పీవీ పుణ్యమే చిన్న కమతాలు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (30-08-2017)
సరిగ్గా 45 సంవత్సరాల
క్రితం ఆగస్ట్ 30, 1972 న, అప్పటి ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో నాటి ముఖ్యమంత్రి,
తెలంగాణ బిడ్డ, స్వర్గీయ పీవీ నరసింహారావు చారిత్రాత్మక భూసంస్కరణల బిల్లును ప్రవేశ
పెట్తూ చెప్పిన మాటలు, తదనంతర అమలు పరిణామాలు, ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనలకనుగుణంగా చేపట్తున్న సమగ్ర భూప్రక్షాలణ
నేపధ్యంలో వెలుగులోకొచ్సిన భూకమతాల వివరాలు, ఒకదానికొకటి అన్వయించుకుని విశ్లేషణ
చేస్తే ఆసక్తికరమైన విషయాలు అవగాహనకొస్తాయి. నాటి పీవీ శాసనసభ ప్రసంగం, చర్చలో ఆయన
వెలిబుచ్చిన అభిప్రాయాలు, ఆయన అసలు-సిసలైన భూసంస్కరనాభిలాషను ప్రతిబింబిస్తే,
ప్రస్తుతం తెలంగాణలోని భూకమతాల లెక్కలు పరిశీలిస్తే, పీవీ గారి దూరదృష్టిని కళ్ళకు
కనిపించే విధంగా వుంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు ఏదైనా ప్రయోజనం చేకూరిందా
అని భూతద్దం పెట్టుకుని వెతుక్కుంటే, బహుశా, తెలంగాణ ప్రాంతానికి చెందిన పీవీ సీఎంగా
వున్నప్పుడు అమలు చేసిన భూసంస్కరణల ద్వారానే అన్న సమాధానం దొరుకుతుంది. రాష్ట్రంలో
సుమారు 97 శాతం చిన్న-సన్న-మధ్యతరగతి కమతాలుండడం పీవీ చలవే!
ఉమ్మడి
రాష్ట్రంలో, అప్పటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి
అనుగుణంగా, జాతీయ మార్గదర్శికాల నేపధ్యంలో, జూన్ 1, 1973 నుండి భూసంస్కరణలు
అమల్లోకి వచ్చాయి. ఆగస్ట్ 30, 1972 న శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టడానికి
పూర్వరంగంలో అదే ఏడాది మే నెలలో ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా భూసంస్కరణలకు
తెరదించింది. భూమిలేని నిరుపేదలకు భూమి పంచాలనీ, తద్వారా భూకమతాల్లో చోటుచేసుకున్న
అసమనాతలను తొలగించాలనీ, కుటుంబం యూనిట్ గా సీలింగ్ నిర్ధారించాలనీ, “బంజర్” గా
వ్యవహరించే ప్రభుత్వ భూములను పేదలకు పంచాలనీ, అంతవరకూ భూస్వాముల హక్కుభుక్తంలో వుంటూ
మిగులు భూమిగా తేలనున్న లక్షలాది ఎకరాల భూమిని షెడ్యూల్డ్ కులాల-తెగల వారికి,
బలహీన వర్గాల వారికి వ్యవసాయం కొరకు పంచాలనీ, వ్యవసాయ కూలీలకు ఉజ్జ్వల భవిష్యత్
కలిగించాలనీ, గ్రామీణ సామాజిక-ఆర్ధిక స్థితిగతులను మెరుగుపర్చాలనీ, భూసంస్కరణల
ఉద్దేశంగా బిల్లులో పేర్కొంది ప్రభుత్వం. ఒక విధంగా చెప్పాలంటే వ్యవసాయ భూమిని
సొంతం చేసుకునే విషయంలో అదొక విప్లవాత్మకమైన కార్యక్రమం.
చారిత్రాత్మకమైన,
విప్లవాత్మకమైన భూసంస్కరణల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్తూ పీవీ నరసింహారావు చేసిన
ప్రసంగం, తదనంతరం చర్చలో పాల్గొంటూ ఆయన చెప్పిన అనేక విషయాలు, ఆయన రాజనీతిజ్ఞతకు,
భూమికి సంబంధించిన, రాజకీయ-ఆర్ధిక-సామాజిక స్థితిగతులకు సంబంధించిన,
చట్టానికి-సామాజిక న్యాయానికి సంబంధించిన అనేక అంశాలపై ఆయన కనపరచిన ప్రతిభ
ఆబాలగోపాలాన్ని ఆకట్టుకుంది. భూసంస్కరణలు అమలుపర్చాల్సిన-పర్యవేక్షించాల్సిన
సిబ్బందికి సామాజిక న్యాయం పట్ల వుండాల్సిన నిబద్ధత గురించీ, మిగులు భూమి వుండే
భూస్వాముల పిర్యాదులను విని వారికి ఎలాంటి అన్యాయం జరక్కుండా చూసే విషయంలో
హైకోర్ట్ నిర్వర్తించాల్సిన పాత్ర గురించీ, స్త్రీధనం-దయాభాగే-మితాక్షర
న్యాయం-చట్టం గురించీ, భూమి కోల్పోయే వారి నష్టపరిహారం గురించీ,
హరిజనులకు-గిరిజనులకు భూమి పంపకం గురించీ, ముందస్తుగా మే నెలలోనే ఆర్డినెన్స్
తీసుకోరావాల్సిన ఆగత్యం గురించీ, ఏర్పాటు చేయబోయే ట్రిబ్యునల్స్ గురించీ, కుటుంబం
ఒక యూనిట్ గా వుండే విషయం గురించీ, కుటుంబలో మేజర్-మైనర్ పిల్లల గురించీ,
భూసంస్కరణలో సెక్యులరిజం గురించీ, రామాయణం కాలం నుంచే ఎలా భారతదేశంలో భూసంస్కరణలు
అమల్లో వున్నాయనే విషయం గురించీ.....ఇలా అనేక విషయాల గురించి ఆయన మాట్లాడిన అంశాలు
ఆయన ప్రజ్ఞా-పాటవాలకు నిలువెత్తు నిదర్శనం అని చెప్పాలి.
బిల్లు
ప్రధాన ధ్యేయం భూస్వాముల చేతుల్లో, వారి హక్కుభుక్తంలో వేలాది ఎకరాల భూమి
వుండకూడదని, భూసంస్కరణలు రాబోతున్నాయని తెలుసుకుని చట్టం నుంచి తప్పించుకోవడానికి
బినామీ పేర్ల మీద భూమిని బదలాయించడం నిరోధించడమని పీవీ చెప్పారు. భూసంస్కరణలను
అధిగమించడానికి కుక్కల పేరు మీద, పిల్లుల, ఇతర రకాలైన పెంపుడు జంతువుల పేరుమీద
కూడా భూస్వాములు తమ భూములను బదలాయిస్తున్నారనీ, అలాంటి చట్ట వ్యతిరేక విధానాలను నిరోధించడానికి
పకడ్బందీగా బిల్లును రూపొందించామనీ, బిల్లు గురించి తాను చర్చించిన అనేకమంది
ప్రముఖ వ్యక్తులు దీని అవసరాన్ని, ఆవశ్యకతనీ, ప్రాముఖ్యతను గుర్తించారనీ, సామాజిక
న్యాయానికి బిల్లు అత్యవసరమని వారంతా చెప్పారనీ పీవీ శాసనసభకు తెలియచేశారు.
పీవీ
శాసనసభలో మాట్లాడుతూ.....“ఎప్పుడో రామాయణ కాలంలోనే భూసంస్కరణలకు భారతదేశంలో బీజం
పడింది. ఒక చిన్న భూకమతం మీద చిన్న-సన్నకారు రైతుకుండే వ్యక్తిగత శ్రద్ధ, ప్రేమ,
ధ్యాస బడా భూస్వామికి వుండదు. ఇలాంటి అత్యంత ప్రాముఖ్యతకలిగిన, ప్రాధాన్యత
సంతరించుకున్న, విభిన్న కోణాల సమాహారమైన భూసంస్కరణ చట్టం ఎక్కడో ఒక మూల కూర్చుని
తయారుచేసేదికాడు......రాష్ట్రవ్యాప్త చర్చ జరగాలి.....శాసనసభ క్షుణ్ణంగా
చర్చించాలి. కాకపోతే, అనవసర కాలయాపన చేసి, అనవసర అంశాల మీద చర్చ పొడిగించి, బిల్లు
చట్టం కావడంలో జాప్యం జరిగితే, భూస్వామికి లాభం చేకూర్చిన వాళ్ళం అవుతాం. అలా
జాప్యం జరిగితే భూమంతా, భూస్వాముల కుక్కల, పిల్లుల వాటా అయ్యే ప్రమాదముంది. అందుకే
ముందుగా ఆర్డినెన్స్ తెచ్చాం. ఎవరిమీదనో కోపంతోనో, మరెవరిమీదనో ద్వేషంతోనో, ఎవరి
పైన పగ తీర్చుకోవడానికో ఈ బిల్లు ప్రవేశ పెట్టడం లేదు. సమాజంలో చోటుచేసుకున్న అసమానతలు
తొలగించి న్యాయం చేయడానికే ఈ బిల్లు తెస్తున్నాం”. అన్నారు.
ఇంకా ఇలా అన్నారు:
“ఈ రోజు సమాజంలో ఎవరికైనా 500 ఎకరాల భూమి వుంటే ఆయన్ను గౌరవంగా చూస్తాం. ఆ క్రమంలో
వాడికి గర్వం, అహంకారం పెరుగడం సహజం. అదే అతడి భూమిని ఒక పాతిక ఎకారాలో-ఇరవై
ఎకరాలో చేస్తే, అలా ఆయనకున్న భూమిని తగ్గిస్తే, అదే దామాషాలో అతడి
అహంభావం-అహంకారం-గర్వం కూడా తగ్గుతుంది. ఆస్తిమీదే ఆధారపడే సమాజంలో, ఆస్తికలిగిన
వాడినే సమాజం గౌరవించాల్సిన పరిస్థితుల్లో, సమాజంలో విలువలు కొరవడుతాయి. అందుకే
విలువలకు ప్రాదాన్యతనిస్తున్న భూసంస్కరణల బిల్లును ప్రవేశ పెట్టున్నాం. ప్రజా
ప్రతినిధులుగా మనకు అయిష్టమైన చట్టాన్ని తేవాలని కోరుకోం. ఆంగ్లంలో ఒక సామెత
వుంది...”చారిటీ బిగిన్స్ ఎట్ హోం” అని. మెజారిటీ శాసనసభ సభ్యులు గ్రామీణ
ప్రాంతానికి చెందిన వారే. అందుకే, ముందుగా మనమే మన భూముల వివరాలను ప్రకటిద్దాం. మన
డిక్లరేషన్లు మనమే మొదలిద్దాం. ప్రజా ప్రతినిధులుగా-ప్రజా నాయకులుగా అలా చేయడం మన
బాధ్యత. నాయకుడంటే ఓట్లు అడగడం మాత్రమే కాదు. నేనొక విషయం స్పష్టం
చేయదలచుకున్నాను. మీరెవరూ, మనమెవరమూ ఈ చట్టం నుంచి తప్పించుకోలేం. స్వచందంగా
వివరాలిస్తే సరే....లేకపోతే.....ఈ చట్టం ఆధారంగా (నేనే) ప్రభుత్వమే మిగులు భూములను
తీసుకుంటుంది. ప్రజలిది జరగాలనీ, చట్టం అమలు జరిగితీరాలనీ కోరుకుంటున్నారు”.
పీవీ నరసింహారావు
1972 ఆగస్ట్ నెలలో బిల్లుగా ప్రవేశ పెట్టి, జూన్ 1, 1973 నుంచి అమల్లోకి వచ్చిన
భూసంస్కరణల చట్టం తెలంగాణకు సంబంధించినంతవరకు లాభం చేసిందనే అనాలి. లభ్యమవుతున్న
గణాంకాల ప్రకారం తెలంగాణలో 3.14 లక్షల ఎకరాల
భూమి మిగులుగా తేలి షెడ్యూల్డ్ కులాల-తెగల-బలహీన వర్గాల వారికి ఇళ్ళ జాగాకు, లేదా,
వ్యవసాయానికి పంచడం జరిగింది. తద్వారా 2.26 మంది లాభపడ్డారు. అదీ-ఇదీ కలిసి సుమారు
23 లక్షల ఎకరాల అసైన్డ్ భూమిని సుమారు 15. 84 లక్షల మందికి పంచడం కూడా జరిగింది.
కాకపోతే అలా పంచిన భూమిని రైతు ఏ మేరకు సక్రమంగా వినియోగించుకోగలిగాడనేది సమాధానం
దొరకని ప్రశ్న. రైతుకు కావాల్సిన కనీస వసతి-సౌకర్యాలు కలిగించకుండా భూమి
ఇవ్వడంతోనే సరిపుచ్చుకుంది అలనాటి ప్రభుత్వం.
భూసంస్కరణల
పుణ్యమా అనీ, పీవీ గారి పుణ్యమా అని, భూస్వాముల భూమి పోవడంతో పాటు, చట్టం అమలు
మొదలైన తరువాత పెద్ద మొత్తంలో వ్యవసాయ భూముల కొనుగోలు, పెద్ద కమతాలుండే విధానం,
క్రమేపీ తగ్గిపోయింది. సమగ్ర సర్వే-భూ రికార్డుల ప్రక్షాళణ చేయించాలన్న ప్రస్తుత
ప్రభుత్వ ఆలోచన నేపధ్యంలో లభ్యమవుతున్న గణాంకాల వివరాల ప్రకారం, చిన్న-సన్న-మీడియం
కమతాలున్న రైతులే మెజారిటీలో-సుమారు 97 శాతం-వున్నారని తేలింది.
వివరాల్లోకి పొతే:
రాష్ట్రం మొత్తం వ్యవసాయానికి అనుకూలంగా వున్న సుమారు 1.55 కోట్ల ఎకరాల భూమిలో
సుమారు 62 శాతం కమతాలు (39 లక్షల ఎకరాలకు పైగా) రెండున్నర ఎకరాల లోపే! మరో సుమారు
24 శాతం కమతాలు (46 లక్షల ఎకరాలకు పైగా) రెండున్నర-ఐదు ఎకరాల మధ్యన వున్నాయి.
అలాగే ఐదు-పదెకరాల మధ్యనున్నవారు సుమారు 11 శాతం (39 లక్షల ఎకరాలకు పైగా) మంది
వున్నారు. పదెకరాల నుండి 25 ఎకరాల మధ్యనున్న వారి సంఖ్య 3 శాతం (23 లక్షల ఎకరాలకు
పైగా) మాత్రమే. ఇక 25 ఎకరాల పైనున్న వారు
కేవలం 0.28 (6 లక్షల ఎకరాలకు పైన) శాతమే! ఇక కమతందారుల సంఖ్య చూస్తే: రెండున్నర
ఎకరాల లోపు 34.41 లక్షలు, రెండున్నర-ఐదు ఎకరాల లోపు 13.27 లక్షలు, ఐదు-పదెకరాల
లోపు 6 లక్షలు, పది నుంచి పాతిక ఎకరాల మధ్యన 1.67 లక్షలు, పాతిక ఎకరాల పైన కేవలం
15, 775 మంది మాత్రమే వున్నారు. ఏ విధంగా చూసినా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన
ఎకరాకు రు. 8, 000 సబ్సిడీ పథకం ద్వారా లబ్దిపొందేది అత్యధిక శాతం వున్న
చిన్న-సన్న-మధ్యతరగతి రైతులే! పీవీ భూసంస్కరణల పుణ్యమే చిన్న కమతాలు ఏర్పడడం! END
No comments:
Post a Comment