Monday, August 14, 2017

శృంఖలాలు తెగిపడిందిలా... : వనం జ్వాలా నరసింహారావు

శృంఖలాలు తెగిపడిందిలా...
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక (15-08-2017)

బ్రిటీష్ వలస పాలన నుండి భారత దేశానికి విముక్తి కలిగించేందుకు జరిగిన "ప్రప్రధమ స్వతంత్ర సంగ్రామం"-1857 నాటి సిపాయిల తిరుగుబాటు పర్యవసానంగా, ఆంగ్లేయుల దోపిడీ విధానంలో గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. ఫ్యూడల్, జమీందారీ వర్గాలను పురికొల్పడం ద్వారా, బ్రిటీష్ వారి "విభజించి-పాలించే" విధానం ఆరంభమైంది. పాశ్చాత్య ధోరణులు విపరీత పుంతలు తొక్కుతూ, జాతీయ వ్యతిరేక భావాలకు దారితీయడంతో, సహించలేని పలువురు సంఘ సంస్కర్తలు, భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి పూర్వ రంగంలో, బ్రహ్మ సమాజం, ప్రార్థనా సమాజం, ఆర్య సమాజం, థియోసాఫికల్ (బ్రహ్మ విద్య) ఉద్యమం, రామ కృష్ణా మిషన్ లాంటి పునరుజ్జీవన-పునర్వికాస ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు.

లార్డ్ డఫరిన్ ఆశీస్సులతో ఆవిర్భవించిన భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటీష్ వారి "విభజించి-పాలించే" విధానంలో భాగమే. అయితే, ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి పొందేందుకు, తమ ఆశీస్సులతోనే ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీ ముసుగులో, భారత జాతీయ ఉద్యమం వేళ్లూనుకుంటున్న సంగతి అర్థం చేసుకోలేకపోయింది బ్రిటీష్ ప్రభుత్వం. కాంగ్రెస్ ఆవిర్భావపు తొలినాళ్లలో, "మాడరేట్లు" గా పిలువబడే మితవాద భావాల నాయకులు పార్టీని-పార్టీ కార్య కలాపాలను ప్రభావితం చేశారు. బ్రిటీష్ వారి పద్ధతులను పూర్తిగా వ్యతిరేకించే దశకు అలనాటి మాడరేట్లు చేరుకోలేదప్పటికి. బ్రిటీష్ పాలకులు న్యాయంగా, ధర్మంగా వ్యవహరిస్తున్నారని కూడా అప్పట్లో వారి నమ్మకం. భావ స్వాతంత్ర్యానికి, పత్రికా స్వాతంత్ర్యానికి భంగం కలిగినప్పుడు జరిపిన పోరాటంలో తిలక్ లాంటి నాయకులను నిర్బంధంలోకి తీసుకుంది ప్రభుత్వం. మాడరేట్ల ప్రభావం క్రమేపీ క్షీణించి, మిలిటెంట్ భావాల వారి పలుకుబడి పెరగడంతో, పార్టీలో తీవ్రవాదుల ప్రాబల్యం మొదలయింది. అదికూడా ఒక విధంగా బ్రిటీష్ వారి "విభజించి-పాలించే" విధానానికి అనుకూలంగానే కనిపించింది పాలకులకు.

లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ, భారతీయ యువత, స్వదేశీ ఉద్యమం చేపట్టింది. అరబిందో, తిలక్, బిపిన్ పాల్ సహాయ నిరాకరణకు ఇచ్చిన పిలుపే, భవిష్యత్ లో మహాత్మా గాంధి, పెద్ద ఎత్తున చేపట్టారు. పూర్ణ స్వరాజ్యం-స్వపరిపాలనాధికారం కావాలంటూ, బాలగంగాధర తిలక్-ఇతర అతివాద నాయకులు నినాదం లేవనెత్తటాలు. 1907 లో, కాంగ్రెస్ పార్టీలో చీలి కొచ్చి, మాడరేట్లు అతివాదులనుంచి విడిపోయారు. మాడరేట్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా, అతివాదులపై మరిన్ని ఆంక్షలు విధించ సాగారు బ్రిటీష్ పాలకులు. "విభజించి పాలించే" దిశగా మరో అడుగు వేసింది ప్రభుత్వం.

భారత రాజకీయాలలో మహాత్మా గాంధి ప్రవేశించిన తర్వాత స్వాతంత్ర్యోద్యమంపై ఆయన ప్రభావం పడింది. ప్రధమ ప్రపంచ సంగ్రామం ముగిసిన పిదప, బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రౌలట్‌చట్టానికి వ్యతిరేకంగా మొట్టమొదటి సారి జాతీయ స్థాయిలో "సత్యాగ్రహం" ఉద్యమానికి పిలుపునిచ్చారు గాంధి. సెప్టెంబర్ 1920 లో కలకత్తాలో నిర్వహించిన ప్రత్యేక కాంగ్రెస్ సమావేశాల్లో, లాలా లజపతి రాయ్, చిత్తరంజన్ దాస్ లాంటి నాయకులు వ్యతిరేకించినప్పటికీ, ఉద్యమం జరపాలన్న తీర్మానానికి పెద్ద సంఖ్యలో మద్దతు లభించింది. మోతీలాల్ నెహ్రూ, గాంధి పక్షం వహించారు.

"శాసనోల్లంఘనం" ఉద్యమానికి నాంది పలికిన గాంధి, చౌరీ చౌరా సంఘటనలో పాతిక మంది పోలీసులు మరణించడంతో, సహాయ నిరాకరణకు ఏక పక్షంగా స్వస్థి చెప్పారు. దరిమిలా, నవంబర్-డిసెంబర్, 1922 లో జరిగిన కలకత్తా, గయ కాంగ్రెస్ సమావేశాలలో చట్ట సభల్లో ప్రవేశించే విషయంలో తీవ్ర అభిప్రాయ బేధాలొచ్చాయి. చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ ప్రభృతులు ఒక వైపు, రాజాజీ, అన్సారి ప్రభృతులు మరో వైపు వాదించారు. మాట నెగ్గించుకోలేని చిత్తరంజన్ దాస్ పార్టీకి రాజీనామా చేసి "స్వరాజిస్ట్ పార్టీ" ని స్థాపించారు. మోతీలాల్ నెహ్రూ ఆయన పక్షానే నిలిచారు. తండ్రి మోతీలాల్ స్థానంలో లాహోర్ లో కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికైన జవహర్ లాల్ నాయకత్వంలో, డిసెంబర్ 31, 1929 అర్థ రాత్రి, నూతన సంవత్సరం ఆరంభమవుతుండగా, "పూర్ణ స్వరాజ్" నినాదంతో, త్రి వర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇక అప్పటినుంచి "సత్యాగ్రహ శకం" ఆరంభమయిందనాలి.

ఫిబ్రవరి 1930 లో సబర్మతి ఆశ్రమంలో సమావేశమైన అఖిల భారత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, శాసనోల్లంఘన ఉద్యమం విషయంలో నిర్ణయాధికారం గాంధీజీకి వదిలింది. మార్చ్ 12, 1930 న చారిత్రాత్మక దండి సత్యాగ్రహానికి నాంది పలికారు. అప్పటికింకా గాంధీని అరెస్ట్ చేయలేదుగాని, వల్లభాయ్ పటేల్ లాంటి నాయకులను నిర్బంధంలోకి తీసుకుంది. ఏప్రిల్ 5, 1930 నాటికి దండి చేరుకుంది గాంధీజీ బృందం. సముద్రపు ఒడ్డున పిడికెడు ఉప్పును చేతబట్టి, "ఉప్పు చట్టాన్ని" ఉల్లంఘించామని, ఇక ముందు చట్టాన్ని ఉల్లంఘించి ప్రతి పౌరుడు తాము అనుకున్న స్థలంలో ఉప్పు తయారు చేసుకోవచ్చని పిలుపిచ్చారు. ఉప్పు కర్మాగారాలపై దాడి చేస్తామని మరో లేఖను వైస్రాయ్ కు రాయడంతో, గాంధీజీని అరెస్ట్ చేసి ఎరవాడ జైలుకు తరలించింది బ్రిటీష్ ప్రభుత్వం. వందల సంఖ్యలో అరెస్టులు జరిగాయి. దేశ వ్యాప్తంగా ఉప్పు సత్యాగ్రహం కొనసాగింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని చట్టవిరుద్ధ సంస్థగా పేర్కొంటూ, మోతీలాల్ నెహ్రూను కూడా అరెస్ట్ చేసింది ప్రభుత్వం. "విభజించి పాలించే" విధానాన్ని నమ్ముకున్న బ్రిటీష్ ప్రభుత్వం, గాంధీజీని ఒంటరి వాడిని చేసి, ఇతరులను నిర్బంధించి ఉద్యమానికి గండి కొట్టాలని తలచింది. అయినా వారి కోరిక సఫలం కాలేదు.


గాంధి-ఇర్విన్ మధ్య కుదిరిన ఒప్పందం అమలులో పూర్తిగా విఫలమైంది. ఇంగ్లాండ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన గాంధీజీ, రిక్త హస్తాలతో స్వదేశానికి తిరిగొచ్చారు. జవహర్లాల్ నెహ్రూ, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వంటి నాయకులను మరోసారి అరెస్ట్ చేసింది ప్రభుత్వం. జనవరి 4, 1932 న గాంధీజీతో పాటు పలువురు అగ్రశ్రేణి నాయకులను అరెస్ట్ చేయడంతో సహా, కాంగ్రెస్ పార్టీని చట్ట వ్యతిరేక సంస్థగా నిర్ణయించింది ప్రభుత్వం. సెప్టెంబర్ 1940 లో, భావ స్వాతంత్ర్యాన్ని కాపాడాలంటూ, కాంగ్రెస్ నాయకత్వం సత్యాగ్రహానికి దిగింది మరో సారి. మొదటి సత్యాగ్రహి వినోభా భావే కాగా, జవహర్లాల్ నెహ్రూ ఆయన తర్వాత సత్యాగ్రహి. అరెస్టయిన నెహ్రూకు నాలుగేళ్ల కారాగార శిక్ష పడింది. జులై 14, 1942 , వార్దాలో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, "క్విట్ ఇండియా" డిమాండ్ చేయాలని తీర్మానించింది. ఆగస్ట్ 7, 1942 న బాంబేలో సమావేశమైన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ఆ మర్నాడు ఆగస్ట్ 8, 1942 , జవహర్లాల్ నెహ్రూ ప్రవేశ పెట్టిన, "క్విట్ ఇండియా" తీర్మానాన్ని ఆమోదించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ తీర్మానాన్ని బలపర్చారు. తీర్మానంలో చివరగా "స్వతంత్ర భారతదేశం కావాలన్న వాంఛ వున్నప్పటికీ, దానికి సామూహిక ప్రజా ఉద్యమం చేపట్తున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి అధికారం చేపట్టాలన్న ఉద్దేశం లేదు. అధికారం ఎప్పుడొచ్చినా, అది ప్రజలకే చెందుద్తుంది" అని పేర్కొనడం జరిగింది. కాకపోతే స్వతంత్రం వచ్చిన నలభై సంవత్సరాల వరకు అధికారం కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే వుంది. తీర్మానం ఆమోదించిన మరుక్షణమే మాట్లాడిన గాంధీజీ, తాను "తక్షణమే, వీలుంటే ఆ రాత్రే-తెల్లవారే లోపునే" స్వరాజ్యం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. స్వతంత్రం కంటే తక్కువైనదేదీ తనకు అంగీకారం కాదని కూడా స్పష్టం చేశారాయన.

ఆగస్ట్ 8, 1942 న తెల్లవారక ముందే, ప్రభుత్వం వేసుకున్న పటిష్ఠమైన ప్రణాళిక ప్రకారం, గాంధీజీ తో సహా కాంగ్రెస్ నాయకులందరినీ నిర్బంధంలోకి తీసుకుని, రహస్య ప్రదేశాలకు తరలించింది ప్రభుత్వం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులను ఎక్కడ దొరికితే అక్కడే అరెస్ట్ చేసింది ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా వున్న అన్ని సంస్థలను, వ్యవస్థలను నిషేధించింది. ఖాదీ-హరిజన సంస్థల లాంటి సాంఘిక కార్య కలాపాలను కూడా నిషేధించింది. ప్రజలనుంచి కూడా అదే మోతాదులో ప్రతిఘటన ఎదురైంది. బొంబాయిలో పోలీసు హెచ్చరికలను లక్ష్య పెట్టకుండా అరుణా ఆసఫ్ అలీ ఝండా ఎగుర వేసింది. ఒక వైపు "క్విట్ ఇండియా" ఉద్యమం, మరో పక్క "ఆజాద్ హింద్ ఫౌజ్" ప్రభావం, ఇంకో దిశగా మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు, బ్రిటన్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ ఓటమి, బ్రిటీష్ ప్రభుత్వాన్ని కలవర పరిచాయి.

చర్చిల్ వారసుడు క్లెమెంట్ అట్లీ, త్రి సభ్య కాబినెట్ కమిటీని నియమించి, ఆ కమిటీ భారత దేశాన్ని సందర్శించనున్నదని ఫిబ్రవరి 19, 1946 న ప్రకటించారు. కమిటీతో చర్చలకు పాకిస్తాన్ ఏర్పాటు ప్రాతిపదిక కావాలని జిన్నా అభిప్రాయ పడ్డారు. త్రిసభ్య కాబినెట్ మిషన్ తో రాజకీయ నాయకుల చర్చలు సఫలం కాలేదు. ఇంతలో, కాంగ్రెస్ పార్టీకి చెందిన బడుగు-దళిత వర్గాల వ్యక్తితో కలిపి ఆరుగురు హిందువులు, ముస్లింలీగుకు చెందిన ఐదుగురు ముస్లింలు, ఒక సిక్కు, ఒక క్రిస్టియన్, ఒక పార్సీ-మొత్తం పద్నాలుగురుండే మధ్యంతర ప్రభుత్వాన్ని ప్రకటించాడు వైస్రాయ్. ఆ ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకించడంతో, తాత్కాలికంగా, అధికారులతో కూడిన ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ప్రకటించారు వైస్రాయ్. తదనంతరం, వైస్రాయ్ ఆహ్వానం మేరకు, ఆరుగురు హిందువులతో, ముగ్గురు ముస్లింలతో, ఒక సిక్కు, ఒక క్రిస్టియన్, ఒక పార్సీలతో జవహర్లాల్ నాయకత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం సెప్టెంబర్ 2, 1946 న అధికారాన్ని చేపట్టింది. అక్టోబర్ చివరి వారంలో ముస్లిం లీగ్ కూడా ప్రభుత్వంలో చేరింది. కాకపోతే షరతులతో చేరింది. అధికారం నడుపుతున్నది మంత్రివర్గం తరహా ప్రభుత్వంగా పరిగణించ రాదనీ, అది కేవలం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మాత్రమేనని ముస్లిం లీగ్ వాదన.

1946-1947 మధ్య కాలంలో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. భారీ సంఖ్యలో హిందువులకు ప్రాణ-ఆస్తి నష్టం కలిగింది. నవంబర్ 1946 లో గాంధీజీ నవొకాళీకి వెళ్లి, ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. మధ్యంతర ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలు పరిస్థితిని కుదుట బర్చాయి. దేశ విభజన జరగాలన్న మౌంట్ బేటన్ ప్రణాళికకు కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపింది. గాంధీజీకి విభజన ఇష్టం లేదు. వ్యతిరేకిస్తే విప్లవం మినహా మార్గాంతరం లేదని కూడా ఆయనకు తెలుసు. రెండు దేశాల జిన్నా వాంఛ నెరవేరనున్న తరుణంలో, స్వతంత్రం సిద్ధించనున్న తరుణంలో, లక్షలాది హిందువులు, ముస్లింలు తరతరాలుగా నివసిస్తున్న ప్రాంతాలను-అనుభవిస్తున్న తాత-ముత్తాతల ఆస్తులను వదిలి "శరణార్థుల కాంపుల" లో ఇతరుల దయాదాక్షిణ్యాలతో జీవించాల్సిన పరిస్థితులు కలిగాయి. అలనాటి సంఘటనలను "భారత మాత ఆత్మ సంక్షోభం" గా అభివర్ణించారు జవహర్లాల్ నెహ్రూ.

లక్షలాది భారతీయుల ఇక్కట్ల-త్యాగాల ఫలితంగా, ఆగస్ట్ 14-15 అర్థ రాత్రి సమయంలో, పాకిస్తాన్ భూభాగం భారత దేశం నుంచి విడిపోయిందన్న అశేష జన వాహిని మనస్థాపం మధ్య సంపూర్ణ స్వతంత్రం సిద్ధించింది భారతావనికి. క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన ఆగస్ట్ 9, స్వాంతంత్ర్యం వచ్చిన ఆగస్ట్ 15 భారతీయులకు అసలైన పండుగ దినాలు. END


No comments:

Post a Comment