సాధికారతకు స్ఫూర్తిదాతలు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (08-03-2017)
‘మహిళా
సాధికారత.. మహిళలకు భరోసా.. అధికారంలో భాగస్వామ్యమే లక్ష్యంగా’ ఇటీవల నవ్యాంధ్ర
రాజధాని అమరావతిలో జరిగిన ‘జాతీయ మహిళా పార్లమెంటు’ సదస్సు అనేక కొత్త అంశాలను
చర్చకు తెచ్చింది. టిబెట్ బౌద్ధ మతగురువు, నోబెల్
శాంతి బహుమతి గ్రహీత దలైలామా ఈ సదస్సులో స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. మహిళలకు
హక్కులు, సమన్యాయం, ఆర్థిక స్వేచ్ఛ, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం
వంటి అనేక అంశాలపై ఎప్పటిలాగే చర్చలు జరిగాయి. ఇవే పరిస్థితులను మరోసారి
‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా మననం చేసుకుంటే- మహిళా సాధికారత ఇంకా
పూర్తి స్థాయిలో సాకారం కాలేదు. దశాబ్దాల నాటి పరిస్థితులతో పోల్చితే వివిధ
రంగాల్లో అతివల భాగస్వామ్యం పెరిగినా, మన
దేశానికి సంబంధించి చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం ఇంకా మెరుగుపడాల్సి ఉంది.
ఒక్కసారి
గతంలోకి తొంగి చూస్తే- సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ప్రపంచ వ్యాప్తంగా మహిళలు రాణించడం, కొన్ని రంగాల్లో పురుషులను అధిగమించడం
ముఖ్యంగా ఈ శతాబ్దంలో గమనించవచ్చు. మహిళలు అధికారంలోకి వచ్చిన పలు దేశాల్లో అనేక
సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రపంచ వ్యాప్తంగా గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయ
రంగంలో మహిళలు గణనీయంగా ఎదిగారు. పలుదేశాల్లో అధ్యక్ష పీఠాలను, ప్రధానమంత్రి పదవులను అధిరోహించిన
వనితల్లో కొందరు విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
ప్రపంచంలోనే
తొలిసారిగా ఒక మహిళ ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఘనత శ్రీలంకకు చెందుతుంది.
1960లో సిరిమావో బండారు నాయకే శ్రీలంక ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం
అంతర్జాతీయంగా సంచలనం కలిగించింది. ఒక మహిళ ఆ అత్యున్నత పదవిలోకి ఎలా రాగలిగిందని, ఎలా పాలన చేయబోతున్నదని అప్పుడు
ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఆ తరువాత ఎందరో మహిళలు
ప్రధానులుగానో, దేశాధ్యక్షులుగానో పలు ప్రాంతాల్లో
అధికారం చేపట్టారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్
గెలిచినట్లయితే, ఆ దేశ మొట్టమొదటి మహిళా
అధ్యక్షురాలిగా ఆమె చరిత్ర సృష్టించి ఉండేది. కారణాలేవైనా ప్రపంచంలోనే అతిపెద్ద
ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన అమెరికాలో ఇంతవరకూ మహిళకు అధ్యక్ష పీఠం ఎక్కే అవకాశం
రాలేదు. భవిష్యత్తులో పురుషాధిక్యత రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిన పరిస్థితులు
మెండుగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం
ప్రపంచ దేశాల్లో సుమారు 20 మందికిపైగా దేశాధినేతలుగా మహిళలు వున్నారు. ఈ సంఖ్య
రానురానూ పెరుగుతోంది. ఇరవై,
ఇరవై ఒకటో శతాబ్దాలలో
గణనీయమైన సంఖ్యలో వివిధ దేశాల్లో ప్రధానులుగా, అధ్యక్షులుగా
వున్న మహిళల్లో చాలామంది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవారే. వీరిలో కొందరు
అతి తక్కువ కాలం అధికారంలో వుండగా, మరికొందరు
దీర్ఘకాలం పాటు పదవుల్లో వున్నారు. కొందరికి వారసత్వంగా లాభం చేకూరగా, మరికొందరు ఎన్నికల బరిలోకి దిగి
స్వశక్తితో గెలిచారు. శ్రీలంక ప్రధానమంత్రిగా సిరిమావో బండారు నాయికే మూడుసార్లు
బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత ఆమె కుమార్తె చంద్రికా కుమార తుంగ కొంతకాలం అధ్యక్షురాలిగా, ప్రధానిగా కొనసాగారు. సెప్టెంబర్
1959లో భర్త హత్యానంతర పరిణామాలలో బండారు నాయికే రాజకీయాల్లోకి వచ్చి, 1960లో ప్రధాని అయ్యారు. 1965
ఎన్నికల్లో ఓటమిపాలైన ఆమె తిరిగి 1970లో గెలిచి రెండోసారి ప్రధానిగా కొనసాగారు.
శ్రీలంక అధ్యక్షురాలిగా 1994లో ఎన్నికైన కుమార్తె చంద్రిక- సిరిమావోను మూడోసారి
ప్రధానిని చేసింది.
ఒక
తరంపైగా భారతదేశంలో నెహ్రూ కుటుంబీకులు, పాకిస్తాన్‌లో
భుట్టో కుటుంబీకులు,
బంగ్లాదేశ్‌లో ముజిబుర్
రెహ్మాన్ కుటుంబీకులు అధికారంలో వున్నారు. 20వ శతాబ్దపు విశ్వవిఖ్యాత మహిళ
ఇందిరాగాంధీ భారత ప్రధానిగా రెండు సార్లు బాధ్యతలు నిర్వహించారు. నెహ్రూ మరణించాక
కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రిగా పదవిని చేపట్టిన
ఇందిర అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీ హఠన్మారణంతో ప్రధాని పదవి దక్కించుకుని, సుమారు 11 సంవత్సరాలు సేవలందించారు. ఆ
తర్వాత దేశంలో ఎమర్జెన్సీ విధించి, ప్రజల
విశ్వాసాన్ని కోల్పోయి 1977 ఎన్నికల్లో ఆమె ఓటమి పొందారు. జనతా ప్రభుత్వం పతనం
అయ్యాక 1980లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ఇందిరమ్మ మరోమారి ప్రధాని కాగలిగింది.
1984లో ఆమె దారుణహత్యకు గురికావడం యావత్ జాతిని దిగ్భ్రాంతికి గురి చేసింది. గొప్ప
రాజనీతిజ్ఞురాలిగా ఇందిర ప్రపంచ వ్యాప్తంగా మన్ననలను పొందింది. ఆమె ‘అపర దుర్గ’గా
ప్రతిపక్షాల మెప్పును కూడా పొందింది. ఆమె కోడలు సోనియా గాంధీ ప్రధాని కాలేకపోయినా
అనధికారిక ప్రధానిగా పదేళ్లు యుపిఎ చైర్ పర్సన్‌గా కొనసాగారు. రాష్టప్రతి పదవిని
చేపట్టిన తొలి మహిళగా ప్రతిభా పాటిల్ అరుదైన గౌరవం పొందారు. లోక్‌సభ స్పీకర్
పదవిని చేపట్టి మీరా కుమార్,
సుమిత్రా మహాజన్ కూడా అరుదైన
ఘనత సాధించారు.
ఇజ్రాయిల్
దేశం వ్యవస్థాకుల్లో ఒకరైన గోల్డా మీర్ మొదట్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ భర్తతో
పాటు ఉద్యమంలో పాల్గొనేది. రాజకీయాలలో కూడా చురుగ్గా ఉండేది. 1948లో ఏర్పాటైన
తాత్కాలిక ప్రభుత్వంలో ఆమె మంత్రిగా పనిచేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక
సోవియట్ యూనియన్‌లో ఇజ్రాయిల్ రాయబారిగా గోల్డా మీర్ సేవలందించారు. ఆ తర్వాత
దేశానికి తిరిగొచ్చిన ఆమె లేబర్ పార్టీ జనరల్ సెక్రటరీగా వుండగా, అప్పటి ప్రధాని హఠాన్మరణంతో తన 70వ ఏట
1969లో ఇజ్రాయిల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, ఐదేళ్లపాటు
ఆ పదవిలో కొనసాగారు. బ్రిటన్ మొట్టమొదటి మహిళా ప్రధాని మార్గరెట్ థాచర్ రసాయన
శాస్త్ర పరిశోధకురాలిగా,
బారిస్టర్‌గా పనిచేసి, 1953లో ఆ దేశ చట్టసభ హౌజ్ ఆఫ్ కామన్స్‌కు
ఎన్నికైంది. వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించింది. 1975లో విపక్ష నేతగా
ఎన్నికైంది. 1979లో ప్రధాని పదవి వరించిందామెను. సమర్ధవంతమైన నాయకురాలిగా పేరు
తెచ్చుకున్న థాచర్ అసంతృప్తిని అణచడంలో ఆరితేరిన మహిళగా ప్రసిద్ధికెక్కింది.
1990లో ఆమె నాయకత్వాన్ని కొందరు సవాలు చేసినపుడు ప్రధాని పదవికి రాజీనామా చేసి
హౌజ్ ఆఫ్ కామన్స్ నుంచి కూడా తప్పుకుంది. 1982లో అర్జెంటినా నుంచి ఫాక్‌లాండ్స్‌ను
వెనక్కి తీసుకోవడానికి ఆమె సైన్యాన్ని పంపింది. ఆమె ప్రవేశపెట్టిన ప్రభుత్వ రంగ
సంస్కరణలు నేటికీ పలు దేశాల్లో అమలులో వున్నాయి. ఆమెను విమర్శించినవారు సైతం
వాటిని కొనసాగించారు.
సూంగ్
సోదరీమణులుగా ప్రసిద్ధికెక్కిన చైనా దేశానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ళు ఆ
దేశంలోని అత్యంత శక్తిమంతులైన ముగ్గురు ప్రముఖులను వివాహం చేసుకున్నారు. వాళ్లు
జీవించిన కాలంలో ఆ ముగ్గురూ ప్రపంచ వ్యాప్తంగా వార్తలోకి ఎక్కినవారే. అందులోకి
పెద్దదైన సూంగ్ ఐ లింగ్ అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన చైనా ఆర్థిక మంత్రి
హెచెచ్ కంగ్‌ను పెళ్లాడింది. రెండో సోదరి సూం చింగ్ లింగ్ చైనా జాతిపితగా
పేరుగాంచిన, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా మొదటి
అధ్యక్షుడిగా పనిచేసిన సన్ యట్ సేన్‌ను పెళ్లి చేసుకుంది. 1968-1972 మధ్యకాలంలో
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సంయుక్త అధ్యక్షురాలిగా, 1981లో గౌరవాధ్యక్షురాలిగా
పనిచేసిందామె. చివరి సోదరి సూంగ్ మే లింగ్ కూడా ఒక ప్రముఖ రాజకీయవేత్త. ఆమె
ఒకప్పటి చైనా అధ్యక్షుడైన చియాంగ్ కై షేక్‌ను పెళ్లిచేసుకుంది. నవ చైనా రాజకీయ, ఆర్థిక, వర్తమాన
చరిత్రలో ఆ ముగ్గురు సోదరీమణులు ప్రముఖ పాత్ర వహించారు. పాకిస్తాన్ మాజీ
అధ్యక్షుడు జుల్ఫీకర్ అలీ భుట్టో కూతురు బేనజీర్ భుట్టో తండ్రి వారసురాలిగా
రాజకీయాల్లో రాణించారు. 1988-90,
1993-96 మధ్యకాలంలో
రెండుసార్లు ఆమె పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పనిచేసింది. ప్రపంచంలోని ముస్లిం
దేశాలలో ఆమె కంటే పూర్వం ఏ మహిళ కూడా ప్రధాని కాలేదు. బేనజీర్‌కు ఆ ఖ్యాతి
దక్కింది. తండ్రిని ఉరితీసిన మూడేళ్లకు కేవలం 29 ఏళ్ల వయసులో తండ్రి స్థాపించిన
రాజకీయ పార్టీ చైర్ పర్సన్‌గా ఎన్నికై, 1988లో
జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని గెలిపించి, ఆ
దేశ ప్రధానిగా ఆమె ఎన్నికైంది. 2008 ఎన్నికలకు ముందు బాంబు పేలుడు సంఘటనలో బేనజీర్
మరణించింది.
ఇక-
1991-1996, 2001-2006 మధ్యకాలంలో బంగ్లాదేశ్
ప్రధానిగా ఎన్నికైన బేగం ఖలీదా,
బేనజీర్ తరువాత ఇస్లాం
దేశాలలో ఆ పదవిని చేపట్టిన రెండవ మహిళగా కీర్తి పొందారు. ఏడేళ్ల కింద అధికారంలోకి
వచ్చి, ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా
వున్న షేక్ హసీనా వాజేద్ ఆ దేశపు రెండవ మహిళా అధ్యక్షురాలు. ‘బంగ బంధు’ షేక్
ముజిబుర్ రెహ్మాన్ పెద్దకూతురామె. తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో కొంతకాలం
ఆమె ప్రతిపక్ష నాయకురాలిగా కూడా పనిచేసింది హసీనా. న్యూజిలాండ్ 37వ ప్రధానిగా
1999లో పదవిలోకొచ్చిన హెలెన్ ఎలిజబెత్ క్లార్క్ వరుసగా మూడుసార్లు 2008 వరకు ఆ
పదవిలో కొనసాగింది. ఎన్నికల్లో గెలిచిన తొలి మహిళా ప్రధాని హెలెన్. 2004 నుంచి
2010 వరకు మొజాంబిక్ అధ్యక్షురాలిగా వున్న లుఇసా డయాస్ డివోగో ఆ దేశానికి మొదటి
మహిళా అధ్యక్షురాలు. జర్మనీ రాజకీయ నాయకురాలు ఎంజెలా డొరోథియా మెర్కెల్ 2005 నుంచి
ఆ దేశ ఛాన్స్‌లర్‌గా వుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తూర్పు జర్మనీ
ప్రభుత్వంలో ఆమె అంతకుముందు అధికార ప్రతినిధిగా కూడా పనిచేసింది. కమలా పర్సాద్
బినె్సస్సార్ 2010 నుంచి 2015 వరకు ట్రినాడ్-టొబాగోల ఏడవ ప్రధానిగా వుంది. ఆమె ఆ
దేశపు మొదటి మహిళా ప్రధాని. ఆమె ప్రతిపక్ష నాయకురాలిగానూ సేవలందించింది. 2010
నుంచి 2013 వరకు ఆస్ట్రేలియా 27వ ప్రధానిగా వున్న జూలియా ఐలీన్ గిల్లార్డ్ మొదట్లో
ఉప ప్రధానిగా కూడా పదవిలో వుంది. బ్రిటన్ ప్రధాని పదవికి డేవిడ్ కామెరాన్ రాజీనామా
చేయడంతో 2016 జూలైలో థెరెస్సా మే ఆ బాధ్యతలను చేపట్టారు. ఇలా ఎందరో మహిళలు
దేశదేశాల్లో కీలకమైన పదవుల్లో వుండడం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు
నిదర్శనం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల్లో అధ్యక్ష, ప్రధాన
మంత్రులుగా మహిళలే ఎన్నికయ్యే పరిస్థితులు ఉన్నాయి.
what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
ReplyDeletemy youtube channel garam chai:www.youtube.com/garamchai