Monday, March 27, 2017

హనుమ సదాచార్యుడు .... సీత ఆత్మ స్వరూపిణి ...... ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

హనుమ సదాచార్యుడు .... సీత ఆత్మ స్వరూపిణి
ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (27-03-2017)

సీతాన్వేషణలో భాగంగా, ప్రయాణ సన్నాహంలో వున్న హనుమంతుడు, గురువుకూ, ఇష్ట దేవతలకూ నమస్కరిస్తాడు. కార్యారంభంలో ఇలా విధిగా నమస్కరించడం ఆచార్య లక్షణమనీ, ఉత్తమ గుణమనీ దీనర్ధం. ఆయన సముద్రాన్ని లంఘిస్తుంటే, వాయువు చల్లగా వీచిందట. అంటే భగవత్ కైంకర్యం చేసే వారికి దేవతలు సైతం సహాయం చేస్తారనేందుకు ఇదో నిదర్శనం. అదే విధంగా భగవత్ కార్యం చేయాలన్న ఆసక్తి వుండి కూడా చేయలేని వాడు, చేస్తున్న వారిని ప్రేరేపించి, వారితో ఆ కార్యాన్ని విజయవంతంగా చేయించాలనే విషయం, సముద్రుడు, మైనాకుడు, హనుమంతుడికి చేసిన సహాయం ద్వారా బోధ పడ్తుంది.

          భగవత్ సేవకులకు దేవతలు సహాయపడ్తారు కానీ, ఒక్కోసారి, శ్రేయస్కర కార్యాలకు విఘ్నాలెక్కువ ఎదురవుతాయి. "శ్రేయాంస బహు విఘ్నాని" అని కదా ఆర్యోక్తి! సంసారాన్ని తరించేందుకు, అత్మావలోకన పరుడై యోగాభ్యాసం చేస్తున్న వ్యక్తిని చూసి, ఇతడు చెడిపోతున్నాడనే అనవసర భయం తోనో, ప్రేమ తోనో, అతడి బంధువులు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఇదే సముద్రుడు, మైనాకుడి ద్వారా చేయించిన పని. అయితే, ఇది విఘ్నమే! ముముక్షువైన యోగిని, భాగవతుడిని, దేవతలు పరీక్షించేందుకు విఘ్నాలు కలిగిస్తారు. ఇట్టి వాటిని లక్ష్య పెట్టక, విఘ్నాలు కలిగించే వారికి మంచి మాటలు చెప్పి, సమాధాన పర్చి, హనుమంతుడి లాగా భక్తి తోనే తప్పించు కొని పోవాలి. అదే నిష్ట దూత లక్షణం, ఆచార్య లక్షణం. రాక్షసి సింహిక లేక అంగారక హనుమంతుడికి అడ్డు పడుతుంది. దీన్నే ముముక్షువైన యోగికి దుష్ట గ్రహ భూతాలవల్ల, దుష్ట జనుల వల్ల కలిగే బాధలతో పోల్చుకోవాలి. ఇలా విరోధ భావం కల వారి మీద జాలి, దయ, గౌరవం చూపాల్సిన పని లేదు. హనుమంతుడి లాగా వాళ్లను చంపడమే సరైన మార్గం.

          మొదట్లో లంకను చూసినప్పుడు, వానర వీరుల్లో, లంకలో ప్రవేశించ గలవారు నలుగురు మాత్రమే వున్నారనుకుంటాడు  హనుమంతుడు. ఆ తర్వాత ఆ సంఖ్యను తొమ్మిదికి పెంచుతాడు. చివర్లో వానరుల్లో ప్రతివాడూ తన కంటే బలవంతుడేనంటాడు. దీనర్ధం...కార్య భారం తెలియని మూర్ఖులు మొదట్లో తమనీ, తమవారినీ ఎక్కువగా అంచనా వేసుకుంటారని, చివరకు వెల్లికిల పడ్తారనీ అర్థం. ఆలోచనాపరులు, కార్య భారం తెలిసిన వారు, కార్య దక్షులు, ఇది మనం చేస్తామా, లేదా? మనవల్ల జరుగుతుందా? అని మొదట్లో జంకు తారు. ఎలాగూ ఈపని చేయక తప్పదనుకొని కొంచెం, కొంచెం చేయడం మొదలెట్టి క్రమేపీ ధైర్యం తెచ్చుకుంటారు. కార్యాన్ని సాధిస్తారు. ఇన్ని ఆలోచనలు చేసినప్పటికీ, హనుమంతుడొక్కడే రాక్షసులందర్నీ జయించి, లంకా దహనం చేసి వచ్చాడు కదా! ఇది దూత లక్షణమే! దౌత్య నీతి హనుమంతుడి మరొక ప్రజ్ఞా వైభవం.

లంకలో ప్రవేశించే హనుమంతుడికి అలంకరించుకున్న స్త్రీ లాగా కనిపిస్తుంది రావణ పట్టణం. ఇక్కడ లంకా నగరాన్ని స్త్రీగా వర్ణించడమంటే, లంకాధి దేవత "లంకిణి" రాక సూచిండమే! లంకాధి దేవతను జయిస్తాడు. "లంక" అంటే "దేహం" అని అర్ధం. హనుమంతుడు లంకను జయించాడంటే, తనలో వున్న "ఆత్మ"ను వెతికే వాడు, మొదలు దేహ భ్రాంతిని జయించాలన్న అర్ధం స్ఫురిస్తుంది. దేహ భ్రాంతిని జయించని వాడికి "ఆత్మావలోకనం" లేదు. దేహ-ఆత్మ బేధాన్నీ, సంబంధాన్నీ అర్థం చేసుకోలేకపోవడమే మన కడకండ్లకు కారణం. దేహం వేరు, ఆత్మ వేరు అనే సత్యం అంత సులభంగా అర్థమయ్యేదికాదు. లంకిణిని జయించిన హనుమంతుడు, రాక్షస సంచారం లేని ప్రదేశం ద్వారా లంకా ప్రవేశం చేసాడు. ఇలా ప్రవేశించాలన్నది "రాజనీతి".


          ఇలా చేయడం వెనుక "ముముక్షు" వైన "యోగి" చర్య ఎలా వుండాలో సూచించ బడింది. ఆత్మావలోకన పరుడు సత్య విక్రముడై వుండాలి. "సత్యం" అంటే, అహింస... సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే "యమము"లన్నింటికీ ఉప లక్షణం. ఆత్మ, సత్యం వల్ల, తపస్సు వల్ల, జ్ఞానం వల్ల, బ్రహ్మచర్యం వల్ల లభిస్తుంది. ఇవన్నీ హనుమంతుడిలో వున్నాయి. కాబట్టి సత్యం  అనేది అన్నింటికీ ఉప లక్షణం. బలహీనులకు  ఆత్మ అనుభూతి లభించదు. దేహమే ఆత్మనే భ్రాంతివల్ల ఇది జరుగుతుంది. "లంక" అనే దేహం ప్రకృతి పరిణామం. అది కామ రూపిణి. లంక శబ్దానికి "రంకుటాల" అనే అర్ధం కూడా వుంది. ఈ జీవుడిని ఈ జన్మలో అనుసరించిన దేహం, మరో జన్మలో మరో జీవుడిని ఆశ్రయిస్తుంది. అంటే ఈ దేహం రంకుటాల లాంటిది. తపస్సుతో దేహాన్ని గెలవాలే కాని సౌమ్య మార్గంలో సాధ్యం కాదు. నశించేది దేహం. దేహానికి "నవ" ద్వారాలున్నాయి. ఆత్మలో మనస్సు ప్రవేశించడానికి ఈ ద్వారాలు పనికి రావు.

          హనుమంతుడు లంకను జయించాడంటే....యోగి దేహాన్ని జయించినట్లే. దేహం వశ పడినంత మాత్రాన ఆత్మావలోకనం లభించదు. హనుమంతుడు సీత కొరకై వెతుకుతున్నప్పుడు మండోదరిని చూసి సీతని భ్రమిస్తాడు. అంటే, ఆయన అన్వేషణలో, శోధించే సమయంలో, కనిపించిన ఆత్మ తేజస్సు లాంటి తేజస్సును "ఆత్మ" అని భ్రమించ కూడదు. మున్ముందు మరింత హెచ్చరికతో, నిష్కాముడై, జితేంద్రుడై వెతకాలి. ఇలా వెతుకుతుంటే, స్వప్రయత్నం ద్వారానే కార్యం సాధ్యమౌతున్నదనే భావనుంటే, అది తొలగి పోయే వరకు, ఆత్మ దర్శనం కలగదు. ఆందుకే కార్య సిధ్ధికై, సీత-రామ-లక్ష్మణులకు, మ్రొక్కి ముందుకు సాగాడు. కాబోయే సీతా దర్శనానికీ, జరిగిన రామ దర్శనానికీ, సుగ్రీవుడే కారణం కనుక ఆయనకూ నమస్కరించాడు. హనుమంతుడు సంపాతి (జటాయువు సోదరుడు) మాటలందు నమ్మకంతో రావణుడి అంతః పురంలో సీతను వెతికినట్లే, సాధకుడు గురు వాక్యం మీద నమ్మకంతో, దేహంలో ఆత్మాన్వేషణ చేయాలి. కనపడక పోతే, ప్రయత్న లోపం జరిగిందనుకొని, నిరుత్సాహ పడకుండా, కనిపించేంత వరకూ వెతకాల్సిందే! ఆచార్యానుగ్రహం వల్లనే ఆత్మ దర్శనం కలుగుతుంది. ఇక్కడ హనుమ సదాచార్యుడు కాగా, సీత ఆత్మ స్వరూపిణి. అంటే జీవాత్మ అన్నమాట. శ్రీరాముడు "పరమ ఆత్మ" కద! ఈ జీవాత్మ-పరమాత్మలను కలిపిన ఘటికుడు హనుమంతుడు.


అలా వెతుకుతున్నప్పుడు కనిపించింది, తాను వెతుకుతున్నదేనని నిశ్చయించు కోవడానికి తగిన కారణాలనూ వెతుక్కోవాలి. సీతాదేవి విషయంలో హనుమంతుడు ఇలానే చేస్తాడు. సీతాదేవిని చూసి తనలో తానే తర్కించుకున్న హనుమంతుడు, ఆమె తపస్సు చేసుకుంటున్న స్త్రీ లాగా వుందనీ, కుదుట పడని శ్రధ్ధ ఆమెలో కనిపించిందనీ, సందేహం కలిగించే స్మృతివలె వుందనీ భావిస్తాడు. ఆమె  జితేంద్రియత్వాన్నీ, భోగవిరాగాన్నీ, కుదుట పడని శ్రధ్ధనీ, నిశ్చయ జ్ఞానాన్నీ, బుధ్ధి నిష్కల్మశాన్నీ స్ఫురిస్తున్నాయీ వర్ణనలు. సీతాత్వానికి ఏ విధమైన హాని లేదు. కానీ...ఆమె సీతే అని తెలుసుకోలేని లోపం ఆ మూడుఢిదే. ఆత్మావలోకమవడానికి ముందర, ఆత్మ జ్యోతి లాగా కనిపించిన వెలుతురుని చూసి భ్రమ పడ కూడదు. అదే ఆత్మని సంతోషిస్తే, భ్రష్టుడవుతాడు. ఆచార్య లక్షణం ఏదో శాస్త్రాలు చెప్పిన పధ్ధతిలో ఆలోచించి, స్వబుధ్ధితో తర్కించి, వూహించి, నిశ్చయించు కోవాలి. అదే చేస్తున్నాడు హనుమంతుడు.

No comments:

Post a Comment