Monday, March 27, 2017

అభివృద్ధి కోసమే అప్పులు : వనం జ్వాలా నరసింహారావు

అభివృద్ధి కోసమే అప్పులు
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (28-03-2017)

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు నిరవిధకంగా వాయిదాపడ్డాయి. సభ ఆమోదించిన వివిధ శాఖల పద్దుల మేరకు ప్రభుత్వం నిదులను ఉపయోగించేందుకు అవసరమైన ద్రవ్య వినియోగ బిల్లుకు ఆమోదం లభించింది. మార్చ్ పదవ తేదీన ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు బీఏసీ లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా కొనసాగాయనే అనాలి. 

గవర్నర్ ప్రసంగం మధ్యలో బీఏసీ నిర్ణయానికి విరుద్ధంగా ప్రవర్తించారనే కారణాన ఇద్దరు తెలుగుదేశం శాసన సభ్యుల సస్పెన్షన్, చివరి రోజుల్లో పోడియంలోకి వెళ్ళిన బీజేపీ సభ్యుల సస్పెన్షన్ మినహా మిగతా కార్యకలాపాలన్నీ ఆటంకం లేకుండానే జరిగాయనాలి. తెలంగాణ ఏర్పాటైన తరువాత జరిగిన ఈ నాలుగు బడ్జెట్ సమావేశాలకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో పద్దులన్నీ చివరలో గెలిటిన్ అయ్యాయే కాని, చర్చ జరిగి ఆమోదించడం జరిగిన సందర్భాలు లేవనే అనాలి. దీనికి ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యులందరినీ అభినందించాలి. ద్రవ్య వినియోగ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చే ముందర, సీఎం, రాష్ట్ర శాసన సభా కార్యకాలాపాల విషయంలో ఎలా పలువురు హర్షామోదాలు తెలుపుతున్నారో చెప్పి, దానికి సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్పారు. సభాపతి సహితం సభను వాయిదా వేయడానికి ముందర సభ్యులందరికీ, సభను హుందాగా నడిపినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు.

          శాసన సభ కార్యకలాపాల్లో ఆద్యంతం ఒకటి రెండు విషయాల మీద అనేక పర్యాయాలు చర్చ జరిగింది. అవే అంశాలను గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలోను, బడ్జెట్ పైనా-పద్దుల పైనా చర్చ జరిగే సందర్భంలోను, చివరకు ద్రవ్య వినియోగ బిల్లుకు ఆమోదం తెలపడానికి జరిగిన చర్చ సందర్భంలోను పలువురు గౌరవ సభ్యులు, ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి లేవనెత్తారు. వాటిలో ఒకటి తెలంగాణ రాష్ట్రం సాధించిన వృద్ధి రేట్ కాగా, మరోటి రాష్ట్రం చేసిందని పలువురు ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావించిన ప్రభుత్వ అప్పుల సంగతి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో మాట్లాడిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఒకానొక రోజుల్లో అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాలలోనూ, ఒకే పార్టీ అధికారంలో వున్న సమయంలో, కేంద్ర ప్రభుత్వం మాత్రమే రాష్ట్రాలకు అప్పులిచ్చే స్తోమత వుండేదనీ, అప్పట్లో అలా ఇవ్వ గలిగే పరిస్థితులుండేవనీ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన దరిమిలా రాష్ట్ర నిధులు రాష్ట్రమే వాడుకునే వెసలుబాటు, తెలంగాణ సాధించిన ఆర్థిక అభివృద్ధి వల్ల ప్రజల్లో పెరుగుతున్న ఆత్మ విశ్వాసం, ప్రభుత్వం తమ అవసరాలకు ఏ విధంగానైనా డబ్బు సమకూర్చుకొనగలదనే ధీమా ప్రజలకు కలగడం, గణనీయమైన గ్రోత్ సాధించడమంటే ప్రభుత్వానికి తగినంత శక్తి సామర్థ్యాలున్నాయని నిరూపణ కావడం, గతంలో లేని విధంగా రాష్ట్ర వనరుల, మానవ వనరుల మాపింగ్....లాంటి విషయాలను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో మంచిని మంచనీ, చెడును చెడనీ చెప్పగలిగే విచక్షణ వుండాలనే అభిప్రాయాన్ని కూడా సీఎం వ్యక్తం చేశారు.


          గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద మాట్లాడిన బీజేపీ శాసన సభ సభ్యుడు కిషన్ రెడ్డి "భారీ బడ్జెట్ కాదిది...బడాయి బడ్జెట్" అంటూ వృద్ధి రేటు మెరుగైందని ప్రభుత్వం చెప్పడాన్ని తప్పుబట్టారు. శాసన సభ సాక్షిగా ప్రజలను మభ్యపెట్తున్నారని వ్యాఖ్యానించారు...అంకెల గారడీ అన్నారు...ఎఫ్.ఆర్.బీ.ఎం పరిమితి పెంచుకోవడం కోసం లెక్కలన్నీ పెంచి చూపిస్తున్నారన్నారు. అప్పుల ప్రస్తావన తెస్తూ...ఇది బంగారు తెలంగాణ కాదు...బాకీల తెలంగాణ అన్నారు. గత మూడేళ్లలో అప్పులు విపరీతంగా పెరిగాయనీ, సగటున మనిషి అప్పు పెరిగందని, వడ్డీ చెల్లింపులు కూడా పెరిగాయనీ, బడ్జెట్ అంతా ఊహాలోకంలో విహరించేదిగా వుందనీ అన్నారు కిషన్ రెడ్డి. ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి కూడా ఇదే తరహాలో విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న అప్పుల విషయం ప్రస్తావించిన జానారెడ్డి, అప్పులు చేయడం సరైందా? కాదా? అని ప్రశ్నించి, అప్పులు చేయడానికి అభ్యంతరం వుండకూడదు కాని, అప్పులు-ఆస్తులు బేరీజు వేసుకోకుండా, ఆస్తులకంటే అప్పులు అధికంగా చేయడం ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందని అన్నారు. ఎలా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పులకంటె ఆస్తులు ఎక్కువగా వుండేవీ, ఎలా తమ ప్రభుత్వాలు అప్పులు తీర్చుకుంటూ, ఆస్తులు పెంచుకుంటూ పోయిందీ లెక్కలతో సహా వివరించారాయన. "ఎల్లలు దాటిన అభివృద్ధిని రాష్ట్రం సాధించింది"అనడం తప్పుబట్టిన జానారెడ్డి, బడ్జెట్ సప్తసముద్రాలు దాటిందేమో కాని అభివృద్ధి ఎక్కడిదక్కడే వుందని అన్నారు. మొత్తం మీద "బడ్జెట్ గందరగోళంగా, ప్రజల్ని భ్రమించేదిగా, ఆశలపల్లకిలో ఊరేగించేదిగా వుందికాని వాస్తవాల మీద లేదు" అని వ్యాఖ్యానించారు.

            ద్రవ్య వినియోగ బిల్లు సభ ఆమోదానికి జరిగిన చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్లీ వృద్ధి రేట్ అంశాన్ని ప్రస్తావించారు. "గ్రోత్" ను "బూస్ట్" చేసి చూపుతున్నారని, బడ్జెట్ అంకెలు కూడా బూస్ట్ చేసారని, అంకెల గారడీ అని, రాష్ట్ర భవిష్యత్ కు ఇది మంచిది కాదని, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం గారంటీగా వుండి చేసే అప్పులు కూడా పెరిగిపోతున్నాయని, ఇది దేనికి సంకేతం అని అడిగారు. సమాధానంగా సీఎం తమ ప్రభుత్వం అప్పులు చేస్తున్న మాట వాస్తవేమనీ, ఐతే, అప్పులు చేస్తూ, సద్వినియోగం చేసుకుంటూ, ప్రతి సంవత్సరం విడతలుగా చెల్లించుకుంటూ పోతున్నామని అన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్ లో అప్పుల చెల్లింపుకు రు. 20, 000 కోట్లు కేటాయించినట్లు కూడా చెప్పారాయన. అప్పులు చేయడమంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సామర్థ్యానికి, ఆర్థిక పరిపుష్టికి సంకేతమని సీఎం అన్నారు. భగవంతుడి దయవల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థి అత్యంత మెరుగ్గా వుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ 15% వృద్ధి రేట్ వుండి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో తక్కువ అప్పులుండేవనీ, ఇప్పడవి పెరిగాయనీ ప్రతిపక్షాలు చేసిన విమర్శకు సమాధానంగా, సీఎం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉదాహరణ చెప్పారు. ఆ ప్రాజెక్ట్ మొట్టమొదటి అంచనా కేవలం రు. 92 కోట్లేనని, ఇప్పుడు రు. 92, 000 కోట్లకంటే ఎక్కువ వుంటుందనీ, అప్పట్లో డబ్బు విలువకు, ఇప్పటి డబ్బు విలువకు చాలా వ్యత్యాసం వుందనీ, సహజంగానే ఇప్పటి విలువకు అనుగుణంగా అప్పుల మొత్తం అధికంగానే వుంటుందనీ స్పష్టం చేశారు సీఎం.

          ప్రభుత్వం బడ్జెట్ అంకెలను పెంచి చూపించి అప్పులను చేయడానికి పూనుకుంటున్నదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన విమర్శను కూడా సీఎం వ్యతిరేకించారు. ఆర్థిక శాస్త్రంలో, అర్థ శాస్త్రంలో, ధోరణులు ఎప్పటికప్పుడు ఎలా రూపాంతరం చెందుతున్నాయో చెప్పిన సీఎం, ధనం విలువ మారుతున్నదనీ, అవసరాలు పెరుగుతున్నాయనీ, అవసరాలకనుగుణంగా అప్పులు చేయడం, ఆ చేసిన అప్పుల ఆధారంగా ఆస్తులు సమకూర్చుకోవడం జరుగుతున్నదనీ వివరించారు. ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే అప్పు పుట్తుందని అన్నారు. అత్యంత ధనిక దేశమైన అమెరికా, చైనాలతో సహా, ప్రపంచా ఆర్థిక రంగాన్ని శాసించే పలు దేశాలు అప్పులు చేస్తున్నాయని చెప్పారు. పథకాలకు అవసరమైన డబ్బు సమకూర్చుకోవడానికి అప్పు చేయాల్సి వస్తే చేయాల్సిందేనని, డబ్బు ఖర్చు పెట్టగలిగీ పెట్టకపోతే అది నేరమనీ సీఎం స్పష్టం చేశారు. ఆర్థిక విజ్ఞత, వివేచన, వైదుష్యం, వివేకం, జ్ఞానం అనే విషయాలను ప్రపంచ వ్యాప్తంగా వున్న అనేకమంది ఆర్థిక శాస్త్రవేత్తలు, వివిధ కోణాల్లో రూపకల్పన చేసారనీ, ప్రస్తుతం, అమెరికన్ ఆర్థిక నమూనా అని, అమర్త్యసేన్ ఆర్థిక నమూనా అని, ఇంకా మరికొన్ని నమూనాలున్నాయనీ, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వీటిని అన్వయించుకుంటారనీ అర్థం వచ్చే రీతిలో సీఎం మాట్లాడారు. ఒక్కో దానిలోని మంచిని సంగ్రహించి "మిశ్రమ ఆర్థిక నమూనా" ను రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వాడుకుంటున్నామని సీఎం స్పష్టం చేసారు. లెక్కలు "బూస్ట్" చేసి చూపించారన్న విమర్శకు ధీటుగా సమాధానం ఇస్తూ, "బూస్ట్ చేసి చూపించడం మా విధానం" అనీ, ఆశావహంగా వుండాలనుకోవడం తప్పు కాదనీ, తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తున్నామనీ సీఎం స్పష్టం చేశారు.


          మొత్తం మీద వృద్ధి, అప్పుల మీద పలుమార్లు ప్రస్తావన రావడం, ప్రతిసారీ సీఎం జోక్యంతో అవి రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడ్తాయో సభ్యులకు, సభ ద్వారా ప్రజలకు తెల్సిరావడం ఈ బడ్జెట్ సమావేశాల ప్రత్యేకత. END

No comments:

Post a Comment