శాస్త్రీయ పద్ధతిలో రహదారులు
వనం జ్వాలానరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (11-08-2017)
అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని రెడ్ వుడ్ సిటీ (శాన్ ఫ్రాన్ సిస్కో పక్కన) లో వుంటున్న కొడుకును చూడడానికి
వచ్చి చుట్టుపక్కలున్న కొన్ని ప్రదేశాలకు వెళ్లాను. యు.ఎస్.ఏలో కాలిఫోర్నియా
రాష్ట్రానికి ఒక ప్రత్యేకతుంది. శాన్ ఫ్రాన్ సిస్కో లోని డౌన్ టౌన్ రోడ్ మీద
ప్రయాణం, అక్కడకు పోవడానికి సముద్రం పక్కనుంచి, దాదాపు సాగర జలాల అంచునుంచి చేరుకోవడం బలే సరదాగా వుంటుంది. అలానే
క్రుకెడ్ రోడ్. రోడ్డంతా, నేరుగా, ఒంపులు-వంకర
టింకరలు లేకుండా, సుదూరంలో ఆకాశం నేలను తాకుతున్నట్లు,
అద్భుతమైన సుందర దృశ్యం లా కనిపిస్తుంటుంది. ఆ రహదారి మీద కారులో
పోతుంటే భయం కూడా వేస్తుంది. కొంత ఎత్తుకు వెళ్లిన తర్వాత వెనుక-ముందు ఎటు చూసినా,
వళ్లు గగుర్పొడుస్తుంది. ప్రమాదాలకు నిలయమైనట్లున్నా, ఒక్క
ప్రమాదం కూడా జరగదు.
అమెరికా దేశంలోని నలు మూలల నుంచి వందల మైళ్ల దూరం అనాయాసంగా-సునాయాసంగా సొంత
కార్లలో, స్వయంగా నడుపుకుంటూ ప్రయాణం చేసి
ఇక్కడి ప్రదేశాలు చూసి పోగలగడానికి ప్రధాన కారణం దేశమంతా శాస్త్రీయ పద్ధతిలో
నిర్మించిన రహదారులు, అమల్లో వున్న డ్రైవింగ్ నిబంధనలు, చిత్త శుద్ధిగా వాటిని
ఆచరణలో పెట్తున్న వాహనదారులు. అహర్నిశలూ అలసటొచ్చే దాకా పనిచేసే అమెరికన్లు,
వారాంతపు శెలవులు గడపడానికి, ఇతర ప్రదేశాలకు
వెళ్లాల్సి వచ్చినప్పుడు, వందల మైళ్ల వేగంతో వాహనాలు నడిపినా,
వారి అంతిమ లక్ష్యమైన సుఖప్రదమైన జీవితం గడిపేందుకు, గిరిగీసుకున్నట్లుగా, కొన్ని నియమ నిబంధనలను స్వచ్చందంగా,
ఖచ్చితంగా పాటిస్తారు. ప్రభుత్వం అజమాయిషీ చేస్తుందా-లేదా అని గమనించకుండా,
పౌరులందరూ వాటిని పాటిస్తుంటారు. అందులో రహదారి నియమ నిబంధనలు ఒకటి.
ఉదాహరణకు నగరాలలోని "కార్ పూల్ మార్గం". వేగంగా వెళ్లడానికి అనువుగా
వుండే ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే, కారులో, ఇద్దరికంటే ఎక్కువ మంది వుండాలి. అలా లేని కారు నడిపే వ్యక్తి, ఎవరు గమనించినా, గమనించకున్నా, "కార్ పూల్
మార్గం" లోకి వచ్చే ధైర్యం చెయ్యడు.
మన దేశం (ఇండియా) లో ఎక్కడ చూసినా డ్రైవింగ్ కు అనుకూలించని నైపుణ్యం కొరవడిన
రోడ్లు, ఎదురుగా, పక్కగా వచ్చే వాహనాలను
తప్పించుకోవడానికి సరిపోయేంత వెడల్పులేని రోడ్లు, సరైన కంకర,
డాంబర్, సిమెంట్ కు నోచుకోని రోడ్లు, అవసరమైన ప్రదేశాల్లో
ఇంకా మాంధాతల కాలం నాటి కూలడానికి సిద్ధంగా వున్న వంతెనలు, అసందిగ్ధమైన
హైవే హద్దులు, ఏ రోడ్డు ఎటు పోతుందో తెలియ చేసే ఏర్పాట్లు
లేకపోవడం, రహదారిపై ఒక పక్క ఆపుకోడానికి ఏ మాత్రం సౌకర్యాలు
లేకపోవడం లాంటి ఎన్నో లోటు పాట్లను గుర్తించడమైతే జరిగింది గాని, సరిద్దిద్దేందుకు పటిష్ఠమైన చర్యలంతగా తీసుకోలేదనే అనాలి. ఆరు లేన్ల, నాలుగు
లేన్ల జాతీయ-రాష్ట్రీయ రహదార్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినా, అమలు వరకు వచ్చేసరికి ఎక్కడి గొంగళి అక్కడే.
ఈ నేపధ్యంలో అమెరికా జాతీయ, పట్టణ, నగర రహదారుల్లో ప్రయాణం చేయడం గొప్ప
అనుభూతనాలి. ఆ రోడ్లను చూసి మనం నేర్చుకోవాల్సిందెంతో ఉందనాలి.
అమెరికా రహదారుల మీద వాహనం నడపడమైనా, ఎవరన్నా
నడుపుతుంటే కూర్చొని ప్రయాణం చేయడమైనా ఆసక్తికరంగా, ఆహ్లాదంగా, శరీరం
గగుర్పొడిచేదిగా,మజాగా వుండడంతో పాటు, ఏ మాత్రం ఏమరు పాటుగా
కారు నడిపినా, నడిపేవారి పక్కన కూర్చున్నా, ప్రమాదపుటంచుల్లోకి
నేరుగా పోతున్నట్లుంటుంది. అన్ని రకాల వాహనాలు, భారీ,
మధ్య రకం, చిన్నవి, వివిధ
లేన్లలో, ఏక కాలంలో కనీసం నాలుగు కంటే తక్కువ లేకుండా,
ఇరు వైపుల నుంచీ, తక్కువలో తక్కువగా గంటకు 50-60
మైళ్ల వేగంతో పోతుంటాయి. అంతకంటే ఎక్కువ వేగంతో పోకూడదని హెచ్చరికతో
"కంప్యూటరైజ్డ్ డిజిటల్ బోర్డులు" రహదారి పొడుగూ ఏర్పాటు చేసినప్పటికీ
కొందరు వంద మైళ్ల వేగంతో కూడా నడుపుతుంటారు. కాకపోతే, వెనకాలే
రహదారి పోలీస్ పెట్రోలింగ్ వాహనం వస్తున్న వాసన తగలగానే వేగం తగ్గిస్తుంటారు.
వివిధ రాష్ట్రాలను కలుపుతూ వేసిన రహదారులను "జాతీయ హై వేలు" అని
మనదేశంలో పిలుస్తున్నట్లు, అమెరికాలో వాటిని "అంతర్
రాష్ట్ర రహదారులు" అని అంటారు. ఇండియాలో వాటికి ఎన్. హెచ్ 1, ఎన్.హెచ్ 2 .. ... అని నంబర్లిస్తారు. అమెరికాలోను
అదే మాదిరి నంబర్లుంటాయిగాని, ఒక రాష్ట్ర సరిహద్దు నుంచి మరో
రాష్ట్ర సరిహద్దులో ప్రవేశించగానే అవి మారుతుంటాయి. ఉదాహరణకు "ఏ"
రాష్ట్రంలోని ఒక స్థలం నుంచి "సి" రాష్ట్రం లోని మరో స్థలానికి
"బి" రాష్ట్రం నుంచి పోవాలనుకుందాం. అలా పోతుంటే, "ఏ" నుంచి "బి" కి ఒక నంబర్, "బి"
నుంచి "సి" కి మరో నంబర్ కేటాయిస్తారు. ఉత్తరం నుంచి దక్షిణ
దిశగా-దక్షిణం నుంచి ఉత్తర దిశగా వున్న అంతర్ రాష్ట్ర రహదారులకు బేసి సంఖ్యలు (1,
3, 5..), తూర్పు-పడమరగా, పడమర-తూర్పు గా వున్న
రహదారులకు సరి సంఖ్యలు (2, 4, 6...) కేటాయించబడతాయి.
ఏ పరిస్థితుల్లోను, ఎదురుగా వాహనాలు రాకుండా, వాహనాలు
ఒకదానికొకటి ఎదురు పడకుండా వుండే విధంగా, వెడల్పాటి రహదారి
డివైడర్లను, ఇరువైపుల వేసిన అంతర్ రాష్ట్ర రోడ్ల మధ్య
ఏర్పాటు చేస్తారు. ఒకవిధంగా "వన్ వే ట్రాఫిక్" అని చెప్పాలి. ఎంత వేగంతో
ఎవరు వాహనం నడిపినా, "హెడ్ ఆన్ కొలిజన్"
ప్రమాదాలకు ఆస్కారం లేదు. ఇతర రకాల ప్రమాదాలకు కూడా అవకాశాలు తక్కువే...దాదాపు
వుండవనే అనొచ్చు. ఒకవేళ హైవేలలో ప్రమాదమంటూ జరుగుతే, అది
వెనుకనుంచి వస్తున్న వాహనం ముందున్న దానిని, వేగాన్ని అదుపు
చేయలేక, ఢీ కొనడం వల్ల మాత్రమే జరిగే అవకాశం వుంది. అలా
ఎప్పుడు జరిగినా, సాధారణంగా, ఒక
మోస్తరుగా కాకుండా, భారీ స్థాయిలోనే ప్రమాదం సంభవిస్తుంది.
ఎంతో సేపు, ఎన్నో వాహనాలు ఒక పక్కగా ఆగిపోయే అవకాశం వుంది.
అయితే వీలైనంత త్వరగా, అధికారులకు సమాచారం చేరి, అంతే వేగంగా, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించి, ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్తారు.
ఇరువైపుల నుంచి, అంతర్ రాష్ట్ర రహదారుల్లో కనీసం
రెండో-మూడో "చానల్స్" లేదా "పాస్ వేస్" (లేన్లు)
ఏర్పాటుంటుంది. వాహనం నడిపేవారు, వారి-వారి వేగానికనుకూలంగా,
సరిపడే విధంగా, ఒక లేన్లో ప్రయాణిస్తుంటారు.
"ఎల్లప్పుడూ కుడి వైపునే నడపండి, లేన్ మారటానికి మాత్రమే ఎడమ వైపుకు
తీసుకోండి" అన్న బోర్డులుంటాయి ప్రతి చోటా. ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్
చేయాలంటే, అందుబాటులో ఎడమ వైపున వున్న లేన్ లోకి మారి,
వాహనం నడపాలి. వెనుకా-ముందు పోతున్న ఏ వాహనానికి, అది నడుపుతున్న
వారికి, ఏ మాత్రం ఇబ్బంది కలిగించకుండా, హారన్ మోగించ కుండా, లేన్లు మారాలి. మన దేశంలో
మాదిరి, డోర్ అద్దాలు లేపి, పక్క వాహనం
నడిపేవాడిని, దూషించుకుంటూ, అదే పనిగా హారన్ మోగించుకుంటూ,
ఇతరులకు వీలైనంత అసౌకర్యం కలిగించుకుంటూ, వాహనాలు
నడిపే వారెవరూ వుండరు.
బధ్రతా కారణాల దృష్ట్యా, వాహనం నడిపే
వ్యక్తి, ముందు సీట్లో నడిపే వారి పక్కన కూర్చొన్న వ్యక్తి, విధిగా
"సీట్ బెల్ట్" కట్టుకోవాలి. కొన్ని రాష్ట్రాల నిబంధనల ప్రకారం వెనుక
సీట్లో కూచున్న వారు కూడా సీటు బెల్ట్ ధరించాలి. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా
పట్టుబడితే, ఆ బాధ్యత, కారు నడుపుతున్న
వాడిపైన వేస్తారు పోలీసులు. ఆ తప్పుకు అనుగుణమైన "టికెట్" ఇవ్వడం
జరుగుతుంది. అలాగే వాహనం నడిపే వ్యక్తి నడపడంలో ఎలాంటి తప్పుచేసినా, దానికి తగిన శిక్ష కింద, పోలీసులు
"టికెట్లు" ఇవ్వడం జరుగుతుంది. వాటి వివరాలన్నీ డ్రైవింగ్ లైసెన్స్ లో
పొందుపరిచి, ఆ తప్పుల కొచ్చిన పాయింట్ల ఆధారంగా, లైసెన్స్ కొంతకాలం రద్దుచేయడమో, శాశ్వతంగా తీసేయడమో జరిగే అవకాశం కూడా
వుంది. టికెట్ ఇచ్చిన ప్రతిసారీ భారీగా ఫైన్ కూడా వసూలు చేస్తారు. అలానే మత్తు
పదార్థాలు సేవించి వాహనం నడిపినా శిక్షార్హుడే. ఒక సారి లైసెన్స్ పోతే మళ్లీ రావడం
చాలా కష్టం. అసలు మొదటిసారి రావడమే కష్టం.
హైవే మీద వాహనం నడిపే వ్యక్తి ఏదన్నా ట్రాఫిక్ నిబంధనను అతిక్రమించినట్లు, రహదారి పెట్రోలింగ్ పోలీసు అధికారి గమనిస్తే, వాహనం వెనుకనే వస్తున్న పెట్రోలింగ్ కారుకు అమర్చబడిన లైట్ల ద్వారా
సిగ్నల్స్ ఇవ్వడం జరుగుతుంది. క్షణం కూడా ఆలోచించకుండా, కుయ్, కయ్ అనకుండా వాహనం నడుపుతున్న వ్యక్తి, తన వాహనాన్ని,
రోడ్డుకు ఇరు పక్కలా వుండే "షోల్డర్స్" అని పిలువబడే
వైపుగా తీసి ఆపు చేస్తాడు. వాహనం పట్టేంత జాగా మాత్రమే వుండే "షోల్డర్",
వివిధ కారణాల వల్ల వాహనాన్ని హైవే మీద ఆపుకోవాల్సిన పరిస్థితుల్లో,
పార్క్ చేసేందుకు, ఏర్పాటు చేసిన ఒక సౌకర్యం.
దానిమీద వాహనం నడుపుతే, అంతులేని శబ్దం వచ్చే విధంగా,
రోడ్డు కింది భూ పొరను తయారు చేస్తారు. కేవలం పార్క్ చేయడానికి
మాత్రమే ఆ స్థలం అనుకూలం. పోలీసు సిగ్నల్ చూసి వాహనాన్ని ఆపు చేసిన వ్యక్తి కిందకు
దిగాల్సిన అవసరం లేదు. పెట్రోలింగ్ వాహనంలో వచ్చిన పోలీసు అధికారే డ్రైవర్
దగ్గరకొస్తాడు. వచ్చిన వెంటనే, అతడు అతిక్రమించిన నిబంధన, దానికి
చెల్లించాల్సిన ఫైన్, టికెట్ వివరాలు తెలియచేస్తాడు.
వాద-ప్రతివాదాలకు అవకాశం వుండదు. తనకు పలుకుబడి వుందనో, పాత్రికేయుడిననో, ఉన్నతాధికారులు
తెలుసుననో, వాహనం నడుపుతున్న వ్యక్తి వాదనకు దిగడు. అతడు
తప్ప ఇతరులెవరు వకాల్తా పుచ్చుకొని మాట్లాడరు. తప్పుచేయలేదని నిరూపించుకోవడానికి
చట్టపరమైన మార్గాలను తర్వాత అన్వేషించవచ్చు. అక్కడ మాత్రం కాదు. అతడు చేసిన
నిబంధనలకు విరుద్ధమైన చర్య ఆపాటికే రోడ్డు పైన అమర్చిన రాడార్ లో రికార్డయి
వుంటుంది.అసలు వాహనం నడిపేవారికే తను చేసిన తప్పేంటో తెలిసిపోతుంది ఆపాటికే.
హైవే పొడుగునా రక-రకాల "ఎగ్జిట్లు" వుంటాయి. ప్రధాన హైవే నుంచి
తప్పుకొని, మనం వెళ్లాల్సిన మరో దారికి
పోవడానికి ఉపయోగించాల్సిన మార్గాన్నే "ఎగ్జిట్" అంటారు. వెళ్లాల్సిన
కారణం ఏదైనా కావచ్చు. వాటిని "గాస్ ఎగ్జిట్" అని, "ఫుడ్ ఎగ్జిట్" అని, "లాడ్జింగ్
ఎగ్జిట్" అని, "కంఫొర్ట్ ఎగ్జిట్" అని,
"హాలిడే ఎగ్జిట్" అని, "కాంప్
ఎగ్జిట్" అని, "హాస్పిటల్ ఎగ్జిట్" అని
పిలుస్తారు. వాహనాలకు గాస్ నింపు కొనేందుకు, తిను
పదార్థాలకొరకు, కొద్ది సేపు విశ్రాంతి తీసుకునేందుకు,
శెలవు దినంగా గడిపేందుకు, అత్యవసర వైద్య
సదుపాయం కొరకు, లేదా మరేదైనా సౌకర్యం కొరకు ఉద్దేశించబడినవి
ఇవి. అలానే, ప్రధాన రహదారి నుంచి, మనం
వెళ్లాల్సిన ప్రదేశానికి చేరుకునేందుకు మళ్లాల్సిన మార్గాన్ని కూడా
"ఎగ్జిట్" అంటారు. వీటికి నంబర్లుంటాయి. మనం తీసుకోవాల్సిన
"ఎగ్జిట్" తెలిసైనా వుండాలి, లేదా, జీ. పి. ఎస్ సహాయంతోనైనా తెలుసుకోవాలి. హైవే ఎగ్జిట్ లలో అనేక
సదుపాయాలుంటాయి. హైవేకు ఎడమ వైపున వున్న ప్రదేశానికి చేరుకోవాలంటే, కుడివైపునున్న సంబంధిత ఎగ్జిట్ లోకి ప్రవేశించి, ప్రధాన
రహదారి పైన ఏర్పాటు చేసిన "ఫ్లై ఓవర్" మీద నుంచో, కింద
ఏర్పాటు చేసిన రోడ్డు నుంచో, అటు వైపుగా పోవాలి. ఎక్కడ పడితే
అక్కడ వాహనం మరల్చకూడదు-మరల్చే అవకాశం కూడా వుండదు. ప్రతి పాతిక-ముప్పై మైళ్లకు
ఏదో ఒక రహదారి సౌకర్యం వుంటుంది. ఇందులో కొన్ని ప్రభుత్వ పరంగా, కొన్ని ప్రయివేట్ పరంగా నిర్వహించబడతాయి. పర్యాటక రంగానికి చెందిన సమాచారం
అడుగడుగునా లభిస్తుంటుంది. తిండికి ఏ కొరతా వుండదు. శాంతా క్లారా-లాస్ ఏంజల్స్
మార్గంలో భారతీయ సంప్రదాయ ఆహారం కూడా దొరుకుతుంది. ఇక మెక్ డొనాల్డ్ లు సరే సరి.
అమెరికాలో "ఫ్రీ వేలు" చాలా చోట్ల వుంటాయి. అందులో వెళుతుంటే
ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపిస్తాయి. అయినా నిబంధనలను అతిక్రమించి ఎవరూ నడపరు.
పల్లెటూరి మార్గంలో పోతున్నప్పుడు కూడా ఇరువైపుల ఒక్కోసారి ఒకే లేన్ వుండి, ఎదురెదురు వస్తున్న వాహనాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి
సౌకర్యాలున్న శాంతా క్లారా-లాస్ ఏంజల్స్ రహదారిలో, వెళ్లేటప్పుడు,
తిరిగొచ్చేటప్పుడు, మధ్యలో డిస్నీ లాండ్
కు-యూనివర్సల్ స్టూడియోలకు పోయినప్పుడు, ఎంత వేగంగా కారు
నడిపినా ఎలాంటి భయం వేయలేదు. సుమారు హైదరాబాద్-విజయవాడ మధ్య నున్న దూరం కంటే
ఎక్కువే వున్న శాంతా క్లారా-లాస్ ఏంజల్స్ మధ్య నున్న 350 మైళ్లకు
పైనున్న దూరాన్ని వెళ్లేటప్పుడు-తిరిగొచ్చేటప్పుడు నాలుగైదు గంటల లోపునే
చేరుకున్నాం.
అందుకే అమెరికా రహదారుల ఏర్పాట్ల గురించి తెలుసుకోవాల్సింది ఎంతో వుంది. END
If there is E-Mail provision we can send this to others.
ReplyDelete