లంకలో రాక్షస స్త్రీలను చూసిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి
వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం
జ్వాలానరసింహారావు
సూర్య
దినపత్రిక (14-08-2017)
ఒకరితో ఒకరు పరాచికాలాడుతూ, ఎదుటివారిపై పూలో,
రాళ్లో వేస్తూ, మద్యపాన ప్రభావంతో దేహాన్ని
మరిచి మాట్లాడుతూ, ఇతరులను బెదిరిస్తున్న రాక్షసులను
హనుమంతుడు చూసాడు. రొమ్ములు తెర్చి వెల్లికిల
నిద్రపోయేవారిని, స్త్రీల శరీరంపైన కాలు, చేయి వేసి ప్రక్కకు తిరిగి పడుకున్నవారిని, భర్తలకు
గంధం, మనోహరమైన ఇతర లేపాలను పూస్తున్నవారిని, మొగుడిమీద కోపంతో వారు పలుకరించలేదని నిట్టూర్పులు విడుస్తూ, నొచ్చుకుంటున్నవారిని, భర్తలను రతికై
ప్రార్ధిస్తున్న స్త్రీలను హనుమంతుడు చూసాడు.
ఘీంకరిస్తున్న ఏనుగులను, పెద్దలకు నమస్కరిస్తున్న పెద్దలను, వీరభటులను
లంకలో చూసాడు హనుమ. గొప్పబుధ్ధి కలవారిని, శాస్త్ర విశ్వాసం కలవారిని, మంచిపేర్లున్నవారిని,
విశ్వప్రధానులను, అనేక ఆకారాలున్నవారిని,
స్వగుణానురూపులను, అసమానరూపులను, అనేక గుణాలతో వెలుగుతున్నవారిని, వికార రూపాలున్న
రాక్షసులను చూసాడు హనుమంతుడు. నిర్మల మనస్సున్న వారిని,
పాతివ్రత్య మహిమ కలవారిని, భర్తలందు
పరిశుధ్ధమైన ప్రేమున్నవారిని, నక్షత్రాలవలె ప్రకాశిస్తున్నవారిని,
ఇలాంటి రకరకాల స్త్రీలను అక్కడి భవంతులలో చూసాడు ఆంజనేయుడు.
ముగ్ధనాయికలను(సంపూర్ణమైన సిగ్గుతో వున్నవారు), మధ్యనాయికలను
(ప్రేమరసం ప్రధానంగా వున్నవారు), ప్రౌఢనాయికలను
(ప్రియమైన భర్తలచే కౌగలింపబడినవారు), బాలనాయికలను
(భర్తలను మోహింపచేసే విధం తెలిసినవారు), చక్కటి పూలు తురుముకున్న ఆడపక్షుల్లాంటి అందమైన స్త్రీలను, సంతోషంగా కనిపిస్తున్న స్త్రీలను, భర్తల
అనుగ్రహానికి నోచుకున్న స్త్రీలను, వయస్సున్న స్త్రీలను,
మారుతి చూసాడు. బంగరు మేడలలో కూర్చున్న
స్త్రీలను, భర్తల వొడిలో వున్నవారిని, మగడి
ఇష్టంతో అడిగిన పనులు చేస్తున్న స్త్రీలను, ధర్మ శాస్త్రాలు
తెలిసి ధర్మకార్యాలు చేస్తున్న స్త్రీలను, కామావేశం వున్న
స్త్రీలను, వికారమైన, విడ్డూరమైన,
ఇంపైన చేష్టలు చేస్తున్న స్త్రీలను, పెళ్లై
సంతోషంతో వున్న స్త్రీలను చూసాడు హనుమంతుడు.
అందంగా, బంగారం లాంటి చాయ కలవారిని, భర్త ఎడబాటుతో
విరహతాపం పొందుతూ పాలిపోయినవారిని, రతిక్రీడలలో ఆరితేరిన
వారిని, పమిటలుజారి, రవికలు లేనివారిని,
రతిశ్రమతో కరిగిన సుపర్ణలను (కస్తూరి-కుంకుమపువ్వు లేపంతో చెంపలపైన, స్తనాలపైన చిత్రాలు
వేయించుకున్న స్త్రీలు), గంధంపొడి వాసనగలవారిని, నిడుపాటి కళ్లు చెవులవరకూ వ్యాపించిన స్త్రీలను చూసాడు మారుతి. భర్తలవద్దకు తమంతట తామే పోయి, కౌగిలిలో చేరి
ఆనందిస్తున్న వారిని, నడివయస్సులోని స్త్రీలను, వారి, వారి ఇళ్లల్లోనే తిరుగుతున్నవారిని(వేశ్యలు), తీగల్లాంటి మృదువైన దేహసంపద కలవారిని,
విశేష ప్రేమకు స్థానమైన వారిని, రాక్షసుల పడకటిన్టి
లోనూ, క్రీడామందిరాలలోనూ హనుమంతుడు చూసాడు. లేతవయస్సులో వున్నవారిని, చంద్రబింబం లాంటి ముఖం
కలవారిని, వంకరకనురెప్పల వెంట్రుకలున్నవారిని, ఆభరణాలు ధరించిన వారిని, మెరుపు తీగల్లాంటి ఆడవారిని
చూసాడాంజనేయుడు.
(సీతను
వెతుకుతున్న హనుమంతుడు స్త్రీల ముఖ-నేత్రాలను చూడటానికి
కారణముంది. వీరు దేవతాస్త్రీలా?మనుష్యులా?రాక్షక్శస స్త్రీలా? అని పరీక్ష చేయడం ఓకారణం.
ఆభరణ పరీక్ష, సీతాభరణ స్వరూపం నిర్ధారణ
చేసుకోవటంకొరకే. సీతాదేవిని చూసినప్పుడు ఆమె సీతేనని
నిర్ణయించడానికి ఆమె ఆభరణాలు ఓ ముఖ్య నిదర్శనమని మున్ముందు తెలుస్తుంది).
తను చూస్తున్న స్త్రీలలో, రాజవంశంలో
పుట్టినదాని లాంటి దానిని, వారిలోనూ మిక్కిలి మనోహరంగా
వున్నదానిని, అలాంటి వారిలోనూ భర్త సమీపంలో లేనప్పుడు
పతివ్రతలు ఎలావుండాలో అలా వున్నలాంటి దానిని, తీగలాంటి
దేహమున్నదానిని, స్వసంకల్పంతో అయోనిజగా పుట్టిన దానిని మాత్రం
చూడలేకపోయాడు హనుమంతుడు. పతివ్రతల మార్గంలో, ధర్మ మార్గంలో స్థిరంగా వుంటున్నదానిని, భర్త ముఖం
కనిపిస్తేనే ఆనందించే దానిని, భర్తను కలుసుకోవాలన్న పట్టుదల
వున్నదానిని, అతిలోక సుందరిని, భర్త
హృదయంలో చొరబడే దానిని, విరహతాపంతో, కన్నీటితో
తడిసిన కంఠం కలదానిని, అందమైన కనురెప్పలున్నదానిని, చక్కటి కంఠధ్వని కలదానిని, శ్రేష్ఠమైన బంగారు పతకం
మెడలో వున్నదానిని, వనసంచారం చేస్తున్న నెమలిలాంటి దానిని,
పాడ్యమినాటి చంద్రుడి లాంటిదానిని, దుమ్ముతో
కూడిన కొత్తబంగారపు కడ్డీలాంటి దానిని, పుండులో బాణం
గుచ్చుకుంటే బాధపడే లాంటి దానిని, గాలికి చిందరవందరైన సన్నని
మేఘంలాంటి దానిని (సీతాదేవని అర్ధం) హనుమంతుడు
చూడలేకపోయాడు. శ్రీరామచంద్రమూర్తి భార్య సీతాదేవిని తాను
వెతికిన అన్ని రహస్య ప్రదేశాల్లో ఎక్కడా చూడలేక పోయినందుకు హనుమంతుడు బాధపడ్డాడు
ఆసమయంలో.
రాక్షసుల ఇళ్లల్లో ఎంత వెతికినా, సీతాదేవిని చూడలేకపోయినందుకు చింతిస్తూ హనుమంతుడు తాను కోరిన
రూపాన్ని ధరించి, మరింత వేగంగా, శ్రధ్ధగా
తిరిగి వెతకనారంభించాడు. సింహాల కాపలాలో నిరపాయంగా వుండే
వనంలాగా, క్రూరాతి క్రూర రాక్షసుల కాపలాలో సూర్యకాంతితో
సమానమైన ప్రాకారంతో చుట్టబడి వున్న రావణ గృహాన్ని చూసాడు హనుమంతుడు. (ఇంతకు ముందే రావణాసురుడి ఇంట్లోకి హనుమంతుడు ప్రవేశించాడని చెప్పడం
జరిగింది. మళ్లీ ఎందుకీ ప్రస్తావన అనుకోవచ్చు. రావణ అంతఃపురంలో సీత వుందని అనుకొని అక్కడ వెతుకుదామనుకున్నాడు. అయితే అప్పుడు జామురాత్రే అయినందున, అందరూ
నిద్రపోనందున, వారు మేల్కొన్నప్పుడు వెతకడం కుదరదనుకుని
బయటకు వస్తాడు. లంకాపురంలో కాసేపు గాలిస్తాడు. అందువల్లనే లంకాపుర స్త్రీల వర్ణన జరిగిందప్పుడు. ఇప్పుడు
ఇంకాస్త పొద్దు పోయినందున తిరిగి రావణుడి ఇంట్లోకి వచ్చి వెతకడం మొదలెట్టాడు)
దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ
ఇంటిని చూసి ఆశ్చర్యంతో ముక్కుపై వేలుంచుకుని దాన్నే చూడసాగాడు హనుమంతుడు. అందమైన
ఆ ఇంటి ద్వారాలకు వెండి, బంగారు, రత్నాలతో
అలంకరించబడిన తోరణ సమూహాలున్నాయి. ఏనుగులెక్కిన మావటీలు, కష్ఠం
తెలియని శూరులు, అతివేగంగా పోగలిగే గుర్రాలు, పులుల, సింహాల చర్మాలతో కప్పబడి దంతం, బంగారంతో ప్రకాశించే రధాల గుంపులు, వెలలేని రత్నాలతో
నిండిన పెద్ద పీటలు, అతిరథులకు స్థావరమైన అసమాన రథాలు,
హనుమంతుడి దృష్టిలో పడ్డాయక్కడ.
రకరకాల
మృగాలతో, పక్షుల గుంపులతో నిండివున్న ఆ భవన
పర్యవేక్షణ, భయమనేది ఎరుగని కాపలావారి చేతుల్లో వున్నది.
మనస్సుకు ఆహ్లాదాన్నిచ్చే చక్కటి స్త్రీలున్నారక్కడ. బలసిన చకోర పక్షులతో సమానంగా
వుండే కళ్లున్న స్త్రీల బంగారు ఆభరణాల రాపిడి ధ్వనులు సముద్ర ఘోషతో
పోటీపడ్తున్నాయక్కడ. చందనం, అగరు ధూపాల వాసనలతో నిండి వుండి,
మద్దెల ధ్వనులు మ్రోగుతుంటే, రాక్షసులతో
ఎల్లప్పుడు పూజించబడుతూ, సముద్రాన్ని మరిపిస్తూన్న చందాన
గంభీరంగా వున్నదా రావణ గృహం. ఆ ప్రాన్తంలో వీధి-వీధీ, వాడ-వాడా,
తోట-తోటా, దొడ్డి-దొడ్డీ, మేడ-మేడా, మూల-మూలా, గొంది-గొందీ,
ఇదీ-అదీ అనేది లేకుండా వెతకసాగాడు సీతకోసం హనుమంతుడు.
ఇలా తిరుగుతూ: ప్రహస్తుడి,
మహాపార్శ్వుడి, మేఘంతో సమానమైన కుంభకర్ణుడు,
విభీషణుడు, మహోదరుడు, విరూపాక్షుడు,
విద్యుజ్జిహ్వుడు, విద్యున్మాలి, వజ్రదంష్ట్రుడు, శుకసారణులు, ఇంద్రజిత్,
జంబుమాలి, సుమాలి, రస్మి,
కేతువు, సూర్యశత్రువు, వజ్రకాయుడు
మొదలైన వారి ఇళ్లకు వెళ్లి అక్కడ సీతాదేవికొరకు వెతుకుతాడు హనుమంతుడు. బలవంతులైన: ధ్రూమాక్షుడు, సంపాతి,
విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, వికటుడు,
వక్రుడు, శఠుడు, శుకనాశుడు,
బ్రహ్మకరుడు, దంష్ట్యద్వజుడు, గ్రీవుడు, యుద్ధోన్మత్తమత్తులు, రోమశుడు, విద్యుజ్జిహ్వుడు, ,హస్తిముఖేంద్రుడు,
జిహ్వుడు, శోణితాక్షుడు, పిశాచుడు, కరాళుడు మొదలైన వారు వుండే ఇళ్లంటిలో వరుస
తప్పక సీతకొరకై వెతుకుతాడు హనుమంతుడు. అయినా ఫలితం కానరాలేదు.
No comments:
Post a Comment