గార్ల జాగీరులో తొలి
సత్యాగ్రాహి
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక (15-08-2017)
స్వాతంత్ర్య సమరయోధుడుగా, నిజాం హైదరాబాద్ సంస్థానం పాలన నుంచి విముక్తికొరకు
జరిగిన పోరాటంలో పాల్గొన్న వ్యక్తిగా,
శాసన సభ సభ్యుడుగా, ప్రముఖ న్యాయవాదిగా, శాసన సభ అంచనాల కమిటీ అధ్యక్షుడుగా, పానెల్ స్పీకర్ గా, బొగ్గారపు సీతారామయ్య తెలంగాణ ప్రజలకు చిరపరిచితుడే. ఆయన పుట్టింది ఫిబ్రవరి 12,1930. ఖమ్మం జిల్లా పండితాపురంలో జన్మించిన సీతారామయ్య కేవలం 15 సంవత్సరాల వయసులోనే సత్యాగ్రహం చేసి జైలుకెళ్లారు. శిక్షా కాలం
పూర్తైన తరువాత, తెలంగాణ సాయుధ పోరాటంలో
చురుగ్గా పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడుగా భారత ప్రభుత్వం నుంచి తామ్ర పత్ర
సత్కారం పొందారాయన. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వ విద్యాలయం, ఉస్మానియా విశ్వ విద్యాలయం, సీతారామయ్యను విశిష్ఠ స్వాతంత్ర్య సమరయోధుడుగా సత్కరించాయి.
1951 లో ఉపాధ్యాయ వృత్తిని
చేపట్టారు. ఉపాధ్యాయ సంఘాలను నెలకొల్పారు. ప్రధానోపాధ్యాయ స్థాయికి కూడా ఎదిగారు.
హైదరాబాద్ స్టేట్ యూనియన్ నాయకుడిగా సేవలందించారు. 1961 లో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా
చేసి ఖమ్మంలో న్యాయవాదిగా పనిచేయడం ప్రారంభించారు. జిల్లా న్యాయవాదుల సంఘానికి
అధ్యక్షుడయ్యారు. 1969 లో తెలంగాణ ప్రజాసమితిలో చేరి, ప్రత్యేక తెలంగాణ వేర్పాటు ఉద్యమంలో క్రియాశీలకంగా పని
చేస్తూ, జైలు శిక్షను కూడా
అనుభవించారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పటివరకూ అందులోనే
కొనసాగుతున్నారు. 1978 లో ఇందిరా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖమ్మం జిల్లా సుజాత్ నగర్
నియోజక వర్గం నుంచి శాసన సభకు పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం
హైకోర్టు న్యాయవాదిగా పని చేస్తున్నారు.
బొగ్గారపు
సీతారామయ్య నేను ఖమ్మం రికాబ్
బజార్ పాఠశాలలో చదువుతున్నప్పుడు మాకు ఇంగ్లీష్ బోధించిన ఉపాధ్యాయుడు. సీతారామయ్య సార్‍ను కలవడానికి ఎమ్మెల్యే
కాలనీలోని వారింటికి వెళ్తుండేవాడిని. పాత రోజుల నాటి సంగతులు, బొగ్గారపు సీతారామయ్య సార్ ఎమ్మెల్యే అయిన రోజులనాటి
విషయాలు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వ్యవహారం....ఇలా ....చాలా కబుర్లు
చెప్పుకునే వాళ్ళం. ఒక సారి నేను, డాక్టర్ రంగారావు, లలిత ఆయనతో సంభాషించినప్పుడు
తన చిన్ననాటి విషయాలను మాతో పంచుకున్నారు.
87 సంవత్సరాల వయసులో కూడా
నవ యవ్వన యువకుడిలో వున్న ఉత్సాహంతో అలనాటి సంగతులు చెపుతుంటే ఎంతో సంతోషం వేసింది
మాకు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరుగుతున్న విషయాన్ని మరీ-మరీ చెపుతూ ఆయన
ఎంతగానో ఆనందించారు. తన జీవితకాలంలో తెలంగాణ ఏర్పాటును చూడగలగడం తనకెంతో
సంతోషాన్నిస్తున్నదని పలుమార్లు అన్నారు. ఎక్కడా
మొదట్లో ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది లేదు. ఒక ప్రయివేట్ పాఠశాలలో నాలుగో తరగతి వరకు
చదివారు. ప్రముఖ జర్నలిస్ట్ ఆదిరాజు వెంకటేశ్వర రావుది కూడా పండితాపురమే.
సీతారామయ్య తండ్రి పోలీసు
పటేల్, తాత పట్వారీ. పటేల్, పట్వారీలంటే ఆరోజుల్లో హడల్.
వాళ్లిద్దరూ ఆ గ్రామాధినేతలే. బొగ్గారపు తండ్రికి ఒక్కడే కొడుకు. మధ్యతరగతి
కుటుంబీకులు. వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగించేవాళ్లు. చిన్నప్పటి నుంచీ పటేల్
పట్వారీలంటే నిరసన ధోరణితో వ్యవహరించేవాడు సీతారామయ్య. వాళ్లకెప్పుడూ దండం పెట్టక
పోయేవాడు. చిన్నప్పటి నుంచీ ఒక రకమైన తిరుగుబాటుతనం వుండేది ఆయనలో. అప్పట్లో ఐదో
తరగతి (ఫస్ట్ ఫామ్ అనేవారు) చదవాలంటే ముప్పై కిలోమీటర్ల దూరంలో వున్న ఖమ్మం
రావాల్సిందే. సీతారామయ్య చిన్నతనంలో నాలుగో తరగతి అయిన తరువాత ఖమ్మం వెళ్లి ఐదో
తరగతి చదవడానికి గొడవ పడినప్పుడు తాత ఈయనగారి తల్లి దగ్గరకు వచ్చి, "నీ కొడుకేమన్నా చదువుకొని పటేల్ గిరి
చేస్తాడా? పట్వారీ గిరి చేస్తాడా? వీడిని గొడ్ల కాపలాకు పంపిస్తే ఒక
పుట్టెడు గింజలు మిగులుతాయి కదా?" అన్నాడు.
అంతే సీతారామయ్యను ఖమ్మం పంపడం మానేసుకున్నారు. అంతేకాదు ఆయనను పశువులు కాయడానికి
పెట్టారు తల్లితండ్రులు. ఆ రోజుల్లో పశువులు కాసేవాళ్లంతా చేపలు కూడా పట్టేవారు.
మిగతా కుర్రకారుతో పాటు ఆయన కూడా చేపలు పట్టడం చేసేవాడు.
ఇలావుంటే ఆగస్టు 8, 1947 వచ్చింది. పక్క వూరి పెద్దమనిషి
రాధాకృష్ణ చేతిలో ఆంధ్రప్రభ దినపత్రిక వుంది. దాన్నాయన తనతో తీసుకుపోతున్నాడు.
పండితాపురంలో పోస్టాఫీస్ లేదు కాబట్టి పేపర్లు రావప్పట్లో. ఎప్పుడో పేపర్ దొరికితే
అదొక పండుగలాంటిది. ఒక్క పేపర్ చదువొచ్చిన వాళ్లంతా చదివేవారు. రాధాకృష్ణ
సీతారామయ్య పొలం నుండే కాలిదారిన వెళ్తున్నాడు. "నమస్కారమండీ"
అన్నాడీయన. "మీ చేతిలో పేపరిస్తారా?" అని అడిగాడు. తన వూరు వాళ్లు ఈ పేపర్
కొరకు ఎదురు చూస్తుంటారని ఇవ్వలేనని సమాధానం వచ్చింది. తాను చదివి ఆయన వూరుకు
తీసుకొచ్చి ఇస్తానని మాటిచ్చాడు సీతారామయ్య. ఎలాగో ఒప్పించి పేపర్ తీసుకున్నాడు.
మెయిన్ పేపర్ మెయిన్
హెడ్డింగ్ చదివాడు. "తెలంగాణాలో సత్యాగ్రహ మహోద్యమ విజృంభణ....వాడవాడలా
మువ్వన్నెల జండా రెపరెప....నిజాం గుండెల్లో గుబులు....మధిరలో జమలాపురం అరెస్ట్..." అని వుంది. అది చదవగానే సీతారామయ్యకు
పెద్ద ఉత్సాహం కలిగింది. తనకు కూడా సత్యాగ్రహం చేయాలని సంకల్పం కలిగింది. ఆయన
గ్రామం ఇల్లెందు తాలూకా...గార్ల జాగీరులో వుంది. అంతకు ముందు ఆ వూళ్లో సత్యాగ్రహం
చేసినవాళ్లెవరూ లేరు. ఆయనే మొదటి వాడవుతాడు. అందులో ఇంకా అప్పటికాయన మైనరే!
పద్దెనిమిదో సంవత్సరం నడుస్తోంది. ఇదిలా వుండగా ఆగస్ట్ 15, 1947 న స్వామీ రామానంద తీర్థ
సత్యాగ్రహానికి మరో పిలుపిచ్చాడు. తక్షణమే పండితాపురంలో సీతారామయ్య సత్యాగ్రహం
చేశాడు. సహచర విధ్యార్థులను ఉపాధ్యాయుడి అనుమతితో తరగతులనుంచి బయటకు తీసుకొచ్చి, కొందరు గ్రామస్తులతో కలిసి, ఒక ఊరేగింపు తీసి మువ్వన్నెల జండా
ఎగురవేసి సత్యాగ్రహం చేశాడు. విప్లవ భావాల టీచర్ కూడా సహకరించాడు.
బ్రిటీష్ ప్రభుత్వ “గార్ల
జాగీర్” పోలీసులొచ్చి అరెస్ట్ చేశారు ఆయన్ను. అప్పట్లో ఖమ్మం ఖిలా కూడా జాగీరే.
అలాగే ఖిలా చుట్టుపక్కల ప్రాంతమంతా జాగీరే. అక్కడ ఏదన్నా నేరం జరుగుతే గార్ల
జాగీర్ కోర్టుకు రావాల్సిందే. గార్ల జాగీరుకు కలెక్టర్ వేరే. వాళ్లప్పుడు తాలూకా
గార్ల, జిల్లా గార్ల అని రాసుకునేవాళ్లు.
వరంగల్ జిల్లాలో భాగంగా చెప్పుకోలేదు. దానికి పాలనంతా వేరే. పోలీసు
అడ్మినిస్ట్రేషన్ వేరే. అంతా జాగీర్ అడ్మినిస్ట్రేషన్. అది ఖానం జంగ్ బహద్దర్ ది.
అతడు నిజాం ప్రయివేట్ సెక్రటరీ కూడా. అతను నిజాం కు సలహా కూడా
ఇచ్చాడు...స్వతంత్రంగా వుండవద్దు....యూనియన్ లో కలుద్దామని. నిజాం
వినిపించుకోలేదు. జాగీర్దారైనా అతడికి జాతీయ భావాలుండేవి.
గార్ల జాగీర్ కస్టడీలో
పెట్టారు సీతారామయ్యను. ఒకరోజు పోలీసు కానిస్టేబుల్ వచ్చి మెజిస్ట్రేట్ దగ్గరకు
తీసుకుపోయాడు. పోగానే మెజిస్ట్రేట్ సీతారామయ్యను కుర్చీలో కూచోబెట్టి, చపాతీలు పెట్టి, ఖైమా పెట్టి తినమన్నాడు. (దాశరథి
రంగాచార్య కూడా గార్ల జాగీరులోనే). "కేసు ఎల్లుండి వస్తుంది. క్షమాపణ (మాఫీ
మాంగో) కోరు అని సలహా ఇచ్చాడు. "మాఫీ
నై మాంగేతో, ఆయిందా నై కర్తే బోలో... ఛోడ్ దేతాహూం" అన్నాడు. "ఆయిందా నై కర్తే బోల్కే నై బోల్తా....
మాఫీ భీ నై మాంగ్తా....మై గల్తీ నై కరేతో మాఫీ మాంగ్ నే కా సవాల్ కహా హై?" అన్నాడు సీతారామయ్య.
మూడోనాడు కోర్టుకు
మేజిస్ట్రేట్ దగ్గరకు తీసుకుపోయారు. "షాహీ ఖాన్దాన్ ముర్దాబాద్...నిజాం నవాబ్
ముర్దాబాద్" అని అన్నాడని సాక్షి అబద్ధం చెప్పాడు. ఎక్కువ కఠిన శిక్ష పడే విధంగా సాక్ష్యం
చెప్పాడు. "గాంధీజీకి జై..సుభాష్ బోస్ కీ జై" అని అన్నాం కాని
ముర్దాబాద్ అన్న మాటే రాలేదని సీతారామయ్య అన్నాడు. "నేరం చేశావా?" అని అడిగాడు న్యాయమూర్తి. "నేరం
చేయలేదు...సత్యాగ్రహం చేశాను" అని జవాబిచ్చాడు. ఆర్నెల్ల జైలు శిక్ష
విధించినట్లు తీర్పిచ్చాడు న్యాయమూర్తి. వరంగల్ సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు.
అక్కడ కూడా ఓ ముప్పై మందిని వెంటేసుకుని ఆందోళన చేసాడు. ఆహారం బాగాలేదని గొడవ
చేశారు. ఆ ముప్పైమందిని ఔరంగాబాద్ సెంట్రల్ జైలుకు పంపమని రాశారు. వరంగల్ నుంచి
అందర్నీ ఔరంగాబాద్ కు మార్చారు. సబ్ జైలులో, చాలా చిన్న గదిలో నిల్చోడానికి కూడా
చోటు లేని విధంగా వీళ్లనుంచారు. మూత్ర విసర్జన చేయాలంటే గోడకు అభిముఖంగా ఇతరుల మీద
పడుతుంటే చేయాల్సిందే! పొద్దున్నే తీసుకోపోయి ఔరంగాబాద్ సెంట్రల్ జైల్లో పడేశారు.
ఫిబ్రవరి 29, 1948 న ఆర్నెల్ల శిక్ష పూర్తైన
తరువాత విడుదల చేశారు.
పోలీసుల్లో
కూడా ఆ రోజుల్లో మంచి వాళ్లుంటారని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇచ్చారు. విడుదల చేసినప్పుడు
సీతారామయ్యకు పాపటపల్లికి టికెట్ కొన్నారు. రైల్వే స్టేషన్ కు చేరుకున్న కాసేపటికి, ఒక పోలీసు ఇన్‍స్పెక్టర్ పాపటపల్లి
వెళ్లడానికి సికిందరాబాద్ కు, ఔరంగాబాద్ మీదుగా పోవద్దని, బొంబాయ్ పొమ్మని సలహా ఇచ్చాడు.
మన్మాడ్ మీదుగా పొమ్మన్నాడు. ఆయన దగ్గర పైకం లేదు. మన్మాడ్ పోయే రైల్లో "బగర్
టికెట్ చలేజావ్" అన్నాడు పోలీసు ఇన్‍స్పెక్టర్. అలానే చేసిన ఆయన్ను చెకింగ్
వాళ్లు మన్మాడ్ లో పట్టుకున్నారు. వాళ్లు ఆయనను డబ్బులడగ లేదు. సెకండ్ క్లాస్ లో కూచోబెట్టి
బొంబాయ్ లో వదిలిపెట్టారు. బొంబాయ్ బజార్లో ఒక గుడ్డల దుకాణంలో గాంధీ టోపీతో ఒక
మార్వాడీ కనిపించాడు. మార్వాడీ దగ్గరకు పోయి దండం పెట్టి తన పరిస్థితిని
వివరించాడు. వెంటనే గుమాస్తాను పిల్చి "పహలే ఖానా ఖిలా ఏ బచ్చేకో"
అన్నాడు ఆయన. మంచి భోజనం పెట్టించాడు. ఎక్కడికి పోవాలని అడిగి, విజయవాడకని తెలుసుకుని టికెట్
తెప్పించి ఇచ్చి, వంద రూపాయలు జేబులో పెట్టాడు
మార్వాడీ సేట్.
ఆ రోగుల్లో
దేశభక్తులంటే అలా వుండేవారు. అక్కడ నుంచి విజయవాడలో వున్న హయగ్రీవాచారి దగ్గరకు
పోయాడు. అప్పటికే ఆయన దగ్గర ఈయన రికార్డుంది. ఆయనెలా అరెస్టైంది కూడా వుంది.
హయగ్రీవాచారి ఆయన్ను అక్కడే వుండమని, భోజనాలు ఏర్పాటుచేశారు. అక్కడనుండి ఒక
కాంపుకు పొమ్మన్నారీయనను. అలాగే చేశాడు. సీతారామయ్య ఎక్కడికి పోయిందీ, ఏం చేస్తున్నదీ, ఆయన కుటుంబ సభ్యులకెవ్వరికీ
తెలియదు.
ఆ తరువాత పోలీస్ యాక్షన్ అయింది. సీతారమయ్య ఇల్లెందు, కారేపల్లి
కాంపుల్లో తిరుగుతూ వుండేవాడు. ఇండియన్ యూనియన్ పోలీసొచ్చింది. వాళ్లేమో
కమ్యూనిస్టులను ఆడా-మగా తేడా లేకుండా కొట్టేవాళ్లు. సీతారామయ్య లాంటి వాళ్లు ఫలానా
వాళ్లు కమ్యూనిస్టులు కాదంటే వదిలిపెట్టేవాళ్లు. ముచ్చర్ల కాంపు, లింగాల కాంపు లో పనిచేసుకుంటూ పోలీసుల వెంట పోయేవాడీయన. కాంగ్రెస్ వాళ్లను
రక్షించుకునే ప్రయత్నం చేసేవాడు. ఔరంగాబాద్ జైల్లో వుండగా అక్కడున్న అడ్వకేట్ల
ద్వారా కొంచెం ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నాడు.
క్రమేణా ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ప్రయివేట్ గా
మెట్రిక్యులేషన్ చదివి 1951
లో పాసయ్యారు. దాశరథి రంగాచార్య రాసిన "జీవనయానం"
ఆత్మకథలో సీతారామయ్య చదువు గురించి రాశారు. దాశరథిది కూడా అప్పట్లో సీతారామయ్య
పరిస్థితే. ఆయనా ఈయనతో పాటే పరీక్ష రాయడానికి వచ్చి డబ్బులు లేకపోయిన సందర్భంలో
ఇరువురూ ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. తన దగ్గరున్న కొంచెం డబ్బులతోనే, ఒక పూట
తినీ-తినక సీతారామయ్య, దాశరథికి సహాయం చేశాడు. తిరుగుప్రయాణం
టికెట్లిప్పించాడు.
తనకున్న అనుభవం ప్రకారం, కాంగ్రెస్ పార్టీ కేవలం పాతిక శాతం
మాత్రమే స్వాతంత్ర్యం రావడానికి కారణమంటారు. ముప్పై-ముప్పై అయిదు శాతం సుభాష్
చంద్ర బోసు కారణమంటాడు. మిగిలింది ఇతర విప్లవ వీరుల వల్ల వచ్చిందని ఆయన అభిప్రాయం.
కాంగ్రెస్ పార్టీ వల్లనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందనడం వాస్తవం
కానేకాదంటాడాయన. ఇదంతా చారిత్రక సత్యం అని కూడా అంటాడాయన.
ఆంధ్రా మెట్రిక్
రాసిన తరువాత ఏం చెయ్యాలన్న ఆలోచనలో పడ్డాడు. ఇంటర్మీడియేట్ లో చేరడం సీతారామయ్యకు
ఇష్టంలేదు. టీచర్ ఉద్యోగంలో చేరాడు. అప్పుడు అరవై ఎనిమిది రూపాయల హాలీలు జీతం వుండేది.
1956 లో ప్రైయివేట్
గా బిఏ పాసయ్యాడు. చాలా సార్లు అక్కడికీ-ఇక్కడికీ ట్రాన్స్ఫర్ అయ్యాడు. తనకు 1972 లో శాసనసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ దొరకలేదు. దొరకనందుకు
బాధపడ్తున్నావా అని అడిగిన జలగం వెంగళరావుకు సమాధానంగా, తానెప్పటికైనా
ఎమ్మెల్యే అయి తీరుతానని స్పష్టం చేసాడు. ఆయన చెప్పినట్లే 1978 ఎన్నికల్లో
ఖమ్మం జిల్లా సుజాత్ నగర్ నుంచి శాసన సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మర్రి
చెన్నారెడ్డి వీరికి టికెటిచ్చారు. చెన్నారెడ్డిగారితో సీతారామయ్యకు మంచి
సంబంధాలుండేవి. ఆయనకు వీరాభిమానీయన.
క్రియాశీలక
రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత పూర్తికాలం అడ్వొకేట్ గా నే పనిచేశారు. మంచి
పేరు తెచ్చుకున్నారు. పదిమందికీ అవసరానికి వీలైనంత సహాయపడడం ఆయనలోని సుగుణం.
జీవితాంతం అలానే వుండాలని ఆయన కోరిక. End
No comments:
Post a Comment