీ తిరుమల దర్శనానికి
వెళ్లొచ్చిన విషయాలు గుర్తుకు రాసాగాయి. నాకు
ఊహ తెలియక ముందు, తెలిసీ-తెలియని
రోజుల్లో, తెలిసినప్పటి నుంచీ తిరుమల వెళ్లి
రావడంలో చాలా మార్పులు స్వయంగా చూస్తూ వస్తున్నాను.
ఏమిటీ కొండ మహాత్మ్యం? ఏముందీ దైవంలో? ఎందుకిన్ని ఆర్జిత సేవలు? ఒక్కో సేవకున్న ప్రత్యేకత ఏమిటి? పొరపాటునన్నా, లేదా, ఏమరుపాటునన్నా
ఏనాడైనా ఏదైనా సేవ ఆగిందా?
ఏ సేవ, ఎప్పుడు, ఎంతసేపు జరపాలన్న విషయంలో ఏవన్నా నియమ
నిబంధనలున్నాయా? గతంలోను, ఇప్పుడు సేవల వేళల్లో కాని, పట్టే సమయాల్లోకాని, మార్పులు చేర్పులు జరిగాయా? జరగడానికి శాస్త్రీయ కారణాలే మన్నా
వున్నాయా? ఆర్జిత సేవలకు అనుమతిచ్చే భక్తుల
సంఖ్యలో పెంచడం-తగ్గించడం జరిగిందా?
తిరుమల
కొండలో "నిత్య కళ్యాణం-పచ్చతోరణం"…..అన్ని ఆర్జిత సేవలలోను "కళ్యాణోత్సవం" కు ఒక ప్రత్యేకత వుంది. శ్రీ వేంకటేశ్వరుడికి, శ్రీదేవి-భూదేవిలకు, అనునిత్యం తిరుమలలో, భారతీయ హిందూ సాంప్రదాయ రీతిలో, వేద మంత్రోచ్ఛారణల మధ్య, ఇరు వంశాల వంశ క్రమాన్ని-ప్రవరను పఠనం చేస్తూ, అర్చకులు మంగళ సూత్ర ధారణ చేస్తారు. కళ్యాణోత్సవం చేయించిన వారికి నేరుగా
మూల విరాట్ దర్శనం చేయించే ఆనవాయితీ వుండేది ఒకప్పుడు. కాలం మారింది. కాలానుగుణంగా కళ్యాణోత్సవం
చేయించేవారి సంఖ్య పదుల నుండి వందలకు-వేలకు
చేరుకుంది. ఉత్సవం జరిపించే స్థలం కూడా
తదనుగుణంగా మార్చవలసి వచ్చింది.
సరాసరి మూల విరాట్ దర్శనం
చేయించే ఆచారం మారింది.
సర్వదర్శనం క్యూలో కలిపి, ఆ తోపులాటలోనే వీరికీ దర్శనం-అదీ లఘు దర్శనం చేయిస్తున్నారిప్పుడు. ఐనా, కళ్యాణోత్సవం
చేయిస్తున్న వారి సంఖ్య పెరుగుతుందేకాని తగ్గడం లేదు. ఈ మార్పులకు కారణాలుండే వుండాలి. ఇవన్నీ భక్తులు తెలుసుకోవాలనుకున్నా, ఏ కొద్దిమందికో తప్ప అందరికీ
వీలుండదేమో! శ్రీ వేంకటేశ్వరుడికి అను నిత్యం
జరిపించే ఒక్కో సేవకు ఒక్కో ప్రాధాన్యం వుంది-విశేషముంది. ప్రతి సేవలో అనుసరించే ఒక్కో
విధానానికి విశేష ప్రాముఖ్యత వుంది. ఉదాహరణకు
"సన్నిధి గొల్ల" అని పిలువబడే ఒక యాదవ వ్యక్తి బంగారు
వాకిళ్ల తాళాలు తీయడం.
ప్రతి నిత్యం తొలి దర్శనం
అతడికే కలుగుతుంది.
సుప్రభాత సేవ సమయాన పొర్లు
దండాలు మరో విశేషం.
వాటి గురించి గత ఏబై
సంవత్సరాలకు పైగా తిరుమలను దర్శించుకుంటున్న నాకు తెలిసింది చాలా తక్కువ. ఊహ తెలిసినప్పటి నుంచీ - తెలియనప్పటి నుంచి కూడా తిరుమలను అనేక
మార్లు దర్శించుకున్న నాకు అప్పటికీ-ఇప్పటికీ
తేడా కనిపించడం మాత్రం వాస్తవం.
మొదటి సారి చిన్న వయసులో కుటుంబంతో
కలిసి కాలినడకన నేను తిరుమల వెళ్లాను. ఆ
తరువాత సుమారు అరవై ఏళ్ల క్రితం నా ఉపనయనానికి వెళ్లినప్పుడు, పాతిక మందికి పైగా ఒక జట్టుగా కలిసి
వెళ్లాం. నాలుగైదు కచ్చడం (ఎద్దులు లాగే) బళ్లు, మరో
నాలుగైదు (ఎద్దులు లాగే) పెద్ద బళ్లు కట్టుకుని మా స్వగ్రామం
నుంచి బయల్దేరాం. ఆరేడు కిలోమీటర్ల దూరంలో వున్న చిన్న
రైల్వే స్టేషన్ కు చేరుకుని,
అక్కడ నుంచి పాసింజర్ రైల్లో
విజయవాడ వెళ్లాం. విజయవాడలో సత్రం బస..అక్కడినుంచి మర్నాడు సాయంత్రం
తిరుమలకు ప్రయాణం కట్టాం.
బయల్దేరిన మూడో రోజు ఉదయం
తిరుపతి రైల్వే స్టేషన్‌లో దిగాం.
స్థానికంగా వున్న దేవాలయాలను
దర్శించుకుని, మర్నాడు తిరుమలకు బస్సులో
ప్రయాణమయ్యాం. ఆ రోజుల్లో తిరుమల-తిరుపతి దేవస్థానం వారే బస్సులు
నడిపేవారు. అప్పట్లో సెక్యూరిటీ చెకింగులు అసలే
లేవు. తిరుమలలో ఇప్పటి లాగా టిటిడి వారి
వసతి గృహాలు ఎక్కువగా వుండేవి కావు. ఎన్నో
ప్రయివేట్ సత్రాలుండేవి.
వాటిలో "పెండ్యాల వారి సత్రం" చాలా పేరున్న సత్రం. అక్కడే బస చేశాం. వంటా-వార్పూ
అన్నీ అక్కడే. అక్కడే నా ఉపనయనం జరిగింది. దాదాపు మూడు రోజులు అక్కడే వున్నాం. దర్శనానికి ఎన్ని సార్లు వీలుంటే
అన్ని సార్లు, ఏ దర్శనం కావాలనుకుంటే ఆ దర్శనానికి, ఎవరి సహకారం లేకుండానే వెళ్లొచ్చాం. నాకు గుర్తున్నంతవరకు ప్రధాన ద్వారం
గుండా సరాసరి వెళ్లొచ్చాం.
కళ్యాణోత్సవం చేయించాం. గుళ్లో తిరగని ప్రదేశం లేదు. ఏ రకమైన కట్టుబాట్లు లేవు. ఇక లడ్డులకు కొదవే లేదు. కళ్యాణోత్సవం చేయించిన వారు బస చేసే
చోటికి, ఆలయ నిర్వాహకులు, ఒక పెద్ద గంప నిండా పులిహోర, దద్ధోజనం, పొంగలి, పెద్ద
లడ్డులు, వడలు, చిన్న
లడ్డులు వచ్చేవి. శ్రీవారి దర్శనానికి ముందు వరాహ
స్వామి దర్శనం చేసుకున్నాం.
పక్కనే వున్న స్వామిపుష్కరణి-కోనేరులో స్నానం చేసే వాళ్లం. అప్పట్లో అందులో నీరు శుభ్రంగా-కొబ్బరి నీళ్లలా వుండేది. తిరుమల సమీపంలోని పాప నాశనానికి
తప్పనిసరిగా వెళ్లే ఆచారం వుండేది అప్పట్లో. అక్కడ
నిరంతరం ధారగా నీరు పడుతుండేది.
నీరు పడడానికి ఒక చైన్
గుంజాలి. అది గుంజినప్పుడు నీరు పడకపోతే పాపాలు
తొలగనట్లు భావించేవారు.
ఆ రోజుల్లో ఒక పద్దతి ప్రకారం దైవ
దర్శనం చేసుకునే ఆచారం వుండేది.
వరాహ స్వామి దర్శనం, వేంకటేశ్వర స్వామి దర్శనం, అల మేలు మంగ దర్శనం, గోవింద రాజ స్వామి దర్శనం, శ్రీ కాళహస్తి దర్శనం తిరుగు
ప్రయాణంలో విజయవాడలో ఆగి కనకదుర్గ దర్శనం చేసుకునే వాళ్లం. సుమారు వారం-పది రోజుల యాత్ర అలా సాగేది అప్పట్లో. సత్రాలలో వుండేవాళ్లం. హాయిగా దర్శనాలు చేసుకునే వాళ్లం. ఇప్పుడేమో మధ్యాహ్నం బయల్దేరి
విమానంలో వెళ్లి, మర్నాడు ఉదయం దర్శనం చేసుకుని ఇరవై
నాలుగు గంటల్లో తిరిగి హైదరాబాద్ చేరుకోవచ్చు. ఒకప్పుడు
ఒక్క వాయుదూత్ మాత్రమే వుండేది...ఇప్పుడు తిరుపతికి పన్నెండు
విమానాలున్నాయి. సాయంత్రం తిరుమలకు చేరుకోవడం, వారి-వారి
స్థాయిని బట్టి మర్నాడు ఉదయం సుప్రభాత సేవ కాని, అర్చన
కాని, అభిషేకం కాని, నిజ పాద దర్శనం కాని, వీటన్నిటినీ మించి ఎల్-1, ఎల్-2,ఎల్-3
కేటగిరీ కింద బ్రేక్ దర్శనం
కాని చేసుకోవడం, వీలుంటే అల మేలు మంగాపురం పోవడం, లేదా సరాసరి విమానాశ్రయానికి పోయి
హైదరాబాద్, ఢిల్లీ, ఇతర
మహానగరాలకు చేరుకోవడం జరుగుతోంది.
సామాన్యులు ఎప్పటి లాగానే
ధర్మ దర్శనం కాని,
ఆన్ లైన్ దర్శనం కాని
చేసుకుంటున్నారు.
యాత్రీకుల
రద్దీ పెరగడం మొదలైంది.
ప్రత్యేక ప్రవేశ దర్శనం రు. 10 టికెట్ తో ప్రారంభమైనట్లు జ్ఞాపకం. సిఫారసు ఉత్తరాల సాంప్రదాయం మొదలైంది. ఆర్జిత సేవలకు కోటా కూడా మొదలైంది. అప్పటి నుంచి వెళ్లిన ప్రతి సారి
టిటిడి ఈఓ కు గాని,
జెఈఓ కు గాని సిఫార్సు
వుత్తరాలు తీసుకెళ్లడం ఆనవాయితీగా మారింది. అప్పట్లో
అర్చనానంతర దర్శనానికి ప్రాముఖ్యత వుండేది. చాలా
మంది కళ్యాణం తప్పక చేయించే వారు.
ఎప్పుడైతే కళ్యాణం చేయించిన
వారికి లఘు, మహా లఘు దర్శనాలు మొదలయ్యాయో ఇక
అక్కడి నుంచి అవి చేయించడం మానుకుంటున్నారు చాలా మంది. అర్చన, సుప్రభాతం, అభిషేకం, కళ్యాణం లాంటివి చేయించిన మాకు "వస్త్రం" సేవ చేయించాలనే కోరిక ఐ. వి. సుబ్బారావు
గారు ఎండోమెంట్ శాఖ కార్యదర్శిగా-టిటిడి బోర్డ్ సభ్యుడుగా వున్నప్పుడు
తీరింది. నిజంగా అదొక అద్భుత అవకాశం. స్వామివారి
ముందర గంటకు పైగా కూర్చుని చూసే అరుదైన అవకాశం అలా మొదటి సారిగా లభించింది. రమణాచారిగారు టిటిడి ఈఓ కాగానే అలాంటి
అవకాశం మరో మారు కూడా లభించింది.
మా అబ్బాయి ఆదిత్యకు కూడా
రెండు పర్యాయాలు ఆ అవకాశం లభించింది.
ఇదంతా
నా అనుభవం మాత్రమే.
నాకింత మంచిగా జరుగుతున్నది
కాబట్టి అక్కడ యాత్రీకులకు ఏ ఇబ్బందీ కలగడం లేదని అనడం లేదు. కాకపోతే ఎవరి అదృష్టం వారిదే! చివరి క్షణం వరకూ దర్శనం టికెట్లు
దొరుకుతాయో, లేదో అన్న అనుమానం నాకు కలిగిన
సందర్భాలు లేకపోలేదు.
అప్పుడొకాయన అన్నారు.... దర్శనం స్వామి ఇవ్వాల్సిందే కాని మనం
తెచ్చుకోవడం కాదని!
ఇప్పటికీ, దర్శనం చేసుకుంటున్నప్పుడు, క్యూలో అసహనానికి గురైన సందర్భాలు
అనేకం. క్యూలో వంటి మీద చేయి వేసి
తోస్తున్నప్పుడు కోపగించుకున్న సందర్భాలు అనేకం. అలానే
వివిఐపి గా స్వామివారి ముందు నన్ను-నా
కుటుంబ సభ్యులను నిలబెట్టిన సందర్భాలూ అనేకం. ఎప్పటికెయ్యది
ప్రాప్తమో అదే జరుగుతుందని అనుకునే వాడిని. కోపమొచ్చినా
అణచుకునేవాడిని. ఏదేమైనా కాలం మారింది. ఏబై-అరవై
ఏళ్ల క్రితం పరిస్థితులు ఇప్పుడు లేవు. సరాసరి
దైవ దర్శనానికి పోయేందుకు ఇప్పుడు వీలు లేదు. ఇప్పటి
నియమనిబంధనలు పాటించక తప్పదు.
భక్తులను ఇలా నియంత్రిస్తేనే
అందరికీ దర్శనం దొరికే అవకాశం వుంటుంది. ఒకనాడు
విఐపి లకు వున్న ప్రాముఖ్యత ఇప్పుడు లేదే! ఆ
రోజుల్లో లాగా అన్నీ-అందరికీ ఇప్పుడు జరగడం లేదే! రాబోయే రోజుల్లో ఏం జరగ బోతోందో ఎవరూ ఊహించలేరేమో! End
No comments:
Post a Comment