Sunday, September 3, 2017

ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
రావణుడి అంతఃపుర స్త్రీలను చూసిన హనుమంతుడు
వనం జ్వాలానరసింహారావు
సూర్య దినపత్రిక (03-09-2017)

శరత్కాలంలోని ఆకాశం నక్షత్ర సమూహాలతో ప్రకాశించినట్లు, స్త్రీ రత్నాలతో రావణాసురిడిల్లు ప్రకాశించింది (రావణాసురుడు చంద్రుడు-స్త్రీలు నక్షత్రాలు). తామరపూలలాంటి ముఖాలున్న ఆ స్త్రీల మధ్యలో, రావణుడు ,చుక్కల్లో చంద్రుడిలా వున్నాడనుకుంటాడు హనుమంతుడు. అయితే పుణ్యం క్షయిస్తే నేలరాలుతున్న నక్షత్రాలలాగా ఆ స్త్రీలను భావిస్తాడు ధైర్యవంతుల్లో శ్రేశ్ఠుడైన హనుమంతుడు. కారణం, ఆ స్త్రీలు త్వరలో విధవలు కాబోతున్నారు కనుక. ఉత్తమ జాతి క్షత్రియ స్త్రీలు రాక్షసుడితో సంభోగించాల్సిన పరిస్థితి కలిగిందంటే అది వారి పుణ్యక్షయమే కదా! తళుకు-తళుక్కను నక్షత్రాల రూపం, నైర్మల్యం, ఘనమైన కాంతి, రావణుడింట్లో నిద్రిస్తున్న స్త్రీలలో కనిపించింది.

         ఆరాత్రి రెండో జాములో: మధ్యపానానంతరం రతికేళిలో వళ్లు, వంటిమీదున్న హారాలను మరిచి, ఆభరణాలు నేలరాలినా వళ్లు తెలియకుండా నిదిరిస్తున్న హస్తినీజాతి స్త్రీలను చూసాడు హనుమంతుడు. చెమటకు తిలకం చెరిగిపోయిన, కాలిగజ్జెలు ఊడిపడిన, మెడదండలు పక్కల్లో పడిపోయిన, చీరెలు వదులై వంటి మీదుండి జారిపడిపోయిన, మెడలోని ముత్యాల దండలు తెగి నేలరాలిపోయిన, మొలతాళ్లు తునిగి పడిపోయిన, అలసిన గుర్రపు బిళ్లలలా పడుకున్న, తళుకు కమ్మలు ధరించిన రావణుడి అంతఃపుర స్త్రీలను చూసాడు హనుమంతుడు. వారిలోని కొందరు తమ దండలు తెగిపడిపోవటంతో, అడవిలో ఏనుగు త్రుంచిన పూలతీగల్లా వున్నారు. మరికొందరు స్త్రీల చనుదోయి పైనున్న ముత్యాలదండలు సూర్య-చంద్ర కిరణాల కాంతితో నిద్రిస్తున్న హంసల మాదిరిగా వున్నాయి. కొందరు స్త్రీలు ధరించిన వైడూర్యాలు కాదంబ పక్షుల్లా వున్నాయి. కొందరి మెడల్లోని బంగారు సరములు చక్రవాకాల్లా వున్నాయి. హంసలచేత, కన్నెలేళ్లచేత, చక్రవాకాలచేత, ఇసుకదిబ్బలచేత ఒప్పు నదులలాగా, నడుము ముందు భాగాలతో ఒప్పే స్త్రీలున్నారా ఇంట్లో.

         బంగారపు సొమ్ములనే వికసించిన తామరపూలు, ఒడ్డాణాలలోని చిరుగజ్జెల్లాంటి మొగ్గలు, మనసు మింగేలా మోహించే స్వభావమున్న శృంగార చేష్టలనెడి మొసళ్లు, కాంతులనెడి ఒడ్డులు కలిగి నిద్రిస్తున్న బాలికలు క్రీడాతిశయంతో అలసి-సొలసి, పరవశంతో ఏరుల్లా పారుతున్నారక్కడ. (పదహారేళ్లు నిండిన ఆడదే "బాల"నీ, ఆతక్కువ వయస్సుది రతికి యోగ్యురాలు కాదని, శాస్త్రాభిప్రాయంగా అంటారు కవి. ప్రధమ రజస్వల ఎప్పుడైనప్పటికీ, పదహారేళ్లు దాటేంతవరకు గర్భాదానం చేయరాదని కూడా వ్రాస్తారిక్కడ)


         స్తనములపైన, చనుముక్కులపైన, కుసుమ మనోహరమైన అవయవములమీద, అందమైన రత్నాభరణాలు ధరించి నిద్రిస్తున్న ఆస్త్రీలను చూసిన మగవారెవరైనా మదన వికారంతో పరవశులైపోవాల్సిందే. (ఈ కారణం వల్లే స్త్రీలు నిదురిస్తున్నప్పుడు పురుషులు చూడరాదన్న నియమం ఏర్పడింది. స్త్రీలు కూడా వెల్లికిల పరుండకూడదు). ఆ సమయంలో నిద్రిస్తున్న స్త్రీల ముఖాల్లోనుండి వస్తున్న నిట్టూర్పుగాలులు పైటకొంగులను కదిలించి, వారి ముఖాలపై వింజామర వీస్తున్నట్లుగా వుంది. ఆస్త్రీలకెవరికీ రవికలు లేవు. స్త్రీల అందమైన ముఖాల మీదున్న పైటలు ప్రకాశిస్తూ, మదనుడి ధ్వజాలను మరిపిస్తూ అందంగా వున్నాయి. వారి ముఖం నుండి బయటకొస్తున్న కమ్మని వాయువు, అలంకరించబడిన వెలగల కెంపులను, కమ్మలను, కొంచెం కదిలించింది.

         చక్కెరకల్లు వాసన కొట్తున్న ఆస్త్రీల కమ్మని శ్వాసలు మదాతిశయంతో రావణుడిపై వ్యాపించాయి. (అంటే హనుమంతుడు రావణుడిని సమీపిస్తున్నాడని తెలుస్తున్నది) సవతుల ముఖాలను రావణుడి ముఖమేననుకుని, భ్రాంతితో ముద్దెట్టుకుంటున్నారు కొందరు స్త్రీలక్కడ. ముద్దుపెట్టుకున్నది రావణుడేననుకొని భ్రమించిన ఆసవతి, మరో సవతిని ముద్దెట్టుకుంటున్నది. నిద్రాపీడితులై, పరుపులు వేసుకునే అవకాశంలేక, వాటిని తలగడలాగా పెట్టుకుని, కొందరు నిద్రిస్తుండగా, మరికొందరు పైటలు పరుచుకుని నిద్రిస్తున్నారు. కడియాల చేతులు తలక్రిందుంచుకుని కొందరు, ఒకరి రొమ్ముపై మరొకరి తలవుంచి ఇంకొందరు నిద్రిస్తున్నారక్కడ. ఒకరి తొడమీద మరొకరి తల వుంచి నిద్రిస్తున్నవారినీ చూసాడు హనుమంతుడు. విపరీతంగా తాగి, దేహాలను మర్చి, ఒకరిపై ఇంకొకరు పడిపోయి, పక్కలు, వీపు, తొడలు, నడుములుంచి మన్మధ కామంలో మునిగిన స్త్రీలున్నారక్కడ. చేతులు-చేతులు పెనవేసుకుని నిద్రిస్తున్న కబరీవతులను చూసాడు హనుమంతుడు. పెనవేసుకున్న తీగలపైనున్న పూలసమూహాల్లా, తుమ్మెదగుంపుల్లా, చైత్ర మాసంలోని వనంలా వుంది రావణాసురుడి "స్త్రీవనం" . స్త్రీలక్కడ పడుకున్న విధం చూస్తే: కాళ్లు-చేతులు-వస్త్రాలు-మూల్యాలు, ఇవి వీరివీ-అవి వారివీ అన్న భేదం లేకుండా కలిసిపోయి వున్నాయప్పుడు.

         ఆ ఇంట్లోని మణిదీపాలు ఏకాగ్రంతో వెలుగుతున్న విధానం గమనిస్తే, రావణుడు నిదురిస్తున్నందువల్లనే, భయంలేక ఆదీపాలు తనివితీర వాడి స్త్రీలను చూస్తున్నాయా అన్నట్లున్నాయి. రావణుడు మేల్కొన్నప్పుడు దీపాలకు కూడా వాడి స్త్రీలను చూసే ధైర్యం లేదు. ఆప్రదేశంలో రావణాసురుడు స్వాధీన పరుచుకున్న రాజుల-ఋశుల-దైత్యుల కన్యలు, దేవతా స్త్రీలు, యుధ్ధంలో గెల్చి కోరికబడి తెచ్చుకున్న స్త్రీలు, కామమున్న స్త్రీలు, మన్మధ తాపం సహించలేక, నిద్రమబ్బుతో వళ్లుతెలియక, రావణాసురుడి చుట్టూ పడిపోయి వున్నారు. అక్కడున్న వారందరూ రావణుడిని చూసి, వాడి శౌర్య సంపదలను చూసి వచ్చిన వారే! అందరూ అకామ కాములట!

         అయితే దీనర్ధం రావణుడు పరస్త్రీలనంటని సదాచార సంపన్నుడని కాదు. ఆ పడకటింట్లో మాత్రం వాడిని ఒల్లని స్త్రీలు లేరనే కాని, వేరే స్థలాల్లో లేరని కాదు. ఈ స్త్రీలలో వాడిమీద ప్రేమ లేనివారూ లేక పోలేదు. (రావణుడు సీతాదేవిని బెదిరించేటప్పుడు,ఆమె దుఃఖ పడుతుంటే, ఈస్త్రీలలో కొందరు సైగలతో సీతాదేవికి ధైర్యం చెప్పారట. వాడిపై నిజమైన కామమున్నవారు అలా చేయరు కదా! దిక్కులేక వాడిపాల్పడ్డవారు వాడికనుకూలంగా వుండి అనుభవించారే కాని వాస్తవపు మక్కువ కానేకాదు. లోబడనివారిని అనేక ఇక్కట్లకు గురిచేసాడు)

         రావణుడి భార్యలలో కురూపులు లేరు. ఉత్తమవంశంలో పుట్టనివారు లేరు. భర్తను ఉపచారాలతో సంతోషింప చేయని ముగ్ధా లేదు. భర్తను వశపర్చుకోలేనిదికాని, శృంగారచేశ్టలతో భర్తను కామించలేనిది కాని లేనేలేరు. అప్పుడు సద్బుధ్ధుడైన హనుమంతుడికి ఒక దుర్బుధ్ధి పుట్టింది. ఈరావణుడి భార్యలవలె, శ్రీరాముడి ధర్మపత్ని కూడా చేరి వుంటే, రావణుడు పుణ్యాత్ముడై వుండే వాడుకదా అనుకుంటాడు. వెంటనే అలాంటి ఆలోచన కలిగినందుకు, అసమాన పాతివ్రత్యం కలదై, అయోనిజ, అవనిజైన (భూమినుండి పుట్టినదైన) సీత అలా చేస్తుందా? అనుకుంటూ, తనకీ పాపపు ఆలోచన కలిగినందుకు చింతిస్తాడు. రావణుడు తన నాశనం కొరకు చేయరాని పని చేసాడు కదా అనుకుంటాడు.


No comments:

Post a Comment